వెంకీ మామ
కె.ఎస్. రవీంద్ర దర్శకత్వంలో 2019లో విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. From Wikipedia, the free encyclopedia
వెంకీ మామ 2019, డిసెంబరు 13న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. సురేష్ ప్రొడక్షన్స్[2] పతాకంపై సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్. రవీంద్ర దర్శకత్వం వహించాడు.[3][4] వెంకటేష్, నాగ చైతన్య, రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ నటించిన ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందించాడు.[5] ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంది.[6]
వెంకీ మామ | |
---|---|
![]() వెంకీ మామ సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | కె.ఎస్.రవీంద్ర |
రచన | జనార్ధన మహర్షి కె.ఎస్.రవీంద్ర కోన వెంకట్ |
నిర్మాత | సురేష్ బాబు టి.జి. విశ్వ ప్రసాద్ వివేక్ కూచిభొట్ల |
తారాగణం | వెంకటేష్ నాగ చైతన్య రాశీ ఖన్నా పాయల్ రాజ్‌పుత్ |
ఛాయాగ్రహణం | ప్రసాద్ మూరెళ్ళ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థలు | |
విడుదల తేదీ | 13 డిసెంబరు 2019 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | ₹45.5 crore (US$5.7 million)(తొలి 3 రోజులు)[1] |
కథ
పేరుమోసిన జ్యోతిష్యుడు రామనారాయణ (నాజర్) కూతురు జాతకాలతో సంబంధం లేకుండా ప్రేమ వివాహం చేసుకుంటుంది. కానీ, ఆ దంపతులిద్దరు రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోతారు. జాతకం దృష్ట్యా వారి ఏడాది కొడుకును చేరదీయడానికి రామనారాయణ నిరాకరించగా, జాతకాల కన్నా ప్రేమ గొప్పదని భావించే మేనమామ వెంకటరత్నం (వెంకటేశ్) ఆ చిన్నారిని చేరదీసి, తాను పెళ్లికూడా చేసుకోకుండా పెంచి పెద్ద చేస్తాడు. మరోవైపు మామ కోసం లండన్‌లో మంచి ఉద్యోగాన్ని, ఆఖరికీ ప్రేమను కూడా తిరస్కరించడానికి కార్తీక్ (నాగచైతన్య) సిద్ధపడతాడు. ఈ క్రమంలో మామకు పెళ్లి చేయడానికి కార్తీక్, కార్తీక్ ప్రేమించిన అమ్మాయిని మళ్లీ కలుపడానికి వెంకటరత్నం ప్రయత్నిస్తారు. కానీ, కార్తీక్ జాతక ప్రభావం వెంకటరత్నాన్ని వెంటాడుతుంది. ఈ క్రమంలో మామకు దూరంగా వెళ్లిపోయిన కార్తీక్ ఆర్మీలో మేజర్‌గా చేరుతాడు. తనకు దూరంగా ఉన్న కార్తీక్‌ను వెతుక్కుంటూ వెంకటరత్నం వెలుతాడు. అక్కడ ఏం జరిగిందన్నది ఇది మిగతా కథ.
నటవర్గం
- వెంకటేష్ (మేజర్ వెంకట్ సత్యనారాయణ/వెంకీ మామ)
- నాగ చైతన్య (కెప్టెన్ కార్తీక్ శివరాం వీరమాచినేని/కార్తీక్)
- రాశీ ఖన్నా (హారిక)
- పాయల్ రాజ్‌పుత్ (మీనా)
- ప్రకాష్ రాజ్ (మేజర్ జయదేవ్)
- నాజర్
- పరాగ్ త్యాగి
- సంపత్ రాజ్
- రావు రమేష్
- కిషోర్
- పోసాని కృష్ణ మురళి
- బ్రహ్మాజీ
- జాన్ కొక్కెన్
- చమ్మక్ చంద్ర
- శ్రీనివాస రెడ్డి
- గీత
- విద్యుల్లేఖ రామన్
- మాస్టర్ నాగ మహేష్
- దాసరి అరుణ్ కుమార్
- హైపర్ ఆది
సాంకేతికవర్గం
- దర్శకత్వం: కె.ఎస్. రవీంద్ర
- నిర్మాత: దగ్గుబాటి సురేష్‌బాబు, టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
- రచన: జనార్ధన మహర్షి, కె.ఎస్. రవీంద్ర, కోన వెంకట్
- సంగీతం: ఎస్. తమన్
- ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ
- కూర్పు: ప్రవీణ్ పూడి
- నిర్మాణ సంస్థ: సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
- కాస్టింగ్ కోఆర్డినేటర్: చందు కాస్టింగ్ క్లబ్
నిర్మాణం
అభివృద్ధి
మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రామ్ తో మసాలా, పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, వరుణ్ తేజ్ తో F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ వంటి మల్టీస్టారర్ సినిమాలు తీసిన వెంకటేష్, ఈసారి తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ఈ మల్టీస్టారర్ సినిమాలో నటించాడు. ఈ సినిమాకంటే ముందు నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాలో వెంకీ అతిథి పాత్ర చేయగా, మొదటిసారిగా ఈసినిమాలో ఇద్దరూ కలిసి పూర్తి నిడివి గల పాత్రలు చేసారు.[7]
హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో సినీ దర్శకుడు వి.వి. వినాయక్ అతిథిగా ఈ చిత్రం అధికారికంగా ప్రారంభించబడింది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.[8]
నటీనటుల ఎంపిక
వెంకటేష్‌కు జోడిగా శ్రియా సరన్,[9] నాగచైతన్యకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్[10] నటించబోతున్నారని మొదట ప్రకటించారు. కానీ, ఇద్దరూ హీరోయిన్స్ మార్చబడ్డారు. రకుల్ ప్రీత్ సింగ్ స్థానంలో నభా నటేష్ నటించబోతుందని వార్తలు వచ్చాయి.[11] ఆఖరికి, ఈ చిత్రంలో హీరోయిన్స్ గా రాశీ ఖన్నా,[12][13] పాయల్ రాజ్‌పుత్[14] నటిస్తున్నారని చిత్రబృందం ప్రకటించింది.
చిత్రీకరణ
2019, ఫిబ్రవరి 24న గోదావరి నది[15] తీరంలో చిత్రీకరణ ప్రారంభమై, రాజమండ్రిలో మొదటి షెడ్యూల్ పూర్తయింది.[16] 2019, ఏప్రిల్ 8న హైదరాబాదులో రెండవ షెడ్యూల్ ప్రారంభమయింది.[17] హైదరాబాద్‌లో రెండవ షెడ్యూల్‌ను పూర్తిచేసిన తరువాత 2019, జూన్ 13[18] వరకు దాదాపు ఒక నెలరోజులపాటు కాశ్మీర్[19] షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించబడ్డాయి. కాశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసిన తరువాత బృందం విశాఖపట్నంకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు చిత్రీకరించింది.[20] అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీలో వెంకటేష్, పాయల్ రాజ్‌పుత్‌లతో పాట చిత్రీకరణ జరిగింది.[21] పోరాట సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు వెంకటేష్ గాయపడగా, రెండు వారాలు విశ్రాంతి తీసుకున్నాడు.[22]
పాటలు
ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.[23] 2019, నవంబరు 7న ఈ చిత్రంలోని వెంకీ మామ (మొదటి పాట) విడుదల చేయబడింది. శ్రీకృష్ణ, మోహన భోగరాజు పాడిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశాడు. మామ (వెంకటేష్), అతని మేనల్లుడు (చైతన్య)ల మధ్య ఉన్న బంధాన్ని ఈ పాట తెలియజేస్తుంది.[24] శ్రీమణి రాయగా పృథ్వీ చంద్ర, ఎస్. తమన్ పాడిన ఎన్నేళ్ళకో (రెండవ పాట) సంగీత దర్శకుడు ఎస్. తమన్ పుట్టినరోజు సందర్భంగా 2019, నవంబరు 19న విడుదలైంది.[25] కాసర్ల శ్యామ్ రాయగా, అదితి భావరాజు, రమ్య బెహరా, సింహా, హనుమాన్ పాడిన కోకా కోలా పెప్సి (మూడవ పాట) 2019, డిసెంబరు 4న విడుదల చేయబడింది.[26]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "వెంకీ మామ (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | శ్రీకృష్ణ, మోహన భోగరాజు | 4:15 |
2. | "ఎన్నేళ్ళకో (రచన: శ్రీమణి)" | శ్రీమణి | పృథ్వీ చంద్ర, ఎస్. తమన్ | 3:36 |
3. | "కోకా కోలా పెప్సి (రచన: కాసర్ల శ్యామ్)" | కాసర్ల శ్యామ్ | సింహా, రమ్య బెహరా, అదితి భావరాజు, హనుమాన్ | 3:41 |
4. | "నువ్వు నేను (రచన: శ్రీమణి)" | శ్రీమణి | అనురాగ్ కులకర్ణి, నందిత | 4:02 |
మొత్తం నిడివి: | 15:34 |
విడుదల
మొదటగా ఈ చిత్రాన్ని 2019, అక్టోబరు 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.[27] 2019, డిసెంబరు 7న ఈ చిత్రానికి 'యు/ఎ' సర్టిఫికేట్ వచ్చింది.[28] వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా 2019, డిసెంబరు 13న విడుదలచేశారు.[29]
మార్కెటింగ్
2019, ఏప్రిల్ 6న ఉగాది సందర్భంగా వెంకటేష్,నాగచైతన్యల ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో ఇద్దరూ గ్రామీణ నేపథ్యంలో ముఖం మీద చిరునవ్వుతో వరి సంచులపై కూర్చున్న ఫోటో ఉంది.[17] 2019, ఆగస్టు 1న దర్శకుడు కె.ఎస్. రవీంద్ర పుట్టినరోజు సందర్భంగా ప్రీ-టీజర్ విడుదలైంది.[30] 2019, సెప్టెంబరు 2న వినాయక చవితి సందర్భంగా పండుగ పోస్టర్ విడుదలైంది. ఇందులో వెంకటేష్, నాగచైతన్యలు సాంప్రదాయ దక్షిణ భారత దుస్తులైన పంచకట్టులో ఉన్నారు.[31] 2019, అక్టోబరు 7న ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో వెంకటేష్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ ఒక ట్రాక్టర్ పై కూర్చునివున్న ఫోటో ఉంది. ఇందులో చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.[32] 2019, అక్టోబరు 8న విజయదశమి సందర్భంగా మొదటి టీజర్ విడుదలై,[33] మంచి స్పందన అందుకుంది.[34] గడ్డంతో వెంకటేష్, పారామిలట్రీ దుస్తుల్లో నాగచైతన్య ఉన్న పోస్టర్ 2019, అక్టోబరు 26న దీపావళి సందర్భంగా విడుదలైంది.[35]
2019, నవంబరు 23న నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా అల్లుడు పుట్టినరోజు టీజర్ విడుదలైంది, దీనిలో చైతన్య పాత్ర సరదాగా ప్రేమించే బాలుడిగా, ఆర్మీ ఆఫీసర్‌గా ఉంది.[36] 2019, నవంబరు 30న రాశీఖన్నా పుట్టినరోజు సందర్భంగా రాశీఖన్నా పుట్టినరోజు టీజర్ విడుదల చేయబడింది.[37] 2019, డిసెంబరు 5న పాయల్ రాజ్‌పుత్ పుట్టినరోజు సందర్భంగా విషింగ్ అవర్ టీచర్ (పాయల్ రాజ్‌పుత్) ఏ వెరీ హ్యాపీ బర్త్డే అంటూ ఒక పోస్టర్ విడుదల చేయబడింది.[38]
2019, డిసెంబరు 4న పత్రికా సమావేశం జరిగింది. ఇందులో చిత్రబృందం పాల్గొన్నారు.[39] 2019, డిసెంబరు 7న ఖమ్మంలో చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది.[40] దీనికి చిత్రబృందం మొత్తం హాజరయ్యారు.[41] అదే రోజున చిత్రం ట్రైలర్ కూడా విడుదలైంది.[42] 2019, డిసెంబరు 10న జెఆర్‌సి కన్వెన్షన్స్‌లో వెంకీ మామ మ్యూజికల్ నైట్ ఈవెంట్ జరిగింది, పూర్తి సౌండ్‌ట్రాక్ ఆల్బమ్ విడుదలై ప్రత్యక్ష ప్రసారం చేయబడింది, దీనికి సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అతిథిగా వచ్చాడు.[43]
స్పందన
బాక్సాఫీస్
తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 16.5కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది.[44][45] రెండోరోజు ప్రపంచవ్యాప్తంగా 14కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది.[46] మూడోరోజు ప్రపంచవ్యాప్తంగా 14.5కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది.[1] మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 45కోట్ల గ్రాస్ కలెక్షన్ సంపాదించింది.[47]
రేటింగ్
ప్రేక్షకులు, విమర్శకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.[48]
- ది హన్స్ ఇండియా: 3/5[49]
- సమయం: 3.5/5[50]
- టైమ్స్ ఆఫ్ ఇండియా: 2.5/5[51]
- ఇండియా టుడే: 2.5/5[52]
- ది న్యూస్ మినట్: 2/5[53]
- ఫస్ట్ పోస్టు: 2.5/5[54]
- టాలీవుడ్.నెట్: 3/5[55]
- గ్రేట్ ఆంధ్ర: 2.5/5[56]
మూలాలు
ఇతర లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.