From Wikipedia, the free encyclopedia
ఇలియాడ్ గ్రీకు మహాకవి హోమర్ సా.పూ 700 సమయంలో రచించిన కావ్యం. సా.పూ 1100 కాలంలో పురాతన గ్రీకు రాజ్యాలకీ, ట్రాయ్ నగరానికీ మధ్య జరిగిన సంగ్రామం ఈ కావ్యానికి కథా వస్తువు.[1]
ఈ కావ్యం యుద్ధంలో చివరి కొన్ని వారాల గురించి మాత్రమే అయినా ట్రాయ్ నగర ముట్టడి గురించి ఎన్నో పురాణాలను, అసలు యుద్ధానికి కారణాలు, ముట్టడికి సేనలను సమీకరించడం లాంటి సంఘటనలను మొదట్లో వర్ణిస్తాడు రచయిత. హోమర్ కథనం ప్రకారం మేసినీ రాజు అగమెమ్నాన్ సారథ్యంలోని గ్రీకులు, ప్రియాం రాజు నేతృత్వంలోని ట్రోజన్ల మధ్య సుమారు కాంస్యయుగం చివర్లో ఈ యుద్ధం చోటు చేసుకుంది. ఈ యుద్ధం పదేళ్ళపాటు సాగింది. ఈ కావ్యంలో యుద్ధ వివరాలను ఎంత కూలంకషంగా రాశాడంటే దగ్గరుండి నిజమైన యుద్ధాన్ని పరిశీలిస్తే తప్ప అలా రాయలేరు అన్న విశ్వాసం ప్రజల్లో ఉంది.[2]
హోమర్ రాసిన ఇలియాడ్ లో కథనం గ్రీసు సేనలకి, ట్రోయ్ సేనలకి మధ్య యుద్ధం తొమ్మిదో సంవత్సరంలో ఉండగా మొదలవుతుంది. అనగా యుద్ధం చివరి దశలోఉండగా కథ మొదలవుతుంది.
కవి సాహిత్యాలకి అధిదేవత అయిన “మూజ్” ని ప్రార్ధించి గ్రీకు యోధులలో అగ్రేసరుడైన అక్ఖిల్లీస్ (Achilles) కోపోద్రేకాలకి కారణమేమిటో చెప్పడంతో గ్రంథ రచన ప్రారంభం అవుతుంది. ప్రారంభ వాక్యంలో మొదటి మాట గ్రీకు భాష లో "Μηνιν" ("mēnin", మేనిన్ అనగా "wrath" లేదా తీవ్రమైన ఆగ్రహము). రెండవ మాట "aeide", అనగా గేయం, పాట. మూడవ మాట "thea", అనగా దేవత. ఎవరీ దేవత? సాహిత్యాలకి అధిదేవత అయిన “మూజ్”. అనగా, “ఓ దేవతా! అక్ఖిల్లీస్ ఆగ్రహం యొక్క పాట!” అని హోమర్ గ్రంథ రచన మొదలు పెడతాడు.
ఈ అక్ఖిల్లీస్ తండ్రి పెలియస్ (Peleus, ఒక కులీన రాజ వంశీయుడైన మానవుడు), తల్లి తీటస్ (దైవగణాలకి చెందిన ఒక జలకన్య). ఇలియాడ్ లో వచ్చే పాత్రలలో అత్యధికులు గ్రీసు దక్షిణ పరగణాల నుండి వచ్చిన వారైతే ఒక్క అక్ఖిల్లీస్ మాత్రం ఉత్తరాదివాడు. అనగా ఒక విధంగా ”పరాయి” వాడు. యవ్వనం, పరాక్రమం అతని భూషణాలు అయితే కూటనీతి, మంత్రాంగం తెలియని ఉడుకు రక్తం అతని శత్రువులు. అక్ఖిల్లీస్ కీ గ్రీకు మహారథుడు, గ్రీకు సేనానాయకుడు అయిన అగమెమ్నాన్ (Agamemnon) కి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా యుద్ధం చెయ్యనని ప్రతిన పూని అక్ఖిల్లీస్ తన గుడారంలో కూర్చుంటాడు. దరిదాపు కథాంతం వరకు అక్ఖిల్లీస్ అలక లోనే ఉంటాడు. చిట్ట చివరికి తన ఆప్త మిత్రుడు పాట్రోక్లస్ (Patroclus) హెక్టర్ చేతులలో మరణించేసరికి కోపోద్రేకాలు పెల్లుబకగా దుమారంలా యుద్ధరంగం లోకి దూకి పాట్రోక్లస్ మరణానికి కారణభూతుడైన హెక్టర్ (Hector) ని హతమార్చి అతని మృత దేహాన్ని ఛిన్నాభిన్నం చేస్తాడు.
కొడుకు మృతదేహాన్ని తెచ్చుకుందుకని హెక్టర్ తండ్రి ప్రియం (Priam) అర్ధరాత్రి వేళ అక్ఖిల్లీస్ ఆవాసానికి వెళ్లడంతో కథ పూర్తి అవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బహుళ ప్రచారం పొందిన కొయ్యగుర్రం ప్రస్తావన ఇలియాడ్ లో కనిపించదు.
ఇదీ టూకీగా ఇలియాడ్ లో కథ. ఇదంతా ఒలింపియను దేవుళ్ళ కనుసన్నలలో జరుగుతుంది. అనగా ఈ దేవుళ్ళు కేవలం ప్రేక్షకులు కాదు వీరు కూడా ఇరు పక్షాలకు వెనక ఉండి పురి కొల్పడం, మద్దత్తు ఇవ్వడం వంటి పనులు చేస్తూ ఉంటారు. కనుక ట్రోయ్ యుద్ధం కేవలం రెండు మానవ సైన్యాలకి పరిమితమైన యుద్ధం కాదు; దేవుళ్ళ మధ్య జరిగిన యుద్ధం కూడా! జూస్ పట్టమహిషి అయిన హేరా; బుద్ధులకీ, యుద్ధాలకి అధినేత్రి అయిన ఎతీనా; సముద్రాలకి అధిపతి అయిన పొసయిడన్ గ్రీకుల పక్షం అయితే ట్రోయ్ పక్షం కాసిన వారిలో అపాలో ముఖ్యుడు.
హ్రదయ విదారకమైన అంశం ఏమిటంటే యుద్ధంలో మరణం తథ్యం. యుద్ధంలో పాల్గొనే వారు, తద్వారా మరణించే వారిలో యువత ఎక్కువ. అక్ఖిల్లీస్ వయస్సులో పిన్నవాడు. ఉడుకు రక్తం వాడు. తల్లి ద్వారా సంక్రమించిన దైవాంశ దన్నుగా ఉన్నా యుద్ధంలో మరణాన్ని జయించలేక పోయాడు. శౌర్య పరాక్రమాలతో అల్ప కాలం బతికిన తరువాత వీరస్వర్గం కావాలా లేక సాధారణమైన జీవితంతో పూర్ణాయుర్దాయం కావాలా అని అడిగితే యుద్ధంలో మరణాన్ని ఎదుర్కొని వీరస్వర్గాన్నే కోరుకున్నాడు. అక్ఖిల్లీస్ చేతులలో వీరస్వర్గం పొందిన హెక్టర్ కూడా యువకుడే!
మరి దేవుళ్ళ సంగతి? వారు అమరులు. వారికీ మరణం లేదు. వారు వారి ఇష్టం వచ్చిన ఆటలు ఆడవచ్చు. మరణం లేకపోయినా దేవతలు కూడా కొన్ని కష్టాలని ఎదుర్కోక తప్పలేదు. అక్ఖిల్లీస్ మరణంతో అమరత్వం పొందినా అతని తల్లి థేటిస్ గర్భశోకంతో బాధపడుతూనే ఉంది - నేటికీ!
ఇంతకీ అక్ఖిల్లీస్ కోపోద్రేకాలకి కారణం? యుద్ధం మొదలయి తొమ్మిదేళ్లు గడచిన తరువాత గ్రీకు సైన్యం ట్రోయ్ మిత్రరాజ్యం అయిన క్రిసి ని ముట్టడించి లొంగదీసుకుంటుంది. ఈ సందర్భంలో ఓడిపోయిన రాజ్యానికి చెందిన క్రిసెస్ (Chryses) అనే పేరు గల పురోహితుని కుమార్తెలు ఇద్దరు - క్రిసేయిస్ (Chryseis), బ్రెసేయిస్ (Briseis) - గ్రీకుల వశం అవుతారు. (జనకుడి కూతురు జానకి అయినట్లే క్రిసెస్ కూతురు క్రిసేయిస్ అవుతుంది. ఈమె అసలు పేరు మరొకటి ఉంది!) గ్రీకుల సేనాధిపతి అగమెమ్నాన్ క్రిసేయిస్ ని తనకి దక్కిన బహుమానంగా తీసుకుంటాడు. గ్రీకు సైన్యం అంతటికి ఆణిముత్యం అనదగ్గ అక్ఖిల్లీస్ బ్రెసేయిస్ ని తీసుకుంటాడు.
క్రిసేయిస్ తండ్రి క్రిసెస్ - సాక్షాత్తు ఒలింపియన్ దేవుడైన అపాలోకి హితుడు - కూతురు బంధ విమోచనకి అగమెమ్నాన్ కి ఎంతో విలువైన నగలు, ఆభరణాలు పణంగా పెడతాడు కానీ అగమెమ్నాన్ లొంగడు. తన హితునికి ఎదురవుతున్న పరాజయం చూడగానే అపాలోకి కోపం వచ్చి అగమెమ్నాన్ సేనల మీద ప్లేగు మహమ్మారి పడాలని శపిస్తాడు.
తమ సేనలు ఎండలలో పిట్టలలా రాలిపోతూ ఉంటే చూసి, కంగారుపడి, అక్ఖిల్లీస్ దైవజ్ఞులని సంప్రదించగా, కాల్చస్ (Calchas) అనే దైవజ్ఞుడు లేచి, “ఇదంతా అపాలో శాపం వల్ల జరుగుతోంది” అని చెబుతాడు. అప్పుడు అగమేమ్నాన్ - అయిష్టంగానే - క్రిసేయిస్ ని వదలుకుందుకి ఆమోదిస్తాడు; కానీ ఒక మెలిక పెడతాడు. ఏమిటా మెలిక? తాను క్రిసేయిస్ ని వదులుకుంటే ఆ స్థానంలో అఖిల్లీస్ తనకి బ్రెసేయిస్ ని ఇచ్చెయ్యాలి! ఈ వంకాయల బేరం విని అక్ఖిల్లీస్ కోపోద్రేకుడయి, కత్తి దూసి, అగమెమ్నాన్ తో ద్వంద్వ యుద్ధానికి తయారవుతాడు. ఒక పక్క ట్రోయ్ సేనలు భీకర పోరాటంలో ఉండగా ఈ గిల్లికజ్జాలు ఏమిటని కాబోలు ఒలింపియన్ దేవత హేరా ఈ యోధుల మధ్య సంధి కుదర్చమని ఎథీనాని పంపుతుంది. నెస్టర్ (Nestor) సహాయంతో ఎథీనా చేసిన హితోపదేశం అక్ఖిల్లీస్ కోపాన్ని కొంతవరకు చల్లార్చుతుంది. కానీ, తనకి జరిగిన పరాభవానికి ప్రతీకారంగా తాను ఇటుపైన యుద్ధం చెయ్యనని ప్రతిన పూని తన గుడారానికి చేరుకుంటాడు. అక్ఖిల్లీస్ తన కోపం చల్లారక ముందే తన తల్లి అయిన ఎలనాగ (సముద్రపు “జలకన్య”) తీటస్ (Thetis) ని పిలచి తనకి జరిగిన పరాభవానికి ప్రతీకారం చెయ్యడానికి దేవతల రాజైన జూస్ (Zeus) నుండి సహాయం అర్థించమని అడుగుతాడు.
ఇది ఇలా ఉండగా అగమెమ్నాన్ క్రిసేయిస్ ని ఆమె తండ్రి దగ్గరకు పంపేసి, బ్రెసేయిస్ ని తన దగ్గరకి రప్పించుకుంటాడు. ఒడీసియస్ తన పడవలో క్రిసేయిస్ ని తీసుకువెళ్ళి ఆమె తండ్రికి అప్పగించగా, అతను సంతృప్తి చెందిన వాడై గ్రీకు సైనికులని శాపం నుండి విముక్తి చెయ్యమని అపాలోని కోరుకుంటాడు. గ్రీసు కీ ట్రోయ్ కి మధ్య తాత్కాలికంగా యుద్ధ విరమణకి ఒప్పందం జరుగుతుంది.
గ్రీకు సేనలకి, ట్రోయ్ సేనలకి మధ్య యుద్ధం ఆగింది కానీ అక్ఖిల్లీస్ కి అగమెమ్నాన్ కీ మధ్య విరోధ జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. దేవతల రాజైన జూస్ ని కలుసుకోడానికి తీటస్ కి పన్నెండు రోజులు పట్టింది. జూస్ ట్రోయ్ పక్షం కాస్తే భార్య హేరాకి కోపం వస్తుంది; ఆమె గ్రీకుల పక్షం! కాని తీటస్ కోరికని కాదనలేకపోయాడు, జూస్. హేరాకి కోపం రానే వచ్చింది. మానవుల మధ్య జరుగుతూన్న ఈ పోరాటంలో దేవతలు తల దూర్చడం శ్రేయస్కరం కాదని ఆమె కొడుకు హెఫయెస్టస్ హేరాకి హితోపదేశం చేస్తాడు.
ఈలోగా ట్రోయ్ పక్షం వారు యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు. అప్పుడు జూస్ ట్రోయ్ పక్షం వహించి వారికీ సహాయం చెయ్యడానికి వస్తాడు. జూస్ ట్రోయ్ పక్షం కాయడం, అక్ఖిల్లీస్ అస్త్ర సన్యాసం చేసి ఇహ పోరాడనని భీష్మించుకుని కుర్చోవడం వల్ల గ్రీకు సేనలు బాగా నష్టపోతారు. చాల రోజులు జరిగిన ఆ భీకర పోరాటంలో పేరిస్-మెనలయస్ ల మధ్య, హెక్టర్-ఏజాక్స్ ల మధ్య జరిగిన ద్వంద్వ యుద్ధాలు చిరస్మరణీయమైనవి. అయినా సరే ట్రోయ్ సైన్యాలు గ్రీకు సేనా వాహినిని తరిమి కొట్టాయి.
భారత యుద్ధంలో వ్యాసుడు పద్దెనిమిది రోజుల యుద్ధాన్ని, దినాలవారీగా, వ్యూహాలవారీగా, అస్త్రాలవారీగా ఎలా వర్ణిస్తాడో హోమర్ కూడా అలా ఆ యుద్ధాన్ని వర్ణించుకుంటూ వస్తాడు. చిట్టచివరికి ట్రోయ్ నగరాన్ని పడగొట్టలేక గ్రీసు సేనలు పడవలలో ఎక్కి పారిపోతారు. ఆ హడావిడిలో ఒక కొయ్య గుర్రాన్ని సముద్రపుటొడ్డున వదిలేసి మరీ పోతారు. ట్రోయ్ సేనలు వారి విజయానికి ఆ గుర్రం ఒక అభిజ్ఞానం అనుకుంటూ దానిని ఈడుచుకుని పట్టణపు లోపలికి తీసుకుపోతారు. లోపలికి వెళ్లిన తరువాత ఆ కొయ్యగుర్రం తలుపులు తెరుచుకుని గ్రీకు సేనా వాహిని, యులిసిస్ నాయకత్వంలో, బయటకి వచ్చి ట్రోయ్ నగరాన్ని పరిపూర్ణంగా కొల్లగొట్టి పోతారు.
భారత యుద్ధం ధర్మయుద్ధానికి ప్రతీక అయితే ట్రోయ్ యుద్ధం దేవతల అగ్రహానికి, స్వల్పబుద్ధికి ప్రతీక అనుకోవచ్చు.
గ్రీకు తత్త్వవేత్త ప్లేటో (సా. శ. పూ. 428 - 348) తనకు సుమారు నాలుగువందల ఏళ్ల పూర్వుడైన హోమర్ రాసిన ‘ఇలియాడ్’ గురించి చెపుతూ ఇలా పేర్కొన్నాడు: “దాదాపు ప్రతిరోజూ ఏథెన్స్ నగరంలోని మార్కెట్ స్థలంలోనో, నాటక మందిరంలోనో, లేక కొండ పక్కనున్న విశాలమైన ఆరుబయలు మైదానంలోనో ఇరవైవేలకు పైగానే జనం పోగై, ఎవరో ఒక ప్రముఖ గాయకుడు ‘ఇలియాడ్’ లోని ‘హెక్టర్ మృతి’, ‘ప్రియాం రాజు - అక్ఖిల్లీస్ ల భేటీ’ మొదలగు రసవద్ఘట్టాలను శ్రావ్యంగా గానం చేస్తుంటే శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటారు.”
విశ్వ విజేత అలెగ్జాండర్ (సా. శ. పూ. 356 - 322) ‘ ఇలియాడ్’ గ్రంథాన్ని తన తలగడ కింద ఉంచుకుని, చదవాలని బుద్ధిపుట్టినప్పుడల్లా తీసి చదువుకునేవాడనీ, కుదిరినప్పుడల్లా ‘ఇలియాడ్’ లోని ఘట్టాలు కథాంశాలుగా జరిగే నాటక ప్రదర్శనలు తిలకించేవాడనీ చరిత్రకారులు పేర్కొన్నారు.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.