కాకతీయ ప్రతాపరుద్రుడి పతనానంతరం తెలుగునాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి కాలంలో కాకతీయ వారసులైన ముసునూరి నాయకులు స్థానిక సైన్యాన్ని సంఘటితం చేసి ఢిల్లీ సుల్తానులను తెలుగునేల నుండి ప్రాలదోలారు. ప్రతాపరుద్రుడి మరణం తరువాత సాగిన 'అంధకార యుగం' అనుకొనే ఈ సమయం గురించి సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ విశేషంగా అధ్యయనం చేశాడు.

Thumb
ఓరుగల్లు, కాపయ నాయుడి రాజధాని
త్వరిత వాస్తవాలు ముసునూరి నాయకులు, స్థాయి ...
ముసునూరి నాయకులు

1012–1436
స్థాయిసామ్రాజ్యము
రాజధానివరంగల్లు

ఖమ్మం

రాజమండ్రి
సామాన్య భాషలుతెలుగు కన్నడ
మతం
హిందూ మతం
ప్రభుత్వంరాజరికము
చరిత్ర 
 స్థాపన
1012
 పతనం
1436
Preceded by
Succeeded by
పశ్చిమ చాళుక్యులు
తూర్పు చాళుక్యులు
దక్కను సుల్తానులు
విజయనగర సామ్రాజ్యము
మూసివేయి

ముసునూరి ప్రోలయ నాయుడు, ముసునూరి కాపయ నాయుడు తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి శర్మ తన 'Forgotten Chapter of Andhra History' లో వివరించాడు. "ముసునూరి నాయకుల యుగం" రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు [1][2].

క్రీ.శ. 1012[3] -1436[4] కాలం మధ్య ముసునూరి వంశస్థుల శాసనాలు తెలుగునాట వున్నవి. ఈ వంశస్తులు సుమారు 425 ఏళ్లు పాలించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. వీరు కాకతీయుల వారసులని కొన్ని శాసనాలు తెల్పుతున్నవి[5].

పరిచయము

1323 సంవత్సరములో ఆంధ్ర దేశము అల్లకల్లోల పరిస్థితిలో ఉంది. ఢిల్లీ సుల్తాను పంపిన ఉలుఘ్ ఖాన్ (మహమ్మద్ బిన్ తుగ్లక్) మూడు నెలల ముట్టడి తరువాత ప్రతాపరుద్రుని జయించి బంధించెను[6]. ఓరుగల్లు నెలల తరబడి దోచబడెను[7]. అమూల్యమైన కోహినూరు వజ్రము, బంగారము, వజ్రవైఢూర్యములు మొదలగు సంపద 20,000 గుర్రములు, ఏనుగులు, ఒంటెలపై ఢిల్లీ తరలించబడెను[8][9]. ప్రతాపరుద్ర మహారాజు, దుర్గపాలకుడు గన్నమ నాయుడు (యుగంధర్/మాలిక్ మక్బూల్) మొదలగు వారు బందీలుగా ఢిల్లీ తరలుచుండగా మహారాజు నర్మదా నదిలో ఆత్మహత్య గావించుకొనెను.

ముసునూరి నాయకుల వివరాలు

  • పోతాయ నాయుడు (1220 - 1270)
  • పోచయ్య నాయుడు (1255 - 1300)
  • ప్రోలయ నాయుడు (1300 - 1335)
  • అనపోత నాయుడు (1335 - 1356)
  • వినాయక దేవరాయ (1346 - 1358)
  • కాపయ నాయుడు ( 1335 - 1368)

ప్రోలయ నాయుడు

ప్రోలయ నాయుడు విలస శాసనమందు ఆనాటి తెలుగు దేశపు దయనీయ దుస్థితి వర్ణించబడెను[10]. అట్టి విషమ కాలమందు బెండపూడి అన్నయ మంత్రి, కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన నాయకులను ఐక్యపరచిరి[11]. వారికి నాయకునిగా ముసునూరి ప్రోలయ నాయుడు అను ఒక కమ్మ సేనానిని ఎన్నుకొనిరి[12]. ప్రతాపరుద్రుని 72 నాయకులలో ప్రోలయ నాయుడు ఒకడు. కృష్ణా మండలములోని నూజివీడుకు చెందినవాడు. అతని తండ్రి పేరు పోచి నాయుడు. పోచినాయునికి ముగ్గురు తమ్ములు గలరు. వారు రాజ నాయుడు, కామా నాయుడు, దేవ నాయుడు . దేవనాయకునికి మహావీరుడగు పుత్రుడు కాపయ నాయుడు జన్మించెను. కాపయ నాయుడు తన పినతండ్రికి చేదోడు వాదోడుగా నిలచి పేరుప్రఖ్యాతులు గడించెను[13].

ప్రోలయ నాయుడు నాయకులందరిని ఒక త్రాటిపై తెచ్చి ఓరుగల్లును విముక్తిగావించుటకు పలు వ్యూహములల్లెను. అతనికి ముఖ్య సహచరులుగా అద్దంకి వేమారెడ్డి, కొప్పుల ప్రోలయనాయకుడు, రేచెర్ల సింగమనాయకుడు, మంచికొండ గణపతినాయకుడు, వుండి వేంగభూపతి మొదలుగు మహావీరులు తెలుగు దేశమును పారతంత్ర్యము నుండి విడిపించుటకు సన్నద్ధులైరి. పలుచోట్ల పెక్కు యుద్ధముల పిదప 1326 లో తురుష్కులను దక్షిణభారతమునుండి తరిమివేయుటలో నాయకులు సఫలమైరి. హిందూమతము రక్షించబడెను. దేవాలయములు పునరుద్ధరించబడెను. కోటలు గట్టిబరచబడెను. బ్రాహ్మణులకు అగ్రహారములీయబడెను. అనితల్లి కలువచేరు శాసనములో ప్రోలయ నాయుడుడి వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడబడెను.

కాపయ నాయుడు

Thumb
కాపయ నాయుడు

వయసు మీరిన ప్రోలయ నాయుడు రాజ్యాధికారమును కాపయ నాయుడుకి అప్పగించి తరాలనాటి ముసునూరి నాయకుల నివాస, పరిపాలన కేంద్రమైన ఖమ్మం కోటకు తరలిపోయెను. ముసునూరివారి విజయములచే ఉత్తేజితులై హొయసల, ద్వారసముద్రము, అరవీటి రాజులు తిరుగుబాటు చేసి తిరిగి వారి వారి రాజ్యములు సాధించుకొనిరి. ఇస్లాము మతమునకు మార్చబడిన హరిహర, బుక్క రాయలు హోయసల రాజ్యమును జయించి విద్యారణ్యులవారి బోధనలవల్ల తిరిగి హిందూ మతమును స్వీకరించి ఆనెగొందిలో విజయనగర రాజ్యము స్థాపించిరి[14]. మధురలో జలాలుద్దీను హస్సను స్వతంత్రుడిగా ప్రకటించుకొనెను. సుల్తాను ఉగ్రుడై స్వయముగా పెద్దసైన్యముతో ఓరుగల్లు చేరెను. అచట ప్రబలుచున్న మహమ్మారివల్ల సుల్తానుకు అంటు జాడ్యము వచ్చింది. భయపడిన సుల్తాను తిరిగి దౌలతాబాదుకు తిరుగుముఖము బట్టెను. తనతో వచ్చిన ముల్తాను పాలకుడు మాలిక్ మక్బూల్ను ఓరుగల్లు కోటకు అధిపతిగా నియమించి ఢిల్లీకి తిరిగిపోయెను . వెనువెంటనే హోయసల రాజు సహకారముతొ కాపయ ఓరుగల్లుపై దాడి చేసి తెలంగాణమంతయును విముక్తి గావించెను[15]. మాలిక్ మక్బూల్ ఢిల్లీకి పారిపోయెను. ఓరుగల్లు కోటపై ఆంధ్రదేశ పతాకము ఎగిరెను. కాపయ నాయుడు 'ఆంధ్రదేశాధీశ్వర', 'ఆంధ్రసురత్రాణ' అను బిరుదులు పొందెను. ప్రజారంజకముగా పరిపాలించెను. తన తోటినాయకులగు వేమారెడ్డి, పిఠాపురం కొప్పుల నాయకుడు, రేచెర్ల, భువనగిరి, దేవరకొండ పద్మనాయకుల స్వతంత్రమును గౌరవించెను. కాపయ నాయుడు సామ్రాజ్యము శ్రీకాకుళం నుండి బీదరు వరకు సిరిపూరు నుండి కంచి వరకు విస్తరించెను[16]. అది ఆంధ్రదేశ చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖించదగిన కాలము.

పతనము

1345లో హసను గంగు మహమ్మదు బీన్ తుగ్లకుపై తిరుగుబాటు చేసి దేవగిరిలో బహమనీ రాజ్యము స్థాపించెను. 1347లో తన రాజధానిని గుల్బర్గాకు మార్చెను. అతని ముఖ్యోద్దేశము దక్షిణాపథమునంతయు ఆక్రమించుట. క్రమముగా తెలుగు నాయకులలో ఐక్యత సన్నగిల్లసాగెను. పాత అసూయలు, కక్షలు తిరిగి తలెత్తాయి. రేచెర్ల సింగమ నాయుడు అద్దంకిపై దండెత్తగా కాపయ కలుగచేసుకొనెను, సింగయకది నచ్చలేదు. అదేసమయాన తుగ్లక్ బహమనీ రాజ్యముపై దాడిచేయగా కాపయ సాయమందించెను. బహమనీ సుల్తాను ఎంత క్రుతఘ్నుడో కాపానీడికి త్వరలో తెలియవచ్చెను. 1350లో సింగమ నాయుని ప్రోద్బలముతో అలావుద్దీను ఓరుగల్లుపై మొదటిసారి దండెత్తెను. ఇది ఊహించని కాపానీడు వీరోచితముగా పోరాడినను తప్పక సంధిగావించుకొని కైలాసకోటను అలావుద్దీనుకప్పగించెను. తుగ్లక్ 1351లో మరణించగా మిగుల ఉత్సాహముతో అలావుద్దీను పెద్దసైన్యము సమకూర్చుకొని 1355లో మరలా ఓరుగల్లుపై దండెత్తెను. ఆతనికి సింగమ నాయుడు లోపాయకారీగా సహాయపడెను. భువనగిరి సహా పెక్కు కోటలు స్వాధీనపర్చుకొని ఒక సంవత్సరముబాటు అల్లావుద్దీను తెలంగాణలో సర్వనాశనముగావించెను. 1359లో గుల్బర్గకు తిరిగిపోయి మరణించెను. పిమ్మట మహమ్మదు షా గుల్బర్గలో రాజయ్యాడు. అది అదనుగా కాపానీడు తన కుమారుడు వినాయకదేవుని భువనగిరి, కైలాసకోటలను విముక్తి గావించుటకు పంపెను. ఆతనికి బుక్క రాయలు సాయపడెను. తొలుత విజయములు సాధించినను వినాయక దేవుడు షా సైన్యమునకు చిక్కి మహాఘాతుకముగా వధించబడ్డాడు. కాపానీడికి అదొక పెద్ద విషాదఘాతము. బుక్కరాయల సహాయముతొ కాపానీడు బహ్మనీ సుల్తానుపై పెద్ద దాడికి సన్నిద్ధుడయ్యెను. అది తెలిసి మహమ్మదు షా కోపోద్రిక్తుడై తెలంగాణపై దండెత్తెను. రాచకొండ నాయకులు అతనికి సాయమందించారని చరిత్రకారుల అభిప్రాయము. అలాంటి విషమసమయమున బుక్కరాయలు మరణించెను. విజయనగర తోడ్పాటు లేకపోయెను. కాపానీడు ఓడిపొయి గొల్లకొండ కోటను, నెమలి సింహాసనము, ఎనలేని సంపద, వజ్రవైఢూర్యములు, బంగారము సమర్పించుకొనెను. మహమ్మదు షా రెండు వర్షములు తెలంగాణను అన్నివిధములుగా నాశనము గావించి 1365లో తిరిగిపోయెను. అదే అదనుగా రేచెర్ల సింగమ నాయుడు అతని కుమారులు స్వాతంత్ర్యము ప్రకటించుకొని బలహీనపడిన కాపానీడుపై యుద్ధము ప్రకటించిరి. ఖాళీ ఐన కోశాగారముతో, యుద్ధములలో అలసిన సైన్యముతో, విషణ్ణుడైన కాపానీడు పోరుకు తలపడెను. భీమవరము వద్ద జరిగిన పోరులో తెలుగుదేశపు ఐక్యతకు, హిందూమత రక్షణకు, దక్షిణభారతమును పరదాస్యమునుండి విముక్తి చేయుటకు ఎన్నోత్యాగములుచేసిన మహామానధనుడు 1370లో అసువులు బాసెను.

ప్రాముఖ్యత

సోమశేఖర శర్మ మాటలలో: "తెలుగుదేశచరిత్రలో వారు వహించిన పాత్ర అనుపమానమైనది. వింధ్యకు దక్షిణమందుండిన గొప్ప హిందూ రాజ్యములన్నియూ ఢిల్లీ సుల్తాను మహమ్మదు బిన్ తుగ్లకు కు పాదాక్రాంతములై ఆ చక్రవర్తి మగటిమిని, సామ్రాజ్యబలమును తలయెత్తి ఎదిరింపలేని కాలమున, పూర్వపు సూర్యవంశ, చంద్రవంశజులైన క్షత్రియుల రాజ్యములన్నియు క్రుంగి కూలారిపోయిన కాలమున అంతటి మహాబలవంతుడైన ఢిల్లీ చక్రవర్తిపై కత్తికట్టి, అతని యధికారమును ధిక్కరించి, స్స్వాతంత్ర్యోద్యమమును లేవదీసి, దానిని విజయవంతముగా నడిపిన కీర్తి, ప్రతిష్ఠలు తెలుగు ప్రజానీకమువి; తెలుగు నాయకులవి; అందును ముఖ్యముగా ముసునూరి ప్రోలయ, కాపయనాయకులవి. వీరు హిందూరాజ్య పునరుద్ధరణమునకు దీక్షాకంకణములు కట్టి యవనవారధి నిమగ్నమైన తెలుగుభూమిని ఉద్ధరించిన పిదపనే దక్షిణదేశమున నుండిన ఇతర రాజ్యములకు ధైర్యము కలిగి, ఢిల్లీ సుల్తానుపై తిరుగుబాటులు కావించి విజయలక్ష్మీ సంపన్నములైనవి. హిందూదేశచరిత్రలో తెలుగు నాయకుని అధిపత్యమున తమకు తామై ప్రజలే తమ శ్రేయోభాగ్యములకొరకు అపూర్వ ధైర్యోత్సాహములతో విమత బలములను ఎదిరించి పోరాడి స్వరాజ్యమును స్థాపించుకొనిన అపూర్వ, అద్భుత ప్రకరణమిది; ప్రాచీన చరిత్రలో అశ్రుతపూర్వమైనది. ముసునూరినాయకులకు విజయమే లభించి యుండకపోయినచో మన తెలుగుదేశ చరిత్ర మరియొకతెన్నున నడచియుండెడిది. ముసునూరివారి స్వాతంత్ర్యవిజయముతో తెలుగుదేశములో నూతన యుగము ఆరంభమైనది. తెలుగుదేశచరిత్ర ఉత్తరమధ్యయుగములో పడినది".

మలుపు

1370 వ సంవత్సరము దక్షిణభారత చరిత్రలో పెద్దమలుపు. తెలంగాణను జయించిన బహమనీ సుల్తాను విజయనగరము పై కన్ను వేసెను. ముసునూరి వారి త్యాగములు, దేశాభిమానము విజయనగర రాజులకు మార్గదర్శకమయ్యెను. ఓరుగల్లు పతనము పిమ్మట పెక్కు నాయకులు విజయనగరమునకు తరలి పోయి రాబోవు మూడు శతాబ్దములు దక్షిణభారతమును హిందూమతమును రక్షించుటకు పలుత్యాగములు చేసిరి. సమకాలీన చరిత్రకు అది ఒక గుణపాఠము కూడ.

ఇవి కూడా చూడండి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.