![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/37/Annamacharya.jpg/640px-Annamacharya.jpg&w=640&q=50)
అన్నమయ్య
సుప్రసిద్ధ వాగ్గేయకారుడు / From Wikipedia, the free encyclopedia
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
ఇతర పేర్లు | అన్నమయ్య |
జననం | (1408-05-09)1408 మే 9 తాళ్ళపాక, ఆంధ్రప్రదేశ్ |
మూలం | తాళ్ళపాక |
మరణం | 1503 ఫిబ్రవరి 23(1503-02-23) (వయసు 94) తిరుపతి, ఆంధ్రప్రదేశ్ |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | రచయిత, యోగి, స్వరకర్త, కవి, పదకవితా పితామహుడు |
వాయిద్యాలు | తంబూర |
కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా కొందరి అభిప్రాయం. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.
అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి. జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఇలా అనేక రకాలైన శైలిలో పాటలు రాశాడు అన్నమయ్య.[1]