![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/0/02/International_Monetary_Fund_logo.svg.png/640px-International_Monetary_Fund_logo.svg.png&w=640&q=50)
అంతర్జాతీయ ద్రవ్య నిధి
From Wikipedia, the free encyclopedia
అంతర్జాతీయ ద్రవ్య నిధి [1] (English: International Monetary Fund - IMF) వాషింగ్టన్, డి.సి. లో ప్రధాన కార్యాలయం కలిగిన అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. ఇందులో 190 దేశాలకు సభ్యత్వం ఉంది. ఇది ప్రపంచంలో ద్రవ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని భద్రపరచడానికి, అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి, అధిక ఉపాధినీ, స్థిరమైన ఆర్థిక వృద్ధినీ ప్రోత్సహించడానికి, ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించడానికీ కృషి చేస్తుంది. దాని వనరుల కోసం ఇది ప్రపంచ బ్యాంకుపై ఆధారపడుతుంది.[2]
![]() IMF అధికారిక లోగో | |
సంకేతాక్షరం | ఐఎమ్ఎఫ్ (IMF) |
---|---|
స్థాపన | 27 డిసెంబరు 1945 (78 సంవత్సరాల క్రితం) (1945-12-27) |
రకం | అంతర్జాతీయ ఆర్థిక సంస్థ |
ప్రధాన కార్యాలయాలు | అమెరికా లోని వాషింగ్టన్ డి.సి. |
భౌగోళికాంశాలు | 38.53°N 77.02°W / 38.53; -77.02 |
సేవా | ప్రపంచవ్యాప్తం |
సభ్యులు | 29 వ్యవస్థాపక దేశాలు; 188 సభ్య దేశాలు (ఇప్పటి వరకు) |
అధికారిక భాష | అరబిక్, చైనీసు, ఇంగ్లీషు, ఫ్రెంచి, రష్యన్, స్పానిష్ |
మేనేజింగ్ డైరెక్టరు | క్రిస్టీన్ లాగార్డే |
ప్రధానభాగం | గవర్నర్ల బోర్డు |
1944 లో అమెరికాలో జరిగిన బ్రెట్టన్ వుడ్స్ సదస్సులో, [నోట్స్ 1] ప్రధానంగా హ్యారీ డెక్స్టర్ వైట్, జాన్ మేనార్డ్ కీన్స్ ల ఆలోచనల నుండి ఇది రూపుదిద్దుకుంది.[3] 1945 లో 29 సభ్య దేశాలతో, అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థను పునర్నిర్మించే లక్ష్యంతో అధికారికంగా ఉనికి లోకి వచ్చింది. చెల్లింపుల సంక్షోభాలు, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల నిర్వహణలో ఇది ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తోంది.[4] సంస్థలో సభ్యత్వం ఉన్న దేశాలు కోటా విధానం ద్వారా ఒక సంచయానికి నిధులు చేకూరుస్తాయి. చెల్లింపుల సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలు ఈ సంచయం నుండి డబ్బు తీసుకుంటాయి. 2016 నాటికి, ఫండ్‌లో 477 బిలియన్ల ఎక్స్‌డిఆర్ (సుమారు $ 667 బిలియన్) లున్నాయి.[5]
ఫండ్ పనులతో పాటు, గణాంకాల సేకరణ, విశ్లేషణ, సభ్యుల ఆర్థిక వ్యవస్థలపై పర్యవేక్షణ, నిర్దుష్ట విధానాల కోసం డిమాండు చెయ్యడం వంటి ఇతర కార్యకలాపాల ద్వారా, [6] IMF తన సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడానికి పనిచేస్తుంది.[7] ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్లో పేర్కొన్న సంస్థ లక్ష్యాలివి:[8] అంతర్జాతీయ ద్రవ్య సహకారం, అంతర్జాతీయ వాణిజ్యం, అధిక ఉపాధి, మార్పిడి రేటు స్థిరత్వం, స్థిరమైన ఆర్థిక వృద్ధి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సభ్య దేశాలకు వనరులను అందుబాటులో ఉంచడం.[9] IMF నిధులు రెండు ప్రధాన వనరుల నుండి వస్తాయి: కోటాలు, రుణాలు. కోటాల ద్వారా సభ్య దేశాల నుండి సేకరించే నిధులు IMF నిధుల్లో సింహభాగం. ఒక్కో సభ్యుని కోటా పరిమాణం, ప్రపంచంలో దాని ఆర్థిక, ద్రవ్య ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది. ఎక్కువ ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన దేశాలకు కోటాలు పెద్దగా ఉంటాయి. IMF వనరులను పెంచే సాధనంగా కోటాలు ఎప్పటికప్పుడు పెరుగుతూంటాయి.[10] IMF వనరులు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో ఉంటాయి.
2019 అక్టోబరు 1 నుండి IMF మేనేజింగ్ డైరెక్టరు (ఎండి), చైర్ వుమన్ గా బల్గేరియన్ ఎకనామిస్ట్ క్రిస్టాలినా జార్జివా నిర్వహిస్తోంది.[11]
2018 అక్టోబరు 1 నుండి గీతా గోపీనాథ్‌ను ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమించారు. ఆమె ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పొందింది. ఐఎంఎఫ్ లో నియామకానికి ముందు ఆమె కేరళ ముఖ్యమంత్రికి ఆర్థిక సలహాదారుగా పనిచేసింది.[12]