Remove ads
అంతర్జాతీయ క్రీడా పోటీలు From Wikipedia, the free encyclopedia
ఒలింపిక్ క్రీడలు (English: Olympic Games;French: Jeux olympiques) ప్రతి నాలుగేళ్ళకొకసారి జరుగుతాయి. క్రీ.పూ.776 లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలు సా.శ.393 లో నిలిపి వేసారు. మళ్ళీ సా.శ. 1896లో ఏథెన్స్లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మధ్యలో కొంతకాలం ప్రపంచయుద్ధాల వల్ల అంతరాయం ఏర్పడిననూ, దాదాపు నాలుగేళ్ళకోసారి (దీనికే ఒలింపియాడ్ [1] అని కూడా పేరు) ఈ మహా క్రీడలు జరుగుతున్నాయి. ప్రాచీన కాలంలో జరిగిన క్రీడలను ప్రాచీన ఒలింపిక్ క్రీడలుగా, పునఃప్రారంభం తరువాత జరుగుతున్న క్రీడలకు ఆధునిక ఒలింపిక్ క్రీడలుగా వ్యవహరిస్తారు. సంక్షిప్తంగా ఈ క్రీడలను ది ఒలింపిక్స్ [2] అని పిలుస్తారు. ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ముఖ్యకారకుడు ఫ్రాన్స్ దేశానికి చెందిన పియరె డి కోబర్టీన్. 1924 నుంచి శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి 1896లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలను వేసవి ఒలింపిక్ క్రీడలు అని పిలువవచ్చు. ఇంతవరకు 28 వేసవి ఒలింపిక్ క్రీడలు జరుగగా, 29 వ ఒలింపిక్ క్రీడలు 2008లో చైనా లోని బీజింగ్లో జరిగాయి. 2012లో లండనులో జరిగాయి.
క్రీ.పూ. 8 వ శతాబ్దంలో ప్రాచీన గ్రీకు సామ్రాజ్యం అనేక రాజ్యాలుగా చీలిపోయి ఉండేది. గ్రీకు రాజ్యాల మధ్య తరుచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. శాంతి సామరస్యాలకు క్రీడలు పరిష్కారం చూపుతాయని గ్రహించిన గ్రీకులు క్రీ.పూ.776 లో మొదటిసారిగా ఈ క్రీడలను నిర్వహించారు. అప్పటినుంచి సా.శ.393[3] వరకు ప్రతి నాలుగేళ్ళకోసారి ఒలింపిక్ క్రీడలు సాఫీగా నిర్వహించారు. క్రీడోత్సవాల సమయంలో యుద్ధాలు కూడా ఆపేవారు. క్రీడలలో గెలుపొందిన విజేతలకు ఆలివ్ కొమ్మలను బహుమతిగా ఇచ్చేవారు.[4] అప్పట్లో ప్రాచీన ఒలింపిక్ క్రీడలు జూలై నెలలో జరిగేవి. ప్రారంభంలో ఒక రోజు మాత్రమే నిర్వహించేవారు కాని కాలక్రమేణా జనాదరణ పెరగడంతో పోటీలు నిర్వహించే రోజుల సంఖ్య, క్రీడాంశాల సంఖ్య పెరుగుతూ పోయింది. ఆ రోజుల్లో క్రీడలు జరుగుతున్నన్ని రోజులు తమతమ ప్రజలు పనులు కూడా ఆపివేసి ఒలింపియా స్టేడియానికి పరుగులు పెట్టేవారు. క్రీడాంశాలలో పరుగు పందెంతో పాటు, కుస్తీ, రథాల పోటీ, బాక్సింగ్, గుర్రపు స్వారీ మున్నగు పోటీలు జరిగేవి. రోమన్ చక్రవర్తి థియోడొసియస్ గ్రీకు సామ్రాజ్యాన్ని జయించి ఈ ఒలింపిక్ క్రీడలను నిషేధించాడు.[5] ఆ తరువాత ఒలింపస్ పట్టణం వరదలు, భూకంపాల కారణంగా కాలగర్భంలో కలిసిపోయింది.
రోమన్ చక్రవర్తి థియోడొసియస్ కారణంగా మరుగున పడిన ఒలింపిక్ క్రీడలకు తిరిగి జీవం పోసిన ఘనత ఫ్రాన్సుకు చెందిన క్రీడాపండితుడు పియరీ డి కోబర్టీన్ కే దక్కుతుంది. కాబట్టి ఇతడు ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడిగా ప్రసిద్ధి చెందినాడు. కోబర్టీన్ 1892లో ఒలింపిక్ క్రీడలను పునరుద్ధరించాలని ప్రకటించాడు. క్రీడల పున:ప్రారంభానికి అతడు విపరీతంగా కృషి చేశాడు. అతడి పట్టుదల మూలంగా 1896లో మొదటిసారిగా ఎథెన్స్‌లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు జరిగాయి. ప్రాచీన ఒలింపిక్ క్రీడలు మరుగున పడిన ప్రదేశంలోనే తొలి ఆధునిక క్రీడలు నిర్వహించుట విశేషం. ఆ తరువాత 6 ఒలింపిక్ క్రీడలు జరగగానే 1916లో బెర్లిన్లో జరగాల్సిన క్రీడలు మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా రద్దయ్యాయి. మళ్ళీ 1940, 1944లలో జరగాల్సిన హెల్సింకీ, లండన్ ఒలింపిక్ క్రీడలు కూడా రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా రద్దయ్యాయి. తదనంతరం ఈ క్రీడలు నిరాటంకంగా జరుగుతున్ననూ రాజకీయ కారణాల వల్ల అప్పుడప్పుడు కొన్ని దేశాలు బహిష్కరిస్తున్నాయి. హంగేరీ మీద సోవియట్ యూనియన్ దాడికి నిరసనగా 1956 మెల్బోర్న్ ఒలింపిక్ క్రీడలను హాలెండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ మొదలైన దేశాలు బహిష్కరించాయి. వర్ణవివక్షత పాటిస్తున్న కారణంగా 1964 నుంచి చాలాకాలం పాటు దక్షిణాఫ్రికా ఈ క్రీడలలో పాల్గొనడాన్ని నిషేధించారు. 1976 మాంట్రియల్ ఒలింపిక్ క్రీడలను ఆఫ్రికా దేశాలు బహిష్కరించాయి. 1980 మాస్కో ఒలింపిక్ క్రీడలలో అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు పాల్గొనలేదు. తత్ఫలితంగా 1984 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌ను రష్యా, దాని మిత్ర దేశాలు బహిష్కరించాయి. ఈ విధంగా దేశాల మధ్య స్నేహ సంబంధాల కోసం ప్రారంభించిన క్రీడలు అపుడప్పుడు దేశాల మధ్య వైషమ్యాలు కూడా పెంచాయి. అయినప్పటికీ ఈ క్రీడల యొక్క జనాదరణ, పాల్గొంటున్న క్రీడాకారుల ఉత్సాహం విపరీతమైనది.
5 రంగురంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపించే చిహ్నమే ఒలింపిక్ చిహ్నం. పైన 3 వలయాలు, క్రింద 2 వలయాలు ఈ చిహ్నంలో ఉంటాయి. ఒక్కో వలయం ఒక్కో ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వలయాల మాదిరిగా ఖండాలు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ చిహ్నాన్ని ఎంపికచేశారు. 1913లో రూపొందించిన ఈ చిహ్నం తొలిసారిగా 1914లో ఆమోదించబడింది. 1920 నుంచి ఒలింపిక్ క్రీడలలో వాడుతున్నారు.
1896లో ఏథెన్స్‌లో జరిగిన తొలి ఒలింపిక్ క్రీడలలో 9 క్రీడాంశాలు ఉన్నాయి. అవి: అథ్లెటిక్స్, సైక్లింగ్, కత్తియుద్ధం, జిమ్నాస్టిక్స్, బరువులెత్తడం, షూటింగ్, ఈతలపోటీలు, టెన్నిస్, మల్లయుద్ధం. క్రమక్రమంగా క్రీడాంశాల సంఖ్య పెరిగి, ప్రస్తుతం 28 క్రీడాంశాలకు చేరింది. (శీతాకాలపు ఒలింపిక్స్‌తో కలిపి 35 క్రీడాంశాలు).[6] ఒలింపిక్ నిబంధన 48.1 ప్రకారం వేసవి ఒలింపిక్స్‌లో క్రీడాంశాల సంఖ్య 15 కు తగ్గరాదు. 2002లో మెక్సికోలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సమావేశమై క్రీడాంశాల గరిష్ఠ సంఖ్య 28గా నిర్ణయించింది.
క్రీడాకారుల దృష్టిలో ఒలింపిక్ స్వర్ణ పతకం సాధించడమే అన్నిటి కంటే పెద్ద గౌరవం. ఒలింపిక్ చరిత్రలో అనేక స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు కూడా ఉన్నారు. లారిస్సా లాటినినా అత్యధికంగా 9 స్వర్ణాలతో మొత్తం 18 ఒలింపిక్ పతకాలను సాధించగా 9 స్వర్ణాలు సాధించిన మరో ముగ్గురు క్రీడాకారులు కూడా ఉన్నారు. 1972లో స్విమ్మింగ్‌లో మార్క్ స్పిట్జ్ ఒకే ఒలింపిక్‌లో 7 స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున ఇంతవరకు వ్యక్తిగత పోటీలలో ఎవరూ స్వర్ణం సాధించలేదు గానీ, మిల్కాసింగ్, పి.టి.ఉషలు తృటిలో పతకాలు సాధించే అవకాశాలు పోగొట్టుకున్నారు.అభినవ్ బింద్రా 2008 లో స్వర్ణం సాధించాడు.
మార్క్ స్పిట్జ్: ఒకే ఒలింపిక్స్‌లో - ఒకటి కాదు రెండు కాదు - ఏకంగా ఏడు స్వర్ణాలు సాధించి కొత్త రికార్డు సృష్టించాడు మార్క్ స్పిట్జ్. 1972లో మ్యూనిచ్లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో స్పిట్జ్ బంగారు పంట పండించాడు. వండర్ స్విమ్మర్‌గా పేరుగాంచిన స్పిట్జ్ ఈత కొలనులో చేపపిల్లలా దూసుకుపోయి ఎనిమిది రోజుల వ్యవధిలో 7 స్వర్ణాలు సాధించాడు. తొలి పోటీలోనే (200 మీటర్ల బటర్ ఫ్లై) లోనే కొత్త ప్రపంచ రికార్డును తిరగరాశాడు. తన క్రీడాజీవితంలో మొత్తం 9 స్వర్ణాలు సాధించాడు. ఒకే ఒలింపిక్ పోటీలలో అత్యధిక స్వర్ణాలు సాధించిన రికార్డు ఇప్పటికీ మార్క్ స్పిట్జ్ పేరిటే ఉంది.
సెర్గీ బుబ్కా: ఉక్రెయిన్‌కు చెందిన బుబ్కా పోలోవాల్ట్ క్రీడలో లెక్కకు మిక్కిలి ప్రపంచ రికార్డులు సృష్టించాడు. పోలోవాల్ట్‌లో మకుటం లేని మహారాజుగా అవతరించాడు. కాని ఒలింపిక్ క్రీడలలో మాత్రం ఇతడు సాధించినది ఒకే ఒక్క స్వర్ణం. ప్రతీసారి ఏదో ఒక కారణం వల్ల అవకాశం చేజార్చుకున్నాడు. 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌ను రష్యా బహిష్కరించటంతో పాల్గొనే అవకాశంతో పాటు కచ్చితంగా గెలిచే స్వర్ణం చేజారింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో కూడా పాదం గాయం కారణంగా వైగొలిగినాడు. చివరిసారిగా 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో అర్హత సాధించలేకపోయాడు. రికార్డుల మీద రికార్డులు సృష్టించిన సెర్గీ బుబ్కాకు ఒలింపిక్స్‌లో ఒకే స్వర్ణం సాధించినప్పటికీ ప్రముఖ ఒలింపిక్ క్రీడాకారుడిగా కీర్తి గడించాడు.
క్రీడాకారుడు | దేశం | క్రీడ | సంవత్సరం | స్వర్ణ | రజత | కాంస్య | మొత్తం |
---|---|---|---|---|---|---|---|
లారిసా లాటినినా | URS | జిమ్నాస్టిక్ | 1956–1964 | 9 | 5 | 4 | 18 |
నికోలాయ్ ఆండ్రియనోవ్ | URS | జిమ్నాస్టిక్ | 1972–1980 | 7 | 5 | 3 | 15 |
పావో నుర్మి | FIN | అథ్లెటిక్స్ | 1920–1928 | 9 | 3 | 0 | 12 |
మార్క్ స్పిట్జ్ | USA | స్విమ్మింగ్ | 1968–1972 | 9 | 1 | 1 | 11 |
కార్ల్ లూయీస్ | USA | అథ్లెటిక్స్ | 1984–1996 | 9 | 1 | 0 | 10 |
జార్న్ దాహ్లీ | NOR | స్కీయింగ్ | 1992–1998 | 8 | 4 | 0 | 12 |
బిర్గిట్ ఫిషర్ | GDR / GER | కనోయింగ్) | 1980–2004 | 8 | 4 | 0 | 12 |
సావో కాటో | JPN | జిమ్నాస్టిక్ | 1968–1976 | 8 | 3 | 1 | 12 |
జెన్నీ థాంప్సన్ | USA | స్విమ్మింగ్ | 1992–2004 | 8 | 3 | 1 | 12 |
మాట్ బియోండీ | USA | స్విమ్మింగ్ | 1984–1992 | 8 | 2 | 1 | 11 |
రే ఎవ్రీ | USA | అథ్లెటిక్స్ | 1900–1908 | 8 | 0 | 0 | 8 |
# | సంవత్సరం | వేదిక |
---|---|---|
1 | 1896 | ఏథెన్స్ |
2 | 1900 | పారిస్ |
3 | 1904 | సెయింట్ లూయిస్ |
4 | 1908 | లండన్ |
5 | 1912 | స్టాక్‌హోమ్ |
6 | 1916 | బెర్లిన్ మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా రద్దు అయింది |
7 | 1920 | ఆంట్‌వెర్ఫ్ |
8 | 1924 | పారిస్ |
9 | 1928 | ఆంస్టర్‌డాం |
10 | 1932 | లాస్‌ఏంజిల్స్ |
11 | 1936 | బెర్లిన్ |
12 | 1940 | హెల్సింకీ రెండో ప్రపంచ యుద్ధం కారణంగా రద్దు అయింది |
13 | 1944 | లండన్ రెండో ప్రపంచ యుద్ధం కారణంగా రద్దు అయింది |
14 | 1948 | లండన్ |
15 | 1952 | హెల్సింకీ |
16 | 1956 | మెల్బోర్న్ |
17 | 1960 | రోమ్ |
18 | 1964 | టోక్యో |
19 | 1968 | మెక్సికో సిటీ |
20 | 1972 | మ్యూనిచ్ |
21 | 1976 | మాంట్రియల్ |
22 | 1980 | మాస్కో |
23 | 1984 | లాస్ ఏంజిల్స్ |
24 | 1988 | సియోల్ |
25 | 1992 | బార్సిలోనా |
26 | 1996 | అట్లాంటా |
27 | 2000 | సిడ్నీ |
28 | 2004 | ఏథెన్స్ |
29 | 2008 | బీజింగ్ |
30 | 2012 | లండన్ |
31 | 2016 | రియో |
32 | 2020 | టోక్యో |
22 | 2024 | పారిస్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.