కర్ణాటక రాష్ట్రం, తుళునాడు ప్రాంతం, ఉడిపి జిల్లా, బైందూరు తాలూకాలోని కొల్లూరులో ఉన్న దేవాలయం From Wikipedia, the free encyclopedia
కొల్లూరు మూకాంబిక దేవాలయం అనేది కర్ణాటక రాష్ట్రం, తుళునాడు ప్రాంతం, ఉడిపి జిల్లా, బైందూరు తాలూకాలోని కొల్లూరులో ఉన్న దేవాలయం. మూకాంబికా దేవి అని పిలువబడే మాతృదేవతకు అంకితం చేయబడిన హిందూ దేవాలయమిది. సౌపర్ణికా నది దక్షిణ ఒడ్డున, కొడచాద్రి కొండల దిగువన ఉన్న ఈ దేవాలయ లింగం ఎడమ వైపున "మహా కాళి, మహా లక్ష్మి, మహా సరస్వతి" కలిసి ఉన్నందున మూకాంబిక ఆదిపర శక్తి, పరబ్రహ్మల కలయికగా చెప్పబడుతోంది.[1][2][3][4][5] గోకర్ణం, కన్యాకుమారి మధ్య ఉన్న భూభాగంలో ఉన్న ఈ దేవాలయాన్ని పరశురాముడు సృష్టించాడని భక్తుల నమ్మకం. దేవాలయంలో స్వయంభూగా వెలిసిన జ్యోతిర్లింగం ప్రధాన దేవతగా ఉంది. లింగం సగానికి కత్తిరించే బంగారు గీతతో ఉంటుంది, దీనిలో ఎడమ సగం త్రిదేవిని, కుడి సగం త్రిమూర్తులను సూచిస్తుంటుంది. దీనితో పాటు, మూకాంబిక దేవి నాలుగు చేతుల పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు.
దేవాలయంలో గణపతి, శివుడు, విష్ణువు, హనుమంతుడు, సుబ్రహ్మణ్యుడు, వీరభద్రుడు, నాగదేవతలకు ఉప మందిరాలు కూడా ఉన్నాయి. ఫాల్గుణ మాసంలో జరిగే రథోత్సవాలు, ఆశ్వీజ మాసంలో జరిగే నవరాత్రులు ఈ దేవాలయంలో ప్రధాన పండుగలు. మూకాసురుడు అనే రాక్షసుడిని చంపిన తర్వాత శక్తి దేవికి మూకాంబిక దేవి అని పేరు పెట్టబడింది. ఈ దేవాలయం కర్ణాటకలో ఉన్నప్పటికీ, పొరుగు రాష్ట్రమైన కేరళ నుంచి ఇక్కడికి ఎక్కువమంది భక్తులు వస్తుంటారు. మతం, కులంతో సంబంధం లేకుండా మలయాళీలు సందర్శించే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి.
కొల్లూరు మూకాంబిక దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన చరిత్ర దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర ఉన్నది. రాణి చెన్నమాజీ సూచనల మేరకు హాలుగల్లు వీర సంగయ్య మహారాజు గుడి లోపై కప్పు వేసాడని చెపుతారు. దేవాలయంలోని గర్భగృహం సమకాలీనమైనది, కళాత్మకమైనది, ఒక పెద్ద దీపస్థంబం తాబేలు తల వలె ఎత్తుగా ఉంటుంది. ఈ దీపస్తంభంలో 21 అందమైన ఏకవృత్తాకారాలు ఉన్నాయి, అన్ని దీపాలను వెలిగించి దూరం నుండి చూసినప్పుడు మకరజ్యోతిని పోలి ఉంటాయి.
కొల్లూరు మూకాంబిక ఆలయ చరిత్ర ప్రకారం కౌమాసురుడు అనే రాక్షసుడు శివుడు ప్రసాదించిన వరముచే లభించిన ప్రత్యేక శక్తితో అందరి దేవతలపై దుష్టమైన భయంకర పాలన సాగిస్తున్నాడు. దేవతలందరూ తన చుట్టుపక్కల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, రాక్షస గురువైన శుక్రాచార్యుడు దేవతలకు శుభకరమైన వార్త చెబుతాడు, ఈ రాక్షసుడు ఒక స్త్రీ, అంటే పార్వతి దేవి చేత మరణాన్ని పొందుతాడు.
ఈ కౌమాసురుడు తీవ్ర తపస్సు తో శివడు అనుగ్రహం చెంది, కౌమాసురుడిని వరం అడగమని అడుగుతాడు, ఒక వేళ వరం ఇస్తే తీవ్రమైన ప్రమాదం కౌమాసురుడి నుంచి ప్రమాదం ఉందని గ్రహించాడు, వాక్ దేవత రాక్షసుడిని మూగవాడిగా చేస్తుంది. అందువలన ఈ కౌమాసురుడు మూకాసురుడు (మూగవాడు అని అర్థం) అని పిలువబడ్డాడు. ఆ తరువాత దేవి దేవతల శక్తులన్నింటి కలయికతో రాక్షసుడిని పార్వతి దేవి సంహరించింది. దీనికి గాను పార్వతి దేవిని మూకాంబికై అని పిలిచేవారు. దేవి మూకాసురుడిని వధించిన ఈ ప్రదేశాన్ని మరానా కట్టే అంటారు. ఇక్కడ తనను సందర్శించే వారిని మూకాంబిక దేవి పద్మహాసన భంగిమలో కూర్చొని రెండు చేతులలో శంఖం, చక్రంతో పాటు తన తేజస్సుతో అమ్మవారు తనను కోరిన వారందరికీ అనుగ్రహ ఆశీస్సులు అందచేస్తుంది.[6]
ఈ దేవాలయంలో పరమేశ్వరుడు కాలి బొటనవేలుతో చక్రాన్ని గీసినప్పుడే మూకాంబిక దేవాలయంలోని స్వయం భూలింగం ఉనికిలోకి వచ్చిందని చెబుతారు. ఈ చక్రం ఉధ్భవ లింగం అని భక్తులు నమ్ముతారు. మూకాంబిక దేవికి ఒకవైపు లక్ష్మీ, సరస్వతిలతోపాటు మరోవైపు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులతో కలిసి లింగంగా ఏర్పడిందని చెబుతారు. కిరాతార్జునుడు అని పిలువబడే అర్జునుడితో జరిగిన పోరాటంలో శివుడు గాయపడినట్లు చెప్పబడుతున్న శివుని చెక్కిన విగ్రహం స్వయంభూలింగానికి కుడి వైపున ఉంది. ఆది శంకరాచార్యుల వారి తపః ఫలితంగా దేవి మూకాంబిక ఈ ప్రదేశాన్ని కొల్లూరులో తన నివాసంగా అయినదని ప్రజలు నమ్ముతారు. సౌపర్ణిక నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశంలోనే ఆదిశంకరుడు శ్రీ చక్ర యంత్రం ప్రతిష్ట చేసి యంత్రంపై దేవిస్థాపన జరిగింది.[6]
చాలా మంది రాజులు ఈ దేవాలయంపై నమ్మకంతో, స్థానిక రాజులు, కేలాడి రాజవంశానికి చెందిన సుప్రసిద్ధ రాజులు, శంకరన్న నాయక, శివప్ప నాయక ఈ దేవాలయం కోసం అనేక విరాళాలు ఇచ్చి పునరుద్ధరించారు. మరియొక చరిత్ర ప్రకారం ఆదిశంకరాచార్యులు మూకాంబికా దేవి దర్శనం పొందినప్పుడు ఈ ఆలయాన్ని ప్రతిష్టించారని, పురాణాల ప్రకారం దేవి తన ముందు ప్రత్యక్షమై తన కోరికను కోరిన రోజు, ఆదిశంకరాచార్యులు దేవి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరుకుంటారు. అందుకు దేవి అంగీకరించింది కానీ ఆదిశంకరాచార్యులను పరీక్షించడానికి, దేవి ఆదిశంకరాచార్యులను వెనక్కి తిరిగి చూడకూడదని షరతు పెడుతుంది. కొల్లూరు చేరుకోగానే ఆదిశంకరాచార్యులు వస్తున్నారా రాదా అనే అనుమానంతో వెనుదిరిగారు. ఆ తరువాత, దేవి తన విగ్రహాన్ని కొల్లూరు అయిన ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించమని ఆది శంకరాచార్యుడిని కోరుతుంది.[7]
దేవి మూకాంబిక ఎన్నో విలువైన ఆభరణాలు ఉన్నాయి, ఎంతో మంది రాజులు, రాణులు ఈ దేవికి ఆభరణాలు బహుకరిచినారు వారిలో దివంగత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గుండూరావు దేవికి వెండి ఖడ్గాన్ని, రాణి చెన్నమ్మ పచ్చ (మరకతము- Emerald)ను సమర్పించారు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎం.జి. రామచంద్రన్ బంగారు ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చారు. విజయనగర రాజు శ్రీ కృష్ణదేవరాయలు దేవికి బంగారుచే పూత చేసి అలంకరించినది (gold mask) బహూకరించాడు, ప్రస్తుతం దానిని విలువైనదిగా భావిస్తున్నారు. కెలాడికి చెందిన చెన్నమాజి లింగానికి బంగారుతో చేసిన దేవి ముఖం విరాళంగా సమర్పించాడు., ఇవి గాక ప్రస్తుతం ఎన్నో విలువైన వస్తువులను, డబ్బులను ప్రజలు ఇప్పటికి అమ్మవారికి సమర్పిస్తారు.[6]
ఈ ఆలయంలో రెండు సంప్రదాయాలకు అవి ఒకటి యజ్ఞ ఆచారం ప్రకారం, రెండవది విజయ్ యజ్ఞ శాస్త్రం ప్రకారం దేవి పూజలు చేయడం జరుగుతుంది. ఆలయంలో ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో పూజలు చేస్తారు.అనేక ముఖ్యమైన ఆచారాలలో, పూజలలో విశేషంగా దేవి నవరాత్రులు (శరన్నవరాత్రులు),మరొకటి బ్రహ్మోత్సవం. ఈ రెండు పూజలు చాలా వైభవంగా, ప్రజలు ఉల్లాసంగా జరుపుకుంటారు. ఈ రోజుల్లో దేవి ఎంతో మంది భక్తులకు వరాలు ప్రసాదిస్తుందని చెబుతారు.
కొల్లూరు మూకాంబిక దేవిని ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. కొల్లూరు చేరుకోవడానికి మంగళూరు నుండి 135 కిలోమీటర్లు (84 మైళ్ళు) దూరంలో, బెంగళూరు నుండి 440 కిలోమీటర్లు (274 మైళ్ళు) దూరంలో ఉంది. కొల్లూరు పశ్చిమ కనుమల వాలులో ఉంది.భారతదేశం అంతటా ప్రజలచే సందర్శించబడినప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలకు దగ్గరగా ఉండటం, మూకాంబికను కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రజలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా నిలుస్తుంది. కొల్లూరు చుట్టుపక్కల అనేక ఇతర పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి[8].
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.