శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం, చలనచిత్ర సంగీతం, ఇండియన్ రాక్, ఇండియన్ పాప్ బహుళ రకాలను కలిగి ఉం From Wikipedia, the free encyclopedia
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి: అన్నారు పెద్దలు. ఆది ప్రణవనాదమైన ఓంకారం నుండి ఉధ్బవించినదిగా చెప్పబడే సంగీతం గురించి చూద్దాం.
|
సంగీత నాట్యకళలు భారతజాతి అంత ప్రాచీనమైనది. భారతీయ సంగీతానికి మూలం వేదాలు - వేదాలలోని స్వరాలు. ఋగ్వేదం మంత్రాల గురించి వివరిస్తుంది. ఈ మంత్రాలకు మొన్ని లయాత్మక పదాలు చేర్చి పాడేవారు. వీటిని 'స్తోభాలు' అంటారు. రుగ్వేద కాలంలో ఉదాత్త, అనుదాత్త, స్వరిత అనే స్వరాలు ఉచ్ఛరించేవారు. కాలక్రమేణా వీటిని ఉచ్ఛ, వచ, స్వర, విశిష్టలతో సృష్టించారు. ఈ విధానం తరువాత ఏకస్వరమైన ఆర్చిక పఠనంగా మరింది. యజ్ఞయాగాలు జరిపే సమయంలో హాత, ఉద్గాత, సామిక అనే పేర్లతో స్వరాలను పాడేవారు. వేదకాలంలో ఏక (ఆర్చిక), ద్విశ్వరాలు (గాధిక్యం), దిస్వర (సామిక) పేర్లతో రూపొందింది. కాలక్రమేణా చతుస్వరి (నాలుగు), పంచస్వరి (ఐదు), షట్స్వరి (ఆరు), సప్తస్వరి (ఏడు) గా మారాయి. కాలక్రమంగా సప్తస్వర యుక్తమైన ఒక స్థాయిని మన పూర్వీకులు అందించారు.
సామవేదము భారతీయ సంగీతానికి మూలం. ఇందులో ఏడు నుండి పది స్వరాలు వాటి సంగతులున్నాయి. ఇవి వికార, విశ్లేష, వికర్షణ, అభ్యాస, విరామ, స్తోభాలు మొదలైనవి. అవి ఈనాటికీ సంగీతంలో గమకాలుగా ఉంటాయి. మరికొంత కాలానికి సంగీతంలో వాది-సంవాది, ఆరోహణ-అవరోహణ, మంద్ర-తారా స్థాయిలు మొదలైన ప్రక్రియలు వచ్చాయి.
భారతీయ సంగీతము అనేక సంప్రదాయ రీతులలో భాసిల్లుచున్నది. వాటిలో ముఖ్యమైనవిగా కర్ణాటక, హిందుస్థానీ సంగీత సంప్రదాయములు చెప్పబడుచున్ననూ, ప్రసిద్ధములైన యితర సంప్రదాయములూ ఉన్నాయి. వాటిని గురించి ఈ దిగువన ప్రస్తావించెదము.
చెవుల కింపైన దేదైనా కర్ణాటక సంగీతమే. కాని దక్షిణాదిలో ప్రాచుర్యం పొందిన సంగీత బాణీని కర్ణాటక సంగీతమనీ, దాక్షిణాత్య సంగీతమని అంటారు. ఇందులో శాస్త్రీయ సంగీతం పండితరంజకంగా ఉంటే, ఇతర రకారలైన సంగీత రూపాలు దెశకాలపరిస్థితుల కనుగుణంగా, పామర రంజకంగా అభివృద్ధి చెందాయి.
సామవేద జనితమైన సంగీతం ఉత్తరాదిన మొగలుల ప్రభావంతో మార్పులు చెంది నేడు ప్రచారంలో ఉన్న హిందూస్తానీ సంగీతంగా ప్రచారంలో ఉంది. ఇది ముఖ్యంగా రాజాస్థానాల్లో పాడబడేది. దీనిలో అనేక బాణీలు జనించాయి.
ఈ సంగీత సంప్రదాయము భక్తి రస ప్రధానము. ఈ సంప్రదాయము ఆయా వాగ్గేయకారుల పద్యములు, భజనలు, సంస్కృత శ్లోకములను కలిగి వుండును. సాధారణముగా శ్లోకముల వంటివాటికి తాళము చెప్పబడదు.
ఇది పురాణేతిహాసములలోని ప్రధాన ఇతివృత్తములను ఆధారముగా చేసికొని సాగే సంగీత కథనము. దక్షిణ భారతదేశమందు ప్రసిద్ధి చెందిన ఈ ప్రక్రియయందు ప్రధాన గాయకుడు కథాభాగమునకు శ్లోకములు, కీర్తనలు మేళవించి రసరమ్యముగా ఆలపించును.
దక్షిణ భారతదేశమందు ఖ్యాతినొందిన శాస్త్రీయ నృత్యములగు భరత నాట్యము, కూచిపూడి, మొదలగునవి కర్ణాటక సంగీతముపై మిక్కిలి ఆధారపడియున్నవి. తిల్లానా, పదము, జావళి, మొదలగునవి సంగీత కచేరీలయందును, నృత్య ప్రదర్శనలయందును ముఖ్య భాగములుగా పరిగణింపబడుచున్నవి. నృత్యమున ఉపయుక్తములగు కృతులు నృత్తమునకు, అభినయమునకు అనుగుణముగా మార్పు చేయబడును అనగా, కాల భేదము చూపబడును.
భారతదేశము జానపద సంగీతానికి పట్టుకొమ్మ. కొన్ని జానపద గేయాలు శతాబ్దాలనుండి తరువాతి తరముల వారికి అందింపబడుతున్నాయి. ఇక పోతే, చక్కటి గతులతో హృదయాన్ని హత్తుకునేలా ఉండటం దీని ప్రత్యేకత. ఇప్పటికీ పల్లెటూర్లలో జానపదాలు వినవస్తాయి. శాస్త్రీయ సంగీతం లోని ఆనంద భైరవి వంటి రాగాలు కొన్ని జానపద సంగీతం నుండి వచ్చినవే. చాలా మటుకు సినిమా సంగీతం కూడా జానపదాల మీద ఆధారపడి ఉంది.)
కర్ణాటక సంగీతములో చాలా రకాల రచనలు ఉన్నాయి. అవి
వివిధ రాగ, తాళములకు కూర్చబడ్డ స్వరయుక్తమైన చిరు రచనలు గీతములు. తాళాధ్యయనము కొరకై నేర్వబడు అలంకారముల తరువాత గీతములు చెప్పబడును. విద్యార్థికి గీతముల ద్వారా రాగసంబంధమైన స్వరసంచారాదులు పరిచయం చేసెదరు.
గీతముల తర్వాత స్వర సాహిత్య యుక్తమైన స్వరజతులు నేర్పబడును. స్వరజతులయందు పల్లవి అనుపల్లవి చరణములను మూడు భాగములుండును. వీటిని నృత్యమునందు ఉపయోగించరు.
స్వరజతి వలె వుండే జతిస్వరంలో కేవలం జతులు స్వరములు మాత్రమే వుండును. ఇవి భరత నాట్యం లోని నృత్త వరుసలకు యుక్తములు. నృత్తమనగా కథనరహిత వరుసలు. స్వరము లేక పదముల బదులు వాడబడే ధీం, తాం, తోం, నం, ఝం, తకిట, తరికిట, మొదలైనవి జతులనబడును.
నాట్యంలో మాదిరిగానే సంగీతంలో కూడా వర్ణానికి చాలా ప్రాముఖ్యముంది. గీతములు స్వరజతుల మల్లే రాగస్వరూపాన్ని నేర్చుట కోసం వర్ణములు ఉపయుక్తములు. సంగీత కచేరీలలో ప్రారంభంలో వర్ణమును పాడుట కూడా సంప్రదాయమున ఉంది. వర్ణములు ముఖ్యముగా తాన వర్ణములు, పద వర్ణములు, దరు వర్ణములు అని మూడు రకాలు. తాన వర్ణములు చిఱు సాహిత్యముతో ప్రారంభమవుతాయి. పల్లవి అనుపల్లవి చరణములు మాత్రమే సాహిత్యమును కలిగి వుంటాయి. చిట్ట ముక్తాయి స్వరములు సాహిత్యరహితములు. అదే పద వర్ణమయితే చిట్ట ముక్తాయి స్వరములకు కూడా సాహిత్యముండును. పద వర్ణములు నాట్యంలో బాగా ప్రసిద్ధములు. దరు వర్ణములో స్వర సాహిత్యములే గాక జతులు కూడా వుంటాయి. వర్ణములు రచించిన వారిలో రామస్వామి దీక్షితులు, పల్లవి గోపాల అయ్యర్, తంజావూర్ చతుష్టయము (చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు, శివానందం), పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మొదలైన వారు ముఖ్యులు.
కీర్తనలలో సంగీతానికన్నా సాహిత్యానికి ప్రాముఖ్యత ఎక్కువ. అంటే రాగానికి కాక భావానికి ప్రాధాన్యత ఎక్కువన్నమాట. నవవిధ భక్తులలో ఒకటైన భగవంతుని కీర్తనకు అనువైనవి కీర్తనలు. ఇంకోలా చెప్పాలంటే కీర్తనలు భక్తిరస ప్రధానమైనవి. కీర్తనలనగానే మనకి గుర్తుకొచ్చేవి ఈనాడు అధిక ప్రాచుర్యంలో ఉన్న త్యాగరాజస్వామి వారి దివ్యనామ ఉత్సవ సాంప్రదాయ కీర్తనలూ అన్నమయ్య కీర్తనలూ రామదాస పురందరదాస కీర్తనలూను. తమిళ కవులు ముత్తు తాండవర్, అరుణాచల కవిరాయర్, గోపాలకృష్ణ భారతి మున్నగువారి రచనలు కూడా ఈ కోవకే వస్తాయి.
కృతులు కీర్తనలనుండే పుట్టాయని ఒక వాదం ఉంది. కృతులలో సంగీతం ప్రధానం. అయితే హిందుస్థానీ సంప్రదాయంలా కాక కర్ణాటక సంప్రదాయంలో సాహిత్యం తప్పనిసరి. రాగభావాన్ని వ్యక్తీకరించడం కృతుల ముఖ్య లక్షణం. కర్ణాటక సంగీతపు త్రిమూర్తులుగా పిలువబడే త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రుల రచనలు కృతుల ప్రపంచంలో అగ్రతాంబూలాన్ని అందుకుంటాయి. వీరు ముగ్గురే కాక మైసూరు వాసుదేవాచార్యులు, హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్, సుబ్బరాయ శాస్త్రి, మహారాజా స్వాతి తిరునాళ్, పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్, పాపనాశం శివన్, కోటీశ్వర అయ్యర్ వంటి వాగ్గేయకారులు కృతి సాంప్రదాయంలో దిగ్గజాలు.
రాగమాలిక అంటే రాగములతో కూర్చబడ్డ దండ. రాగమాలికలంటే ఒకే కృతిలోగానీ పదములలోగానీ వర్ణంలోగానీ వివిధ భాగాలు వివిధ రాగాలలో వుంటాయి. రాగమాలికలైన పల్లవులు, కల్పన స్వరములు కూడా మనోధర్మ సంగీతంలో ఉన్నాయి. ఒక రాగం నుండి మరొక రాగానికి మార్పిడి చాలా మృదువుగా వుంటుంది. ముత్తుస్వామి దీక్షితులు, మహారాజా స్వాతి తిరుణాళ్, సీతారామయ్య, రామస్వామి దీక్షితులు మున్నగువారలు రాగమాలికా రచనలలో ప్రసిద్ధులు. మహా వైద్యనాథ అయ్యర్ గారిచే రచింపబడిన ఒక 72 మేళకర్తరాగమాలిక కూడా ఉంది.
తాళమాలికలంటే వివిధ తాళములకు కూర్చబడిన రచనలు. ఒకే కృతిలోగానీ తిల్లానాలోగానీ వివిధ తాళగతులుంటాయి. తిరువొట్రియూర్ త్యాగయ్య తాళమాలికలు బాగా ఆదరణ పొందాయి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ వ్రాసిన గతిభేదతిల్లానా కూడా జనాదరణ పొందింది.
ఈ సంగీత ప్రక్రియలో ప్రతిభాగానికీ రాగమూ తాళమూ రెండూ మార్పుచెందుతాయి. 108 వివిధ రాగతాళములతో రామస్వామి దీక్షితులు ఒక రాగతాళమాలికను చేసారు.
నృత్య సంగీతాలలో శృంగార, భక్తి రస ప్రధానమైన వీ పదములు. పదములు నాయికా నాయకుల మధ్య జరిగే ఆయా సంఘటనల గురించి చెప్పుచున్నట్లు కనపడినా, ప్రేమతో (శృంగారము) భక్తితో భగవంతునిలో ఏకమవ్వటం వీటి అసలు అంతరార్థం. సాధారణంగా పదములను మధ్యమకాలము లేదా అంతకన్నను నెమ్మదిగా పాడవలెను. పదరచనలో క్షేత్రజ్ఞులు (క్షేత్రయ్య), అన్నమాచార్యులు, పురందరదాసు, ఘనం సీనయ్య మొదలైనవారు ప్రసిద్ధులు.
శృంగారరసముతో ప్రేయసీ ప్రియుల లక్షణములను తెలిపే కృతులకు జావళీలని పేరు. వీటిలో పదములలో మాదిరిగా అంతర్లీనమైన భక్తి కనపడదు. జావళీలు గ్రామ్య భాషలో ఆది-రూపక-చాపు తాళములకు కూర్చబడి తేలికగా పాదుకొనేవిధంగా రచించబడతాయి. మహారాజా స్వాతి తిరుణాళ్, పట్ణం సుబ్రహ్మణ్య అయ్యరు, ధర్మపురి సుబ్బారావు, శివరామయ్య మున్నగువారు జావళీకర్తలు.
జతులు, స్వరసాహిత్యములతో మధ్యమగతిలో పాదుకొనుటకు అనుకూలంగా వివిధ రాగములలో వివిధ తాలములఓ చేయబడ్డ రచనలకు తిల్లానాలని పేరు. వీటి సంగీతము చాల సజీవముగానూ వేగంగానూ వుంటుంది. సాధారణంగా తిల్లానాలను కచేరీలలో చివరలో ప్రదర్శిస్తారు. మహారాజా స్వాతి తిరుణాళ్, పొన్నయ్య, పల్లవి శేషయ్య, మంగళంపల్లి బాల మురళీకృష్ణ, లాల్గుడి జయరామన్ తిల్లానా రచనలో ప్రముఖులు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.