Remove ads
హిందూ దేవుడు, పార్వతీ పరమేశ్వరుల పుత్రిడు From Wikipedia, the free encyclopedia
షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు.వినాయకుని తమ్ముడు. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' అని, 'శరవణుడు' అని, 'సుబ్రహ్మణ్యుడు' కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము నెమలి. స్కంద పురాణంలో ఈయన గాథ వివరంగా ఉంది. ఇతన్ని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరుపుకొంటారు. ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు.
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమయ్యిందట.జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారిగా వుండి పోయాడట.
సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరంలో (రెల్లుగడ్డిలో) చిక్కుకొని ఆరు చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి 'స్కందా' అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలూ, 12 చేతులూ గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి
దేవతల కోరిక మేరకు ఈయన సురపద్ముని, సింహముఖుని, తారకాసురుని వధించాడు. ఈయనకు వల్లి, దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు. వినాయకుడు నారదునికి కృత్తికావ్రతము ఆచరించమని బోధించాడంటారు.
షణ్ముఖుడి ఆరు ముఖాలుపంచ భూతాలను + ఆత్మను సూచిస్తాయంటారు. ఇంకా అవి యోగ సాధకులకు షట్చక్రాలకు సంకేతాలు. తెలుగునాట సుబ్రహ్మణ్య షష్ఠి ఒక ముఖ్యమైన పండుగ. తమిళనాట మురుగన్ దేవాలయాలు, పేర్లు, ఉత్సవాలు సర్వ సాధారణం.
హే స్వామినాథ కరుణాకర దీనబంధో, |
క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల, |
పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః, |
షణ్మతాలలో కుమారోపాసన (సుబ్రహ్మణ్యోపాసన)ఒకటి. మిగిలినవి సౌర, శాక్త, వైష్ణవ, గాణాపత్య, శైవములు. అయితే అగ్ని గర్భుడు అనిపేరు ఉన్న సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్ర వాక్యము.అందుచేతనే పంచాయతన పూజలో ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తి ఉండదు.అయితే దీపారాధన శివశాక్త్యాత్మకుడైన అగ్నిసంభవుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడమేననిపెద్దలు చెప్తారు. ఈ విధంగా వైదిక ధర్మంలో సుబ్రహ్మణ్యోపాసన చెప్పబడింది.
వైదిక వాగ్మయంలో కుమార అనే నామం వినగానేగుర్తుకు వచ్చేది కేవలం బుజ్జి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యగణపతులు పరబ్రహ్మ స్వరూపులేకాక, “కుమార”తత్వానికి ప్రతీక. జగత్తులో మాతాపితృతత్వానికి ప్రతీక పార్వతీ పరమేశ్వరులు. (లేదా లక్ష్మీ నారాయణులు, ఎలా పిలిచినాఒకటే). అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం ఈ నాలుగు పంచభూతాత్మక జగత్తుకి ఆధారం.ఇందులో అవ్యక్తానికి ప్రతీకగా అమ్మవారిని పేర్రొంటే, వ్యక్త స్వరూపాలకు సంకేతంగా అయ్యవారిని స్మరించుకోవటం ఆనవాయితి అయితే, మహత్తత్వానికి ప్రతీకగా గణపతిని,అహంకారానికి ప్రతీకగా కుమారస్వామిని చెప్పడం జరిగింది. అహంకార తత్త్వం ఉండడం వల్లనే ఈ సకల జగత్తు సృష్టింపబడినదిఅని చెప్తారు పెద్దలు. నిజానికి ఒకే పరతత్వం యొక్క నాలుగు భూమికలివి.
ఇక్కడ అహంకారం అంటే లోకంలో అనుకునే గర్వం అనేభావం కాదు. నేను అనే స్పృహను అహంకారం అంటారు. ఈశ్వరుని పరంగా ఈ బావం ఉంటుంది.ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభం అవుతుంది. చైతన్యం యొక్క లక్షణం అహంకారం. ఈసృష్టిలో కృత్రిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా మానవుని మెదడు వంటిజ్ఞాపక శక్తి కల యంత్రాన్ని తయారు చేయవచ్చునేమో కానీ, దానికి “నేను చేస్తున్నాను” అనే అహంభావం, స్పందన ఇవ్వలేము. అది కేవలం స్వాభావికమైనసృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ కేంద్రం ఈ అహం తత్వమే.
ఈ అహంతత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు.రహస్యంగా అందరిలోనూ ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక ‘గుహ’ అన్నారు స్వామిని. శివతేజస్సు నుండి ఉద్భవించినవాడు కనుక జ్ఞానతత్త్వం కలిగి ‘గురుగుహ’ అని స్వామికి నామం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడింది.
పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః
అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా
తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః
అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్నీ,లక్ష్మీనారాయణులనీ కలిపి అర్చించినట్లే. ప్రకృతీ పురుషుల ఏకత్వం కుమార స్వామితత్త్వం.
కుమార జననంలోనే అనేక తాత్త్విక మర్మాలుఉన్నాయి. పరతత్వం అవ్యక్తం నుండి జగద్రూపం తీసుకొనే పరిమాణ క్రమం కుమార జననంలోకనబడుతుంది. అమోఘమైన శివతేజాన్ని పృథ్వి, అగ్ని, జలం (గంగ), నక్షత్ర శక్తి (షట్కృత్తికలు) ధరించి చివరకు బ్రహ్మతపోనిర్మితమైన శరవణం (రెల్లు తుప్ప) లోంచిఉద్భవించినవాడు కనుక శరవణభవుడు అయ్యాడు.
వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగాస్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈసంవత్సరాగ్ని. ఆరు ముఖాలను ఆరు ఋతువులకు ప్రతీకగా, పన్నెండు చేతులను పన్నెండు మాసాలకు ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఇదీసంవత్సరాగ్ని రూపం. ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలనువెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి.
సుబ్రహ్మణ్యస్వామి వారురాసిభూతమైన జ్ఞానస్వరూపం. సునిసితమైన మేధస్సుకు స్వామి వారి చేతిలో ఉండే శక్తిఆయుధమే ప్రతీక. శివజ్ఞానప్రదాయిని అయిన అమ్మవారికి ప్రసాదించిన దివ్యాయుధమిది. ఇదేఅజ్ఞానమనే తారకాసురుని సంహరించిన జ్ఞానశక్త్యాయుధము. “జ్ఞానశక్త్యాత్మా” అనేదిస్వామి వారి నామాలలో ఒకటి. ఇఛ్చా, జ్ఞాన, క్రియా అనేమూడు శక్తుల మయమైన శక్తినిధరించిన జ్ఞానశక్తి స్వరూపుడు, జ్ఞానయోగంలో సాక్షాత్కరించే శివశక్త్యాత్మక తేజఃపుంజం – కుమారస్వామి. ఆరుకోణాల చక్రం అనేది బహుముఖీయమైన ప్రజ్ఞకు సంకేతం కనుక కవిత్వానికీ, ప్రతిభకీ, ఆధారశక్తిగా కూడాకుమారస్వామి ఉపాసన చెప్పబడింది. “షణ్ముఖీ ప్రతిభ” ప్రసాదించే ఈ కార్తికేయుని‘కవి’గా పేర్కొన్నాయి శాస్త్రాలు.
“పుట్టన్ బుట్ట శరంబునన్ మొలువ” అనే పద్యంలోపోతన గారు…”కావ్య రచనా సామర్ధ్యానికి నేను వాల్మీకిని కాను (పుట్టన్ బుట్ట),శరవణభవుణ్ణి కాను (శరంబునన్ మొలువ)” అంటూ ప్రార్థించారు. ఈ మాటలో కూడా కవితా శక్తినిధిగా స్కందుడోచరిస్తున్నాడు. శివతేజం స్కన్నమై వచ్చి రూపుకట్టిన దైవం కనుక ఈయనస్కందుడు. రామాయణంలో యాగరక్షణకు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో వెళుతుండగా,మార్గమధ్యంలో స్కందోత్పత్తి (సుబ్రహ్మణ్య జనన ఆఖ్యానము) వివరిస్తారు మహర్షి.
కార్తికేయ భక్తులు ఇహలోకంలో ఆయుష్మంతులైపుత్రపౌత్రులతో వర్ధిల్లి అంత్యమున స్కంద సాలోక్యాన్ని పొందుతారు. ఓ రామా! ఈకుమారసంభవం “ధన్యపుణ్యగాథ” అని విశ్వామిత్రుని మాట (వాల్మీకి రామాయణం – బాలకాండ).
ఏషతే రామ గంగాయా విస్తరోమయా
కుమారసంభవశ్చైవధన్యం పుణ్యస్తథైవ చ
భక్తశ్చయః కార్తికేయే కాకుత్ స్థ భువిమానవాః
ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కందసాలొక్యతాం వ్రజేత్
మహాభారతంలో కూడా ప్రత్యేకించి సుబ్రహ్మణ్యస్వామి వారి జనన గాథ, తారకాసుర సంహారం అద్భుతంగా వర్ణించారు వ్యాసమహర్షి.ధర్మరాజుగారికి మార్కండేయ మహర్షి చెప్తారు సుబ్రహ్మణ్య జనన వైభవం గురించి. ఇక్కడమనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అటు శ్రీరామాయణం లోనూ, ఇటు మహాభారతంలోనూ కూడాసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం గురించి ఇవ్వడంలో రహస్యం సాధకులగా మనం గురువులనుంచి తెలుసుకోవలసిన విషయం. రామాయణంలో రామచంద్రప్రభువుకి స్కందోత్పత్తి చెప్పడంలోఉద్దేశం ఏమిటంటే, సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి రాముడిలో ప్రవేశించాలి. అది రావణసంహారమునకు అవసరము. సుబ్రహ్మణ్య స్వామి వారిని అందుకే ఆంగ్ల భక్తులు “The God ofWar” అని సంబోధిస్తారు. దేవతలకు రాక్షసులకు, మంచికి చెడుకి, రాముడికి రావణుడికి,పాందవులకి, కౌరవులకి మధ్య జరిగే యుధ్ధములలో మంచి/దేవతా సైన్యం విజయం సాధించాలంటే,దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి అవసరము. ఇక్కడ ఇలా చెప్పడంలోరాముడిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు…అసలు విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామియజ్ఞ తత్వమునకు ప్రతీక, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞ పురుషుడిగానూ, యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడింది. అందులోనేశ్రీమహావిష్ణువుకి “స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః” అనే నామాలు ఉన్నాయి,అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అనిఅర్ధం. మరి విష్ణువే రాముడు కదా, ఆయనకివిశ్వామిత్ర మహర్షి సుబ్రహ్మణ్య తత్వం బోధించడంలో ఏమిటి రహస్యం అంటే రాముడు అవతారప్రయోజనం కోసం సాధారణ మానవుడిగా వచ్చాడు, అప్పుడు ఆయన రావణ సంహారం చేయడానికిఅవసరమైన సకల అస్త్ర శస్త్రములతో పాటుగా, యుధ్ధ వీరుడైన సుబ్రహ్మణ్యుని శక్తినికూడా రాముడిలో ప్రవేశ పెట్టడమే విశ్వామిత్రుల వారి ఆంతర్యము. ఇదే విషయం భారతంలోధర్మరాజు గారికి సుబ్రహ్మణ్య వైభవం, తారకాసుర సంహారం చెప్పబడడలోనూ వర్తిసుంది.
అయితే రామాయణం లోనూ, మహాభారతంలోనూ,శివమహాపురాణంలోనూ, స్కాందపురాణంలోనూ చెప్పబడ్డ సుబ్రహ్మణ్య స్వామి జనన, లీలావిశేషాలలో చిన్న చిన్న వ్యత్యాసాలు కనిపించవచ్చు. కానీ, అవి అన్నీ సత్యాలే. ఒకే కుమారసంభవమునుఅనేక కోణాలలో మహర్షులు దర్శించారు.
కుమారస్వామి వారి పేరు చెబితే మనందరికీగుర్తుకు వచ్చే ఒక గొప్ప కావ్యం,”కుమారసంభవం”. మహాకవి కాళిదాసు గారు రచించిన ఈకుమారసంభవం మొత్తం ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్యుడి ప్రసక్తి ఉండదు. కేవలం శివపార్వతుల కళ్యాణ ఘట్టం వరకు చెప్పి ముగిస్తారు కాళిదాసు. శివ పార్వతుల ఏకత్వమేకుమారుని సంభవం.
అష్టాదశపురాణాలలో లక్ష శ్లోకాలు ఉన్న పురాణంస్కాందపురాణం. ఈ పురాణం పరమశివుడి నుంచి స్కందుడు విన్నాడు, అందుకే స్కాంద పురాణంఅయ్యింది. తంత్ర శాస్త్రంలో కూడా వివిధ సుబ్రహ్మణ్య స్వరూపాలు చెప్పబడ్డాయి.
ఉత్థిత కుండలినీ శక్తికి ప్రతీకగాసుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామి వారి ఇద్దరు భార్యలుఅంటే ఇక్కడ లౌకికమైన భార్యలు అని కాదు. వల్లీ దేవి అమ్మ వారు కుండలినీ శక్తికి ప్రతీక.ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాథశక్తికి ప్రతీక వల్లీ దేవి అమ్మ. మనందరిలోనూకుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకుని మూలాధార చక్రములో ఉంటుంది.అయితే ఆ కుందలినీశక్తిని కదపడం అనేది కేవలం సమర్ధుడైన గురువు పర్యవేక్షణలో తప్పఎవరూ సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్తారు.
ఇక దేవసేనా అమ్మ వారు అంటే, ఇంద్రియశక్తులేదేవసేన. కాదు కాదు సకల సృష్టిలో ఉన్న శక్తికి ప్రతీక. వల్లీ దేవి, దేవసేనాఅమ్మలు ఇద్దరూ చైతన్య స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడికి పత్నులు.
“నీవంటి దైవము షడానన! నేనెందుకు కాననురా!మారకోటులందు గల శృంగారము, ఇందుముఖా! నీ కొనగోటను బోలునే!” అని స్కందునికీర్తించారు నాదబ్రహ్మ త్యాగరాజ స్వామి. అలాగే శ్రీముత్తుస్వామి దీక్షితార్ గారుసాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం పొంది, స్వామి అనుగ్రహం పొందినమహనీయుడు. ప్రఖ్యాత ఆరుపడైవీడు క్షేత్రములలో ఒకటైన ‘తిరుత్తణి’లో కుమారస్వామి ఒకవృధ్ధ గురురూపంలో కనిపించి “ముత్తుస్వామి దీక్షితార్! ఏదీ నీ నోరు తెరూ…అని చెప్పిఆయన నోటిలో పటికి బెల్లం వేసి” వెళ్ళిపోయారు. దీక్షితార్ కళ్ళు తెరిచి చూసేసరికిఅక్కడ స్వామి లేరు. అప్పటి నుంచే దీక్షితార్ గారు ఆసువుగా సంగీత, సాహిత్య,మంత్రశాస్త్ర, నాదరహస్యాలు కలబోసిన అనేక దివ్యమైన కృతుల్ని చేశారు. ప్రతీ కీర్తనలో‘గురుగుహ’ అనే నామముతో ముద్రాంకితం చేశారు. “శ్రీగురుగుహ తారయాశు మాం శరవణభవ!శ్రీగురుగుహ తారయాశు మాం శరవణభవ!”, “స్వామినాథ! పరిపాలయాశు మాం స్వప్రకాశ! వల్లీ దేవిశ!గురుగుహ! దేవసేనేశ!” ఇలా ఎన్నెన్నో కీర్తనలను స్వామివారిపై కీర్తించారు.
అలాగే తమిళనాట విశేష సుబ్రహ్మణ్యారాధనచేస్తారు. అరుణగిరినాథర్ అనే గొప్ప భక్తుడు సుబ్రహ్మణ్యానుగ్రహముతో తిరుప్పుగళ్అనే పేరుతో కొన్ని వేల కీర్తనలు చేశారు.
కంచికామకోటి పీఠాధిపతిపరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి మాటలలో చెప్తే, ఉపాసనలోపరమశివుడికి కొన్ని ఇష్టం, అలాగే అమ్మ వారికి కొన్ని ఇష్టం, భక్తులు అమ్మకి అయ్యకిఇద్దరికీ కలిపి పూజ చేయాలి అంటే కేవలం సుబ్రహ్మణ్యస్వామి వారికి పూజ చేస్తే చాలుట.ఒకేసారి శివపార్వతులను పూజించినట్లే. అదీ కుమార తత్వం. ఇక్కడే కుమార తత్వం గురించిమరో చక్కని మాట కూడా చెప్పారు. పరమశివుడు ఎప్పుడూ తనలోతానే రమిస్తూ ఉంటాడు కదా, ఆయనకిఅవతారాలు ఎత్తడం అవీ ఉండవు. మనకి బాలకృష్ణుడు ఉన్నాడు, అలాగే బాలరాముడు ఉన్నాడు,మరి బాలశంకరుడిని ఎక్కడ చూడగలం? అంటే పరమశివుడు చిన్నపిల్లవాడైతే అన్న ఆలోచనకు ఈ బుజ్జిసుబ్రహ్మణ్య స్వామిని ఉదహరించవచ్చన్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.