Remove ads
From Wikipedia, the free encyclopedia
హిందుస్థానీ శాస్త్రీయ సంగీతము భారతీయ శాస్త్రీయ సంగీత సంప్రదాయాలలో ఒకటి, 13-14 శతాబ్దములలోని సాంస్కృతిక పరిస్థితులచే అమితముగా ప్రభావితమైనది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతపు మూలములు మానవ చరిత్రలోనే అత్యంత ప్రాచీన శాస్త్రములైన వేదముల సంప్రదాయములోనివి. ఇందువలన హిందుస్థానీ సంగీతము యొక్క మూలములు మానవ చరిత్రలోని అత్యంత పురాతనమైన సంగీత సంప్రదాయములలోనివని భావించవచ్చును.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
|
నాలుగు వేదములలో ఒకటైన సామవేదము దీనికి సంబంధించిన సంపూర్ణ సాహిత్యమును వివరిస్తుంది. హిందుస్థానీ సంగీతము ధ్యానము రూపములో కూడా కలదు, కానీ ఇది కొందరు అదృష్టవంతులకు మాత్రమే అందుబాటులో ఉంది.
హిందుస్థానీ సంగీతము రాగములు, తాళము లపై ఆధారపడి, మానవ శరీరంలోని వివిధ "చక్రముల"ను ప్రభావితం చేయగలిగి కుండలిని శక్తి దిశగా తీసుకు వెళ్తున్నది. వేదముల యొక్క పద్ధతులు ముఖ్యముగా భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక వికాసములకు తోడ్పడి ఈ చక్రముల ఉత్తేజపరుచుటతో అనుసంధానమై ఉంది.
భారతీయ శాస్త్రీయ సంగీతము మానవ సమాజముచే సృష్టించబడిన సంగీత పద్ధతులన్నింటిలో అత్యంత క్లిష్టమైనది, సంపూర్ణమైనది. పాశ్చాత్య సంగీతములోని ఎనిమిది మూల స్వరములు డొ రే మి ఫ సొ ల టి డొ, స రిగా మ ప దని స లకు సమానము.
స్వరముల ఆధారముగా పాడే పద్ధతి వేదముల కాలము నాటికే ప్రసిద్ధమైనది. సామ వేదములోని పవిత్ర స్తోత్రములను పాడేవారు కానీ, వల్లె వేసేవారు కాదు. ఇది ఎన్నో శతాబ్దముల నుండి అభివృద్ధి చెంది భారత దేశాన (ప్రస్తుత పాకిస్తాన్, బంగ్లాదేశ్ లతో పాటు) స్థిరపడినది. దక్షిణ భారతములో ప్రముఖమైన కర్ణాటక సంగీతము వలె గాక, హిందుస్థానీ సంగీతము ప్రాచీన హైందవ సంస్కృతి, వేదాల తత్వములు, పురాతన శబ్ద వాయిద్యములతో పాటు మొఘల్ సామ్రాజ్యం మొఘల్ పరిపాలనా సమయమునందు పర్షియా దేశపు సంగీత విధానముల కలయిక ఉంది.
దక్షిణ ఆసియాకు ఆవల హిందుస్థానీ సంగీతము భారతీయ సంగీతముగా పరిగణించబడటము పరిపాటి. భరత ఖండమునకు ఆవల ఇది అత్యంత ప్రీతిపాత్రమైన సంగీత పద్ధతి అని భావించవచ్చు.
కర్ణాటక సంగీతము మాదిరిగా, హిందుస్తానీ సంగీతము ఆరోహణ, అవరోహణములతో కూడిన రాగముల యొక్క స్వభావములతో క్రమబద్ధీకరించబడినవి. రాగమునందు ఆరోహణ అవరోహణల యందున్న క్రమములో ఒకే స్వరములు ఉండవలెనన్న నిబంధన లేదు. రాగ స్వభావమునకు వాది, సంవాదిలతో కూడిన ఒక ప్రత్యేకమైన అమరికను పకడ్ అంటారు. వీటితో పాటు ప్రతి రాగమునకు అంబిత్, మీండ్యను నిబంధనలు మరికొన్ని ప్రత్యేక లక్షణములు ఉన్నాయి.
ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభమున, హిందుస్థానీ సంగీతమును ప్రస్తుత థాట్ పద్ధతిన క్రమబద్ధీకరణ చేసిన వారు పండిట్. విష్ణు నారాయణ్ భాత్కండే (1860-1936) గారు. అంతకు ముందు రాగములను రాగ (మగ), రాగిణి (ఆడ), పుత్ర (శిశు) క్రమమున ఏర్పరచి ఉండేవి.
కళాకారులు, ముఖ్యముగా కచేరి చేయువారు (కృతులను రచించువారు కాదు) జనామోదాన్ని పొందిన తరువాత వారి పేర్లకు హిందువులయితే పండిట్ అని ముస్లిములయితే ఉస్తాదులని కలిపి గౌరవిస్తారు.
సంగీతం హిందూ సంస్కృతిలో ఒక ప్రధాన భాగం అయిపోయింది. వైష్ణవ సంప్రదాయములో సంగీతానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది, సంగీతాన్ని ఆధారంగా చేసుకొని ఎందరో భగవతారాధన చేసి తరించారు. క్రీస్తు పూర్వం 1800 ప్రాంతములోనిదిగా భావించబడుతున్న చందోగ్య ఉపనిషత్తులో ఆనాడు స్వరముల ఆధారముగా వేద మంత్రాలను పాడే విధానం గురించిన విజ్ఞానాన్ని భద్రపరిచారు. అలా గానం చేసే వారిని సమనులు లేదా సామవేదులు అని పిలిచేవారు. వీరు శంకు, వీణ, వేణువు వంటి వాయిద్యాలను ఉపయోగించేవారు. రాగము అను పదము క్రీ.పూ 200 ప్రాంతమున భరతముని చే రచింపబడినదని భావించబడుతున్న నాట్య శాస్త్రములో కనిపిస్తున్నది. ఆ తరువాతి కాలంలో ప్రాచుర్యం పొంది, పురాణాల కాలంలో అనేక విధములైన కళలలో కనిపిస్తున్నది. నారదునిచే రచింపబడిన సంగీత మకరందమను శాస్త్రములో (క్రీపూ 1100) హిందుస్తానీ సంగీతమును పోలిన పద్ధతి కనిపిస్తున్నది. నారదుడు రాగములకు పేర్లు పెట్టి వర్గీకరణ చేసి ఒక విధానాన్ని రచించాడు. 12వ శతాబ్దమున జయదేవుడు అష్టపది అను సంప్రదాయమున పాడెనని తెలుస్తున్నది.
ఆ తరువాత భారతీయులతో కలిసిపోయిన మొఘల్ సామ్రాజ్యవాదులు, ముఖ్యంగా జలాలుద్దీన్ అక్బర్ కాలంలో సంగీత నృత్య కళలకు ఆదరణ దొరికింది, అదే కాలానికి చెందినవాడు ప్రముఖ సంగీతకారుడు తాన్ సేన్. అతని రాగాలు (సమయానికి అనుగుణంగా విభజింపబడి) ఎంతో శక్తివంతమైనవిగా చెప్పుకోబడతాయి. అతనొక ఉదయం రాత్రి సమయానికి చెందిన రాగమును పాడుట వలన, నగరమంతా మేఘమయమై చీకటి ఆవరించిందని చెప్పుకుంటారు.
20వ శతాబ్దములో మహారాజుల, నవాబుల బలము క్షీణించింది, దాంతోపాటే వారి పోషణ కూడా. ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) ఏర్పడిన తరువాత కొంత మంది కళాకారులను ఆదుకున్నది. 1902లో ఫ్రెడ్ గైస్‌బర్గ్ అనే ఆయన రికార్డు చేయడంతో మొట్టమొదటగా గౌహర్ జాన్ అనే కళాకారిణి వెలుగులోకి వచ్చింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.