ఆర్య అల్లు అర్జున్ హీరోగా రెండవ సినిమా. ఇది 7 మే 2004లో విడుదల చేసారు. దర్శకుడు సుకుమార్. తన మెదటి సినిమా బాగా ఆడినప్పటికీ, అర్జున్‌కు టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చిన సినిమా ఆర్య.ఈచిత్రంలో అనురాధ మెహతా నాయిక గా నటించింది. సంగీతం దేవీ శ్రీ ప్రసాద్ అందించారు.

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
ఆర్య
(2004 తెలుగు సినిమా)
Thumb
దర్శకత్వం సుకుమార్
నిర్మాణం దిల్ రాజు
రచన సుకుమార్
కథ సుకుమార్
చిత్రానువాదం సుకుమార్
తారాగణం అల్లు అర్జున్, శివ బాలాజి కృష్ణుడు (నటుడు) , అనురాధ మెహతా (నటి)
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
నేపథ్య గానం షాన్, సాగర్, రవి వర్మా, టిప్పు, కే కే, మాలతి , రంజిత్
నృత్యాలు రాజు సుందరం, నిక్సన్, శంకర్, అషోక్ రాజ్, హరీష్ పాయ్
గీతరచన విశ్వా, వేటూరి, చంద్రబోస్,
సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంభాషణలు సుకుమార్
ఛాయాగ్రహణం రత్నవేలు
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
విడుదల తేదీ 7 మే 2004
నిడివి 165 నిం.
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
మూసివేయి

కథ

Thumb
"ఫీల్ మై లవ్"

గీత (అనురాధ మెహతా) కన్యాకుమారికి స్నేహితులతో విహారయాత్రకి వస్తుంది. అక్కడ సముద్రపు ఒడ్డున ఒక పుస్తకంలో ఒక యువకుడు తన స్వప్నసుందరికి రాసిన కవితను మెచ్చిన గీత, ఆ యువకుడికి ఆ అమ్మాయి త్వరలోనే దొరకాలని ఆశిస్తున్నానని రాసి వెళ్ళిపోతుంది. ఆ యువకుడు గీతని కాని, గీత ఆ యువకుడిని కాని ఎరుగరు. వంతెన పై నిలబడి సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న గీతని కొందరు ఆకతాయిలు ఆట పట్టిస్తూ ఉంటారు. ఇంతలో గీత కాలి పట్టీ ఒకటి జారి సముద్రంలో పడిపోతుంది. ఆ ఆకతాయిలకు బుధ్ధి చెప్పాలన్న ఉద్దేశంతో గీత స్నేహితురాలు "మీరు చావక్కర్లేదు. నిజంగా ప్రేమ ఉంటే ఆ పట్టీ తెచ్చివ్వండి చాలు" అని అంటుంది. ఇంతలో వేరొక యువకుడు దభాల్న సముద్రంలోనికి దూకేస్తాడు. ఈ దృశ్యం తన మనసు లోతుల్లో ముద్రించుకుపోవటంతో గీతకి తరచు అది కలగా వస్తూ ఉంటుంది. అజయ్ (శివ బాలాజీ) MP అవతారం (రాజన్ పి. దేవ్) కొడుకు. కాలేజిలో చదువుతుంటాడు. అదే కాలేజీలో గీతని ప్రేమిస్తాడు. తను కాదంటే కాలేజి మీదనుండి దూకి చస్తానని బెదిరిస్తాడు. తాను ప్రేమిస్తున్నట్టు చెబితే గాని దిగి రానని దూకబోవటంతో అయిష్టంగానే గీత I love you అని గట్టిగా అరుస్తుంది. కాలేజికికి అప్పుడే వచ్చిన ఆర్య (అల్లు అర్జున్) అది చూసి గీతని ప్రేమించటం మెదలుపెడతాడు. అజయ్ ముందే గీతకి "ఐ లవ్ యూ" చెప్తాడు. కోప్పడిన అజయ్ తో వారు ప్రేమించుకోవచ్చని కాని అనుని తాను కూడా ప్రేమిస్తున్నాని, ప్రేమిస్తూనే ఉంటానని అయోమయంలో పడేస్తాడు. గీతకి అజయ్ పట్ల నిజంగానే ప్రేమ ఉంటే తన లాంటి వారు ఎందరు వచ్చినా వారిని విడదీయలేరని అతనికి నచ్చజెపుతాడు. గీత స్నేహితురాళ్ళందరూ దబాయించటంతో తాజ్ మహల్ అందరికీ ఇష్టమేనని ఒకరు ఇష్టపడుతున్నారు కదా అని మన ఇష్టాన్ని చంపుకోలేమని, గీత పై తన ఇష్టం కూడా అలాంటిదే నని, ప్రశ్నించటం మాని ప్రేమించటం మొదలు పెట్టండని హితబోధ చేస్తాడు. అవతారం తన కొడుక్కి వేరే సంబంధం నిర్ణయిస్తాడు. అది నచ్చక అజయ్, గీతలు ఆర్య సాయం కోరతారు. వారి నుండి ఆ జంటని రక్షించటానికి ఆర్య, అజయ్, గీతలు ఊరు వదిలి పారిపోతారు. ఆర్య ఉద్దేశం ఏంటి? అజయ్ ప్రేమ నిజమైనదేనా? కన్యాకుమారిలో కవి ఎవరు? తన పట్టీ కోసం దూకిన ఆ యువకుడు ఎవరు? వంటి ప్రశ్నలని ఛేదిస్తూ కథ సుఖాంతమవుతుంది.

తారాగణం

అభివృద్ధి

దిల్ రాజు నిర్మాతగా వి. వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమాకు సుకుమార్ సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు. ఆ సినిమా విజయవంతం అయితే సుకుమార్ కి ఒక అవకాశం కల్పిస్తానని దిల్ రాజు మాట ఇచ్చాడు. దిల్ మంచి ఆదరణ పొందడంతో సుకుమార్ తయారు చేసుకున్న కథను రాజు విన్నాడు కానీ అది వ్యాపారాత్మకంగా అంత విజయం సాధించగలదా అని అనుమానం వ్యక్తం చేశాడు. కొన్ని చర్చల తర్వాత ఒప్పుకున్నాడు. మొదట్లో సుకుమార్ ఈ కథను అల్లరి నరేష్ ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసినా ఎందుకో ఈ కథ అతనికి చెప్పలేది. తర్వాత దిల్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు వచ్చిన అల్లు అర్జున్ ని చూసి సుకుమార్ తన కథకు అతను నాయకుడైతే బాగుంటుంది అనుకున్నాడు. గంగోత్రి సినిమా తర్వాత అనేక రొటీన్ కథలు విన్న అల్లు అర్జున్ ఈ కథ వినడానికి అంత ఆసక్తి చూపకపోయినా, విన్న తర్వాత సంతోషంగా ఒప్పుకున్నాడు. అల్లు అరవింద్, చిరంజీవి కూడా ఈ కథకు ఓకె చెప్పారు. మొదటగా ఈ సినిమాకు నచికేత అని పేరు పెట్టాలనుకున్నారు కానీ చివరికి ఆర్య అనే పేరును నిర్ధారించారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు సహాయ దర్శకుడుగా పనిచేయడమే కాక ఓ చిన్న పాత్రలో కూడా కనిపిస్తాడు.[2]

2003 నవంబరు 19 న ప్రారంభమైన ఈ చిత్రం 120 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దేవిశ్రీప్రసాద్, సుకుమార్ కలయిక ఈ సినిమాతోనే మొదలైంది. తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు సంగీతపరంగా ఘన విజయం సాధించాయి.[2]

విడుదల, ఫలితం

2004 మే 7 న విడుదలైన ఈ సినిమాను 4 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించగా 30 కోట్లు వసూలు చేసింది. మలయాళంలోకి అనువాదం చేసి విడుదల చేయగా అక్కడ 35 లక్షలు వసూలు చేయడమే కాక అల్లు అర్జున్ కి అక్కడ ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడేలా చేసింది. తొలి చిత్రంతోనే ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు సుకుమార్.[2]

పాటలు

Thumb
తన ప్రేమని పరీక్షించుకొనే సన్నివేశంలో...

ఆర్యలో ఆరు పాటలు ఉన్నాయి

  • యూ రాక్ మై వర్ల్డ్ (You Rock My World) - షాన్ ప్రేమ జీ, రచన: విస్వా
  • నువ్వుంటే - సాగర్ , సుమంగళి, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • ఓ మై బ్రదరు, చెబుతా వినరో - రవి వర్మా , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • థకథిమితోం - గానం: టిప్పు రచన: సురేంద్ర కృష్ణ
  • నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో- కే కే , క్లింటన్ సిరోజ్, రచన: చంద్రబోస్
  • అ అంటే అమలాపురం , ఆ అంటే ఆహాపురం - మాలతి, రంజిత్ , రచన: వేటూరి సుందర రామమూర్తి.

విశేషాలు

  • ఈ చిత్రం మలయాళం లోకి ఆర్య (మలయాళం సినిమా)గా అనువదించబడింది. కేరళలో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని చవి చూసింది.
  • ఆ అంటే అమలాపురం , ఆ అంటే ఆహాపురం గీతం ఉత్తర భారత దేశీయులు చాలా మంది ఇష్టపడతారు.
  • ఈ చిత్రంలో మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన చాలా అంశాలు వినోదాత్మకంగా చిత్రీకరించబడ్డాయి.

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.