Remove ads

హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో శ్రీమహావిష్ణువు ఒకరు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి స్థితి కర్త, లయ కర్త, సృష్టికి మూలంగా భావిస్తారు. శ్రీవైష్ణవం సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాథుడు, పరబ్రహ్మం, సర్వేశ్వరుడు. శంకరాచార్యుని పంచాయతన విధానాన్ని అనుసరించే స్మార్తుల ప్రకారం విష్ణువు ఐదు ముఖ్యదేవతలలో ఒకడు.[1] యజుర్వేదం, ఋగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలు నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి.[2][3][4][5][6]

ద్వారకా తిరుమలలో శ్రీ మహావిష్ణువు శిల్పం.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాథారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||

విష్ణు సహస్రనామ స్తోత్రం[7]లో విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, విశ్వరూపుడని, కాలాతీతుడని, సృష్టి స్థితి లయాధిపతియని, దేవదేవుడని కీర్తించింది. పురాణాలలో విష్ణువు వర్ణన ఇలా ఉంటుంది - నీలమేఘశ్యామవర్ణం కలవాడు, చతుర్భుజుడు, పంచాయుధములు ధరించినవాడు, పాల సముద్రంలో శేషునిపై పవళించినవాడు, శ్రీదేవి, భూదేవిలచే కొలువబడుచున్నవాడు, శ్రీవత్సచిహ్నమును, కౌస్తుభమును, వైజయంతీ మాలను ధరించినవాడు, గరుడునిపై ప్రయాణించువాడు.[8]

యుగయుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అవతరిస్తాడు. అలాంటి అనేక అవతారాలలో దశావతారములు ప్రసిద్ధములు. ముఖ్యముగా నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి వంటి అవతారాలలో విష్ణువు పూజింపబడుతాడు.[9][10]

పాలసముద్రంలో శేషశయనుడైన విష్ణువు, పాదసేవ చేయుచున్న శ్రీదేవి, నాభి పద్మంలో బ్రహ్మ - 1870 నాటి చిత్రం
Remove ads

విశ్వం, విష్ణుః వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః

Thumb
13వ శతాబ్దంలో కాంబోడియాకు చెందిన విష్ణువు విగ్రహం

"విష్" అనే ధాతువునుండి "విష్ణు" అనే పదానికి భాష్యకారులు అర్థం చెబుతారు. "విష్" అంటే సర్వత్ర వ్యాపించి ఉండుట, అంతటినీ ఆవరించి ఉండుట అనే అర్థాలున్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం మొదటి శ్లోకంలో "విశ్వం, విష్ణుః, వషట్కారః, భూత భవ్య భవత్ప్రభుః, భూతకృత్, భూతభృత్, భావః, భూతాత్మా, భూత భావనః" అనే నామాలున్నాయి. "యద్ విషితో భవతి తద్ విష్ణుర్భవతి" - అంతటా ప్రవేశించి ఉండేవాడు విష్ణువు - అని నిరుక్తి అర్థం. "వేవేష్టి ఇతి విష్ణుః" అని శంకరాచార్యుల వ్యాఖ్యానం. "విశ్వం" అంటే అంతా తానైనవాడు. "విష్ణువు" అంటే అన్నియెడలా ఉండేవాడు. "భూత భవ్య భవత్‌ప్రభుః" అంటే గడచిన కాలానికి, జరుగుతున్న కాలానికి, రాబోయే కాలానికి కూడా ప్రభువు. భూత కృత, భూత భృత్, భావః, భూతాత్మా, భూత భావనః అంటే అన్ని భూతాలను (జీవులను) సృష్టించి, పోషించి, భరించేవాడు. అన్ని జీవులలోను ఉండేవాడు. ఈ నామ పదాలు హిందూ సంప్రదాయంలో విష్ణువుకు ఉన్న స్థానాన్ని క్లుప్తంగా చెబుతున్నాయనుకోవచ్చును. అనగా విష్ణువు కాలానికి, స్థలానికి, పదార్థానికి అతీతుడు.[11]

భాగవతం గజేంద్ర మోక్షం ఘట్టంలో గజేంద్రుని ప్రార్థన (నిరాకార) పరబ్రహ్మమును ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తుంది. కాని విష్ణువు ఆ మొర ఆలకించి గజరాజును రక్షించడానికి పరుగున వచ్చాడు. అనగా ఆ ప్రార్థనలో చెప్పిన లక్షణాలు విష్ణువుకు అన్వయిస్తాయనుకోవచ్చును - అవి -

  • జగం ఎవనిచే జనిస్తుంది? ఎవ్వనిలో ఉంటుంది? ఎవ్వనిలో అంతమవుతుంది?
  • పరమేశ్వరుడు (అందరికీ దేవుడు) ఎవ్వడు?
  • అంతటికీ మూలం ఎవ్వడు?
  • మొదలు, మధ్య, తుది లేనివాడు (అనంత మూర్తి) ఎవ్వడు?
  • అంతా తానైనవాడెవ్వడు?
  • ఆత్మ భవుడు (తనంత తానే జనించినవాడు),

అయితే సామాన్య పూజాదిక సంప్రదాయాలలోను, విశేషించి శ్రీవైష్ణవ సిద్ధాంతాలలోను శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసుడు, శేష శయనుడు, శ్రీలక్ష్మీ సమేతుడు, నీలమేఘ శ్యాముడు, పరిపూర్ణుడు అయిన పురుషోత్తమునిగా ఆరాధింపబడుతాడు.

Remove ads

వేదాలలో విష్ణువు

Thumb
గరుఢారూఢులైన లక్ష్మీనారాయణులు - 1730 నాటి చిత్రం

నాలుగు వేదాలు హిందూమతానికి మూలగ్రంథాలని చెప్పవచ్చును. వీటిలో అన్నింటికంటే పురాతనమైనదని భావించే ఋగ్వేదంలో విష్ణువును స్తుతిస్తూ ఐదు సూక్తులు ఉన్నాయి. ఇవి కాక ఇంకొక సూక్తంలో కొంతభాగం విష్ణువును గురించి ఉంది. వేదాలలో విష్ణువును గురించి మూడు ముఖ్య లక్షణాలు తరచు ప్రస్తావింపబడినాయి - (1) మూడు పెద్ద అంగలు వేసినవాడు (త్రివిక్రముడు). మూడు అడుగులతో లోకాలను ఆక్రమించినవాడు (2) పెద్ద శరీరం కలిగినవాడు (వరాహమూర్తి). జగత్తంతా వ్యాపించి ఉంటాడు. (3) యువకుడు, నవ యవ్వనుడు. ఇంకా విష్ణువు తన గుర్రాలను (రోజులను) వాటి ఆరు పేర్లతో (ఋతువులతో) చక్రాన్ని తిప్పినట్లు కదల్చాడని చెప్పబడింది. విష్ణువు స్వభావంలో మరొక ముఖ్యాంశం ఇంద్రునితో స్నేహం. వృత్రాసురునితో యుద్ధం చేసేటపుడు, అనంతర రాక్షస సంహారంలోను ఇంద్రునికి విష్ణువు సహకరించాడు.[12].

ఒక వివరణ ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య అనేక యుద్ధాలు జరుగుతుండేవి. దేవతలు ఓడిపోయినా గాని ఏదో ఒక ఉపాయం వలన చివరికి నెగ్గుకొచ్చేవారు అని ఐతరేయ బ్రాహ్మణములో ఉంది. శతపథ బ్రాహ్మణములో ఒక కథ ప్రకారం యుద్ధానంతరం విష్ణువు మూడడుగులలో ఆక్రమించే భూమిని దేవతలకు ఇచ్చేలా రాక్షసులు ఒప్పందం చేసుకొన్నారు. అప్పుడు విష్ణువు లోకాలను, వేదాలను, వాక్కును తన మూడడుగులతో ఆక్రమించాడు. అదే వామనావతారము. శతపథ బ్రాహ్మణములో "ఏమూష" అనే పేరు గల వరాహం భూమిని నీటినుండి పైకి ఎత్తింది అని చెప్పబడింది. తైత్తరీయ సంహితలో ఆ వరాహమే ప్రజాపతి అవతారమని ఉంది. అదే వరాహావతారము. శతపథ బ్రాహ్మణములో మనువును ప్రళయంనుండి ఒక చేప కాపాడుతుంది అని ఉంది. అదే మత్స్యావతారము. ప్రజాపతి నీటిలో తిరిగే తాబేలుగా మారాడు. అదే కూర్మావతారము. యజ్ఞో వై విష్ణుః - అనగా యజ్ఞము విష్ణు స్వరూపము - అని వేదంలో చెప్పబడింది.[12]

కృష్ణ యజుర్వేదం

కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన నారాయణోపనిషత్తులో ఇలా ఉంది -

ఓం. అథ పురుషో హ వై నారాయణోఽ కామయత, ప్రజాః సృజయేతి, నారాయణాత్ప్రాణో జాయతే, మనస్సర్వేంద్రియాణిచ, ఖం వాయుర్జ్యోతి రాపః, పృథివీ విశ్వస్య ధారిణీ, నారాయణాద్బ్రహ్మాజాయతే.... .... -- సృష్టి ప్రారంభంలో పరమపురుషుడైన నారాయణుడు మాత్రమే ఉన్నాడు. అతడు సృష్టి చేయాలనుకొన్నాడు. అప్పుడు నారాయణుని శరీరంనుండి హిరణ్యగర్భుడు పుట్టాడు.. ...

ఋగ్వేదం

ఋగ్వేదంలో ఇలా ఉంది -

అథ నిత్యో నారాయణః, బ్రహ్మో నారాయణః, శక్రశ్చ నారాయణః, ద్యావా పృథివ్యౌచ నారాయణః, కాలశ్చ నారాయణః, దిశశ్చ నారాయణః, ఊర్ధ్వంచ నారాయణః, అధశ్చ నారాయణః, అంతర్బహిశ్చ నారాయణః,నారాయణ ఏవేదగ్‌ం సర్వం, యద్భూతం యచ్చభవ్యం, నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో, నిరాఖ్యాతశ్శుద్ధో దేవ ఏకో నారాయణః,న ద్వితీయోఽస్తి కశ్చిత్, య ఏవం వేదస విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి, ఏతద్యజుర్వేద శిరోఽధీతే -- నారాయణుడే సత్యము, నిత్యము, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, భూమి, ఆకాశము, పైన, క్రింద, అన్నిదిశలు, బయట, లోపల అన్నీ నారాయణుడే. అతడే భూత భవిష్యద్వర్తమానాలు. అతడు నిష్కళంకుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు. నారాయణుని మాటలతో నిర్వచింపలేము..
Remove ads

పురాణేతిహాసాలలో విష్ణువు

హిందూ పురాణాలు, ఇతిహాసాల ప్ర‌కారం బ్ర‌హ్మ సృష్టిక‌ర్త కాగా, విష్ణువు ర‌క్ష‌ణ‌కారుడుగా, ప‌ర‌మ శివుడిని వినాశ‌కారుడిగా భావిస్తారు. పురాణాలలో కేవలం విష్ణువుకు సంబంధించిన ప్రస్తావన ఆంశాలున్నది, విష్ణుపురాణం. చతుర్ముఖ బ్రహ్మ మొదటగా దక్ష పజాపతికి వినిపించగా, దక్షుడు ద్వారా పురుకుత్సుడను రాజుకు చెప్పగా, ఈ రాజు సారస్వతుడను వానికి చెప్పాడు. పులస్త్య బ్రహ్మ వలన దివ్యజ్ఞాన శక్తిని పొందిన వాడు, వశిష్ట మహర్షి యొక్క మనుమడు, శక్తి మహర్షి,దృశ్యంతి దంపతుల కుమారుడు అయిన పరాశర మహర్షి సారస్వతుడు ద్వారా పొందగా, పరాశరుని నుండి అతని శిష్యుడు అయిన మైత్రేయునకు విష్ణుపురాణం వివరించి వినిపించాడు. సృష్టి, స్థితి, లయ కారకులు అయిన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు కథలే పురాణాములు. ఇందులో పది పురాణాములు శివునికి, రెండు దేవీకి, నాలుగు బ్రహ్మ పరమైనవి, విష్ణువు సంబంధించినవి.

మహావిష్ణువు అవయవాలు

అష్టాదశా మహాపురాణాలు అయిన 1.బ్రహ్మ పురాణం (మహావిష్ణువు యొక్క శిరస్సు), 2.పద్మపురాణం (మహావిష్ణువు యొక్క హృదయం), 3.విష్ణుపురాణం (మహావిష్ణువు యొక్క కుడిచేయి), 4.వాయుపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమచేయి), 5.శ్రీమద్భాగవతపురాణం (మహావిష్ణువు యొక్క తొడలు), 6. నారదపురాణం (మహావిష్ణువు యొక్క నాభి), 7.మార్కండేయపురాణం (మహావిష్ణువు యొక్క కుడిపాదం), 8.అగ్నిపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమ పాదం), 9.భవిష్యపురాణం (మహావిష్ణువు యొక్క కుడిమోకాలు), 10.బ్రహ్మవైవర్తపురాణం (మహావిష్ణువు యొక్క ఎడామ మోకాలు), 11.లింగపురాణం (మహావిష్ణువు యొక్క కుడి చీలమండ), 12.వరాహపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమ చీలమండ), 13.స్కాందపురాణం (మహావిష్ణువు యొక్క కేశములు), 14.వామనపురాణం (మహావిష్ణువు యొక్క చర్మము), 15.కూర్మపురాణం (మహావిష్ణువు యొక్క వీపుభాగం), 16.మత్స్యపురాణం (మహావిష్ణువు యొక్క మెదడు), 17.గరుడపురాణం (మహావిష్ణువు యొక్క మాంససారము), 18.బ్రహ్మాండపురాణం (మహావిష్ణువు యొక్క ఎముకలు) మొదలయినవి; మహావిష్ణువు యొక్క శరీరం లోని 18 అవయవములతో పోల్చారు.[13][14]

పురాణములు క్రమం

అష్టాదశా మహాపురాణాల లోని బ్రహ్మ పురాణం మొదటదనీ, రెండవది పద్మపురాణం, విష్ణుపురాణం మూడవదనీ వరుసగా ఆయా పురాణాములను పేర్కొనడం జరిగింది. అష్టాదశా మహాపురాణాలను విష్ణు స్వరూపుడు అయిన వ్యాసుడు (వ్యాసమహర్షి) ప్రజలకు అందించాడు.

ప్రధానమైనవి

  • శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమాహాత్మ్యాన్ని, దేవాలయ జీర్ణోద్ధరణ ఫలాన్ని తెలియజేస్తున్నది స్కందపురాణం.
  • శివ-కేశవుల మధ్య ఎటువంటి భేదం లేదనీ, వీరిద్దరినీ భేదభావంతో చూడకూడదని విష్ణుపురాణం లోని సందేశం.
  • సృష్టి యందలి సమస్తము హరిమయమేనని ఉపదేశిస్తున్నది పద్మపురాణం.
  • యమునా-సరస్వతుల సంగమంనందు విష్ణుపూజ సకల అభీష్ట ప్రదాయకము అని వరాహపురాణం నొక్కి వక్కాణిస్తోంది.
  • విష్ణుమందిరాలు, విష్ణుభక్తులు గురించి వివరిస్తోంది వామనపురాణం.
  • బ్రహ్మపురాణం వాస్తవానికి మహావిష్ణువు యొక్క మాహాత్మ్యాన్ని తెలియజేస్తుంది. ఇందులో నైమిశారణ్యం వర్ణన, మహాప్రళయ-అవాంతర ప్రళయాలు, శునశ్శేఫ చరితం, హరిశ్చంద్ర, సగర, భగీరథుల యొక్క చరిత్ర, గోదావరి నది పవిత్రత, ఆత్రేయ ఋషి వృత్తాంతం, వసుదేవుని యొక్క పుట్టుక, భూగోళ,సప్త ద్వీప వర్ణన, దధీచి మహర్షి వృత్తాంతం, సముద్ర స్నానవిధి, సూర్య పూజా మహాత్మ్యం, కామదహనం, పార్వతీ స్వయంవరం, నరసింహ స్వామి పూజా విధానం, ఇంద్రద్యుమ్న యొక్క చరితం, పూరీ జగన్నాథ క్షేత్రం వర్ణన, ఉమామహేశ్వర స్తోత్రం, అహల్య వృత్తాంతం, సరస్వతీదేవి వృత్తాంతం, క్షీరసాగర మథనం, మార్కండేయ ప్రభావం, వరాహ, నరసింహ, దత్తాత్రేయ, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణావతారాల వర్ణన, విశ్వామిత్రుని తపస్సును భంగపరచడం ద్వారా శాపవశము వలన అప్సరసలు నదులుగా రూపం పొందుట మొదలైన అనేక విషయాలు బ్రహ్మపురాణంలో ఉన్నాయి.
Remove ads

మత సాంప్రదాయాలు

విశిష్టాద్వైతంలో విష్ణువు

విశిష్టాద్వైత ప్రవర్తకుడైన రామానుజాచార్యుడు సా.శ. 1017లో జన్మించాడు. 1049లో సన్యాసం స్వీకరించాడు. విశిష్టాద్వైతం లేదా శ్రీవైష్ణవం ప్రకారం భగవంతుడు ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవి నారాయణునినుండి వేరు కాదు. నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం. మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. భక్తితో పాటు ప్రపత్తి, అనగా మనసా వాచా కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం. మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. కుల, లింగ విచక్షణ లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే.[12]

నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము. చిత్తు జీవుడు. అచిత్తు ప్రకృతి. ఇవి రెండూ ఆయన శరీరము. సూక్ష్మ చిదచిద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టుడు కావడమే సృష్టి. ప్రకృతి మూలంగానే ఈ జగత్తు అంతా సృజింపబడుతున్నది. శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలు దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తులపట్ల వాత్సల్యంతో ఐదు మూర్తులుగా గోచరిస్తాడు. అవి

  1. అర్చావతారము - దేవాలయాలలోని ప్రతిమలు
  2. విభవావతారములు - రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు.
  3. వ్యూహావతారములు - వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు.
  4. సూక్ష్మావతారము - సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మము.
  5. అంతర్యామి - సకల జీవనాయకుడు.

భగవంతుని అనుగ్రహానికి భక్తి ప్రపత్తులు ముఖ్యం. అందుకు ఉపాసనా విధానాలు - (1) అభిగమనము (2) ఉపాదానము (3) ఇజ్యము (4) స్వాధ్యాయము (5) యోగము

Remove ads

అవతారాలు

Thumb
విష్ణుమూర్తి విశ్వరూపం
  1. మత్స్యావతారము
  2. కూర్మావతారము
  3. వరాహావతారము
  4. నరసింహావతారము
  5. వామనావతారము
  6. పరశురామ అవతారము
  7. రామావతారము
  8. కృష్ణావతారము
  9. బలరామావతారం
  10. కల్కి అవతారము

దేవాలయాలు

Remove ads

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads