Remove ads
From Wikipedia, the free encyclopedia
ముత్తుస్వామి దీక్షితర్(1775-1835) కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు, వీణ విద్వాంసుడు. వీరి కృతులు తెలుగు కంటే ఎక్కువగా సంస్కృతంలో రాయబడ్డాయి. వీరు కొన్ని కృతులు మణిప్రవాలం (తమిళము, సంస్కృతాల సమ్మేళనం)లో కూడా రాయబడ్డాయి. "గురు గుహ" అనేది వీరి మకుటం. వీరి అన్ని రచనాల్లోనూ అది కనిపిస్తుంది. వీరు మొత్తం 500లకు పైగా కీర్తనలు రాసారు. వీరు సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి.
ముత్తుస్వామి దీక్షితులు | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
మూలం | తిరువారూర్, తంజావూరు, భారతదేశం |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | కర్ణాటక సంగీతం, వాగ్గేయకారుడు |
త్యాగరాజస్వామి ఆలయంలో వార్షిక వసంతోత్సవ సమయం అయిన ఫల్గుణ మాసంలో, రామస్వామి దీక్షితార్, సుబ్బమ్మ దంపతులకు ఒక మగపిల్లవాడు జన్మించాడు. రామ స్వామి దీక్షితర్, సుబ్బలక్ష్మి అంబాళ్ పుణ్యదంపతుల సంతానంగా మార్చి 24, 1775లో పుట్టాడు. ఇతడు ముద్దు కుమారస్వామి దయవలన జన్మించిన ఇతనికి ముద్దుస్వామి దీక్షితర్ అని ఇతని తల్లిదండ్రులు పేరు పెట్టారు. ముద్దుస్వామి దీక్షితర్ కాలక్రమేణా ముత్తుస్వామి దీక్షితర్‌గా పిలువబడ్డాడు. తరువాత, మరో ఇద్దరు కుమారులు - చిన్నస్వామి, బలస్వామి, ఒక కుమార్తె బాలంబిక జన్మించారు. [1] భక్తిశ్రద్ధలుగల వ్యక్తి గుణగణాలను తన బాల్యంలోనే ఇతడు ప్రదర్శించాడు. తన తండ్రి వద్ద తెలుగు, సంస్కృతంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఈయన అభ్యసించాడు. సంగీతంపై వెలువడిన "వెంకటాముఖి" సుప్రసిద్ధ గ్రంథం "చతుర్దండి ప్రకాశికై"ను అధ్యయనం చేశాడు. కావలసినమేరకు మన ధర్మ గ్రంథాల పరమైన జ్ఞానాన్ని కూడా సంపాదించగలిగాడు.[2] ముత్తుస్వామి కి మద్రాసులోని ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో పాశ్చాత్య సంగీత కళాకారులతో పరిచయం ఏర్పడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ కలనల్ బ్రౌన్ సూచన మేరకు దీక్షితార్ ఇంగ్లీష్ బాణీలకు సంస్కృతంలో వచనాన్ని రాసారు . పాశ్చాత్య సంగీతంతో దీక్షితార్ కుటుంబం అనుబంధం వల్ల లభించిన చాలా ముఖ్యమైన ప్రయోజనం వయోలిన్‌ను సాధారణ కచేరీ సాధనంగా స్వీకరించడం. ముతుస్వామి, అతని తండ్రి, సోదరులు తరచూ బ్యాండ్ వాయించే ఆర్కెస్ట్రా సంగీతాన్ని వినేవారు దానివల్ల కచేరీలో వయోలిన్‌కు కేటాయించిన ముఖ్యమైన పాత్రను చూసి ముగ్ధులయ్యారు.
చిదంబరనాధ యోగి ముత్తుస్వామి దీక్షితర్‌ను కాశీకి తీసుకెళ్ళాడు. అక్కడ ఇతడిని ఉపాసనా మార్గంలో అతడు ప్రవేశపెట్టాడు. వారణాసిలో ఉన్నప్పుడు ముత్తుస్వామి ఉత్తరదేశపు సంగీతమైన హిందూస్తానీ కూడా నేర్చుకున్నాడు. "శ్రీనాధాధి గరు గుహోజయతి" అనే మాటలతో ప్రారంభమయ్యే తొలి కీర్తనను ఇతడు ప్రథమావిభక్త్యంతంగా సంస్కృతంలో రచించి రాగం కూర్చాడు. తిరుత్తణిలో వెలసిన శివుడి కుమారుడైన మురుగ భగవానుడి భక్తిపారవశ్యంలో లీనమైనప్పుడు పై సంకీర్తనను అతడు రచించాడు. తరువాత ప్రథమావిభక్తి మొదలుకొని సంబోధనావిభక్తి వరకు కల ఏడు విభక్తులతో ఏడు కీర్తనలు రచించాడు. ఆధ్యాత్మిక వెలుగులో ఇతడి సృజనాత్మకత ప్రతిభ ప్రకాశించింది. తన శిష్యులను ఎంతో జాగ్రత్తగా ఎన్నుకున్న వారికి తన కృతులను ఆలాపించడం బోధించాడు.
కాశీ లో గడిపిన కాలంలో హిందుస్తానీ సంగీతం ఆయన సృజనాత్మకత పై తీవ్ర ప్రభావాన్ని చూపింది, ఇది హిందూస్థానీ రాగాల నిర్వహణలో మాత్రమే కాకుండా, సాధారణంగా రాగాల చిత్రణలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. హిందూస్థానీ సంగీతం నుండి వీరు కర్ణాటక సంప్రదాయానికి వీరు తెచ్చిన రాగాలు సారంగ, ద్విజావంతి మొదలైనవి. ఈయన యమునా కళ్యాణి (హిందూస్థానీ సంగీతానికి చెందిన యమన్) లో అనేక కీర్తనలను స్వరపరిచారు. వాటిలో రాగభావం, వైభవాల గొప్పతనం కోసం కీర్తన జంబుపతే మామ్ పాహి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. హమీర్ కల్యాణిలోని పర్మల రంగనాథం హిందూస్థానీ సంగీతంలో వివరించిన విధంగా రాగం యొక్క ముఖ్య లక్షణాలను తెస్తుంది. ఆయన కీర్తనలు నెమ్మదిగా ఉంటాయి, రాగాల విస్తరణకు చక్కగా సరిపోతాయి. ఈయన వీణా విద్వాంసుడు కావడం చేత గామాకాల యొక్క గొప్పతనం దీక్షితార్ కూర్పులలో అద్భుతంగా కనిపిస్తుంది.
వీరి కృతులలో నవగ్రహ కృతులు చాల ప్రసిద్ధి పొందాయి. ఈ కృతులను శ్రీ చక్ర ఆరాధనకు అంకితమిచ్చినప్పటికీ, వాటిని కమలంబ నవవర్ణ కీర్తనలు అంటారు. తిరువారూర్ మూల విరాట్టు యొక్క భార్య అయిన కమలాంబని దీక్షితార్ జగజ్జననిగా కొలిచేవాడు. నవగ్రహ కీర్తనలు, నవవర్ణ కీర్తనలు అతని ప్రసిద్ధ సమూహ కూర్పులు. దీక్షితార్ రాగాలకు మాత్రమే కాకుండా తాళాలలో కూడా ప్రావీణ్యం కలవాడు. కర్ణాటక సంగీతంలో ఏడు ప్రాథమిక తాళాల్లో కృతులు చేసిన ఏకైక స్వరకర్త. వీరు డెబ్భై రెండు మేళకర్త రాగాలలో(ఇవి వేరే డెబ్భై రెండు మేళకర్త రాగాలు) కృతులు రచించారు .
కొన్ని రచనా సమూహాలు
వీరి పూర్తి కీర్తనలకోసం ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు చూడండి.
వాతాపి గణపతిం భజే అన్న కీర్తన విననివారుండరంటే అది అతిశయోక్తి కాదేమో. ఇతని రచనలలో శాల్కట్టు స్వరము, మణిప్రవాళ సాహిత్యము, స్వరాక్షరములు మొదలైనవి కనిపిస్తాయి. ఇతడు గోపుచ్ఛయతి, శ్రోతవహ యతులతో రచనలు చేయడానికి దారి చూపాడు. రాగముద్ర, రాజముద్ర, వాగ్గేయకార ముద్ర మొదలైన అష్టాదశ ముద్రలు ఇతని కృతులలో కనిపిస్తాయి. వీరి యితర ప్రముఖ రచనలు: వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేత: శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవైభవం, హిరణ్మయీం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలైనవి. తన తమ్ముడు చిన్నస్వామి చనిపోయినప్పుడు ఆ దుఖంలో ఉన్నప్పుడు మదురై మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని దర్శించారు. అక్కడే అతడు "మీనాక్షి మేముదం దేహి, మామన మీనాక్షి" అన్న కీర్తనలను వరుసగా పూర్వీ కళ్యాణి, వరాళి రాగాలలో ఆలపించారు. ధ్యాన యోగం, జ్యోతిష శాస్త్రం, మంత్ర యోగం, పురాణాల సారం మొదలైనవి దీక్షితర్ కృతులలోని ప్రత్యేకతలు. అంబాళ్‌పై అతడు రాసిన నవవర్ణ కీర్తనలు, నవ గ్రహాలపైన రాసిన నవగ్రహ కీర్తనలు ఆయన రచనా గొప్పతనానికి ఉజ్వల ఉదాహరణలు. శక్తి ఉపాసనలోని సూక్ష్మాలను వివరిస్తూ శ్రీ విద్యా తత్వ రహస్యంపై ఇతడు ఎన్నో కీర్తనలను రచించారు.
ఈయన అద్వైత తత్వాన్ని సంగీతం ద్వారా పరిచయం ప్రచారం చేశారు . ఈయన శిష్యులు శివానందం, పొన్నయ్య, చిన్నయ్య, వడివేలు ఆయన అనుచరులు ఆయన నుండి సంగీతం నేర్చుకున్నారు. వడివేలు ఏకసంథాగ్రాహి. వారు, తమ గురువు గౌరవార్థం నవరత్న మాలను సృష్టించారు. తరువాత, శాస్త్రీయ నృత్య రూపమైన భరతనాట్యానికి ప్రధాన సంగీత సృష్టికర్తలుగా పేరు పొందారు.
"శివ పాహి ఓం శివే" అన్న మంత్రాన్ని ఉచ్చరిస్తున్నవేళ అక్టోబర్ 21, 1835 న తనువు చాలించారు. వీరికి ఒక కుమార్తె ఉంది. ఈయన సోదరుడు, బలుస్వామి ఇంకా శిష్యగణం ఈయన సంగీతాన్ని ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించారు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.