ఆంగ్ల రచయిత. From Wikipedia, the free encyclopedia
రాజారావు (1908 – 2006) ఇంగ్లీషులో నవలలు, కథలు వ్రాసిన ఒక భారతీయ రచయిత. ఇతని నవల "ది సెర్పెంట్ అండ్ ద రోప్" ఇతనికి 1964లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెచ్చి పెట్టింది.
రాజారావు | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | హసన్, మైసూరు, భారతదేశం | 1908 నవంబరు 8
మరణం | 2006 జూలై 8 97) ఆస్టిన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు | (వయసు
వృత్తి | రచయిత, ప్రొఫెసర్ |
భాష | ఇంగ్లీషు, ఫ్రెంచి, కన్నడ |
పూర్వవిద్యార్థి | ఉస్మానియా విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం, మొపెయి విశ్వవిద్యాలయం |
కాలం | 1938–1998 |
రచనా రంగం | నవల, కథ, వ్యాసం |
గుర్తింపునిచ్చిన రచన | కాంతాపుర (1938) ద సెర్పెంట్ అండ్ ద రోప్ (1960) |
పురస్కారాలు |
|
రాజారావు 1908, నవంబరు 8వ తేదీన మైసూరు రాజ్యం (ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం) లోని హసన్ పట్టణంలో ఒక స్మార్త బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతడు వారి తల్లి దండ్రులకు జన్మించిన 9 మంది సంతానంలో పెద్దవాడు. ఇతనికి ఏడుగురు చెల్లెల్లు, ఒక తమ్ముడు యోగేశ్వరానంద ఉన్నారు. ఇతని తండ్రి హెచ్.వి.కృష్ణస్వామి హైదరాబాదులోని నిజాం కళాశాలలో కన్నడ భాషను బోధించేవాడు. ఇతని తల్లి గౌరమ్మ ఒక గృహిణి. ఇతడు 4 యేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె మరణించింది.[1]
ఇతడు నైజాం పరిపాలనలో ఉన్న ఆనాటి హైదరాబాదులోని మదరసా - ఎ - ఆలియాలో మెట్రిక్యులేషన్ వరకూ చదివాడు. తరువాత తండ్రి పనిచేస్తున్న నిజాం కళాశాలలో డిగ్రీ చదివాడు.[2] తరువాత ఇతడు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఫ్రెంచి అధ్యయనం చేశాడు. ఆ తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు, చరిత్రలలో పట్టా పుచ్చుకున్నాడు. హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వంచేత 1929లో ఏషియాటిక్ స్కాలర్‌షిప్ పొంది ఫ్రాన్స్‌లోని మొపెయి విశ్వవిద్యాలయం (University of Montpellier)లో ఐరిష్ సాహిత్యంపై భారతీయ ప్రభావం అనే అంశంపై అధ్యయనం చేశాడు. 1931లో ఇతడు కేమిల్ మౌలీ అనే ఫ్రెంచి అధ్యాపకురాలిని వివాహం చేసుకున్నాడు. 1939 వరకు వీరు కలిసి ఉన్నారు. తరువాత వీరి సంబంధం భగ్నమైంది. ఈ వైవాహిక జీవితం గురించి రాజారావు తన నవల "ది సెర్పెంట్ అండ్ ది రోప్"లో వర్ణించాడు. 1939లో ఇతడు భారతదేశం తిరిగి వచ్చాడు. 1942లో ఇతడు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. 1943-1944లో ఇతడు బొంబాయి నుండి వెలువడిన "టుమారో" అనే పత్రికకు సహసంపాదకుడిగా వ్యవహరించాడు. "శ్రీ విద్యా సమితి" అనే సాంస్కృతిక సంస్థ ప్రారంభానికి ఇతడు ముఖ్యకారకుడు. ఇతడు "చేతన" అనే మరో సాంస్కృతిక సంస్థతో కూడా అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇతడు 1966 నుండి 1986 వరకు ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో తత్త్వశాస్త్రాన్ని బోధించాడు. అక్కడ ఇతడు బోధించిన వాటిలో మార్క్సిజం నుండి గాంధీయిజం దాకా,మహాయాన బౌద్ధము, భారతీయ తత్త్వము, ఉపనిషత్తులు మొదలైనవి ఉన్నాయి. 1965లో ఇతడు అమెరికన్ రంగస్థల నటి కేథరిన్ జోన్స్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి క్రిస్టఫర్ రామారావు అనే ఒక కుమారుడు కలిగాడు. 1986లో ఆమెకు విడాకులు ఇచ్చి సూసన్ వాట్‌ను మూడవ వివాహం చేసుకున్నాడు సూసన్ 1970లో టెక్సాస్ యూనివర్సిటీలో ఇతని శిష్యురాలు.
ఇతడు తన రచనా వ్యాసంగంపు తొలిదశలో ఫ్రాన్సు దేశంలో ఫ్రెంచి, ఇంగ్లీషు, కన్నడ భాషలలో కథలు వ్రాశాడు. 1939లో ఛేంజింగ్ ఇండియా అనే సంకలనానికి సంపాదకునిగా, విదర్ ఇండియా అనే పుస్తకాన్ని ఇక్బాల్ సింగ్‌తో కలిసి సహసంపాదకునిగా ప్రచురించాడు. జవహర్‌లాల్ నెహ్రూ వ్రాసిన సోవియట్ రష్యా సమ్ రాండమ్ స్కెచెస్ అండ్ ఇంప్రెషన్స్ అనే పుస్తకానికి సంపాదకుడిగా ఉన్నాడు. ఇతడు జాతీయోద్యమంలో పాల్గొన్న అనుభవాలు ఇతని తొలి నవల "కాంతాపుర"లోను కథా సంకలనం "ది కౌ ఆఫ్ ది బ్యారికేడ్స్"లోను ప్రతిఫలించాయి. ఫ్రాన్స్ నుండి తిరిగి వచ్చిన చాలా కాలం తర్వాత 1960లో ఇతడు "ద సర్పెంట్ అండ్ ద రోప్" రచించాడు. దీనిలో భారతీయ పాశ్చాత్య సంస్కృతుల మధ్య సంబంధాలను నాటకీయ ఫక్కీలో వర్ణించబడింది. ఈ నవల పేరులోని సర్పం (Serpent) భ్రాంతికి, త్రాడు (Rope) వాస్తవానికి ప్రతీకలు[3].
ఇతని రచనల జాబితా
ఇతడు 2006, జూలై 8వ తేదీన టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలోని తన గృహంలో 97వ యేట గుండెపోటుతో మరణించాడు.[1][6][7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.