From Wikipedia, the free encyclopedia
గురువు అంటే "మార్గదర్శి, నిపుణుడు, ఉపాధ్యాయుడు అని అర్థం. ఇది సంస్కృత పదం గురు నుండి వచ్చింది భారతీయ సంప్రదాయంలో గురువు ఉపాధ్యాయుని కంటే ఎక్కువ. సాంప్రదాయకంగా, గురువు శిష్యుడికి లేదా విద్యార్థికి గౌరవప్రదమైన వ్యక్తి. గురువు శిష్యునికి జీవిత విలువలను నేర్పించే బోధకుడు, సాహిత్య జ్ఞానంతో పాటు, తన అనుభవ జ్ఞానాన్ని పంచేవాడు, విద్యార్థి జీవితంలో ఒక ఆదర్శ వ్యక్తి, స్ఫూర్తిదాయకమైన వ్యక్తి, విద్యార్థి ఆధ్యాత్మిక పరిణామంలో సహాయపడేవాడు. [1] గురువు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి, తాను పొందిన సామర్థ్యాలను శిష్యుడూ పొందడంలో సహాయం చేస్తాడు. [2]
గురు భావనకు సంబంధించిన అత్యంత పురాతన సూచనలు వేద గ్రంథాలలో కనిపిస్తాయి. [1] గురు, గురుకులం భావన సా.పూ. 1వ సహస్రాబ్ది నాటికి భారతదేశంలో వేళ్ళూనుకున్న సంప్రదాయం. వివిధ వేదాలు, ఉపనిషత్తులు, హిందూ తత్వశాస్త్రంలోని వివిధ గ్రంథాలు, వేదానంతర శాస్త్రాలను - ఆధ్యాత్మిక జ్ఞానం నుండి వివిధ కళల వరకు- కంపోజ్ చేయడం లోను, వ్యాప్తి చేయడంలోనూ గురు శిష్య సంప్రదాయం దోహదపడింది. [1] [3] [4] సా.శ. 1వ సహస్రాబ్ది మధ్య నాటికి, భారతదేశంలో అనేక పెద్ద గురుకులాలు ఉన్నాయని పురావస్తు, శిలాశాసన ఆధారాలు సూచిస్తున్నాయి. హిందూ దేవాలయాలకు సమీపంలో విలసిల్లిన గురు-శిష్య సంప్రదాయం వివిధ జ్ఞాన రంగాలను సంరక్షించడం, సృష్టించడం, వ్యాప్తి చేయడంలో సహాయపడింది. [4] ఈ గురువులు హిందూ గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలు, వ్యాకరణం, తత్వశాస్త్రం, యుద్ధ కళలు, సంగీతం, చిత్రలేఖనం వంటి విస్తృత అధ్యయనాలకు నాయకత్వం వహించారు. [4] [5] తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం అని హిందూ ధర్మం బోధిస్తుంది.
హిందూ సంప్రదాయాలలో గురువు పురాతనమైన, ప్రధాన వ్యక్తి. [6] అంతిమ విముక్తి, తృప్తి, మోక్షం రూపంలో స్వేచ్ఛ, అంతర్గత పరిపూర్ణత అనేవి రెండు మార్గాల ద్వారా సాధించదగినవిగా పరిగణిస్తారు: గురువు సహాయం తోను, హిందూ తత్వశాస్త్రంలోని పునర్జన్మతో వంటి కర్మ ప్రక్రియ ద్వారాను. [6] గురువు అనేక విషయాలు, నైపుణ్యాల బోధకుడు, సలహాదారు, మానసిక జ్ఞానోదయానికి, స్వీయ సాక్షాత్కారానికి సహాయపడే వ్యక్తి, విలువలు, అనుభవ జ్ఞానాన్ని నింపేవాడు. గురువు ఒక ఆదర్శ వ్యక్తి, ఒక ప్రేరణ, శిష్యుని ఆధ్యాత్మిక అభివృద్ధికి మార్గనిర్దేశం చేసేవాడు. [6] సామాజిక, మతపరమైన స్థాయిలో గురువు, మతాన్ని, హిందూ జీవన విధానాన్నీ కొనసాగించడంలో సహాయం చేస్తాడు. [6] హిందూ సంస్కృతిలో గురువుకు చారిత్రక, గౌరవప్రదమైన, ముఖ్యమైన పాత్ర ఉంది. [1]
గురు అనే పదం వేద గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఋగ్వేదంలోని 4.5.6 శ్లోకం,"స్వయం యొక్క జ్ఞానానికి మూలం, ప్రేరేపకుడు, వాస్తవికత యొక్క సారాంశం" అని వర్ణించింది. [7]
వేదాల తరువాతి అంగాలైన ఉపనిషత్తులు గురువును ప్రస్తావిస్తాయి. ఉదాహరణకు చాందోగ్య ఉపనిషత్తు, 4.4వ అధ్యాయంలో, గురువు ద్వారా మాత్రమే ముఖ్యమైన జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానానికి దారితీసే అంతర్దృష్టిని పొందగలరని ప్రకటించింది. [8] కథా ఉపనిషత్తు, 1.2.8 శ్లోకంలో జ్ఞాన సముపార్జనకు గురువు అనివార్యమని ప్రకటించింది. [8] తైత్తిరీయ ఉపనిషత్తులోని 3వ అధ్యాయంలో, సంతానోత్పత్తి మాధ్యమం ద్వారా బిడ్డ తండ్రి, తల్లి మధ్య అనుసంధాన బంధాన్ని ఏర్పరుస్తుందో, అలాగే మానవ జ్ఞానం గురువు, విద్యార్థిని కలుపుతుంది అని వర్ణించబడింది. [9] [10] తైత్తిరీయ ఉపనిషత్తులో, గురువు ఒక విద్యార్థిని, "విశ్వానికి సృష్టి, స్థితి, లయానికి మూలమైన సత్యం కోసం యత్నించు, కనుగొను, అనుభవించు" అని చెబుతుంది. [8]
భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో గురువు పాత్ర గురించి చెబుతాడు. 4.34 శ్లోకంలో తమ విషయం బాగా తెలిసిన గురువులు మంచి శిష్యుల కోసం చూస్తారని, శిష్యుడు అటువంటి గురువుకు శుశ్రూష చేసి నేర్చుకోవచ్చని చెప్పాడు. [11] [12]
సాంప్రదాయికంగా, గురువు సాధారణ వైవాహిక జీవితాన్ని గడుపుతూ తనవద్దనే శిష్యుల అధ్యయన జీవితాన్ని ప్రారంభింపజేస్తాడు. శిష్యుడు, గురుకులంలో గురువుతో కలిసి జీవిస్తూ, పనిచేస్తూ, సహాయం చేస్తూ శుశ్రూష చేస్తానని కోరుతూ గురువుకు అగ్ని కోసం కట్టెలు సమర్పిస్తాడు. [13] [14] గురు శుశ్రూషలో శిష్యుడు, ప్రాథమిక సాంప్రదాయిక వేద శాస్త్రాలు, వివిధ ఆచరణాత్మక నైపుణ్య-ఆధారిత శాస్త్రాలను [15] వేదాలు, ఉపనిషత్తులలోని మతపరమైన గ్రంథాలతో పాటు అధ్యయనం చేస్తాడు. [3] [16] [17] ఈ విద్యా దశను బ్రహ్మచర్యం అంటారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇది ఉపనయనం లేదా విద్యారంభ ఆచారాలతో మొదలౌతుంది. [18] [19] [20]
గురుకులం ఒక అడవిలో ఒక ఆశ్రమంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, మఠం లేదా ఆశ్రమంగా ఉంటుంది. [5] [21] గురువుకు ఒక గురు పరంపర ఉంటుంది. వీరు హిందూ తత్వశాస్త్ర అధ్యయనంపై కేంద్రీకరిస్తారు, [15] [16] వీటిని గురు-శిష్య పరంపర అని పిలుస్తారు. [3] ఈ సంప్రదాయంలో శిల్పం, కవిత్వం, సంగీతం వంటి కళలు కూడా ఉన్నాయి. [22] [23]
నిజమైన గురువు జ్ఞాన రంగంలో నిష్ణాతుడై ఉండాలని, వేదాలను బాగా పఠించినవాడు, అసూయ లేనివాడు, యోగం తెలిసినవాడు, సరళమైన జీవితాన్ని గడుపుతాడని, ఆత్మ జ్ఞానాన్ని పొందినవాడని అద్వయతారక ఉపనిషత్తు పేర్కొంది. కొన్ని గ్రంథాలు తప్పుడు బోధకుల గురించి హెచ్చరించాయి. ఆధ్యాత్మిక అన్వేషకులు గురువును అంగీకరించే ముందు పరీక్షించాలని చెప్పాయి. అసమర్థులైన గురువులు ఎందరో ఉన్నారని, నిజమైన గురువంటే గ్రంథాల స్ఫూర్తిని అర్థం చేసుకుని, స్వచ్ఛమైన స్వభావాన్ని కలిగి ఉండి, పాపం నుండి విముక్తి కలిగి ఉండాలని, డబ్బు, పేరు ప్రఖ్యాతులు కోరకుండా నిస్వార్థంగా ఉండాలని స్వామి వివేకానంద చెప్పాడు.
ఇండాలజిస్ట్ జార్జ్ ఫ్యూయర్స్టెయిన్ ప్రకారం, హిందూమతంలోని కొన్ని సంప్రదాయాలలో, స్వీయ-జ్ఞాన స్థితికి చేరుకున్న వ్యక్తి, తనకు తానే గురువు అవుతాడు. తంత్రంలో, గురువును "అస్తిత్వ సముద్రం దాటించే నావ"గాక్వ్ వర్ణిస్తుందని ఫ్యూయర్స్టెయిన్ పేర్కొన్నాడు. [24] నిజమైన గురువు విద్యార్థి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తాడు, సలహా ఇస్తాడు. ఎందుకంటే యోగా-బీజం, అంతులేని తర్కం, వ్యాకరణం గందరగోళానికి దారి తీస్తుంది, సంతృప్తిని కలిగించదు. [24] అయితే, వివిధ హిందూ గ్రంథాలు సరైన గురువును కనుగొనడంలో, తగని వారిని నివారించడంలో వివేకం, శ్రద్ధ కలిగి ఉండాలని హెచ్చరిస్తాయి. [25] ఉదాహరణకు, కుల-అర్ణవ వచనంలో ఈ క్రింది మార్గదర్శకత్వం ఉంది:
ప్రతి ఇంట్లోను దీపాలు ఉన్నట్లుగా గురువులూ అనేకం ఉంటారు. కానీ, ఓ దేవా, సూర్యునిలా ప్రతిదానిని ప్రకాశింపజేసే గురువును కనుగొనడం కష్టం.
వేదాలు, పాఠ్యపుస్తకాలు మొదలైనవాటిలో ప్రావీణ్యం ఉన్న గురువులు ఎందరో ఉన్నారు. కానీ, ఓ దేవీ, పరమ సత్యంలో ప్రావీణ్యం ఉన్న గురువును కనుగొనడం కష్టం.
శిష్యుల సంపదను దోచుకునే గురువులు ఎందరో. కానీ, ఓ దేవీ, శిష్యుల బాధలను తొలగించే గురువు దొరకడం కష్టం.
సామాజిక వర్గం, జీవిత దశ, కుటుంబంపై ఉద్దేశ్యంతో ఉన్నవారు ఇక్కడ భూమిపై చాలా మంది ఉన్నారు. కానీ లౌకిక మాలిన్యాలు లేని గురువు దొరకడం కష్టం.
తెలివైన వ్యక్తి పరమానందాన్ని కలిగించే గురువును ఎంచుకోవాలి అలాంటి గురువును మాత్రమే ఎంచుకోవాలి.
ఆధునిక హిందూ మతంలో, గురువు అంటే పూర్తిగా భిన్నమైన భావనలను ఏర్పడ్డాయి. ఉదాహరణకు గురువు అంటే ఆధ్యాత్మిక సలహాదారు లేదా ఆలయం వెలుపల సాంప్రదాయ ఆచారాలు చేసే వ్యక్తి లేదా తంత్ర లేదా యోగా లేదా కళల రంగంలో జ్ఞానోదయం పొందిన మాస్టర్ అని అర్థమని క్రానెన్బోర్గ్ చెప్పాడు.
గురువు పట్ల గౌరవం అనే సంప్రదాయం ఆధునిక హిందూమతంలో కొనసాగుతూనే ఉంది. కానీ ఒక ప్రవక్తగా కాకుండా, ఆధ్యాత్మికత, ఏకత్వం, జీవిత పరమార్ధానికి మార్గాన్ని సూచించే వ్యక్తిగా గురువును చూస్తారు. [26] [27] [85]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.