సినీ నటుడు, రచయిత, విలేఖరి, వ్యాఖ్యాత From Wikipedia, the free encyclopedia
గొల్లపూడి మారుతీరావు (ఏప్రిల్ 14, 1939 - డిసెంబరు 12, 2019) రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశాడు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశాడు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నాడు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.[2]
గొల్లపూడి మారుతీరావు | |
---|---|
జననం | |
మరణం | 2019 డిసెంబరు 12 80) | (వయసు
వృత్తి | రేడియో ప్రయోక్త అసిస్టెంట్ స్టేషను డైరెక్టరు ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడు రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి, నాటక రచయిత కథారచయిత సంభాషణల రచయిత |
జీవిత భాగస్వామి | శివకామసుందరి (మరణం: 2022 జనవరి 28) [1] |
పిల్లలు | సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్ |
తల్లిదండ్రులు |
|
గొల్లపూడి మారుతీ రావు 1939 ఏప్రిల్ 14 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (పూర్వపు మద్రాసు ప్రావిన్సు ), విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. వారు జీవితాంతం విశాఖపట్టణం లోనే నివాసమున్నారు. సి.బి.ఎం. ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్ కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయము లలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. ఆయన మ్యాథమేటికల్ భౌతిక శాస్త్రంలో బి.యస్‌సీ (ఆనర్స్) చేశాడు. ఈయన తన తల్లిదండ్రులకు అయిదో కొడుకు.[3]
మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 1960 జనవరి 13వ తేదీ చిత్తూరులో పత్రిక యొక్క మరో ఎడిషన్ ప్రారంభించినపుడు, అక్కడ సంపాదక వర్గంలో పనిచేశాడు. తరువాత రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికై, హైదరాబాదుకు మారాడు. ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేశాడు. కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొంది, సంబల్‌పూర్ వెళ్లాడు. ఆ తరువాత చెన్నై, కడప కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టరుగా పదోన్నతి పొందాడు. మొత్తం ఇరవై సంవత్సరాలు పనిచేసి, అసిస్టెంట్ స్టేషను డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశాడు. తరువాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినిమారంగ ప్రవేశం చేశాడు.
మారుతీరావు రాసిన తొలి కథ ఆశాజీవి. ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక రేనాడు లో 1954, డిసెంబరు 9న వెలువడింది. చిన్న వయసులోనే రాఘవ కళా నికేతన్ పేరున ఆయనొక నాటక బృందాన్ని నడిపేవాడు. ఆడది (పినిశెట్టి), కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం (రావి కొండల రావు), రిహార్సల్స్ (సోమంచి యజ్ఞన్న శాస్త్రి), వాపస్ (డి.వి.నరసరాజు), మహానుభావులు (గోగోల్ రాసిన An Inspector Calls ఆధారంగా సోమంచి యజ్ఞన్న శాస్త్రి చేసిన రచన) నాటకాలకు నిర్మాణం, దర్శకత్వం వహించడంతోపాటు, ప్రధానపాత్రధారిగా నటించాడు. కళ్ళు నాటిక రాశాడు.[4]
విద్యార్థి దశలో ఉండగానే శ్రీవాత్సవ రచించగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె.వి.గోపాలస్వామి దర్శకత్వం వహించిన స్నానాలగది నాటకంలోనూ, భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోనూ నటించాడు. మనస్తత్వాలు నాటకాన్ని ఐదవ అంతర విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో భాగంగా కొత్తఢిల్లీలోని తల్కతోరా ఉద్యానవనంలో ప్రదర్శించాడు. ఆయన రచన అనంతం, ఉత్తమ రేడియో నాటకంగా అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటి సమాచార, ప్రసార శాఖామాత్యుడు డాక్టర్ బి.వి.కేశ్‌కర్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకొన్నాడు. మనస్తత్వాలు నాటకాన్ని ఆంధ్ర అసోసియేషన్, కొత్తఢిల్లీ వారికోసం ప్రదర్శించాడు. ఆ అసోసియేషనుకు వి.వి.గిరి అధ్యక్షుడు. చైనా ఆక్రమణ పై తెలుగులో మొట్టమొదటి నాటకం రచించి, చిత్తూరు, మదనపల్లె, నగరి లలో ప్రదర్శించగా వచ్చిన సుమారు యాభై వేల రూపాయల నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి ఇచ్చాడు.
చైనా విప్లవం పై తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటకం వందే మాతరంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి పి.వి. నరసింహారావు దానికి ఉపోద్ఘాతం రాశాడు. 1959, డిసెంబరు 16న రాగరాగిణి అనే నాటకం అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ప్రదర్శించబడింది. పథర్ కే అన్సూ అనే పేరుతో హిందీలోకి కూడా అనువదించబడింది.
ఆయన రచనలను భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన వ్రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. ఆయన రాసిన కళ్ళు నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులకు పాఠ్యపుస్తకం. ఆయన రచనల మీద పరిశోధన చేసి, ఎం.ఫిల్, డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు. చాలా సెమినార్లలో మారుతీరావు కీలకోపన్యాసకునిగా వ్యవహరించాడు. తెలుగు సాహిత్యం మీద ఆయన వ్రాసిన రెండు పరిశోధన పత్రాలు ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం 11వ సంపుటిలో ప్రచురితమయ్యాయి.
మారుతీరావు వివాహం 1961 నవంబరు 11న, విద్యావంతులు సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివకామసుందరితో హనుమకొండలో జరిగింది. సి.నారాయణ రెడ్డి, కాళోజి నారాయణ రావు వంటి ప్రముఖులకు ఆమె తండ్రి ఉపాధ్యాయుడు. ప్రముఖ రచయిత, విమర్శకుడు డా. శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి, మనోధర్మ సంగీతం బాణీ ప్రముఖుడు పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి ఆమెకు సమీప బంధువులు. మారుతీరావుకు ముగ్గురు మగసంతానం సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్. ఆయన కుటుంబంతో మద్రాసులో స్థిరపడ్డాడు.
1992 ఆగస్టు 12న మారుతీరావు చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్, తన తొలి ప్రయత్నంగా ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చిత్రీకరణ సమయంలో జల ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించాడు. మారుతీరావు, తన కుమారుని జ్ఞాపకంగా, గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు నెలకొల్పి, ప్రతి యేటా ఉత్తమ నూతన సినిమా దర్శకునికి రూ. 1.5 లక్షలు నగదుబహుమతి, ప్రముఖ చిత్రకారుడు దర్శకుడు బాపు రూపొందించిన బంగారపు జ్ఞాపికనూ ప్రధానం చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ఏదేని అంశంపై విశేష ఉపన్యాసం చేసిన ప్రముఖునికి గౌరవసూచకంగా రూ.15, 000 గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ లెక్చర్ పేరిట బహూకరిస్తారు. సునీల్ దత్, నసీరుద్దీన్ షా, మృణాల్ సేన్, శ్యాం బెనగల్, జావెద్ అక్తర్, అనుపమ్ ఖేర్ మొదలైన వారు ఇందులో ప్రసంగించిన వారిలో ప్రముఖులు. మిగిలిన ఇద్దరు కుమారులు సుబ్బారావు, రామకృష్ణలు మారుతీ ఎయిర్‌లింక్స్ అనే ట్రావెల్ ఏజన్సీని నడుపుతున్నారు.
1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశాడు. మారుతీరావుకు అది మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డు లభించింది. మారుతీరావు నటునిగా ప్రధానపాత్ర పోషించిన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఘనవిజయం సాధించిన తరువాత వెనుదిరిగి చూడవలసిన అవసరం కలుగలేదు. 250 చిత్రాలకు పైనే, సహాయక నటుడిగా, హాస్య నటుడిగా వివిధ పాత్రలలో నటించాడు. సంసారం ఒక చదరంగం, తరంగిణి, త్రిశూలం, అసెంబ్లీ రౌడీ, చిరునవ్వుల వరమిస్తావా, ముద్దుల ప్రియుడు, ఆలయశిఖరం (1983) ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (1988) ఆదిత్య 369, అల్లుడు దిద్దిన కాపురం (1991), గోల్‌మాల్ గోవిందం (1992), రెయిన్‌బో (2008) అతను నటించిన కొన్ని సినిమాలు. పూర్తి జాబితా కోసం అధికారిక వెబ్‌సైటు Archived 2009-12-02 at the Wayback Machineను సందర్శించండి.
మారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నాడు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.
ఈటీవీ నిర్వహిస్తున్న ప్రతిధ్వని కార్యక్రమానికి మొదట్లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ కార్యక్రమంలో ఆయన అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు. ఈటీవీ నిర్వహించిన మనసున మనసై అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. ఇది భార్యాభర్తల కోసం ఉద్దేశించింది. జెమిని టీవీ నిర్వహించిన ప్రజావేదిక, మాటీవీ నిర్వహించిన వేదిక, దూరదర్శన్, హైదరాబాద్ ప్రసారం చేసిన సినీ సౌరభాలు మొదలైనవి ఆయన నిర్వహించిన ప్రజాదరణ పొందిన కార్యక్రమాలు. ఇంకా ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరి గోల వారిదే, ప్రేమలు-పెళ్ళిళ్ళు, భార్యారూపవతీ శత్రుః, ఏది నిజం? అనే ధారావాహికల్లో నటించాడు.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ నిర్వహించిన అనేక పోటీల్లో జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా వ్యవహరించాడు. జాతీయ చలనచిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్ట్ పరిశీలన విభాగంలో పనిచేశాడు. 1958లో జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున మనస్తత్వాలు అనే నాటకాన్ని ప్రదర్శించాడు. 1978లో మద్రాసులో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఆకాశవాణి తరపున సమీక్షకుడిగా వ్యవహరించాడు. 1996 లో జరిగిన ఇండియన్ పనోరమాలో జ్యూరీ సభ్యుడిగా వ్యవహరించాడు. 2000, డిసెంబరు 8 న జరిగిన ప్రపంచ తెలుగు సమావేశంలో కళలు, సంస్కృతి మీద సెమినార్ కు అధ్యక్షత వహించాడు. 2007, జూన్ 2, 3 తేదీల్లో చెన్నైలో జరిగిన అఖిల భారత తెలుగు సమావేశంలో కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించాడు. 2007, సెప్టెంబరు 23 న కృష్ణా జిల్లాలో జరిగిన తెలుగు రచయితల సమావేశంలో కీలకోపన్యాసకుడుగా వ్యవహరించాడు.
ఈయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, డిసెంబరు 12న మరణించాడు. చిత్రరంగంలోని పలువురు సంతాపం ప్రకటించారు. వారి బహుముఖ ప్రజ్ఞత్వం గురించి ప్రత్యేకంగా పత్రికలు ప్రచురించాయి.[8][9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.