ప్రముఖ దర్శకుడు, నిర్మాత From Wikipedia, the free encyclopedia
కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి (జననం: 1973 అక్టోబరు 10 ; వృత్తిపరంగా ఎస్ఎస్ రాజమౌళి అని పిలుస్తారు) భారతీయ సినిమా దర్శకుడు, సినీ రచయిత. అతను ప్రధానంగా తెలుగు సినిమారంగంలో పని చేస్తాడు.[2] అమెరికన్ ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో అలరించిన మగధీర (2009), టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్‌గా నిలిచిన ఈగ (2012), అమెరికన్ సాటర్న్ పురస్కారానికి నామినేట్ చేయబడిన బాహుబలి: ది బిగినింగ్ (2015), ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అమెరికన్ సాటర్న్, ఆస్ట్రేలియన్ టెల్స్ట్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డులనందుకున్న బాహుబలి 2: ది కంక్లూజన్ (2017) వంటి ఫాంటసీ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు అతను బాగా ప్రసిద్ధి చెందాడు.[3][4][5] బాహుబలి ఫ్రాంచైజ్ దాదాపుగా ₹ 1,810 కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా సిరీస్‌గా నిలిచింది.[6][7][8][9] అతన్ని భారతీయ చలనచిత్రరంగంలో ఉత్తమ దర్శకులలో ఒకడిగా తరచుగా పరిగణిస్తుంటారు.[10]
ఎస్.ఎస్. రాజమౌళి | |
---|---|
జననం | [1] | 1973 అక్టోబరు 10
వృత్తి | సినిమా దర్శకుడు, సినిమా నిర్మాత |
జీవిత భాగస్వామి | రమా రాజమౌళి |
పిల్లలు | కార్తికేయ/మయూశ |
అతని ఇతర యాక్షన్ చిత్రాలు సై, విక్రమార్కుడు ప్రధాన స్రవంతి విభాగంలో భారతదేశం 37వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడ్డాయి.[11] మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛత్రపతి చిత్రాలు విజయవంతమైన సమీక్షలతో వివిధ భారతీయ భాషలలో రీమేక్ చేయబడ్డాయి.[12][13] రాజమౌళి మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, నాలుగు దక్షిణ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఐదు రాష్ట్ర నంది పురస్కారలు, ఐఫా అవార్డు (IIFA), రెండు సైమా అవార్డులు, స్టార్ వరల్డ్ ఇండియా, 2012లో "ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్", 2015లో " సిఎనెన్-న్యూస్18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్" సహా పలు గౌరవాలు అందుకున్నాడు.[14][15][16] ఆయన కళారంగానికి చేసిన కృషికి ప్రభుత్వం 2016లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది.[17][18]
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్-2023లో రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ (2022)కి రెండు నామినేషన్లు దక్కాయి. ఉత్తమ ఆంగ్లేతర చిత్రం విభాగంలోనూ, ఎం. ఎం. కీరవాణి స్వరపరిచిన ‘నాటు నాటు...’ పాటకిగానూ ఒరిజినల్ సాంగ్ విభాగంలోనూ ఈ చిత్రం నామినేట్ అయ్యింది.[19] రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట, 2023 మార్చి 13 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[20][21]
తెలుగు సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్, రాజనందిని దంపతలకు 1973లో కర్నాటక రాష్ట్రంలో రాయచూరు జిల్లా అమరేశ్వరి క్యాంప్ లో రాజమౌళి జన్మించాడు. వీరి స్వస్థలం పశ్చమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామం. విద్యాభ్యాసం కొవ్వూరు, ఏలూరు, విశాఖ పట్నం లలో జరిగింది. సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి ఇతనికి వరసకు అన్నయ్య అవుతాడు.[22]
కె. రాఘవేంద్రరావు మార్గదర్శకత్వంలో రాజమౌళి ఈటీవీలో తెలుగు సోప్ ఒపెరాలకు దర్శకత్వం వహించడం ప్రారంభించాడు. తరువాత, అతను కె. రాఘవేంద్రరావు నిర్మించిన శాంతి నివాసం అనే టీవీ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. 2001 లో జూనియర్ ఎన్టీఆర్‌తో తీసిన స్టూడెంట్ నెం .1 తెలుగు చిత్రాలలో అతని మొదటి షాట్. రాజమౌళి తన రెండవ చిత్రం సింహాద్రికి రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది. స్టూడెంట్ నెం .1, సింహాద్రి మధ్య రెండేళ్ల ఖాళీలో, రాజమౌళి తన మొదటి పౌరాణిక చిత్రాన్ని మలయాళ నటుడు మోహన్ లాల్‌తో ప్లాన్ చేసాడు, కానీ ఆ చిత్రం ఆగిపోయింది.[23] 2015 లో, బాహుబలి కోసం ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ మను జగత్, మోహన్ లాల్ ప్రాజెక్ట్ కోసం తాను గీసిన అనేక స్కెచ్లను విడుదల చేశాడు.[24] రాజమౌళి మూడో సినిమా సై, ఇందులో నటులు నితిన్, జెనీలియా డిసౌజా నటించారు. ఇది టాలీవుడ్లో ఈ తరహాలో వచ్చిన మొట్టమొదటి చిత్రం, రగ్బీ ఆట ఆధారంగా రూపొందించిన చిత్రం. కెకె సెంథిల్ కుమార్‌తో రాజమౌళి కలిసి పనిచేసిన మొదటి సందర్భం కూడా ఇదే.[25] అతని తదుపరి చిత్రం ఛత్రపతికి కూడా ఎం ఎం కీరవాణి సంగీత స్వరకర్త, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహకుడు.
తన తదుపరి మాయాజాలాం విక్రమార్కుడులో రాజమౌళి రవితేజతో పనిచేశాడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది, కన్నడలో వీర మదకారి (2009), తమిళంలో సిరుతై (2011), హిందీలో రౌడీ రాథోర్ (2012) గా రీమేక్ చేయబడింది.[26] ఆ తర్వాత విమర్శకుల ప్రశంసలు పొందిన సోషియో ఫాంటసీ చిత్రం అయిన యమదొంగకు దర్శకత్వం వహించాడు. తరువాత చిత్రం రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ నటించిన ఫాంటసీ-యాక్షన్ చిత్రం మగధీర. మగధీర తెలుగు సినిమా పరిశ్రమలో భారీ వ్యాపార విజయం సాధించిన చిత్రాలలో ఒకటి. అది థియేటర్లలో నడిచిన చివరిరోజులకు అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రంగా నిలిచింది. మగధీరకు రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును, ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు-తెలుగును గెలుచుకున్నాడు. ఈ చిత్రం ఉత్తమ కొరియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలిచింది,[27] నటులను స్టార్డమ్లోకి ఎత్తింది. అతని యాక్షన్ హాస్య చిత్రం మర్యాద రామన్న (2010) హిందీలో సన్ ఆఫ్ సర్దార్‌గా, తమిళం, కన్నడ, బెంగాలీ, మలయాళం వంటి ఇతర భాషల్లోకి రీమేక్ చేయబడింది.[28][29] 2012 లో రాజమౌళి మా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలలో మర్యాద రామన్న తనకు ఇష్టమైన సినిమా అని చెప్పాడు.
రాజమౌళి 2012 యాక్షన్ - ఫాంటసీ చిత్రం ఈగ లె ఎస్ట్రాంజ్ ఫిల్మ్ ఫెస్టివల్లో విమర్శకుల ప్రశంసలను పొందింది.[30][31][32] తెలుగు వెర్షన్ 8వ వార్షిక టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యంత వాస్తవమైన చిత్రం, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ హాస్యం, ఉత్తమ పోరాటాలు, జనంతో చూడటానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ విలన్, ఉత్తమ హీరో అవార్డులను అందుకుంది.[33] అలాగే 2013 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో, 16వ షాంఘై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో, పుచోన్ అంతర్జాతీయ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క పనోరమా విభాగాంలో కూడా ప్రదర్శించబడింది.[34][35][36] ఈ చిత్రం బ్రెజిల్‌లోని ఫాంటాస్పోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ కళా దర్శకత్వ పురస్కారాన్ని అందుకుంది.[37] అలాగే, మాడ్రిడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ సంగీత కంపోజర్, ఉత్తమ ఎడిటర్, ఉత్తమ సహాయ నటుడు సహా ఆరు అవార్డులకు నామినేట్ అయింది.[38] తమిళ వెర్షన్ నాన్ 10 వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[39][40]
2015లో, అతను బాహుబలి: ది బిగినింగ్ అనే జానపద యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహించాడు, ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా, భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.[41][42][43][44] 100 సంవత్సరాల భారతీయ సినిమాపై సంజీవ్ భాస్కర్ దర్శకత్వం వహించిన బిబిసి డాక్యుమెంటరీలో ఈ చిత్ర నిర్మాణాన్ని ఫీచర్ చేశారు.[45][46][47] ఇది రాజమౌళి డిజిటల్ కెమెరాతో తీసిన మొదటి చిత్రం,అరి అలెక్సా ఎక్స్.టి (XT) అనే కెమెరాను ఉపయోగించారు.[48][49] రాజమౌళి చిత్రాలను ది హాలీవుడ్ రిపోర్టర్, ది గార్డియన్, ది హఫింగ్టన్ పోస్ట్ వంటి అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి .[50][51] అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, హారర ఫిల్మ్స్ 42వ సాటర్న్ అవార్డులలో నాలుగు విభాగాలలో ఈ చిత్రం నామినేట్ అయింది.[52]
బాహుబలి: ది బిగినింగ్, ఓపెన్ సినిమా స్ట్రాండ్ ఆఫ్ బుసాన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ది హేగ్‌లో,[53] స్పెయిన్‌లో సిట్జెస్ ఫిల్మ్ ఫెస్టివల్లో,[54] ఫ్రాన్స్‌లో ఆదర్శధామ చలన చిత్రోత్సవంలో [55] తైవాన్‌లోని తైపీలో గోల్డెన్ హార్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో[56] ఎస్టోనియాలో ట్యాలిన్ బ్లాక్ నైట్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో,[57] పారిస్‌లో లె 'ఎస్ట్రాంజ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో,[58] పోలాండ్‌లో ఫైవ్ ఫ్లేవర్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో,[59] హానలూలూలో హవాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో, బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో బ్రస్సెల్స్ అంతర్జాతీయ ఫన్టాస్టిక్ ఫిల్ం ఫెస్టివల్,[60][61], కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది.[62][63] రెండవ భాగం బాహుబలి 2: ది కన్‌క్లూజన్ బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రదర్శించబడింది,[3][64], 39 వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రారంభ చలనచిత్రంగా ప్రదర్శించబడింది.[65][66][67]
రాజమౌళి రాబోయే చిత్రం ఆర్.ఆర్.ఆర్ (2021) భారతీయ విప్లవకారులు, అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా రూపొందుతున్న ఒక చారిత్రక డ్రామా. ₹ 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణమవ్తున్న ఇది అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాల్లో ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్ జూనియర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ నటిస్తున్నారు.[68]
నటుడు మహేష్ బాబుతో కలిసి పనిచేయడానికి రాజమౌళి కట్టుబడి ఉన్నాడు. ఈ చిత్ర నిర్మాణం 2022 లో ప్రారంభమవుతుంది.[69] భవిష్యత్తులో హిందూ ఇతిహాసం మహాభారతం ఆధారంగా సినిమా చేయాలనే తన ఉద్దేశం గురించి కూడా రాజమౌళి ప్రస్తావించాడు.[70]
రాజమౌళి సినిమాలలో ఫాంటసీ, హిందూ పురాణాలకు సంబంధించిన ఇతివృత్తాలు ఉంటాయి. పునర్జన్మ ఆలోచనను మొదట మగధీరలో ఉపయోగించాడు, తరువాత ఈగలో కూడా. ఇండియా టుడేకి చెందిన దేవర్సి ఘోష్ గమనించి ఇలా అన్నారు "ఒక అనాథ కథానాయకుడు, ఒక రహస్య ముందుకథ, విడిపోయిన కుటుంబం, ఒక ముఖ్యపాత్ర అతని/ఆమె మూలాలను వెతకడం ఇవి రాజమౌళి చిత్రాలలో అధికంగా ఉంటాయి." [71]
రాజమౌళి 2001లో రమ రాజమౌళిని వివాహం చేసుకున్నాడు. రాజమౌళి చాలా సినిమాలకు రమ దుస్తుల డిజైనర్‌గా పనిచేసింది. రమకు ముందు వివాహంతో కలిగిన కుమారుడు కార్తికేయను రాజమౌళి దత్తత తీసుకున్నాడు. ఈ దంపతులకు దత్తపుత్రిక కూడా ఉంది.[72] కార్తికేయ తెలుగు నటుడు జగపతి బాబు మేనకోడలు పూజా ప్రసాద్‌ని వివాహం చేసుకున్నాడు.[73]
2017 ఏప్రిల్‌లో రాజమౌళి తాను నాస్తికుడిని అని చెప్పాడు. ఆయన ప్రకారం భక్తి, ఒక బలమైన భావం, దాన్ని తన చిత్రాలలో ఒక కథామూలకంగా ఉపయోగించుకుంటాడు.[74] 2017 మేలో రాజమౌళి తన కుటుంబంతో సహా మంత్రాలయాన్ని సందర్శించాడు, దీవెనల కోసం గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్ర స్వామిని ప్రార్థించాడు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, తన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నందుకు సంతోషంగా ఉందని, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు తనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని అన్నాడు.[75]
రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత.[76] ఎన్.టి.ఆర్ (జూనియర్)తో ఇతను తీసిన మూడు చిత్రాలూ అఖండ విజయాన్ని సాధించాయి. తన ప్రతి చిత్రంలో చిత్ర విచిత్రమైన ఆయుధాలను నాయకుని చేత ధరింపజేస్తాడు. ఇతని భార్య రమా రాజమౌళి కూడా చిత్ర రంగంలో దుస్తుల రూపకర్తగా ఉంది.
రాజమౌళి తీసిన బాహుబలి (ది బిగినింగ్), బాహుబలి (ది కంక్లూజన్) సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. బాహుబలి (ది కంక్లూజన్) చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా 1800 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనం.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.