సినీ నటి From Wikipedia, the free encyclopedia
శ్రీరంజని (సీనియర్)గా ప్రసిద్ధి చెందిన మంగళగిరి శ్రీరంజని (1906 - 1939) ప్రముఖ పాతతరం చలన చిత్ర నటి. ఈవిడ మరో నటి శ్రీరంజని (జూనియర్)కు అక్క, దర్శకుడు ఎం.మల్లికార్జునరావుకు తల్లి. 1906లో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామంలో జన్మించింది. ఈవిడ 1920, 1930లలో గ్రామోఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా వారు విడుదలచేసిన నాటకాలను రికార్డులలో గాయనిగా తన ప్రైవేటు గీతాల ద్వారా ప్రసిద్ధి పొందింది. చిత్రాలలో నటించకముందు ఈమె పౌరాణిక నాటకాలలో అభిమన్యుడు, సత్యవంతుడు, కృష్ణుడు వంటి పురుష పాత్రలు వేసేది,[2] అప్పట్లో ఆవిడ కృష్ణ విలాస నాటక సమాజంలో సభ్యురాలు. సి.పుల్లయ్య తీసిన లవకుశ (1934) ఈవిడ మొదటి చిత్రం. ఈవిడ మొత్తం 9 చిత్రాలలో నటించింది. 1939లో క్యాన్సర్ వ్యాధి కారణంగా మరణించింది.
శ్రీరంజని | |
---|---|
జననం | 1906 మురికిపూడి, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
మరణం | 1939 మురికిపూడి, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
మరణ కారణం | క్యాన్సర్ |
ఇతర పేర్లు | శ్రీరంజని సీనియర్ |
వృత్తి | రంగస్థల, చలనచిత్ర నటి |
మతం | హిందూ మతం |
భార్య / భర్త | కె.నాగమణి[1] |
పిల్లలు | ముగ్గురు కుమారులు |
శ్రీరంజని బెజవాడ హనుమాన్ దాసు దగ్గర సంగీతం నేర్చుకుంది. మహాకవి కాళిదాసు (1960), ప్రమీలార్జునీయం (1965) వంటి చిత్రాల నిర్మాత కె.నాగమణి కూడా హనుమాన్దాసు దగ్గరే హార్మోనియం నేర్చుకుంది. శ్రీరంజని నాటకాలలో నటిస్తున్నప్పుడు నాగుమణి హార్మోనియం వాయించేది. పరిచమయిన కొన్నాళ్ళకి వారిద్దరు భార్యాభర్తలయ్యారు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. శ్రీరంజని తను చనిపోయేముందు పిల్లల సంరక్షణార్థం తన భర్తను తన చెల్లెలు మహాలక్ష్మిని పెళ్ళి చేసుకోమని చెప్పారు. తర్వాత ఆమె పేరును కూడా శ్రీరంజనిగా మార్చారు. ఆవిడ శ్రీరంజని జూనియర్ గా ప్రసిద్ధి పొందింది, అందువలనే శ్రీరంజనికి సీనియర్ శ్రీరంజని అని పేరు వచ్చింది.
శ్రీరంజని మేనత్తలు నాట్యము చేసేవారు, పాడేవారు. శ్రీరంజనికి ఉత్సాహం కలిగి వారిదగ్గరే ప్రాథమిక పాఠాలు నేర్చుకుంది. రాధాకృష్ణ, శశిరేఖాపరిణయం, సావిత్రి, కనకతార, ఉషాపరిణయం మొదలైన నాటకాలు శ్రీరంజనికి పేరు తెచ్చాయి. అవసరాన్ని బట్టి ఆవిడ నాటకాలలో మగవేషాన్నీ వేసేది. శశిరేఖాపరిణయంలో శశిరేఖ వేసేది, అభిమన్యుడు వేసేది, రాధాకృష్ణలో రాధ, కృష్ణ రెండూ పాత్రలు వేసేది. ఆమెది మంచి గాత్రమని హెచ్.ఎమ్.వి. గ్రామఫోను సంస్థ ఆమెతో ఒప్పందం కుదుర్చుకుని ఎన్నో గ్రామఫోను రికార్డులలో పాడించింది.
శ్రీరంజనికి ప్రయత్నం లేకుండానే సినిమాలో నటించడానికి అవకాశం వచ్చింది. హెచ్.ఎమ్.వి వారు రిహార్సల్సుకని శ్రీరంజనిని బెజవాడ తీసుకువెళ్ళారు. ఆ సమయంలో సి.పుల్లయ్య లవకుశ చిత్రం ఆరంభించడానికి నటులకోసం వెతుకుతున్నారు. ఆ చిత్రంలో శ్రీరామునికి పాత్రకి పారుపల్లి సుబ్బారావునీ, వాల్మీకి పాత్రకి పారుపల్లి సత్యనారాయణనీ నిర్ణయించగా వారి ద్వారా శ్రీరంజని గురించి తెలుసుకున్నారు. అలా శ్రీరంజనికి సీతపాత్ర ఖరారు అయ్యింది. శ్రీరంజని, నాగుమణి ముందు గ్రామఫోను రికార్డింగు నిమిత్తం బెంగళూరు వెళ్ళి అక్కడి నుండి లవకుశ షూటింగ్ కోసం కలకత్తా వెళ్ళారు. లవకుశతో శ్రీరంజనికి శోకపాత్రలే ఎక్కువ వచ్చాయి. మాయాబజార్ (1936)లో సుభద్ర, సతీ తులసి (1937)లో పార్వతి, సారంగధర (1937)లో రత్నాంగి, చిత్రనళీయం (1938)లో దమయంతి, శ్రీకృష్ణలీలలు (1935)లో దేవకి, నరనారాయణ (1937)లో గయుని భార్య, మార్కండేయ (1938)లో మరుద్వతి, వరవిక్రయం (1939)లో భ్రమరాంబ ఆమెకు లభించిన ముఖ్య పాత్రలు. ఈ తొమ్మిది చిత్రాలే శ్రీరంజని నటించిన చిత్రాలు. వీటిలో వరవిక్రయం ఒక్కటే సాంఘికం మిగాతావన్నీ పౌరాణిక చిత్రాలే. ఈ తొమ్మిది చిత్రాల తోనే ఆవిడ మేటితారగా ఎదిగింది. ఆవిడ సినిమాలలోకి వచ్చిన తర్వాత కూడా నాటకాలలో నటించడం మానలేదు. పాట, పద్యం మాత్రమేకాకుండా హావభావాలు ప్రకటించడంలోనూ శ్రీరంజనికి మంచి పేరుండేది. ఆమెది చక్కటి ఉచ్ఛారణ అని, చక్కని భాష అనీ ప్రేక్షకులు చెప్పుకునేవారు.
నాటకాలలో నటించినవారికంటే చలనచిత్రాలలో నటించిన వారికే ఆకర్షణ ఎక్కువ. రంగస్థలం నుండి చలనచిత్రరంగంలోకి ప్రవేశించిన సి.ఎస్.ఆర్, గగ్గయ్య, కన్నాంబ వంటి వారితోటే ప్రేక్షకాదరణ మొదలైంది. ఐతే ఆరాధన, అభిమానం మాత్రం శ్రీరంజనితోనే మొదలయ్యాయి. తెలుగులో మొదటి బాక్స్ఆఫీసు చిత్రంగా చెప్పుకోవలసిన లవకుశ (1934) లో శ్రీరంజని సీత పాత్ర ధరించింది. సినిమాతో పాటు శ్రీరంజనికీ ప్రేక్షకాదరణ లభించింది. ఆ చిత్రంలో సీతాదేవి కష్టాలను చూసి ప్రేక్షకులు కన్నీళ్ళ పర్యంతమయ్యేవారు, సాక్షాత్తు సీతమ్మే తెరమీదకి దిగివచ్చినట్టు నమ్మేవారు. శ్రీరంజనికి ఇదే తొలి చిత్రం అంతకుముందు రంగస్థలనటి. ఈవిధంగా తొలి చిత్రంతోనే గ్లామరు, ఆరాధన సంపాదించుకున్న మొదటి నటి శ్రీరంజని.
లవకుశ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న రోజుల్లో ఆమేకు అనేక చోట్ల సన్మానాలు జరిగాయి. ప్రజలు శ్రీరంజనికి పసుపుకుంకుమలు ఇచ్చి నమస్కారాలు పెట్టేవారు, కొందరు పాదనమస్కారాలు చేసి చీరిచ్చేవారు. సొంతవూరులో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆమెను అభిమానులు వెళ్ళి గుడి దేవతను ఆరాధించినట్టు, పళ్ళు, పువ్వులు, పాలు ఇచ్చి దండాలు పెట్టేవారు. మద్రాసులోని క్రౌన్టాకీసులో లవకుశ శతదినోత్సవం జరిగింది, ఆ ఉత్సవంలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, మద్రాసు గవర్నరు, జైపూరు మహారాజావారు పాల్గొని చిత్రాన్ని, దర్శకుడు సి.పుల్లయ్యని, నటవర్గాన్ని ప్రసంసించారు. ఆ సందర్భంలో శ్రీరంజనికి స్వర్ణపతకం బహుకరించారు.
1939 సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడిన శ్రీరంజని అదే సంవత్సరం తన స్వగ్రామంలో పరమపదించారు. అప్పుడు ఆమె వయసు కెవలం 33. ఆమె మరణవార్తకి పత్రికలు ప్రాముఖ్యం ఇచ్చి చిన్న వయస్సులోనే పెద్ద తార రాలిపోయిందంటూ రాశాయి. సీతాదేవిగా శ్రీరంజనిని చూసి కన్నీళ్ళు పెట్టుకున్న ప్రేక్షకులు ఆమె మరణవార్త విని మరింత శోకించారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.