From Wikipedia, the free encyclopedia
మాలిక అనగా మాల లేదా హారము అని అర్థము. హారము రంగు రంగుల పుష్పములచే అందముగా కట్టబడి యుండును. చూచుటకు కన్నులకు సొంపుగా నుండును.అదే రీతిన రాగమాలిక కూడా రాగముల యొక్క హారము. ఒక్కొక్క అంగము (పల్లవి, అనుపల్లవి మొదలగునవి) ఒక్కొక్క రాగములో రచించబడి రచన యొక్క నడకను గానీ భావమును గాని చెడపక, సౌందర్యమును పెంపొందించునట్లు రచింపబడిన రచన రాగమాలిక
|
రాగమాలిక అనునది ప్రత్యేక సంగీత రచన. తాళము మారక రాగము మాత్రము అంగ అంగమునకు మారుచుందు రచన రాగమాలిక. పల్లవి, అనుపల్లవి, కొన్ని చరణములుండును. నాలుగు రాగముల కంటే తక్కువ రాగములతో రాగమాలిక ఉండుట అరుదు. అనగా కనిష్ఠము రాగమాలికకు నాలుగు రాగములుండవలెను. కొన్ని రాగమాలికలలో అనుపల్లవి లేకుండుటయు ఉంది. ఒక్కొక్క రాగము తరువాత ఆ రాగ చిట్టస్వరమును, తరువాత పల్లవిని అందుకొనుటకు వీలుగా నుండుట కొరకు పల్లవి రాగములోని చిట్టస్వరములోని కొంత భాగము నుండుట ఉంది. కాబట్టి ప్రతి రాగమును పాడిన తరువాత ఈ వంతెన చిట్టస్వరము వల్ల పల్లవిని అందుకొని పాడుట సులువగుచున్నది. కొన్ని రాగమాలికలలో చిట్టస్వరము లేకుండా యుండును. ఒక్కొక్క రాగము యొక్క పేరు సాహిత్యములోని పదములతో అర్థము చెడకుండా కూర్చి వారి నైపుణ్యమును చూపు రాగమాలికా రచయితలు కొందరు కలరు. కళ్యాణి రాగమయినపుడు "నిత్యాకళ్యాణీ నిగమాగమ సంచారిణీ" అని అర్థము చెడకుండా పొంకముగా నున్నది. కొన్ని రాగమాలికలలో రాగ నామములు సాహిత్యములో లేక యుండుట ఉంది. ఒక రాగము నుండి ఇంకొక రాగమునకు మారుట వల్ల రసములు మారినను, మార్పు చాల సునిశితముగా నుండునటుల రచయిత రచించును. ఒక్క రాగము నుండి ఇంకొక రాగమునకు మారునపుడు ఆ మార్పు మన చెవులకు ఎంతో క్రొత్త ఆనందమునిచ్చును. పెద్ద పెద్ద రాగమాలికలు కొన్ని భాగములుగా భాగింపబడి ఒక్కొక్క భాగము స్వతంత్రముగా ఉంచబడుచున్నవి. సాహిత్యము దైవ ప్రార్థనగాను రాజపోషకుని స్తోత్రముగాను లేక శృంగారముగాను ఉండవచ్చును.
రాగమాలిక రచననే కాక వర్ణములలోను, కీర్తనలలోను పలురాగములుండుట వలన రాగమాలికా వర్ణములు, రాగమాలికా కీర్తనలు అగుచున్నవి. జయ జయ గోకుల బాల అను తీర్థ నారాయణస్వామి గారి కీర్తన కురంజీ రాగములో సామాన్య మెట్టులో పూర్వులు పాడినప్పటికీ, ప్రస్తుతం రాగమాలికా కీర్తనగా పాడబడుచున్నది.
మనోధర్మ సంగీతములో కూడా మనము రాగమాలికను వినుచున్నాము. ఎట్లనగా శ్లోకములు పాడునపుడు రాగములను మార్చి గాయకుడు కొన్ని రాగములతో శ్లోకమును పెంచుచున్నాడు. ఇదియు రాగమాలికయే. తానమును ప్రస్తరించునపుడును, కల్పస్వరములు పాడునపుడును పలురాగములతో పాడిన యెడల అది రాగమాలిక యగుచున్నది.
తాళము మారక రాగము మారి పలు రాగములతో నుండు రచన రాగమాలిగ. రాగము మారక తాళము అంగ అంగమునకు మారునది తాళమాలిక. ఇది మనో సంగీతములోనే సాధ్యము. కొన్ని పల్లవులను తిరుత్తియూర్ త్యాగయ్యరు గారు తాళమాలికగా పాడి తన సభా ప్రేక్షకులను ఆశ్చర్యింప జేయుచున్నారు.
ఒక్కొక్క అంగములోను తాళము, రాగము మార్పబదియుండు రచన రాగతాళమాలిక . దక్షిణ సంగీతములో రామస్వామి దీక్షితుల వారి 108 రాగతాళమాలిక ఒక్కటే యున్నది. ప్రతి భాగములోను సాహిత్యములో తాలము యొక్క యు రాగము యొక్కయు పేరు అతి సుందరముగా కూర్చబదినది. ఇటువంటి రచన రచించుట చాలా కష్టము.
సంగీత రచనలలో రాగమాలికా రచనము పొడుగు రచన.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.