From Wikipedia, the free encyclopedia
అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క (హెర్బ్-herb). ఇది మూసా అను ప్రజాతికి, మ్యుసేసియె (musaceae) కుటుంబానికి చెందినది.[1] కూర అరటికి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. అరటి చెట్టు కాండము, చాలా పెద్ద పెద్ద ఆకులతో (సుమారుగా 2 నుండి 3 మీటర్లు పొడుగు) 4 నుండి 8 మీటర్లు ఎత్తు పెరుగుతాయి. అరటి పండ్లు సాధారణంగా 125 నుండి 200 గ్రాములు బరువు తూగుతాయి. ఈ బరువు వాటి పెంపకం, వాతావరణము, ప్రాంతముల వారీగా మారుతుంది. అరటి పండులో 80% లోపల ఉన్న తినగల పదార్థము ఉండగా, పైన తోలు 20% ఉంటుంది.
వ్యాపార ప్రపంచములోనూ, సాధారణ వాడకములోనూ వేలాడే అరటికాయల గుంపును గెల అంటారు. గెలలోని ఒక్కొక్క గుత్తిని అత్తము (హస్తము) అంటారు. చరిత్ర పరంగా అరటిచెట్లను పశ్చిమ పసిఫిక్, దక్షిణ ఆసియా దేశాలలో (భారత దేశంతో సహా) సాగు చేశారు.
చాలా రకాల అరటి పండ్ల రంగూ, రుచి, వాసన అవి పక్వానికి వచ్చే దశలో ఉష్ణోగ్రతల ఆధారంగా మారుతుంటాయి. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అరటిపండ్లు పాడయిపోయి పాలిపోవడం వల్ల వీటిని ఇండ్లలోని రిఫ్రిజిరేటర్లలో పెట్టరు. అలాగే రవాణా చేసేటప్పుడు కూడా 13.5 డిగ్రీ సెల్సియసు కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచరు.
2002 లోనే సుమారు 6.8 కోట్ల టన్నుల అరటిపండ్లు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడ్డాయి. ఇందులో 1.2 కోట్ల టన్నులు దేశాల మధ్య వ్యాపారపరంగా రవాణా చేయబడ్డాయి. ఈక్వడార్, కోష్టరికా, కొలంబియా, ఫిలిప్పైన్సు దేశాలు ప్రతి ఒక్కటీ పది లక్షల టన్నుల కన్నా ఎక్కువ అరటి పండ్లు ఎగుమతి చేస్తున్నాయి.
అరటిలో పిండిపదార్థాలు/చక్కెరలు (కార్బోహైడ్రేటులు) ఎక్కువ ఉంటాయి. ప్రతి 100 గ్రాముల అరటిలో 20 గ్రాముల పిండిపదార్థాలు, 1 గ్రాము మాంసకృత్తులు, 0.2 గ్రాములు కొవ్వు పదార్థాలు, 80 కిలోక్యాలరీల శక్తి ఉన్నాయి. అరటి సులభంగా జీర్ణమై మలబద్ధకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
భారతదేశములో మొత్తం 50 రకాల అరటిపండ్లు లభిస్తున్నాయి. వాటిలో కొన్ని రకాలు: పచ్చ అరటిపండ్లు, చక్కెరకేళి, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి, ముకిరీ, కర్పూరం. వీటి నుండి చిప్సు కూడా తయారు చేస్తారు.
అరటి చెట్టు ఆసియా వాయువ్య దేశాలలో పుట్టింది. ఇప్పటికీ కూడా చాలా రకాల అడవి అరటి చెట్లు న్యూ గినియా, మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్సు లలో కనపడతాయి. ఇటివల దొరికిన పురావస్తు, శిలాజవాతావరణ శాస్త్ర ఆధారాలను బట్టి పపువా న్యూ గినియా లోని పశ్చిమ ద్వీప ఖండములోని కుక్ స్వాంపు వద్ద క్రీస్తు పూర్వం 8000 లేదా 5000 సంవత్సరాల నుండే అరటి తోటల పెంపకం సాగినట్లు నిర్ధారించారు. కాబట్టి న్యూ గినియాలో తొలి అరటి తోటల పెంపకం జరిగినట్లు నిర్ధారించవచ్చు. తరువాత ఇతర అడవి అరటి జాతులు దక్షిణ ఆసియా ఖండములో పెంపకము చేసినట్లు భావించవచ్చు.
వ్రాత ప్రతులలో మొదటిసారిగా అరటి ప్రస్తావన మనకు క్రీస్తు పూర్వం 600 సంవత్సరములో వ్రాసిన బౌద్ధ సాహిత్యంలో కనపడుతుంది. అలెగ్జాండరు తొలిసారిగా క్రీస్తు పూర్వం 327 వ సంవత్సరములో భారత దేశంలో వీటి రుచి చూశాడు.[2] చైనాలో క్రీస్తు శకం 200 సంవత్సరము నుండి అరటి తోటల పెంపకం సాగినట్లుగా మనకు ఆధారాలు లభ్యమవుతున్నాయి. క్రీస్తు శకం 650 వ సంవత్సరములో ముస్లిం దండయాత్రల వల్ల అరటి పాలస్తీనా ప్రాంతానికీ, తరువాత ఆఫ్రికా ఖండానికీ వ్యాప్తి చెందింది.
వందగ్రాముల అరటిలో వున్న పోషకాలు |
---|
|
క్రీస్తుశకం 1502 లో పోర్చుగీసు వారు తొలిసారిగా అరటి పెంపకాన్ని కరేబియన్, మధ్య అమెరికా ప్రాంతములలో మొదలుపెట్టారు.
అరటిపండ్లు రకరకాల రంగులలో, ఆకారాల్లో లభిస్తున్నాయి. పండిన పండ్లు తేలికగా తొక్క వలుచుకొని తినడానికీ, పచ్చి కాయలు తేలికగా వంట చేసుకుని తినడానికీ అనువుగా ఉంటాయి. పక్వ దశను బట్టి వీటి రుచి వగరు నుండి తియ్యదనానికి మారుతుంది. 'పచ్చి' అరటికాయలను వండటానికి ఉపయోగిస్తారు. కొన్ని ఉష్ణమండల ప్రాంతాల్లోని ప్రజలకు ఇది ప్రధాన ఆహారం.
నిఖార్సయిన అరటి పండ్లు చాలా పెద్ద పెద్ద విత్తనాలను కలిగి ఉంటాయి, కానీ విత్తనాలు లేకుండా రకరకాల అరటి పండ్లను ఆహారం కోసం అభివృద్ధి చేసారు. వీటి పునరుత్పత్తి కాండం యొక్క తొలిభాగాల ద్వారా జరుగుతుంది. వీటిని పిలకలు, అరటి పిల్లలు అంటారు. కొన్ని పర్యాయములు ఈ పిలకలను పూలు అనికూడా పిలవడం పరిపాటి. ఒకసారి పంట చేతికి వచ్చిన తరువాత అరటి చెట్టు కాండాన్ని నరికివేసి, ఈ పిలకలను తరువాతి పంటగా ఎదగనిస్తారు. ఇలా నరికిన కాండం బరువు సుమారుగా 30 నుండి 50 కేజీలు ఉంటుంది.
అరటి చెట్లతో పాటు అరటి పువ్వును (దీనిని తరచూ అరటి పుష్పం లేదా అరటి హృదయం అని అంటారు) బెంగాలీ వంటలలో, కేరళ వంటలలో ఉపయోగిస్తారు. అరటి కాండములోని సున్నితమైన మధ్య భాగం (దూట) కూడా వంటలలో ఉపయోగిస్తారు - ముఖ్యముగా బర్మా, కేరళ, బెంగాలు, ఆంధ్ర ప్రదేశ్ లలో. అరటి పూవు జీర్ణ క్రియ తేలికగా జరిగి సుఖ విరోచనము అగును . ఇందులోని ఐరన్, కాల్సియం, పొటాసియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, వగైరాలు నాడీ వ్యవస్థ మీద ప్రభావంచూపి సక్రమముగా పనిచేసేటట్లు దోహదపడును . ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని అభివృద్ధి చేయును . ఆడువారిలో బహిస్టుల సమయంలో అధిక రక్తస్రావము అరికట్టడానికి ఇది పనికొచ్చును. మగవారిలో వీర్య వృద్ధికి దోహద పడును.
అరటి ఆకులు చాలా సున్నితంగా, పెద్దగా సౌలభ్యంగా ఉంటాయి. ఇవి తడి అంటకుండా ఉంటాయి, అందువల్ల వీటిని గొడుగుకు బదులుగా వాడతారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోను, చైనా, జోంగ్జీ, మధ్య అమెరికాలలో వీటిని వంటకాలు చుట్టడానికి ఉపయోగిస్తారు.
అరటి పండు ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. భారతదేశంలో, మామిడి పండు తరువాత, రెండవ ముఖ్యమైన పండ్ల పండు అరటి, సంవత్సరం పొడవునా లభిస్తుంది, సరసమైన, పోషకమైనది, రుచికరమైనది,ఔషధ విలువలను కలిగి ఉంది, ఇతర దేశాలకు అరటి పళ్లను ఎగుమతి చేయవచ్చును. ప్రపంచవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ రకాల అరటిపండ్లు ఉన్నాయి. అయితే, భారతదేశంలో 15 నుండి 20 రకాలు మాత్రమే ప్రధానంగా వ్యవసాయానికి ఉపయోగించబడుతున్నాయి. వాణిజ్యపరంగా, అరటిని తినే పండ్ల (డెజర్ట్) రకాలు & వంటలలో ఉపయోగించే (పాక) రకాలుగా వర్గీకరించారు. పాక రకాల్లో పిండి పదార్ధాలు ఉండి, అవి పరిపక్వం చెందని రూపంలో కూరగాయలుగా ఉపయోగించబడతాయి. రోబస్టా, మంథన్, పూవాన్, మరుగుజ్జు కావెండిష్, నంద్రన్, ఎర్ర అరటి, బస్రాయి, అర్ధపురి, నయాలీ, సఫేద్ వెల్చి రస్తాలీ, కర్పుర్వల్లి మొదలైనవి ముఖ్యమైన పంటలు.[3]
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో పండించే అరటి రకాలు:
కర్ణాటక - రోబస్టా, రస్తాలీ, డ్వాఫ్ కావెండిష్, పూవన్, మంథన్, ఎలకిబలే
కేరళ - నెండ్రన్ (అరటి), పాలయంకోడన్ (పూవన్), రస్తాలీ, మంథన్, రెడ్ బననా, రోబస్టా
ఆంధ్రప్రదేశ్ - డ్వాఫ్ కావెండిష్, రస్తాలీ, రోబస్టా, అమృత్పంత్, తెల్లాచక్రేలి, చక్రకేలి, మంథన్, కర్పూర పూవన్, యెనగు బొంత, అమృతపాణి బంగాళా
తమిళనాడు - రోబస్టా, విరూపాక్షి, రెడ్ బనానా, పూవన్, రస్తాలీ, మంథన్, కర్పూరవల్లి, నేంద్రన్, సక్కై, పెయాన్, మత్తి
అస్సాం - జహాజీ, చిని చంపా, మల్భోగ్, హోండా, మంజహాజీ, బోర్జాజీ (రోబస్టా), చినియా (మనోహర్), కాంచ్కోల్, భీమ్కోల్, డిగ్జోవా, కుల్పైట్, జతికోల్, భరత్ మోని
జార్ఖండ్ - బస్రాయి, సింగపురి
బీహార్ - చినియా, డ్వాఫ్ కావెండిష్, అల్పోన్, చిని చంపా, కోథియా, మాల్బిగ్, ముథియా, గౌరియా
గుజరాత్ - లకాటన్, డ్వాఫ్ కావెండిష్, హరిచల్ (లోఖండి), గాందేవి సెలక్షన్, బస్రాయ్, రోబస్టా, జి-9, శ్రీమతి
మధ్యప్రదేశ్ - బస్రాయ్
మహారాష్ట్ర - డ్వాఫ్ కావెండిష్, శ్రీమంతి, బస్రాయ్, రోబస్టా, లాల్ వెల్చి, సఫేడ్ వెల్చి, రాజేలి నేంద్రన్, గ్రాండ్ నైన్, రెడ్ బనానా
ఒరిస్సా - డ్వాఫ్ కావెండిష్, రోబస్టా, చంపా
పశ్చిమ బెంగాల్ - మోర్ట్మాన్, చంపా, డ్వాఫ్ కావెండిష్, జెయింట్ గవర్నర్, సింగపురి.
ఇతర దేశాలలో దేశాలలో సాగుబడిలో ఉన్న ఇతర జాతి అరటి పండ్లు ఈ విధంగా ఉన్నాయి.[4] అవి డ్వాఫ్ కావెండిష్, జెయింట్ కావెండిష్, పిసాంగ్ మసాక్ హిజావు, ఐస్ క్రీం, 'ఎనానో గిగాంటే, మాచో, ఒరినోకో.
బ్రెజిల్ దేశములో రోబస్టా, శాంటా కాటారినా సిల్వర్, బ్రెజిలియన్.
చైనా దేశములో డ్వాఫ్ కావెండిష్
దక్షిణ ఆఫ్రికా దేశములో డ్వాఫ్ కావెండిష్, గోల్డెన్ బ్యూటీ
ఆస్ట్రేలియాలో రోబస్టా, విలియమ్స్, కోకోస్,
తూర్పు ఆఫ్రికా, థాయ్ లాండ్ దేశాలలో బ్లగ్గో, మారికోంగో, కామన్ డ్వాఫ్
ఫిలిప్పీన్స్ లో కామన్ డ్వాఫ్, ఫిలిప్పైన్ లకాటన్
తైవాన్ లో జెయింట్ కావెండిష్
అరటి శుభ సూచకం అందుచేత అరటిని శుభకార్యాలలో తప్పకుండా వినియోగిస్తారు. దీని వెనుక ఒక ఇతిహాస సంబంధమైన కథ కూడా ఉంది. ఒకప్పుడు దుర్వాసమహాముని సాయంసంధ్యవేళ కూడా ఆదమరచి నిద్రపోతున్నప్పుడు ఆయన భార్య (కదలీ) సంధ్యావందనం సమయం అయిన కారణమున ఆయనను నిద్ర నుండి మేలుకొల్పుతుంది. దుర్వాసుడు నిద్ర నుండి లేచి చూస్తే ఆయన నేత్రాల నుండి వచ్చిన కోపాగ్నికి ఆవిడ భస్మరాశి అయిపోతుంది. కొన్ని రోజుల తరువాత దుర్వాస మహర్షి మామ గారు తన కూతురు గురించి అడుగగా ఆవిడ తన కోపాగ్ని వల్ల భస్మరాశి అయినది అని చెప్పి, తనమామ గారి ఆగ్రహానికి గురి కాకుండా ఉండేందుకు దుర్వాసముని తన భార్య శుభపద్రమైన కార్యాలన్నింటిలో కదలీ ఫలం (సంస్కృతంలో కదలీ ఫలం అంటే అరటిపండు) రూపంలో వినియోగించబడుతుంది అని వరాన్ని ఇస్తాడు.
అరటి కాయలలో రెండు రకాలున్నాయి. ఒక రకం పండించి పండు మాగిన తరువాత తినడానికి ఉపయోగపడేవి. రెండో రకం కేవలం కూరలలో ఉపయోగపడేవి. ఇవి కూడా పండు మాగుతాయి కాని అంత రుచిగా వుండవు. వీటికి తోలు చాల మందంగా, గట్టిగా ఉంటుంది. వీటిని కూరలలో, ఇతర వంటకాలలో మాత్రమే ఉపయోగిస్తారు.
కూర అరటి రకాలు |
---|
|
అరటి పంటకు మంచి సారవంతమైన ఒండ్రునేల కలిగిన డెల్టా భూముల్లో, నీరు బాగా ఇంకిపోయే భూములు అనుకూలం. ఇసుకతో కూడిన గరపనేలల్లో కూడా ఈ పంట పండించవచ్చు. భూమి 1మీ. కంటే లోతుగా ఉండి, 6.5-7.5 మధ్య ఉదజని సూచిక కలిగి, ఎలక్ట్రికల్ కండక్టివిటి 1.0 మీ.మోస్ కంటే తక్కువ కలిగిన భూములు అనుకూలము. నీరుసరిగా ఇంకని భూముల్లో, చవుడు భూములు, సున్నారపు నేలలు, గులక రాల్లు, ఇసుక భూములు ఈ పంటకు పనికి రావు.[5]
అరటికి చీడపీడల బెడద కొద్దిగా ఎక్కువ. దానికి కారణాలలో ఒకటి జన్యుపరమైన వైవిధ్యము లేకపోవడము అని భావిస్తారు. ఇవి ఎక్కువగా స్వపరాగ సంపర్కము వల్ల వృద్ధిపొందటము వల్ల జన్యుపరమైన వైవిధ్యము లేకపోవడానికి కారణంగా భావిస్తారు. కాండము ద్వారా ఫలదీకరణము చేయుపద్ధతి వల్ల వైరసులు చాలా తేలికగా వ్యాపిస్తాయి.
అరటిపండులో[6] ముందే చెప్పుకున్నట్లు 74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది. 23% కార్బోహైడ్రేటులు, 1% ప్రోటీనులు, 2.6% ఫైబరు ఉంటుంది. ఈ విలువలు వాతావరణాన్ని, పక్వదశనుబట్టి, సాగు పద్ధతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. పచ్చి అరటిపండులో కార్బోహైడ్రేటులు స్టార్చ్ రూపములో ఉంటాయి, పండుతున్న కొద్దీ ఇవి చక్కరగా మార్పుచెందబడతాయి. అందుకే పండు అరటి తియ్యగా ఉంటుంది. పూర్తిగా మాగిన అరటిలో 1-2% చక్కర ఉంటుంది. అరటిపండు మంచి శక్తిదాయకమైనది. అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా విలువైన ఆహారం. అరటిపండు, పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం. అందుకే అరటి పండు పేదవాడి ఆపిలు పండు అని అంటారు. ఎందుకంటే, రెండింటిలోనూ పోషక విలువలు సమానంగానే ఉంటాయి. కాని, అరటి పండు చవక, ఆపిలు పండు ఖరీదు.
అరటి పళ్లలోని పోషక విలువల గురించి దాదాపు అందరికీ తెలుసు. పండిన అరటి పళ్లలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బీ3, విటమిన్ సీలతోపాటు కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉన్నాయి. భారతదేశంలో పూర్వము నుంచి వీటిని ఔషధాల్లో వాడుతున్నారు. పళ్లు, ఆకులు, పువ్వులు, అరటి దవ్వ ఇలా అన్నింటినీ వైద్యంలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో భాగంగా మధుమేహ నివారణకు అరటి పువ్వు, దవ్వలను ఉపయోగిస్తుంటారు. అరటి కాండం లోపలి రసాన్ని కీటకాలు కుట్టినప్పుడు, కుష్టు రోగ నివారణలో ఉపయోగిస్తుంటారు. రక్తపోటు, నిద్రలేమి లాంటి ఒత్తిడి సంబంధిత వ్యాధుల నివారణలోనూ అరటి ఉపయోగం ఉన్నది.[7]
అరటితో రకరకాలైన వంటకాలు చేసుకోవచ్చు. అరటి కూర, అరటి వేపుడు, అరటి బజ్జీ మొదలైనవి. అరటితో అల్పాహారాలు, అరటి పండు రసాలు కూడా చేసుకోవచ్చు. బనానా చిప్స్ అనునది అరటి కాయ నుండి తయారు చేయు ఓ అల్పాహారం. ఇది ప్రపంచ వ్యాప్తంగా బహు ప్రసిద్ధి. చాలా కంపెనీలు దీని వ్యాపారం లాభదాయకంగా నిర్వహిస్తున్నాయి. భారతదేశంలో, ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్ లోని నగరాలు, పట్టణాలలో ఇవి చాలా విరివిగా లభిస్తాయి. మామూలు బంగాళదుంప లేదా ఆలూ చిప్స్ కన్నా కొద్దిగా మందంగా ఉంటాయి. కేరళ వాళ్ళు వీటిని కొబ్బరి నూనెతో వేయించి తయారు చేస్తారు. అవి ఓ ప్రత్యేకమైన వాసన, రుచి కలిగి ఉంటాయి. అరటి పండ్లను జాం తయారు చెయ్యడంలో కూడా ఉపయోగిస్తారు. అరటి పండ్లను పండ్ల రసాలు తయారు చేయడం లోనూ, ఫ్రూట్ సలాడ్ లలోనూ, ఉపయోగిస్తారు. అరటి పండ్లలో సుమారుగా 80% నీళ్ళు ఉన్నప్పటికీ, చారిత్రకంగా వీటినుండి రసం తీయడం అసాధ్యంగా ఉండినది, ఎందుకంటే వీటిని మిక్సీలో పట్టినప్పుడు అది గుజ్జుగా మారిపోతుంది. కానీ 2004 వ సంవత్సరంలో భాభా ఆటామిక్ పరిశోధనా సంస్థ (బార్క్) వారు ఓ ప్రతేకమైన పద్ధతి ద్వారా అరటి పండ్లనుండి రసాలు తయారు చేయడం రూపొందించి, పేటెంటు పొందినారు. ఈ పద్ధతిలో అరటి పండ్ల గుజ్జును సుమారుగా నాలుగు నుండి ఆరు గంటల పాటు ఓ పాత్రలో చర్యకు గురిచేయడం ద్వారా పండ్ల రసాన్ని వెలికితీస్తారు.
పూర్వం అతిథులు ఇంటికి వచ్చినప్పుడు అరటి ఆకులో భోజనం పెట్టేవారు. అరటి ఆకులోని భోజనంలో విషం కలిపితే ఆకు నల్లగా మారిపోతుంది. అందుకే ఇంటికి వచ్చిన అతిథుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే అరటి ఆకులో భోజనం పెట్టేవారు.[10]
ఇతరుల ఇండ్లకు లేదా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు భోజనం చేసిన తరువాత అరటి ఆకు మనవైపు మడవాలి. అటువైపు మడిస్తే సంబంధాలు చెడిపోతాయని నమ్మకం.
ఓ దశాబ్దంలో ఆహారంగా స్వీకరించు అరటి జాతి అంతరించు ప్రమాదంలో ఉంది. ప్రస్తుతము ప్రపంచ వ్యాప్తముగా తిను కావెండిషు అరటి (మన పచ్చ అరటి ?) జన్యుపరంగా ఎటువంటి వైవిధ్యాన్నీ చూపలేకపోవడం వల్ల వివిధ రకాల వ్యాధులకు గురిఅవుతుంది. ఉదాహరణకు 1950 లో పనామా వ్యాధి, ఇది నేల శిలీంధ్రము (ఫంగస్) వల్ల వచ్చి బిగ్ మైక్ రకానికి చెందిన అరటి జాతిని పూర్తిగా తుడిచిపెట్టినది. నల్ల సిగటోక (black sigatoka) వ్యాధి. ఇది కూడా మరో రకం శిలీంధ్రము వల్ల వచ్చిన వ్యాధే కానీ చాలా త్వరితగతిన వ్యాపించింది. ముఖ్యముగా మధ్య అమెరికా లోనూ ఆఫ్రికా, ఆసియా ఖండములలో ఇది వ్యాపించింది.
ట్రోపికల్ జాతి 4 అనబడు ఓ క్రొత్త వ్యాధికారకము కావెండిషు (పచ్చ అరటి?) జాతికి చెందిన అరటితోటలపై ప్రభావం చూపుతుంది. దీని ప్రభావము వల్ల... వాయువ్య ఆసియాలో అందువల్ల ఇక్కడినుండి వచ్చే అరటి ఎగుమతులపై కొద్దిగా జాగ్రత్త వహించడం ప్రారంభం అయింది. ఈ వ్యాధి వ్యాపించకుండా ఇతర దేశాలవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొంటూ మట్టినీ, అరటి పండ్లను జాగ్రత్తగా పరిశీలించసాగారు.
గ్రాస్ మికేలు లేదా బిగ్ మైక్ అను రకానికి చెందిన అరటిది ఒక విషాద కథ. ఇది పనామా వ్యాధి వల్ల 1950లో పూర్తిగా తుడిచిపెట్టబడింది. ఈ బిగ్ మైక్ రకం సమ శీతల, లేదా శీతల దేశాలకు ఎగుమతి చేయడానికి చాలా అనువుగా ఉండేది. కొంతమంది ఇప్పటికీ దీని రుచిని మరిచిపోలేక ప్రస్తుతము లభిస్తున్న పచ్చ అరటి కన్నా బిగ్ మైక్ రుచికరంగా ఉంటుంది అంటూ వాదిస్తుంటారు! అంతే కాకుండా రవాణాకు కూడా బిగ్ మైక్ చాలా అనుకూలంగా ఉండేది, అదే పచ్చ అరటి రవాణా విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది.
అరటి ప్రపంచంలో ఎక్కువగా తినే పండు. కానీ చాలామంది అరటి సాగుబడిదారులకు మాత్రం మిగిలేది, లేదా గిట్టుబాటయ్యేది చాలా స్వల్ప మొత్తాలలోనే. మధ్య అమెరికా ఎగుమతులలో అరటి, కాఫీ సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ఎగుమతులలో ఇవి రెండు కలిపి 1960లో 67 శాతం వాటా కలిగిఉన్నాయి. బనానా రిపబ్లికు అను పదం స్థూలంగా మధ్య అమెరికాలోని అన్ని దేశాలకూ వర్తించినప్పటికీ నిజానికి కోస్టారికా, హోండూరస్, పనామాలు మాత్రమే నిజమైన బనానా రిపబ్లికులు. ఎందుకంటే వీటి ఆర్థికవ్యవస్థ మాత్రమే అరటి వ్యాపారంపై ఆధారపడి ఉంది.
అరటి పండు చాలా ప్రముఖమైన, ప్రసిద్ధి పొందిన పండు. ఇది చాలా మందికి ఇష్టమైన పండు. కానీ కోతులు, కొండముచ్చులు అరటిపండును రకరకాల పద్ధతిలో తినే ఫోటోలు చాలా ప్రసిద్ధి పొందటంవల్ల ఈ అరటి పండు అనే పదాన్ని కొన్ని ప్రాంతాలలో జాతిపరమైన అపహాస్యములకు ఉపయోగించారు. ముఖ్యముగా ఆటగాళ్ళపై అరటిపండు తొక్కలు విసిరివేయడం, కుళ్ళిన టమాటాలు, కోడిగుడ్లు అంత ప్రసిద్ధి. మలేషియాలోనూ, సింగపూరులోనూ అరటిపండును చైనీసు భాష రాని, లేదా ఎక్కువగా ఆంగ్లేయుడిలాగా ప్రవర్తిస్తున్న చైనీయునికి పర్యాయపదంగా వాడతారు. ఎందుకంటే అరటిపండుకూడా పైన పసుపు, లోన తెలుపు కాబట్టి.
బాల సాహిత్యంలో "అరటిపాట" అనే పాట ప్రాచుర్యం పొందింది. సరళమైన ఈ పాట ఆరంభ తరగతుల పుస్తకాలలో పాఠ్యాంశంగా కూడా చేర్చారు.
ఆదివారము నాడు అరటి మొలిచింది
సోమవారము నాడు సుడి వేసి పెరిగింది
మంగళవారము నాడు మారాకు తొడిగింది
బుధవారము నాడు పొట్టి గెల వేసింది
గురువారమునాడు గుబురులో దాగింది
శుక్రవారము నాడు చక చకా గెల కోసి
అందరికి పంచితిమి అరటి అత్తములు
అబ్బాయి, అమ్మాయి అరటి పండ్లివిగో
Seamless Wikipedia browsing. On steroids.