2014 సినిమా From Wikipedia, the free encyclopedia
శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించిన సినిమా "రభస". సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్.టీ.ఆర్., సమంత, ప్రణీత ముఖ్యపాత్రల్లో నటించారు.[1] ఎస్. తమన్ సంగీతం అందించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటరుగా, శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. ఈ సినిమాకి కథ, చిత్రానువాదం, సంభాషణలు సంతోష్ శ్రీనివాస్ అందించాడు. పోరాటాలను రామ్ - లక్ష్మణ్, విజయన్ నేతృత్వంలో తెరకెక్కించారు. కళా విభాగంలో ఎ.ఎస్.ప్రకాష్ పనిచేసారు.
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
రభస | |
---|---|
దర్శకత్వం | సంతోష్ శ్రీనివాస్ |
రచన | సంతోష్ శ్రీనివాస్ |
నిర్మాత | బెల్లంకొండ సురేష్ |
తారాగణం | జూనియర్ ఎన్.టీ.ఆర్., సమంత, ప్రణీత, సాయాజీ షిండే |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మినరసింహా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | ఆగస్ట్ 29, 2014 |
భాష | తెలుగు |
కార్తీక్ తన తల్లికి మరదలునే పెళ్ళి చేసుకుంటానని మాట ఇస్తాడు. తన చిన్నప్పుడే ఆ మామయ్య తన తండ్రితో విభేదించి సిటీకి వెళ్లి ఎదుగుతాడు. దాంతో ఇప్పుడు తన మరదలుని వెతుక్కుంటూ సిటీకి వచ్చి బాగ్యంని చూసి పొరబడి ఆమే తన మరదలు అనుకుని ఆమె వెంటబడతాడు. కొంతకాలం తర్వాత తన మరదలు ఆమెకాదు తను ఎప్పుడూ గొడవపడే ఇందు అని తెలుస్తుంది. ఇందు అప్పటికే తనకి తెలియని వ్యక్తితో ప్రేమలో పడింది. అలాంటి పరిస్ధుతుల్లో కార్తీక్ తల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు? ఇందుని ఎలా ఒప్పించాడు? అనేది ఈ సినిమా మూల కథ.
ఈ సినిమా 2013 ఫిబ్రవరి 13న హైదరాబాదులో ప్రారంభమయ్యింది. చిత్రీకరణ హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో 2013 ఆగస్టు 2న మొదలయ్యింది. హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, గంధర్వ మహల్ సెట్, గచ్చిబౌలి అల్యూమీనియం ఫ్యాక్టరీ మొదలగు ప్రదేశాల్లో చిత్రీకరించగా మిగిలిన భాగం తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచి ప్రాంతంలో, రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ప్రాంతంలో చిత్రీకరించారు. స్విట్జర్ల్యాండ్ దేశంలో ఒక పాటను చిత్రీకరించాక షూటింగ్ హైదరాబాదులో 2014 జూలై 23న పూర్తయ్యింది.[2]
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి కానుకగా 2014 ఆగస్టు 29న విడుదల కానుంది.[3]
తన తొలిచిత్రం కందిరీగ విజయం తర్వాత సంతోష్ శ్రీనివాస్ ఆ సినిమాకి కొనసాగింపుగా కందిరీగ 2 తెరకెక్కించాలనుకున్నాడు. అందులో కథానాయకుడిగా రామ్ ఎన్నుకోబడ్డాడు. అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాకు నామమాత్రపు కొనసాగింపుగా వచ్చిన ఆర్య 2 లాగే ఈ సినిమా కూడా ఒక నామమాత్రపు కొనసాగింపుగా ఉంటుందని 2012 ఏప్రిల్ 17న సినిమా ప్రారంభోత్సవంలో పేర్కొన్నారు.[4] మధ్యలో సంతోష్ శ్రీనివాస్, బెల్లంకొండ సురేష్ మధ్య విభేదాలు తలెత్తడంతో సినిమా నిలిపివేయబడింది.[5] మళ్ళీ కొంతకాలానికి సినిమాకి సంబంధించిన పనులు మొదలయ్యాయి. నవంబరు నెలలో శ్రుతి హాసన్ ఈ సినిమాలో కథానాయికగా ఎన్నికయ్యిందని తెలిసింది.[6] కానీ ఆ తర్వాత కందిరీగ 2లో రామ్ బదులు జూనియర్ ఎన్.టీ.ఆర్. హీరోగా నటిస్తాడని తెలిసింది.[7] 2012 డిసెంబరు 6న బెల్లంకొండ సురేష్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్.టీ.ఆర్., సమంత హీరోహీరోయిన్లుగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని స్పష్టం చేసారు.[8] ఆ సినిమాకి రభస అని వర్కింగ్ టైటిల్ పెట్టి, వేరే టైటిల్ దొరకనప్పుడు దీన్నే ఖరారు చెయ్యాలని డిసెంబరు నెలచివర్లో భావించారు.[9] 2013 ఫిబ్రవరి 13న రామానాయుడు స్టూడియోస్ భవనంలో ఉదయం 7:30కి సినిమా ప్రారంభమయ్యింది. ముహూర్తపు సన్నివేశం దేవుని పటాలపై తీశారు. జూనియర్ ఎన్.టీ.ఆర్. క్లాప్ కొట్టారు. వి. వి. వినాయక్ కెమేరా స్విచ్చాన్ చేశారు. శ్రీను వైట్ల గౌరవ దర్శకత్వం వహించారు.[10] చిత్రీకరణ మొదలుపెట్టక ముందే జూలై 2013లో సంతోష్ ఈ కథ కందిరీగ సినిమాకు కొనసాగింపు కాదని, ఆ కథ ముగిసిపోయిందని, ఇది ఒక కొత్త కథని చెప్పాడు.[11]
నవంబరు 2013 నెలమధ్యలో రభస అన్న టైటిల్ ఈ సినిమాకి సూట్ అవ్వదనుకున్న దర్శకనిర్మాతలు ఈ సినిమాకి జోరు అన్న టైటిల్ని ఖరారు చేసినట్టుగా వార్తలొచ్చాయి.[12] జనవరి 2014 నెలచివర్లో సంతోష్ శ్రీనివాస్ పచ్చ కామెర్లతో బాధపడుతున్నప్పుడు కొరటాల శివ ఈ సినిమాలో కొంత భాగానికి దర్శకత్వం వహించారని వార్తలొచ్చాయి. ఆ నేపథ్యంలో ఫిబ్రవరి 2014 నెలమొదట్లో కొరటాల శివ స్పందించి నేను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నానన్న వార్తలు విని విస్మయానికి గురయ్యాననీ, అవన్నీ పుకార్లేనని తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసారు.[13] సినిమా టైటిల్ జూనియర్ ఎన్.టీ.ఆర్. పుట్టిన రోజైన మే 20వ తేదీన అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది.[14] 2014 మే 20న ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి ముందు నుండి వార్తల్లో ఉన్న రభస టైటిల్ని ఖరారు చేసారు.[15] ఆగస్టు 2014 నెలచివర్లో వి. వి. వినాయక్ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారని తెలిసింది.[16]
జూనియర్ ఎన్.టీ.ఆర్., సమంత ఈ సినిమా ప్రారంభం నుండి తారాగణంలో భాగస్వాములు. ఈ సినిమాలో జూనియర్ ఎన్.టీ.ఆర్. పాత్ర ఒకదానితో ఒకదానికొకటి సంబంధం లేని మూడు విభిన్న కోణాల్లో ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని, ప్లే బాయ్ తరహా పాత్రలో కనిపిస్తాడనీ, రెండు కొత్త విభిన్న కేశాలంకరణలతో కనిపిస్తాడని దర్శకుడు చెప్పాడు.[11] సెప్టెంబరు 2013లో కథానుగుణంగా వచ్చే సన్నివేశం కోసం సమంత ఇందులో బికినీ ధరించిందని మీడియాలో వచ్చిన కథనాలపై సమంత స్పందిస్తూ "నా సినిమాల్లో నా పాత్రలు చూసి కూడా నా గురించి ఇలాంటి గాసిప్పులు ఎలా పుట్టించగ లుగుతున్నారు?" అని ప్రశ్నించింది. "నాపై జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు. నేను బికినీ వేయడం శుద్ధ అబద్ధం. నేనేంటో, ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలేంటో తెలిసి కూడా నాపై ఇలాంటివి పుట్టించడం నిజంగా దారుణం" అని ట్విట్టర్ ద్వారా బాధను వ్యక్తం చేసింది.[17][18] ఈ సినిమాలో రెండో కథానాయికగా ప్రణీత సుభాష్ ఎన్నికయ్యిందని అక్టోబరు 2013 నెలచివర్లో తెలిసింది.[1] ఈ సినిమాలో సమంత, ప్రణీత కాంబినేషన్ సీన్లు ఉండవనీ, ప్రణీత ద్వితీయార్థంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో, మిగిలిన భాగంలో సమంత కనిపిస్తారని వార్తలొచ్చాయి.[19] అవి పుకార్లని తర్వాత తెలిసింది. నావాడంటే నావాడంటూ సమంత, ప్రణీత ఈ సినిమాలో జూనియర్ ఎన్.టీ.ఆర్. కోసం తగువులాడుకుంటారని, ముగ్గురి మధ్య సినిమా ద్వితీయార్థంలో మంచి సన్నివేశాలుంటాయని ఫిబ్రవరి 2014 నెలమొదట్లో తెలిసింది.[20] విలక్షణ మలయాళ నటుడు మోహన్ లాల్ ఈ సినిమాలో జూనియర్ ఎన్.టి.ఆర్. తండ్రిగా కీలక పాత్ర పోషిస్తారని వార్తలొచ్చాయి.[21] కానీ ఆ వార్తలని మోహన్ లాల్ సన్నిహిత వర్గాలు తోసిపుచ్చాయి.[22]
ఈ సినిమాలో జూనియర్ ఎన్.టీ.ఆర్. రెండు విభిన్నమైన ఛాయల్లో కనిపిస్తాడని, అందులో ఒకటి అత్యంత హాస్యభరితంగా ఉంటుందని మే 2014 నెలమొదట్లో తెలిసింది.[23] తన ఇంట్రడక్షన్ సాంగ్ కోసం జూనియర్ ఎన్.టీ.ఆర్. కొరియోగ్రాఫరుగా మారాడని జూన్ 2014 నెలచివర్లో తెలిసింది.[24] భార్యామణిలో తేజ్, పెళ్ళినాటి ప్రమాణాలలో శ్రీమంత్, ముత్యమంత పసుపులో మౌర్య, ముద్దుబిడ్డలో చిన్నా, కళ్యాణయోగంలో వివేక్ పాత్రలు పోషించిన సీరియల్ నటుడు సుందర్ ఈ సినిమాలో సహాయనటుడిగా నటిస్తున్నానని సాక్షి దినపత్రికకు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.[25] ఈ సినిమాలో తన పాత్ర గురించి మాత్లాడుతూ బ్రహ్మానందం "మళ్ళీ అదుర్స్ తరహాలోనే మా ఇద్దరి కాంబినేషన్ అదుర్స్గా ఉంటుంది. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది" అని అన్నారు.[26]
ఈ సినిమా షూటింగ్ 2013 ఆగస్టు 2న హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో మొదలయ్యింది.[27] హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని పోరాట సన్నివేశాలను తెరకెక్కించాక రెండో షెడ్యూల్ 2013 సెప్టెంబరు 10న మొదలయ్యింది.[28][29] ఆ తర్వాత హైదరాబాద్, పొల్లాచి ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగాక నవంబరు 2013లో రామోజీ ఫిల్మ్ సిటీలో జూనియర్ ఎన్.టీ.ఆర్., సాయాజీ షిండే, మరికొందరి మీద పోరాట సన్నివేశాలు తెరకెక్కించారు.[30] సమంత అనారోగ్యం కారణంగా చిత్రీకరణలో పాల్గొనలేదని డిసెంబరు 2013లో వచ్చిన వార్తలను అప్పుడు ట్విట్టర్ ద్వారా సమంత పుకార్లుగా ఖండించింది.[31] పదిరోజుల పాటు హైదరాబాదులో చిత్రీకరణ జరిపాక జైపూర్ నగరంలో నెలపాటు చిత్రీకరణ కొనసాగింది.[32][33] ఆ తర్వాత జనవరి 2014లో హైదరాబాదులోని మణికొండ ప్రాంతంలోని ఒక సెట్లో చిత్రీకరణ కొనసాగింది.[34] సంక్రాంతికి సెలవు తీసుకున్న తర్వాత హైదరాబాదులోని గంధర్వ మహల్ సెట్లో కొన్ని సన్నివేశాలు, ఒక పాట చిత్రీకరణ పూర్తి చేసారు.[35] ఆపై పొల్లాచిలో హీరో ఇంట్రడక్షన్ పాటను తెరకెక్కించారు.[36] ఆ షెడ్యూల్లోనే జూనియర్ ఎన్.టీ.ఆర్., సమంత, ప్రణీతలపై రొమాంటిక్ సన్నివేశాలు తెరకెక్కించారు.[37] ఆపై ముగ్గురి మీదా అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ లో ఒక పాటను 2014 ఫిబ్రవరి 13 నుండి 2014 ఫిబ్రవరి 18 వరకూ చిత్రీకరించారు.[38] మనం సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసాక 2014 ఫిబ్రవరి 26 నుండి సమంత జూనియర్ ఎన్.టీ.ఆర్.తో రామానాయుడు స్టూడియోస్ లో కలిసి ఒక పాట చిత్రీకరణలో పాల్గొంది.[39][40] మార్చి 2014 నెలమొదట్లో అకాల వర్షాలవల్ల షూటింగ్ ఆగిపోయింది.[41]
సంతోష్ శ్రీనివాస్ పచ్చకామెర్లతో బాధపడుతుండటం వల్ల షూటింగ్ ఆగిపోయాక 2014 మార్చి 5న అధికారికంగా బెల్లంకొండ సురేష్ తదుపరి మరియూ చివరి షెడ్యూల్ 2014 మార్చి 16న మొదలై 40 రోజుల పాటు కొనసాగుతుందనీ, విదేశల్లో చివరి పాట చిత్రీకరించాక షూటింగ్ ముగుస్తుందని ప్రకటించారు. పాటల చిత్రీకరణ గురించి మాట్లాడుతూ బెల్లంకొండ గణేష్ బాబు "ఈ సినిమా కోసం హైదరాబాద్ లో వేసిన ప్యాలెస్ సెట్ లో ఒక పాట, పొల్లాచ్చిలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్, రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక కాలేజ్ సాంగ్, రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోలో వేసిన 4 సెట్స్ లో ఒక పాట చిత్రీకరిచడం జరిగింది" అని అన్నారు.[42] సంతోష్ శ్రీనివాస్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ షెడ్యూల్ 2014 ఏప్రిల్ 5న హైదరాబాదులో మొదలయ్యింది.[43] కొన్ని వారాల పాటు శరవేగంగా సాగిన షూటింగ్ ఆపై మణికొండలో ఉన్న గంధర్వ మహల్ సెట్లో కొనసాగింది. అక్కడ జూనియర్ ఎన్.టీ.ఆర్., సమంతలపై సన్నివేశాలు తెరకెక్కించారు.[44] అల్లుడు శీను షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళొచ్చాక సమంత తిరిగి 2014 మే 11న చిత్రీకరణలో పాల్గొంది.[45] కొంతకాలం తర్వాత కత్తి సినిమా షూటింగ్ నుంచి తిరిగి 2014 జూన్ 1న సమంత రభస చిత్రీకరణలో పాల్గొంది.[46] 2014 జూలై 6న ఒక్క పాట మినహా రభస షూటింగ్ పూర్తయ్యిందని తెలిసింది.[47] చివరి పాట షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళాలనుకున్నారు.[48] వీసా సమస్యల వల్ల పాట షూటింగ్ స్విట్జర్ల్యాండ్ దేశంలో జరిపి 2014 జూలై 23న రామోజీ ఫిల్మ్ సిటీలో నటీనటులందరిపై చివరి సన్నివేశం తెరకెక్కించారు. ఆ సన్నివేశంతో చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది.[49][50]
సినిమా ప్రారంభించినప్పుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడని అన్నారు దర్శకనిర్మాతలు. ఆ తర్వాత ఎస్. తమన్ సంగీతదర్శకుడిగా ఎన్నికయ్యినా తర్వాత అనూప్ రూబెన్స్ ఇ సినిమాకి సంగీతదర్శకుడిగా నియమించబడ్డాడు.[51] అయితే సంతోష్ శ్రీనివాస్ కోరుకున్న విధంగా అనూప్ రూబెన్స్ పాటలు లేకపోవటం వల్ల అతన్ని తప్పించి మళ్ళీ అతని స్థానంలో తమన్ ను ఎన్నిక చేసారు.[52] డిసెంబరు 2013 నెలమధ్యలో ఈ సినిమాలో కొండవీటి దొంగ సినిమాలోని అత్తమడుగు వాగులోనా అత్తకొడకో పాటను రీ-మిక్స్ చెయ్యనున్నారని వార్తలొచ్చాయి.[53][54] ఫిబ్రవరి 2014లో గతంలో యమదొంగ, కంత్రి, అదుర్స్ సినిమాల్లోలాగే జూనియర్ ఎన్.టీ.ఆర్. ఈ సినిమాలో ఒక పాట పాడనున్నాడని వార్తలొచ్చాయి.[55] జూన్ 2014 రెండో వారంలో ఈ సినిమా పాటలు 2014 జూలై 20న విడుదల చెయ్యాలని భావించి ఆ తేదీని ఖరారు చేసారు.[56] కానీ జూలై 2014 నెలమధ్యలో ఈ సినిమా పాటలు జూలై 20న కాకుండా 2014 జూలై 27న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో విడుదల చేస్తారని తెలిసింది.[57] అప్పుడే జూనియర్ ఎన్.టీ.ఆర్. రాకాసి రాకాసి అనే పాటను పాడాడని తమన్ తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసాడు.[58] అదే సమయంలో పాటల జాబితా విడుదలైంది. అందులో థీమ్ సాంగుతో కలుపుకుని మొత్తం 6 పాటలున్నాయి. కానీ ఆ జాబితాలో పాటలు ఎవరు పాడారు? ఎవరు రాసారు? అన్న వివరాలు మాత్రం లేవు.[59] అనుకున్న తేదీన కాకుండా పాటలను 2014 ఆగస్టు 1న సినీప్రముఖులు, అభిమానుల సమక్షంలో శిల్పకళా వేదికలో విడుదల చేస్తామని బెల్లంకొండ సురేష్ 2014 జూలై 23న స్పష్టం చేసారు.[60][61]
ఆడియో విడుదల కార్యక్రమంలో సమంత, ప్రణీత, వంశీ పైడిపల్లి, రఘుబాబు, హేమ, బండ్లగణేష్, దిల్ రాజు, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, బి.ఎ.రాజు, అనంత్ శ్రీరామ్ తదితరులు పాల్గొని చిత్రయూనిట్ ను అభినందించారు. రాజమౌళి, వి.వి.వినాయక్ ఆడియో సీడీలను, థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.[62] 2014 ఆగస్టు 21న జరిగిన ప్రెస్ మీట్ లో బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ "ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఆడియో పెద్ద హిట్ అయింది. ముఖ్యంగా ఎన్.టీ.ఆర్. పాడిన ‘రాకాసి రాకాసి’ పాట హైలెట్గా నిలిచింది. త్వరలోనే ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకలను నిర్వహిస్తాం" అని అన్నారు.[63]
నెం. | పాట | గాయకులు | రచయిత | నిడివి |
---|---|---|---|---|
1 | మార్ సలామ్ | సుచిత్ సురేశన్ | రామజోగయ్య శాస్త్రి | 03:39 |
2 | రాకాసి రాకాసి | జూనియర్ ఎన్.టీ.ఆర్. | శ్రీమణి | 04:12 |
3 | గరమ్ గరమ్ చిలకా | శ్రీకృష్ణ, దీపు, పర్ణిక, బిందు | శ్రీమణి | 04:04 |
4 | హవా హవా | కార్తిక్, మేఘ | రామజోగయ్య శాస్త్రి | 04:56 |
5 | ఢం ఢమారే | సింహా, సూరజ్ సంతోష్, నివాస్, దీప్తిమాధురి, మానసా ఆచార్య, పావనీ | శ్రీమణి | 04:03 |
డిసెంబరు 2013 నెలమొదట్లో ఈ సినిమా 2014 మార్చి 28న విడుదల చెయ్యనున్నామని దర్శకనిర్మాతలు స్పష్టం చేసారు. "2002 మార్చి 28న ఆది సినిమా విడుదలైంది. మా సంస్థలో మేటి చిత్రంగా మిగిలింది. 2014లో అదే రోజున ఇప్పుడు తీస్తున్న ఎన్టీఆర్ సినిమాని విడుదల చేస్తాము" అని బెల్లంకొండ సురేష్ అన్నారు.[64] కానీ జనవరి 2014 నెలచివర్లో ఈ సినిమాని 2014 మే 9న వేసవి కానుకగా భారీ ఎత్తున విడుదల చేస్తారని వార్తలొచ్చాయి.[65] అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 2014లో సినిమాను విడుదల చెయ్యాలనుకున్నా 2014 మే 19న ఈ సినిమా విడుదల తేదీని 2014 ఆగస్టు 14గా ఖరారు చేసారు దర్శకనిర్మాతలు.[66] 2014 జూలై 29న ఈ సినిమా విడుదల ఒక రోజు ఆలస్యంగా 2014 ఆగస్టు 15న విడుదలవుతుందని దర్శకనిర్మాతలు ఖరారు చేసారు.[67] కానీ నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యమవ్వడం వల్ల, కొన్ని సన్నివేశాల ప్యాచ్ వర్క్ పూర్తి చేయాల్సి రావడంతో సినిమాని 2014 ఆగస్టు 29న వినాయక చవితి కానుకగా విడుదల చెయ్యనున్నామని 2014 ఆగస్టు 5న అధికారికంగా ప్రకటించారు.[68] ఆర్థిక ఇబ్బందుల వల్ల సురేష్ ఈ సినిమా విడుదలను వాయిదా వెయ్యడానికి ఆలోచిస్తున్నారని వార్తలొచ్చాయి.[69] ఈ నేపథ్యంలో సురేష్ ఈ సినిమా 2014 ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని 2014 ఆగస్టు 20న ఒక ప్రెస్ మీట్ ద్వారా ధ్రువీకరించారు.[70] మరుసటి రోజున సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ నుండి 'ఏ' (పెద్దలకు మాత్రమే) సర్టిఫికెట్ పొందింది.[71]
మార్చి 2014 నెలచివర్లో ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉగాది కానుకగా విడుదల చేస్తారని వార్తలొచ్చాయి.[72] కానీ కుదర్లేదు. ఆ తర్వాత మే 2014 నెలమధ్యలో ఈ సినిమా ఫస్ట్ లుక్ జూనియర్ ఎన్.టీ.ఆర్. పుట్టినరోజున విడుదల చేస్తారని వార్తలొచ్చాయి.[73] ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ 2014 మే 20న జూనియర్ ఎన్.టీ.ఆర్. పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యాయి.[74] పోస్టర్లకు మంచి స్పందన లభించింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి అభినందించాడు.[75] అదే రోజున తొలి టీజర్ కూడా విడుదలయ్యింది.[76] టీజర్ మాత్రం అంచనాలను అందుకోలేక పూర్తిగా విఫలమయ్యింది.[77] జూలై 2014 చివరి వారంలో విడుదలైన రెండు పోస్టర్లకు మాత్రం సానుకూల స్పందన లభించింది. జూనియర్ ఎన్.టీ.ఆర్. అభిమానులు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో కవర్ ఫొటోగా పెట్టుకున్నారు. సినిమాకు మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.[78] పాటలను విడుదల చేసినప్పుడే ఈ సినిమా ట్రైలరును కూడా విడుదల చేసారు. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.[79] 2014 ఆగస్టు 29న ఇనిమా విడుదలవుతున్న సందర్భంగా 3 టీజర్లను విడుదల చేసారు. వాటికి చాలా మంచి స్పందన లభించింది.[80][81] సినిమాకు సరైన ప్రచారం జరగడం లేదని వచ్చిన వార్తలకు స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్ తన ఫేస్ బుక్ పేజిలో "అల్లుడు శీను సినిమాను నాన్న స్వయంగా నిర్మించి చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాడు. అందుకే దానిపై ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాం కానీ ఈ సినిమా బిజినెస్ ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి ఇక మిగతాదంతా డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్సే తీసుకోవాలి. అయిన ఎన్టీఆర్ అన్న కు ప్రమోషన్ అవసరమా..! తనంతట తానే ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించే సత్తా ఉన్నవాడు" అని పోస్ట్ చేసాడు.[82] 2014 ఆగస్టు 25న జూనియర్ ఎన్.టీ.ఆర్. రాకాసి రాకాసి పాటను పాడిన మేకింగ్ వీడియోని విడుదల చేసారు.[83]
జూనియర్ ఎన్.టీ.ఆర్. అభిమానులు ఈ సినిమా విడుదల రోజు తెల్ల చొక్కా వేసుకోవాలని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఒక పోస్టర్ ద్వారా ఒక క్యాంపైన్ మొదలుపెట్టారు. "టైం టు యునైట్" అనే ఉపశీర్షికతో జరిగిన ఈ క్యాంపైన్ని జూనియర్ ఎన్.టీ.ఆర్. వీరాభిమానులు ప్లాన్ చేసి నిర్వహించే భాథ్యతను తీసుకున్నట్లు తెలిసింది. అలాగే ఇదే సందర్భంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అభిమానులను సైతం కలుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా మంది అభిమానులు వైట్ షర్ట్ లను కొనుగోలు చేసారని తెలిసింది.[84] సినిమా పంపిణీదారులు సైతం ప్రచారానికి అనుగుణంగా భారీ సంఖ్యలో సినిమాని విడుదల చెయ్యనున్నారని తెలిసింది.[85] అదే సమయంలో ఈ సినిమాకు కావాలనే సరైన ప్రమోషన్ చెయ్యడం లేదని వార్తలొచ్చాయి. బెల్లంకొండ, జూనియర్ ఎన్.టీ.ఆర్., సంతోష్ శ్రీనివాస్ కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నారనీ, కందిరీగతో విజయం సాధించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించడం, జూనియర్ ఎన్.టీ.ఆర్.తో మూడోసారి సమంత నటించడంతో పెరిగిన అంచనాలను పబ్లిసిటీతో పెంచితే అందుకోవడం కష్టమైపోతుంది, అదే ఏ అంచనాలు లేకుండా సినిమా ముందుకు వస్తే కచ్చితంగా సూపర్ హిట్ కొట్టవచ్చని భావించినట్టు వార్తలొచ్చాయి.[86]
జూన్ 2014 నెలచివర్లో నెల్లూరు ప్రాంతం హక్కులను కొత్త పంపిణీదారులు ₹1.9 కోట్లుకి సొంతం చేసుకున్నారనీ, హరి పిక్చర్స్ వారు గుంటూరు, కృష్ణా హక్కులకు చర్చల్లో ఉన్నారనీ, గుంటూరుకి ₹3.85 కోట్లు, మొత్తం అయితే ఆరు కోట్లుకు ఫైనల్ చేయాలని హరి భావిస్తున్నారు అని తెలిసింది. అనుశ్రీ ఫిల్మ్స్ వారు తూర్పు గోదావరి, ఉషా పిక్చర్స్ వారు పశ్చిమ గోదావరి అడుగుతున్నారనీ, దిల్ రాజు, భారత్ లు వైజాగ్ రైట్స్ కు రేసులో ఉన్నారని తెలిసింది. నైజాం ప్రాంతం హక్కులను ఇప్పటికే దిల్ రాజు తీసేసుకున్నారు కానీ గతంలో నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్ కి మధ్య ఉన్న పెండింగ్ పేమెంట్స్ ఇష్యూతో డీల్ ఇంకా ఫైనలైజ్ కాలేదని వార్తలొచ్చాయి. ప్రాంతాల వారీగా సీడెడ్ హక్కులు అమ్మారనీ, కర్నూలుకి ₹7 నుంచి ₹7.5 కోట్ల మధ్య బిజినెస్ జరిగిందని వార్తలొచ్చాయి. కర్ణాటక హక్కులను వేణుగోపాల్ 3.75 ఎన్ఆర్ఎకి తీసుకున్నారని వార్తలొచ్చాయి. కృష్ణా ఏరియాకి సురేష్ మూవిస్ వారు అడుగుతున్నారని, వారు సొంతం చేసుకోకపోతే అలంకార్ ప్రసాద్ తీసుకునే అవకాశం ఉంది అని కథనాలు వచ్చాయి.[87][88] కొన్ని ప్రాంతాలకు సంబంధించిన పంపిణీదారుల పేర్లు బయటకు వచ్చాయి. నైజాం హక్కులను దిల్ రాజు, సీడెడ్ హక్కులను బళ్లారి లక్ష్మీకంఠరెడ్డి, నెల్లూరు హక్కులను హరి పిక్చర్స్, కృష్ణ హక్కులను సురేష్ మూవీస్, గుంటూరు హక్కులను హరి పిక్చర్స్, కర్ణాటక హక్కులను వేణు గోపాల్ కైవసం చేసుకున్నారని తెలిసింది.[89] ₹35 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి విడుదలకు ముందే పంపిణీ హక్కుల అమ్మకం ద్వారా ₹40 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని జూలై 2014 నెలమొదట్లో తెలిసింది.[90]
2010లో వచ్చిన బృందావనం తర్వాత బాద్షా తప్ప మరే హిట్ అందుకోని జూనియర్ ఎన్.టీ.ఆర్ సినిమాకి ఈ స్థాయి బిజినెస్ జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఈ సినిమా విదేశీ పంపిణీ హక్కులను క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కొనుగోలు చేసిందనీ, తాము ఈ సినిమాని విదేశాల్లో పంపిణీ చెయ్యబోతున్నామని 2014 జూలై 2న ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసారు. అక్కడితో సినిమాకి సంబంధించిన బిజినెస్ పూర్తయ్యిందని సమాచారం వచ్చింది.[91] వ్యాపారం మొత్తం పూర్తయ్యే సరికీ ₹56 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల్లో వార్తలు, కథనాలు వచ్చాయి.[92]
విభాగం | ఆదాయం |
---|---|
నైజాం పంపిణీ హక్కులు | ₹12 కోట్లు |
సీడెడ్ పంపిణీ హక్కులు | ₹7.5 కోట్లు |
నెల్లూరు పంపిణీ హక్కులు | ₹1.9 కోట్లు |
గుంటూరు పంపిణీ హక్కులు | ₹3.85 కోట్లు |
తూర్పు గోదావరి పంపిణీ హక్కులు | ₹2.5 కోట్లు |
పశ్చిమ గోదావరి పంపిణీ హక్కులు | ₹2.5 కోట్లు |
విశాఖ పంపిణీ హక్కులు | ₹4.5 కోట్లు |
కృష్ణ పంపిణీ హక్కులు | ₹2.5 కోట్లు |
కర్ణాటక పంపిణీ హక్కులు | ₹3.5 కోట్లు |
మిగిలిన భారతదేశం పంపిణీ హక్కులు | ₹1.0 కోట్లు |
గల్ఫ్, యూకే, మిగిలిన విదేశాల పంపిణీ హక్కులు | ₹3 కోట్లు |
శాటిలైట్ హక్కులు | ₹8 కోట్లు |
ఆడియో హక్కులు | ₹50 లక్షలు |
హిందీ డబ్బింగ్, శాటిలైట్ హక్కులు | ₹3 కోట్లు |
గమనిక: ఇవన్నీ ట్రేడ్ లో చెప్పబడిన లెక్కలు మాత్రమే. అధికారిక లెక్కలు మాత్రం కాదని గమనించగలరు
ఈ సినిమా విమర్శకుల నుండి మిశ్రమ ఫలితాలు రాబట్టింది. 123తెలుగు.కామ్ తమ సమీక్షలో "యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘రభస’ సినిమా అభిమానులు ఆశించిన రేంజ్ లో రభస క్రియేట్ చేయలేకపోయినా, ఆ అంచనాలకు కాస్త తక్కువగా ఓ మోస్తరు రభసను మాత్రం క్రియేట్ చేసింది. విమర్శకులను అస్సలు మెప్పించలేని ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ కోరుకునే రెగ్యులర్ అంశాలు ఉండడం వలన, అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయడం వలన మొదటి వారం బాక్స్ ఆఫీసు వద్ద భారీగా కాసుల వర్షం కురిపించే అవకాశం మాత్రం పుష్కలంగా కనపడుతోంది" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చారు.[93] ఇండియాగ్లిట్స్ తమ సమీక్షలో "ఎన్టీఆర్ వంటి హీరోతో సినిమా అనగానే మంచి కథ కూడా అవసరం అని విషయాన్ని దర్శకుడు మరచిపోయి నాలుగైదు సినిమాల కథతో రభసను రసాభాస చేశాడు" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 2.25/5 రేటింగ్ ఇచ్చారు.[94] వన్ఇండియా తమ సమీక్షలో "అంచనాలును అందుకోవటానికి దర్శకుడు ఎక్కడా ప్రయత్నించలేదనిపిస్తుంది. ఎన్టీఆర్ కి ఇమేజ్ కి కొద్దిగా కూడా అతకని కథతో నానా ‘రభస' చేయటానికి ప్రయత్నించాడు. సెకండాఫ్ లో వచ్చే బ్రహ్మానందం ఎపిసోడ్, ఎన్టీఆర్ నటన లేకపోతే చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పటికీ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో లాగ మొదటి నుంచి చివరి దాకా తన భుజాలపైనే సినిమాను మోయటానికి ప్రయత్నించాడు" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చారు.[95] వెబ్ దునియా తమ సమీక్షలో "ఇలాంటి ఫార్మెట్లు చాలా సినిమాల్లోనూ వచ్చాయి. హీరోలు మారారు. కాగా, వినాయకచవితి రోజున విడుదలైన 'రభస' చిత్రం ఏమాత్రం కొత్తగా అనిపించదు" అని వ్యాఖ్యానించారు.[96] గ్రేట్ ఆంధ్ర తమ సమీక్షలో "కందిరీగలో పకడ్బందీ కథనంతో, వినూత్నమైన వినోదంతో అలరించిన సంతోష్ శ్రీనివాస్ ఇందులో మరీ మూస ధోరణులకి పోయాడు. దారీ తెన్నూ లేని కథనంతో రభసని రసా భాస చేసి చివరకు కామెడీ సాయంతో ఒడ్డు చేరగలిగాడు" అని వ్యాఖ్యామించి ఈ సినిమాకి 2.75/5 రేటింగ్ ఇచ్చారు.[97]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.