కృష్ణా నది భారతదేశంలోని అత్యంత పొడవైన నదుల్లో మూడవది. దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది. కృష్ణలో నీటి ప్రవాహం సెకనుకు 2213 మీ3 . నీటి ప్రవాహం పరంగా ఇది దేశంలో కెల్లా నాలుగవ పెద్ద నది. తెలుగు వారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్‌కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో, సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా కృష్ణానది జన్మిస్తుంది. ఆపై అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను సస్యశ్యామలం చేస్తూ[3] మొత్తం 1, 400 కి. మీ. ప్రయాణించి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
కృష్ణానది | |
---|---|
స్థానం | |
Country | భారత దేశం |
State | మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ |
Region | దక్షిణ భారతదేశం |
భౌతిక లక్షణాలు | |
మూలం | మహాబలేశ్వర్ వద్ద నున్న జోర్ గ్రామం |
• స్థానం | సతారా జిల్లా, మహారాష్ట్ర |
• అక్షాంశరేఖాంశాలు | 17°59′18.8″N 73°38′16.7″E |
• ఎత్తు | 914 మీ. (2,999 అ.)Geographic headwaters |
సముద్రాన్ని చేరే ప్రదేశం | బంగాళాఖాతం |
• స్థానం | హంసలదీవి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
• అక్షాంశరేఖాంశాలు | 15°44′10.8″N 80°55′12.1″E[1] |
• ఎత్తు | 0 మీ. (0 అ.) |
పొడవు | 1,400 కి.మీ. (870 మై.)approx. |
పరీవాహక ప్రాంతం | 258,948 కి.మీ2 (99,980 చ. మై.) |
ప్రవాహం | |
• సగటు | 2,213 m3/s (78,200 cu ft/s) |
ప్రవాహం | |
• స్థానం | విజయవాడ (1901–1979 సగటు), గరిష్ఠం (2009), కనిష్ఠం (1997) |
• సగటు | 1,641.74 m3/s (57,978 cu ft/s) |
• కనిష్టం | 13.52 m3/s (477 cu ft/s) |
• గరిష్టం | 31,148.53 m3/s (1,100,000 cu ft/s)[2] |
పరీవాహక ప్రాంత లక్షణాలు | |
ఉపనదులు | |
• ఎడమ | భీమ, దిండి, పెద్దవాగు, మూసీ, పాలేరు, మున్నేరు |
• కుడి | కుడాలి (నిరంజన) వెన్నానది, కొయినా, పంచ్‌గంగ, దూధ్‌గంగ, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర |
ప్రయాణం
ద్వీపకల్పం పడమర చివరి నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణ 29 ఉపనదులను తనలో కలుపుకుంటోంది. పుట్టిన మహాబలేశ్వర్ నుండి 135 కి.మీ.ల దూరంలో కొయినా నదిని తనలో కలుపుకుంటుంది. తరువాత వర్ణ, పంచగంగ, దూధ్‌గంగ లు కలుస్తాయి. మహారాష్ట్రలో నది 306 కిలోమీటర్లు ప్రవహించాక బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. పడమటి కనుమలు దాటాక, జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ దూరంలో కర్ణాటకలో ఘటప్రభ, మలప్రభ నదులు కృష్ణలో కలుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు, భీమా నది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి రాయచూర్ జిల్లా దేవర్‌సూగూర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలుకి, మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత ఆలంపూర్కు దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది తుంగభద్ర కలుస్తుంది. ఇదే ప్రాంతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత కొద్ది దూరంలోనే నది నల్లమల కొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలం, నాగార్జున సాగర్ ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన దిండి, మూసి, పాలేరు, మున్నేరు వంటివి కలుస్తాయి. విజయవాడ వద్ద బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బ్యారేజిని దాటి డెల్టా ప్రాంతంలో ప్రవేశిస్తుంది. విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తరువాత దివిసీమ లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఉపనదులు అన్నిటితో కలిపిన కృష్ణా నదీ వ్యవస్థ యొక్క మొత్తం పరీవాహక ప్రాంతం 2,56,000 చ.కి.మీ. ఇందులో మూడు పరీవాహక రాష్ట్రాల వాటా ఇలా ఉంది:
- మహారాష్ట్ర: 26.8%
- కర్ణాటక: 43.8%
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్: 29.4%
కృష్ణా నదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు
కృష్ణా నదికి భారతదేశంలోని ఇతర నదుల వలెనే పౌరాణిక ప్రశస్తి ఉంది. ఎన్నో పుణ్య క్షేత్రాలు నది పొడుగునా వెలిసాయి. వీటిలో ప్రముఖమైనవి:
- శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆలయం. ప్రసిద్ధ శివక్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, శ్రీశైలం.
- ఆలంపూర్ : అష్టాధశ శక్తి పీఠాలలో ఒకటైన ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు మొదలగు దేవాలయ సముదాయాలున్న ఆలంపూర్ చాళుక్య రాజుల ఆలయ శిల్ప నిర్మాణానికి అద్దం పడతాయి.
- శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం (కనకదుర్గ) - విజయవాడ
- అమరావతి: అమరారామం ఇక్కడ శివుడు అమరలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటాడు. బౌద్ధుల ఆరామలకు కూడా ఇది ప్రసిద్ధి.
- మోపిదేవి: ఈ ప్రసిద్ధ క్షేత్రములో నాగ పూజలు చేస్తారు.
- ప్రకాశం బ్యారేజీ వద్ద:
సీతానగరం నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా వైకుంఠపురం వరకు కరకట్ట వెంబడి కృష్ణాతీరాన్ని ఆనుకుంటూ ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రకృతి ఆశ్రమాన్ని కూడా నెలకొల్పారు.సీతానగరంలో శ్రీ మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి ఆలయం, 1982లో అయిదెకరాల విస్తీర్ణంలో శ్రీ జీయరుస్వామివారు ఆశ్రమాన్ని నెలకొల్పారు. 2001 ఫిబ్రవరి 6వ తేదీన రామకృష్ణమిషన్‌ను ఇక్కడే ఏర్పాటు చేశారు. శ్రీ జయదుర్గా తీర్థాన్ని 1986లో దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ స్థాపించారు.ఇస్కాన్ మందిరంలో విదేశీ భక్తులు సైతం కృష్ణ భజనల్లో మునిగి తేలుతుంటారు. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యశాలను ఏర్పాటు చేశారు.తాళ్లాయపాలెం లోశ్రీ కోటిలింగ మహాశైవక్షేత్రాన్ని ఏడెకరాల విస్తీర్ణంలో విజయవాడకు చెందిన శ్రీ బ్రహ్మచారి శివస్వామి 2004లో నెలకొల్పారు. ఈ క్షేత్రంలో అనేక ఆలయాలు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో పాదరస స్పటిక లింగాలు వుండడం ఓ విశేషం.
ప్రాజెక్టులు
కృష్ణా నది పరీవాహక రాష్ట్రాలు మూడూ కూడా విస్తృతంగా సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకున్నాయి. వీటిలో ముఖ్యమైనవి:
కర్ణాటక
- అలమట్టి ప్రాజెక్టు
- నారాయణపూర్ ప్రాజెక్టు
- తుంగభద్ర
పై రెంటినీ కలిపి అప్పర్ కృష్ణా ప్రాజెక్టు అని అంటారు.
తెలంగాణ
- ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు : కృష్ణానది తెలంగాణలో ప్రవేశించిన తరువాత కృష్ణాపై ఉన్న మొదటి ప్రాజెక్టు ఇదే. [Jogulamba gadwal district], రేవులపల్లి సమీపంలో నిర్మించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు : కృష్ణానదిపై కల ప్రాజెక్టులలో ఇది ప్రముఖమైనది. గుంటూరు (ఆంధ్ర ప్రదేశ్), నల్గొండ (తెలంగాణ) జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టును 1956లో ప్రారంభించారు.
- శ్రీశైలం ప్రాజెక్టు : కర్నూలు జిల్లా శ్రీశైలం వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు.
ఆంధ్రప్రదేశ్
వరదలు
2009 అక్టోబరులో కృష్ణానదికి వచ్చిన వరదల్లో 350 గ్రామాలు మునిగిపోయి లక్షల మంది నిరాశ్రయులయ్యారు.[4] దీన్ని వెయ్యేళ్ళ వరదగా భావిస్తున్నారు. కర్నూలు, మహబూబ్ నగర్, గుంటూరు, కృష్ణా, నల్గొండ జిల్లాల్లో ఈ వరద బీభత్సం సృష్టించింది. కర్నూలు నగరం మొత్తం దాదాపు 3 రోజుల పాటు 3 మీటర్ల వరద నీటిలో మునిగిపోయి ఉంది.[5] కృష్ణా నది శ్రీశైలం ఆనకట్ట పైగా ప్రవహించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద 11,10,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. 1903 లో నమోదైన 10,80,000 క్యూసెక్కుల ప్రవాహ రికార్డును ఇది మించిపోయింది.[6]
ఇవి కూడా చూడండి
బయటి లంకెలు
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.