From Wikipedia, the free encyclopedia
పైడి జైరాజ్ (ఆంగ్లము: Paidi Jairaj)(సెప్టెంబరు 28, 1909 - ఆగష్టు 11, 2000) భారత సినీరంగంలో తెలంగాణ కరీంనగర్ కు చెందిన తెలుగు నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. తెలంగాణ రాష్ట్రం నుండి హిందీ చిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి పేరు సంపాదించి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న పైడి జైరాజ్ పేరును రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ పెట్టారు.[1]
ఈయన 1909 సంవత్సరం సెప్టెంబరు 28న కరీంనగర్ లో జన్మించారు.[2] జైరాజ్ 156 చిత్రాలలో కథానాయకుడి పాత్రలతోపాటు మొత్తం 300 పైగా మూకీ, టాకీ సినిమాలలో నటించారు.[3]
భారత కోకిల సరోజినీ నాయుడు జైరాజ్ కు మేనత్త అవుతారు. కరీంనగర్ జిల్లాకు చెందిన జైరాజ్ హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివి సినిమాలపై మోజుతో 1929లో ముంబాయి చేరుకున్నారు. తన ఇరవైయ్యోయేట 1930 లో తొలిసారిగా " స్పార్క్లింగ్ యూత్ " అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో " ట్రయంఫ్ ఆఫ్ లవ్ " అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. జైరాజ్ మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు. 1931 లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన " షికారి " ఉర్దూ చిత్రంతో టాకీల్లో ప్రవేశించారు. తర్వాత కాలంలో శాంతారాం, పృధ్వీరాజ్ కపూర్ లాంటి పెద్ద హీరోల సరసన మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకున్నారు. నిరూపా రాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరోయిన్ ల సరసన నటించారు. అనేక విజయాలనూ చవిచూశారు.
'మూకీ' సినిమా రోజులలో 11 సినిమాలలో, తరువాత సుమారు 156 'టాకీ' సినిమాలలో కథానాయకుడిగా, విలక్షణమైన నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హిందీ, ఉర్దూ భాషలతో పాటు, కొన్ని మరాఠీ, గుజరాతీ భాషా చిత్రాలలో కూడా నటించారు. అనేక చిత్రాలలో ఎన్నో రకాల పాత్రలు ధరించినా ఇతను పోషించిన జాతీయ నాయకుల పాత్రలు దేశానికి గుర్తుండేవి, ప్రేరణ కలిగించేవి. ఒక నటుడిగా ఈ పాత్రలే ఎక్కువ సంతృప్తినిచ్చినట్లు ఆయన చెప్పేవారు. జైరాజ్ పోషించిన టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ మొదలైన చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి. బొంబాయి చిత్రసీమలో ప్రవేశించి హీరోగా ఎదిగి హిందీ, ఉర్దూ మొదలైన భాషల్లో సుమారు 170 చిత్రాల్లో నటించిన తెలుగువాడు పైడి జైరాజ్.
సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా 1962, ఫిబ్రవరి 24న విడుదలైంది. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ అనే హిందీ సినిమా తెలుగులోకి అనువాదం చేయబడింది.
నటుడిగానే కాక మొహర్, మాలా, ప్రతిమ, సాగర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో ' సాగర్ ' చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. ఎక్కువగా షాజహాన్, పృధ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్, టిప్పు సుల్తాన్, అల్లావుద్దీన్, చంద్రశేఖర ఆజాద్ లాంటి చారిత్రక పాత్రల్ని ధరించిన జైరాజ్ తెలుగు వాడై వుండి కూడా ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేకపోయారు.
పైడి జైరాజ్ మెహర్, సాగర్ , మాల, ప్రతిమ అనే నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. పి.జె. ఫిల్మ్స్ యూనిట్ పతాకంపై ప్రసిద్ధనటి నర్గీస్ కథానాయికగా 'సాగర్' చిత్రాన్ని 1951లో నిర్మించాడు.
జైరాజ్ భారతీయ సినిమా వికాసానికి తన జీవితకాలంలో చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1980లో కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసి గౌరవించింది.
ఈయన పుట్టిన తేది సెప్టెంబరు 28 1909 . ఈయనకి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు.
ఈయన 2000 సంవత్సరం ఆగష్టు 11న పరమపదించారు.
హిందీలో మాత్రమే కాకుండా మరాఠీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మలయాళం సహా పలు జాతీయభాషల్లో దాదాపు 300 చిత్రాలకు పైగా నటించి భారతీయ సినిమా పరిశ్రమలో శిఖర సమానుడిగా నిలిచి, తెలంగాణ నేలనుంచి దేశం గర్వించదగ్గ స్థాయిలోకి ఎదిగిన పైడి జైరాజ్ అందించిన సేవలకు గుర్తుగా రవీంద్రభారతి రెండవ అంతస్తులోని హాలును ఆధునీకరించి ‘పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్’గా నామకరణం చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేసింది.[4][5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.