సాహితీవేత్త From Wikipedia, the free encyclopedia
ఆర్.కే. నారాయణ్‌గా పిలువబడే రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి ( 1906 అక్టోబరు 10 - 2001 మే 13) ఒక భారతీయ రచయిత. ఇతడు మాల్గుడి అనే ఒక కాల్పనిక పట్టణాన్ని సృష్టించి దానిలోని ప్రజలు, వారి వ్యవహారాల గురించి ధారావాహిక నవలలు, కథలు వ్రాసాడు. ఆంగ్ల భాషలో భారత సాహిత్యరంగపు ప్రారంభదశకు చెందిన ముగ్గురు గొప్ప రచయితలలో ఇతడు ఒకడు. ముల్క్‌రాజ్ ఆనంద్, రాజారావులు మిగిలిన ఇద్దరు. ఆంగ్ల భాషలో భారతీయ సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా ఇతనికి పేరు ఉంది. ఇతడు భారతదేశానికి చెందిన ఆంగ్లభాషా నవలా రచయితలలో ఎన్నదగినవారిలో ఒకడు.
తన గురువు, మిత్రుడైన గ్రహం గ్రీన్ సహాయంతో నారాయణ్ వెలుగులోకి వచ్చాడు. ఇతడు రాసిన మొదటి నాలుగు పుస్తకాలను ప్రచురించడానికి ప్రచురణకర్తలను ఒప్పించడంలో గ్రహం గ్రీన్ ముఖ్యపాత్ర పోషించాడు. వీటిలో స్వామి అండ్ ఫ్రెండ్స్, ది బాచిలర్ అఫ్ ఆర్ట్స్,ది ఇంగ్లీష్ టీచర్ అనే మూడు పాక్షిక స్వీయచరిత్ర పుస్తకాలు ఉన్నాయి. 1951 సంవత్సరపు అత్యుత్తమ అసలైన నవలగా పేరొందిన ది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, సాహిత్య అకాడెమీ పురస్కారం గెలిచిన ది గైడ్ నారాయణ్ రాసిన ఇతర నవలలలో కొన్ని. ది గైడ్ నవల హిందీ, ఇంగ్లీషులలో సినిమాగా తీయబడింది.
నారాయణ్ రాసిన కథలలో అనేకం మాల్గుడి అనే ఒక కల్పిత పట్టణం భూమికగా జరుగుతాయి. మొదటి సారిగా ఈ ఊరు స్వామి అండ్ ఫ్రెండ్స్ నవలలో పరిచయం చేయబడింది. ఇతని కథలు సామాజిక సంబంధాలని ఎత్తి చూపి, రోజూవారి జరిగే యథార్థ సంఘటనల ద్వారా పాత్రలకు ప్రాణం పోస్తాయి. వాస్తవమనిపించే ఒక కల్పిత పట్టాణాన్ని సృష్టించి, దాని ద్వారా రోజువారి సామాన్య జీవితములోని హాస్యాన్నీ, సాదాసీదాతనాన్నీ బయటకు చూపి, తన రచనలో దయ, మానవత్వం చూపిన విల్లియం ఫాక్నేర్‌తో ఇతడిని పోలుస్తారు. నారాయణ్ చిన్నకథలు వ్రాసే శైలిని గై డి మొపాసా శైలితో పోల్చబడుతుంది. వీరిద్దరికి కథాంశాలని తీసేయకుండా కథని కుదించే సామర్థ్యం ఉంది. అయితే వచనం, పద ప్రయోగాలలో చాలా సాదాగా ఉండేవాడని నారాయణ్ మీద విమర్శలు ఉన్నాయి.
అరవై ఏళ్ళకు పైగా రచనలు చేసిన నారాయణ్‌కు అనేక పురస్కారాలు, గౌరవాలు అందాయి. రాయల్ సొసైటీ అఫ్ లిటరేచర్ వారి ఎ.సి. బెన్సన్ మెడల్‌నూ, భారతదేశపు రెండవ అత్యుత్తమ పౌరపురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇతడు అందుకున్నాడు. ఇతడు పెద్దల సభ ఐన రాజ్యసభకు నామినేట్ చేయబడ్డాడు.
ఆర్.కే. నారాయణ్ మద్రాస్ (ప్రస్తుత చెన్నై) లో జన్మించాడు.[1] ఇతని తండ్రి ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. నారాయణ్ అదే పాఠశాలలో కొన్నాళ్ళు చదివాడు. ఉద్యోగరీత్యా తండ్రి తరచూ బదిలీ అవుతూ ఉండడంతో, నారాయణ్ తన బాల్యంలో కొన్నాళ్ళు అమ్మమ్మ పార్వతి వద్ద పెరిగాడు.[2] ఆ సమయంలో, ఒక నెమలి, ఒక అల్లరి కోతి ఇతనికి ఆప్తమిత్రులుగా ఉండేవి.[3][4][5]
అమ్మమ్మ ఇతనికి కుంజప్ప అనే ముద్దుపేరు పెట్టింది. చుట్టాల్లో ఆ పేరే స్థిరపడి పోయింది.[6] ఆమె నారాయణ్‌కు గణితం, పురాణాలు, భారతీయ శాస్త్రీయ సంగీతం, సంస్కృతం నేర్పించింది.[7] ఇతని తమ్ముడు ఆర్.కె.లక్ష్మణ్ ప్రకారం, కుటుంబ సభ్యులు అందరు సాధారణంగా ఇంగ్లీషులోనే సంభాషించేవారు. నారాయణ్, అతని తోబుట్టువులు ఏదైనా వ్యాకరణ తప్పులు చేస్తే, కుటుంబసభ్యులు సహించేవారు కాదు.[8] అమ్మమ్మతో ఉన్నప్పుడు, నారాయణ్ పురసవాకం లోని లూథరన్ మిషన్ స్కూల్,[9] సి.ఆర్.సి. హై స్కూల్, క్రిస్టియన్ కాలేజీ హై స్కూలు వంటి వాటిలో చదివాడు.[10] నారాయణ్ ఒక పుస్తకాల పురుగు. ప్రారంభ దశలో ఇతడు డికెన్స్, వోడ్ హౌస్, ఆర్థర్ కోనన్ డోయల్, థామస్ హార్డీ రాసిన పుస్తకాలని చదివాడు.[11]
నారాయణ్ తండ్రి మహారాజ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఉన్నత పాఠశాలకు బదిలీ కావటంతో ఆయన కుటుంబసమేతంగా మైసూరుకు మారాడు. పాఠశాలలోని గ్రంథాలయంతో పాటు, తండ్రి స్వంత గ్రంథాలయం కూడా అందుబాటులో ఉండటంతో, పుస్తకాలు చదవటంలో ఇతడికి ఆసక్తి ఏర్పడింది. స్వయంగా తానే రాయటం కూడా అలవాటు చేసుకున్నాడ్య్. ఉన్నత పాఠశాల విద్య ముగించాక, నారాయణ్ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష తప్పి, ఇంటిలోనే చదువుకుంటూ, రాసుకుంటూ ఒక సంవత్సరం గడిపి, తర్వాత 1926 సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడై మైసూరు మహారాజ కళాశాలలో చేరాడు. బేచలర్ పట్టా పొందడానికి నారాయణ్ నాలుగు సంవత్సరాలు తీసుకున్నాడు. ఇది మామూలు కంటే ఒక ఏడాది ఎక్కువ. మాస్టర్ డిగ్రీ (M.A.) చదవడం వల్ల సాహిత్యంలో ఉన్న ఆసక్తి తగ్గిపోతుందని ఒక మిత్రుడు చెప్పడంతో, కొంత కాలం ఇతడు ఒక పాఠశాల ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేసాడు. అయితే, ప్రధానోపాధ్యాయుడు ఇతడిని వ్యాయామ ఉపాధ్యాయుని స్థానంలో పని చేయమని చెప్పినప్పుడు, ఇతడా ఉద్యోగాన్ని మానేశాడు.[9] తనకు తగిన పని రచనలే అని ఈ అనుభవం వల్ల తెలుసుకుని, ఇంట్లోనే ఉండి నవలలు రాయడం ప్రారంబించాడు.[12][13] ఇతని మొదటి రచన డెవెలప్మెంట్ అఫ్ మారిటైం లాస్ అఫ్ 17త్ సెంచురీ ఇంగ్లాండ్ అనే పుస్తక పరిచయం.[14] ఆ తర్వాత ఆంగ్ల పత్రికలకు కథలు వ్రాయడం ప్రారంబించాడు. వ్రాయడం ద్వారా సంపాదన తక్కువైప్పటికీ, (మొదటి సంవత్సరం ఆయన సంపాదన తొమ్మిది రూపాయిల పన్నెండు అణాలు), ఇతడికి ఒక స్థిరమైన జీవితం ఏర్పడింది. ఇతని అవసరాలు చాలా తక్కువగా ఉండేవి. అసాధరణమైన వృత్తిని ఎన్నుకున్నందుకు ఇతని కుటుంబం, స్నేహితులు ఇతడిని ప్రోత్సహించారు.[15] 1930లో నారాయణ్ తన మొదటి నవల స్వామి అండ్ ఫ్రెండ్స్ [14] ని రచించాడు. ఆ నవల చదివి అతని మావయ్య ఎగతాళి చేసాడు.[16] పలు ప్రచురణకర్తలు ఆ నవలను తిరస్కరించారు.[8] ఈ నవలలోనే నారాయణ్, మనదేశపు సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబించే మాల్గుడి అనే ఒక పట్టణాన్ని సృష్టించాడు. బ్రిటిష్ వారి సమయములోను, స్వాతంత్రం తరువాతా ఏర్పడిన అనేక సామాజిక రాజకీయ మార్పులను బట్టి ఈ పట్టణం కూడా మారుతూ వచ్చింది.[17]
1933లో కోయంబత్తూర్‌లో తన సోదరి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కాలంలో, నారాయణ్ ప్రక్కనే నివసిస్తున్న రాజం అనే ఒక పదిహేనేళ్ళ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. జాతకపరమైన, ఆర్థికపరమైన అడ్డంకులు ఏర్పడినా, నారాయణ్ ఆ అమ్మాయి తండ్రి ఆమోదం పొంది, ఆమెను వివాహం చేసుకున్నాడు. వివాహం పిమ్మట, నారాయణ్ ది జస్టిస్ అనే ఒక మదరాసు పత్రికకు విలేకరి అయ్యాడు. అది బ్రాహ్మణేతరుల ప్రయోజనాలకై వెలసిన పత్రిక. వారి పక్షాన ఒక బ్రాహ్మణ అయ్యరు పనిచెయ్యడం ప్రచురణకర్తలకు ఉత్సాహం కలిగించింది. ఈ ఉద్యోగం ద్వారా ఇతనికి అనేక రకాల ప్రజలు, సమస్యలతో పరిచయం ఏర్పడింది.[18] అంతకు ముందు, నారాయణ్ స్వామి అండ్ ఫ్రెండ్స్ నవల వ్రాతప్రతిని ఆక్స్ఫర్డ్ లోని ఒక మిత్రునికి పంపాడు. ఆ మిత్రుడు ఆ ప్రతిని గ్రహం గ్రీన్‌కు చూపించాడు. గ్రీన్ ఆ పుస్తకాన్ని తన ప్రచురణకర్తకు సిఫార్సు చేస్తే, ఆ పుస్తకం చివరికి 1935లో ప్రచురించబడింది.[3] ఆంగ్ల పాఠకులకు సులువుగా ఉండే విధంగా పేరుని క్లుప్తం చేసుకోమని నారాయణ్‌కు గ్రీన్ సలహా ఇచ్చాడు.[19] ఈ నవల గురించి సానుకూల విమర్శలు వచ్చినప్పటికీ, అమ్మకాలు మాత్రం తక్కువగానే ఉంది. నారాయణ్ తరువాతి నవల ది బేచలర్ అఫ్ ఆర్ట్స్ (1937), కొంత వరకు ఇతని కళాశాల అనుభవం స్ఫూర్తితో వ్రాయబడింది.[20] ఒక తిరగబడే బాలుడు ఒక సర్దుకోగల ఎదిగిన వ్యక్తిగాగా మార్పు చెందే పరిస్థితిని గురించి ఈ నవల వర్ణిస్తుంది;[21] ఈ నవల కూడా గ్రీన్ సిఫార్సుతో మరో ప్రచురణకర్తచే ప్రచురించబడింది. ఇతడు రాసిన మూడో నవల ది డార్క్ రూం (1938),లో గృహస్థ, సంసారిక జీవితాలలోని అపశ్రుతుల[22] గురించి, వివాహ సంబంధంలో మగవాడిని హింసించేవాడిగా, స్త్రీని బాధితురాలుగా చిత్రీకరించబడింది.
1939లో టైఫాయిడ్ వల్ల రాజం చనిపోయింది.[23] ఆమె మరణం నారాయణ్‌ని తీవ్రంగా బాధించడంతో, చాలకాలం దుఃఖంలో ఉన్నాడు. మూడేళ్ళ వయసున్న హేమలత అనే తన కూతురు గురించి ఇతడికి బెంగగా ఉండేది. భార్య మరణం ఇతడి జీవితంలో గణనీయమైన మార్పు తెచ్చింది. ఇదే ఇతని మరుసటి నవల ది ఇంగ్లీష్ టీచర్‌కు స్ఫూర్తిగా నిలిచింది.[14] ఈ నవల, ఆయన మొదటి రెండు నవలలలాగే స్వీయచరిత్రను పోలివుంది. యాధృచ్చికంగా స్వామి అండ్ ఫ్రెండ్స్, ది బేచలర్ అఫ్ ఆర్ట్స్ తరువాత ఈ నవల ట్రయాలజీని పూర్తి చేసింది.[24][25]
కొంత మేరకు విజయం సాదించడంతో నారాయణ్ 1940లో ఇండియన్ థాట్ అనే ఒక పత్రిక ప్రారంబించాడు.[26] కార్ సేల్స్ మాన్ ఆయన తన మావయ్య సహాయంతో, మద్రాస్ నగరములో మాత్రం ఒక వేయికు పైగా చందాదరులని నారాయణ్ సంపాదించకలిగాడు. అయితే, నారాయణ్ దీనిని నడపలేకపోవడంతో, ఈ ప్రయత్నం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఒక సంవత్సరము లోపలే ఈ పత్రిక మూతపడింది.[27] మాల్గుడి డేస్ అనే ఆయన మొదటి చిన్నకథల సంపుటం నవంబరు 1942లో ప్రచురించబడింది. తరువాత, 1945లో ది ఇంగ్లీష్ టీచర్ ప్రచురించబడింది. ఈ మధ్యలో యుద్ధం కారణంగా ఇంగ్లాండ్‌తో సంబంధాలు తెగిపోవడంతో, నారాయణ్ తన సొంత ప్రచురణ సంస్థని ప్రారంబించాడు. దీనికి మళ్ళి ఇండియన్ థాట్ పబ్లికేషన్స్ అనే పేరు పెట్టాడు. ఈ ప్రచురణ సంస్థ దిగ్విజయంగా నేటికీ ఇతని మనవరాలిచే నడపబడుతూ ఉంది.[12] తక్కువ సమయంలోనే న్యూయార్క్ నుండి మాస్కో వరకు పాఠకులు పెరిగే సరికి, నారాయణ్ నవలలు బాగా అమ్ముడుపోవడం మొదలయింది. 1948లో ఇతడు మైసూరు శివార్లలో సొంత ఇల్లు కట్టడం ప్రారంభించాడు. ఆ ఇల్లు 1953లో పూర్తయింది.[28]
ది ఇంగ్లీష్ టీచర్ తరువాత నారాయణ్ వ్రాత శైలిలో మార్పు వచ్చి, మునుపటి నవలలలో కనిపించిన పాక్షిక-స్వీయచరిత్ర లాగ కాకుండా ఎక్కువ కల్పనాశక్తితో కూడినదిగా మారింది. ఇతని మరుసటి నవల Mr. సంపత్ ఈ మారిన శైలిలో రాసిన మొదటి నవల. అయితే, ఇది కూడా కొంత మేరకు ఆయిన సొంత అనుభవాల మీద ఆధార పడివుంది. ముఖ్యంగా, సొంత పత్రిక ప్రారంభించిన అనుభవాలు; జీవితచరిత్రలోని సంఘటనలని చేర్చటణ్ ద్వారా ఇతడు తన మునుపటి నవలలకంటే భిన్నమైన శైలిని ప్రదర్శించాడు.[29] ఈ నవల తర్వాత మాస్టర్ పీస్ అని భావించబడే ది ఫైనాన్షియల్ ఎక్స్పెర్ట్ అనే నవలని ప్రచురించాడు. ఈ నవల 1951 సంవత్సరపు అత్యుత్తమ పుస్తకంగా కొనియాడబడింది.[30][31] ఆర్థిక విషయాలలో మేధావి ఐన మార్గయ్య అనే బంధువు యథార్థ కథ ఆధారంగా ఈ నవల వ్రాయబడింది.[32] ఇతని తర్వాతి నవల వెయిటింగ్ ఫర్ ది మహాత్మా మాల్గుడికి మహాత్మా గాంధి వస్తున్నట్లు ఊహించి వ్రాసింది. కథానాయకుడు మహాత్ముని ప్రసంగాలను వినడానికి వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ పట్ల అతనికి కలిగిన ప్రేమభావాల గురించినదే ఈ కథ. భారతి అనే పేరుగల ఆ స్త్రీ, భారత దేశానికి ప్రతీక. భారత స్వాతంత్రోద్యమానికి గురించిన కొన్ని ముఖ్య సంఘటనలు ఈ నవలలో ఉన్నా, ఈ కథ ముఖ్యంగా ఒక సామాన్య వ్యక్తి యొక్క జీవితం గురించి వ్యంగ్యంగా వ్రాయబడింది.[33]
1953లో ఇతని నవలలు మొదటి సారిగా యునైటెడ్ స్టేట్స్లో ప్రచురించబడ్డాయి. మిచిగన్ స్టేట్ యునివెర్సిటీ ప్రెస్ వీటిని ప్రచురించింది. 1958లో వీటి ప్రచురణ హక్కులని వైకింగ్ ప్రెస్‌కు అమ్మేశారు.[34] నారాయణ్ తన రచనల్లో విప్లవభావాలు చొప్పించినా ఒక సాంప్రదాయవాదే; ఫిబ్రవరి 1956లో, నారాయణ్ తన కుమార్తె వివాహాన్ని పూర్తి సాంప్రదాయబద్దంగా అన్ని హైందవ ఆచరాలను పాటించి జరిపాడు.[35] కూతురు పెళ్ళి తరువాత, నారాయణ్ అప్పుడప్పుడు ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా, రోజుకు కనీసం 1500 పదాలైన రాయడం కొనసాహించాడు.[28] ది గైడ్ అనే నవల, ఇతడు 1956లో రాక్ఫెల్లెర్ ఫెలోషిప్ మీద యునైటెడ్ స్టేట్స్ను సందర్శించినపుడు వ్రాసాడు. యు.ఎస్.లో ఉన్నప్పుడు, నారాయణ్ తన దినచర్యని ఒక డైరీలో రాసేవాడి. అదే ఇతడు రాసిన మై డేట్ లెస్ డైరీ అనే పుస్తకానికి ఆధారమయింది.[36] దాదాపు ఇదే సమయంలో, ఇంగ్లాండ్ సందర్శించిన నారాయణ్, మొదటి సారిగా తను మిత్రుడు, గురువైన గ్రాహం గ్రీన్ ని కలిశాడు.[23] భారత దేశానికి తరిగి వచ్చిన తరువాత, ది గైడ్ ప్రచురించబడింది.[37] ఈ పుస్తకం ఇతనికి 1958లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం తెచ్చిపెట్టింది.[38]
అప్పుడప్పుడు, నారాయణ్ తన ఆలోచనలను వ్యాసాల రూపంలో వెలువరించేవాడు. వీటిలో కొన్ని పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇటువంటి వ్యాసాల సంకలనమే నెక్స్ట్ సండే (1960).[39] దీని తర్వాత 1956 యునైటెడ్ స్టేట్స్ సందర్శన అనుభవాలను వివరించే మై డేట్ లెస్ డైరీ' ప్రకటించబడింది. ది గైడ్ రాసిన అనుభవం గురించిన ఒక వ్యాసం కూడా ఈ పుస్తకంలో ఉంది.[36][40]
నారాయణ్ యొక్క తదుపరి నవల ది మాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి 1961 సంవత్సరములో ప్రచురించబడింది.[34] ఈ పుస్తకం విడుదలయ్యాక, నారాయణ్ మళ్ళీ ప్రయాణాలు ప్రారంబించి, యు.ఎస్., ఆస్ట్రేలియాను సందర్శించాడు. ఇతడు అడిలైడ్, సిడ్నీ, మెల్బోర్న్ లలో భారతీయ సాహిత్యం గురించి ఉపన్యాసాలు ఇస్తూ మూడు వారాలు గడిపాడు. ఈ పర్యటనకు ఆస్ట్రేలియన్ రైటర్స్ గ్రూప్ నిధులు సమకూర్చింది.[41] ఈ సమయానికల్లా, నారాయణ్, సాహిత్య పరంగానూ, ఆర్థిక పరంగానూ గణనీయమైన విజయం సాధించాడు. మైసూరులో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. వివాహం తరువాత కోయంబత్తూరులో స్థిరపడ్డ తన కూతురుని కలవడానికి, అప్పట్లో భారాత దేశములో విలాస వస్తువైన కొత్త మెర్సిడెస్-బెంజ్ కారులో వెళ్ళేవారు. భారతదేశంలోను, విదేశాలలోనూ విజయం సాధించిన తరువాత, నారాయణ్ ది హిందూ, ది అట్లాంటిక్ వంటి పత్రికలకు, వార్తాపత్రికలకు వ్రాయడం మొదలుపెట్టాడు.[42]
1964లో నారాయణ్ తన మొదటి పౌరాణిక పుస్తకమైన గాడ్స్, డెమన్స్ అండ్ అదర్స్ని ప్రచురించాడు. ఇది హిందూ పురాణాలనుండి అనువదించబడిన చిన్నకథల సమాహారం. ఇతని ఇతర పుస్తకాల లాగే, ఈ పుస్తకానికి కూడా, ఇతని తమ్ముడైన ఆర్.కె.లక్ష్మణ్ బొమ్మలు గీచాడు.[43]
నారాయణ్ తరువాతి నవల, 1967లొ ప్రచురించబడిన ది వెండార్ అఫ్ స్వీట్స్ . ఈ నవలలో కొంత మేరకు ఇతని అమెరికా పర్యటనలు వివరించబడ్డాయి. ఆ సంవత్సరం, నారాయణ్ ఇంగ్లాండుకు వెళ్ళాడు. అక్కడ మొదటి సారిగా యునివర్సిటీ అఫ్ లీడ్స్ నుండి గౌరవ డాక్టరేట్ స్వీకరించాడు.[44] 1970లో ఆయన కథానికా సంపుటి ఎ హార్స్ అండ్ టూ గోట్స్ ను ప్రకటించాడు.[45] నారాయణ్ తన మామయ్యకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం కంబ రామాయణనాన్ని ఆంగ్లంలో అనువాదం చేయడం మొదలుపెట్టి ఐదు సంవత్సరాల తర్వాత 1973లో ది రామాయణను ప్రచురించాడు.[46] ది రామాయణ ప్రచురించిన వెనువెంటనే, నారాయణ్ మహాభారతాన్ని సంస్కృతం నుండి ఆంగ్లంలోనికి అనువాదం చేశాడు. ఈ కావ్యాన్ని రాస్తూ ఉండగానే, ఆయన ది పెయింటర్ అఫ్ సైన్స్ (1977) అనే మరో పుస్తకాన్ని ప్రచురించాడు. ది పెయింటర్ అఫ్ సైన్స్ ఇతర నవలల కంటే విబిన్నంగా ఉండి కొంత శృంగారాన్ని చొప్పించాడు. ది మహాభారత 1978లో ప్రచురించబడింది.[47]
కర్నాటక ప్రభుత్వం రాష్ట్ర పర్యాటకరంగ ప్రచారము కొరకు ఒక పుస్తకము రాసే పనిని నారాయణ్‌కు అప్పగించింది. నారాయణ్ రాసినవాటిని, ప్రభుత్వం 1970ల చివర్లో ప్రచురించింది.[48] ఐతే నారాయణ్ దానితో తృప్తి చెందక, ది ఎమరాల్డ్ రూట్ (ఇండియన్ థాట్ పబ్లికేషన్స్, 1980) పేరుతో దానిని పునఃప్రచురణ చేశాడు.[49]అదే సంవత్సరం, ఇతడు అమెరికన్ అకాడెమీ అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవ సభ్యుడుగా ఎంపికయ్యాడు. రాయల్ సొసైటీ అఫ్ లిటేరేచర్ వారి ఎ.సి.బెన్సన్ మెడల్ ని గెలుచుకున్నాడు.[50]ఇంచుమించు ఇదే సమయములో, నారాయణ్ నవలలు మొదటి సారిగా చైనీస్ భాషలో అనువాదించబడ్డాయి.[51]
1983లో నారాయణ్ ఎ టైగర్ ఫర్ మాల్గుడిని ప్రచురించాడు. ఇది ఒక పులి, మనుషులతో దానికి ఉన్న సంబంధాల గురించిన కథ.[52] 1986లో ప్రచురించబడిన నవల టాకటివ్ మాన్, మాల్గుడికి చెందిన పాత్రికేయుడు కావాలని ఆకాంక్షిస్తున్న ఒక వ్యక్తి గురించిన కథ.[53] దాదాపు ఇదే సమయంలోమాల్గుడి డేస్(మరి కొన్ని కొత్త కథలను చేర్చిన రివైజ్డ్ ఎడిషన్), ది బన్యన్ ట్రీ అండ్ అదర్ స్టోరీస్ అనే రెండు కథా సంపుటాలను ప్రచురించాడు.[54] 1987లో ఇతడుఎ రైటర్స్ నైట్మేర్ అనే వ్యాస సంపుటాన్ని ప్రకటించాడు. దీంట్లో కుల వ్యవస్థ, నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రేమ, కోతులు గురించిన వివిధ అంశాల మీద వ్యాసాల ఉన్నాయి. 1958 నుండి వివిధ పత్రికలలో రాసిన వ్యాసాలు ఈ సేకరణలో ఉన్నాయి.[55][56]
మైసూర్ లో ఒంటరిగా ఉన్నప్పుడు, ఇతనికి వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. ఒక ఎకరా పంటపొలం కొని వ్యవసాయం చేశాడు.[57] ప్రతిరోజూ మధ్యాహ్నం ఆయన మార్కెట్‌కు నడచి వెళ్ళేవాడు. ఏదైనా కొనటానికి కాకుండా అక్కడి జనాలతో కలిసి ఉండటానికోసమే ఆయన అలా వెళ్ళేవాడు. అలాంటి సమయాల్లో, అడుగడుకుకి ఆగి కొట్ల యజమానులతో, వినియోగదారులతో మాట్లాడేవాడు. బహుశా ఇలా వారి నుండి సేకరించిన విషయాలను తన తర్వాతి పుస్తకాలలో ఉపయోగించుకునేవాడు.[58]
1980లో నారాయణ్ రాజ్య సభకు నామినేట్ చేయబడ్డాడు.[59] రాజ్యసభ సభ్యుడిగా తన పదవీ కాలంలో ఇతడు పాఠశాల పిల్లల దురవస్థలు, ముఖ్యంగా పుస్తకాల బరువు తగ్గించడం, పిల్లల సృజనాత్మకతపై విద్యావ్యవస్థ ప్రభావం మొదలైన అంశాలపై పూర్తి శ్రద్ధ కనబరచాడు. ఈ సమస్యనే ఇతడు తన మొదటి నవల స్వామి అండ్ ఫ్రెండ్స్‌లో ప్రముఖంగా ప్రస్తావించాడు. ఇతడు చేసిన తొలి ప్రసంగంలో ఈ ప్రత్యేక సమస్య గురించి మాట్లాడాడు. ఇతని కృషి ఫలితంగా పాఠశాల విద్యావ్యవస్థలో మార్పులు చేయడానికి ప్రొఫెసర్ యష్పాల్ నేతృత్వంలో ఒక కమిటి ఏర్పాటు చేయబడింది.[60]
1990లో ఇతని నవల ది వరల్డ్ అఫ్ నాగరాజ్ విడుదలయ్యింది. ఇది కూడా మాల్గుడిలో జరిగే కథ. ఈ నవలలో నారాయణ్ వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.[61] ఈ నవల వ్రాయడం పూర్తైన తర్వాత నారాయణ్ ఆరోగ్యం క్షీణించసాగింది. కూతురు కుటుంబానికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఇతడు మద్రాసుకు మకాం మార్చాడు.[57] మద్రాసుకు మారిన కొన్ని సంవత్సరాల తరువాత, 1994లో ఇతని కూతురు కాన్సర్ వ్యాధి సోకి మరణించగా, ఇతని మనవరాలు భువనేశ్వరి (మిన్నీ) ఇతని ఆలనాపాలనా చూసుకోవడం ప్రారంబించింది. అలాగే, ఇండియన్ థాట్ పబ్లికేషన్స్ని కూడా తనే నిర్వహించింది.[3][12] తరువాత నారాయణ్ తన ఆఖరి పుస్తకమైన గ్రాండ్ మదర్స్ టేల్ని ప్రచురించాడు. ఇది ఆయన ముత్తవ్వ గురించిన కథ. తన భర్త వివాహమైన వెంటనే పారిపోవడంతో, ఆమె అతడిని వెతకటానికి సుదూర ప్రాంతాలకు పయనం చేసింది. నారాయణ్ బాలుడుగా ఉన్నప్పుడు అమ్మమ్మ ఇతనికి ఈ కథని వివరించింది.
తన ఆఖరి సంవత్సరాలలో నారాయణ్, దాదాపు ప్రతిరోజూ సాయంత్రం, ది హిందూ సంపాదకుడైన ఎన్.రామ్‌తో గడిపేవాడు. ఇద్దరూ కాఫీ త్రాగుతూ, రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటూ, అర్ధరాత్రి దాటే వరకు గడిపేవారు.[62]
2001 మేనెలలో నారాయణ్ ఆసుపత్రిలో చేరాడు. ఇతడిని వెంటిలేటర్ లో పెట్టడానికి కొన్ని గంటలు ముందు, తన తాత గురించిన కొత్త కథ, తన మరుసటి నవల రాయడం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇతడు చెన్నైలో తన 94వ వయస్సులో 2001 మే 13వ తేదీన మరణించాడు.[10][63]
నారాయణ్ రచనా శైలి సరళంగా, కపటం లేకుండా, సహజంగా హాస్యస్పోరకంగా ఉండేది.[64] ఇతని రచనల్లో సామాన్య ప్రజలు కేంద్రబిందువుగా ఉండటం వల్ల పాఠకులు ఇతని పాత్రలను తమ బంధువులుగా, ఇరుగు పొరుగు వారిగా భావించేవారు. దీనివల్ల పుస్తకంలోని విషయాలతో పాఠకులు దాదాపుగా ఏకీభవించేవారు. [65] తన సమకాలీన రచయితలవలె నవలా రచనలో అప్పుడున్న బాణికి అనుకూలంగా తన శైలిని మార్చుకోకుండా సమాజంలోని సమస్యలను తనదైన సరళమైన శైలిలో వ్రాయగాలిగాడు.[66] విమర్శకులు నారాయణ్‌ని భారత చెకోవ్ అని పరిగణించారు. ఇద్దరి రచనలోని సరళత్వం, సున్నితహాస్యం వంటి అంశాల వల్ల ఇద్దరిని పోల్చేవారు.[67]ది న్యూయార్కర్కు చెందిన ఆంటొనీ వెస్ట్ ప్రకారం నారాయణ్ రచన నికోలాయి గోగోల్ యొక్క వాస్తవికత రచన లాగా ఉందని భావించాడు.[68]
నారాయణ్ రాసిన కథానికలు ఇతడు రాసిన నవలల వలె లాగే మనోహరంగా ఉన్నాయని, చాలా కథానికలు పది పేజీలకంటే తక్కువే ఉన్నాయని, చదవటానికి కూడా అంతే సమయం తీసుకుంటుందని పులిట్జర్ ప్రైజ్ గ్రహీత జుంపా లహరి భావించింది. నారాయణ్ రచనల గుణగణాలు, సామర్ధ్యాల వల్ల లహరి ఇతడిని ఓ. హెన్రీ, ఫ్రాంక్ ఓ'కానర్, విల్లియం ఫాక్నర్ వంటి కథారచయితలతో జత కట్టింది. ఇంకా ఈమె నారాయణ్‌ను గై డి మొపాసాతో కూడా పోల్చింది. కథని చెడగొట్టకుండా ఉపాఖ్యానాన్ని తగ్గించే సామర్థ్యం ఇద్దరికీ ఉంది. ఇద్దరూ ఒక రకమైన మధ్య తరగతి జీవితం గురించి, ఎక్కడ వదలకుండా, జాలి చూపకుండా రాసారు.[11]
మాల్గుడి, నారాయణ్ సృష్టించిన ఒక కాల్పనిక, పాక్షిక నగర వాతావరణం కలిగిన దక్షిణ భారత పట్టణం.[69] aayana ఈ పట్టణాన్ని సెప్టెంబరు 1930న విజయదశమి నాడు సృష్టించాడు.[70] ఇతనికి మొదట మదిలో ఒక రైల్వే స్టేషను మెదిలి, తరువాత నెమ్మదిగా మాల్గుడి అనే పేరు తట్టినట్లు ఇతడు చెప్పుకున్నాడు.[71] రామాయణ కాలం నుండి ఉన్న నిష్కళంకమైన చరిత్ర గల పట్టణంగా మాల్గుడి సృష్టించబడింది. శ్రీరామచంద్రుడు ఈ పట్టణం మీదుగా వెళ్ళినట్లు వ్రాయబడింది; బుద్ధుడు కూడా మార్గమధ్యంలో ఈ పట్టణాన్ని సందర్శించినట్లు వ్రాయబడింది.[72] నారాయణ్ ఈ పట్టణానికి కచ్చితమైన భౌగోళిక హద్దులు ఎప్పుడూ పెట్టలేదు. కథలో వచ్చే సంఘటనలకు అనుగుణంగా ఊరి రూపురేఖలు తరచూ మార్చి, భవిష్యత్తు కథలకు రంగం సిద్దం చేసేవాడు.[73] డా. జేమ్స్ ఎం. ఫెన్నేలీ, నారాయణ్ రాసిన అనేక పుస్తకాలు, కథల ఆధారంగా మాల్గుడి రేఖాచిత్రాన్ని రూపొందించాడు.[11]
భారాతదేశములో మారుతున్న రాజకీయ పరిణామాల బట్టి మాల్గుడి కూడా మారుతూ వచ్చింది. 1980లలో, భారతదేశంలో జాతీయవాదం గట్టిగా పెరుగుతున్న సమయంలో, పట్టణాలకు, ప్రాంతాలకు బ్రిటిష్ పేర్లని మార్చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఆ సమయములో మాల్గుడి మేయర్‌గా చాలా కాలంగా ఉన్న ఫ్రెడరిక్ లాలీ యొక్క విగ్రహాన్ని తీసివేశారు. ఫ్రెడరిక్ లాలీ మాల్గుడిలో స్థిరపడ్డ పౌరులలో ఒకడు. అయితే, భారత స్వాతంత్రోద్యమాన్ని లాలి గట్టిగా సమర్ధించేవాడని హిస్టారికల్ సొసైటీస్ ఆధారాలు చూపినప్పుడు, ముందు తీసుకున్న చర్యలని నగరసభ ఉపసంహరించుకోవలసి వచ్చింది.[74]
నారాయణ్ మొదట ప్రపంచానికి గ్రాహం గ్రీన్ ద్వారా తెలిశాడు. గ్రీన్, స్వామినాథన్ అండ్ టేట్ని చదవగానే తనంతట తనే ఆ పుస్తకానికి నారాయణ్ ఏజెంట్ లాగ వ్యవహరించాడు. అతడే ఈ నవల పేరుని స్వామి అండ్ ఫ్రెండ్స్‌గా మార్చడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అంతే కాక, నారాయణ్ తర్వాతి పుస్తకాలు కొన్నింటికి ప్రచురణకర్తలని ఒప్పించడంలో కూడా ముఖ్య పాత్ర పోచించాడు. నారాయణ్ యొక్క మొదటి నవలలు వాణిజ్యంగా గొప్ప విజయం సాదించకపోయినా, ఆ కాలపు ఇతర రచయితల దృష్టిలో పడ్డాడు. సోమర్ సెట్ మామ్ 1938లో మైసూరుకు వచ్చినప్పుడు నారాయణ్‌ని చూడాలని కోరాడు. కాని నారాయణ్ ఆ సమయానికి చాలా మందికి తెలియకపోవడంతో, అతని కోరిక తీరలేదు. తరువాత మామ్ నారాయణ్ రాసిన ది డార్క్ రూం చదివి అబినందనలు తెలియచేస్తూ నారాయణ్‌కు లేఖ రాసాడు.[75][76] నారాయణ్ రచన మీద ఆసక్తి చూపించిన మరో సమకాలీన రచయిత ఇ.ఎం.ఫార్స్టర్.[77] అతడు కూడా నారాయణ్ మాదిరిగానే హాస్యధోరణిలో రచనలు చేస్తాడు. అందువల్ల దక్షిణ భారతీయ ఇ.ఎం.ఫార్స్టర్ అని నారాయణ్ పిలవబడ్డాడు.[78]
కొంత కాలం తరువాత నారాయణ్‌కు అమెరికా సంయుక్తరాష్ట్రాలలో గుర్తింపు లభించింది. మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ ప్రెస్ ఇతడి పుస్తకాలని ప్రచురించడం ప్రారంబించింది. మొదటిసారి అమెరికా దేశానికి రాక్ ఫెల్లెర్ ఫౌండేషన్ వారి ఫెలోషిప్ మీద వెళ్ళాడు. అక్కడ మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియా, బెర్క్లీ వంటి అనేక విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు చేశాడు. ఈ తరుణంలో జాన్ అప్డైక్ ఇతని రచనను గమనించి, ఇతడిని చార్లెస్ డికెన్స్‌తో పోల్చాడు. ది న్యూ యార్కర్లో ప్రచురించబడిన వ్యాసంలో అప్డైక్ ఇతడిని అంతరించిపోతున్న రచయితల జాతికు చెందిన రచయితగా వర్ణించాడు.[79]
అనేక నవలలు, వ్యాసాలు, చిన్నకథలు రాసిన నారాయణ్, భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిగా పేరొందాడు. శశి ధరూర్, శశి దేశ్‌పాండే, వి.ఎస్.నయపాల్, వ్యాట్ మేసన్, శ్రీనివాస అయ్యంగార్, విలియం వాల్ష్, అనితా దేశాయ్ వంటి దేశవిదేశాల విమర్శకులు నారాయణ్ రచనలపై విశ్లేషణలు చేశారు.
తన సాహిత్య జీవితములో అనేక పురస్కారాలను నారాయణ్ గెలుచుకున్నాడు.[80] ఇతడికి లభించిన మొదటి పెద్ద గుర్తింపు, ది గైడ్ నవలకు 1958లో బహుకరించబడిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు[81] ఆరు సంవత్సరాల తర్వాత, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇతడి పద్మ భూషణ్ పురస్కారం లభించింది.[82] 1980లో రాయల్ సొసైటీ అఫ్ లిటరేచర్ వారు "ఎ.సి.బెన్సన్ మెడల్" బహూకరించారు. ఇతడు ఆ సొసైటిలో ఒక సభ్యుడు.[83] 1982లో ఇతడిని అమెరికన్ అకాడమీ అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ వారు గౌరవ సభ్యుడుగా ఎన్నుకున్నారు.[66] ఇతని పేరు పలుమార్లు సాహిత్యంలో నోబెల్ బహుమతికు పరిశీలించబడింది కాని ఆ పురస్కారం ఇతనికి దక్కలేదు.[84]
యూనివెర్సిటీ అఫ్ లీడ్స్ (1967),[85] మైసూరు విశ్వవిద్యాలయం (1976)[86] ఢిల్లీ విశ్వవిద్యాలయం (1973) మొదలైన విశ్వవిద్యాలయాలు ఇతనికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించాయి.[87] సాహిత్యరంగానికి చేసిన సేవకు గుర్తింపుగా నారాయణ్ భారత రాజ్య సభకు ఆరు సంవత్సరాల కాలానికి నియమితుడైనాడు.[59] ఇతడు మరణించడానికి ఒక సంవత్సరం ముందు, 2000లో భారతదేశపు రెండవ అతి గొప్ప పౌరపురస్కారం పద్మ విభూషణ్ ఇతడిని వరించింది.[88]
తన సాహిత్యం ద్వారా భారతదేశాన్ని బయటి ప్రపంచానికి పరిచయం చేసిన వారిలో నారాయణ్ ఒకడూ. భారత సాహిత్యరంగానికి చెందిన ముగ్గురు గొప్ప ఇంగ్లీషు రచయితలలో ఇతడు ఒకడు. ముల్క్ రాజ్ ఆనంద్,, రాజారావులు మిగిలిన ఇద్దరు. 2014లో గూగుల్ ఇతని 104వ జయంతి సందర్భంగా ఒక డూడుల్‌ని ప్రదర్శించడం ద్వారా గౌరవించింది.[89]
Whom next shall I meet in Malgudi? That is the thought that comes to me when I close a novel of Mr Narayan's. I do not wait for another novel. I wait to go out of my door into those loved and shabby streets and see with excitement and a certainty of pleasure a stranger approaching, past the bank, the cinema, the haircutting saloon, a stranger who will greet me I know with some unexpected and revealing phrase that will open a door on to yet another human existence.
—Graham Greene[90]
మైసూరులో ఇతడు నివసించిన గృహాన్ని 2016లో ఇతని గౌరవ సూచకంగా ఒక మ్యూజియంగా మార్చారు.[91][92]
నారాయణ్ రచించిన ది గైడ్ అనే నవల గైడ్ అనే పేరుతో విజయ్ ఆనంద్ దర్శకత్వంలో హిందీ సినిమాగా తీయబడింది. ఆంగ్ల భాషలో కూడా ఐది విడుదలయింది. అయితే, ఈ సినిమాను నవలలో రాసినట్లు కాకుండా కథను మార్చి తీయడం నారాయణ్‌కు నచ్చలేదు.లైఫ్ పత్రికలో "ది మిస్ గైడెడ్ గైడ్" అనే పేరుతొ ఈ చిత్రాన్ని విమర్శిస్తూ ఒక వ్యాసం రాసాడు.[9] Mr. సంపత్ అనే ఇతని నవల మిస్ మాలిని అనే పేరుతో, పుష్పవల్లి, కొత్తమంగళం సుబ్బు నటులుగా తమిళభాషలో సినిమాగా తీయబడింది. పద్మిని, మోతిలాల్ నటులుగా జెమినీ స్టూడియోస్ ఈ సినిమాను హిందీలో కూడా నిర్మించారు.[93] మరో నవల ది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ బ్యాంకర్ మర్గయ్య అనే పేరుతొ కన్నడభాషలో సినిమాగా తీయబడింది.[94] స్వామి అండ్ ఫ్రెండ్స్, ది వెండార్ అఫ్ స్వీట్స్తోపాటు నారాయణ్ రచించిన మరి కొన్ని చిన్నకథలని నటుడు-దర్శకుడైన శంకర్ నాగ్, మాల్గుడి డేస్ అనే పేరుతో టెలివిజన్ సీరియల్‌గా తీసాడు. దీనితో నారాయణ్ సంతృప్తి చెంది, పుస్తకాలలో రాసినట్లే కథలని ఉంచడం గురించి నిర్మాతలని నారాయణ్ మెచ్చుకున్నాడు.[95]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.