From Wikipedia, the free encyclopedia
1950లో శ్రీశ్రీ వ్రాసిన మహాప్రస్థానంని నళినీకుమార్ బందరు నుండి వెలువరించాడు. 1964 ప్రాంతాలలో మహాప్రస్థానంను చదివిన అద్దేపల్లి రామమోహనరావు శ్రీశ్రీ ప్రాచీనధోరణిని తన శైలికీ, భావస్ఫురణకీ వినియోగించిన అపూర్వమైన పద్ధతీ, సామాజిక వైరుధ్యాలను ప్రతిబింబించిన విధానమూ, ఆధునిక ఆంగ్ల శిల్పరీతుల్ని ఉపయోగించిన నవ్యప్రయోగ నైపుణ్యమూ చూసి ఆకర్షితుడై విశ్లేషణ వ్యాసాలు వ్రాశాడు. ఈ వ్యాసాలు 1965-66లో నీలంరాజు వెంకటశేషయ్య సంపాదకత్వంలో వస్తున్న ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధం 'కళాసాహిత్యవిజ్ఞానవేదిక'లో వరుసగా ప్రచురించబడ్డాయి. ఈ వ్యాసాలన్నింటినీ శ్రీశ్రీ కవితాప్రస్థానంపేరుతో పుస్తకరూపంలో 1968లో ప్రచురించాడు. జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ఒకే ఒక కవిని శిల్పరీత్యా విశ్లేషిస్తూ ఆధునిక సాహిత్యంలో వెలువడిన మొదటి పుస్తకంగా దీనిని పేర్కొనవచ్చు. ఈ పుస్తకాన్ని రాచమల్లు రామచంద్రారెడ్డి తన సంవేదన త్రైమాస పత్రిక (అక్టోబరు1968) లో ఖండిస్తూ తీవ్రమైన విమర్శచేశాడు. తరువాతి కాలంలో శ్రీశ్రీ అద్దేపల్లి వ్యాఖ్యానమే సరైనదని ఒప్పుకున్నాడు.
శ్రీశ్రీ కవితాప్రస్థానం | |
కృతికర్త: | అద్దేపల్లి రామమోహనరావు |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | విమర్శావ్యాసాలు |
ప్రచురణ: | అద్దేపల్లి రామమోహనరావు,మధురానగర్, కాకినాడ |
విడుదల: | నాలుగవ ముద్రణ 2009 |
పేజీలు: | 136 |
అంపశయ్య నవీన్ : సహృదయుడైన విమర్శకుడిగా స్థిరపడటానికి అద్దేపల్లికి రా.రా. విమర్శ తోడ్పడింది. సామాన్య విమర్శకుడైతే రా.రా. చేసిన ఆ ఘాటు విమర్శ అద్దేపల్లిని విమర్శకుడిగా అంతం చేసి ఉండేది. అంతటి విమర్శను స్పోర్టివ్‌గా తీసుకుని విమర్శకుడిగా తన స్థానాన్ని పదిలపరచుకున్న అద్దేపల్లిని అభినందించాలి.
ద్వా.నా.శాస్త్రి : అద్దేపల్లి శ్రీశ్రీకి భజన చెయ్యడం కోసం ఈ పుస్తకం రాయలేదు. "సత్యశోధన" కోసం రాశాడు. శ్రీశ్రీని అర్థం చేసుకోవటానికి కొన్ని సూత్రాలు, చిట్కాలు అందించాడు. ఎక్కడైతే శ్రీశ్రీ ప్రయోగాలు సమంజసంగా లేవో అక్కడ అలా నిర్భయంగా చెప్పటంలోనే అద్దేపల్లి నిజాయితీ వెల్లడై "సద్విమర్శ" అయింది. "కదిలేదీ కదిలించేదీ - మారేదీ మార్పించేదీ" వంటివి పాక్షిక సత్యాలు మాత్రమే అన్నాడు. శ్రీశ్రీ భావాల సమన్వయంలోనూ, ప్రయోగాలలో కల లోపాలను, అసమంజసాలను కూడా అద్దేపల్లి చెప్పటంలో సహృదయవిమర్శ ఉంది.
జి.సుబ్బారావు : మహాప్రస్థానంలోని పదబంధాలు, వాటి అర్థాలూ చాలా చోట్ల అర్థం కావు. కానీ ఏదో తెలియని వేగం పాఠకుల్ని తన వెంట లాక్కుపోతాయి. అటువంటి పాఠకులకు "శ్రీశ్రీ కవితాప్రస్థానం" అర్థాలను, సందర్భాలను విపులీకరించి గొప్పమేలు చేసింది.
కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి : అద్దేపల్లి ప్రాచీన కవుల భావజాలాన్ని, ఆధునిక కవులలోని సనాతన వాదుల సాహిత్య అనుసరణీయతతో ఆధునిక వచన కవితా శిల్పిని పోలుస్తూ ఉత్తర దక్షిణ ధ్రువాలకు తోరణపాకు కట్ట ప్రయత్నిస్తాడు. శ్రీశ్రీని కవితా హోమగుండంగా అభివర్ణిస్తాడు. సవీన లక్షణాలున్న భావవ్యంజకతా మార్గాన్ని పాఠకలోకానికి చూపిస్తాడు. శ్రీశ్రీ కవిత్వం పారడీలకు బాగా మూలమైనదిగా భావిస్తాడు. స్వతంత్రత గూడుకట్టుకున్న చైతన్య స్వరూపునిగా శ్రీశ్రీని అభివర్ణిస్తాడు అద్దేపల్లి.
సి.హెచ్.లక్ష్మణచక్రవర్తి : సిద్ధాంతాల రాద్ధాంతాల జోలికి వెళ్ళకుండా ఒక కవితను కవితగా, ఒక కవిని కవిగా తెలుసుకునేందుకు మార్గదర్శకమయ్యే మంచి విమర్శ రచన శ్రీశ్రీ కవితాప్రస్థానం.
యు.వి.రత్నం : క్షీరాంబోధిని మంధరపర్వతం చిలికినట్లు శ్రీశ్రీ కవితా ప్రస్థానాన్ని మథించి యజ్ఞగుండంలోంచి హవిస్సులతో వచ్చిన అగ్నిదేవుని చేతిలో అమృతభాండంలా, తిమిరాన్ని పారద్రోలే సాహిత్యవజ్రపు వెలుగు అద్దేపల్లి శ్రీశ్రీ మిఅద వ్రాసిన వ్యాసాల సంకలనం.
మాకినీడి సూర్యభాస్కర్ : విమర్శ విధానానికి వ్యవస్థీకృత రూపం ఏర్పడని కాలంలో, తాను అప్పుడే ఎం.ఏ.లో సంపాదించుకున్న రసచర్చ, వ్యాకరణాది తూకపురాళ్లలో గొప్ప ఆరాధనాభావంతో శ్రీశ్రీని అతని కవిత్వాన్ని అంచనా వేశాడు అద్దేపల్లి.
సన్నిధానం నరసింహశర్మ : అద్దేపల్లి శ్రీశ్రీకవితా ప్రస్థానంలో ఎన్నో ఉటంకింపులు, ఔచిత్యవంతాలై, అర్థవంతాలై ఆధునిక సాహిత్య విమర్శ చరితలో పలుకుబళ్ళ వలె నిలిచిపోయేవిగా ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.