కర్ణాటక సంగీతము భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఒక శైలి. హిందుస్తానీ సంగీతం ఉత్తర భారతదేశంలో కానవస్తే ఈ సంగీతం భారత ఉపఖండంలో ముఖ్యంగా ద్రవిడ రాష్ట్రాలు లేదా దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో అలాగే ఇతర దేశమైన శ్రీ లంకలో కూడా కానవస్తుంది. హిందుస్థానీ సంగీతం పర్షియన్, ఇస్లామిక్ ప్రభావం వలన తనదైన ప్రత్యేకమైన శైలి సంతరించుకోగా, కర్నాటక సంగీతం మాత్రం సాంప్రదాయ మూలాలను పరిరక్షించుకుంటూ వస్తోంది. కానీ రెండింటిలోనూ సాధారణంగా గాత్ర సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
|
చరిత్ర
భారతీయ సంప్రదాయంలోని అన్ని కళలలాగే కర్ణాటక సంగీతానికి కూడా దేవతలకు సంబంధించిన మూలాలు ఉన్నాయి [1][2] ఈ సంగీతాన్ని నాదబ్రహ్మకు చిహ్నంగా భావిస్తారు. ప్రకృతిలోని జంతువుల, పక్షుల స్వరాలను నిశిత పరిశీలన ద్వారా అనుకరించడం ద్వారానే స్వరాలు ఏర్పడ్డాయని హిందూ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వైదిక యజ్ఞాల్లో, ఋగ్వేద సామవేద మంత్రాల్లో ఉచ్చరింపబడే కొన్ని సంగీత స్వరాలు, భారతీయ శాస్త్రీయ సంగీతానికి పునాదిరాళ్ళ వంటివని చెబుతారు. వీణ గాత్రానికి పక్క వాయిద్యమని, యజుర్వేదంలో చెప్పబడింది. రామాయణ, భారతాల్లో కూడా శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. యాజ్ఞవల్క్య స్మృతిలో చెప్పబడినట్లు, " తాళశృతి పరిజ్ఞానము కలిగిన వీణావాదకుడు నిస్సందేహంగా మోక్షమార్గాన్ని పొందుతాడు."
“ | (వీణావాదన తత్వజ్ఞ: శృతిజాతి విశారద: తాలజ్ఞ2ప్రయాసేన మోక్షమార్గమ్ నియచ్ఛతి). | ” |
నేటి కర్ణాటక సంగీతానికి స్వరరాగతాళములే ఆధారములని, ప్రాచీన గ్రంథాలైన శిలప్పాధికారం, భరతుని నాట్యశాస్త్రంలో వివరించబడింది.
సా.శ. 12వ శతాబ్దం వరకూ భారతదేశమంతటా ఒకే రకమైన సాంప్రదాయ సంగీతం ప్రాచుర్యంలో ఉండేది. తరువాత ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలు టర్కీ,, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం పరిపాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వీరు సా.శ. 17వ శతాబ్దంలో ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకునే వరకు పరిపాలించారు. వీరి కాలంలో ఆయా ప్రాంతాలలోని సాంప్రదాయ సంగీతం పర్షియన్ కళలచే విపరీతంగా ప్రభావితమైంది. 14వ శతాబ్దం వచ్చే సరికి ఈ సాంప్రదాయ సంగీతం, హిందుస్థానీ, కర్ణాటక సంగీతం అని రెండుగా చీలిపోయాయి. 18వ శతాబ్దం నుంచీ, 20వ శతాబ్దం వరకూ ఈ సంగీతాన్ని మైసూర్ మహారాజులు, ట్రావెంకూర్ మహారాజులు ఎక్కువగా ఆదరించి పోషించారు. వేంకటమఖి మేళకర్త రాగాల వర్గీకరణ పద్ధతిని కనుగొని, దానిని తన సంస్కృత గ్రంథం, "చతుర్దండి ప్రకాశిక"లో పొందుపరిచాడు. నేడు వాడుకలో నున్న సంపూర్ణ మేళకర్త రాగాల పట్టికను తయారు చేసింది గోవిందాచార్య. ట్రావెంకూర్, మైసూర్ రాజులు, సంగీతకర్తలే కాక, వీణ, రుద్రవీణ, వేణువు, వయొలిన్, ఘటం, మృదంగం వంటి వాయిద్యాలలో నిష్ణాతులు. వారి ఆస్థాన సంగీత విద్వాంసులలో పేరెన్నిక గన్నవారు వీణా శేషన్న (1852 - 1926), వీణా సుబ్బన్న (1861 - 1939) లు.
స్వాతంత్ర్యానంతరం, కర్ణాటక సంగీతం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. గాయకులు సభల్లో పాడేవారు. శ్రోతలు టిక్కెట్లు కొనుక్కొని వినేవారు.అలా మద్రాసు కర్ణాటక సంగీత కేంద్ర బిందువుగా వెలసింది. ప్రస్తుతం ఈ సంగీతం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా చెప్పుకోదగ్గ స్థాయిలో దక్షిణ భారతీయులు నివసిస్తూ ఉంటే అక్కడ కూడా ఇది తప్పక వారి జీవనంలో భాగంగా ఉంటుంది. ప్రతీ యేటా చెన్నైలో డిసెంబరు, జనవరి మధ్యలో జరిగే కర్ణాటక సంగీత ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలకు దేశం నలుమూలల నుంచీ కళాకారులు విశేషంగా హాజరవుతారు.
గ్రంథాలు
మనకు లభ్యమగు ప్రాచీన సంగీతశాస్త్ర గ్రంథములు స్వల్పములయ్యు వాని వలన ఆకాలపు సంగీతమునుగూర్చి కొంత తెలుసుకొనుటకు వీలు ఉంది. సంగీత వాజ్మయమునకు ఆది గ్రంథముగా పేర్కొనబడు క్రీ.పూ. 4 వ శతాబ్దమునాటి భరతముని విరచిత నాట్య శాస్త్రము, తరువాతి సా.శ.1210-1247 ప్రాంతమునాటి శారంగదేవుని సంగీత రత్నాకరము స్వతంత్ర గ్రంథములుగ తెలియబడుచున్నవి. ఈకాలము వరకు దత్తిల, కోహాల, నందికేశ్వర, మతంగ, కశ్యప, యక్షటిక, అభినవగుప్త, మాతృగుప్త, శంకుక, రుద్రట, నాన్యదేవ, భోజదేవ, సోమేశ్వర, ముమ్మట, కీర్తిధర మొదలగు సంగీతవేత్తలు భరత నాట్యమును పురస్కరించుకొని వ్యాఖ్యానములు, గ్రంథములను రచించిరి. అంతేకాక తమ గ్రంథములను భరతాంకితముగ వెలయుచుండిరి. నాన్య భూపాలుడు తన గ్రంథమును భరతభాష్య మనెను.నందికేశ్వరుని భరతావర్ణవము, అభినవగుప్తుని అభినవభారతి మున్నగునవి ఇట్టివే. కోహలుని సంగీతమేరు, మాతంగుని బృహద్దేశి, దత్తిలుని దత్తిలము, భట్టగోపాలుని తాళదీపిక, శారదాతనయుని భావప్రకాశము భోజదేవుని సరస్వతీకంఠాభరణము, పార్స్వదేవుని సంగీతసమయసారము మున్నగు కొన్ని గ్రంథములు స్వతంత్రములుగ రాయబడినను అవిభరతగ్రంథమున గల వివిధ విషయములలో నాట్యకళకు సంబంధిచిన కొన్ని విషయములను ముఖ్యముగ అలంకార రసాదులను, విపుల పరిచించారు. పెక్కు గ్రంథములు నాట్యకళ పరమావధిని గూర్చి, అనగా రసమును గూర్చి మగ్నతతో చెప్పినారు.ఎట్లైనను భరతనాట్యశాస్త్రానుగత సంగతులను అనేకములుగ జేసి చెప్పుటవలన అవి సంగీతరత్నాకరము కాలమువరకు అంతగ స్వతంత్ర గ్రంథములుగ తెలియలేదు. లోల్లట, ఉద్భట, శంకుక, కీర్తిధర, అభినవగుప్త ఆచార్యాదుల గ్రంథములు నాట్య శాస్త్రమునకు వ్యాఖ్యానములు. కావున 13వ శతాబ్దమువరకు గల సంగీత గ్రంథములు భ్రతనాట్యశాస్త్రమునకు సంబంధిచినవే అని చెప్పుకోవచ్చును. కాని వీటిలో సంగీతమునకు సంబంధించిన విషయములు ఉండుటవల వీటిని సంగీతమును అభ్యసించువారు చదువెడివారు.
సంగీత రత్నాకరము
శారంగదేవునిచే రచింపబడిన సంగీత రత్నాకరము మీద పలు వ్యాఖ్యానాలున్నాయి. వానిలో ఆంధ్ర కృతములు జనసమ్మతము లగుచుండెననియు తెలియుచున్నది. అట్టి ఆంధ్రవ్యాఖ్యాతలలో ముఖ్యులు చతురకల్లినాధుడు, సింహభూపాలుడు, కుంభకర్ణ భూమీశుకుడు మున్నగువారు. ఒప్పర్టుదొరగారు తమ సంస్కృత వ్రాత గ్రంథములో సంగీతరత్నాకరచంద్రికా అను వ్యాఖ్యానమును చెప్పెను. గ్రంథకర్తపేరు తెలియదు. కేశవ అను బ్రాహ్మణుడు మరియొక వ్యాఖ్యానమును రచించినట్లు సంగీతసుధ యందు తెలియుచున్నది. ఇది ఇప్పటి మద్రాసు గ్రంథాలయమునందు ఉంది.
రాగార్ణవము
సా.శ. 1609వ సంవత్సరమున ఆంధ్రభారతాచార్యుడగు సోమనార్యుడు రచించిన రాగవిబోధా యందీగ్రధముగూర్చి తెలియుదును. 14వ శతాబ్దము మధ్యమున రచింపబడిన సారంగధరపద్ధతీ అను గ్రంథమునకు ఈ రాగార్ణవము తోడగుచున్నట్లు అందు తెలియుచున్నది. గ్రంథ కర్త తెలియరాకపోయినను ఈగ్రంథము ఆంధ్రవాగ్గేయకరులచే ఆదరింపబడింది.
హరిపాలదేవుని సంగీత సుధాకరము
ఈ గ్రంథము మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తకాలయమునను, తంజావూరు గ్రంథాలయమునను ఉంది. గ్రంథకర్త అయిన హరిపాలదేవుడు భూపాలకుడని గ్రహింతుము. చాళుక్య రాజులలో హరిపాలుడు అనుపేరుగలవాడు కలడని, ఈ గ్రంథకర్త ఆయనేయుండునని కొందరు ఎంచిరి. ఈయన శ్రీరంగ క్షేత్రమున పోయి అక్కడ నటీనటులకు వారికోరికపై సంగీతము ఏర్పరచినట్లు గ్రంథమున ఉంది. వారిచెప్పిన మతము సంగీతసుధాకర గ్రంథముననుసరించిననియు దెలిపినాడు.
శారదాతనయ
శారదాతనయ భావప్రకాశము అను గ్రంథము నాట్యకళ గూర్చియు, శారదీయము అనునది సంగీతము గూర్చియు రచించెను. ఇతడు బ్రాహ్మణుడు. కాశ్యప గోత్రుడు. భావప్రకాశ గ్రంథము మైసూరు ప్రాంతమందలి మేల్ కోట రాజువద్ద నొకప్రతియు, మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయమున ఒక ప్రతియు ఉంది.
విద్యారణ్యుల సంగీతసారము
విద్యారణ్యుడు ఈయన ఆంధ్ర బ్రాహ్మణుడు.ఈయన సంస్కృత వాజ్మయమునకు మిగుల తోడై పెక్కు శాస్త్రములందు గ్రంథములను వ్రాసినాడు.ఈయన కర్ణాటక సంగీతము అంకురింపజేసే ననుటకు రాగములను మేళకర్తలగా క్రోడీకరించు పద్ధతిని తెలియజేసినాడు. ఈయన చెప్పిన మేళకర్త పద్ధతియే కర్ణాటక సంగీతమును ఉత్తరదేశపు సంగీతమునుండి వేరుచేస్తోంది. ఉత్తరదేశమున రాగ రాగిణి అను పద్ధతి అమలో ఉండెను. విద్యారణ్యులిట్లు మేళపద్ధతి నేర్పరచి ఆంధ్రుల ప్రతిభను చాటినాడు. విద్యారణులు వ్రాసిన సంగీతసార ఇప్పుడు అలభ్యము. బికనీరు గ్రంథాలయమున ఈపేరు గల గ్రంథము ఒకటి ఉంది. కాని అది సా.శ. 1565 లేక 1506 కాలమునాటిదని దెలియుటచే అది విద్యారణ్యులు వ్రాసినది కాదని తెలియుచున్నది.
ప్రధాన అంశాలు
శృతి
శ్రుతి అంటే ధ్వని విశేషం. గీతానికి పనికి వచ్చే శ్రుతులు 22. వీనికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం) కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది. శృతి అనగా స్థాయిని సూచిస్తుంది. ఈ సంగీతంలో ఇతర అంశాలకు ఇది ప్రాథమిక భావన లాంటిది.[3] ఇది పాశ్చాత్య సంగీతంలో టానిక్ లేదా కీకి దగ్గరగా ఉంటుంది. అష్టమ స్వరాల్లో స్థాయీ భేదాన్ని సూచించడానికి కూడా దీనిని వాడుతుంటారు. ఒక రాగంలో ఎన్నిరకాలైన స్థాయి భేదాలైనా ఉండవచ్చు కానీ సాధారణ మానవుని చెవి కేవలం ఇరవై రెండింటిని మాత్రమే గుర్తించగలదు. ఒక్కోసారి శ్రోత దృష్టిలో ఇది భావాన్ని కూడా సూచిస్తుంది.[4]
స్వరం
కర్ణాటక సంగీతం | |
---|---|
విషయాలు | |
కూర్పులు | |
వాయిద్యాలు | |
సంగీతకారులు | |
ఈ సంగీతంలో స, రి, గ, మ, ప, ద, ని అని సప్త స్వరాలు (ఏడు స్వరాలు) ఉంటాయి. ఇవి షడ్జమ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, ధైవత, నిషధ అనే పొడవైన పేర్లకు సంక్షిప్త రూపాలు. ఈ సప్త స్వరాలను అనేక రీతులు తప్పని మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పని సరిగా ఉండాలన్న నియమం లేదు.ఇతర సంగీత ప్రక్రియల్లాగా కాకుండా ఈ ఏడింటిలో షడ్జమానికీ, పంచమానికీ, మధ్యమానికీ తప్ప మిగతా స్వరానికీ మూడు ఉప రీతులు ఉంటాయి. షడ్జమానికీ, పంచమానికీ ఒకే రీతి, మధ్యమానికీ రెండు ఉపరీతులూ ఉంటాయి.
రాగం
కర్ణాటక సంగీతంలో రాగం అంటే ఏదైనా ఒక మాధుర్యాన్ని పలికించడానికి ఏర్పరిచిన కొన్ని నిబంధనల సమాహారం.ఇది పాశ్చాత్య సంగీతంలో మోడ్ (mode) కు దగ్గరగా ఉంటుంది. ఆరోహణ, అవరోహణలు ఎలా సాగాలి అన్నదానికి కూడా నిభందనలు ఉన్నాయి. సప్త స్వరాలయిన స, రి, గ, మ, ప, ద, ని రాగం యొక్క ఆరోహణా అవరోహణల్లో కచ్చితంగా వున్న రాగాలని మేళ కర్త రాగాలంటారు. వీటి సంఖ్య 72. వీటినే జనక రాగాలని కూడా అంటారు. ఈ మేళ కర్త రాగాలనుండి పుట్టిన రాగాలని జన్య రాగాలంటారు. అంటే ఆరోహణా, అవరోహణల్లో ఒకటీ లేదా రెండు స్వరాలు వర్జితం కావచ్చు, కొన్ని అదనంగా ఉండచ్చు. ఈ జన్య రాగాలకీ అనేక విభజనలున్నాయి.
తాళం
సంగీతంలో వినిపించే మరోధ్వని విశేషం తాళం. దీనినే లయ అని కూడా అంటారు. తాళం అంటే నిర్ణీత కాలవ్యవధిలో క్రమబద్ధమైన, లయబద్ధమైన రీతిలో వచ్చే ఒక దరువు. శ్రుతి లయలు సంగీత మాధుర్యానికి ఆధారాలు. అట్టి తాళంలో కూడా రకాలున్నాయి. ఆది తాళం 8 మాత్రలతో కూడింది. చుతాళ లేక ఏక తాళం 12 మాత్రలతో కూడింది. జపతాళ 10 మాత్రలతో, రూపక్ తాళ 7 మాత్రలతోను, తీన్ తాళ 16 మాత్రలతో కూడినది.
ఇది పాటతో పాటు మారదు. అన్ని పాటలకూ ఒకే విధంగా ఉంటుంది. కర్ణాట సంగీత కళాకారులు ముఖ్యంగా తమ చేతులనూ, వేళ్ళను పైకి, క్రిందకూ ఆడించడం ద్వారా దీన్ని అనుసరిస్తారు. హిందుస్థానీ సంగీతంలో తాళాన్ని పలికించడానికి, అనుసరించడానికి తబలాను ఉపయోగిస్తారు. కర్ణాటకసంగీతంలో అయితే మృదంగమును ఉపయోగిస్తారు. సప్త తాళములు, అంగ లక్షణములు .
- ధ్రువ తాళం ( 1 0 1 1 )
- మత్య తాళం ( 1 0 1 )
- రూపక తాళం ( 0 1 )
- ఝంపే తాళం ( 1 U 0 )
- త్రిపుట తాళం ( 1 0 0 )
- అట తాళం ( 1 1 0 0 )
- ఏక తాళం ( 1 )
మనోధర్మ సంగీతం
- రాగాలాపన
ఆలాపన అంటే లయతో సంబంధం లేకుండా రాగాన్ని ఆలపించడం.సాధారణంగా మనోధర్మ సంగీతంలో దీనిని సులభమైన ప్రక్రియగా పరిగణిస్తారు. ఎందుకంటే మిగతా ప్రక్రియలతో పోలిస్తే ఇందులో నియమ నిబంధనలు తక్కువగా ఉండటమే. కానీ వీనులవిందైన ఒక సంపూర్ణమైన రాగాలాపన చేయడం మాత్రం కష్టమైన విషయమే. ఇందుకు చాలా నైపుణ్యం అవసరమౌతుంది.
- నెరవల్
సాధారణంగా దీన్ని అనుభవజ్ఞులైన గాయకులు మాత్రమే ఆలపిస్తారు. ఇందులో ఒకటి లేదా రెండు పంక్తులను పదే పదే వివిధ స్థాయీ భేదాలతో, వేగంతో ఆలపించడం జరుగుతుంది.
- కల్పనా స్వరం
దీనినే స్వర కల్పన అని కూడా అంటారు. ఇది ప్రాథమిక స్థాయికి చెందినది. మనోధర్మ సంగీతంలో మొదటగా ఈ ప్రక్రియనే బోధిస్తుంటారు.
- తానం
మనోధర్మ సంగీతంలో ముఖ్యమైన వాటిల్లో ఒకటైన ఈ ప్రక్రియ మొదటగా వీణ కోసం రూపొందించబడింది.
- రాగం తానం పల్లవి
ఇది సుదీర్ఘమైన ప్రదర్శనల్లో ముఖ్య అంశంగా ఉంటుంది.
కూర్పులు
గీతాలు,, స్వరజతులు ముఖ్యంగా కర్ణాటక సంగీత సాధనలో ప్రాథమిక అంశాలు.
వర్ణం
రాగ సంచారాన్ని "వర్ణం" వివరిస్తుంది. స్వర ఉచ్ఛారణ ను, రాగ లక్షణాన్ని, రాగ అవరోహణ, ఆరోహణ క్రమాన్ని కూడా వర్ణం వివరిస్తుంది. వర్ణాల్లో చాలా రకములు ఉన్నాయి. పల్లవి, అను పల్లవి, ముక్తాయి స్వరాలు, చరణం,, చిట్ట స్వరాలు వర్ణానికి సర్వ సాధారణం. వివిధ గతుల్లో అభ్యాసం చేయటానికి వీలుగా వీటిని రచించారు.సాధారణంగా గాత్ర కచేరీల్లో శ్రోతలను మురిపించటానికి వర్ణ ఆలాపనతో గాయకులు కార్యక్రమాన్ని ఆరంభిస్తారు.
కృతి
కృతిలో మూడు ప్రధాన భాగాలుంటాయి.
- పల్లవి
- అనుపల్లవి
- చరణం
ప్రముఖ విద్వాంసులు
కర్ణాటక సంగీతంలో అనేకమంది పేరెన్నిక గన్న విద్వాంసులున్నారు. పురందర దాసు (1480-1564) సల్పిన విశేష కృషి వల్ల ఆయన్ను ఈ సంగీతానికి ఆద్యుడిగా భావిస్తారు. ఈ సంగీతంలో ప్రాథమిక అంశాలని ఈయనే సూత్రీకరించాడు.
సమకాలికుల్లో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి లను కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా భావిస్తారు. వీరి కంటే ముందు అరుణాచల కవి, అన్నమాచార్య, నారాయణ తీర్థులు, విజయదాసు, రామదాసు, సదాశివ బ్రహ్మేంద్ర, ఊటుకూరి వెంకటకవి, మొదలైన వారు ఇందులో ప్రముఖులు. ఇంకా షట్కాల గోవింద మరార్, స్వాతి తిరునాళ్, గోపాలకృష్ణ భారతి, నీలకంఠ శివన్, పట్నం సుబ్రమణి అయ్యర్, మైసూరు వాసుదేవాచారి, చౌటి భాస్కర్, ముత్తయ్య భాగవతార్, కోటీశ్వర అయ్యర్, సుబ్రహ్మణ్య భారతీయార్, పాపనాశం శివన్, హైదరాబాద్ సిస్టర్స్, వీణా శ్రీనివాస్, శేషులత కోసూరు మొదలైన వారు కూడా ప్రసిద్ధిగాంచారు. వీరి కీర్తనలు ప్రస్తుతం అనేకమంది కళాకారులు వేదికలపై గానం చేస్తుంటారు.
నేర్చుకోవడం
ఈ సంగీతాన్ని బోధించడానికి పురందరదాసు కొన్ని పద్ధతులు ఏర్పరచాడు. దీని ప్రకారం ముందుగా వరుసలు నేర్పిస్తారు. తరువాత అలంకారాలు, గీతాలు (సులభమైన పాటలు), స్వరజతులు నేర్పించబడతాయి. విద్యార్థి ఒక దశ చేరుకున్న తర్వాత వర్ణాలు, కృతులు బోధిస్తారు. సాధారణంగా వేదిక మీద ప్రదర్శన ఇవ్వడానికి ఒక విద్యార్థికి కొన్ని ఏళ్ళ కాలం అవసరమౌతుంది. ఈ సంగీతాన్ని మొదటి సారిగా నేర్చుకునే వారికి మాయా మాళవ గౌళ రాగాన్ని నేర్పిస్తారు. ఇదిసంగీతంలో తొలి అడుగులు వేసేవారికి అనుకూలంగా ఉంటుందని పురంధర దాసు ప్రకటించాడు.
బోధనా పద్ధతులు, ఉపకరణాలు దాదాపు అన్ని దక్షిణాది రాష్ట్రాలలోనూ ఒకే విధంగా ఉంటాయి. అభ్యాసం సరళీ వరుసలతో ప్రారంభమై, క్రమంగా క్లిష్టమైన అంశాలకు మళ్ళుతుంది. సాంప్రదాయకంగా ఈ సంగీతాన్ని గురుకుల విద్యా విధానం లోనే బోధించే వారు. కానీ 20వ శతాబ్దం మలి భాగం నుంచీ ప్రజల జీవనశైలిలో గణనీయమైన మార్పులు సంభవించడంతో, ఈ సంగీతాన్ని నేర్చుకోదలచిన పిల్లలు, దీనికి సమాంతరంగా మరో విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగించాల్సి రావడంతో గురుకుల విధానం ప్రాచుర్యాన్ని కోల్పోయింది.
ప్రదర్శన
ప్రదర్శనలో ఎత్తైన వేదికపై కూర్చున్న కొద్దిమంది గాయకుల బృందం గానం చేస్తారు. వీరిలో ఒకరు ప్రధాన గాయకులుగా ఉంటారు. ఈయనకు శృతి, లయ, తాళంలో సహకారంగా కొంత మంది కళాకారులు ఉంటారు. తంబుర సాంప్రదాయకంగా వస్తున్న శృతి వాద్యం. కానీ ఇప్పుడు శృతి పెట్టెలు వాడుతున్నారు.
ముఖ్యాంశాలు
ఈ ప్రదర్శననే కచేరీ అని కూడా వ్యవహరిస్తారు. ఇది సుమారు మూడు గంటల పాటు కొనసాగుతుంది. ప్రదర్శన వర్ణంతో ప్రారంభమౌతుంది. దీనిలో ఎక్కువగా స్వరాలకు ప్రాధాన్యత ఇవ్వబడి ఉంటుంది. కానీ కొద్దిపాటి సాహిత్యం కూడా సమ్మిళితమై ఉంటుంది. వర్ణాల తరువాత కీర్తనలను ఆలపించడం జరుగుతుంది. ఇవి సాధారణంగా వర్ణాలకంటే ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి. సాధారణంగా ఒక కృతి ఒక్క రాగంలోనే స్వరపరచబడి ఉంటుంది. కానీ ఒకే కృతిలో ఒకదానికంటే ఎక్కువ రాగాలు కూడా ఇమిడియుండవచ్చు. ఇటువంటి వాటిని రాగమాలికలని వ్యవహరిస్తారు.
శ్రోతలు
సాధారణంగా ఈ ప్రదర్శనలకు హాజరయ్యేవారు కనీసం కొద్దిపాటి సంగీత పరిజ్ఞానం కలిగినవారు అయి ఉంటారు. వీరు గాయకులు గానం చేస్తున్నపుడు తమ చేతులను పైకి, క్రిందకు కదుపుతూ తాళాన్ని అనుసరిస్తుండటాన్ని గమనించవచ్చు.
ఇవికూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.