ప్రముఖ కవి From Wikipedia, the free encyclopedia
ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందు వలన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.
జాషువా 1895, సెప్టెంబర్ 28 న గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవులు, తల్లి మాదిగ, తండ్రి పాస్టర్ గా పనిచేసేవాడు [1] ఈ ఒక్క విషయం చాలు, మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోడానికి. బాల్యం వినుకొండ గ్రామంలో సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.
అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసాడు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని. తరువాత గుంటూరులోని లూథరన్ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పనిచేసాడు. తరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసాడు. 1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసాడు.
ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివాడు. తక్కువ కులం వాడిని సభలోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక మచ్చు మాత్రమే. అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండి, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు. క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగాడు.
జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది. 1971 జూలై 24న గుంటూరులో గుర్రం జాషువా మరణించాడు.[2].
చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడు, తరువాతి కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసాడు. వాటిలో ప్రముఖమైనవి:
గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.
1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడు.
1948 లో రాసిన బాపూజీ - మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా సృష్టించిన స్మృత్యంజలి.
జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి జాషువా కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించాడు.
ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడాయన. కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యాడు.
ఎండ్లూరి సుధాకర్ జాషువా సాహిత్యం దృక్పథం-పరిణామం అనే గ్రంథాన్ని రాశారు.
జాషువా కుమార్తె హేమలతా లవణం నెలకొల్పిన జాషువా ఫౌండేషన్ ద్వారా భారతీయ భాషలలో మానవ విలువలతో కూడిన రచనలు చేసిన సాహిత్యకారులకు జాషువా సాహిత్య పురస్కారం అందజేయబడుతున్నది. 2002 లో ఏడవ సంచికగా అస్సామీ కవి నిల్మనీ ఫుఖాన్ కు పురస్కారమివ్వబడింది.[4]
తెలుగు అకాడమీ, జాషువా పరిశోధనాకేంద్రం 2012 సెప్టెంబరు 28 న 'జాషువా విశిష్ట సాహిత్య పురస్కారా'న్ని (రెండు లక్షల నగదు పురస్కారం ) ప్రముఖకవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్కి బహూకరించారు .
తెలుగు అకాడమీలో జాషువా పరిశోధనాకేంద్రం కవులకు రచయితలకు మూడు పురస్కారాలు 2013 సెప్టెంబరు 28 న (118 వ జన్మతిథి రోజున) అందజేసింది. ఈ పురస్కారం 2 లక్షల రూపాయాల నగదు, శాలువా, ప్రశంసాపత్రంతో కూడుకున్నది. దాశరథి రంగాచార్యకు జాషువా జీవిత సాఫల్య పురస్కారము, కొలకలూరి స్వరూప రాణికి జాషువా విశిష్ట మహిళా పురస్కారము బహుకరించారు. దళిత సాహిత్యములో విశేష కృషిచేసినందులకు కాలువ మల్లయ్యకు జాషువా సాహిత్య విశిష్ట పురస్కారము బహుకరించారు.[5][6][7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.