From Wikipedia, the free encyclopedia
భారత్-పాకిస్తాన్ ల మధ్య అతి పెద్ద యుద్ధం 1971 లో జరిగింది. ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ విమోచన ప్రధాన అంశంగా నిలిచింది. 1971 డిసెంబరు 3 సాయంత్రం మొదలయిన యుద్ధం 1971 డిసెంబరు 16 న పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో భారత సైన్యం, బంగ్లాదేశ్ సైన్యం కలసికట్టుగా పాకిస్తాన్ సైన్యంతో పొరాడటం విశేషం.
భారత్ పాక్ యుద్ధం 1971 | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
పాకిస్తాన్ సైన్యాధిపతి ఎ.ఎ.కె. నియాజి తన సైన్యంతో బాటు భారత్ సైన్యాధిపతి జగ్జీత్ సింగ్ అరోరాకి లొంగిపోతున్నట్టుగా సంతకం చేస్తున్న దృశ్యం. | |||||||||
| |||||||||
ప్రత్యర్థులు | |||||||||
భారత్ | పాకిస్తాన్ | ||||||||
సేనాపతులు, నాయకులు | |||||||||
శామ్ మానెక్షా జగ్జీత్ సింగ్ అరోరా జి.జి. బేవూర్ కె.పి. కాన్డెత్ | గుల్ హసన్ ఖాన్ అబ్దుల్ హమూద్ ఖాన్ టిక్కా ఖాన్ ఎ.ఎ.కె. నియాజి | ||||||||
బలం | |||||||||
500,000 సైనికులు | 365,000 సైనికులు | ||||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||||
3,843 మరణించారు[1] 9,851 గాయపడ్డారు[1] 1 ఫ్రిగేట్ 1 నావల్ ప్లేన్ | 9,000 మరణించారు[2] 4,350 గాయపడ్డారు 97,368 పట్టుబడ్డారు[3] 2 డిస్ట్రాయర్స్[4] 1 మైన్ స్వీపర్[4] 1 సబ్ మెరీన్[5][6] 3 పాట్రోల్ వెసెల్స్ 7 గన్ బోట్లు |
1971 భారత-పాకిస్తాన్ యుద్ధం, భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక సైనిక ఘర్షణ. 1971 డిసెంబరు 3 న 11 భారతీయ వాయుసేనకు సంబంధించిన విమాన స్థావరాలపై పాకిస్తాన్ చేసిన అనుమాన ప్రేరిత దాడిని, ఆపరేషన్ చెంఘిజ్‌ఖాన్ అంటారు. ఈ అనుమాన ప్రేరిత దాడి, యుద్ధానికి మొదలుగా నిలిచింది.[7][8] 13 రోజులు మాత్రమే నడిచిన ఈ యుద్ధాన్ని చరిత్రలో అతి తక్కువ కాలం జరిగిన యుద్ధాలలో ఒకటిగా గుర్తిస్తారు.[9][10]
యుద్ధం జరుగుతోన్న సమయంలో, భారత, పాకిస్తానీ బలగాలు, తూర్పు, పడమటి దిశలలో ఘర్షణ పడ్డాయి. తూర్పు కమాండ్‌కు చెందిన పాకిస్తానీ సైనిక బలగాలు లొంగుబాటు పత్రం పై సంతకాలు చేసాక, యుద్ధం ముగిసింది. ఈనాటి వరకూ కూడా, బహిరంగ లొంగుబాటులలో ఇది మొదటిది.[11][12] ఈ లొంగుబాటు తరువాత, తూర్పు పాకిస్తాన్, స్వతంత్ర బంగ్లాదేశ్‌గా విడిపోయింది. తూర్పు పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో తూర్పు పాకిస్తాన్లో ఉన్న సుమారు 97,368 పశ్చిమ పాకిస్తానీ వాసులను, భారతదేశం యుద్ధ ఖైదీలుగా అదుపులోకి తీసుకుంది. అందులో 79,700 మంది పాక్ సైన్యానికి చెందిన సైనికులు, పారామిలిటరి సిబ్బంది కాగా[13], మరో 12,500 మంది పౌరులు[13] ఉన్నారు.
భారత-పాక్ ఘర్షణ బంగ్లాదేశ్ విముక్తి పోరాటం వల్ల సంభవించింది. బంగ్లాదేశ్ విముక్తి పోరాటం సాంప్రదాయికంగా ఆధిక్యత ప్రదర్శించే పశ్చిమ పాకిస్తానీయులకూ,, సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్న తూర్పు పాకిస్తానీయులకు మధ్య జరిగిన పోరాటం.[4] బంగ్లాదేశ్ విముక్తి పోరాటం, 1970వ సంవత్సరపు పాకిస్తాన్ ఎన్నికల తరువాత రాజుకుంది. ఈ ఎన్నికలలో, తూర్పు పాకిస్తానీ అవామీ లీగ్ తూర్పు పాకిస్తాన్లో, 169 సీట్లలో, 167 సీట్లు గెలుచుకుని 313 సీట్లుగల మజ్లిస్-ఎ-షూరా (పాకిస్తాన్ యొక్క పార్లమెంట్) లో స్వల్ప ఆధిక్యతను పొందింది. అవామీ లీగ్ నాయకుడు షేక్ ముజీబుర్ రహ్మాన్ పాకిస్తాన్ రాష్ట్రపతికి ఆరు సూత్రాలను సమర్పించి ప్రభుత్వం స్థాపించే హక్కుని కోరాడు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన జుల్ఫికర్ అలీ భుట్టో, పాకిస్తాన్ ప్రభుత్వం పై అధికారాన్ని ముజీబుర్‌కు బదిలీ చేయడానికి నిరాకరించడంతో, రాష్ట్రపతి యాహ్యా ఖాన్ పశ్చిమ పాకిస్తానీల ఆధిక్యతలో ఉన్న సైన్య నిరసనను అణచివేయడానికి పిలిచాడు.[14][15]
నిరసనకారుల యొక్క సామూహిక అరెస్టులు మొదలయ్యాయి, అంతేకాక, తూర్పు పాకిస్తానీ సైనికులనీ, పోలీసులనీ నిరాయుధులను చేసే ప్రయత్నాలు జరిగాయి. అనేక రోజులపాటు కొనసాగిన దాడులు, సహాయ నిరాకరణోద్యమాల తరువాత, పాకిస్తానీ సైన్యము 1971 మార్చి 25న ఢాకాపై విరుచుకుపడింది. అవామీ లీగ్ నామరూపాల్లేకుండా పోయింది, చాలామంది సభ్యులు భారతదేశానికి పారిపోయారు. ముజీబ్‌ను 25-1971 మార్చి 26వ నాటి రాత్రి 1-30 ప్రాంతంలో నిర్బంధంలోకి తీసుకుని (1971 మార్చి 29నాటి రేడియో పాకిస్తాన్ యొక్క వార్తల ప్రకారం) పశ్చిమ పాకిస్తాన్‌కు తరలించారు.
1971 మార్చి 27న, జియావుర్ రహ్మాన్, పాకిస్తాన్ సైన్యంలో ఒక తిరుగుబాటుదారుడైన మేజర్ ముజీబుర్ తరఫున బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాడు.[16] ఏప్రిల్‌లో, మెహెర్పూర్లోని బైద్యనాథ్‌తలాలో, బహిష్కృతులైన అవామీ లీగ్ నాయకులు, దేశం వెలుపల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. ఈస్ట్ పాకిస్టాన్ రైఫిల్స్ అనబడే ఒక పారామిలిటరి బలగం, తిరుగుబాటుదారుల్లోకి ఫిరాయించింది. బంగ్లాదేశ్ సైన్యానికి సాయం చేయడానికి పౌరులతో కూడిన ముక్తి బాహిని అనే ఒక గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్), తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) ల మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఈ యుద్ధానికి బీజం వేసింది. 1970లో జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్ పార్టీ అయిన అవామీ లీగ్ మొత్తం 169 సీట్లలో 167 గెలుచుకొని, 313 సీట్లు ఉన్న పాకిస్తాన్ పార్లమెంట్ దిగువసభలో ఆధిక్యతను సాధించింది. అవామీ లీగ్ పార్టీ అధ్యక్షుడయిన షేక్ ముజిబుర్ రెహ్మాన్ తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి హక్కు ఉన్నదని ప్రతిపాదించినపుడు, అప్పటి పాకిస్తాను అధ్యక్షుడు అయిన యాహ్యా ఖాన్ అందుకు అంగీకరించలేదు.
తూర్పు పాకిస్తాన్ నాయకులను అణచివేయడానికి యాహ్యా ఖాన్ మిలిటరీని రంగంలోకి దింపినపుడు తూర్పు పాకిస్తాన్లో నిరసనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున బందులు జరిగాయి. అవన్నీ అణిచివేస్తూ మార్చి 25, 1971 న ఢాకాను మిలిటరీ స్వాధీనపరచుకొంది. చాలామంది నాయకులు పారిపోయి భారతదేశం చేరుకొన్నారు. ముజిబుర్ రెహ్మాన్‌ను అరెస్టు చేసి పశ్చిమ పాకిస్తానుకు తీసుకెళ్ళారు.
ఇది జరిగిన రెండు రోజులకు పాకిస్తాను సైన్యంలో మేజర్ అయిన జియా ఉర్ రెహ్మాన్ తనకుతానుగా బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం ప్రకటించాడు. అవామీ లీగ్ నాయకులు కొందరు కలసి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొనగా ప్రజలే గెరిల్లా గ్రూపులుగా మారి తమకున్న ఆర్మీతో కలసి పాకిస్తానుతో యుద్ధానికి సిద్దమయ్యారు.
1971 మార్చి 27న అప్పటి భారతదేశ ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ స్వాతంత్ర్యపోరాటానికి పూర్తి మద్దతు తెలిపి బంగ్లా శరణార్థులకోసం భారత సరిహద్దులను తెరిపించారు. దాదాపు కోటిమంది శరణార్థులు పలురాష్ట్రాల్లోని శిబిరాల్లో తలదాచుకొన్నారు. అంతమంది శరణార్థులకు అవసరమయిన సౌకర్యాలు కలిపించడానికి వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టసాగింది భారత ప్రభుత్వం.
అమెరికా పశ్చిమ పాకిస్తానుకు మొదటినుండి మిత్రదేశం కావడం వల్ల, పాకిస్తానుకు అవసరమయిన ఆయుధాలు, సామగ్రి సమకూర్చడానికి సిద్ధమయింది. వెంటనే ఇందిరా గాంధీ ఐరోపా పర్యటన జరిపి యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్‌లు పాకిస్తానుకు వ్యతిరేకంగా పనిచేయునట్లు ఒప్పించింది. ఆగష్టులో సోవియట్ యూనియన్‌తో ఇరవయ్యేళ్ళ మైత్రీ ఒప్పందం కుదుర్చుకొని ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. భారత్‌కు సోవియట్ యూనియన్ అండ చూసిన చైనా యుద్ధంలో పాల్గొనలేదు కానీ పాకిస్తానుకు కొన్ని ఆయుధాలు సరఫరా చేసింది.
పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్[17]కు చెందిన బెంగాలి ప్రజల పై విస్తృతమైన జాతి నిర్మూలన మారణకాండ నిర్వహించింది, ముఖ్యంగా అల్పసంఖ్యాకులైన హిందు జనాభా[18][19]ని నిర్మూలించడం పై దృష్టి కేంద్రీకరించింది. దాని వల్ల, సుమారు కోటి మంది[18][20] తూర్పు పాకిస్తాన్ వదిలి సరిహద్దు భారత రాష్ట్రాలలోకి శరణార్దులుగా పారిపోయారు.[17][21] తూర్పు పాకిస్తాన్-భారతదేశపు సరిహద్దుని శరణార్ధులకు భారతదేశంలో రక్షితమైన ఆశ్రయం కల్పించడం కోసం తెరిచారు. పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, మేఘాలయా, త్రిపురా రాష్ట్ర ప్రభుత్వాలు సరిహద్దులలో, శరణార్ధుల శిబిరాలు ఏర్పాటు చేసాయి. దరిద్రులయిపోయిన తూర్పు పాకిస్తానీ శరణార్ధులు వరదలా తరలిరావడం, అప్పటికే పెనుభారంతో ఉన్న భారత ఆర్థికవ్యవస్థ పై మోయలేని భారం మోపింది.[19]
విస్తృత స్థాయిలో చేసిన అమానుష కృత్యాలకుగాను, జనరల్ తిక్కా ఖాన్‌కు 'బెంగాల్ యొక్క నరహంతకుడు' అన్న పేరు వచ్చింది.[7] అతని చర్యల పై వ్యాఖ్యానం చేస్తూ, గనరల్ నియాజి '25/1971 మార్చి 26 తేదీల మధ్య రాత్రి జనరల్ తిక్కా విరుచుకుపడ్డాడు. శాంతియుతమైన రాత్రి, దహనకాండతో, ఏడుపులతో, ఆక్రందనలతో ప్రతిధ్వనించింది. తప్పుదోవ పట్టిన తన సొంత ప్రజల పైన అన్నట్లుగా కాకుండా, శత్రువు పైన దాడి చేసినట్లుగా, జనరల్ టిక్కా తన అమ్ములపొదిలోని ప్రతి అస్త్రాన్నీ ప్రయోగించాడు. బుఖారా, బగ్దాద్ లపై చెంగిజ్‌ఖాన్, హలకు ఖాన్ చేసిన నరమేధాల కంటే నిర్దయగా ఉన్న సైనిక చర్య, అతి దారుణమైన క్రూరత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. జనరల్ తిక్కా....నాగరికులని చంపడం భూమికి నిప్పుపెట్టే విధానం అవలంబించాడు. తన బలగాలకు అతను ఇచ్చిన ఉత్తర్వులు ఏమిటంటే: 'నాకు భూమి కావాలి మనుషులు కాదు....' మేజర్ జనరల్ ఫర్మన్ తన టేబుల్ డైరీలో ఇలా వ్రాసాడు, "తూర్పు పాకిస్తాన్ యొక్క పచ్చటి భూమి ఎరుపు రంగు పులమబడుతుంది." బెంగాలీ రక్తంతో అది ఎరుపురంగుగా మారిపోయింది.[22]
జాతీయ భారత ప్రభుత్వం అంతర్జాతీయ సముదాయాన్ని కదిలించడానికి పదే పదే విజ్ఞాపనలు చేసింది, కానీ ప్రతిస్పందన[23] రాలేదు. ప్రధానమంత్రి ఇందిరా గాంది 1971 మార్చి 27న తూర్పు పాకిస్తాన్ ప్రజలు చేస్తోన్న స్వాతంత్ర్య పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని భారత నాయకత్వం, శరణార్ధుల శిబిరాలలోకి చేరుతోన్న శరణార్ధులకు శరణు ఇవ్వడం కన్నా, జాతి నిర్మూలనకాండకు ఒడిగట్టిన పాకిస్తాన్ పై సాయుధ చర్య ప్రభావవంతంగా ఉంటుందని వేగంగా నిర్ణయం తీసుకుంది.[21] పరిస్థితుల ప్రాబల్యం వల్ల బహిష్కృతులైన తూర్పు పాకిస్తాన్‌కు చెందిన సైనిక అధికారులూ, భారత గూఢచారి వ్యవస్థకు చెందిన సభ్యులు, వెంటనే, శరణార్ధుల శిబిరాలను ముక్తి బాహిని గెరిల్లాలను నియమించి, తర్ఫీదు ఇవ్వడం కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు.[24]
చలికాలంలో హిమాలయ పర్వతాల మధ్య ఉన్న దారులన్నీ మంచుతో మూసుకుపోవడంవల్ల చైనా సైన్యం ముందుకు సాగలేదని, నవంబరు వరకు వేచిఉండి, ఆ తర్వాత భారత్ భారీగా తన సైన్యాన్ని సరిహద్దులవెంట మోహరించసాగింది. నవంబరు 23 న యాహ్యా ఖాన్ పాకిస్తానులో ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజలందరినీ యుద్ధానికి సిద్ధమవమని పిలుపు ఇచ్చాడు.
డిసెంబరు 3 సాయంత్రం 5.30 నిమిషాలకు భారతదేశ వైమానిక స్థావరాలపైన దాడి చేయమని యాహ్యా ఖాన్ ఇచ్చిన ఆదేశాలమేరకు పాకిస్తాన్ వైమానిక దళాలు ఎనిమిది భారత స్థావరాల పైన బాంబు దాడులు జరిపాయి. లక్ష్యాల్లో సరిహద్దుకి 480 కి.మీ. దూరాన ఉన్న ఆగ్రా కూడా ఉంది. ఈ యుద్ధసమయంలో తాజ్‌మహల్‌ను ఆకులతో, కొమ్మలతో, ఇంకా జనపనారతో కప్పడం జరిగింది, ఎందుకంటే, దాని రాయి, చంద్రకాంతిలో తెల్లటి వెలుగుదీపంలా వెలుగుతూ శత్రువుకు తేలిగ్గా కనిపిస్తూ ఉంటుంది.[25] ఈ దాడులు ఎక్కువ నష్టం కలిగించకపోయినా, పాకిస్తాన్ పైన దాడి చేయడానికి భారత్‌కు సరి అయిన కారణం దొరికింది. అర్థరాత్రికల్లా భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ పైన దాడులు చేయడం మొదలు పెట్టాయి. మరుసటిరోజుకల్లా భారత్ తనకున్న సైన్యం, నావికా దళం, వైమానిక దళ బలగాలతో ముప్పేట దాడులు జరపడం మొదలు పెట్టింది.
1967 నాటి అరబ్-ఇజ్రాయిలీల ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయిలీ ఆపరేషన్ ఫోకస్ సాధించిన విజయం ఇచ్చిన స్ఫూర్తితో మొదలైన అనుమాన ప్రేరిత దాడికి, పాకిస్తాన్ ఆపరేషన్ చెంఘిజ్‌ఖాన్ అని పేరుపెట్టింది. కానీ పెద్ద సంఖ్యలో విమానాలను ఉపయోగించి అరబ్ వాయుస్థావరాల పైన ఇజ్రాయిల్ చేసిన దాడిలాగా కాకుండా, పాకిస్తాన్ మీదకు 50 కంటే ఎక్కువ యుద్ధవిమానాలను పంపలేక పోయింది. అందువల్ల అనుకున్న విధంగా నష్టం కలిగించలేకపోయింది.[26] అయితే, భారత రన్వేలు గుంతలు పడి దాడి తరువాత చాలా సేపటి వరకు పనికిరాకుండా పోయాయి.[27]
జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, పాకిస్తానీ వాయుసేన చేసిన దాడులు భారతదేశంపై పాకిస్తాన్ చేసిన యుద్ధప్రకటనే[28][29] అని నిశ్చయంగా చెప్పింది. భారత వాయుసేన ఆ రాత్రే, మొదటి ప్రతిదాడులు చేసిందని కూడా చెప్పింది. ఈ దాడులను మరుసటి రోజు ప్రొద్దుటికి భారీ వాయుసేన ప్రతిదాడులుగా విస్తరించారు.[30]
1971వ సంవత్సరపు భారత-పాక్ యుద్ధం అధికారిక ఆరంభానికి ఇది సూచనగా నిలిచింది. ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ త్వరితగతిన బలగాలను సమీకరించాలని ఆదేశాలు జారీ చేసి, పెద్దయెత్తున ఆక్రమణకి నాంది పలికారు. వీటిలో భారతదళాలు సమన్వయంతో కూడిన భారీ వాయు, సముద్ర, భూభాగపు దాడులు నిబిడీకృతమై ఉన్నాయి. మధ్యరాత్రి నుండి, భారత వాయుసేన, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా యుద్ధవిమానాలను ఎగురవేయడం మొదలు పెట్టింది, తరువాత, వేగంగా వాయు విభాగంలో ఆధిపత్యాన్ని సాధించింది.[4][25] పశ్చిమ భాగాన, భారతదేశ ముఖ్య లక్ష్యం, పాకిస్తాన్‌ను భారత గడ్డపై అడుగిడనీయకుండా చూడడం. పశ్చిమ పాకిస్తాన్ భూభాగంపై పెద్దయెత్తున దాడి చేయాలన్న ఆలోచన భారత్‌కు లేదు.[31]
లాంగ్వాలా విజయం: యుద్ధం ప్రారంభమయిన రెండు రోజులకే 2000-3000 మంది పాకిస్తాన్ సైనికులు 60 యుద్ధ ట్యాంకులతో చీకటిలో రాజస్తాన్‌లోని లాంగ్వాలా చెక్‌పోస్ట్‌ను సమీపించారు. అక్కడ ఉన్న చెక్‌పోస్ట్ అధికారి అయిన ధరం వీర్ ఇది తెలుసుకొని తమ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌కు ఈ విషయాన్ని తెలిపి వెంటనే సైన్యం, ఆయుధాలు పంపమని కోరాడు. అంత తక్కువ వ్యవధిలో అవి సమకూర్చడం కష్టమని జవాబు వచ్చినా వీర్ తన దగ్గర ఉన్న కేవలం 120 సైనికులు, అతి కొద్ది ఆయుధాలతో పాకిస్తాన్ సైన్యాన్ని ఎదుర్కొనడానికి సిద్దమయ్యాడు. సూర్యోదయం అయ్యేవరకు దాదాపు రెండుగంటలపాటు ధరం వీర్ తన సైన్యంతో పాకిస్తాన్ సైన్యాన్ని నిలువరించగలిగాడు. భారత యుద్ధ విమానాలకు రాత్రి పూట యుద్ధం చేసే సదుపాయాలు లేకపోవడంతో అవి సూర్యోదయం వరకు వేచి ఉండి, ఆ తరువాత పాకిస్తాన్ సైన్యం పైన బాంబుల వర్షం కురిపించి మధ్యాహ్నానికల్లా పాకిస్తాన్ సైన్యాన్ని చిన్నాభిన్నం చేసి భారత్‌కు మొదటి విజయాన్ని అందించాయి.
అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ భారత నావికా దళం కరాచీ పోర్టు పైన మెరుపుదాడి చేసి యుద్ధ నౌకలను ధ్వంసం చేసింది. బంగాళాఖాత జల ప్రాంతాలన్నింటినీ ఇండియన్ నేవీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మరో వైపు భారత వైమానిక దళం దాదాపు 4000 యుద్ధ వాహనాలతో పాకిస్తాన్ ఎయిర్ ఫొర్స్‌ను ధ్వంసం చేసింది. భారతసైన్యం ముందు నిలువలేక పాకిస్తాన్ కేవలం 15 రోజుల్లో, అంటే డిసెంబరు 16 న లొంగిపోయింది. మరుసటిరోజు భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది.
యుద్ధపు పశ్చిమ రంగాన, వైస్ అడ్మిరల్ కోహ్లి నాయకత్వంలో, ఆపరేషన్ ట్రైడెంట్[4] పేరుతో భారత నావికాదళం చేపట్టిన సైనిక చర్య కరాచి ఓడరేవుపై దాడి చేయడంలో సఫలీకృతమయ్యింది. ఆ కారణాన, డిసెంబరు 4-5 [4] రాత్రి, పాకిస్తానీ డిస్ట్రాయర్ PNS ఖైబర్, మైన్స్వీపర్ PNS ముహాఫిజ్ మునిగిపోయాయి; PNS షాజహాన్ దారుణంగా దెబ్బతింది.[4] ఇది వ్యూహాత్మకమైన భారత విజయానికి దారితీసింది: 720 మంది పాకిస్తానీ నావికులు మరణించారు లేదా గాయపడ్డారు. పాకిస్తాన్ రిజర్వ్‌లో ఉన్న ఇంధనాన్ని, అనేక వాణిజ్య ఓడలను కోల్పోయింది. ఇక ఆ తరువాత ఈ యుద్ధంలో పాకిస్తాన్ నావికాదళం యొక్క పాత్ర కుంటుబడింది. 8-9 డిసెంబరు[4] రాత్రి ఆపరేషన్ ట్రైడెంట్ తరువాత ఆపరేషన్ పైథాన్[4] మొదలయ్యింది, అందులో రాకెట్లతో కూడిన భారత టార్పెడో బోట్లు కరాచి రోడ్లపై దాడి చేసాయి, దాని వల్ల రిజర్వ్ ఇంధన టాంకులు మరింత ధ్వంసమవ్వడంతో పాటు, మూడు పాకిస్తానీ వాణిజ్య నౌకలు కరాచి హార్బర్లో మునిగి పోయాయి.[4]
తూర్పు యుద్ధరంగాన, భారత ఈస్టర్న్ నావల్ కమాండ్‌కు చెందిన వైస్ అడ్మిరల్ కృష్ణన్, తూర్పు పాకిస్తాన్ నావికా దళాన్నీ, ఎనిమిది పాశ్చాత్య వర్తక నౌకలను, బే ఆఫ్ బెంగాల్‌లోని ఓడరేవుల్లో నావికా దిగ్భంధం ద్వారా పూర్తిగా వేరుచేసి వంటరిని చేసాడు. డిసెంబరు 4 నుండి, ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ INS విక్రాంత్‌ను రంగంలో దించారు. అందులో, సీహాక్ ఫైటర్ బాంబర్లు అనేక కోస్తా పట్టణాలపై దాడి చేసాయి. అందులో చిట్టగాంగ్, కాక్సెస్ బజార్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ఈ అపాయాన్ని ఎదుర్కోడానికి తన జలాంతర్గామి PNS ఘాజిను పంపింది.[5] భారత ఈస్టర్న్ నావల్ కమాండ్ జలాంతర్గామిను ముంచి వేయడానికి వలపన్నింది. భారత నావికా దళ డిస్ట్రాయర్ INS రాజ్పుట్ పాకిస్తానీ జలాంతర్గామి PNS ఘాజిను విశాఖపట్నపు కోస్తా[32][33] ప్రాంతంలోని అగాధాలలో ముంచివేసింది, దాంతో బంగ్లాదేశ్ తీరప్రాంతంపై పాకిస్తాన్ నియంత్రణ తగ్గిపోయింది.[6] డిసెంబరు 9న, పాకిస్తానీ జలాంతర్గామి PNS హాంగోర్, భారత ఫ్రిగేట్ INS ఖుక్రిని అరేబియా సముద్రంలో ముంచివేసినపుడు 18 మంది అధికారులు, 176 మంది నావికులనూ నష్టపోయింది. ఈ యుద్ధంలో భారత నావికాదళానికి జరిగిన అతిపెద్ద నష్టం అది.[34]
పాకిస్తానీ నావికా దళానికి కలిగించిన నష్టం, కోస్ట్ గార్డుకి చెందిన 7 గన్బోట్లు, 1 మైన్స్వీపర్, 1 జలాంతర్గామి, 2 డిస్ట్రాయర్లు, 3 పెట్రోల్ క్రాఫ్ట్‌లు, ఇంకా 18 కార్గో, సరఫరా, కమ్యూనికేషన్ నావలు,, కరాచి కోస్తా పట్టణంలోని నావికాదళ స్థావరానికి పెద్ద యెత్తున కలిగిన నష్టం. మూడు వర్తక నావికా దళానికి చెందిన ఓడలు - అన్వర్ బక్ష్, పస్ని, మధుమతి -[35] ఇంకా పది చిన్న నావలు స్వాధీనం చేసుకున్నారు.[36] 1900 మంది సిబ్బందిని నష్టపోయారు, మరోవైపు 1413 మంది సర్వీస్‌మెన్‌ను ఢాకాలో భారత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.[37] పాకిస్తాన్ పండితుడు తారిక్ అలీ ప్రకారం, ఈ యుద్ధంలో పాకిస్తాన్ నావికాదళం తన మూడోవంతు బలగాన్ని కోల్పోయింది.[38]
ఆరంభపు అనుమాన ప్రేరిత దాడి తరువాత, PAF భారత ప్రతిస్పందన పట్ల ఒక రక్షణపూరితమైన వైఖరి అవలంబించింది. యుద్ధం ముందుకు కొనసాగగా, భారత వాయుసేన, ఘర్షణా స్థలాల[39] పైన, PAFను ఎదుర్కొనడం కొనసాగించింది, కానీ రోజు రోజుకీ, పాకిస్తాన్ యుద్ధవిమానాల సంఖ్య తగ్గిపోయింది.[40] భారత వాయుసేన 4000 యుద్ధవిమానాలను రంగంలోకి దించగా, దాని ప్రతిద్వంద్వి అయిన PAF చాలా తక్కువగా ప్రతిస్పందించింది, దానికి బెంగాలీలు కాని సాంకేతిక సిబ్బంది తక్కువవడం ఒక కారణం.[4] ప్రతిదాడులు కొనసాగించపోవడానికి కారణం, ఘర్షణలో పెద్ద యెత్తున నష్టాలు చవిచూసిన నేపథ్యంలో PAF అధిష్టాన వర్గం తీసుకున్న ఉద్దేశపూర్వకమైన నిర్ణయానికి ఆపాదిస్తారు.[41] భారత నావికాదళం పాకిస్తానీ నావికా దళం పై రేవు పట్టణమైన కరాచి మీద దాడి జరిపినపుడు కూడా PAF జోక్యం చేసుకోలేదు.
తూర్పు వైపు, పాకిస్తాన్ వాయుసేన నం.14కు చెందిన ఒక చిన్న వాయుసైనిక దళాన్ని ధ్వంసం చేసారు, దాంతో, ఢాకా వాయుసీమ పనికిరాకుండా పోయి, తూర్పున భారతదేశానికి వాయువిభాగంలో ఆధిక్యత లభించింది.[4]
పాకిస్తాన్‌తో భారత సరిహద్దుల గుండా ఉన్న అనేక స్థలాల పై పాకిస్తాన్ దాడులు జరిపింది, కానీ భారత సైన్యం తన స్థానాలను విజయవంతంగా సుస్థిరంగా ఉంచుకుంది.[ఆధారం చూపాలి] పశ్చిమాన పాకిస్తాన్ సైన్యం యొక్క కదలికలకు భారత సైన్యం వేగంగా ప్రతిస్పందించి కొన్ని ప్రారంభ లాభాలను అర్జించింది, దానిలో సుమారు 5,500 చదరపు మైళ్లు (14,000 కి.మీ2)పాకిస్తాన్ భూభాగం స్వాధీనం చేసుకుంది (భారతదేశం పాకిస్తానీ కాశ్మీర్, పాకిస్తానీ పంజాబ్, సింధ్ భాగాలలో స్వాధీనం చేసుకున్న భూమి తరువాత 1972లో సిమ్లా ఒప్పందం ప్రకారం స్నేహపూర్వకభావానికి ప్రతీకగా తిరిగి పాకిస్తాన్‌కు అప్పగించడం జరిగింది).
తూర్పు భాగాన, భారత సైన్యం ముక్తి బాహినితో కలిసి మిత్రో బాహిని ("సంకీర్ణ బలగాలు") స్థాపించింది; 1965వ సంవత్సరపు యుద్ధంలోని అతిజాగ్రత్తతో కూడిన సైనిక చర్యలలాగా, నెమ్మదిగా చేసే పురోగమనాలలాగా కాకుండా, ఈసారి వేగంగా సాయుధ విభాగాలు కలిగిన తొమ్మిది పదాతిదళాల పై చేసే త్రిముఖ దాడి, ఆ తరువాత తూర్పు పాకిస్తాన్ రాజధాని అయిన ఢాకాలో వేగంగా కలుస్తోన్న వాయుసేన యొక్క మద్దతుని అందకుండా చేయటాన్ని వ్యూహంగా రచించారు.
ఎనిమిదవ, ఇరవై మూడవ, యాభై ఏడవ డివిజన్లకు నాయకత్వం వహించిన లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా, తూర్పు పాకిస్తాన్లోకి భారత సైన్యాన్ని తీసుకువెళ్ళాడు. ఈ బలగాలు పాకిస్తానీ ఆకృతుల పై దాడులు జరుపుతుండగా, భారత వాయుసేన అతివేగంగా తూర్పు పాకిస్తాన్‌లోని ఒక చిన్న వాయుసైన దళాన్ని ధ్వంసం చేసి, ఢాకా వాయుసీమను పనికిరాకుండా చేసింది. ఈ మధ్యలో, భారత నావికాదళం, తూర్పు పాకిస్తాన్‌ను ప్రభావవంతంగా దిగ్బంధం చేసింది.
భారత దండయాత్ర "బ్లిట్జ్‌క్రీగ్" పధ్ధతులను ఉపయోగించింది. దానివల్ల శత్రువు యొక్క స్థానాలలోని బలహీనతలను తమకు అనుకూలంగా వాడుకుంటూ, ప్రతిపక్షాన్ని తప్పించుకుంటూ, వేగంగా విజయం సాధించింది.[42] అధిగమించలేని నష్టాల వలన, పాకిస్తాన్ సైన్యం ఒక పక్షం లోపలే లొంగిపోయింది. డిసెంబరు 16 తేదీన, తూర్పు పాకిస్తాన్లో విడిదిచేసి ఉన్న పాకిస్తానీ బలగాలు లొంగిపోయాయి.
1971 డిసెంబరు 16 తేదీన, 16-31 IST (భారతకాలమానం ప్రకారం) గంటలకు, ఢాకాలోని రమ్నా రేస్ కోర్స్‌లో తూర్పు పాకిస్తాన్లో విడిదిచేసి ఉన్న పాకిస్తానీ బలగాలు లొంగుబాటు పత్రం పై సంతకాలు చేసాయి. భారతదేశం తరఫున లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా, భారత సైన్యం యొక్క ఈస్టర్న్ కమాండ్ యొక్క జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, పాకిస్తాన్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ A.A.K. నియాజి, తూర్పు పాకిస్తాన్‌లోని పాకిస్తానీ బలగాల కమాండర్, సంతకాలు చేసారు. అరోరా, నియాజి ప్రతిపాదించిన లొంగుబాటుని ఒప్పుకోగానే, రేస్ కోర్స్‌లో చుట్టుప్రక్కల గుమిగూడిన జనాలు, నియాజి వ్యతిరేక, పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేయడం మొదలుపెట్టారు.[43]
భారతదేశం సుమారు 90,000 మంది పాకిస్తానీ సైనికులను యుద్ధఖైదీలుగా అదుపులోకి తీసుకుంది, అందులో పాకిస్తానీ సైనికులు, తూర్పు పాకిస్తాన్‌కు చెందిన పౌర మద్దతుదారులు ఉన్నారు; 79,676 మంది సైనిక సిబ్బంది, అందులో 55,692 మంది సైన్యానికి, 16,354 మంది పారామిలిటరి దళానికీ, 5,296 మంది పోలీస్ బలగానికీ, 1000 మంది నావికా దళానికీ, 800 మంది పాకిస్తాన్ వాయుసేనకీ చెందిన వారు.[44] మిగిలిన యుద్ధఖైదీలు నాగరీకులు - సైనిక సిబ్బందికి కుటుంబసభ్యులు లేదా సైన్యంతో స్వార్ధప్రయోజనాలకు కుమ్మక్కైన వారు (రజాకార్లు). పాకిస్తాన్ నియమించిన హమూదుర్ రహ్మాన్ కమిషన్ నివేదిక ఈ క్రింది విధంగా పాకిస్తానీ యుద్ధఖైదీల వివరాలను బేరీజు వేసింది:
శాఖ | పట్టుబడ్డ పాకిస్తాన్ యుద్ధఖైదీలు |
---|---|
సైన్యం | 54,154 |
నావికాదళం | 1,381 |
వైమానికదళం | 833 |
పారామిలిటరి బలగాలు -పోలీసులతో సహా | 22,000 |
నాగరిక సిబ్బంది | 12,000 |
మొత్తం | 90,368 |
ఈ యుద్ధం వల్ల బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం లభించింది. పాకిస్తాన్ అధ్యక్షుడు అయిన యహ్యా ఖాన్ రాజీనామా చేసాడు. ముజీబుర్ రెహ్మాన్ తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్ళి అధికారం చేపట్టాడు. దాదాపు 3,843 భారత సైనికులు మృతి చెందగా 9,851 మంది క్షతగాత్రులయ్యారు. పాకిస్తాన్ తనకున్న నేవీలో సగభాగం, ఎయిర్ ఫోర్స్‌లో పాతిక, దాదాపు మూడొంతుల సైన్యాన్ని నష్టపోయింది. 90,000 పాకిస్తాన్ దేశస్తులు యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు.
తూర్పు పాకిస్తానులో ప్రాణాలు పోగొట్టుకున్నవారి సంఖ్య ఇదమిత్థంగా తెలీదు. పదిలక్షల నుండి ముప్పైలక్షల వరకు మరణించి ఉంటారని ఆర్.జె. రమ్మెల్ అంచనా వేసాడు.[45] ఇతర అంచనాల ప్రకారం ఈ సంఖ్య 300,000 వరకు ఉండవచ్చు. డిసెంబరు 14 న ఓటమి అంచున ఉండగా, పాకిస్తాను సైన్యం, స్థానిక సహచరులతో కలిసి, ఒక పద్ధతి ప్రకారం పెద్ద సంఖ్యలో బెంగాలీ డాక్టర్లు, ఉపాధ్యాయులు, మేధావులను హతమార్చింది.[46][47]. మేధావి వర్గానికి చెందిన హిందూ మైనారిటీలపై జరిగిన ఊచకోతలో భాగమే ఇది.[48][49] తిరుగుబాటు చెయ్యగలరని భావించిన విద్యార్థులు, యువకులు కూడా ఈ దాడులకు గురయ్యారు
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన అతిపెద్ద సైనిక లొంగుబాటు ఈ యుద్ధంలోనే సంభవించింది. యుద్ధనేరాలకు గాను 200 మంది ఖైదీలను విచారించాలని తొలుత భారత్ భావించినప్పటికీ, సంధికి చొరవ తీసుకొనే దిశగా ఖైదీలందరినీ విడుదల చేసేందుకు అంగీకరించింది. ఆ మరుసటి సంవత్సరంలో కుదుర్చుకొన్న సిమ్లా ఒప్పందంతో యుద్ధంలో తాను గెల్చుకున్న 15,000 చ.కి.మీ పైచిలుకు పాకిస్తాను భూభాగాన్ని భారత్ తిరిగి పాకిస్తానుకు ఇచ్చివేసింది. పొరుగు దేశాలను ఆక్రమించుకొనే ఉద్దేశం లేదన్న సూచనగాను, పాకిస్తానుతో చిరకాల శాంతిని నెలకొల్పేందుకుగానూ భారత్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది.
యునైటెడ్ స్టేట్స్ పాకిస్తాన్‌కు రాజకీయంగాను, వస్తురూపేణానూ మద్దతునిచ్చింది. రాష్ట్రపతి రిచర్డ్ నిక్సన్, అతని సెక్రెటరి ఆఫ్ స్టేట్ హెన్రి కిస్సింజర్, దక్షిణాసియా ఇంకా ఆగ్నేయాసియాలో సోవియట్ యూనియన్ విస్తరిస్తుందని భయపడ్డారు.[50] పాకిస్తాన్ పీపుల్'స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు దగ్గరి సంబంధము ఉంది. నిక్సన్ 1972 ఫిబ్రవరిలో చైనాను సందర్శించాలని తలచాడు, అంతేకాక అతను చైనాతో సత్సంబంధాలు తిరిగి నెలకొల్పడానికి చర్చలు జరుపుతున్నాడు. భారతదేశం పశ్చిమ పాకిస్తాన్‌ను ఆక్రమించుకోవడం దక్షిణాసియా ప్రాంతంలో సోవియట్ యూనియన్ యొక్క సంపూర్ణ ఆధిపత్యానికి దారి తీస్తుందని భయపడ్డాడు. దానివల్ల, యునైటెడ్ స్టేట్స్ యొక్క అంతర్జాతీయ స్థానం క్రుంగి పోతుంది, అంతేగాక, అది అమెరికా యొక్క కొత్త పరోక్ష సంబంధి చైనా యొక్క ప్రాంతీయ స్థానాన్ని క్రుంగదీస్తుంది. యునైటెడ్ స్టేట్స్ చైనాకు తాను నమ్మదగ్గ సంబంధి నన్న సందేశం ఇవ్వడానికి, పాకిస్తాన్ పై US కాంగ్రెస్ విధించిన కట్టుబాట్లకు వ్యతిరేకంగా, నిక్సన్ పాకిస్తాన్‌కు సైనికా సరఫరాలు, జోర్డాన్, ఇరాన్[51] గుండా పంపాడు అదే సమయంలో పాకిస్తాన్‌కు ఆయుధ సరఫరా చేయమని చైనాను ప్రోత్సహించాడు. నిక్సన్ పాలనా యంత్రాంగం, పాకిస్తాన్ సైన్యం, తూర్పు పాకిస్తాన్లో చేస్తోన్న, జాతినిర్మూలనాకాండకు సంబంధించిన కార్యకలాపాల నివేదికలను కూడా బేఖాతరు చేసింది, ముఖ్యంగా బ్లడ్ టెలిగ్రాం. ఇది అంతర్జాతీయ పత్రికారంగంలోనూ, కాంగ్రెస్‌లోనూ సర్వత్రా విమర్శలకు, నిరసనకూ దారి తీసింది.[17][52][53]
తూర్పు భాగాన పాకిస్తాన్ యొక్క అపజయం ఖరారయినపుడు, నిక్సన్ USS ఎంటర్‌ప్రైస్‌ను బే ఆఫ్ బెంగాల్ పంపమని ఉత్తర్వులు జారీ చేసాడు. 1971 డిసెంబరు 11న ఎంటర్ప్రైస్ గమ్యం చేరుకుంది. నిక్సన్ ఇరాన్‌ను, జోర్డాన్‌ను తమ F-86, F-104, F-5 ఫైటర్ జెట్ విమానాలను పాకిస్తాన్‌కు మద్దతుగా పంపమని వప్పించినట్లుగా దస్తావేజుల్లో నివేదించబడింది.[54] డిసెంబరు 6, డిసెంబరు 13 తేదీలలో, సోవియట్ నావికాదళం, అణుక్షిపణులతో కూడిన రెండు సముదాయాల నౌకలను ఒక జలాంతర్గామినీ, వ్లాదివోస్తోక్ నుండి పంపింది; అవి 1971 డిసెంబరు 18 నుండి 1972 జనవరి 7 దాకా, U.S. టాస్క్‌ఫోర్స్ 74ను ఇండియన్ ఓషన్‌లో వెంబడించాయి. ఇండియన్ ఓషన్‌లో USS ఎంటర్ప్రైస్ కలుగచేసే ముప్పు నుండి కాపాడడానికి, సోవియట్ల దగ్గర, ఒక అణు జలాంతర్గామి కూడా ఉంది.[55]
బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం రావడం వల్ల, తన ప్రత్యర్థులైన యునైటెడ్ స్టేట్స్, చైనా బలహీనమవుతారని గుర్తించి, సోవియట్ యూనియన్ బంగ్లాదేశీయుల పట్ల సానుభూతి చూపి భారత సైన్యానికీ, ముక్తి బాహినికి యుద్ధంలో మద్దతునిచ్చింది. ఒకవేళ యునైటెడ్ స్టేట్స్, చైనాలతో ఘర్షణ మొదలయితే, తాను తగిన చర్యలు చేపడతానని USSR భారతదేశానికి అభయహస్తం ఇచ్చింది. ఈ హామీ 1971 ఆగస్ట్ సంతకం చేయబడిన భారత-సోవియట్ యూనియన్ల స్నేహపూరిత ఒప్పందంలో పొందుపరచబడింది.
సగానికి పైగా జనాభా కలిగి యుద్ధంతో ఛిద్రమైన పాకిస్తాన్, ఇంకా సుమారు మూడోవంతు సైన్యం బందీలవడం, ఉపఖండంలో భారతదేశం యొక్క సైనికశక్తి ఆధిక్యతను ప్రస్ఫుటం చేసింది.[20] అంతటి విజయం సాధించినప్పటికీ, భారతదేశం, తన ప్రతిస్పందనలో చాలా సంయమనం పాటించింది. చాలావరకు, భారత నాయకులు బంగ్లాదేశ్ స్థాపన జరగడం, ఎవరి గురించి అయితే యుద్ధం జరిగిందో ఆ కోటి మంది బెంగాలి శరణార్ధులు తిరిగి తమ దేశానికి వెళ్ళే అవకాశం కలగడం లాంటి లక్ష్యాలు సులభంగా సాదించడం పట్ల సంతృప్తి చెందినట్లు కనిపించారు.[20] పాకిస్తానీ లొంగుబాటు గురించి పార్లమెంటులో ప్రకటన చేస్తూ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఈ విధంగా చెప్పారు:
"ఢాకా ఇపుడు ఒక స్వతంత్ర దేశం యొక్క స్వతంత్ర రాజధాని. తమ గెలుపు ఘఢియలో ఉన్న బంగ్లాదేశ్ ప్రజలను మేము అభినందిస్తున్నాము. మానవ శక్తికి విలువనిచ్చే అన్ని దేశాలూ, దీనిని మనిషి స్వేచ్చ కోసం చేసే అన్వేషణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా గుర్తిస్తాయి.[20]
బధ్ధశత్రువైన భారత్ చేతుల్లో ఓడిపోవడం పాకిస్తాన్‌కు సంపూర్ణమైన, తలవంపులు తెచ్చే అపజయం, [20] మానసికమైన విఘాతము.[13] పాకిస్తాన్ తన భూభాగంలో సగం కోల్పోయింది, ఆర్థికవ్యవస్థలో చెప్పుకోదగ్గ భాగం నష్టపోయింది, దక్షిణాసియాలో రాజకీయంగా తన స్థానబలాన్ని నష్టపోయింది.[13] రెండు దేశాల వాదము అబద్దమని తేలుతుందని, ఇస్లామిక్ సిధ్ధాంతానికి బెంగాలీలను పాకిస్తాన్లో భాగంగా ఉంచే శక్తి లేదని తేలిపోతుందని పాకిస్తాన్ భయపడింది.[13] అంతేకాక పాకిస్తాన్ సైన్యం తన 90,000 మంది యుద్ధఖైదీలను భారతదేశం 1972 జూలై 2న సిమ్లా ఒప్పందం పైన సంతకాలు చేసాకనే విడుదల చేయడంతో మరింత అవమానానికి గురయ్యింది. యుద్ధఖైదీలను తిరిగి అప్పగించే విషయమే కాకుండా, భవిష్యత్తులో భారతదేశం పాకిస్తాన్ల మధ్య ఉత్పన్నమయ్యే ఘర్షణలను చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోవాలన్న ఒక కొనసాగే ఆకృతి స్థాపన కూడా ఒప్పందంలో భాగమయ్యింది (అది ఇప్పుడు సంపూర్ణమైన పాకిస్తాన్‌గా మిగిలిన పశ్చిమ ప్రావిన్సెస్‌కు సంబంధించినంత వరకు). ఒప్పందం సంతకం చేయడం ద్వారా పాకిస్తాన్, సూత్రప్రాయంగా, ఇదివరకటి తూర్పు పాకిస్తాన్‌ను ఇప్పటి స్వతంత్ర, సార్వభౌమ దేశమైన బంగ్లాదేశ్‌గా గుర్తించింది.
పాకిస్తానీ ప్రజలు ఓటమిని ఒప్పుకోడానికి మానసికంగా సిధ్ధంగా లేరు, పశ్చిమ పాకిస్తాన్లో సర్కారుచే నియంత్రించబడుతోన్న ప్రసార వ్యవస్థ యుద్ధం మనమే గెలిచామని అబధ్ధపు ప్రచారం చేస్తోంది.[13] తూర్పు పాకిస్తాన్లో లొంగిపోయామన్న వార్తలు ప్రకటించగానే, ప్రజలు అంత పెద్ద యెత్తున ఓటమి సంభవించడం తట్టుకోలేక, పశ్చిమ పాకిస్తాన్‌లోని ప్రధాన పట్టణాల వీధుల్లో అప్పటికప్పుడే ప్రతిస్పందించి సామూహిక నిరసనలు వ్యక్తం చేస్తూ ప్రదర్శనలు చేసారు. అంతేకాక, మిగిలిన పశ్చిమ పాకిస్తాన్‌ను కేవలం "పాకిస్తాన్" అని మాత్రం పిలవడం, అపజయం యొక్క ప్రభావానికి దోహదం చేసి, దేశం యొక్క తూర్పు భాగం యొక్క వేర్పాటుకి అంతర్జాతీయంగా సమ్మతి లభించేలా చేసింది ఆ కారణాన స్వతంత్ర దేశమయిన బంగ్లాదేశ్‌కు మరింత విశ్వసనీయత చేకూరింది.[13] ఆర్థిక, మానవ వనరుల రూపేణా యుద్ధం మూలాన పాకిస్తాన్ చెల్లించిన మూల్యం చాలా పెద్దది. నిరుత్సాహం చెంది, పరిస్థితిని అదుపు చేయలేని జనరల్ యాహ్యా ఖాన్, అధికారాన్ని జుల్ఫికర్ అలీ భుట్టోకి అప్పగించాడు, ఆయన, 1971 డిసెంబరు 20న రాష్ట్రపతిగా ఇంకా (మొదటి నాగరిక) చీఫ్ మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్‌గా ప్రమాణస్వీకారం చేసాడు. 1971 డిసెంబరు 16న పశ్చిమభాగాన్ని కేంద్రంగా చేసుకుని ఒక క్రొత్తదయిన, చిన్నపాటి పాకిస్తాన్ అవతరించింది.[56]
తూర్పు పాకిస్తాన్‌ను నష్టపోవడం పాకిస్తానీ సైన్యం యొక్క ప్రతిష్ఠను దెబ్బతీసింది.[13] పాకిస్తాన్ తన నావికాదళంలో సగం, వాయుసేనలో కాలు భాగం, పదాతిదళంలో మూడోవంతు కోల్పోయింది.[57] ఒక్క ముస్లిం యుద్ధప్రావీణ్యంలో అయిదుగురు హిందువులకు సమానమన్న జనాకర్షక నానుడి ఇక అర్థం లేనిదని తేలిపోయింది.[13] "తూర్పు పాకిస్తాన్ యొక్క రక్షణ పశ్చిమ పాకిస్తాన్లో ఉంది" అన్న పాకిస్తాన్ యొక్క ప్రకటించబడిన వ్యూహాత్మక ప్రభోదము కూడా పసలేనిదని తేలింది.[58] తన పుస్తకం పాకిస్తాన్: బిట్వీన్ మాస్క్ అండ్ మిలిటరిలో హుస్సైన్ హక్కాని ఈ విధంగా వ్యాఖ్యానిస్తారు,
"అంతేకాక, సైన్యం తన చివరి సైనికుడి ప్రాణం పోయేవరకూ పోరాడతానన్న ప్రమాణం నిలుపుకోలేకపోయింది. యుద్ధంలో 1,300 మందిని మాత్రమే కోల్పోయి ఈస్టర్న్ కమాండ్ ఆయుధాలు కిందపడేసింది. పశ్చిమ పాకిస్తాన్లో 1,200 సైనిక మరణాలకు పసలేని సైనిక ప్రదర్శన తోడయ్యింది." [59]
ది 1971 ఇండో-పాక్ వార్: ఎ సోల్జర్'స్ నెరేటివ్ అనే పుస్తకంలో పాకిస్తానీ మేజర్ జనరల్ హకీం అర్షద్ కురేషి, ఈ యుద్ధానికి సంబంధించి అనుభవజ్ఞుడు ఈ విధంగా వ్యాఖ్యానించాడు,
"ప్రజలుగా, మనం కూడా మనదేశం రెండుగా విడిపోవడానికి కారణమయ్యామన్న నిజాన్ని మనం ఒప్పుకోవాలి. ఒక నియాజీనో, ఒక యాహ్యానో, ఒక ముజీబో, ఒక భుట్టోనో లేక వాళ్ళ కీలక సహచరులో - వీళ్ళు మాత్రమే ఈ విడిపోవడానికి కారణం కాదు, ఒక భ్రష్టుపట్టిన వ్యవస్థ, తప్పుల తడత అయిన ఒక సామాజిక స్వరూపం దీనికి కారణం, మనం మన ఉదాసీనతతో వీటిని సంవత్సరాలుగా తమ స్థానంలో ఉండనిచ్చాము. చరిత్రలోని అత్యంత కీలకమయిన సమయంలో మనం అనుమానపూరితమయిన చరిత్ర కలిగిన మనుషుల అంతులేని వాంఛలను అదుపు చేసి వారి స్వార్ధపూరిత, బాధ్యతారహితమయిన నడవడికి అడ్డుకట్ట వేయలేకపోయాము. మన సామూహికమయిన 'నడవడి' శత్రువుకి మనల్ని ముక్కలు చేయడానికి అవకాశం ఇచ్చింది."[60]
బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం అయ్యింది, ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన ముస్లిం దేశాలలో ఇది మూడవది. బంగ్లాదేశ్‌కు మొదటి రాష్ట్రపతి, తరువాత ప్రధాన మంత్రి అవ్వడం కోసం, ముజీబుర్ రహ్మాన్ పశ్చిమ పాకిస్తాన్ జైలు నుండి విముక్తుడయ్యి 1972 జనవరి 10న ఢాకా వెనుదిరిగాడు.
14 డిసెంబరు తేదీన, అపజయం యొక్క అంచున ఉన్నపుడు పాకిస్తానీ సైన్యం, దాని స్థానిక కుట్రదారులు, పద్ధతి ప్రకారం పెద్ద సంఖ్యలో బెంగాలి వైద్యులను, అధ్యాపకులను, మేధావులను హతమార్చారు.[46][47] అది నగరాలకు చెందిన విద్యావంతులైన మేధావులలో అధిక సంఖ్యాకులైన, అల్పసంఖ్యాక హిందువులను నిర్మూలించడానికి ఉద్దేశించిన మారణకాండ.[48][61] యువకులు, ముఖ్యంగా విద్యార్థులలో తిరుగుబాటుదారులుగా మారే అవకాశం ఉన్నవారిని గురిపెట్టారు. తూర్పు పాకిస్తాన్‌లోని మరణాల సంఖ్య తెలియ రాలేదు. R.J. రమ్మెల్ అంచనాల ప్రకారం పది లక్షల నుండి, ముప్పై లక్షల దాకా చంపబడ్డారని చెబుతాడు.[45] ఇతర అంచనాలు మరణాల సంఖ్య తక్కువగా అంటే 3,00,000గా చూపిస్తాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వ గణాంకాలు కుట్రదారుల సహకారంతో పాకిస్తానీ బలగాలకు చెందినవారు 30 లక్షల మందిని హతమార్చారనీ, 2,00,000 మంది స్త్రీలను మానభంగం చేసారనీ, కొన్ని లక్షల మందిని నిరాశ్రయులయులని చేసారనీ చెబుతాయి.[62] పాకిస్తాన్‌తో కుమ్మక్కయ్యి సహకరించిన వారినీ, యుద్ధ నేరాలతో సంబంధం ఉన్నవారిని శిక్షించడానికి 2010లో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక న్యాయసభను నియమించింది.[63] ప్రభుత్వం ప్రకారం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పై మానవజాతికి వ్యతిరేకంగా చేసిన నేరాలు, జాతి నిర్మూలనకాండ, హత్య, మానభంగం, లూటీ లాంటి అభియోగాలు చేయబడతాయి.[64]
అపజయానికి రాజకీయ, సైనిక కారణాలు ఇంకా యుద్ధ సమయంలో బంగ్లాదేశీయుల పైన అత్యాచారాల పైన దర్యాప్తు చేయడానికి యుద్ధ తదనంతరం పాకిస్తాన్ ప్రభుత్వం 1971లో జస్టీస్ హమూదుర్ రహ్మాన్ సారథ్యంలో హమూదుర్ రహ్మాన్ కమిషన్‌ను నియమించింది. 2000వ సంవత్సరంలో నివేదిక యొక్క కొన్ని భాగాలు భారత ప్రసార మాధ్యమాలలో కనపడేంత వరకూ, కమిషన్ యొక్క నివేదికను వర్గీకరించి దాని ముద్రణను భుట్టో నిషేధించాడు ఎందుకంటే అది మిలిటరి లోపాలని ఎత్తిచూపేదిగా ఉంది.
దానిని వర్గీకరణ నుండి తొలగించినపుడు, వ్యూహాత్మకమైన తప్పిదాల నుండి ఎత్తుగడలకు సంబంధించిన తప్పిదాల దాకా ఎన్నో తప్పిదాలను సూచించింది. పాకిస్తాన్ సైన్యం, వారి స్థానిక ఏజెంట్లు చేసిన లూటీలను, మానభంగాలను ఇంకా హత్యలను అది ధ్రువపరిచింది. విధి నిర్వహణలో శ్రధ్ధ చూపలేదనీ, యుద్ధనేరాలతో సంబంధం కలిగి ఉన్నారనీ అది నిర్ద్వంద్వంగా పాకిస్తానీ జనరల్స్‌ను తప్పుబట్టింది. కమిషన్ కనుగొన్న నిజాలపైన ఎలాంటి చర్యలూ తీసుకోనప్పటికీ, కమిషన్ పాకిస్తానీ జనరల్స్ విషయంలో విచారణకు సిఫార్సు చేసింది.
1972లో భారతదేశం పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం పై సంతకాలు చేసాయి. పాకిస్తానీ యుద్ధఖైదీల విడుదలకు బదులుగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్ర్యాన్ని గుర్తించే అంశాన్ని ఒప్పందం ఖాయపరిచింది. భారతదేశం యుద్ధ ఖైదీలను జెనీవా కన్వెన్షన్, 1925వ నిబంధనకు అనుగుణంగా ఆదరించింది.[25] అయిదు నెలలలో భారతదేశం 90,000 మందికి పైగా యుద్ధ ఖైదీలను విడుదల చేసింది.[65] సహృదయతకు సంకేతంగా, బెంగాలీలు అడుగుతోన్న యుద్ధనేరాలతో సంబంధం ఉన్న 200 మంది సైనికులను కూడా భారతదేశం క్షమించింది.
కొన్ని వ్యూహాత్మకమైన స్థలాలను తన దగ్గర ఉంచుకున్నప్పటికీ, భారతీయ బలగాలు యుద్ధ సమయంలో పశ్చిమ పాకిస్తాన్లో స్వాధీనం చేసుకున్న 13,000 చదరపు కిలోమీటర్ల భూమిని ఒప్పందం తిరిగి ఇచ్చేసింది.[66] కానీ భారతదేశంలో కొందరు ఒప్పందం భుట్టోకి మరీ సానుకూలంగా ఉందని భావించారు. ఒప్పందం పాకిస్తాన్‌కు మరీ వ్యతిరేకంగా ఉంటే పాకిస్తాన్లో బలహీనంగా ఉన్న ప్రజాస్వామ్యం కూలిపోతుందనీ, ఇంకా తూర్పు పాకిస్తాన్‌తో పాటు కాశ్మీర్ కూడా వదులుకున్నాడని ప్రజలు తనని దుయ్యబడతారనీ, కనికరం చూపమనీ భుట్టో అర్ధించాడు.[13]
ధైర్యసాహసాలకు ఇరువైపులా తమ సైనికులకీ, అధికారులకీ తమతమ దేశాల అత్యున్నత సైనిక పురస్కారం లభించింది. భారతదేశం మొత్తం 45 సైనిక పురస్కారాలను బహూకరించింది.[69] భారత పురస్కారం పరమ వీర చక్ర, బంగ్లాదేశ్ పురస్కారం బీర్ శ్రేష్ఠొ, పాకిస్తానీ పురస్కారం నిషాన్-ఎ-హైదర్ అందుకున్నవారి జాబితా ఈ క్రింద ఇవ్వబడింది:
పరమ వీర చక్ర గ్రహీతలు:
బీర్ శ్రేష్ఠో గ్రహీతలు:
నిషాన్-ఎ-హైదర్ గ్రహీతలు:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.