హైదరాబాదు రవీంద్రభారతిలోని సినిమా ప్రివ్యూ థియేటర్ From Wikipedia, the free encyclopedia
పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ అనేది హైదరాబాద్ రవీంద్రభారతిలో కళల ప్రదర్శనతోపాటు సినిమాను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లఘు చిత్రాలు, సినిమా ప్రదర్శనలకోసం ఏర్పాటుచేసిన ప్రివ్యూ థియేటర్.[1] తెలంగాణ రాష్ట్రం నుండి హిందీ చిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి పేరు సంపాదించి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న పైడి జైరాజ్ పేరును ఈ ప్రివ్యూ థియేటర్ కు పెట్టబడింది.[2]
కళాకారుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడం కోసం పైడి జయరాజ్ థియేటర్లో సినిమాల ప్రదర్శనలతోపాటు సినిమారంగానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.[3]
హిందీలో మాత్రమే కాకుండా మరాఠీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మలయాళం సహా పలు జాతీయభాషల్లో దాదాపు 300 చిత్రాలకు పైగా నటించి భారతీయ సినిమా పరిశ్రమలో శిఖర సమానుడిగా నిలిచి, తెలంగాణ నేలనుంచి దేశం గర్వించదగ్గ స్థాయిలోకి ఎదిగిన పైడి జైరాజ్ అందించిన సేవలకు గుర్తుగా రవీంద్రభారతి రెండవ అంతస్తులోని హాలును ఆధునీకరించి ‘పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్’గా నామకరణం చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేసింది.[4][5]
2017 సెప్టెంబరు 21న తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి అజ్మీరా చందులాల్ చేతులమీదుగా ఈ పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పర్యాటక-సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సినిమా కోసం ఆరాటపడే యువ దర్శకులు, రచయితలు, నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సినీ అభిమానులకు ప్రపంచ సినిమాను పరిచయం చేసే ఉద్దేశంతో పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
Seamless Wikipedia browsing. On steroids.