పోకూరి బాబురావు ఒక తెలుగు సినీ నిర్మాత. అతను సినిమా నిర్మాణ సంస్థ ఈతరం ఫిలిమ్స్ ను స్థాపించాడు.
జీవిత విశేషాలు
పోకూరి బాబూరావు ప్రకాశం జిల్లా లోని ఒంగోలుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రోవగుంట గ్రామంలో శేషయ్య, నాగేశ్వరమ్మ దంపతులకు జన్మించాడు. అతనికి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు. ఐదో తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివాడు. అతనికి అతని తండ్రే స్పూర్తి. అతని తండ్రి సాధారణ రైతు స్థాయి నుంచి పెద్ద పొగాకు వ్యాపారిగా, థియేటర్ యజమానిగా, హోటల్ ప్రొప్రయిటరుగా అంచెలంచెలుగా ఎదిగాడు. బాబూరావు ఉన్నత విద్యకోసం ఒంగోలు పీవీఆర్ హైస్కూలులో చేరాడు. స్వగ్రామం నుండి ఒంగోలుకు రోజూ నడిచె వెళ్ళేవాడు. దారిలో అతని స్నేహితులతొ సినిమా చర్చలు ఎక్కువగా జరిగేవి. అక్కడ 10వ తరగతి పూర్తి చేసాడు.
నాటకాలపై ఆసక్తి
అతని తల్లి ఖాళీ సమయాలలో భక్తిగీతాలు, హిట్టయిన సినిమా పాటలు పాడేది. వాటిని శ్రద్ధగా వింటూ అతనూ గొంతు కలిపేవాడు. అలా అతని తల్లి నుంచి ఆ కళ అతనికి అబ్బింది. స్కూల్లో టీచర్లు అతనిచే పాటలు పాడించేవారు. అతని ఊళ్ళో సంక్రాంతికి నాటకాలు వేసేవారు. అతని మేనమామ వెంకటేశ్వర్లు నాటకాలలో నటించేవాడు. అతని ప్రేరణతో బాబూరావుకు నాటకాలలో వేషాలు వేయాలనే ఆసక్తి పెరిగింది. అతని పోరుకు తట్టుకోలేక అతని మామయ్య ఓసారి నాటకంలో పోస్ట్ మ్యాన్ పాత్ర ఇప్పించాడు.
అతను విజయవాడలో పి.యు.సి చదివాడు. ఒంగోలు లోని సి.ఎస్.ఆర్ శర్మ కాలేజీలో డిగ్రీ బీ.కాం చేసాడు. అక్కడ అతని క్లాస్ మేట్ టి.కృష్ణ. అతను ఎక్కువగా పాటలు బాగా పాడటం మూలాన కృష్ణకు అతనంటే అభిమానం ఏర్పడింది. టి. కృష్ణ కాలేజీ సాంస్కృతిక విభాగానికి కార్యదర్శిగా ఉండేవాడు. కాలేజీ వార్షికోత్సవంలో, వీడ్కోలు సభలలో నాటకాలు వేసేవారు. ఈ నాటకాలకు కృష్ణ దర్శకత్వం వహించేవాడు. బాబూరావు "సంభవామి యుగే యుగే" నాటకంలో చిన్న పాత్ర వేసాడు. కళాశాలలో ప్రతీ సంవత్సరం చివర్లో పాటల పోటీలు జరిగేవి. ప్రతీ యేడాది కృష్ణ ఉత్తమ గాయకునిగా ఎంపిక అయ్యేవాడు. ఒకసారి బాబూరావు కూడా ఉత్తమ గాయకునిగా ఎంపికయ్యాడు. కళాశాల, యూనివర్శిటీ స్థాయిలో కృష్ణ ఉత్తమ నతుడూ దర్శకుడిగా బహుమతులు సాధించేవాడు. ఒకసారి "పగ" అనే నాటకంలో ఉత్తమ నటునిగా బాబూరావు బహుమతి వచ్చింది. కృష్ణ కాలేజీ నుండి వెళ్ళాక బాబూరావు అతని స్థానంలో సాంస్కృతిక విభాగానికి కార్యదర్శి అయ్యాడు. అతనిలోని కళను గుర్తించి, దాన్ని పదిమందికీ పరిచయం చేసి, అతనికి ఒక గుర్తింపు తెచ్చింది కృష్ణ.[1]
కాలేజీ చదువు పూర్తయ్యాక కృష్ణ మద్రాసు వెళ్ళాడు. "తల్లీ కూతుళ్ళు" సినిమా తీస్తున్న దర్శకుడు గుత్తా రామిరెడ్డి దగ్గర అసిస్టెంటుంగా చేరాడు. ఉత్తరాల ద్వారా బాబూరావు కృష్ణతో స్నేహాన్ని కొససాగించాడు.
అతను ఏలూరు సీ ఆర్ ఆర్ కళాశాలలో ఎం.కాం చదివాడు. తరువాత నిడదవోలు ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగంలో చేరాడు. తర్వాత అతనికి ఒంగోలు బదిలీ అయింది. అతను ఆంధ్రాబ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ వ్యవహారాల్లో పాల్గొనేవాడు. ఈ లోపు మద్రాసు వాతావరణం నచ్చక కృష్ణ తిరిగొచ్చాడు. కృష్ణ, అతనూ ప్రజా నాట్యమండలి ఒంగోలు వేదికలపై పాటలు పాడేవారు. ఆ క్రమంలో అతనికి నల్లూరు వెంకటేశ్వరరావు పరిచయమయ్యాడు. అప్పుడాయన "ప్రజా నాట్యమండలి" ప్రకాశం జిల్లా కార్యదర్శి. మాదాల రంగారావు, టి.కృష్ణ, బాబూరావు, వందేమాతరం శ్రీనివాస్ లు అంతా నల్లూరు వెంకటేశ్వరరావు శిష్యులే.
సినిమా రంగంలో
మాదాల రంగారావు ప్రారంభించిన యువతరం కదిలింది సినిమా ప్రొడక్షన్ వ్యవహారాల్లో అతను కృష్ణతో పాటు పాల్గొన్నాడు. వాళ్ళిద్దరూ చిన్న వేషాలు వేసేవారు. అతను బ్యాంకు ఉద్యోగానికి సెలవులు పెట్టి ఇవన్నీ చేసేవాడు. డబ్బింగ్, ఎడిటింగ్ కోసం మద్రాసు వెళ్ళి ఆయా దశలను పరిశీలించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత ఎర్రమల్లెలు, విప్లవ శంఖం సినిమాలలో రంగారావు ఓ స్థాయికి చేరుకున్నాడు.
తానూ దర్శకుడు కావాలన్న తపన కృష్ణలో రోజు రోజుకూ పెరిగిపోయింది. ఇద్దరు మిత్రులూ చెరో లక్షా వేసి సినిమా తీయాలనుకున్నారు. ఈ విషయం అతని తండ్రితో చెబితే మొదట్లో కాదన్నా కృష్ణతో కలసి చేస్తున్నందున అంగీకరించాడు. "ఈ తరం పిలింస్" బ్యానర్ పెట్టి నేటి భారతం సినిమాను ప్రారంభించారు. వారు తెచ్చిన రెండు లక్షలూ రికార్డింగ్ కే సరిపోయాయి. ఈ దశలో తన తండ్రికి డబ్బు అడగడం ఇష్టం లేక తెలిసిన మిత్రుల దగ్గర చిన్న చిన్న మొత్తాల్లో అప్పుచేసి, మద్రాసు తీసుకువెళ్ళేవాడు. ఈ విషయం అతని తండ్రికి తెలిసి ఎవరినీ అడగవద్దనీ తానే ఇస్తాననీ ధైర్యాన్నిచ్చాడు. తండ్రి వద్ద పొగాకు వ్యాపారం చేస్తున్న అతని తమ్ముడు రామారావు అతనికి సహకరిస్తూ ఉండేవాడు. అతను నిర్మించిన నేటి భారతం పెద్ద విజయం సాధించింది. అతను బ్యాంకు ఉద్యోగి కాబట్టి అతని పేరు కాకుండా అతని తమ్ముడి పేరు వేశాడు. తర్వాత దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు వంటి చిత్రాలు హిట్ అయ్యాయి.
తర్వాత కొంత కాలానికి కృష్ణ కేన్సర్ తో మరణించాడు. అతను బతికి ఉన్నంత వరకు బాబూరావు అతని నీడనే ఎదిగాడు. అదే సమయంలో అతని తండ్రి కూడా మరణించాడు.
డిగ్రీ తరువాత 1973లో అతని పెళ్ళి జరిగింది. అతనికి ఇద్దరు పిల్లలు కలిగారు. రెండు సినిమాలు హిట్టయ్యే సరికి, ఈ మార్గంలో నడవవచ్చునన్న నమ్మకంతో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసాడు.
అతను పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో "ప్రజాస్వామ్యం" సినిమాను తీసాడు. ఈ చిత్రంలొ అతనికి పేరొచ్చింది. మరుదూరి రాజాను "ప్రజాస్వామ్యం" సినిమా సమయంలో పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంటు గా ఉంచాడు. అతని కథ, మాటలతో "నవభారతం" సినిమాను ప్రారంభించాడు. అది కూడా హిట్ అయింది. తరువాత భారతనారి, ఎర్ర మందారం, అన్న ఇలా అతని సినిమాల ప్రస్థానం మొదలయింది. [2]
టి.కృష్ణకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ప్రేమ్‌చంద్ ను "అన్న" సినిమా సమయంలో డైరక్షన్ డిపార్టుమెంటులో చేర్చాడు. అమ్మాయి కాపురం సినిమా షూటింగ్ లో ప్రమాద వశాత్తూ ప్రేమ్‌చంద్ మరణించాడు. కృష్ణ రెండవ కుమారుడు తొట్టెంపూడి గోపీచంద్ సినిమారంగంలోకి ప్రవేశించాడు. కృష్ణ
మీద ఉన్న గౌరవంతో అత అతను యజ్ఞం సినిమాలో గోపీచంద్ ను హీరో గా పరిచయం చేసాడు.
అతను వామపక్ష భావాలతో సమాజ మార్పును కోరే సినిమాలు మాత్రమే తీయగలిగాడు. అతనికి ప్రేక్షకునిగా ఎంటర్‌టైన్‌మెంటు, ఆర్ట్ పిలింస్ అంటే యిష్టం. కామెడీ సినిమాలను కూడా ఎక్కువగా ఇష్టపడతాడు. కానీ అలాంటి సినిమాలు తీయలేదు.
అతనికి సినిమాలు చూడడం, కథల గురించి ఆలొచన చేయడం, షార్ట్ స్టోరీ పుస్తకాలు చదవడం అంటే యిష్టం. అతనిని "చిరస్మరణీయులు" సినిమా ఎంతో పభావితం చేసింది. ఇది "కయ్యూరు కామ్రేడ్స్" అనే మలయాళ నవలకు అనువాదం.
అతని సినిమాలకు ఎం.వి.ఎస్ హరనాథరావు, మరుదూరి రాజా ఎక్కువగా మాటలు రాసారు.
పురస్కారాలు
అతను నేటిభారతం, రేపటి పౌరులు, ప్రజాస్వామ్యం చిత్రాలకు నంది పురస్కారాలను స్వర్గీయ ఎన్.టి. రామారావు చేతుల మీదుగ తీసుకున్నాడు.
గాయకునిగా
అతను స్వరాజ్యం, ఎర్రమంద్రారం మొదలైన సినిమాలలో పాటలు పాడాడు.
నటునిగా
నిర్మాతగా నిలదొక్కుకున్న తరువాత టి.కృష్ణ మెమోరియల్ వాళ్ళు అతనిని విలన్ వేషం వేయమని కోరారు. కాదనలేక "నవయుగం" సినిమాలో నటించాడు. అందులో మంచి పేరొచ్చింది. ప్రేమ తపస్సు, రగులుతున్న భారతం సినిమాలలో నటించాడు. అవి ప్లాప్ అయ్యేసరికి నటనకు దూరమయ్యాడు.
వ్యక్తిగత జీవితం
అతని భార్య పేరు రమ. పిల్లలు ప్రశాంత్, ప్రవీణ్. ఇద్దరూ కంప్యూటర్ సైన్స్ లో ఎం.ఎస్ చేసారు. పెద్ద కుమారుడు అట్లాంతాలో సాఫ్టువేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.
నిర్మించిన సినిమాలు
మూలాలు
ఇతర లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.