తెలుగు సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేసిన ఆంగ్లేయుడు From Wikipedia, the free encyclopedia
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (English: Charles Phillip Brown; నవంబర్ 10, 1798 - డిసెంబర్ 12, 1884) తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ | |
---|---|
జననం | 10 నవంబర్ 1798 |
మరణం | 12 డిసెంబర్ , 1884 వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్,యునైటెడ్ కింగ్డమ్ |
ఇతర పేర్లు | బ్రౌన్ దొర |
పిల్లలు | లేరు |
తల్లిదండ్రులు |
|
వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు.
సి. పి. బ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు.[2] [3] ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో సీపీ బ్రౌన్ గ్రీక్, లాటిన్, పారశీ, సంస్కృత భాషల్లో ఆరితేరాడు, బ్రౌను అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. తరువాత 1817 ఆగస్టు 4 న మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించాడు. వేమన, సుమతి శతకాలతోపాటుగా పల్నాటి యుద్ధం లాంటి చారిత్రిక కావ్యాలను, నన్నయ్య, తిక్కన, గౌరన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, రామరాజ భూషణుల కృతుల పరిష్కరణ - ప్రచురణలను ముద్రింపచేసాడు.
1820 ఆగస్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడంలోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్థమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవాడు.
కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. 1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి 1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు. బ్రౌను మానవతావాది. 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, కరువుగానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పందొమ్మిదో శతాబ్ది తొలిపాదం చివర్లో తాను తెలుగు సాహిత్యంలో కృషి మొదలుపెట్టేనాటికి నెలకొని వుండిన స్థితిగతులను గురించి బ్రౌన్ స్ఫుటమయిన మాటల్లో అభివర్ణించాడు. ‘అప్పటికి తెలుగు సాహిత్యం కొనప్రాణంతో కొట్టుకులాడుతోంది. 1825 నాటికి ప్రమిదలో దీపం కొడిగట్టిపోతోంది. తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండడం నా కళ్లబడింది. నేను 30 ఏళ్లు కృషి చేసి, దాన్ని పునఃప్రతిష్ట చేశాన’న్నాడు బ్రౌన్. నిరలంకారంగా మాట్లాడ్డం బ్రౌన్ శైలి. ఈ మాటల్లో కూడా అందుకే అతిశయోక్తులు కనిపించవు. 1827 నాటికే, బ్రౌన్ ‘ఆంధ్ర గీర్వాణ ఛందము’ అనే పుస్తకం రాసినప్పటికీ, ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన పుస్తకం 1829 నాటి ‘వేమన శతకం’. అప్పటికి బ్రౌన్ అయిదేళ్లుగా వేమన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు ఏడొందల పద్యాలకి ఆంగ్లానువాదాలతోపాటు విస్తృతమయిన పదకోశం కూడా సమకూర్చారు. మరో పదేళ్ల తర్వాత, 1164 పద్యాల మేరకి విస్తరింపచేసి, తిరిగి ‘వేమన శతకం’ అచ్చువేశారు.[4] పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12 న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్[5]లో అవివాహితునిగానే మరణించాడు. ఈయనను కెన్సెల్ గ్రీన్ శ్మశానంలో సమాధి చేశారు.[6]
బ్రౌన్ కొలువులో తొలి తెలుగు కథకుడు తాతాచారి అనే పేరుతో ప్రాచుర్యం పొందిన నేలటూరు వేంకటాచలం. తాతాచారి చెప్పిన కథలను విన్న సి. పి. బ్రౌన్ అందులోంచి 24 కథలను, దానితోపాటు శ్రీకృష్ణమాచారి చెప్పిన రెండు కథలను కలిపి 1855లో పుస్తకంగా ముద్రించారు. అదే సంవత్సరం వీటి ఆంగ్లానువాదాన్ని 'పాపులర్ తెలుగు టేల్స్' అనే పేరుతో ప్రచురించారు. 1916లో 'తాతాచారి కథలు' గిడుగు వేంకట అప్పారావు సంపాదకత్వంలో ద్వితీయ ముద్రణ పొందాయి. 1951లో వావిళ్ల వారి తృతీయ ముద్రణ, 1974లో బంగోరె సంపాదకుడిగా చతుర్థ ముద్రణ పొందాయి. తాతాచారి నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా గునుపాడు గ్రామవాసి. తిరుపతి బాలబాలికలకు వీధి బడుల్లో చదువు చెబుతూ జీవితం సాగించారు. 1848లో చెన్నపట్నం వెళ్లి బ్రౌను కొలువులో ఏడేళ్లు తాను బ్రతికి వుండిన పర్యంతమున్నాడు. పల్నాటి వీర చరితం, వసు చరిత్ర మొదలైన గ్రంథాల పరిష్కార కృషిలో ఆయనకు సాయపడ్డారు. తాతాచార్యులు కావ్య తర్క వ్యాకరణముల యందు ప్రవీణత గలవాడు. తాతాచారి కథలు నీతి బోధకాలే కాక, ఆనాటి సామాజిక స్థితికి దర్పణంగాను ఉన్నాయి. అందులోని శైలి శుద్ధ వ్యావహారికమైనందు వల్ల పండిత శైలికి దూరంగా ఉందనే బ్రౌన్ ప్రశంసకు యోగ్యమైంది. తాతాచారి కథల్లో- గ్రామశక్తికి పొంగలి పెట్టిన కథ, దేవరమాకుల కథ, వెట్టి వాండ్ల పట్టీ కథ, వాలాజీపేట రాయాజీ మసీదు కథ, హాలింఖాన్ మోసపోయిన కథ, మనిషి సద్గతి దుర్గతి తెలిపే కథ, పొగచుట్ట కథ లాంటివి ఉన్నాయి.[7]
సి.పి.బ్రౌన్కు తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు, పండితుడు ఏనుగుల వీరాస్వామయ్యతో సాన్నిహిత్యం ఉండేది. వీరాస్వామయ్యకు, బ్రౌన్కు నడుమ తరచు ఉత్తరప్రత్యుత్తరాల్లో వారి అభిరుచియైన సారస్వత సంరక్షణలో జరిగిన ప్రగతి, చేసిన పనులు వంటివి పంచుకుంటూండేవారు. వీరాస్వామయ్య బ్రౌన్కు రాసిన లేఖలో తాను సంపాదించిన అరుదైన స్కాందం అనే గ్రంథమూ, దానికి గల తెలుగు అనువాదం గురించిన వివరాలు తెలిపి, వీటిని ప్రచురించగలరేమో పరిశీలించమన్నారు. తాను వ్రాసిన అపురూపమైన యాత్రాచరిత్ర కాశీయాత్ర చరిత్రను ప్రచురించగలరేమో పరిశీలించవలసిందిగా బ్రౌన్‌ను కోరారు.[8]
150-175 ఏళ్ళనాటి బ్రౌను ఫోటో అంటూ 2007 జనవరి 20 న తితిదే శ్వేత ప్రాజెక్టు డైరెక్టర్ భూమన్ ఒక ఫోటోను పత్రికలకు విడుదల చేసాడు. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన సంజీవిగారి సుబ్బారావు ఇంట్లో ఆయన అసలైన ఫొటో లభ్యమైనట్లు ఆయన చెప్పాడు.[9] అయితే ఈ ఫోటో బ్రౌనుది కాదంటూ వార్తలు వచ్చాయి. [10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.