Remove ads
From Wikipedia, the free encyclopedia
అలెగ్జాండర్ (సా.పూ[నోట్స్ 1] 356 జూలై 20/21 - సా.పూ 323 జూన్ 10/11) ప్రాచీన గ్రీకు రాజ్యమైన మాసిడోన్ [a]కు రాజు (గ్రీకు సామ్రాజ్యంలో ఈ పదవిని బాసిలియస్ అంటారు), ఆర్గియడ్ రాజవంశస్థుడు. అతన్ని మాసిడోన్‌కు చెందిన అలెగ్జాండర్ III అని, అలెగ్జాండర్ ది గ్రేట్ (గ్రీకులో అలెగ్జాండ్రోస్ హో మెగాస్) అనీ పిలుస్తారు. అతను సా.పూ 356 లో పెల్లాలో జన్మించాడు. అతని తండ్రి ఫిలిప్ II మరణం తరువాత, 20 ఏళ్ళ వయస్సులో గద్దె నెక్కాడు. తన పాలనాకాలంలో ఎక్కువ భాగం పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికాల్లో మున్నెన్నడూ ఎరగని సైనిక దండయాత్ర లోనే గడిపాడు. ముప్పై సంవత్సరాల వయస్సు నాటికే, గ్రీస్ నుండి వాయవ్య భారతదేశం వరకు విస్తరించిన, పురాతన ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకదాన్ని సృష్టించాడు.[1][2] అతను యుద్ధంలో అజేయంగా నిలిచాడు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సేనాధిపతుల్లో ఒకరిగా అతన్ని పరిగణిస్తారు. [3]
అలెగ్జాండర్ | |||||
---|---|---|---|---|---|
మాసెడోన్ బాసిలియస్, హెల్లెనిక్ లీగ్ హెజెమోన్, పర్షియా షాహెన్షా, ప్రాచీన ఈజిప్టు ఫారో, ఆసియా ప్రభువు | |||||
మాసెడోన్ రాజు | |||||
పరిపాలన | 336–323 సా.పూ. | ||||
పూర్వాధికారి | ఫిలిప్ II | ||||
ఉత్తరాధికారి |
| ||||
| |||||
Reign | 336 సా.పూ. | ||||
Predecessor | ఫిలిప్ II | ||||
ఈజిప్టు ఫారో | |||||
Reign | 332–323 సా.పూ. | ||||
Predecessor | డారియస్ III | ||||
Successor |
| ||||
King of Persia | |||||
Reign | 330–323 సా.పూ. | ||||
Predecessor | డారియస్ III | ||||
Successor |
| ||||
Lord of Asia | |||||
Reign | 331–323 సా.పూ. | ||||
Predecessor | కొత్త పదవి | ||||
Successor |
| ||||
జననం | సా.పూ. 356 జూలై 20 లేదా 21 పెల్లా, మాసెడోన్, ప్రాచీన గ్రీసు | ||||
మరణం | సా.పూ. 323 జూన్ 10 లేదా 11 (32 ఏళ్ళు) బాబిలోన్, మెసొపొటోమియా | ||||
Spouse |
| ||||
వంశము | అలెగ్జాండర్ IV మాసిడోన్ కు చెందిన హెరాక్లెస్ (చట్టబద్ధ సంతానం కాదని అరోపణలున్నాయి) | ||||
| |||||
గ్రీకు |
| ||||
వంశం | ఆర్గియడ్ | ||||
తండ్రి | మాసెడోన్ కు చెందిన ఫిలిప్ II | ||||
తల్లి | ఒలింపియాస్ | ||||
మతం | గ్రీకు పాలీథీయిజమ్ |
అలెగ్జాండర్ 16 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అరిస్టాటిల్ వద్ద విద్య అభ్యసించాడు. సా.పూ 336 లో ఫిలిప్ హత్య తరువాత, అతను సింహాసనం ఎక్కాడు. బలమైన రాజ్యాన్ని, అనుభవంగల సైన్యాన్నీ వారసత్వంగా పొందాడు. అలెగ్జాండర్‌కు గ్రీస్ సర్వసైన్యాధిపత్యం లభించింది. తన తండ్రి తలపెట్టి, మొదలుపెట్టలేక పోయిన పాన్-హెలెనిక్ ప్రాజెక్టును ప్రారంభించి, పర్షియాను ఆక్రమించడానికి ఈ అధికారాన్ని ఉపయోగించాడు.[4][5] సా.పూ. 334 లో, అతను అకెమెనీడ్ సామ్రాజ్యం (పర్షియన్ సామ్రాజ్యం) పై దాడి చేశాడు. 10 సంవత్సరాల పాటు కొనసాగిన తన దండయాత్రలను మొదలుపెట్టాడు. అనటోలియా ఆక్రమణ తరువాత అలెగ్జాండర్, వరుసబెట్టి చేసిన నిర్ణయాత్మక యుద్ధాల్లో, ముఖ్యంగా ఇస్సస్, గ్వాగమేలా యుద్ధాల్లో పర్షియా నడుం విరగ్గొట్టాడు. తరువాత అతను పర్షియన్ రాజు డారియస్ III ను పడగొట్టి, అకెమెనీడ్ సామ్రాజ్యాన్ని పూర్తిగా జయించాడు. [b] ఆ సమయంలో, అతని సామ్రాజ్యం అడ్రియాటిక్ సముద్రం నుండి బియాస్ నది వరకు విస్తరించింది.
అలెగ్జాండర్ "ప్రపంచపుటంచులను, గొప్ప బయటి సముద్రాన్నీ" చేరుకోవడానికి ప్రయత్నించాడు. సా.పూ. 326 లో భారతదేశంపై దాడి కి ప్రయత్నం చేసి జీలం. హైడాస్పెస్ యుద్ధంలో బారత దేశ పౌరవులపై ఒక ముఖ్యమైన యుద్ధంలో పురుషోత్తముడి చేతిలో చావుదెబ్బలు తిని,ధనానంద్,చంద్రగుప్త మౌర్య పేర్లు వింటేనే బయపడి ఇంటిపై గాలిమళ్ళిన తన సైనికుల డిమాండ్ మేరకు వెనక్కి తిరిగి వస్తూ, సా.పూ. 323 లో బాబిలోన్లో మరణించాడు. అరేబియాపై దండయాత్రతో మొదలుపెట్టి వరసబెట్టి అనేక రాజ్యాలను జయించాలనే ప్రణాళికను అమలు చెయ్యకుండానే, భవిష్యత్తులో తన రాజధానిగా చేసుకుందామనుకున్న నగరంలో మరణించాడు. తరువాత సంవత్సరాల్లో వరుసగా జరిగిన అనేక అంతర్యుద్ధాలతో అతడి సామ్రాజ్యం విచ్ఛిన్నమై పోయింది. దీని ఫలితంగా డియాడోచి అనే పేరున్న అతడి అనుచరగణం వివిధ రాజ్యాలను స్థాపించుకున్నారు.
అలెగ్జాండర్ వారసత్వంగా వచ్చినవాటిలో సాంస్కృతిక వ్యాప్తి ఒకటి. గ్రీకో-బౌద్ధమతం వంటి సమకాలీకరణను కూడా అతని విజయాలు అందించాయి. అతను తన పేరుతో ఒక ఇరవై దాకా నగరాలను స్థాపించాడు. వాటిలో ముఖ్యమైనది ఈజిప్టులోని అలెగ్జాండ్రియా. అలెగ్జాండర్ తాను గెలిచిన ప్రాంతాల్లో గ్రీకు ప్రతినిధులను స్థాపించడం, తద్వారా తూర్పున గ్రీకు సంస్కృతి వ్యాప్తి చెందడం వలన కొత్త హెలెనిస్టిక్ నాగరికత ఏర్పడింది. ఈ చిహ్నాలు సా.శ. 15 వ శతాబ్దం మధ్యలో బైజాంటైన్ సామ్రాజ్య సంప్రదాయాలలో స్పష్టంగా ఉండేవి. 1920 ల్లో గ్రీకులపై మారణహోమం జరిగే వరకూ గ్రీకు మాట్లాడేవారు మధ్య, తూర్పు అనాటోలియాలో ఉండేవారు. అలెగ్జాండర్ అకిలెస్ లాగానే పురాణ పురుషుడయ్యాడు. గ్రీకు, గ్రీకుయేతర సంస్కృతుల చరిత్రలో పౌరాణిక సంప్రదాయాల్లో అలెగ్జాండరు ప్రముఖంగా కనిపిస్తాడు. అతను యుద్ధాల్లో జీవితాంతం అజేయంగా నిలిచాడు. సైనిక నాయకులు తమను తాము పోల్చుకోడానికి అతడొక కొలబద్ద అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలటరీ అకాడమీలు ఇప్పటికీ అతని వ్యూహాలను బోధిస్తున్నాయి. [6] [c] చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకడిగా అలెగ్జాండరు స్థానం పొందాడు.[7]
అలెగ్జాండర్ మాసిడోన్ రాజ్య రాజధాని పెల్లాలో పురాతన గ్రీకు నెల హెకాటోంబాయిన్ లో ఆరవ రోజున జన్మించాడు. ఈ తేదీ బహుశా సా.పూ. 356 జూలై 30 అవుతుంది. అయితే, కచ్చితమైన తేదీ అనిశ్చితంగా ఉంది.[8] అతను మాసిడోన్ రాజు ఫిలిప్ II కు, అతని నాల్గవ భార్య ఒలింపియాస్ కు పుట్టాడు. ఒలింపియాస్, ఎపిరస్ రాజు నియోప్టోలెమస్ I కుమార్తె.[9] ఫిలిప్‌కు ఏడెనిమిది మంది భార్యలు ఉన్నప్పటికీ, ఒలింపియాస్ కొంతకాలం అతనికి మహారాణిగా ఉండేది. బహుశా ఆమె అలెగ్జాండర్‌కు జన్మనిచ్చినందువలన కావచ్చు. [10]
అలెగ్జాండర్ పుట్టుక గురించీ బాల్యం గురించీ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. [11] పురాతన గ్రీకు జీవిత చరిత్ర రచయిత ప్లూటార్క్ ప్రకారం, ఫిలిప్‌తో వివాహ వేడుకలు ముగిసే ముందు రాత్రి ఒలింపియాస్ ఒక కల గంది. ఆ కలలో తన గర్భాన్ని ఒక పిడుగు ఛేదించగా, ఒక మంట వెలువడి చాలాదూరం వ్యాపించి చల్లారిపోయింది. పెళ్ళి తర్వాత కొంతకాలానికి, సింహపు బొమ్మతో ఉన్న ముద్ర తన భార్య గర్భంపై ఉన్నట్లు ఫిలిప్ కలగన్నాడు. ప్లూటార్క్ ఈ కలల గురించి రకరకాల వ్యాఖ్యానాలను అందించాడు: ఒలింపియాస్ తన వివాహానికి ముందే గర్భవతి అని, ఆమె గర్భంపై ఉన్న ముద్ర ద్వారా సూచించబడింది; లేదా అలెగ్జాండర్ తండ్రి గ్రీకు దేవుడు జియస్ అయి ఉండవచ్చు. ఒలింపియాసే అలెగ్జాండర్ యొక్క దైవిక తల్లిదండ్రుల కథను ప్రచారం చేసిందా, ఆమె అలెగ్జాండర్‌తో చెప్పిందా వంటి విషయాలపై ప్రాచీన వ్యాఖ్యాతల్లో భిన్నభిప్రాయాలున్నాయి
అలెగ్జాండర్ జన్మించిన రోజున, ఫిలిప్ చాల్సిడైస్ ద్వీపకల్పంలోని పొటీడియా నగరంపై దాడికి సన్నద్ధమౌతున్నాడు. అదే రోజు, ఫిలిప్ తన సేనాధిపతి పార్మేనియన్, ఇల్లిరియన్ పేయోనియన్ ల సంయుక్త సైన్యాలను ఓడించాడనే వార్త అందుకున్నాడు. అతని గుర్రాలు ఒలింపిక్ క్రీడలలో గెలిచాయనే వార్త కూడా అదే రోజున అతడికి అందింది.ఇదే రోజున, ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటైన ఎఫెసస్ లోని ఆర్టెమిస్ ఆలయాన్ని తగలబెట్టారని కూడా చెబుతారు. ఆర్టెమిస్, అలెగ్జాండర్ పుట్టుకకు హాజరవడానికి వెళ్ళాడని, అందుకే అతడి ఆలయం కాలిపోయిందనీ మెగ్నీషియాకు చెందిన హెగెసియాస్ చెప్పాడు..[12] అలెగ్జాండర్ రాజయ్యాక ఇటువంటి కథలు ఉద్భవించి ఉండవచ్చు. బహుశా అతని ప్రేరణతోనే ఈ కథలు ఉద్భవించి ఉండవచ్చు. అతను మానవాతీతుడనీ, పుట్టుక తోనే గొప్పవాడని చెప్పడం అయి ఉండవచ్చు. [11]
బాల్యంలో అలెగ్జాండర్‌ను లానికే ఆనే ఒక ఆయా పెంచింది. భవిష్యత్తులో అతడి దళపతి అయ్యే క్లైటస్ ది బ్లాక్ కు సోదరి ఆమె. తరువాత అతని బాల్యంలో, అలెగ్జాండర్‌ను అతని తల్లి బంధువు లియోనిడాస్, అకర్నానియాకు చెందిన లైసిమాకస్ లు చదువు చెప్పారు. [13] అలెగ్జాండర్ గొప్ప మాసిడోనియన్ యువకుల పద్ధతిలో పెరిగాడు. చదవడం, లైర్ వాయిద్యాన్ని వాయించడం గుర్రపు స్వారీ, పోరాటం, వేటాడటం నేర్చుకున్నాడు. [14]
అలెగ్జాండర్‌కు పదేళ్ల వయసు ఉన్నప్పుడు, థెస్సాలీకి చెందిన ఒక వ్యాపారి ఫిలిప్ వద్దకు ఒక గుర్రాన్ని తీసుకువచ్చాడు, పదమూడు టాలెంట్లకు అమ్ముతానన్నాడు. గుర్రం ఎక్కబోతే, అది ఎదురు తిరిగింది, ఎక్కనివ్వలేదు. ఫిలిప్ అక్కర్లేదు తీసుకుపొమ్మన్నాడు. అయితే, ఆ గుర్రం దాని స్వంత నీడను చూసి భయపడుతోందని గమనించిన అలెగ్జాండర్, తాను ఆ గుర్రాన్ని మచ్చిక చేసుకుంటానని అన్నాడు. చివరికి చేసుకున్నాడు. [11] ప్లూటార్క్ దాని గురించి ఇలా అన్నాడు: ఫిలిప్, తన కొడుకు ప్రదర్శించిన ధైర్యాన్ని, పట్టుదలనూ చూసి ఆనందం పట్టలేకపోయాడు, నీళ్ళు నిండిన కళ్ళతో కొడుకును ముద్దాడి, "బాబూ, నీ ఆశయాలకు సరిపడేంత పెద్ద సామ్రాజ్యాన్ని నువ్వు స్థాపించాలి. నీ స్థాయికి మాసిడోన్ చాలా చిన్నది " అన్నాడు. అతని కోసం ఆ గుర్రాన్ని కొన్నాడు.
అలెగ్జాండర్ ఆ గుర్రానికి బుసెఫాలస్ అని పేరు పెట్టాడు, దీని అర్థం "ఎద్దు-తల". బుసెఫాలస్ అలెగ్జాండర్‌ను భారతదేశం దాకా తీసుకెళ్ళింది. అక్కడ అది చనిపోయినప్పుడు (వృద్ధాప్యం కారణంగా, ప్లూటార్క్ ప్రకారం, ముప్పై ఏళ్ళ వయసులో), అలెగ్జాండర్ దాని పేరు మీద ఒక నగరానికి బుసెఫాలా అని పేరు పెట్టాడు.[15]
అలెగ్జాండర్‌కు 13 ఏళ్ళ వయసులో, ఫిలిప్ ఒక గురువు కోసం వెతకడం ప్రారంభించాడు. ఐసోక్రటీస్, స్పూసిప్పస్ వంటి విద్యావేత్తలను పరిగణించాడు. స్పూసిప్పస్ ఈ పదవిని చేపట్టడానికి, అకాడమీలో తన స్టీవార్డ్ షిప్ పదవికి రాజీనామా చేయటానికి ముందుకొచ్చాడు. చివరికి ఫిలిప్, అరిస్టాటిల్ ను ఎన్నుకున్నాడు. మీజా వద్ద ఉన్న వనదేవతల ఆలయాన్ని తరగతి గదిగా ఇచ్చాడు. అలెగ్జాండర్‌కు బోధించినందుకు ప్రతిఫలంగా, గతంలో ఫిలిప్ ధ్వంసం చేసిన అరిస్టాటిల్ స్వస్థలం స్టేజీరాను పునర్నిర్మించడానికీ, బానిసలుగా పడిఉన్న పట్టణ పౌరులను కొనుగోలు చేసి విడిపించి, బహిష్కరణకు గురైనవారికి క్షమాభిక్ష పెట్టి వెనక్కి రప్పించి తిరిగి వారందరినీ తమ పట్టణంలో ఆవాసం కల్పించడానికీ ఫిలిప్ అంగీకరించాడు.[16]
అలెగ్జాండరుకు, టోలమీ, హెఫిస్టియోన్, కాసాండర్ వంటి మాసిడోనియన్ ప్రభువుల పిల్లలకూ మీజా ఒక బోర్డింగ్ పాఠశాల లాంటిది. ఈ విద్యార్థులలో చాలామంది అతని స్నేహితులు, భవిష్యత్తులో సేనాధిపతులూ అవుతారు. అరిస్టాటిల్ వారందరికీ చికిత్స, తత్వశాస్త్రం, నీతులు, మతం, తర్కం, కళ బోధించాడు. అరిస్టాటిల్ శిక్షణలో, అలెగ్జాండర్ హోమర్ రచనలపై, ముఖ్యంగా ఇలియడ్ పట్ల అభిరుచిని పెంచుకున్నాడు. అరిస్టాటిల్ అతనికి తాను ఉల్లేఖించిన కాపీని ఇచ్చాడు. దాన్ని అలెగ్జాండర్ తన దండయాత్రల్లో తీసుకెళ్ళాడు.[17]
తన యవ్వనంలో, అలెగ్జాండరుకు మాసిడోనియన్ దర్బారులో పర్షియన్ ప్రవాసులతో పరిచయం ఉండేది. వాళ్ళు ఆర్టాక్సెర్క్సెస్ III ని వ్యతిరేకించినందున ఫిలిప్ II వాళ్ళకు రక్షణ కల్పించాడు.[18][19][20] వాళ్లలో ఆర్టాబాజోస్ II, అతని కుమార్తె బార్సీన్ ఉన్నారు. 352 నుండి 342 వరకు మాసిడోనియన్ దర్బారులో నివసించిన బార్సీన్, తరువాతి కాలంలో అలెగ్జాండర్‌కు ఉంపుడుగత్తె అయింది. అలాగే భవిష్యత్తులో అలెగ్జాండర్‌కు సామంతుడయ్యే అమ్మినాపెస్, సిసినెస్ అనే పర్షియన్ ధనికుడూ వీళ్ళలో కొందరు.[18][21][22][23] వీళ్ళ ద్వారా మాసిడోనియన్ దర్బారుకు పర్షియన్ విషయాలకు సంబంధించిన విశేషాలు తెలిసాయి. మాసిడోనియన్ పాలనలో కొన్ని కొత్త అంశాలను ప్రవేశపెట్టడానికి ఇది దోహదపడి ఉండవచ్చు.[21]
లాంప్సాకస్ యొక్క అనాక్సిమెనెస్ కూడా అలెగ్జాండర్ ఉపాధ్యాయులలో ఒకరని సూడా వ్రాశాడు. అనాక్సిమెనెస్, అలెగ్జాండరు దండయాత్రలో కూడా అతని వెంట ఉన్నాడు.[24]
16 సంవత్సరాల వయస్సులో, అరిస్టాటిల్ ఆధ్వర్యంలో అలెగ్జాండర్ విద్య ముగిసింది. ఫిలిప్ బైజాన్టియన్ [నోట్స్ 2] పై యుద్ధానికి వెళ్తూ, అలెగ్జాండర్‌ను రాజప్రతినిధిగా నియమించి, అతడే తన వారసుడని స్పష్టంగా చూపించాడు. [11] ఫిలిప్ లేనప్పుడు, థ్రాసియన్ మేడీ మాసిడోనియాపై తిరుగుబాటు చేశాడు. అలెగ్జాండర్ త్వరగా స్పందించి, వారిని వారి భూభాగం నుండి తరిమివేసాడు. ఆ రాజ్యాన్ని గ్రీకుల సామంతరాజ్యంగా చేసుకున్నాడు. అలెగ్జాండ్రోపోలిస్ అనే నగరాన్ని స్థాపించాడు.[25]
ఫిలిప్ తిరిగి వచ్చిన తరువాత, అతను దక్షిణ థ్రేస్లో తిరుగుబాట్లను అణచివేయడానికి అలెగ్జాండర్‌ను ఒక చిన్నపాటి సైన్యంతో పంపించాడు. గ్రీకు నగరమైన పెరింథస్కు వ్యతిరేకంగా దాడి చేస్తున్న అలెగ్జాండర్ తన తండ్రి ప్రాణాలను కాపాడినట్లు సమాచారం. ఇంతలో, అంఫిస్సా నగరం డెల్ఫీకి సమీపంలో అపోలోకు చెందిన పవిత్రమైన భూములను ఆక్రమించడం ప్రారంభించింది. దీంతో ఫిలిప్‌కు, గ్రీకు వ్యవహారాల్లో మరింత జోక్యం చేసుకునే అవకాశం కలిగింది. థ్రేస్లోనే ఇంకా తలమునకలుగా ఉన్నఫిలిప్, సైన్యాన్ని సమీకరించుకుని దక్షిణ గ్రీస్‌పై దాడి చెయ్యమని అలెగ్జాండర్‌ను ఆదేశించాడు. ఇతర గ్రీకు రాజ్యాలు జోక్యం చేసుకోవచ్చనే ఆందోళనతో అలెగ్జాండర్, తాను దాడి చెయ్యబోతున్నది ఇల్లైరియాపై అన్నట్లుగా కనిపించాడు. ఈ గందరగోళ సమయంలో, ఇల్లీరియన్లు మాసిడోనియాపై దాడి చేశారు. అయితే వాళ్ళను అలెగ్జాండర్ తిప్పికొట్టాడు. [26]
సా.పూ. 338 లో ఫిలిప్, ససైన్యంగా కొడుకుతో కలిసాడు. వారు థర్మోపైలే ద్వారా దక్షిణానికి కదిలారు. దాని థెబాన్ దండును ఓడించి, థర్మోపైలేను గెలుచుకున్నారు. ఆ తరువాత వారు, ఏథెన్స్, థెబెస్ నగరాలకు కొద్ది రోజుల దూరంలోనే ఉన్న ఎలాటియా నగరాన్ని ఆక్రమించుకున్నారు. డెమోస్థనీస్ నేతృత్వంలోని ఎథీనియన్లు మాసిడోనియాకు వ్యతిరేకంగా థెబెస్‌తో పొత్తు పెట్టుకోవాలని ఓటు వేశారు. ఏథెన్స్, ఫిలిప్ లు ఇద్దరూ థెబెస్‌తో పొత్తు కోసం రాయబారాలు పంపారు. కాని ఏథెన్స్ ఈ పోటీలో నెగ్గింది.[27] ఫిలిప్ అంఫిస్సా పైకి దండెత్తి, డెమోస్థనీస్ పంపిన కిరాయి సైనికులను బంధించాడు. నగరం లొంగిపోయింది. ఆ తరువాత ఫిలిప్ ఎలేటియాకు తిరిగి వచ్చాడు. ఏథెన్స్, థెబెస్ లకు శాంతి కోసం తుది ప్రతిపాదనను పంపాడు. ఇద్దరూ దానిని తిరస్కరించారు.[28]
ఫిలిప్ దక్షిణ దిశగా వెళుతుండగా, అతని ప్రత్యర్థులు బోయోటియాలోని చైరోనియా సమీపంలో అతనిని అడ్డుకున్నారు. అప్పుడు జరిగిన చైరోనియా యుద్ధంలో, ఫిలిప్ కుడి పార్శ్వం లోను, అలెగ్జాండర్ కొందరు సేనాధిపతులతో కలిసి ఎడమ పార్శ్వం లోనూ శత్రువుతో తలపడ్డారు. ప్రాచీన వర్గాల సమాచారం ప్రకారం, ఇరువర్గాలు కొంతసేపు తీవ్రంగా పోరాడాయి. ఫిలిప్ ఉద్దేశపూర్వకంగా తన సైనికులను వెనక్కి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఎథీనియన్ హాప్లైట్లు వాళ్ళను వెంబడిస్తారని అతడు ఆశించాడు. అలాగే జరిగింది. ఆ విధంగా అతడు శత్రు పంక్తిని విచ్ఛిన్నం చేశాడు. థేబన్ పంక్తులను మొదట విచ్ఛిన్నం చేసింది అలెగ్జాండర్, ఆ తరువాత సేనాధిపతులు. శత్రువుల కలసికట్టును దెబ్బతీసిన ఫిలిప్ తన దళాలను ముందుకు దూకించి, శత్రు సైన్యాన్ని నాశనం చేసాడు. ఎథీనియన్లు ఓడిపోవడంతో, థేబన్లను చుట్టుముట్టారు. ఒంటరిగా పోరాడాల్సి వచ్చేసరికి, వారూ ఓడిపోయారు.
చైరోనియాలో విజయం తరువాత, ఫిలిప్, అలెగ్జాండర్ లు ఏ ప్రతిఘటన లేకుండా పెలోపొన్నీస్ లోకి ప్రవేశించారు. నగరాలన్నీ వారిని స్వాగతించాయి; అయితే, వారు స్పార్టాకు చేరుకున్నప్పుడు, వారికి వ్యతిరేకత ఎదురైంది, కాని వారితో యుద్ధం చెయ్యలేదు.[29] కొరింథ్‌లో, ఫిలిప్ "హెలెనిక్ అలయన్స్"ను స్థాపించాడు, ఇందులో స్పార్టా మినహా చాలా గ్రీకు నగర-రాజ్యాలు ఉన్నాయి. ఫిలిప్ ఈ లీగ్ యొక్క హెజెమోన్ ("సర్వ సైన్యాధ్యక్షుడు" అని అనువాదం) అయ్యాడు. (ఆధునిక పండితులు దీన్ని లీగ్ ఆఫ్ కోరింత్ అని పిలుస్తారు.) పర్షియన్ సామ్రాజ్యంపై దాడి చేసే తన ప్రణాళికలను ప్రకటించాడు. [30] [31]
ఫిలిప్ పెల్లాకు తిరిగి వచ్చాక, అతను క్లియోపాత్రా యూరిడైస్ ప్రేమలో పడి సా.పూ. 338 లో ఆమెను పెళ్ళి చేసుకున్నాడు,[32] ఆమె అతని సేనాధిపతి అటాలస్‌కు మేనకోడలు. [33] ఈ పెళ్ళితో, అలెగ్జాండర్‌కు తాను వారసుడౌతాననే విషయంలో కొంత అభద్రతా భావం ఏర్పడింది. ఎందుకంటే క్లియోపాత్రా యూరిడైస్‌కు కుమారుడు పుడితే, అతడు సంపూర్ణ మాసిడోనియన్ వారసుడౌతాడు, అలెగ్జాండర్ సగం మాసిడోనియన్ మాత్రమే. [34] పైగా, వివాహ విందులో, తాగిన మత్తులో అటాలస్, ఈ పెళ్ళితో చట్టబద్ధమైన వారసుడు పుట్టేలా చెయ్యమని బహిరంగంగానే దేవతలను ప్రార్థించాడు. [33]
337 సా.పూలో అలెగ్జాండర్, తన తల్లితో కలిసి మాసిడోన్‌ను వదలిపెట్టి పారిపోయాడు. ఆమెను డొడోనాలో ఆమె సోదరుడు ఎపిరస్కు చెందిన అలెగ్జాండర్ I వద్ద వదలి, [35] తాను ఇల్లైరియాకు వెళ్ళాడు [35] అక్కడ అతను బహుశా గ్లాకియాస్ వద్ద ఆశ్రయం పొంది ఉండవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధంలో అలెగ్జాండర్ వారిని ఓడించినప్పటికీ, వారు అతన్ని అతిథిగా పరిగణించారు.[36] అయితే, ఫిలిప్ రాజకీయ, సైనిక శిక్షణ పొందిన తన కొడుకును నిరాకరించాలని ఎప్పుడూ అనుకోలేదు. [35] దాంతో, వారి కుటుంబ స్నేహితుడు డెమారటస్ మధ్యవర్తిత్వ ప్రయత్నాల కారణంగా అలెగ్జాండర్ ఆరు నెలల తరువాత మాసిడోన్‌కు తిరిగి వచ్చాడు.[37]
తరువాతి సంవత్సరంలో, కారియా లోని పర్షియన్ సామంతుడు, పిక్సోడారస్, తన పెద్ద కుమార్తెను అలెగ్జాండర్ యొక్క సవతి సోదరుడు ఫిలిప్ అర్హిడియస్‌కు ఇచ్చాడు. [35] అర్హిడియస్‌ను తన వారసునిగా చేసుకోవటానికి ఫిలిప్ ఉద్దేశించినట్లు ఉన్నాడని ఒలింపియాస్, అలెగ్జాండర్ స్నేహితులు చాలా మంది అన్నారు. [35] తన కుమార్తెను చట్టవిరుద్ధమైన కొడుకుకు ఇవ్వకూడదనీ, అలెగ్జాండర్‌కు ఇవ్వమనీ పిక్సోడారస్‌కు చెప్పడానికి అలెగ్జాండర్, కోరింథ్కు చెందిన థెస్సాలస్ అనే నటుడిని పంపించాడు. ఈ విషయం విన్న ఫిలిప్, చర్చలను ఆపించాడు. కారియన్ కుమార్తెను వివాహం చేసుకోవాలనుకున్నందుకు అలెగ్జాండర్‌ను తిట్టాడు. అతనికి మరింత మంచి వధువును తేవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. [35] ఫిలిప్ అలెగ్జాండర్ స్నేహితులు, నలుగురిని - హర్పాలస్, నియార్కస్, టోలెమీ, ఎరిజీయస్ - లను దేశం నుండి బహిష్కరించాడు. కోరింథీయుల చేత థెస్సాలస్‌ను గొలుసులతో బంధించి తెప్పించాడు.[38]
సా.పూ 326 వేసవిలో ఫిలిప్, ఒలింపియాస్ సోదరుడైన ఎపిరస్కు చెందిన అలెగ్జాండర్ I తో తన కుమార్తె క్లియోపాత్రా వివాహం జరిపిస్తూండగా, అతని అంగరక్షకుల నాయకుడు కెప్టెన్ పౌసానియాస్ ఫిలిప్‌ను హత్య చేశాడు. [e] పౌసానియాస్ తప్పించుకోవడానికి ప్రయత్నించగా వెంబడించినవారు అతణ్ణి పట్టుకుని చంపారు. వీరిలో అలెగ్జాండర్ సహచరులు ఇద్దరు - పెర్డిక్కాస్, లియోనాటస్ లు కూడా ఉన్నారు. అలెగ్జాండర్‌ను 20 సంవత్సరాల వయస్సులో ప్రభువులు, సైన్యమూ అక్కడికక్కడే రాజుగా ప్రకటించారు. [40] [41][42]
ఆసియాకు వెళ్ళే ముందు, అలెగ్జాండర్ తన ఉత్తర సరిహద్దులను కాపాడుకోవా లనుకున్నాడు. సా.పూ 335 వసంతకాలంలో అతను అనేక తిరుగుబాట్లను అణిచివేసాడు. యాంఫిపోలిస్‌తో మొదలుపెట్టి, తూర్పున "ఇండిపెండెంట్ థ్రేసియన్స్" దేశంలోకి వెళ్ళాడు; హేమస్ పర్వతం వద్ద, మాసిడోనియన్ సైన్యం థ్రేసియన్ దళాలపై దాడి చేసి ఓడించింది. మాసిడోనియన్లు ట్రిబాల్లి రాజ్యం లోకి ప్రవేశించి, వారి సైన్యాన్ని లిగినస్ నది [43] ( డాన్యూబ్ కు ఉపనది ) సమీపంలో ఓడించారు. అలెగ్జాండర్ మూడు రోజుల పాటు ప్రయాణించి డాన్యూబ్ ఒడ్డుకు చేరుకున్నాడు. నదికి అవతలి ఒడ్డున గెటే తెగ మోహరించి ఉంది. రాత్రికి రాత్రి నదిని దాటి, వారిపై దాడి చేసాడు. అశ్వికదళంతో చేసిన యుద్ధం తరువాత శత్రు సైన్యం పారిపోయింది.[44]
ఇల్లైరియా రాజు క్లేటస్, టౌలాంటీకి చెందిన గ్లౌకియాస్ తన అధికారానికి వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేసారన్న వార్త అలెగ్జాండరుకు చేరింది. పడమర వైపు తిరిగి ఇల్లైరియా వెళ్ళి, అలెగ్జాండర్ ఆ ఇద్దరినీ ఓడించాడు. ఇద్దరూ తమ దళాలతో పారిపోవాల్సి వచ్చింది. ఈ విజయాలతో, అతను తన ఉత్తర సరిహద్దును భద్రపరచుకున్నాడు.[45]
అలెగ్జాండర్ ఉత్తరాన దండయాత్రలో ఉండగా, థేబన్లు, ఎథీనియన్లు మరోసారి తిరుగుబాటు చేశారు. అలెగ్జాండర్ వెంటనే దక్షిణ దిశగా వెళ్లాడు. [46] ఇతర నగరాలు మళ్ళీ సంశయించగా, థెబెస్ పోరాడాలని నిర్ణయించుకున్నారు. థెబెస్ ప్రతిఘటన గొప్పదేమీ కాదు. అలెగ్జాండర్ ఆ నగరాన్ని ధ్వంసం చేశాడు. దాని భూభాగాన్ని ఇతర బోటియన్ నగరాలకు పంచేసాడు. థెబెస్ ముగింపు ఏథెన్స్ను భయపెట్టి, గ్రీస్ మొత్తాన్నీ తాత్కాలికంగా శాంతింపజేసింది. [46] అలెగ్జాండర్ యాంటిపేటర్‌ను రాజప్రతినిధిగా ఉంచి, తన ఆసియా దండయాత్రకు బయలుదేరాడు, .[47]
పురాతన రచయితల ప్రకారం, డెమోస్థనీస్ అలెగ్జాండరును "మార్గిటెస్" అనీ,[48][49][50] పిల్లాడనీ అన్నాడు.[50] అవివేకినీ, పనికిరాని వాడినీ గ్రీకులు మార్గిటెస్ అనేవారు .[49][51]
సా.పూ. 336 నాటికే, ఫిలిప్ II, పర్మేనియన్‌కు అమింటాస్, ఆండ్రోమెనెస్, అట్టాలస్ లను తోడిచ్చి, 10,000 మంది సైన్యంతో అనటోలియాకు పంపి ఉన్నాడు. అనటోలియా పశ్చిమ తీరంలోను, దీవులలోనూ నివసిస్తున్న గ్రీకులను ఆకెమినీడ్ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు ముట్టడికి సన్నాహాలు చేయడానికి వాళ్ళను పంపించాడు.[52][53] మొదట్లో అన్నీ బాగానే సాగాయి. పశ్చిమ తీరంలో ఉన్న గ్రీకు నగరాలు అనటోలియాపై తిరుగుబాటు చేశాయి. కానీ, ఫిలిప్‌ను హత్య చేసారని, అతని తరువాత అతని చిన్న కుమారుడు అలెగ్జాండర్ రాజ్యాన్ని చేపట్టాడనీ వాళ్ళకు వార్తలు అందాయి. ఫిలిప్ మరణంతో మాసిడోనియన్లు నిరాశకు గురయ్యారు. మెగ్నీషియా సమీపంలో అకెమినీడ్ల కిరాయి సైనికుడు రోడెస్ కు చెందిన మమ్నోన్ ఆధ్వర్యంలో ఉన్న సైన్యం చేతిలో ఓడిపోయారు.[52][53]
ఫిలిప్ II తలపెట్టిన ఆక్రమణ ప్రాజెక్టును అలెగ్జాండర్ చేపట్టాడు. మాసెడోన్ నుండి, వివిధ గ్రీకు నగర-రాజ్యాల సైన్యాన్ని, కిరాయి సైనికులను, థ్రేస్, పైనోయియా, ఇల్లైరియాల లోని ఫ్యూడల్ సైన్యాన్నీ సమీకరించాడు.[54] [f] సుమారు 48,100 సైనికులతో, 6,100 అశ్వికదళంతో, 38,000 మంది నావిక సైన్యంతో 120 ఓడలతో [46] కూడుకున్న అలెగ్జాండర్ సైన్యం సా.పూ 334 లో హెలెస్పాంట్ దాటింది. ఆసియా మట్టిలోకి ఈటెను విసిరి, ఆసియాను దేవతల బహుమతిగా అంగీకరించానని అలెగ్జాండర్ చెప్పాడు. అలా చెప్పడం ద్వారా పర్షియన్ సామ్రాజ్యాన్ని పూర్తిగా జయించాలనే తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. దౌత్యానికి తన తండ్రి ఇచ్చిన ప్రాధాన్యతకు విరుద్ధంగా, అలెగ్జాండర్, పోరాడటానికే ఉత్సుకత చూపించాడు. [46]
గ్రానికస్ యుద్ధంలో పర్షియన్ దళాలపై సాధించిన తొలి విజయం తరువాత, అలెగ్జాండర్ పర్షియన్ ప్రాదేశిక రాజధాని, సర్దిస్ ఖజానా లొంగిపోవడాన్ని అంగీకరించాడు; తరువాత అతను అయోనియన్ తీరం వెంబడి ఉన్న నగరాలకు స్వయంప్రతిపత్తిని, ప్రజాస్వామ్యాన్నీ మంజూరు చేశాడు. అకెమినీడ్ దళాల స్వాధీనంలో ఉన్న మిలేటస్‌కు సమీపంలో పర్షియన్ నావికా దళాలు ఉండడంతో, కడు జాగ్రత్తగా దాని ముట్టడిని పూర్తిచేసాడు. మరింత దక్షిణంలో, కార్నియా లోని హాలికార్నస్సస్ వద్ద అలెగ్జాండర్ తన మొదటి భారీ ముట్టడిని చేపట్టాడు. ప్రత్యర్థులైన కిరాయి సైనిక నాయకుడు రోడెస్ కు చెందిన మెమ్నోన్, కారియాలోని పర్షియన్ సామంత రాజు ఒరోంటోబాటెస్ లు అలెగ్జాండర్ చేతిలో ఓడిపోయి, ఓడల్లో పారిపోయారు.[55] కారియా ప్రభుత్వాన్ని హెకాటోమ్నిడ్ రాజవంశస్థుడు అడాకు అప్పగించాడు. అతను అలెగ్జాండర్‌కు సామంతుడయ్యాడు.[56]
హాలికర్నాసస్ నుండి, అలెగ్జాండర్ పర్వత ప్రాంతమైన లైసియా లోకి, పాంఫిలియన్ మైదానంలోకీ వెళ్ళాడు. అన్ని తీర నగరాలను స్వాధీనపరచుకున్నాడు. దీంతో పర్షియన్లకు నావికా స్థావరాలు లేకుండా పోయాయి. పాంఫిలియా తరువాత ఇక పెద్ద ఓడరేవులేమీ లేవు. దాంతో అలెగ్జాండర్ ఇక లోతట్టు ప్రాంతం వైపు తిరిగాడు. టెర్మెస్సోస్ వద్ద, అలెగ్జాండర్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కాని ఆ నగరాన్ని ముట్టడించలేదు.[57] పురాతన ఫ్రిజియన్ రాజధాని గోర్డియన్ వద్ద, అప్పటివరకు విప్పలేని గోర్డియన్ ముడిని "విప్పేసాడు". ఈ ఘనత సాధించగలిగేది, భవిష్యత్ " ఆసియా రాజు" మాత్రమే ననే ప్రతీతి ఉండేది.[58] ఆ ముడి విప్పిన కథనం ఒకటి ఇలా ఉంది: ముడిని ఎలా విప్పదీసామనేది పట్టించుకోవాల్సిన సంగతి కాదని చెబుతూ అలెగ్జాండర్, కత్తితో దాన్ని నరికేసాడు.[59]
సా.పూ. 333 వసంతకాలంలో, అలెగ్జాండర్ టారస్ ను దాటి సిలీసియాలోకి ప్రవేశించాడు. అనారోగ్యం కారణంగా చాన్నాళ్ళ పాటు విరామం తీసుకుని ఆ తరువాత సిరియా వైపు వెళ్ళాడు. డారియస్ కున్న పెద్ద సైన్యం అలెగ్జాండరును మించినప్పటికీ, అతను తిరిగి సిలిసియాకు వెళ్ళాడు. అక్కడ అతను ఇస్సస్ వద్ద డారియస్‌ను ఓడించాడు. డారియస్, భార్యనూ ఇద్దరు కుమార్తెలనూ తల్లి సిసిగాంబిస్‌నూ, అద్భుతమైన సంపదనూ విడిచిపెట్టి యుద్ధం నుండి పారిపోయాడు. అతని సైన్యం కూలిపోయింది.[60] తాను అప్పటికే పోగొట్టుకున్న భూములను, తన కుటుంబాన్ని వదిలేసేందుకు 10,000 టాలెంట్ల సొమ్ము ఇచ్చేలా డారియస్ ఒక శాంతి ప్రతిపాదన పంపాడు. అలెగ్జాండర్, తానిపుడు ఆసియా రాజు కాబట్టి, ప్రాదేశిక విభజనలు, సరిహద్దులను నిర్ణయించాల్సింది తానేనని అలెగ్జాండర్ బదులిచ్చాడు.[61] అలెగ్జాండర్ సిరియాను, లెవాంట్ తీరంలో ఎక్కువ భాగాన్నీ స్వాధీనం చేసుకున్నాడు.[56] తరువాతి సంవత్సరం, సా.పూ 332 లో, అతను టైర్‌పై దాడి చేయవలసి వచ్చింది. చాలా కష్టపడి, సుదీర్ఘమైన ముట్టడి తరువాత దాన్ని స్వాధీనపరచు కున్నాడు.[62][63] సైనిక వయస్సు గల పురుషులను ఊచకోత కోసాడు. స్త్రీలు, పిల్లలను బానిసలుగా అమ్మేసాడు.[64]
అలెగ్జాండర్ టైర్‌ను నాశనం చేసినప్పుడు, ఈజిప్ట్ దారిలో ఉన్న చాలా పట్టణాలు త్వరత్వరగా లొంగిపోయాయి. అయితే, గాజాలో అతడు గట్టి ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. ఈ దుర్గాన్ని భారీ గోడలతో గుట్టపై కట్టారు. దాన్ని గెలవాలంటే ముట్టడి అవసరం. "ఎత్తాటి దిబ్బ కారణంగా అది అసాధ్యమని అతని ఇంజనీర్లు ఎత్తి చూపినప్పుడు ...అది అలెగ్జాండర్‌ను మరింతగా ప్రోత్సహించింది".[65] మూడు విఫల ప్రయత్నాల తరువాత, కోట అలెగ్జాండరు వశమైంది, కాని అలెగ్జాండర్‌కు భుజంపై తీవ్రమైన గాయమైంది. టైర్లో లాగానే, సైనిక వయస్సు గల పురుషులను కత్తికి బలిపెట్టారు. స్త్రీలు, పిల్లలను బానిసలుగా అమ్మేసారు.[66]
తరువాత, అలెగ్జాండర్ సా.పూ 332 లో ఈజిప్టుపైకి వెళ్ళాడు. అక్కడ అతన్ని ముక్తిప్రదాతగా కీర్తించారు.[67] లిబియా ఎడారిలోని ఒరాకిల్ ఆఫ్ సివా ఒయాసిస్ వద్ద ఉండే అమున్ దేవత కుమారుడిగా అతన్ని ప్రకటించారు. [68] ఆ తరువాత, జియస్-అమ్మోన్‌ను తన నిజమైన తండ్రి అని చెప్పేవాడు. అతని మరణం తరువాత, నాణేలపై అతని దైవత్వానికి చిహ్నంగా అతని బొమ్మను అమ్మోన్ కొమ్ములతో అలంకరించేవారు.[69] ఈజిప్టులో ఉన్న సమయంలో, అతను అలెగ్జాండ్రియా నగరాన్ని స్థాపించాడు. ఇది, అతని మరణం తరువాత టోలెమిక్ రాజ్యానికి సుసంపన్న రాజధాని అయింది.[70]
సా.పూ 331 లో ఈజిప్టును వదలి అలెగ్జాండర్, తూర్పు వైపు మెసొపొటేమియా (అప్పుడు అస్సీరియా, ఇప్పుడు ఉత్తర ఇరాక్ ) లోకి వెళ్ళాడు. గౌగమెలా యుద్ధంలో డారియస్‌ను ఓడించాడు.[71] డారియస్ మళ్ళీ యుద్ధభూమి నుండి పారిపోయాడు. అలెగ్జాండర్ అతన్ని అర్బెలా వరకు వెంబడించాడు. గౌగమెలా ఇద్దరి మధ్య జరిగిన యుద్ధాల్లో చివరిదీ, నిర్ణయాత్మకమైనదీను. డారియస్, పర్వతాల మీదుగా ఎక్బాటానా (ఆధునిక హమదాన్ ) కు పారిపోగా, అలెగ్జాండర్ బాబిలోన్‌ను స్వాధీనం చేసుకున్నాడు.
బాబిలోన్ నుండి, అలెగ్జాండర్ అకెమినీడ్ రాజధానులలో ఒకటైన సూసా వెళ్లి దాని ఖజానాను స్వాధీనం చేసుకున్నాడు. అతను తన సైన్యంలో ఎక్కువ భాగాన్ని పర్షియన్ రాయల్ రోడ్ ద్వారా పర్షియన్ రాజధాని పెర్సెపోలిస్‌కు పంపించాడు. ఎంపిక చేసిన దళాలను తీసుకుని, తానే స్వయంగా సూటి మార్గంలో నగరానికి వెళ్ళాడు. పర్షియన్ గేట్స్ (ఆధునిక జాగ్రోస్ పర్వతాలలో) వద్ద కనుమను ముట్టడించాడు. అక్కడ కాపలాగా ఉన్న అరియోబార్జనేస్ నేతృత్వం లోని పర్షియన్ సైన్యాన్నిఓడించడు. పర్షియన్ సైనికులు పెర్సెపోలిస్ ఖజానాను దోచుకునే లోపే అక్కడికి చేరుకోవాలని, హడావుడిగా పెర్సెపోలిస్‌కు వెళ్ళాడు.[72]
పెర్సెపోలిస్‌లోకి ప్రవేశించాక, అలెగ్జాండర్ తన దళాలను చాలా రోజుల పాటు నగరాన్ని దోచుకోవడానికి అనుమతించాడు.[73] అలెగ్జాండర్ ఐదు నెలలు పెర్సెపోలిస్లో ఉన్నాడు. [74] అతడు అక్కడ ఉండగా, జెర్క్సెస్ I యొక్క తూర్పు రాజభవనంలో మంటలు చెలరేగి, నగరమంతా వ్యాపించాయి. తాగిన మత్తులో జరిగిన ప్రమాదం కావచ్చు. లేదా రెండవ పర్షియన్ యుద్ధంలో జెర్క్సేస్ ఏథెన్స్ లోని అక్రోపోలిస్ను తగలబెట్టిన దానికి ప్రతీకారంగా తగలబెట్టి ఉండవచ్చు; [75] అలెగ్జాండర్ సహచరుడు, హెటెరా థాయిస్, రెచ్చగొట్టి, మంటలను అంటింపజేసాడని ప్లూటార్క్, డయోడోరస్ లు అన్నారు. నగరం కాలిపోవడాన్ని చూస్తూ, అలెగ్జాండర్ తన నిర్ణయానికి చింతించాడు.[76][77][78] మంటలను ఆర్పమని తన మనుష్యులను ఆదేశించాడని ప్లూటార్క్ పేర్కొన్నాడు.[76] కాని అప్పటికే మంటలు నగరంలోని చాలా ప్రాంతాలకు వ్యాపించాయి.[76] మరుసటి ఉదయం వరకు అలెగ్జాండర్ తన నిర్ణయం పట్ల చింతించలేదని కర్టియస్ పేర్కొన్నాడు.[76] ప్లూటార్క్ ఒక వృత్తాంతాన్ని వివరించాడు - అలెగ్జాండర్ కూలిపోయిన జెర్క్సేస్ విగ్రహం వద్ద ఆగి, ఏదో బతికి ఉన్న వ్యక్తితో మాట్లాడినట్లుగా మాట్లాడతాడు:
గ్రీసుపై నువ్వు చేసిన దండయాత్రలకు గాను నిన్నిలాగే వదిలేసి వెళ్ళిపోయేదా, లేక.., నీ ఔదార్యానికి, నీ ఇతర గుణాలకు గాను నిన్ను తిరిగి ప్రతిష్ఠించేదా?[79]
అలెగ్జాండర్ డారియస్‌ను వెంబడించాడు. మొదట మీడియాలోకి, తరువాత పార్థియా లోకీ అతణ్ణి తరిమాడు. [81] పర్షియన్ రాజు విధి ఇకపై అతడి చేతుల్లో లేదు. బాక్ట్రియాలో డారియస్కు సామంతుడు, బంధువూ అయిన బెస్సస్ అతణ్ణి బంధించాడు. [82] అలెగ్జాండరు వచ్చేలోపే, బెస్సస్ డారియస్‌ను పొడిచి చంపేసి, తనను తాను అర్టాజెర్క్సెస్ V పేరుతో డారియస్కు వారసుడిగా ప్రకటించుకున్నాడు. ఆపై మధ్య ఆసియా లోకి పారిపోయి, అలెగ్జాండరుపై గెరిల్లా యుద్ధాలకు దిగాడు. [83] అలెగ్జాండర్ డారియస్ భౌతిక కాయానికి అతడి అకెమినీడ్ పూర్వీకుల పక్కనే రాచమర్యాదలతో ఖననం చేసాడు. [84] చనిపోతున్నప్పుడు, డారియస్ తనను అకెమినీడ్ సింహాసనానికి వారసుడిగా పేర్కొన్నాడని అలెగ్జాండర్ చెప్పాడు. [85] డారియస్‌తో పాటే అకెమినీడ్ సామ్రాజ్యం కూడా పతనమై పోయినట్లు భావిస్తారు.[2]
అలెగ్జాండర్ బెస్సస్‌ను దోపిడీదారుడిగా భావించి అతనిని ఓడించడానికి బయలుదేరాడు. బెస్సస్‌కు వ్యతిరేకంగా మొదలైన ఈ ప్రచారం మధ్య ఆసియాలో గొప్ప పర్యటనగా మారింది. అలెగ్జాండర్ వరసబెట్టి కొత్త నగరాలను స్థాపించుకుంటూ పోయాడు. అన్నిటికీ ఒకటే పేరు - అలెగ్జాండ్రియా! ఆఫ్ఘనిస్తాన్లోని ఆధునిక కాందహార్, ఆధునిక తజికిస్థాన్‌లో ఉన్న అలెగ్జాండ్రియా ఎషాటే ("సుదూరాన") లు కూడా అలెగ్జాండరు స్థాపించిన అలెగ్జాండ్రియాలే. ఈ దండయాత్రలో అలెగ్జాండర్, మీడియా, పార్థియా, అరియా (పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్), డ్రాంగియానా, అరాకోసియా (దక్షిణ, మధ్య ఆఫ్ఘనిస్తాన్), బాక్ట్రియా (ఉత్తర, మధ్య ఆఫ్ఘనిస్తాన్) సిథియా ల గుండా వెళ్ళాడు. [86]
సా.పూ. 329 లో, సోగ్డియానా సామంత రాజ్యంలో ఉండే స్పిటామెనెస్ (అక్కడ ఇతడి స్థాయి ఏమిటో తెలియరాలేదు) బెస్సస్‌కు ద్రోహం చేసి, అలెగ్జాండర్ యొక్క విశ్వసనీయ సహచరులలో ఒకరైన టోలెమీకి అతణ్ణి పట్టి ఇచ్చాడు. బెస్సస్‌ను వధించారు. [87] అయితే, కొన్నాళ్ళ తరువాత, అలెగ్జాండర్ జాక్సార్టెస్ నది వద్ద ఒక దేశద్రిమ్మరుల సైన్యంతో పోరాడుతూండగా, స్పిటామెనెస్ సోగ్డియానాలో తిరుగుబాటు లేవదీసాడు. జాక్సార్టెస్ యుద్ధంలో అలెగ్జాండర్ సిథియన్లను ఓడించాక, వెంటనే స్పైటామెనిస్‌పై దాడి చేసాడు. గబాయి యుద్ధంలో అతనిని ఓడించాడు. ఓటమి తరువాత, స్పిటామెనెస్‌ను అతడి సొంత మనుషులే చంపేసారు. ఆ తరువాత వాళ్ళు అలెగ్జాండరుతో సంధి చేసుకున్నారు. [88]
ఈ సమయంలో, అలెగ్జాండర్ తన ఆస్థానంలో పర్షియన్ దుస్తులను ధరించడం, కొన్ని పర్షియన్ ఆచారాలను అవలంబించడమూ చేసాడు. ముఖ్యంగా ప్రోస్కైనెసిస్ ఆచారం - చేతిని ముద్దాడడం, లేదా నేలపై సాష్టాంగపడటం. పర్షియన్లు సాంఘికంగా ఉన్నత హోదాల్లో ఉండేవారి పట్ల ఈ మర్యాదలు చూపించేవారు. గ్రీకులు ఈ ఆచారాన్ని దేవతల పట్ల మాత్రమే పాటిస్తారు. అది తనకూ చెయ్యమంటున్నాడంటే అలెగ్జాండర్ తనను తాను దైవంగా భావిస్తున్నాడని వారు అనుకున్నారు. ప్రజలకు అది నచ్చలేదు. దీంతో అతడు దేశప్రజల్లో సానుభూతి కోల్పోయాడు. చివరికి అతడు ఆ ఆచారాలను విడిచిపెట్టాడు. [89]
అతణ్ణి చంపేందుకు చేసిన కుట్ర ఒకటి బయట పడింది. ఆ విషయమై అలెగ్జాండర్‌ను అప్రమత్తం చేయడంలో విఫలమైనందుకు అతని అధికారులలో ఒకరైన ఫిలోటస్‌ను చంపేసారు. కొడుకు చంపడం అనేది, తండ్రిని కూడా చంపడానికి దారితీసింది. కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు చేస్తాడేమోనని భావించి, దాన్ని నివారించడానికి, ఎక్బాటానా వద్ద ఖజానాకు కాపలాగా ఉన్నతండ్రి పార్మేనియన్‌ను కూడా అలెగ్జాండర్ హత్య చేయించాడు. గ్రానికస్ వద్ద తన ప్రాణాలను కాపాడిన వ్యక్తి, క్లెయిటస్ ది బ్లాక్‌ను మరాకాండా ( ఉజ్బెకిస్తాన్‌లో ఆధునిక సమర్కాండ్) వద్ద చంపేసాడు. అలెగ్జాండర్ అపఖ్యాతి పాలైన ఘటనల్లో ఇదొకటి. తాగుడు మైకంలో జరిగిన వాగ్వాదంలో అలెగ్జాండర్ అనేక తప్పిదాలకు పాల్పడ్డాడనీ, ముఖ్యంగా మాసిడోనియన్ పద్ధతులను పక్కనబెట్టి, అవినీతిమయమైన ప్రాచ్య జీవనశైలికి అలవాటు పడ్డాడనీ క్లెయిటస్ అనడంతో అలెగ్జాండర్ అతణ్ణి చంపేసాడు. [90]
తర్వాత, మధ్య ఆసియా దండయాత్రలో అతడిపై జరిగిన మరో కుట్ర బయట పడింది. ఇది అతడి స్వంత పరిచారకులే చేసారు. అతని అధికారిక చరిత్రకారుడు, ఒలింథస్కు చెందిన కాలిస్థెనీస్ ఈ కుట్రలో పాత్రధారి. కాలిస్టెనెస్‌ను ఇతర సేవకులనూ రాక్ మీద ఎక్కించి హింసించారని, వాళ్ళు వెంటనే మరణించి ఉండవచ్చనీ అనాబాసిస్ ఆఫ్ అలెగ్జాండర్ పుస్తకంలో అరియన్ రాసాడు.[91] వాస్తవానికి కాలిస్టెనెస్ ఈ కుట్రలో పాల్గొన్నాడా అనేది అస్పష్టంగానే ఉంది. అతనిపై ఈ ఆరోపణలు రాకముందే, ప్రోస్కైనిసిస్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని వ్యతిరేకించడంతో అతడు అలెగ్జాండరు అనుగ్రహాన్ని కోల్పోయాడు.[92]
అలెగ్జాండర్ ఆసియాకు బయలుదేరినప్పుడు, అనుభవజ్ఞుడైన సైనిక, రాజకీయ నాయకుడు, ఫిలిప్ II "నమ్మకస్తుల్లో" ఒకడైన తన సేనాధిపతి యాంటిపేటర్‌కు మాసిడోన్ బాధ్యతలను అప్పజెప్పాడు.[47] అలెగ్జాండర్ థెబెస్‌ను తొలగించడంతో అతడు లేనప్పుడు గ్రీస్ ప్రశాంతంగా ఉండిపోయింది.[47] 331 లో స్పార్టన్ రాజు అగిస్ III చేసిన తిరుగుబాటు దీనికి ఒక మినహాయింపు. యాంటిపేటర్ ఇతణ్ణి మెగాలోపాలిస్ యుద్ధంలో ఓడించి, చంపాడు.[47] యాంటిపేటర్ స్పార్టన్లకు ఇవ్వాల్సిన శిక్ష గురించి లీగ్ ఆఫ్ కోరింత్కు చెప్పాడు, వాళ్ళు అలెగ్జాండర్‌ను అడగ్గా అతడు క్షమించి వదిలెయ్యమన్నాడు.[93] యాంటిపేటర్‌కు, ఒలింపియాస్ (అలెగ్జాండరు తల్లి) మధ్య కూడా తగువులు ఉండేవి. ఇద్దరూ ఒకరిపై ఒకరు అలెగ్జాండరుకు ఫిర్యాదులు చేసుకున్నారు.[94]
ఆసియాలో అలెగ్జాండర్ దండయాత్ర సందర్భంగా గ్రీసులో శాంతి, సౌభాగ్యాలు విలసిల్లాయి.[95] తన విజయాల్లో లభించిన చాలా సంపదను అతడు గ్రీసుకు పంపాడు. ఇది ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచి, అతని సామ్రాజ్యమంతటా వాణిజ్యాన్ని పెంచింది.[96] అయితే, కొత్త దళాల కోసం అలెగ్జాండర్ నిరంతరం చేసే డిమాండ్ల వలన, అతని సామ్రాజ్యం అంతటా మాసిడోనియన్ల వలసల వలనా, మాసిడోన్ బలాన్ని తగ్గించాయి. అలెగ్జాండర్ మరణించాక, మాసెడోన్ బాగా బలహీనపడి పోయింది. చివరికి మూడవ మాసిడోనియన్ యుద్ధంలో (సా.పూ. 171-168) రోమ్ మాసిడోన్‌ను అణచివేసింది.[14]
కొత్త సామంత రాజులతో సత్సంబంధాల పెంపు కోసం అతడు రోక్సానాను పెళ్ళి చేసుకున్నాడు. స్పిటామెనెస్ మరణం, ఈ వివాహం తరువాత, అలెగ్జాండర్ చూపు భారత ఉపఖండం వైపు తిరిగింది. పూర్వపు సామంతుడు గాంధార రాజును (ప్రస్తుత పాకిస్తాన్‌కు ఉత్తరాన, ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల వద్ద ఉన్న ప్రాంతం), లొంగిపొమ్మని చెబుతూ తనవద్దకు పిలిచాడు. తక్షశిల పాలకుడైన ఓంఫిస్ (భారత పేరు అంభి) (ఇతడి రాజ్యం ఇండస్ వరకు హైడాస్పెస్ (జీలం) వరకు విస్తరించింది) అంగీకరించి, అలెగ్జాండరును దర్శించుకున్నాడు. కానీ కొన్ని కొండ జాతుల నాయకులు, ఆస్పసియోయి, అస్సకేనోయి, కాంభోజులలోని కొందరు (భారతీయ గ్రంథాలలో అశ్వాయనులు అని అశ్వకాయనులు అనీ అంటారు), లొంగిపోడానికి నిరాకరించారు. [97] అలెగ్జాండరుకు ఉన్న ఆందోళనలను తొలగించేందుకు అంబి హడావుడిగా, విలువైన బహుమతులతో అతన్ని కలుసుకున్నాడు. తనను తన సైన్యమంతటినీ అలెగ్జాండరు ముందు ఉంచాడు. అలెగ్జాండర్ అంబికి అతడి బిరుదును బహుమతులనూ తిరిగి ఇవ్వడమే కాకుండా, "పర్షియన్ వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలు, 30 గుర్రాలు 1,000 టాలెంట్ల బంగారమూ" ఉన్న వార్డ్రోబ్ను కూడా అతనికి బహుకరించాడు. అలెగ్జాండర్ ధైర్యం చేసి తన దళాలను విభజించాడు. హుండ్ వద్ద సింధు నది వంపు తిరిగే చోట వంతెన నిర్మించడానికి హెఓఫేస్టియోన్, పెర్డికాస్ లకు అంభి సాయం చేసాడు.[98] వారి దళాలకు ఆహార సరఫరాలు చేసాడు. తన రాజధాని తక్షశిలలోకి అలెగ్జాండరును అతడి సైన్యాన్నీ తానే స్వయంగా స్వాగతించాడు. మైత్రినీ, గొప్ప ఆత్మీయ ఆతిధ్యాన్నీ ప్రదర్శించాడు.
అక్కడి నుండి మాసిడోనియా రాజు దండయాత్రలో Closing 5,000 సైన్యంతో అతడి వెంట నడిచింది. హైడాస్పెస్ నది వద్ద జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. ఆ ఓటమి తరువత అలెగ్జాండర్, అంభిని పోరస్ (పురుషోత్తముడు) ను వెంబడించేందుకు పంపించాడు. అయితే అంభి తన పాత శత్రువైన పురుషోత్తముడి చేతిలో చావును కొద్దిలో తప్పించుకున్నాడు.
సా.పూ 327/326 శీతాకాలంలో, అలెగ్జాండర్ కూనార్ లోయ లోని అస్పాసియోయిల పైన, గూరియస్ లోయ లోని గూరియన్ల పైనా, స్వాత్, బూనర్ లోయల్లోని అస్సాకెనోయిల పైనా స్వయంగా దాడి చేసాడు.[99] అస్పాసియోయితో తీవ్రమైన యుద్ధం జరిగింది. అలెగ్జాండర్ భుజంలో బాణం గుచ్చుకుని గాయపడ్డాడు. కాని చివరికి అస్పాసియోయిలు ఓడిపోయారు. ఆ తరువాత అలెగ్జాండర్ అస్సాకెనోయిని ఎదుర్కొన్నాడు. బలమైన మసాగా, ఓరా, ఆర్నోస్ కోటల నుండి అస్సాకెనోయిలు అతనితో యుద్ధం చేసారు. [97]
కొద్ది రోజుల నెత్తుటి పోరాటం తరువాత మసాగా కోటను స్వధీనపరచుకున్నాడు. దీనిలో అలెగ్జాండర్ చీలమండలో తీవ్రంగా గాయమైంది. కర్టియస్ ప్రకారం, "అలెగ్జాండర్ మసాగా మొత్తం జనాభాను వధించడమే కాక, దాని భవనాలను నేలమట్టం చేసాడు." [100] ఓరాలోనూ ఇదే విధమైన వధ జరిగింది. మస్సాగా, ఓరా లను కోల్పోయిన తరువాత, అనేక అస్సకేనియన్లు అవోర్నోస్ కోటకు పారిపోయారు. అలెగ్జాండర్ వాళ్ళను వెంటాడి, నాలుగు రోజుల రక్తపాతం తరువాత ఆ వ్యూహాత్మక కొండ కోటను స్వాధీనం చేసుకున్నాడు. [97]
అవోర్నోస్ తరువాత, అలెగ్జాండర్ సింధు నదిని దాటి, పోరస్ తో చారిత్రాత్మక యుద్ధం చేసి, గెలిచాడు. పోరస్ హైడాస్పస్, అసేసైన్స్ నదుల (చీనాబ్) మధ్య ఉన్న ప్రాంతాన్ని పాలించేవాడు. ఈ ప్రాంతం ప్రస్తుతం పంజాబులో ఉంది. హైడాస్పిస్ యుద్ధం అని పిలిచే ఈ యుద్ధం సా.పూ 326 లో జరిగింది. [101] పోరస్ ధైర్యం అలెగ్జాండర్‌ను ఆకట్టుకుంది. అతన్ని మిత్రునిగా చేసుకున్నాడు. పోరస్ను తన సామంతుడిగా నియమించాడు. గతంలో పోరస్ రాజ్యంలో భాగం కాని, హైఫాసిస్ నది (బియాస్ నది) వరకు ఉన్న భూభాగాన్ని కూడా చేర్చి పోరస్ రాజ్యాన్ని అతడికి ఇచ్చేసాడు.[102][103] స్థానికంగా సామంతుడిని ఎన్నుకోవడం గ్రీస్ నుండి చాలా దూరంలో ఉన్న ఈ భూములను నియంత్రించడంలో అతనికి సహాయపడింది. [104] అలెగ్జాండర్ హైడాస్పెస్ నదికి ఎదురుగా రెండు నగరాలను స్థాపించాడు. ఈ సమయంలో మరణించిన తన గుర్రానికి స్మారకంగా ఒక దానికి బుసెఫాలా అని పేరు పెట్టాడు. [105] మరొకటి నైజీయా (విజయం). ఇది ఆధునిక పంజాబ్ లోని మోంగ్ వద్ద ఉన్నట్లు భావిస్తున్నారు.[106] లైఫ్ ఆఫ్ అప్పోలోనియస్ లో ఎల్డర్ ఫిలోస్ట్టాటస్ పోరస్ సైన్యంలో ఒక ఏనుగు అలెగ్జాండర్ సైన్యంతో శౌర్యంతో పోరాడింది. అలెగ్జాండర్ దాన్ని హేలియోస్ (సూర్యుడు) కి అంకితమిస్తూ దానికి అజాక్స్ అని పేరుపెట్టాడు. గొప్ప జంతువుకు గొప్ప పేరే ఉండాలనేది అతడి ఉద్దేశం. ఆ ఏనుగు దంతాలకు బంగారు ఉంగరాలుండేవి. వాటిపై గ్రీకు భాషలో వ్రాసిన ఒక శాసనం ఉంది: "జ్యూస్ కుమారుడు అలెగ్జాండర్ అజాక్స్‌ను హేలియోస్కు అంకితం చేసాడు" (ΑΛΕΞΑΝΔΡΟΣ Ο ΔΙΟΣ ΑΙΑΝΤΑ ΗΛΙΩΙ).[107]
పోరస్ రాజ్యానికి తూర్పున, గంగా నదికి సమీపంలో, మగధ నందా సామ్రాజ్యం, ఇంకా తూర్పున, భారత ఉపఖండంలోని బెంగాల్ ప్రాంతంలోని గంగారిడై సామ్రాజ్యం ఉండేవి. పెద్ద సైన్యాలను ఎదుర్కొనే అవకాశముందనే భయంతో, సంవత్సరాల తరబడి చేస్తున్న దండయాత్రలతో అలసిపోయిన అలెగ్జాండర్ సైన్యం హైఫాసిస్ నది (బియాస్) వద్ద తిరుగుబాటు చేసి, తూర్పు వైపుకు నడవటానికి నిరాకరించింది. [108] ఈ నదే అలెగ్జాండర్ విజయాలకు తూర్పు హద్దు. [109]
మాసెడోనియన్లకు సంబంధించినంత వరకు, పోరస్‌తో వారు చేసిన యుద్ధం వారి శౌర్యాన్ని కుంగదీసింది. భారతదేశంలో మరింత ముందుకు పోనీకుండా అడ్డుపడింది. కేవలం 20 వేల మంది కాల్బలం, రెండు వేల గుర్రాలతో ఉన్న సైన్యాన్ని లొంగదీసుకోడానికే ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఇప్పుడు గంగను దాటి ముందుకు పోదామని అంటున్న అలెగ్జాండరును వాళ్ళు గట్టిగా ఎదిరించారు. గంగ వెడల్పు 32 ఫర్లాంగు లుంటుందని విన్నారు. లోతు వంద ఫాతమ్ లుంటుందని, అవతలి ఒడ్డున గుర్రాలు, ఏనుగులపై నున్న సైనికులతో నిండిపోయి ఉంటుందనీ విన్నారు. గాండెరైటెస్, ప్రయేసీ రాజులు తమ కోసం 80 వేల ఆశ్వికులతో, 2 లక్షల కాల్బలంతో, 8 వేల రథాలతో, 6 వేల యుద్ధపు టేనుగులతో ఎదురుచూస్తున్నారనీ విని ఉన్నారు..[110]
అలెగ్జాండర్ తన సైనికులను మరింత ముందుకు వెళ్ళడానికి ఒప్పించటానికి ప్రయత్నించాడు. కాని అతని సేనాధిపతి కోనస్, తన అభిప్రాయాన్ని మార్చుకుని వెనక్కి తిరగాలని అలెగ్జాండరును వేడుకున్నాడు. సైనికులు, "వారి తల్లిదండ్రులను, భార్యా పిల్లలను, మాతృభూమినీ మళ్ళీ చూడాలని ఎంతో ఆశపడుతున్నారు" అని అతను చెప్పాడు. అలెగ్జాండర్ చివరికి అంగీకరించి దక్షిణం వైపు తిరిగాడు, సింధు వెంట వెళ్ళాడు. దారిలో అతని సైన్యం మల్హీని (ఆధునిక ముల్తాన్‌లో ఉంది), ఇతర భారతీయ తెగలను జయించింది. ముట్టడి సమయంలో అలెగ్జాండర్ గాయపడ్డాడు. [111]
అలెగ్జాండర్ తన సైన్యంలో ఎక్కువ భాగాన్ని దళపతి క్రెటెరస్ వెంట కార్మానియా (ఆధునిక దక్షిణ ఇరాన్) కు పంపాడు. పర్షియన్ గల్ఫ్ తీరాన్ని అన్వేషించడానికి తన అడ్మిరల్ నెర్కస్ క్రింద ఒక నౌకాదళాన్ని నియమించాడు. మిగిలిన వారిని గెడ్రోసియన్ ఎడారి, మక్రాన్‌ల గుండా మరింత కష్టతరమైన దక్షిణ మార్గం ద్వారా పర్షియాకు తిరిగి నడిపించాడు. [112] అలెగ్జాండర్ సా.పూ 324 లో సూసా చేరుకున్నాడు. కానీ ఈ లోగానే కఠినమైన ఎడారికి చాలామంది సైనికులు బలయ్యారు.[113]
అతను లేనప్పుడు అనేక మంది సామంతులు, మిలిటరీ గవర్నర్లు తప్పుగా ప్రవర్తించారని తెలుసుకున్న అలెగ్జాండర్, సూసాకు వెళ్ళేటప్పుడు వారిలో చాలా మందిని చంపేసాడు కృతజ్ఞతలు తెలిపే విధంగా, అతను తన సైనికుల అప్పులను తీర్చాడు. వయసు మీరిన వారిని, వికలాంగ అనుభవజ్ఞులనూ క్రెటెరస్ నేతృత్వంలో మాసిడోన్‌కు తిరిగి పంపుతానని ప్రకటించాడు. అతని దళాలు అతని ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఓపిస్ పట్టణంలో తిరుగుబాటు చేశాయి. వెనక్కి పోవడానికి వాళ్ళు నిరాకరించారు. అతను పర్షియన్ ఆచారాలను, ఆహార్యాన్నీ స్వీకరించడాన్ని, పర్షియన్ అధికారులను సైనికులను మాసిడోనియన్ యూనిట్లలోకి తీసుకోవడాన్నీ వాళ్ళు విమర్శించారు.[114]
తిరుగుబాటు చేసిన సైనికులను వెనక్కి తగ్గమని మూడు రోజుల పాటు ప్రయత్నించినా, ఒప్పించలేక పోయిన అలెగ్జాండర్, సైన్యంలోని పర్షియన్లకు దళపతుల పోస్టులు ఇచ్చాడు. పర్షియన్ యూనిట్లకు మాసిడోనియన్ సైనిక బిరుదులను ఇచ్చాడు. తిరుగుబాటు చేసిన సైనికులు వెంటనే కాళ్ళబేరానికి వచ్చారు, క్షమించమని వేడుకున్నారు. దీనికి అలెగ్జాండర్ అంగీకరించాడు. కొన్నివేల మంది సైనికులకు విందు ఇచ్చాడు. వారితో కలిసి తిన్నాడు.[115] తన మాసిడోనియన్, పర్షియన్ అనుచరుల మధ్య శాశ్వత సామరస్యాన్ని ఏర్పరచుకునే ప్రయత్నంలో, అలెగ్జాండర్ తన సీనియర్ అధికారులకు సూసా లోని పర్షియన్ మహిళలతోటి, ఇతర కులీన మహిళల తోటీ సామూహిక వివాహాలు జరిపించాడు. కాని ఆ వివాహాలలో ఒక సంవత్సరానికి మించి కొనసాగినవి పెద్దగా ఉన్నట్లు కనిపించదు. ఇదిలా ఉండగా, పర్షియాకు తిరిగి వచ్చిన తరువాత, అలెగ్జాండర్ పసర్గడేలోని గ్రేట్ సైరస్ సమాధి కాపలాదారులు దానిని అపవిత్రం చేశారని తెలుసుకుని, వారిని వధించాడు. అలెగ్జాండర్ చిన్నతనం నుండి సైరస్ ది గ్రేట్ ను అభిమానించాడు. జెనోఫోన్ యొక్క సైరోపీడియా చదివాడు. యుద్ధంలో, పాలనలోనూ సైరస్ కనబరచిన వీరత్వాన్ని, పాలనా సమర్ధతనూ అందులో చదివాడు.[116] పసర్గాడే సందర్శనలో అలెగ్జాండర్ తన వాస్తుశిల్పి అరిస్టోబ్యులస్‌ను సైరస్ సమాధి యొక్క సెపుల్క్రాల్ చాంబర్ లోపలి భాగాన్ని అలంకరించమని ఆదేశించాడు.[116]
తరువాత, అలెగ్జాండర్ పర్షియన్ నిధిలో సింహభాగాన్ని తిరిగి పొందడానికి ఎక్బాటానాకు వెళ్ళాడు. అక్కడ, అతని సన్నిహితుడు, బహుశా ప్రియుడు అయిన హెఫెస్టియోన్ అనారోగ్యం వలన గాని, విషప్రయోగం కారణంగా గానీ మరణించాడు.[117] హెఫెస్టియోన్ మరణం అలెగ్జాండర్‌ను కుంగదీసింది. అతను బాబిలోన్లో ఖరీదైన అంత్యక్రియల పైర్ను తయారు చేయాలని, అలాగే బహిరంగ సంతాపానికీ ఆదేశించాడు. బాబిలోన్కు తిరిగి వచ్చి, అలెగ్జాండర్ అరేబియాపై దండయాత్రతో ప్రారంభించి, కొత్త దండయాత్రలకు ప్లాన్ చేశాడు. కాని అతను వాటిని అమల్లో పెట్టే అవకాశం రాకుండానే, హెఫెస్టియోన్ మరణించిన తరువాత కొద్దికాలానికే మరణించాడు.
సా.పూ 323 జూన్ 10 లేదా 11 న అలెగ్జాండర్, 32 సంవత్సరాల వయసులో బాబిలోన్లోని నెబుచాడ్నెజ్జార్ II యొక్క రాజభవనంలో మరణించాడు. అలెగ్జాండర్ మరణానికి సంబంధించి రెండు వేర్వేరు కథనాలున్నాయి. మరణ వివరాలు రెంటి లోనూ కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ప్లూటార్క్ కథనం ప్రకారం, అతని మరణానికి సుమారు 14 రోజుల ముందు, అలెగ్జాండర్ అడ్మిరల్ నెర్చస్కు దర్శనమిచ్చాడు. ఆ రాత్రీ, మరుసటి రోజూ లారిస్సాకు చెందిన మీడియస్తో కలిసి మద్యపానం చేశాడు. అతను జ్వరం బారిన పడ్డాడు. మాట్లాడలేనంతగా ముదిరిపోయింది. అతని ఆరోగ్యం గురించి ఆత్రుతగా ఉన్న సాధారణ సైనికులు, అతడి ముందు నుండి కవాతు చేసుకుంటూ పోయేందుకు అనుమతి ఇచ్చారు. అతడు నిశ్శబ్దంగా వారికి చెయ్యి ఊపాడు. [118] డయోడోరస్ చెప్పిన రెండవ కథనం ఇలా ఉంది: హెరాకిల్స్ గౌరవార్థం ఒక పెద్ద గిన్నెడు ద్రాక్ష సారాయిని ఏమీ కలపకుండా తాగాడు. ఆ తరువాత అలెగ్జాండర్ నొప్పితో బాధపడ్డాడు. తరువాత 11 రోజుల పాటు బలహీనంగా ఉన్నాడు. అతనికి జ్వరం రాలేదు గానీ, కొంత నొప్పితో మరణించాడు. అర్రియన్ కూడా దీనిని ప్రత్యామ్నాయ కథనంగా పేర్కొన్నాడు. కాని ప్లూటార్క్ ఈ వాదనను ప్రత్యేకంగా ఖండించాడు.
మాసిడోనియన్ కులీనుల్లో హత్యలు జరిగే దుష్ప్రవృత్తి ఉన్న కారణంగా, [119] అతని మరణానికి సంబంధించిన కథనాల్లో కుట్ర కోణం ఉంటుంది. డయోడోరస్, ప్లూటార్క్, అరియన్, జస్టిన్ అందరూ అలెగ్జాండర్‌కు విషమిచ్చిన సిద్ధాంతాన్ని పేర్కొన్నారు. ఒక విషపూరిత కుట్రకు అలెగ్జాండర్ బలయ్యాడని జస్టిన్ పేర్కొన్నాడు. ప్లూటార్క్ దీనిని కల్పితమని కొట్టిపారేశాడు. అయితే డయోడోరస్, అరియన్ లిద్దరూ - దీనిని సంపూర్ణత కోసమే ప్రస్తావించాడని అన్నారు. ఏదేమైనా, కొద్ది కాలం ముందు మాసిడోనియన్ వైస్రాయ్గా తొలగించిన, అలెగ్జాండర్ తల్లి ఒలింపియాస్‌తో విభేదించిన, యాంటిపేటర్ ఈ కుట్రకు నాయకత్వం వహించినట్లు చాలా కథనాలు చెబుతాయి. బాబిలోన్కు తనను పిలిపించడమంటే తనకు మరణశిక్ష విధించడమేనని భావించిన యాంటిపేటర్, [120] పైగా పర్మేనియన్, ఫిలోటాస్ ల గతి ఏమయిందో కూడా చూసి ఉన్నాడు కాబట్టి, తన కుమారుడు ఐయోల్లాస్ చేత అలెగ్జాండరుకు విషం పెట్టించాడు. ఈ కుమారుడు అలెగ్జాండరు దగ్గర సారాయి పోసేవాడిగా పనిచేసేవాడు. అరిస్టాటిల్ కూడా ఈ పనిలో పాల్గొని ఉండవచ్చని ఒక సూచన కూడా ఉంది.
విష ప్రయోగ సిద్ధాంతానికి వ్యతిరేకంగా బలమైన వాదన ఏమిటంటే, అతని అనారోగ్యం మొదలవడానికి మరణానికీ మధ్య పన్నెండు రోజులు గడిచాయి; అంత దీర్ఘకాలం పాటు పనిచేసే విషాలు బహుశా అందుబాటులో ఉండి ఉండకపోవచ్చు. [121] అయితే, అలెగ్జాండర్ మరణంపై దర్యాప్తు చేసిన 2003 బిబిసి డాక్యుమెంటరీలో, న్యూజిలాండ్ నేషనల్ పాయిజన్స్ సెంటర్‌కు చెందిన లియో షెప్, ఆ కాలం నాటికే తెలిసిన వైట్ హెలెబోర్ (వెరాట్రమ్ ఆల్బమ్) మొక్కను అలెగ్జాండర్‌పై విషప్రయోగానికి ఉపయోగించి ఉండవచ్చని ప్రతిపాదించారు.[122] [123] [124] క్లినికల్ టాక్సికాలజీ జర్నల్‌లో 2014 మాన్యుస్క్రిప్ట్‌లో, అలెగ్జాండర్ తాగిన ద్రాక్ష సారాయిలో వెరాట్రమ్ ఆల్బమ్‌ను కలిపారనీ, అలెగ్జాండర్ రొమాన్స్‌లో వివరించిన సంఘటనల క్రమానికి సరిపోయే విష లక్షణాలను ఇది కలిగిస్తుందనీ షెప్ సూచించాడు.[125] వెరాట్రమ్ ఆల్బమ్ విషప్రయోగం సుదీర్ఘంగా సాగుతుంది. అలెగ్జాండర్‌పై విషప్రయోగమే గనక జరిగి ఉంటే, ఆ విషం వెరాట్రమ్ ఆల్బమ్ అయి ఉంటుందని చెప్పేందుకు చాలా ఆమోదయోగ్యమైన హేతువు ఉంది.[125][126] 2010 లో ముందుకు వచ్చిన మరో విష వివరణ, ప్రమాదకరమైన సమ్మేళనం కాలిచెమిసిన్ కలిగి ఉన్న స్టైక్స్ నది (గ్రీస్‌లోని ఆర్కాడియాలోని ఉన్న మావ్రోనేరి నది) నీటితో విషప్రయోగం జైరిగి అతడు మరణించి ఉండవచ్చు. ఈ కాలిచెమిసిన్ను బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది.[127]
మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో సహా అనేక సహజ కారణాలను (వ్యాధులు) కూడా సూచించారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో 1998 లో వచ్చిన ఒక వ్యాసంలో, టైఫాయిడ్ జ్వరం ఉండి, పైగా ప్రేగు చిల్లులు పడడం, పక్షవాతం వలన అది మరింత సంక్లిష్టంగా మారడం వలన అలెగ్జాండర్ మరణించాడని పేర్కొంది. మరో విశ్లేషణలో పయోజెనిక్ (ఇన్ఫెక్షియస్) స్పాండిలైటిస్ లేదా మెనింజైటిస్లు కారణాలుగా సూచించారు. లక్షణాలకు సరిపోయే ఇతర జబ్బులు తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్, వెస్ట్ నైల్ వైరస్.[128] చాలా సంవత్సరాల పాటు అధికంగా మద్యపానం చెయ్యడంతో ఆరోగ్యం క్షీణించడం వలన, తీవ్రమైన గాయాల వలనా సహజ మరణం ప్రాప్తించి ఉండవచ్చు. హెఫెస్టియన్ మరణం తరువాత అలెగ్జాండర్ అనుభవించిన వేదన కూడా అతని ఆరోగ్య క్షీణతకు కారణమై ఉండవచ్చు.
అలెగ్జాండర్ మృతదేహాన్ని తేనెతో నింపిన బంగారు సార్కోఫాగస్ (రాతితో చేసిన శవ పేటిక) లో ఉంచారు. దీన్ని మరొక బంగారు పేటికలో ఉంచారు.[2] ఏలియన్ ప్రకారం, అరిస్టాండర్ అనే ఒక దార్శనికుడు అలెగ్జాండర్‌ను ఖననం చేసే భూమి "ఎప్పటికీ సంతోషంగా, అజేయంగా ఉంటుంది" అని ముందే చెప్పాడు. గతించిన రాజును సమాధి చేయడం రాజ హక్కు కావడాన, పార్థువ దేహం తమ వద్ద ఉండడం తమ వారసత్వపు చట్టబద్ధతకు చిహ్నంగా భావించి ఉండవచ్చు. [129]
అలెగ్జాండర్ అంత్యక్రియల ఊరేగింపు మాసిడోన్‌కు వెళుతుండగా, టోలెమి దానిని స్వాధీనం చేసుకుని తాత్కాలికంగా మెంఫిస్‌కు తీసుకువెళ్ళాడు. అతని వారసుడు, టోలెమి II ఫిలడెల్ఫస్, సార్కోఫాగస్‌ను అలెగ్జాండ్రియాకు పంపించాడు. అక్కడ ఇది పురాతన కాలం వరకు ఉంది. టోలెమి చివరి వారసులలో ఒకరైన టోలెమి IX లాథిరోస్, అలెగ్జాండర్ సార్కోఫాగస్ స్థానంలో ఒక గ్లాసు పేటిక పెట్టాడు. అసలు సార్కోఫాగస్‌ను నాణేలుగా మార్చుకున్నాడు. ఉత్తర గ్రీస్‌లో, ఆంఫిపోలిస్ వద్ద ఇటీవల చాలా పెద్ద సమాధిని కనుగొన్నారు. ఇది అలెగ్జాండర్ [130] కాలం నాటిది. ఈ సమాధిని అసలు ఉద్దేశించినది అలెగ్జాండర్ ఖననం కోసమేననే ఊహాగానాలకు తెరలేచింది. ఈ స్థలం అలెగ్జాండర్ అంత్యక్రియల ఊరేగింపు వెళ్ళదలచిన గమ్యానికి సరిపోతోంది. అయితే, ఈ స్మారకం అలెగ్జాండర్‌కు అత్యంత ప్రియమైన స్నేహితుడు హెఫేస్టియోన్ దని తేలింది.[2][2]
పాంపే, జూలియస్ సీజర్, అగస్టస్ అందరూ అలెగ్జాండ్రియాలోని సమాధిని సందర్శించారు, అక్కడ అగస్టస్ అనుకోకుండా ముక్కును తన్నాడు. కాలిగులా తన సొంత ఉపయోగం కోసం సమాధి నుండి అలెగ్జాండర్ రొమ్ము పలకను తీసుకెళ్ళినట్లు చెబుతారు. సా.శ. 200 ప్రాంతంలో, చక్రవర్తి సెప్టిమియస్ సెవెరస్ అలెగ్జాండర్ సమాధిని ప్రజలు దర్శించకుండా మూసివేసాడు. అతని కుమారుడు, వారసుడు, కారకాల్లా, అలెగ్జాండరంటే ఆరాధన కలిగినవాడు, తన పాలనలో సమాధిని సందర్శించారు. దీని తరువాత, సమాధి గతి ఏమైందనే దాని గురించిన వివరాలు అస్పష్టంగా ఉన్నాయి.
సిడాన్ సమీపంలో కనుగొన్న "అలెగ్జాండర్ సార్కోఫాగస్"ను అలా పిలవడానికి కారణం అందులో అలెగ్జాండర్ అవశేషాలను ఉండేవని భావించినందువల్ల కాదు, కానీ దానిపై అలెగ్జాండర్, అతని సహచరులు పర్షియన్లతో పోరాడటం, వేటాడటం చిత్రించి ఉండడం వలన. ప్రస్తుతం ఇస్తాంబుల్ ఆర్కియాలజీ మ్యూజియంలో ఉంది. దీన్ని మొదట అబ్దలోనిమస్ యొక్క సార్కోఫాగస్ అని భావించారు (మరణం: 311 సా.పూ), 331 లో ఇస్సస్ యుద్ధం ముగిసిన వెంటనే అలెగ్జాండర్ నియమించిన సిడాన్ రాజు ఇతడు.[131][132] అయితే, ఇటీవల, ఇది అబ్దలోనిమస్ మరణ కాలం కంటే ఇది పూర్వపుదని సూచించబడింది.
అలెగ్జాండర్ మరణం చాలా ఆకస్మికంగా జరిగిందంటే, అతని మరణవార్త గ్రీస్ చేరినపుడు, దాన్ని ప్రజలు వెంటనే నమ్మలేదు.[47] అలెగ్జాండర్‌కు స్పష్టమైన లేదా చట్టబద్ధమైన వారసుడు లేడు. రోక్సేన్ ద్వారా అతనికు కలిగిన కుమారుడు అలెగ్జాండర్ IV, అలెగ్జాండర్ మరణం తరువాతనే జన్మించాడు. [133] డయోడోరస్ ప్రకారం, మరణ శయ్యపై ఉండగా రాజ్యాన్ని ఎవరికి అప్పగిస్తాడని అతన్ని సహచరులు అడిగారు; అతని క్లుప్తమైన సమాధానం "tôi kratistôi" - "అత్యంత బలవంతుడికి". మరొక సిద్ధాంతం ఏమిటంటే, అతని వారసులు కావాలనో లేదా తప్పుగానో "tôi Kraterôi"- "క్రెటెరస్‌కు" అని విన్నారు. ఈ క్రెటెరస్ యే, అలెగ్జాండర్, మాసిడోనియాకు కొత్తగా పట్టం గట్టినవాడు, అతడి మాసిడోనియాన్ దళాలను వెనక్కి, ఇంటికి నడిపిస్తున్నవాడు.[134]
అర్రియన్, ప్లూటార్క్ లు, అప్పటికే అలెగ్జాండర్‌కు మాట పడిపోయిందని చెబుతూ, పై కథ ప్రక్షిప్తమై ఉండవచ్చని వారు సూచనగా చెప్పారు.[135] డియోడోరస్, కర్టియస్, జస్టిన్ మరింత ఆమోదయోగ్యమైన కథ చెప్పారు. దాని ప్రకారం, అలెగ్జాండర్, తన రాజముద్రికను తన అంగరక్షకుడు అశ్వికదళ నాయకుడు అయిన పెర్డిక్కాస్కు సాక్షులు చూస్తూండగా ఇచ్చాడు. ఆ విధంగా అతణ్ణి తన వారసుడిగా నియమించాడు [133]
పెర్డికాస్ మొదట్లో అధికారం కోసం దావా చెయ్యలేదు. బదులుగా రోక్సేన్ కు మగబిడ్డ పుడితే అతడే రాజు అవుతాడనీ తాను, క్రెటెరస్, లియోనాటస్, యాంటిపేటర్ లు ఆ బిడ్డకు సంరక్షకులుగా ఉంటామనీ అన్నాడు. అయితే, మెలేజర్ ఆధ్వర్యంలోని పదాతిదళం, ఈ చర్చలో తమను కలుపుకోనందున, ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. బదులుగా, వారు అలెగ్జాండర్ సవతి సోదరుడు ఫిలిప్ అర్హిడియస్‌కు మద్దతు నిచ్చారు. చివరికి, ఇరువర్గాలు రాజీ పడి, అలెగ్జాండర్ IV జన్మించిన తరువాత, అతన్ని, ఫిలిప్ III నూ కలిపి ఉమ్మడి రాజులుగా నియమించారు, పేరుకు మాత్రమే. [136]
అయితే, త్వరలోనే విభేదాలు, శత్రుత్వాలూ మాసిడోనియన్లను చుట్టుముట్టాయి. బాబిలోన్‌ను విభజించి పెర్డికాస్ ఏర్పరచిన సామంతరాజ్యాలు అధికారం కోసం పోరాట స్థావరాలుగా మారాయి. సా.పూ 321 లో పెర్డికాస్ హత్య తరువాత, మాసిడోనియన్ ఐక్యత కూలిపోయింది. వారసుల మధ్య 40 యేళ్ళ యుద్ధం మొదలైంది. హెల్లెనిస్టిక్ ప్రపంచం నాలు రాజ్యాలుగా - టోలెమిక్ ఈజిప్ట్, సెలూసిడ్ మెసొపొటేమియా మధ్య ఆసియా, అటాలిడ్ అనటోలియా, యాంటిగోనిడ్ మాసిడోన్ గా - విడిపోయింది. ఈ ప్రక్రియలో, అలెగ్జాండర్ IV, ఫిలిప్ III లు ఇద్దరూ హత్యకు గురయ్యారు. [137]
అలెగ్జాండర్ తన మరణానికి కొంత సమయం ముందు క్రేటెరస్కు వివరంగా రాతపూర్వకంగా సూచనలు ఇచ్చాడని డయోడోరస్ పేర్కొన్నాడు. క్రేటెరస్ అలెగ్జాండర్ ఆదేశాలను అమలు చేయడం ప్రారంభించాడు, కాని వారసులు వాటిని కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారు. అవి అసాధ్యమైనవి విపరీతమైనవీ అని వారి ఉద్దేశం. ఏదేమైనా, పెర్డికాస్ తన దళాలకు అలెగ్జాండర్ సంకల్పం చదివి వినిపించాడు.[47]
అలెగ్జాండర్ సంకల్పం దక్షిణ, పశ్చిమ మధ్యధరా ప్రాంతాలలో సైనిక విస్తరణ, స్మారక నిర్మాణాలు, తూర్పు, పాశ్చాత్య జనాభా మధ్య కలయిక కోసం పిలుపు నిచ్చింది. ఇందులో ఇవి ఉన్నాయి:
తేదీ | యుద్ధం | చర్య | ప్రత్యర్థులు | రకం | దేశం (ప్రస్తుత కాలంలో) | ర్యాంకు | ఫలితం |
---|---|---|---|---|---|---|---|
2 ఆగస్టు 338 సా.పూ | Rise of Macedon | చెరోనియా పోరాటం | ఎథీనియన్లు | థేబన్లు,పోరాటం | గ్రీస్ | యువరాజు | విజయం
|
335 సా.పూ | బాల్కన్ దండయాత్ర | మౌంట్ హేమస్ పోరాటం | గెటే, థ్రేసియన్లు | పోరాటం | బల్గేరియా | రాజు | విజయం
|
డిసెంబరు 335 సా.పూ | బాల్కన్ దండయాత్ర | పేలియమ్ ముట్టడి | ఇల్లైరియన్లు | ముట్టడి | ఆల్బేనియా | రాజు | విజయం
|
డిసెంబరు 335 సా.పూ | బాల్కన్ దండయాత్ర | థెబెస్ పోరాటం | థేబన్లు | పోరాటం | గ్రీస్ | రాజు | విజయం
|
మే 334 సా.పూ | పర్షియాపై దండయాత్ర | గ్రానికస్ పోరాటం | అకెమినీడ్ సామ్రాజ్యం | పోరాటం | టర్కీ | రాజు | విజయం
|
334 సా.పూ | పర్షియాపై దండయాత్ర | మాలెటస్ ముట్టడి | అకెమినీడ్ సామ్రాజ్యం, మిలేసియన్లు | ముట్టడి | టర్కీ | రాజు | విజయం
|
334 సా.పూ | పర్షియాపై దండయాత్ర | హాలికామస్స ముట్టడి | అకెమినీడ్ సామ్రాజ్యం | ముట్టడి | టర్కీ | రాజు | విజయం
|
5 నవంబరు 333 సా.పూ | పర్షియాపై దండయాత్ర | ఇస్సస్ పోరాటం | అకెమినీడ్ సామ్రాజ్యం | పోరాటం | టర్కీ | రాజు | విజయం
|
జనవరి–July 332 సా.పూ | పర్షియాపై దండయాత్ర | టైర్ ముట్టడి | అకెమినీడ్ సామ్రాజ్యం, టైరియన్లు | ముట్టడి | లెబనాన్ | రాజు | విజయం
|
అక్టోబరు 332 సా.పూ | పర్షియాపై దండయాత్ర | గాజా ముట్టడి | అకెమినీడ్ సామ్రాజ్యం | ముట్టడి | పాలస్తీనా | రాజు | విజయం
|
1 అక్టోబరు 331 సా.పూ | పర్షియాపై దండయాత్ర | గౌగుమేలా పోరాటం | అకెమినీడ్ సామ్రాజ్యం | పోరాటం | ఇరాక్ | రాజు | విజయం
|
డిసెంబరు 331 సా.పూ | పర్షియాపై దండయాత్ర | ఉక్సియన్ డిఫైల్ పోరాటం | Uxians | పోరాటం | ఇరాన్ | రాజు | విజయం
|
20 జనవరి 330 సా.పూ | పర్షియాపై దండయాత్ర | పర్షియన్ గేట్ పోరాటం | అకెమినీడ్ సామ్రాజ్యం | పోరాటం | ఇరాన్ | రాజు | విజయం
|
329 సా.పూ | పర్షియాపై దండయాత్ర | సైక్రోపోలిస్ ముట్టడి | Sogdians | ముట్టడి | తుర్క్మేనిస్తాన్ | రాజు | విజయం
|
అక్టోబరు 329 సా.పూ | పర్షియాపై దండయాత్ర | జాక్సార్టెస్ పోరాటం | Scythians | పోరాటం | ఉజ్బెకిస్తాన్ | రాజు | విజయం
|
327 సా.పూ | పర్షియాపై దండయాత్ర | సోగ్డియన్ రాక్ ముట్టడి | Sogdians | ముట్టడి | ఉజ్బెకిస్తాన్ | రాజు | విజయం
|
మే 327 – మార్చి 326 సా.పూ | భారతదేశంపై దండయాత్ర | కోఫెన్ దండయాత్ర | Aspasians | దండయాత్ర | ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ | రాజు | విజయం
|
ఏప్రిల్ 326 సా.పూ | భారతదేశంపై దండయాత్ర | అవోర్నోస్ ముట్టడి | Aśvaka | ముట్టడి | పాకిస్తాన్ | రాజు | విజయం
|
మే 326 సా.పూ | భారతదేశంపై దండయాత్ర | హైడాస్పెస్ పోరాటం | Paurava | పోరాటం | పాకిస్తాన్ | రాజు | విజయం
|
నవంబరు 326 – ఫిబ్రవరి 325 సా.పూ | భారతదేశంపై దండయాత్ర | ముల్తాన్ ముట్టడి | Malli | ముట్టడి | పాకిస్తాన్ | రాజు | విజయం
|
అలెగ్జాండర్ కాలంలోని ఒక ప్రముఖ వ్యక్తి, చరిత్రకారుడైన కాలిస్థెనిస్ తన రచన సిలీషియాలో ఒక సముద్రం గురించి, అలెగ్జాండర్ గురించి వ్రాసాడు. (Plutarch, Alexander the great' 46.2)
డేనియల్ 8:5–8 మరీయు 21–22 లలో ఒక రాజు గురించి ప్రస్తావింపబడింది. ఈ రాజు మిడిస్, పర్షియాలను జయిస్తాడని, తరువాత అతడి సామ్రాజ్యం నాలుగు భాగాలుగా విభజింపబడుతుందని వ్యాఖ్యానింపబడింది. ప్రస్తావింపబడిన రాజు అలెగ్జాండరేనని కొందరు భావిస్తున్నారు. తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ పురుషోత్తముడిపై దండెత్తి కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు అలెగ్జాండర్. అయితే మరికొన్నాళ్ళ తర్వాత పురుషోత్తముడు మరణిస్తాడు. అతని రాజ్యాన్ని అతనికే ఇచ్చేయాలని భావించి తిరిగి తన సైన్యాన్ని విరమించుకుని పురుషోత్తముని రాజ్యాన్ని అతని సోదరునికి అప్పగించి తిరిగి పయనిస్తాడు.
ఖురాన్లో ఒక సత్ప్రవర్తన గల పాలకుడి దుల్-ఖర్నైన్ లేదా జుల్-ఖర్నైన్ గురించి ప్రస్తావింపబడింది. అరబ్, పర్షియన్ ప్రపంచంలో ఈ దుల్-ఖర్నైన్, అలెగ్జాండరేనని భావిస్తున్నారు. కానీ కొందరు ధార్మిక చరిత్రకారులు మాత్రం ఈ వాదనతో విభేదించి, దుల్-ఖర్నైన్ రాజు పర్షియాకు చెందిన సైరస్ రాజు అని భావిస్తున్నాడు.
ఫిరదౌసి రచించిన ప్రబంధకావ్యం, షాహ్‌నామా పర్షియన్ భాషా సాహిత్యం లోని ప్రాచీన గ్రంథాలలో ఒకటి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.