మూస:హిందూధర్మ హిందూధర్మ సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు
- బ్రహ్మ - సృష్టికర్త
- విష్ణువు - సృష్టి పాలకుడు
- మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు
ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కథలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి. కాని ప్రధానమైన నమ్మకాలుగా క్రిందివాటిని చెప్పవచ్చును.
- బ్రహ్మ: సృష్టి కర్త. బ్రహ్మ ఉండేది సత్యలోకం. ఆసనం పద్మం. బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి. బ్రహ్మకు పత్ని సరస్వతి చదువుల దేవత. విష్ణువు నాభి లోని పద్మంనుండి బ్రహ్మ జనించాడు గనుక బ్రహ్మకు విష్ణువు జనకుడు.
- విష్ణువు: సృష్టి పాలకుడు. అంటే సృష్టిని నడిపించేవాడు. నివాసం వైకుంఠం. శయనించేది పాలకడలిలో ఆదిశేషునిపైన. పయనించేది గరుత్మంతునిపైన. సంపదల దేవతయైన లక్ష్మీదేవి విష్ణువునకు భార్య. ఆయన ఆయుధములు అయిదు. నారాయణుడు, వాసుదేవుడు వంటి ఎన్నో నామములు. వీటిలో వేయి ప్రధాన నామములు విష్ణు సహస్రనామ స్తోత్రముగా ప్రసిద్ధము. విష్ణువు యుగయుగాన అవతారాలెత్తి లోకంలో ధర్మం నిలుపుతాడు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వేంకటేశ్వరస్వామి ఇవి ప్రజలు ఎక్కువగా ఆరాధించే అవతారాలు.
- శివుడు: కాలాంతములో సృష్టిని అంతము చేస్తాడు (పునఃసృష్టికి అనుకూలంగా). ఉండేది కైలాసం. వాహనం నంది. త్రినేత్రుడు. తలపై గంగ. మెడలో సర్పము. చర్మాంబరధారి. భక్తసులభుడు. శివుని ఇల్లాలు పార్వతి జగజ్జనని. ఈశ్వరుడు, శంకరుడు, మహాదేవుడు, గంగాధరుడు, నీలకంఠుడు ఇవి ఈయన కొన్ని పేర్లు.
వీరంతా ఒకే పరబ్రహ్మముయొక్క వివిధ స్వరూపములనికూడా పలుచోట్ల ప్రస్తావింపబడింది.
విశేషాలు
- ఒక పురాణ కథ ప్రకారం బ్రహ్మకు ఒక శాపం కలిగింది. కనుక బ్రహ్మను పూజించడం అరుదు. కాని త్రిమూర్తులను కలిపి పూజిస్తే దోషం లేదంటారు.
- ఇలా చేసే పూజలలో త్రిమూర్తి వ్రతం ముఖ్యమైనది.
- బ్రహ్మ విష్ణువు రుద్రుఁడు. ఆదిని నిర్గుణస్వరూపుఁడు అయిన ఈశ్వరుఁడు (శుద్ధబ్రహ్మము లేక శుద్ధచైతన్యము) "బహుస్స్యాం" అని సంకల్పించి సృష్టి చేయ ఉద్యమించెను. ఈ సంకల్పస్థితియందు ఆబ్రహ్మము ప్రకృతిపురుషస్వరూపుఁడు అగుచు సత్వరజస్తమోగుణాత్మకుఁడై ఉండెను. ఆస్వరూపమునందు అతఁడు శబళబ్రహ్మము లేక మాయావచ్ఛిన్నచైతన్యము అనఁబడును. అది అతనికి మాయోపాధిచే అనఁగా ప్రకృతి సంబంధముచేత కలిగెను. మాయ అన విచిత్రసృష్టికి హేతువు: ప్రకృతి అన మహదాది వికారములకు కారణము. ఇది జ్ఞానవిరోధిగా ఉండుటవలన ఆవిద్య అనియు చెప్పఁబడును. అట్టి ప్రకృతి సంబంధముగల శబళబ్రహ్మ స్వరూపమునందు (అనఁగా కేవల సంకల్పస్థితియందు) సత్వరజస్తమోగుణములు మూఁడును సమములు అయి ఉండును. సత్వము జ్ఞానసుఖములను వానియందు ఇచ్చను పుట్టించుచు ఉంది. ఇది విష్ణురూపము అయ్యెను. రజస్సు రాగతృష్ణలయందు సంగమమును పుట్టించుచు ఉంది. ఇది చతుర్ముఖబ్రహ్మ స్వరూపము అయ్యెను. తమస్సు విపరీతజ్ఞానమును నిద్రాలస్యాదులను పుట్టించుచు ఉంది. ఇది లయ కారణము అగుటవలన రుద్రస్వరూపము అయ్యెను. ఆసంకల్పస్థితి వదలి ఈశ్వరుఁడు సృష్టిక్రియారూపుఁడు కాఁగానే ఈసత్వరజస్తమోగుణములకు వైషమ్యము కలిగెను. అదియే మహత్తత్వ స్వరూపము. అది సాత్వికము రాజసము తామసము అని మూఁడువిధములు కలది. ఆస్థితియందు బ్రహ్మము సూత్రబ్రహ్మము (లేక అంతఃకరణావచ్ఛిన్నచైతన్యము) అనఁబడును. ఈశ్వరూపమున అతఁడు నామరూపాత్మకమైన సకలప్రపంచమును సృజియించెను. ఆ స్రష్టృసృజ్య తాదాత్మ్యస్వరూపమైన బ్రహ్మము విరాడ్రూపము అనఁబడు జ్ఞానమాత్రతాదాత్మ్య స్వరూపము విష్ణుస్వరూపము.
విరాడ్రూపస్థితియందు చిత్స్వరూపమైన జ్ఞానమును వృత్యవచ్ఛిన్యచైతన్యము అంటారు; జ్ఞానశూన్యమై వికారాస్పదమై ఉండుదానిని విషయావచ్ఛిన్నచైతన్యము అంటారు. అట్లు విరాట్సరూపుఁడు అయిన బ్రహ్మమువలన నుండి ప్రపంచసృష్టి కలిగెను. ఎట్లు అనిన:
1. తమస్సృష్టి. తమస్సు - మోహము - మహామోహము - తమిస్రము - అంధతమిస్రము; ఇందుండి చేతనములేని స్థావరసృష్టి కలిగెను.
2. తిర్యక్సృష్టి. పశుపక్ష్యాదులు.
3. దేవసృష్టి. తుష్టాత్ములై నిత్యానందులై కేవల సాత్వికభూతులైనవారు ఈసృష్టియందు పుట్టిరి. "నహదేవా అశ్నంతి నపిబంతి ఏతదేవామృతం దృష్ట్వాతృప్యతి" అని సాత్వికమునకు ప్రమాణము.
4. అర్వాక్సృష్టి. తమ ఉద్రేకులు అయి దుఃఖబహుళములు కలిగి కర్మశీలులు అయిన మనుష్యుల సృష్టి.
5. అనుగ్రహసృష్టి. ఇది సాత్వికతామసమిశ్ర గుణములు కల జంతురాశి సృష్టి.
6. కౌమారసృష్టి. ఇది ప్రాకృతము వైకృతము అని రెండువిధములు. ఈసృష్టియందే సనత్కుమారాదులు పుట్టినది.
ఈయాఱును మహాత్సృష్టి, పంచతన్మాత్రసృష్టి, పంచభూతేంద్రియసృష్టి అను మూటితో చేరి తొమ్మిది సృష్టులు అగుచు ఉన్నాయి. ఇది నవవిధిసృష్టి వివరణము.
ఈ సత్వరజస్తమో గుణాత్మకులైన త్రిమూర్తులు తమతమ అంశములను ఒకరొకరు పంచుకొనియు ఉందురు. ఆస్థితియందు వారికి నామాంతరములు ఉన్నాయి. అవి విష్ణువ్యూహము, బ్రహ్మవ్యూహము, రుద్రవ్యూహము అనఁబడును.
విష్ణ్వంశము బ్రహ్మాంశము రుద్రాంశము వి. ప్రద్యుమ్నుఁడు సంకర్షణుఁడు అనిరుద్ధుఁడు బ్ర. మనువు దక్షుఁడు యముఁడు రు. మృడుఁడు భవుఁడు హరుఁడు
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
- హిందూమత సంప్రదాయాలగురించిన వ్యాసం
- అమెరికాలో హిందూదేవాలయాలలో సంప్రదాయాలు, విష్ణు-శివ మందిరాలు కలిపి ఉండడంపై చర్చ
- త్రిమూర్తుల గురించి
- శైవగురువు బోధినాధుని ప్రవచనాలు - శివుడు, విష్ణువు ఒకే పరమాత్ముని స్వరూపాలని Archived 2008-07-05 at the Wayback Machine
- భాగవత పురాణంలో కొన్ని అంశాలు.
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.