Remove ads
భారతదేశంలోని గ్రామం From Wikipedia, the free encyclopedia
హంసలదీవి, కృష్ణా జిల్లా, కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
సాధారణంగా హంసలదీవి పేరు ఇక్కడ హంసలు ఎక్కువగా తిరిగేవేమో అనుకోవడానికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ ఈ పేరు సంబంధిత కథనం ఒకటి ప్రచారంలో ఉంది. ఈ క్షేత్రంలో కాకి హంసగా మారిన అద్భుత సంఘటన చోటు చేసుకుందిగనుకనే ఈ పేరు స్థిరపడింది. అందరి పాపాలను కడిగేస్తూ వెళ్లిన కారణంగా గంగానది మలినమైపోయింది. దాంతో ఆమె తన దుస్థితిని శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకుంది. అప్పుడు విష్ణుమూర్తి గంగాదేవిని కాకి రూపంలో సకల పుణ్యతీర్థాలలో స్నానమాచరించమనీ, ఏ క్షేత్రంలో ఆమె హంసగా మారుతుందో అది మహోన్నతమైన దివ్యక్షేత్రమై అలరారుతుందని చెప్పాడు. ఆ క్షేత్ర మహిమ కారణంగా హంసగా మారాక తిరిగి ఎప్పటిలానే పవిత్రతతో ప్రవహించమని అన్నాడు. సకల పుణ్య తీర్థాలలో స్నానం చేస్తూ వెళుతోన్న కాకి కృష్ణవేణి సాగర సంగమం చేసే ఈ ప్రదేశంలో మునిగిలేవగానే హంసగా మారిపోయింది. అందుకే ఇది హంసలదీవిగా పిలువబడుతుందని స్థలపురాణం వివరిస్తుంది.
బంగాళాఖాతం ఇక్కడి నుండి 5 కి.మీ. దూరంలో ఉంది. అవనిగడ్డ దగ్గర పులిగడ్డ వద్ద కృష్ణానది రెండు పాయలుగా చీలుతున్నది. వాటిలో తూర్పు శాఖ పాలకకాయి తిప్ప దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది హంసల దీవికి 5 కిలోమీటర్లు దూరంలో ఉంది. పశ్చిమ శాఖ మళ్ళీ మూడు పాయలుగా చీలుతుంది - లంకవానిదిబ్బ కృష్ణ, నాసగుంట కృష్ణ, వేణీసాగరం కృష్ణ - ఈ మూడు పాయలూ సముద్రంలో కలుస్తాయి.
పాలకాయి తిప్ప వద్ద నది సాగరంలో కలిసే చోట (సాగర సంగమం) సుందరమైన ప్రదేశం. ఇక్కడికి రోడ్డు మార్గం ఉంది. చివరిలో బీచి వెంట ఉన్న కాలిమార్గం సముద్రం పోటు సమయంలో అంత క్షేమం కాదు. సందర్శకులు నీటిలో ఎక్కువ దూరం వెళ్ళవద్దని హెచ్చరించే బోర్డు ఉంది. సురక్షితమైన ప్రాంతాన్ని సూచించే సిమెంటు స్తంభాల హద్దులు కనిపిస్తాయి. దగ్గరలో ఉన్న ఒక భవంతి పైనుండి సుందరమైన సాగర సంగమం దృశ్యాన్ని చూడవచ్చును. పాలకాయతిప్ప వద్ద కృష్ణానదీ బంగాళాఖాతం సాగరసంగమ దృశ్యం చూడాలంటే రోడ్డు మార్గంలో 3 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవచ్చు. అక్కడ విహంగ వీక్షణం చేయడానికి వీలూగా నిర్మించిన నిర్మాణం పైకి చేరుకుంటే కృష్ణాజలాలు సాగరంలో కలవడాన్ని చూడవచ్చు.1977 తుఫానులో ఇక్కడ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
హంసల దీవికి విజయవాడ నుండి, గుడివాడ నుండి బస్సు ద్వారా చేరుకోవచ్చును. కొత్తమాజేరు, నాగాయలంక నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 88 కి.మీ
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల. మండల పరిషత్తు ప్రాథమికో పాఠశాల, లింగారేడ్డిగూడెం. రవితేజ హైస్కూల్, కోడూరు.
ఈ గ్రామంలో వాటర్ ట్యాంకు నిర్మాణానికి ప్రభుత్వం రు. 15 లక్షల నిధులు మంజూరు చేసింది.
ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో కొక్కిలిగడ్డ సముద్రాలు సర్పంచిగా ఎన్నికైనాడు.
ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఒక పవిత్ర పుణ్య స్థలం. పూర్వం దేవతలు ఈ గుడిని నిర్మించారు అని ఇక్కడి ప్రజల నమ్మకము.ఈ ఆలయానికి గాలిగోపురం ఉండదు. ఇక్కడ మాఘ పౌర్ణమి నాడు ప్రత్యేకమైన పూజలుమహోత్సవాలు, అన్నదానం జరుగుతాయి. ఈ ఆలయంలోని శ్రీ వేణుగోపాలస్వామి పిలిస్తే పలుకుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రాంతంలో బయటపడిన శ్రీ కృష్ణుడి విగ్రహం అనుకోని కారణంగా దెబ్బతినడంతో, దానిని ప్రతిష్ఠించే విషయమై ప్రజలు ఆలోచనలో పడ్డారు. అప్పుడు వారిలో ఒకరికి స్వామి కలలో కనిపించి చెప్పిన ప్రకారం కాకరపర్రు వెళ్ళి ఓ గృహస్థుని ఇంట్లో కాకరపాదు కింద భూమిలో వున్న స్వామివారి విగ్రహాన్ని వెలికితీశారు. ఈ కారణంగానే ఆ ఊరికి కూడా కాకరపర్తి అనే పేరు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ బయటపడిన శ్రీ వేణుగోపాల స్వామిని హంసలదీవికి తెచ్చి ప్రతిష్ఠించారు. అయితే ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఈ విగ్రహం నీలమేఘ ఛాయలో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
ఈ దేవాలయం, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి దేవాలయానికి దత్తత దేవాలయంగా ఉంది.
ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేతుడై పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక్కడి దేవాలయ కుడ్యాలపై రామాయణ ఘట్టాలు అందంగా చెక్కబడి ఉన్నాయి. తూర్పు చాళుక్యుల శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంటాయి. ప్రతి యేడు మాఘ శుద్ధ నవమి నుంచి బహుళ పాడ్యమి వరకూ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా వేలసంఖ్యలో వచ్చిన ప్రజలు స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తరువాత అక్కడికి దగ్గరలో ఉన్న సాగరంలో కృష్ణానది (తుంగ - భద్ర నదులను తనలో కలుపుకున్న కృష్ణవేణి ఇక్కడే సముద్రంలో కలుస్తుంది) క్షేత్రంలో స్నానం చేసి తరిస్తుంటారు.
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, మాఘ పౌర్ణమికి వైభవంగా నిర్వహించెదరు. మాఘ శుద్ధ త్రయోదశినాడు ఉదయం స్వామివారిని శాస్త్రోక్తంగా పెళ్ళికుమారునిచేసి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. చతుర్దశినాడు ఉదయం శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారికి కుంకుమపూజను రాత్రికి స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. పౌర్ణమినాడు రథోత్సవం మరుసటిరోజున చక్రస్నానం (వసంతోత్సవం) మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.