ట్రావన్‌కోర్

బ్రిటిషు భారతదేశం లోని సంస్థానం From Wikipedia, the free encyclopedia

ట్రావన్‌కోర్

ట్రావన్‌కోర్ రాజ్యం (తరువాత ట్రావన్‌కోర్ సంస్థానం), సుమారు1729 నుండి 1949 వరకు విలసిల్లిన రాజ్యం. తొలుత పద్మనాభపురం, ఆ తరువాత తిరువనంతపురం రాజధానిగా ట్రావన్‌కోర్ రాజకుటుంబం ఈ రాజ్యాన్ని పాలించింది. ట్రావన్‌కోర్ అత్యున్నత దశలో ఉన్నపుడు, ఆధునిక కేరళలోని దక్షిణ భాగం లోని ఇడుక్కి, కొట్టాయం, అలప్పుళా, పతనంతిట్ట, కొల్లం, తిరువనంతపురం జిల్లాలు, ఎర్నాకులం జిల్లాలోని ప్రధాన భాగాలు, త్రిసూర్ జిల్లాలోని పుతేన్‌చిర గ్రామం, ఆధునిక దక్షిణ తమిళనాడుకు చెందిన కన్యాకుమారి జిల్లా, తెన్‌కాశి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, పొరుగున ఉన్న కొచ్చిన్ రాజ్యంలోని ఇరింజలకుడ కూడల్మాణిక్యం దేవాలయానికి చెందిన తాచుడయ కైమల్ ఎన్‌క్లేవ్‌లు ఈ రాజ్యంలో భాగంగా ఉండేవి.[1] అయితే కొల్లాం నగరంలోని తంగస్సేరి ప్రాంతం, తిరువనంతపురంలోని అట్టింగల్ సమీపంలోని అంచుతెంగు బ్రిటిషు భారతదేశంలో భాగం.

త్వరిత వాస్తవాలు తిరువాన్కూరుతిరువిత్తాంకూర్ రాజ్యం, Government ...
తిరువాన్కూరు
తిరువిత్తాంకూర్ రాజ్యం
Thumb Thumb
Motto: ధర్మోస్మత్ కులదైవతం
Anthem: వంచీష మంగళంమూస:Parabr
Thumb
భారతదేశంలో తిరువాన్కూరు (ఎరుపు రంగు)
భారతదేశంలో తిరువాన్కూరు (ఎరుపు రంగు)
Government రాచరికం
Currency ట్రావన్‌కోర్ రూపాయి
మూసివేయి

ఉత్తరాన మద్రాసు ప్రెసిడెన్సీ మలబార్ జిల్లా,[2] తూర్పున మద్రాసు ప్రెసిడెన్సీలో పాండ్య నాడు ప్రాంతానికి చెందిన మదురై, తిరునల్వేలి జిల్లాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం ఈ రాజ్యానికి సరిహద్దులుగా ఉండేవి.[3]

ట్రావన్‌కోర్ రాజ్యాన్ని పద్మనాభపురం, త్రివేండ్రం, క్విలాన్, కొట్టాయం, దేవికులం అనే ఐదు విభాగాలుగా విభజించారు. వీటిలో పద్మనాభపురం, దేవికులం ప్రధానంగా తమిళం మాట్లాడే ప్రాంతం. మలయాళం మాట్లాడే ప్రజలు కొద్దిసంఖ్యలో ఉండేవారు.[4] త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం విభాగాలు ప్రధానంగా మలయాళం మాట్లాడే ప్రాంతాలు. తమిళం మాట్లాడే వారు కొద్ది సంఖ్యలో ఉండేవారు.[4]

ట్రావన్‌కోర్ రాజ్యం భారత ఉపఖండపు దక్షిణ కొన వద్ద ఉంది. భౌగోళికంగా, ట్రావన్‌కోర్‌ను విభిన్న వాతావరణ స్థితులుండే మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు: ఎత్తైన తూర్పు ప్రాంతాలు (కఠినమైన, చల్లని పర్వత భూభాగం), మధ్య ప్రాంతాలు (రోలింగ్ కొండలు), పల్లపు పశ్చిమ ప్రాంతాలు (తీర మైదానాలు).

చరిత్ర

ట్రావన్‌కోర్ ఏర్పాటు, విస్తరణ

Thumb
1733లో మలబార్ తీరం మ్యాప్. ఆ సమయంలో, ట్రావన్‌కోర్ మ్యాప్‌లో చూపిన విధంగా (ప్రస్తుత త్రివేండ్రం, కన్యాకుమారి మాత్రమే) కొల్లం, కన్యాకుమారి మధ్య ఉన్న చిన్న భూభాగం మాత్రమే. కన్నూర్, కొల్లాం మధ్య ఉన్న మలబార్ తీరంలోని విస్తారమైన ప్రాంతం అప్పట్లో కాలికట్ జామోరిన్ ఆధీనంలో ఉంది. 18వ శతాబ్దం చివరి భాగంలో ట్రావన్‌కోర్ కొచ్చిన్ వరకు రాజ్యాలను వారసత్వంగా పొంది, శక్తివంతమైన రాజ్యంగా మారింది.
Thumb
పద్మనాభపురం ప్యాలెస్
Thumb
డచ్ ఈస్టిండియా కంపెనీకి చెందిన యుస్టాచియస్ డి లానోయ్ కొలాచెల్ యుద్ధం తర్వాత ట్రావన్‌కోర్ రాజ్యానికి చెందిన మహారాజా మార్తాండ వర్మకు లొంగిపోయాడు. ( పద్మనాభపురం ప్యాలెస్ వద్ద చిత్రణ)

18వ శతాబ్దం ప్రారంభంలో, ట్రావన్‌కోర్ రాజకుటుంబం ప్రస్తుత మలప్పురం జిల్లాలోని కన్నూర్, పరప్పనాడ్ కేంద్రంగా ఉన్న కొలతునాడు రాజకుటుంబం నుండి కొంతమంది సభ్యులను దత్తత తీసుకుంది.[5] ట్రావన్‌కోర్ చరిత్ర మార్తాండ వర్మతో ప్రారంభమైంది, అతను వేనాడ్ (త్రిప్పప్పూరు) రాజ్యాన్ని వారసత్వంగా పొందాడు. అతని పాలనలో (1729-1758) దానిని ట్రావన్‌కోర్‌గా విస్తరించాడు. భూస్వామ్య ప్రభువుల యూనియన్‌ను ఓడించి, అంతర్గత శాంతిని నెలకొల్పిన తరువాత, అతను తన 29 ఏళ్ల పాలనలో దక్షిణాన కన్యాకుమారి నుండి ఉత్తరాన కొచ్చి సరిహద్దుల వరకు వరుస దండయాత్రల ద్వారా వేనాడ్ రాజ్యాన్ని విస్తరించాడు.[6] అతని పాలనా కాలంలో ట్రావన్‌కోర్, డచ్ ఈస్టిండియా కంపెనీల మధ్య ట్రావన్‌కోర్-డచ్ యుద్ధం (1739–1753) కూడా జరిగింది.

1741 లో ట్రావన్‌కోర్, డచ్ ఈస్టిండియా కంపెనీపై కోలాచెల్ యుద్ధంలో విజయం సాధించింది. ఫలితంగా ఈ ప్రాంతంలో డచ్ అధికారానికి తెరపడింది. ఈ యుద్ధంలో, డచ్ కెప్టెన్ యుస్టాచియస్ డి లానోయ్ పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతను ట్రావన్‌కోర్‌కు లొంగిపోయాడు.[7]

మైసూరు దండయాత్ర

Thumb
టిప్పు సుల్తాన్ ట్రావన్‌కోర్ యుద్ధంలో -జేమ్స్ గ్రాంట్ (c 1896). కాసెల్ కు చెందిన ఇల్లస్ట్రేటెడ్ హిస్టరీ ఆఫ్ ఇండియా లోని బొమ్మ.

మార్తాండ వర్మ వారసుడు, ధర్మ రాజా అని ప్రసిద్ధి చెందిన కార్తీక తిరునాళ్ రామ వర్మ 1795 లో రాజధానిని పద్మనాభపురం నుండి తిరువనంతపురానికి మార్చాడు. ధర్మ రాజా పాలనాకాలాన్ని ట్రావెన్కోర్ చరిత్రలో స్వర్ణయుగంగా పరిగణిస్తారు. అతను తన పూర్వీకుల ప్రాదేశిక లాభాలను నిలుపుకోవడమే కాకుండా, సామాజిక అభివృద్ధిని మెరుగుపరచి, ప్రోత్సహించాడు. సమర్థవంతమైన పరిపాలకుడు, ట్రావెన్కోర్ దివాన్ రాజా కేశవదాస్ ఆయనకు అండగా నిలిచాడు.

సైనిక ఘర్షణ సందర్భాల్లో ట్రావన్‌కోర్, ఈస్టిండియా కంపెనీతో పొత్తు పెట్టుకునేది.[8] ధర్మరాజా పాలనలో, మైసూరు వాస్తవ పాలకుడు, హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ 1789 లో కేరళపై దండయాత్రలో భాగంగా ట్రావన్‌కోర్‌పై దాడి చేశాడు. మలబార్‌లో మైసూర్ ఆక్రమణ సందర్భంలో ట్రావన్‌కోర్‌లో ఆశ్రయం పొందిన హిందూ రాజకీయ శరణార్థులను తిరిగి అప్పగించడానికి ధర్మరాజా గతంలో నిరాకరించాడు. మైసూరు సైన్యం 1789 నవంబరులో కోయంబత్తూరు నుండి కొచ్చిన్ రాజ్యంలోకి ప్రవేశించి డిసెంబరులో త్రిచూర్ చేరుకుంది. 1789 డిసెంబరు 28 న టిప్పు సుల్తాన్ ఉత్తరం నుండి నెడుంకోటపై దాడి చేశాడు. అప్పుడు జరిగిన నెడుంకోట యుద్ధంలో (1789) మైసూర్ సైన్యం ఓడిపోయింది.

దివాన్ వేలు తంపి తిరుగుబాటు

1798లో ధర్మరాజు మరణంతో, రాజవంశంలోని బలహీనమైన పాలకుడైన బలరామ వర్మ (1798-1810) పదహారేళ్ల వయసులో బాధ్యతలు స్వీకరించాడు. ఈస్టిండియా కంపెనీతో కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం 1795 లో ట్రావన్‌కోర్ అనుబంధ కూటమి కిందకు వచ్చింది.[8]

జయంతన్ శంకరన్ నంబూద్రి (1798-1799) తొలగింపు తర్వాత దివాన్‌గా నియమితులైన వేలు తంపి (వేలాయుధన్ చెంపకరామన్ తంపి) (1799-1809)తో ప్రధానమంత్రులు (దళవాస్ లేదా దివాన్‌లు ) రాజ్యాన్ని నియంత్రించడం మొదలైంది. మొదట్లో, వేలాయుధన్ చెంపకరామన్ తంపి, ఈస్టిండియా కంపెనీలు చాలా బాగా కలిసిపోయాయి. ట్రావన్‌కోర్ సైన్యంలోని ఒక విభాగం 1805 లో వేలు తంపి దాలవపై తిరుగుబాటు చేసినప్పుడు, అతను బ్రిటిష్ రెసిడెంట్ కల్నల్ (తరువాత జనరల్) కోలిన్ మెకాలే వద్ద ఆశ్రయం పొందాడు. ఆ తరువాత తిరుగుబాటును అణిచివేసేందుకు ఈస్టిండియా కంపెనీ దళాలను ఉపయోగించాడు. ట్రావన్‌కోర్, ఈస్టిండియా కంపెనీల మధ్య కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో వేలు తంపి కీలక పాత్ర పోషించాడు. అయితే, ట్రావన్‌కోర్ తరపున ట్రావన్‌కోర్ -మైసూర్ యుద్ధం (1791)లో పాల్గొన్నందుకు పరిహారం చెల్లించాలని ఈస్టిండియా కంపెనీ చేసిన డిమాండుతో దివాన్‌కూ, కల్నల్ మెకాలేకూ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. వేలు తంపి, కొచ్చిన్ రాజ్యపు దివాన్ అయిన పాలియాత్ అచ్చన్ గోవిందన్ మీనన్‌తో కలిసి ఈస్టిండియా కంపెనీపై "యుద్ధం" ప్రకటించాడు. గోవిందన్ మీనన్‌, తన శత్రువు కున్హి కృష్ణ మీనన్‌కు ఆశ్రయం కల్పించినందుకు గాను, మెకాలే పట్ల అప్పటికే అసంతృప్తితో ఉన్నాడు.

Thumb
దత్తత దర్బార్, త్రివేండ్రం

ఈస్టిండియా కంపెనీ సైన్యం 1809 ఫిబ్రవరి 27 న కొచ్చిన్‌లో పాలియాత్ అచ్చన్ సైన్యాన్ని ఓడించింది. పాలియత్ అచ్చన్ ఈస్టిండియా కంపెనీకి లొంగిపోయాక, అతన్ని మద్రాసుకు, ఆ తరువాత కాశీకి బహిష్కరించారు. నాగర్‌కోయిల్, కొల్లాం సమీపంలో జరిగిన యుద్ధాలలో కంపెనీ, వేలు తంపి దాలవ ఆధ్వర్యంలోని దళాలను ఓడించింది. తిరుగుబాటుదారులకు భారీ ప్రాణనష్టం కలిగింది. వీరిలో చాలా మంది సైన్యాన్ని విడిచిపెట్టి ఇంటికి తిరిగి వెళ్లారు. అప్పటివరకు తిరుగుబాటులో బహిరంగంగా పాల్గొనని ట్రావన్‌కోర్ మహారాజు, ఇప్పుడు బ్రిటిషు వారితో పొత్తు పెట్టుకుని తంపి శత్రువులలో ఒకరిని తన ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. మిత్రపక్షమైన ఈస్టిండియా కంపెనీ సైన్యం, ట్రావన్‌కోర్ సైనికులు త్రివేండ్రం వెలుపల ఉన్న పప్పనంకోడ్‌లో విడిది చేశారు. వేలు తంపి దలావా ఇప్పుడు కంపెనీకి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాన్ని నిర్వహించాడు. ట్రావన్‌కోర్ సైన్యం అతన్ని పట్టుకునే సమయానికి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. 1805 లో వేలు తంపిపై చేసిన తిరుగుబాటు తరువాత, ట్రావన్‌కోర్‌లోని నాయర్ ఆర్మీ బెటాలియన్‌లను చాలావరకు రద్దు చేసారు. ఇప్పుడు వేలు తంపి దాలవ చేసిన తిరుగుబాటు తర్వాత, దాదాపుగా మిగిలిన ట్రావన్‌కోర్ దళాలన్నిటినీ రద్దు చేసారు. రాజాకు అంతర్గతంగాను, బయటి నుండి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు ఈస్టిండియా కంపెనీ నిలబడింది.

మహాదానాల నిలిపివేత

ఒక కాల క్రమణిక ప్రకారం హిరణ్య-గర్భ, హిరణ్య-కామధేనుడు, హిరణ్యస్వరత వంటి 16 మహాదానాలు చేస్తూ వచ్చిన ట్రావన్‌కోర్ రాజులు కొన్ని షరతులతో క్షత్రియత్వానికి పదోన్నతి పొందారు. ఈ దానాల్లో వేలాది మంది బ్రాహ్మణులకు ఖరీదైన దానాలు చేసేవారు. కనిష్ఠంగా 1 కజాంచ్ (78.65 గ్రా) బంగారం ఉండేది.[9] 1848 లో అప్పటి భారత గవర్నర్ జనరల్ అయిన మార్క్వెస్ ఆఫ్ డల్హౌసీ, పాలకుల మహాదానం వల్ల ట్రావన్‌కోర్‌లో ఆర్థిక పరిస్థితి దిగగారిపోయిందని వెల్లడించాడు.[10] లార్డ్ డల్హౌసీ, అప్పటి ట్రావన్‌కోర్ రాజు మార్తాండ వర్మ (ఉత్రం తిరునాల్ 1847-60)ని ఈ విషయమై హెచ్చరించమని మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్ లార్డ్ హారిస్‌ను ఆదేశించాడు. అతను ఈ మహాదానాలను ఆపకపోతే మద్రాసు ప్రెసిడెన్సీ, అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించాడు. దీంతో మహాదాన ఆచారం ఆగిపోయింది.

శ్రీ మూలం తిరునాల్‌తో సహా ట్రావన్‌కోర్ రాజులందరూ హిరణ్యగర్భం, తులాపురుషదానం వేడుకలను నిర్వహించారు. ట్రావన్‌కోర్ రాజు చితిర తిరునాల్ మహారాజా మాత్రమే ఈ ఆచారాలను నిర్వహించలేదు - అవి చాలా ఖరీదైనవని అతను భావించాడు.[11]

20 వ శతాబ్దంలో

ట్రావెన్‌కోర్‌లోని చివరి రాజైన చితిర తిరునాల్ బలరామ వర్మ 1931 నుండి 1949 వరకు పరిపాలించాడు. అతని పాలనలో విద్య, రక్షణ, ఆర్థిక వ్యవస్థలతో సహా మొత్తం సమాజం అన్ని రంగాలలో విప్లవాత్మక పురోగతి సాధించింది.[12] అతను ప్రసిద్ధిగాంచిన ఆలయ ప్రవేశ ప్రకటన చేసాడు. 1936 నవంబరు 12 న ట్రావెన్‌కోర్‌లోని అన్ని దేవాలయాల లోకి వెనుకబడిన వర్గాలకు ప్రవేశం కల్పించారు. ఈ చర్యతో అతనికి భారతదేశం అంతటా, ముఖ్యంగా మహాత్మా గాంధీ నుండి ప్రశంసలు వచ్చాయి. ప్రజా రవాణా వ్యవస్థ (తిరువనంతపురం-మావెలిక్కర), టెలికమ్యూనికేషన్ వ్యవస్థ (తిరువనంతపురం ప్యాలెస్-మావెలిక్కర ప్యాలెస్) అతని హయాంలోనే మొదలయ్యాయి. అతను రాష్ట్ర పారిశ్రామికీకరణను కూడా ప్రారంభించి, ప్రభుత్వ రంగపు పాత్రను మెరుగుపరిచాడు. రాష్ట్రంలో భారీ పరిశ్రమను ప్రవేశపెట్టి దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించాడు. దాదాపు ఇరవై పరిశ్రమలను స్థాపించాడు. వీటిలో ఎక్కువగా రబ్బరు, సిరామిక్స్, ఖనిజాలు వంటి స్థానిక ముడి పదార్థాలను ఉపయోగించేవే. నేటికీ కేరళలోని ప్రధాన పరిశ్రమలలో ఎక్కువ భాగం చితిర తిరునాళ్ స్థాపించినవే. అతను సంగీతకారులు, కళాకారులు, నృత్యకారులు, వేద పండితులను పోషించాడు. చితిర తిరునాళ్ మొదటిసారిగా ప్రభుత్వ కళా సలహాదారుగా డా. G. H. కజిన్స్ ను నియమించాడు. అతను యూనివర్శిటీ ట్రైనింగ్ కార్ప్స్ ను కూడా స్థాపించాడు. విద్యా సంస్థల్లో ఎన్.సి.సి.ను ప్రవేశపెట్టడానికి ముందే ఇది జరిగింది. యూనివర్సిటీ ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలి. చితిర తిరునాళ్ కొవడియార్ ప్యాలెస్ అనే పేరుతో ఒక అందమైన రాజభవనాన్ని కూడా నిర్మించాడు. ఇది 1915 లో శ్రీ మూలం తిరునాళ్ తన తల్లి సేతు పార్వతి బాయికి ఇచ్చిన పాత నలుఎక్తు భవన నిర్మాణం 1934 లో పూర్తయింది.[13][14][15]

అయితే, అతని ప్రధాన మంత్రి సర్ సి.పి. రామస్వామి అయ్యరుకు ట్రావెన్‌కోర్ కమ్యూనిస్టులలో వ్యతిరేకత ఉండేది. కమ్యూనిస్టులకూ అయ్యరుకూ మధ్య ఉద్రిక్తత చిన్న అల్లర్లకు దారితీసింది. 1946 లో పున్నప్రా-వాయలార్‌లో జరిగిన ఆ అల్లర్లలో కమ్యూనిస్టులు ఆ ప్రాంతంలో తమ స్వంత ప్రభుత్వాన్ని స్థాపించారు. దీనిని ట్రావెన్‌కోర్ ఆర్మీ, నేవీలు అణిచివేసాయి. ప్రధాన మంత్రి 1947 జూన్‌లో ట్రావెన్‌కోర్ ఇండియన్ యూనియన్‌లో చేరడానికి బదులుగా స్వతంత్ర దేశంగా ఉంటుంది అని ప్రకటన విడుదల చేసాడు. తదనంతరం, అతనిపై హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత అతను రాజీనామా చేసి మద్రాసు వెళ్ళిపోయాడు, తరువాత శ్రీ పి.జి.ఎన్. ఉన్నితాన్ ప్రధానమంత్రి అయ్యాడు. మహారాజాకు రాజ్యాంగ సలహాదారు కె.అయ్యప్పన్ పిళ్లై, ఎ. శ్రీధర మీనన్ వంటి చరిత్రకారుల ప్రకారం, అల్లర్లు, మూకదాడులు మహారాజా నిర్ణయంపై ఎటువంటి ప్రభావం చూపలేదు.[16][17] చితిర తిరునాళ్, V.P మీనన్‌ల మధ్య అనేక రౌండ్ల చర్చల తర్వాత, రాజ్యం 1947 ఆగస్టు 12 న ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసేందుకు రాజు అంగీకరించాడు.[18] 1949 జూలై 1 న ట్రావెన్‌కోర్ రాజ్యం కొచ్చిన్ రాజ్యంలో విలీనమైంది. స్వల్పకాలం ఇనికిలో ఉన్న ట్రావెన్‌కోర్-కొచ్చి రాష్ట్రం ఏర్పడింది.[19]

కేరళ ఏర్పాటు

కేరళ రాష్ట్రం 1956 నవంబరు 1 న ఉనికిలోకి వచ్చింది. రాజుకు బదులుగా గవర్నరు పదవి ఉనికి లోకి వచ్చింది.[20] 1971 జూలై 31 నాటి భారత రాజ్యాంగ చట్టంలోని ఇరవై ఆరవ సవరణ ప్రకారం రాజు తన రాజకీయ అధికారాలన్నింటినీ, వ్యక్తిగత పర్సులను పొందే హక్కునూ తొలగించారు. అతను 1991 జూలై 20 న మరణించాడు.[21]

పాలకులు

ట్రావన్‌కోర్ రాజ్యం, రాజు ప్రత్యక్ష నియంత్రణ కింద, దివాన్ పరిపాలనలో ఉండేది. దివాన్ కింద నీతేజుత్తు పిళ్లే లేదా కార్యదర్శి, రాయసోమ్ పిళ్లే (సహాయకుడు లేదా అండర్-సెక్రటరీ), అనేక మంది రాయసోమ్‌లు లేదా క్లర్క్‌లతో పాటు కనక్కు పిల్లామర్లు (అకౌంటెంట్‌లు) పనిచేసేవారు. దివాన్ పర్యవేక్షణలో ఉండే సర్వాధికారులు జిల్లాలకు నేతృత్వం వహించేవారు. పొరుగు రాష్ట్రాలు, యూరోపియన్లతో సంబంధాలు వలియా సర్వాహీ పరిధిలో ఉండేవి. లావాదేవీలు ఒప్పందాలు, ఒప్పందాలపై వారే సంతకాలు చేసేవారు.[22]

ట్రావన్‌కోర్ పాలకులు

  1. అనిజం తిరునాళ్ మార్తాండ వర్మ 1729–1758 [23]
  2. కార్తీక తిరునాళ్ రామవర్మ (ధర్మరాజు) – 1758–1798
  3. బలరామ వర్మ I - 1798-1810
  4. గౌరీ లక్ష్మీ బాయి – 1810–1815 (1810 నుండి 1813 వరకు రాణి, 1813 నుండి 1815 వరకు రీజెంట్ క్వీన్)
  5. గౌరీ పార్వతి బాయి (రీజెంట్) – 1815–1829
  6. స్వాతి తిరునాళ్ రామవర్మ III – 1813–1846
  7. ఉత్రం తిరునాళ్ మార్తాండ వర్మ II – 1846–1860
  8. ఆయిల్యం తిరునాళ్ రామవర్మ III – 1860–1880
  9. విశాఖం తిరునాళ్ రామవర్మ IV – 1880–1885
  10. శ్రీ మూలం తిరునాళ్ రామవర్మ VI – 1885–1924
  11. సేతు లక్ష్మీ బాయి ( రీజెంట్ ) – 1924–1931
  12. చితిర తిరునాళ్ బలరామ వర్మ II – 1924–1949 / మరణం 1991

1991 నుండి ట్రావన్‌కోర్‌లోని నామమాత్రపు మహారాజులు

  1. ఉత్రదోమ్ తిరునాళ్ మార్తాండ వర్మ III – 1991–2013.
  2. మూలం తిరునాళ్ రామవర్మ VI – 2013 నుండి.

ట్రావన్‌కోర్ ప్రధానులు

దళవాయిలు

  • ఆరుముఖం పిళ్లై 1729–1736
  • థాను పిళ్లై 1736–1737
  • రామయ్య దళవా 1737–1756
  • మార్తాండ పిళ్లై 1756–1763
  • వార్కాల సుబ్బయ్యన్ 1763–1768
  • కృష్ణ గోపాలయ్యన్ 1768–1776
  • వాదీశ్వరన్ సుబ్రహ్మణ్య అయ్యర్ 1776–1780
  • ముల్లెన్ చెంపకరమన్ పిళ్లై 1780–1782
  • నాగర్‌కోయిల్ రామయ్యన్ 1782–1788
  • కృష్ణన్ చెంపకరామన్ 1788–1789
  • రాజా కేశవదాస్ 1789–1798
  • ఒడియరీ జయంతన్ శంకరన్ నంపూతిరి 1798–1799
  • వేలు తంపి దళవా 1799–1809
  • ఊమిని తంపి 1809–1811

దివాన్లు

Thumb
దివాన్ రాజా సర్ టి.మాధవ రావు
  • కల్నల్ జాన్ మున్రో 1811–1814
  • దేవన్ పద్మనాభన్ మీనన్ 1814–1814
  • బప్పు రావు (తాత్కాలిక) 1814–1815
  • శంకు అన్నావి పిళ్లై 1815–1815
  • రామన్ మీనన్ 1815–1817
  • రెడ్డి రావ్ 1817–1821
  • T. వెంకటరావు 1821–1830
  • తంజావూరు సుబ్బారావు 1830–1837
  • T. రంగారావు (తాత్కాలిక) 1837–1838
  • T. వెంకటరావు (మళ్ళీ) 1838–1839
  • తంజావూరు సుభా రావు (మళ్ళీ) 1839–1842
  • కృష్ణారావు (తాత్కాలిక) 1842–1843
  • రెడ్డి రో (మళ్ళీ) 1843–1845
  • శ్రీనివాసరావు (తాత్కాలిక) 1845–1846
  • కృష్ణారావు 1846–1858
మరింత సమాచారం పేరు, చిత్తరువు ...
పేరు చిత్తరువు పదవి ప్రారంభం పదవి ముగింపు పదవీ కాలం [24]
టి. మాధవ రావు Thumb 1857 1872 1
ఎ. శేషయ్య శాస్త్రి Thumb 1872 1877 1
నానూ పిళ్ళై 1877 1880 1
వి. రామియంగార్ Thumb 1880 1887 1
టి. రామారావు Thumb 1887 1892 1
ఎస్. శుంగ్రసూబియర్ 1892 1898 1
వి. నాగం అయ్యా Thumb 1901 1904 1
కె. కృష్ణస్వామి రావు Thumb 1898 1904 1
వి. పి. మాధవ రావు Thumb 1904 1906 1
ఎస్. గోపాలచారి 1906 1907 1
పి. రాజగోపాలాచారి 1907 1914 1
ఎం. కృష్ణన్ నాయర్ 1914 1920 1
టి. రాఘవయ్య 1920 1925 1
ఎం. ఇ. వాట్స్ 1925 1929 1
వి. ఎస్. సుబ్రమణ్య అయ్యర్ 1929 1932 1
టి. ఆస్టిన్ 1932 1934 1
సర్ ముహమ్మద్ హబీబుల్లామహ్మద్ హబీబుల్లా Thumb 1934 1936 1
సర్ సి. పి. రామస్వామి అయ్యర్ Thumb 1936 1947 1
పి.జి.ఎన్.ఉన్నితన్ 1947 1947 1
మూసివేయి

ట్రావన్‌కోర్ ప్రధాన మంత్రులు (1948–49)

మరింత సమాచారం No., పేరు. ...
No.[a] పేరు. చిత్తరువు పదవీకాలం అసెంబ్లీ (ఎన్నిక)
నియమించిన రాజు
నుండి వరకు రోజులు
1 పట్టోమ్ ఎ. థాను పిళ్ళై Thumb 1948 మార్చి 24 1948 అక్టోబరు 17 210 రోజులు భారత జాతీయ కాంగ్రెస్ ప్రాతినిధ్య సభ

(1948–49)

సర్ చిత్తిర తిరునాళ్ బలరామ వర్మ, ట్రావెన్కోర్ మహారాజు
2 పరవూర్ టి. కె. నారాయణ పిళ్ళై 1948 అక్టోబరు 22 1949 జూలై 1 253 రోజులు
మూసివేయి

పరిపాలనా విభాగాలు

1856 లో రాజ్యాన్ని మూడు విభాగాలుగా విభజించారు. ఒక్కొక్కదానికి, బ్రిటిష్ భారతదేశం లోని జిల్లా కలెక్టర్‌తో సమానమైన హోదాగల దివాన్ పీష్కర్ అధికారిగా ఉండేవారు.[25] ఇవి:

  • ఉత్తర ట్రావన్‌కోర్ (కొట్టాయం) లో షేర్‌తలే, వైకోమ్, యెట్మనూర్, కొట్టాయం, చుంగినచేరి, మీనాచిల్, తోడుపోలయ్, మూవాటుపోలయ్, కున్నత్ నాడు, అలన్ గౌడ్, పరవూరు తాలూకాలు భాగం;
  • క్విలాన్ (సెంట్రల్ ట్రావన్‌కోర్ ) లో క్విలాన్, అమబలాపులే, చెంగన్నూర్, పందళం, కున్నత్తూర్, కరుంగపుల్లి, కార్తీకపుల్లి, హరిప్పాడ్, మావెలికరే తాలూకాలున్నాయి.
  • దక్షిణ ట్రావన్‌కోర్ (పద్మనాభపురం) లో త్రివేండ్రం, చిరాయింకిర్, తోవలే, ఔగతీశ్వరోమ్, కల్కులం, ఎరనీల్, వెలవెన్‌కోడ్‌లు ఉన్నాయి.

జనాభా వివరాలు

మరింత సమాచారం సంవత్సరం, జనాభా ...
సంవత్సరంజనాభా±%
18169,06,587    
183612,80,668+41.3%
185412,62,647−1.4%
187523,11,379+83.1%
188124,01,158+3.9%
189125,57,736+6.5%
190129,52,157+15.4%
191134,28,975+16.2%
192140,06,062+16.8%
193150,95,973+27.2%
194160,70,018+19.1%
మూసివేయి

మతాలు

మరింత సమాచారం జనాభా లెక్కల సంవత్సరం, మొత్తం జనాభా ...
జనాభా లెక్కల సంవత్సరం మొత్తం జనాభా హిందువులు క్రైస్తవులు ముస్లింలు
1816 – 1820 9,06,587[26] 7,52,371[26] 82.99% 1,12,158[26] 12.37% 42,058[26] 4.64%
1881 24,01,158[4] 17,55,610[4] 73.12% 4,98,542[4] 20.76% 1,46,909[4] 6.12%
1891 25,57,736[27] 18,71,864[27] 73.18% 5,26,911[27] 20.60% 1,58,823[27] 6.21%
1901 29,52,157[26] 20,63,798[26] 69.91% 6,97,387[26] 23.62% 1,90,566[26] 6.46%
1911 34,28,975[26] 22,98,390[26] 67.03% 9,03,868[26] 26.36% 2,26,617[26] 6.61%
1921 40,06,062[26] 25,62,301[26] 63.96% 11,72,934[26] 29.27% 2,70,478[26] 6.75%
1931 50,95,973[26] 31,37,795[26] 61.57% 16,04,475[26] 31.46% 3,53,274[26] 6.93%
1941 60,70,018 36,71,480 60.49% 19,63,808 32.35% 4,34,150 7.15%
మూసివేయి

భాషలు

మరింత సమాచారం జనాభా లెక్కల సంవత్సరం, మొత్తం జనాభా ...
జనాభా లెక్కల సంవత్సరం మొత్తం జనాభా మలయాళం తమిళం ఇతరాలు
1875 23,11,379[4] 19,02,533[4] 82.32% 3,87,909[4] 16.78% 20,937[4] 0.91%
1881 24,01,158[4] 19,37,454[4] 80.69% 4,39,565[4] 18.31% 24,139[4] 1.01%
1891 25,57,736[27] 20,79,271[27] 81.29% 4,48,322[27] 17.53% 30,143[27] 1.18%
1901 29,52,157[28] 24,20,049[28] 81.98% 4,92,273[28] 16.68% 39,835[28] 1.35%
1911 34,28,975[29] 28,36,728[29] 82.73% 5,54,618[29] 16.17% 37,629[29] 1.10%
1921 40,06,062[30] 33,49,776[30] 83.62% 6,24,917[30] 15.60% 31,369[30] 0.78%
1931 50,95,973[26] 42,60,860[26] 83.61% 7,88,455[26] 15.47% 46,658[26] 0.92%
మూసివేయి

కరెన్సీ

భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా, ట్రావన్‌కోర్ రూపాయిని కింది విషంగా విభజించారు.

మరింత సమాచారం యూనిట్, సమానమైన ఉప యూనిట్లు ...
యూనిట్ సమానమైన ఉప యూనిట్లు
1 ట్రావన్‌కోర్ రూపాయి 7 ఫానమ్‌లు
1 ఫానమ్ 4 చక్రాలు
1 చక్రం 16 నగదు
మూసివేయి

నగదు, చక్రం నాణేలను రాగి తోనూ, ఫణం, రూపాయి నాణేలను వెండి తోనూ తయారు చేసేవారు.

ఇవి కూడా చూడండి

గమనికలు

  1. A parenthetical number indicates that the incumbent has previously held office.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.