మీరట్
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం From Wikipedia, the free encyclopedia
మీరట్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలో ఉన్న నగరం. ఇది ఒక పురాతన నగరం, సింధు లోయ నాగరికతకు చెందిన స్థలాలు ఈ చుట్టుపక్కల కనుగొన్నారు. నగరం, జాతీయ రాజధాని న్యూ ఢిల్లీకి ఈశాన్యంగా 70 కి.మీ. దూరంలో జాతీయ రాజధాని ప్రాంతంలో ఉంది. మీరట్, రాష్ట్ర రాజధాని లక్నోకు పశ్చిమాన 485 కి.మీ. దూరంలో ఉంది.
మీరట్ | |
---|---|
మెట్రో నగరం[1] | |
Nickname: భారత క్రీడా రాజధాని | |
Coordinates: 29.05°N 77.51°E | |
దేశం | India |
డివిజను | మీరట్ |
జిల్లా | మీరట్ |
Government | |
• Body | Meerut Municipal Corporation |
విస్తీర్ణం | |
• మెట్రో నగరం[3] | 450 కి.మీ2 (170 చ. మై) |
Elevation | 247 మీ (810 అ.) |
జనాభా | |
• మెట్రో నగరం[5] | 15,71,434 |
• జనసాంద్రత | 3,500/కి.మీ2 (9,000/చ. మై.) |
• Metro | 18,71,434 |
భాషలు | |
• అధికారిక | ఖడీబోలీ, హర్యాన్వీ, హిందీ, ఉర్దూ, పంజాబీ, |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 250 0xx |
టెలిఫోన్ కోడ్ | 91- 121- XXXX XXX |
Vehicle registration | UP-15, UP-14, HR-12 |
[7] |
2011 నాటికి మీరట్, భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన పట్టణ సముదాయాల్లో 33 వ స్థానంలో ఉంది. అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో 26 వ స్థానంలో ఉంది.[8][9] ఇది 2006 నాటి అతిపెద్ద నగరాలు, పట్టణ ప్రాంతాల ప్రపంచ జాబితాలో ఇది 292 వ స్థానంలో ఉంది 2020 లో 242 వ స్థానానికి చేరుకుంటుందని అంచనా వేసారు.[10] మునిసిపల్ ప్రాంత విస్తీర్ణం (2016 నాటికి) 450 చ.కి.మీ.[11].[12] ఈ నగరం క్రీడా వస్తువుల అతిపెద్ద ఉత్పత్తిదారులలో ఒకటి. భారతదేశంలో అత్యధిక సంగీత వాయిద్యాలను ఉత్పత్తి చేసే స్థలం ఇది. ఈ నగరం పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో విద్యా కేంద్రంగా ఉంది. దీనిని "భారత క్రీడా నగరం" అని కూడా పిలుస్తారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా 1857 సిపాయీల తిరుగుబాటును లేవదీసిన స్థలం, మీరట్ నగరం.
నగరం 'పేరు మాయారాష్ట్ర అనే పేరు నుండి ఉత్పన్నమై ఉండవచ్చు ఇది మండోదరి తండ్రి మాయాసురుడి రాజధాని. ఈ పేరు మీరట్గా మారి ఉండవచ్చు..[13][14]
మరొక పౌరాణిక కథనం ప్రకారం, మాయాసురుడు (మయుడు) ఒక విశిష్ట వాస్తుశిల్పి. ధర్మరాజు అతడికి ప్రస్తుతం మీరట్ నగరం ఉన్న భూమిని ఇచ్చాడు. అతను ఈ స్థలానికి మహారాష్ట్ర అని పేరు పెట్టుకున్నాడు. అదే మీరట్ అయింది. సాంప్రదాయం ప్రకారం, ఈ నగరం ఇంద్రప్రస్థ రాజు మహిపాలుడి రాజ్యంలో భాగంగా ఉండేది. మీరట్ అనే పదం అతని పేరుతో ముడిపడి ఉంది.[15]
మీరట్‌కు ఈశాన్యంగా 37 కి.,మీ.దూరంలో ఉన్న విదుర కా తిలా అనే చోట 1950-52 లో జరిపిన పురాతత్వ తవ్వకాల్లో లభించిన ఆధారాలను బట్టి, ఇది కౌరవ పాండవుల రాజధాని హస్తినాపురానికి చెందినదిగా నిర్ధారించారు. ఆ పట్టణం గంగా నది వరదలలో కొట్టుకుపోయింది.[16][17]
మీరట్‌లో అలమ్గీర్పూర్ అనే చోట హరప్పా నాగరికతకు చెందిన నివాస స్థలం కూడా ఉంది. సింధు లోయ నాగరికతలో అత్యంత తూర్పున ఉన్న స్థావరం ఇది మౌర్య చక్రవర్తి అశోకుడికి (క్రీ.పూ. 273 నుండి క్రీ.పూ 232 వరకు) మీరట్, బౌద్ధమత కేంద్రంగా ఉండేది. బౌద్ధ నిర్మాణాల అవశేషాలు నేటి నగరంలోని జామా మసీదు సమీపంలో కనుగొన్నారు.[19] ఢిల్లీ విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉన్న 'బారా హిందూ రావు హాస్పిటల్' పక్కన ఉన్న ఢిల్లీ రిడ్జ్ వద్ద ఉన్న అశోక స్తంభాన్ని ఫిరోజ్ షా తుగ్లక్ (r. 1351-1388) మీరట్ నుండి ఢిల్లీకి తీసుకువెళ్లాడు;[20][21] తరువాత ఇది 1713 పేలుడులో దెబ్బతినగా, 1867 లో పునరుద్ధరించారు.[22]
సా.శ. పదకొండవ శతాబ్దంలో, నగరానికి నైరుతి దిశలో ఉన్న ప్రాంతాన్ని బులంద్‌షహర్‌కు చెందిన డోర్ రాజ్‌పుత్ర రాజా హర్ దాత్ పాలించాడు. అతడు ఇక్కడొక కోటను నిర్మించాడు. ఈ కోట బలిష్టతకు ప్రసిద్ధి చెందింది. దీని ప్రసక్తి ఐన్-ఇ-అక్బరిలో ఉంది. తరువాత అతను 1018 లో ఘజ్ని మహమూద్ చేతిలో ఓడిపోయి, తన బలగాలతో పాటు మహమూద్‌కు లొంగిపోయాడు.[23] స్థానికంగా ప్రసిద్ధి గాంచిన జామా మసీదు, ఆ కాలం నాటిదే. దీనిని మహమూద్ మంత్రి నిర్మించినట్లు చెబుతారు. ముస్లిములు స్వాధీనం చేసుకున్న కొద్దికాలానికే నగరాన్ని స్థానిక హిందూ రాజా తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అతడు అప్పుడు నగరానికి రక్షణగా గోడను నిర్మించాడు. అది ఇటీవలి కాలం వరకూ నిలిచి ఉంది.[24] 1206 లో ఢిల్లీ సుల్తానేట్ను స్థాపించిన కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ (ఇతడు మహమ్మదు ఘోరి సేనాధిపతి) 1193 లో మీరట్‌పై దాడి చేసి స్వాధీనం చేసుకున్నాడు.[25]
1399 లో తైమూర్ మీరట్‌ను పట్టుకున్నాడు. ఢిల్లీలో పౌర తిరుగుబాటు అనంతరం జరిపిన ఊచకోతలో వేలాది మంది పౌరులను వధించాక, అతడు మీరట్‌ను జయించాడు. కోటకు రక్షణగా ఇలియాస్ ఆఫ్ఘన్, అతని కుమారుడు మౌలా ముహమ్మద్ థానేశ్వరిలు ఉన్నారు. వీరికి సఫీ నేతృత్వంలోని ముస్లిమేతరులు బాసటగా ఉన్నారు. వారిని లొంగిపొమ్మని తైమూర్ కబురంపాడు. దీనికి వాళ్ళు, గతంలో టార్మాషిరిన్ కూడా ఇలాగే కోటను పట్టుకోవటానికి ప్రయత్నించాడనీ, కానీ అతడి వల్ల కాలేదనీ సమధానమిచ్చారు. రెచ్చిపోయిన తైమూర్ 10,000 మంది గల అశ్వికదళంతో బయలుదేరాడు. అతడి సైనికులు గోడలను ఎక్కి కోటను ఆక్రమించాయి. యుద్ధంలో సఫీ హతుడయ్యాడు. కోట లోని నివాసులను చంపేసారు. వారి భార్యలు, పిల్లలను బానిసలుగా చేసుకున్నారు. యుద్ధఖైదీలను సజీవంగా కాల్చేసారు. రక్షణ గోడలను, ఇళ్ళనూ నేలమట్టం చేసారు.[26][27]
ఈ నగరం మొఘల్ సామ్రాజ్యం పాలనలో వచ్చాక ప్రశాంతతను చూసింది. మొఘల్ చక్రవర్తి, అక్బరు (r. 1556-1605) పాలనలో, ఇక్కడ రాగి నాణేల టంకసాల ఉండేది.[19] మొఘల్ సామ్రాజ్యపు క్షీణ దశలో, ఔరంగజేబు మరణం తరువాత నగరం, ఉత్తరాన ముజఫర్ నగర్ కు చెందిన సయ్యదులు, ఆగ్నేయంలోని జాట్లు, నైరుతిలో.గంగానది వెంట ఉన్న గుజ్జర్ల వంటి స్థానిక అధిపతులనియంత్రణలోకి వచ్చింది. ఈ నగరం 18 వ శతాబ్దంలో సిక్కుల, మరాఠాల దండయాత్రలను చూసింది. మధ్య మధ్యలో జాట్లు, రోహిల్లాల పాలనలొచ్చాయి. వాల్టర్ రీన్హార్ట్ అనే ఆంగ్ల సైనికుడు సర్ధానాలో స్థిరపడ్డాడు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలను అతడు నియంత్రణ లోకి తెచ్చుకున్నాడు.. అతని మరణం తరువాత, అవి బేగం సమ్రూ చేతుల్లోకి వచ్చాయి. ఈ సమయంలో, జిల్లా దక్షిణ భాగం మరాఠా పాలనలో ఉండేది.
1803 లో, ఢిల్లీ పతనంతో, మరాఠాలకు చెందిన దౌలత్ రావు సింధియా ఈ భూభాగాన్ని బ్రిటిష్ వారికి అప్పగించాడు. మీరట్ కంటోన్మెంటును 1806 లో ఏర్పాటు చేసారు. ఇది ఢిల్లీకి దగ్గరగా ఉండటం, సంపన్నవంతమైన గంగానది - యమునా దోఅబ్ ప్రాంతంలో ఉండడం దీని స్థాపనకు దోహద పడ్డాయి కాలక్రమేణా మీరట్, భారతదేశంలో అతిపెద్ద, అతి ముఖ్యమైన సైనిక కేంద్రాలలో ఒకటిగా నిలిచింది. నగరాన్ని 1818 లో ఇదే పేరున్న జిల్లాకు ప్రధాన కార్యాలయంగా మార్చారు.[28]
1857 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన భారత తిరుగుబాటుకు మీరట్ ప్రసిద్ధి గాంచింది.[29] ప్రసిద్ధ నినాదం " దిల్లీ చలో " ("ఢిల్లీకి వెళ్దాం!") ఇక్కడే మొదట లేవనెత్తారు. తిరుగుబాటు ప్రారంభమైన ప్రదేశం మీరట్ కంటోన్మెంట్. మీరట్‌కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఈ తిరుగుబాటు 1857 మార్చిలో బెంగాల్‌లోని బరాక్‌పూర్‌లో ప్రారంభమైంది. సిపాయి మంగళ్ పాండే ఇద్దరు యూరోపియన్లపై కాల్పులు జరపగా అవి గురితప్పాయి. తనను తాను చంపుకోవడంలో అతడు విఫలమయ్యాడు. ఆ తరువాత అతన్ని ఉరితీసారు. ఏప్రిల్ నాటికి, పాండే తిరుగుబాటు అగ్నికణం ఉత్తర భారతదేశాన్ని దహనం చేసి, ఈస్ట్ ఇండియా కంపెనీ వారి రెండవ అతిపెద్ద దండు అయిన మీరట్ చేరింది. ఇక్కడ, యూరోపియన్లు, స్థానిక సిపాయిలు సుమారుగా చెరి 2000 మందితో సమాన సంఖ్యలో ఉండేవారు. యూరోపియన్ కంటోన్మెంట్ 'స్థానిక సైనికుల' నుండి వేరుగా ఉండేది. దీనికి సమీపంలో సదర్ బజార్, లాల్ కుర్తీ బజార్ ఉన్నాయి. కంపెనీ సైనికులు ధరించే ఎరుపు యూనిఫారాల మీదుగా లాల్ కుర్తీ బజారుకు ఆ పేరు వచ్చింది.
1857 ఏప్రిల్ 24 న, మీరట్ కమాండర్ కల్నల్ కార్మైచెల్ స్మిత్, బెంగాల్ అశ్వికదళానికి చెందిన 90 మంది భారతీయ సిపాయిల చేత కవాతు చేయించాడు. వీళ్ళలో ఎక్కువ మంది ఉత్తర ప్రదేశ్, బీహార్ నుండి వచ్చారు. కొత్త ఎన్ఫీల్డ్ తూటాలను కాల్చమని అతను వారిని ఆదేశించాడు. అందుకు 85 మంది నిరాకరించారు. తూటా ఓ కాగితంలో చుట్టి ఉంటుంది. వాడేముందు ఆ కాగితాన్ని నోటితో చింపేసి తూటాను తుపాకిలో లోడు చేసుకోవాల్సి ఉంటుంది. తూటాకు కందెన లాగా ఉండేందుకు ఆ కాగితానికి పంది కొవ్వు పూసారని ముస్లిములు, ఆవు కొవ్వును పూసారని హిందువులూ అనుకున్నారు. మొదటివారికి పందికొవ్వు హీనమైనది కాగా రెండవవారికు ఆవు పూజనీయమైనది.[30]
ఆ 85 మందినీ ఉద్యోగాల్లోంచి తీసివేసి, పదేళ్ల జైలు శిక్ష విధించారు - ఇది వారికి పెద్ద అవమానం. తిరుగుబాటుదారులు 3 వ అశ్వికదళానికి చెందినవారు. వారికి స్వంత గుర్రాన్నాయి. వారు సామాజికంగా ఉన్నత వర్గాలకు చెందినవారు. అలాంటి వారికే సంకెళ్ళు పడితే, ఇక ఇతరుల సంగతి చెప్పేందుకేముందని ఇతరులు అనుకున్నారు. 1857 మే 10 ఆదివారం నాడు కొత్వాల్ ధన్ సింగ్ గుర్జర్ జైలు తలుపులను తెరిచాడు. ఈ 85 మంది సైనికులు, జైలులో ఉన్న ఇతర సైనికులతో పాటు తప్పించుకొని తమకు తాము స్వేచ్ఛను ప్రకటించుకున్నారు, తిరుగుబాటు చేశారు. నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి బ్రిటిష్ అధికారులపై దాడి చేసి చంపారు. ఈ సైనికులు ఢిల్లీ వైపు కవాతు చేస్తున్నప్పుడు ఇది ఉత్తర భారతదేశం అంతటా విస్తృతమైన తిరుగుబాటుకు నాంది పలికింది. మే 10 ని మీరట్ లో స్థానిక సెలవుదినంగా జరుపుకుంటారు.[31]
మీరట్ 1929 మార్చిలో వివాదాస్పదమైన మీరట్ కుట్ర కేసుకు వేదికగా ఉంది, ఇందులో రైల్వే సమ్మెను నిర్వహించినందుకు ముగ్గురు ఆంగ్లేయులతో సహా పలు ట్రేడ్ యూనియన్ నాయకులను అరెస్టు చేశారు. ఇది వెంటనే ఇంగ్లండ్‌లో అందరి దృష్టినీ ఆకర్షించింది, మాంచెస్టర్ స్ట్రీట్ థియేటర్ గ్రూప్, 'రెడ్ మెగాఫోన్స్' వారు దీని ప్రేరణతో 1932 లో మీరట్ ఖైదీల పేరుతో నాటకం రాసారు. ఇది వలస విధానపు, పారిశ్రామికీకరణపు హానికరమైన ప్రభావాలను ఎత్తిచూపింది [32]
1931 లో మీరట్‌కు విద్యుత్తు వచ్చింది.[28] 1940 లలో, మీరట్ సినిమా హాళ్ళలో బ్రిటిష్ జాతీయ గీతాన్ని పాడుతున్నప్పుడు "కదలకూడద"నే విధానం ఉండేది.
భారత స్వాతంత్ర్యానికి ముందు భారత జాతీయ కాంగ్రెస్ జరుపుకున్న చివరి సమావేశాలు 1946 నవంబరు 26 న మీరట్ లోని విక్టోరియా పార్కులో జరిగాయి. ఈ సమావేశాల్లోనే రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేశారు.[33]
మీరట్ నగరం, మీరట్ జిల్లా రెండూ 1984 లో హిందూ - సిక్కు అల్లర్లతో,[34] 1982 లో హిందూ-ముస్లిం అల్లర్లతో వార్తల్లోకెక్కాయి.[35] 1987 మే లో ప్రవిన్షియల్ ఆర్మ్డ్ కాన్స్టాబులరీ (పిఎసి) వారు 42 మంది ముస్లింలను కాల్చి చంపినపుడు నగరం అల్లర్లతో అట్టుడికింది. ఈ కేసు విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.[36][37] 2006 లో, విక్టోరియా పార్కు స్టేడియంలో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ "బ్రాండ్ ఇండియా" ఫెయిర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 100 మంది మరణించారు.ఈ సంఖ్య ఇంకా ఎక్కువని భావిస్తారు.[38]
మీరట్‌లో రుతుపవనాల ప్రభావంతో తేమతో కూడిన ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. ఏప్రిల్ ప్రారంభం నుండి జూన్ చివరి వరకు వేసవికాలం ఉంటుంది. ఈ కాలంలో చాలా వేడిగా ఉండి, ఉష్ణోగ్రతలు 49 °C (120 °F) చేరుకుంటాయి .[39] రుతుపవనాలు జూన్ చివరలో వచ్చి సెప్టెంబరు మధ్య వరకు కొనసాగుతాయి. ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గుతాయి. మేఘాల ఆవరించి ఉంటాయి. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. అక్టోబరుర్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయి. నగరంలో అక్టోబరు చివరి నుండి మార్చి మధ్య వరకు తేలికపాటి, పొడి శీతాకాలం ఉంటుంది ఇప్పటివరకు నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రత −0.4 °C (31.3 °F), 2013 జనవరి 6 న నమోదైంది.[40] వార్షిక వర్షపాతం సుమారు 845 మి.మీ. ఉంటుంది. అత్యధిక వర్షపాతం వర్షాకాలంలో నమోదవుతుంది. సాపేక్ష తేమ 30 నుండి 100% వరకు ఉంటుంది. నగరంలో హిమపాతం ఉండదు.
శీతోష్ణస్థితి డేటా - Meerut (1971–2000) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 29.3 (84.7) |
32.2 (90.0) |
39.5 (103.1) |
43.5 (110.3) |
45.8 (114.4) |
46.1 (115.0) |
46.0 (114.8) |
40.0 (104.0) |
39.0 (102.2) |
38.0 (100.4) |
34.5 (94.1) |
30.0 (86.0) |
46.1 (115.0) |
సగటు అధిక °C (°F) | 21.9 (71.4) |
23.1 (73.6) |
28.7 (83.7) |
36.3 (97.3) |
39.1 (102.4) |
37.6 (99.7) |
33.6 (92.5) |
32.6 (90.7) |
33.7 (92.7) |
32.8 (91.0) |
28.6 (83.5) |
23.5 (74.3) |
31.1 (88.0) |
సగటు అల్ప °C (°F) | 7.2 (45.0) |
9.1 (48.4) |
13.8 (56.8) |
19.9 (67.8) |
24.3 (75.7) |
26.0 (78.8) |
25.9 (78.6) |
25.5 (77.9) |
23.6 (74.5) |
18.2 (64.8) |
12.4 (54.3) |
8.0 (46.4) |
17.7 (63.9) |
అత్యల్ప రికార్డు °C (°F) | 0.2 (32.4) |
0.1 (32.2) |
5.4 (41.7) |
8.3 (46.9) |
15.4 (59.7) |
17.7 (63.9) |
16.5 (61.7) |
19.0 (66.2) |
15.7 (60.3) |
7.2 (45.0) |
1.8 (35.2) |
0.2 (32.4) |
0.1 (32.2) |
సగటు అవపాతం mm (inches) | 19.7 (0.78) |
24.9 (0.98) |
24.4 (0.96) |
12.8 (0.50) |
19.1 (0.75) |
71.2 (2.80) |
269.0 (10.59) |
264.7 (10.42) |
95.4 (3.76) |
25.9 (1.02) |
4.3 (0.17) |
13.4 (0.53) |
845.0 (33.27) |
సగటు వర్షపాతపు రోజులు | 1.5 | 1.7 | 1.7 | 0.9 | 1.6 | 3.9 | 10.2 | 9.4 | 4.2 | 1.6 | 0.4 | 0.9 | 38.0 |
Source: India Meteorological Department (record high and low up to 2010)[41][42] |
మీరట్ ఢిల్లీ తరువాత ఎన్‌సిఆర్‌లో అతిపెద్ద నగరం. ఇది గంగా మైదానాలకు, యమునా మైదానాలకు మధ్య ఉంది. మీరట్ జిల్లా విస్తీర్ణం 2,522 కిమీ2 ఇది ఢిల్లీ కంటే పెద్దది (ఢిల్లీ విస్తీర్ణం 1,484 కిమీ2). అయితే, మీరట్ జనాభా ఢిల్లీ జనాభాలో మూడో వంతే ఉంటుంది. (మీరట్ జిల్లా ప్రస్తుత జనాభా 34,43,689).
సమీప విమానాశ్రయం, ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 100 కి.మీ దూరంలో ఉంది.
డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ విమానాశ్రయం పార్థాపూర్ వద్ద ఉంది. ఢిల్లీ విమానాశ్రయంపై ఒత్తిడిని తగ్గించడానికి ఈ ఎయిర్‌స్ట్రిప్‌ను అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.[43] అయితే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమైన తరువాత దేశీయ విమానాశ్రయాన్ని విస్తరించే ఆలోచనను విరమించుకున్నారు.[44] 2012 మేలో జరిగిన ప్రమాదం తరువాత, ప్రైవేటు విమానాల కోసం ఈ ఎయిర్‌స్ట్రిప్ ఉపయోగించకుండా నగర పాలక సంస్థ నిరోధించింది.[45]
రోడ్డు ద్వారా మీరట్ నుండి ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్, హరిద్వార్, వంటి ప్రధాన నగరాలకు చక్కటి రవాణా ఉంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు పని కోసం ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘాజియాబాద్, గుర్గావ్లకు వెళ్తారు. మూడు జాతీయ రహదారులు ( జాతీయ రహదారి-58, జాతీయ రహదారి-119 & జాతీయ రహదారి-235 ) మీరట్ గుండా వెళుతున్నాయి. నగరం శివార్లలో ప్రయాణించే ఎగువ గంగా కాలువ ఎక్స్‌ప్రెస్ వే ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.
నగరంలో 2 ప్రధాన బస్ టెర్మినల్స్ ఉన్నాయి, అవి భైన్సాలి బస్ టెర్మినల్, సోహ్రాబ్ గేట్ బస్ టెర్మినల్. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థకు (యుపిఎస్ఆర్టిసి) చెందిన బస్సులు నగరం నుండి రాష్ట్రవ్యాప్తంగా నగరాలన్నింటికీ నడుస్తాయి. JNNURM పథకం నగరంలో అమల్లోకి వచ్చింది . లోపలి రింగ్ రోడ్, ఔటరు రింగ్ రోడ్డు, కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి అనేక కొత్త రోడ్డు ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నాయి. [46] [47]
ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో ఉంది. 90 కిలోమీటర్ల పొడవైన నియంత్రిత-యాక్సెస్ ఎక్స్‌ప్రెస్‌వే, మీరట్‌ను ఘజియాబాద్‌లోని దాస్నా ద్వారా ఢిల్లీతో కలుపుతుంది. ప్రస్తుత హైవే 24 (ఎన్‌హెచ్ -24) లోని ఉత్తర ప్రదేశ్ గేట్ వరకు ఉన్న భాగాన్ని 8 నుండి 14 లేన్లకు వెడల్పు చేస్తారు. యుపి గేట్, దాస్నా మధ్య ఉన్న భాగాన్ని కూడా పద్నాలుగు లేన్లకు మారిస్తారు. జాతీయ రహదార్ల సంస్థ ప్రకారం మొత్తం నిర్మాణ పనులను మూడు దశలుగా విభజించారు. మొదటి దశలో ఢిల్లీ నుండి దాస్నా వరకు ఉన్న జాతీయ రహదారి -24 (8 లేన్లు) ను (కిమీ 0 నుండి కిమీ 27.5, 14 లేన్లు), రెండవ దశలో దాస్నా నుండి హాపూర్ వరకు (కిమీ 27.5 నుండి కిమీ 49.9) మూడవ దశలో దాస్నా నుండి మీరట్ వరకు (6 లేన్లు) 37 కిలోమీటర్ల పొడవైన కొత్త అలైన్‌మెంటు నిర్మాణం ఉంటుంది.
ఎక్స్‌ప్రెస్‌వేకు 2015 డిసెంబరు 31 న ప్రధాని నరేంద్ర మోడీ పునాదిరాయి వేశాడు
మీరట్ ఢిల్లీ -సహారన్పూర్ విద్యుదీకరించిన రైల్వే మార్గంలో ఉంది [48] నగరంలో మీరట్ సిటీ, మీరట్ కాంట్, పార్థాపూర్, మొహియుద్దీన్పూర్, పాబ్లి ఖాస్ అనే ఐదు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మీరట్ సిటీ రైల్వే స్టేషన్ అత్యంత రద్దీగా ఉంటుంది. ఢిల్లీ - మీరట్ రైల్వే మార్గం 1864 లో వేసారు [28] ద్వితీయ రైల్వే స్టేషన్‌గా పనిచేసే మీరట్ కాంట్ స్టేషన్‌ను 1865 లో నిర్మించారు.
ప్రతిరోజూ 20,000 మంది ప్రయాణికులు ఢిల్లీ నుండి/కి ప్రయాణం చేస్తారు. మీరట్, ఢిల్లీల మధ్య 27 జతల రైళ్లు, మీరట్, ఖుర్జాల మధ్య నాలుగు రైళ్లు నడుస్తాయి. లక్నోకు రోజూ రెండు రైళ్లు ఉన్నాయి, అవి నౌచండి ఎక్స్‌ప్రెస్, రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ . వారపు రైలు చెన్నై, కుచ్చువెల్లి లకు వెళుతుంది. రోజువారీ రైళ్లు మీరట్ నుండి బొంబాయి, అహ్మదాబాద్, జైపూర్, రాజ్‌కోట్ తదితర నగరాలకు వెళ్తాయి.
మీరట్‌లోని పట్టణ సామూహిక రవాణా వ్యవస్థను పెంచడానికి మీరట్‌లో ప్రతిపాదిత మెట్రో రైలు ప్రాజెక్టులకు 2014 డిసెంబరు 30 న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సంబంధిత సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) ను తయారు చేయడానికి సమన్వయకర్తగా రాష్ట్ర ప్రభుత్వం రైట్స్ లిమిటెడ్, లక్నో మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎల్ఎమ్ఆర్సి) లను ప్రతిపాదించింది. అభివృద్ధి అధికారులు డిపిఆర్ కోసం నోడల్ ఏజెన్సీలుగా ఉంటారు.[49]
మెట్రో ప్రాజెక్టుకు డివిజనల్ కమిషనర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పార్థాపూర్ నుండి పల్లవ్‌పురం ఫేజ్ 2, రాజ్బన్ మార్కెట్ నుంచి గోకాల్పూర్ గ్రామం వరకు రెండు కారిడార్లు ఈ ప్రాజెక్టులో ఉంటాయని సమావేశంలో నిర్ణయించారు.[50]
2011 జనాభా లెక్కల ప్రకారం, మీరట్ అర్బన్ అగ్లోమెరేషన్ (మీరట్ యుఎ) జనాభా సుమారు 14.2 లక్షలు [6] నగర జనాభా 13.1 లక్షలు.[4] మీరట్ అర్బన్ అగ్లోమెరేషన్లో మీరట్ కార్పొరేషన్, మీరట్ కంటోన్మెంట్ బోర్డు, సింధవాలి, అమేహ్రా, ఆదిపూర్, అమినగర్ ఉర్ఫ్ భుర్బరల్, మొహియుద్దీన్పూర్ లు కాక, మరో 4 జనగణన పట్టణాలు ఉన్నాయి.[52][53] అత్యధిక జనాభా కలిగిన పట్టణ సముదాయాల్లో మీరట్ 33 వ స్థానంలోను, అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో 28 వ స్థానం లోనూ ఉంది. మీరట్ యుఎలో లింగ నిష్పత్తి 887, ఇది రాష్ట్ర సగటు 908 కన్నా తక్కువ; బాలల్లో లింగ నిష్పత్తి 845, ఇది రాష్ట్ర సగటు 899 కన్నా తక్కువ. జనాభాలో 12.99% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు. మొత్తం అక్షరాస్యత 76.28%, ఇది రాష్ట్ర సగటు 69.72% కంటే ఎక్కువ.[54]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.