శ్రీశ్రీ రచించిన సంచలన కవితా సంకలనం మహా ప్రస్థానం, ఇది వెలుబడిన తరువాత తెలుగు సాహిత్యపు ప్రస్థానానికే ఓ దిక్సూచిలా వెలుగొందినది, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని 'మహా ప్రస్థానానికి ముందు, మహా ప్రస్థానానికి తరువాత' అని విభజించవచ్చు అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇది ఒక అభ్యుదయ కవితా సంపుటి. దీనిలో మొత్తం నలబై కవితలు ఉన్నాయి. ఇందులో శ్రీశ్రీ కార్మిక కర్షిక శ్రామిక వర్గాలను ఉత్తేజితులను చేస్తూ, నూతనోత్సాహం కలిగిస్తూ, ఉర్రూతలూగిస్తూ గీతాలు వ్రాసినాడు. ఇది తెలుగు కవితకే ఓ మార్గదర్శి అయినది. మహా ప్రస్థానం కవితా సంపుటికి యోగ్యతాపత్రం శీర్షికన ఉన్న ముందుమాట ప్రముఖ తెలుగు రచయిత గుడిపాటి వెంకట చలం వ్రాసినారు.
మహాప్రస్థాన కవితల రచన మొత్తంగా 1930 దశకంలో జరిగింది. మరీ ముఖ్యంగా 1934కూ 1940కీ నడుమ వ్రాసినవాటిలో గొప్ప కవితలను ఎంచుకుని 1950లో ప్రచురించారు శ్రీశ్రీ. ఈ కవితలు తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వమనే కవితావిప్లవాన్ని సృష్టించడానికి ఒకానొక కారణంగా భావించారు.[1] శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని విశ్లేషిస్తూ వెలువడిన అనేక వ్యాసాల పరంపరలో అద్దేపల్లి రామమోహనరావు వ్రాసిన శ్రీశ్రీ కవితాప్రస్థానం పేర్కొనదగింది.
రచనా నేపథ్యం
1930 దశకం ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం వల్ల నిరుద్యోగులైన యువకుల జీవితాలు మొదలుకొని చిరుద్యోగుల వరకూ సమాజంలోని అనేకమైన వర్గాల జీవితాలు అల్లకల్లోలమైన సమయం. ఆ కాలాన్ని ఆకలి ముప్పైలు (హంగ్రీ థర్టీస్) అని పిలిచారు. ఈ దశలో వ్యక్తిగతంగానూ, సాంఘికంగానూ శ్రీశ్రీ చుట్టూ జరిగిన సాంఘిక పరిణామాలు ఆయన రచనా వస్తువులను నిర్దేశించాయి. రచనా క్రమంలో కూడా మొదట పద్యాలను భావకవుల ప్రభావం వ్రాస్తున్న శ్రీశ్రీ క్రమంగా ఇతర భాషల్లో వస్తున్న ప్రక్రియాపరమైన మార్పులు అర్థం చేసుకుంటూ ఒకానొక పరిపక్వమైన దశకు చేరుకున్నారు. అలాంటి స్థితిలో 1934 నుంచి 1940 వరకూ తాను రాసిన కవితల్లోని ఉత్తమమైన, మానవజాతి ఎదుర్కొంటున్న బాధల గురించి, క్రొత్తగా వెలువడాల్సిన సాహిత్యం గురించి వ్రాసిన కవితలను మాత్రం తీసుకుని 1950ల్లో ప్రచురించారు.
సంకలనంగా కాక విడివిడిగా ప్రచురణ పొందిన, వేర్వేరు కవితావేదికలపై కవితాగానం చేస్తున్న దశలోనే మహాప్రస్థానంలోని కవితలు పేరు ప్రఖ్యాతులు పొందాయి. కవితా! ఓ కవితా!!ను నవ్యసాహిత్య పరిషత్తు వేదికపై తన ధోరణిలో గొణుగుడు లాంటి స్వరంతో చదువుతుండగా అదే వేదికపై అధ్యక్షునిగా కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఉన్నారు. తొలినాళ్ళలో శ్రీశ్రీకి అభిమానపాత్రుడైనవాడు, అప్పటికే గొప్పకవిగా పేరు సంపాదించినవాడు విశ్వనాథ సత్యనారాయణ కవిత పూర్తవుతుండగానే తడిసిన కన్నులతో వేదికపైన అటు నుంచి ఇటు నడచుకుంటూ వచ్చి కౌగలించుకుని ప్రస్తుతించారు. కాకినాడలో కమ్యూనిస్టు యువకుల మహాసభలో శ్రీశ్రీ చదివిన గేయం కూడా ఇందులో ఉంది. దానిని విని అడవి బాపిరాజు, శ్రీరంగం నారాయణబాబు దానిని అనుకరించే ప్రయత్నాలు చేయగా, ముద్దు కృష్ణ తన పత్రికయైన జ్వాలలో పట్టుపట్టి ప్రచురించుకున్నారు. జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి పాడి వినిపించగా చలం కన్నీళ్ళు పెట్టుకునేలా చేసిన చేదుపాట అనే గేయం కూడా ఇందులో చేరింది. సంకలనంగా ప్రచురణకు ముందే ఇందులోని చాలా కవితలను అడవి బాపిరాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి అప్పటికే చేస్తున్న సభల్లో పలువురు కవుల పాటలతో కలిపి పాడేవారు. ఆ విధంగా కూడా ఈ గీతాలు ప్రాచుర్యం పొందాయి.
నవ్యసాహిత్య పరిషత్తు వేదికపై కవితా ఓ కవితా గేయాన్ని విన్న విశ్వనాథ అక్కడిక్కడే శ్రీశ్రీని ఆర్ద్రంగా అభినందించడంతో పాటుగా దానిని ప్రచురిస్తానని అన్నారు. ఆ గ్రంథానికి పీఠిక చలమే రాయాల్సిందని మరో రచయిత చింతా దీక్షితులు ద్వారా కబురుపెట్టారు. అయిత చలం ముందుమాటగా యోగ్యతా పత్రం వ్రాసినా విశ్వనాథ వారు కారణాంతరాల వల్ల ప్రచురించలేకపోయారు. 1950న మహాప్రస్థానం మొట్టమొదటిసారిగా నళినీకుమార్ ఆర్థిక సహాయం ప్రచురణ పొందింది. నళినీమోహన్ పూర్తిపేరు ఉండవల్లి సూర్యనారాయణ. ఈ పుస్తకాన్ని 1938లో అకాల మరణం పొందిన శ్రీశ్రీ స్నేహితుడు, సాహిత్యకారుడు కొంపెల్ల జనార్ధనరావుకు అంకితమిచ్చారు.[2]
ఇతివృత్తాలు
మహాప్రస్థానం గేయాల్లోని ఇతివృత్తాలు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా మానవజాతి ఎదుర్కొంటున్న బాధలు, వీటికి నేపథ్యంగా ఉన్న చారిత్రిక పరిణామాలు, పీడితుల పక్షాన నిలవాల్సిన కవికి అవసరమైన లక్షణాలు, నూతనమైన ఈ అంశాలపై రావాల్సిన కవిత్వమూ, తన కవిత్వానికి లక్షణాలు, పీడితులను ఇంకా పీడించేందుకు సహాయకారిగా ఉండే తాత్త్వికతలపై తిరుగుబాటు వంటివి ఉన్నాయి. వీటన్నిటికీ మూలమైన నేపథ్యంగా తన కవితాతాత్త్వికతనీ, దానికి వెనుకనున్న సంఘర్షణనీ అపురూపంగా వెల్లడించిన కళాఖండమైన కవితా ఓ కవితా కూడా ఉంది.
మొదటి గేయం మహాప్రస్థానం. అదొక కవాతు పాట లాంటిది. పదండి ముందుకు పదండి త్రోసుకు అంటూ ప్రబోధించే ఈ గేయం హరోం! హరోం హర! హరోం! హరోం హర!హర! హర! హర! అంటూ యుద్ధనినాదం చేసుకుంటూ కదలమన్నాడు. ఐ గేయంలో తాను స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం అని చెప్పుకున్నారు, నా మహోద్రేకాలు భవభూతి శ్లోకాలు, పరమేష్ఠి జూకాలు అంటూ తన గురించి వ్రాసుకున్నారు. దీనిని విమర్శకులు నిర్ద్వంద్వంగా, నిరాఘాటంగా చేసుకున్న ఆత్మస్తుతిగా పేర్కొన్నారు. మూడో కవిత జయభేరి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను అంటూ సాగే ఈ గేయంలో తన వల్ల అయ్యేది తాను చేయగలగడం మొదలుకొని తుదకు ఆ తానే భువన భవనపు బావుటానై పైకి లేస్తానని, నా కుహూరుతశీకరాలే, లోకమంతా జల్లులాడే, ఆ ముహూర్తా లాగమిస్తాయి అన్నారు.
యోగ్యతా పత్రం
యోగ్యతా పత్రం - మహాప్రస్థానం పుస్తకానికి 1940 లో చలం రాసిన పీఠిక. తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప పీఠికలలో ఇది ఒకటి. ఆ పుస్తకం ఎవరు చదవాలో, ఎందుకు చదవాలో, ఎలా చదవాలో వివరించే పీఠిక అది. "రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రపంచ ఘోషం ఝంఝానిల షడ్జధ్వానం" విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి." అంటూ పుస్తకం చదవడానికి పాఠకుడిని సమాయత్త పరచే పీఠిక అది. యోగ్యతాపత్రంలో చలం రాసిన కొన్ని వాక్యాలు మచ్చుకు:
- ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాథం లోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరి బిక్కిరై తుఫాను హోరు చెవుల గింగురు మని, నమ్మిన కాళ్ళ కింది భూమి తొలుచుకు పోతోవుంటే, ఆ చెలమేనయమని వెనక్కి పరిగెత్త చూస్తారు.
- తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీ శ్రీ అడిగితే, కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చెలం. "తూచవద్దు, అనుభవించి పలవరించ" మన్నాడు శ్రీ శ్రీ.
శ్రీశ్రీ నిర్వహించిన ప్రజ శీర్షిక లో పిచ్చయ్య అనే పాఠకుడు ఇలా ప్రశ్నించాడు "యోగ్యతా పత్రం చదివితే మహాప్రస్థానం చదవనక్కరలేదని నేను అంటాను, మీరేమంటారు". అతిశయోక్తి అయినా, అంతటి గుర్తింపు పొందిన పీఠిక అది.
అయితే శ్రీశ్రీ ఆ పాఠకుడి ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు: "మీరు సార్థక నామధేయులంటాను"
కవితా సూచిక
- యోగ్యతా పత్రం
- కొంపెల్లి జనార్ధన రావు కోసం
- జయభేరి
- ఒక రాత్రి
- గంటలు
- ఆకాశ దీపం
- అవతారం
- ఆశా దూతలు
- ఐ !
- శైశవ గీతి
- అవతలి గట్టు
- సాహసి
- కళారవి
- భిక్షు వర్షీయసి
- ఒక క్షణంలో
- పరాజితులు
- ఆ ః !
- ఉన్మాది
- స్విన్‌బర్న్ కవికి
- వాడు
- అభ్యుదయం
- వ్యత్యాసం
- మిథ్యావాది
- కవితా! ఓ కవితా !
- జ్వాలా తోరణం
- మానవుడా !
- దేనికొరకు ?
- పేదలు
- గర్జించు రష్యా !
- నిజంగానే ?
- నీడలు
- జగన్నాథుని రథచక్రాలు
ముద్రణలు
తొలి ప్రచురణ తర్వాత 70 సంవత్సరాలకు, శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు, "శ్రీశ్రీ మహాప్రస్థానం మొదలైన గీతాలు" అనే శీర్షికతో పెద్ద పరిమాణంలో మహాప్రస్థానం రూపకల్పన చేసి ప్రచురించారు. నిలువుటద్దం అని విజయవాడలో ఈ పుస్తకాన్ని తనికెళ్ళ భరణి ఆవిష్కరించాడు. భరణి ఈ పుస్తకాన్ని నిలువుటద్దంగా అభివర్ణించాడు.[3] మహాప్రస్థానం రచన పుట్టుక, తొలిసారి చదివిన వివరాలు, ముద్రణలకు నోచుకున్న తీరు, పలుముద్రణల ముఖచిత్రాలు వివరాలు కూడా దీనిలో వున్నాయి.[4]
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.