భారతీయ నటుడు From Wikipedia, the free encyclopedia
అశోక్ కుమార్ ( 1911 అక్టోబరు 13 – 2001 డిసెంబర్ 10), భారతీయ సినిమాకు చెందిన చలనచిత్ర నటుడు. ఇతని అసలు పేరు కుముద్‌లాల్ గంగూలీ. ఇతడు దాదామొని అని ముద్దుగా పిలవబడ్డాడు. ఇతడు 1988లో భారత ప్రభుత్వపు అత్యున్నత చలనచిత్ర పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు. 1999లో ఇతడికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇతడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఉత్తమ నటులలో ఒకనిగా పరిగణించబడ్డాడు.
అశోక్ కుమార్ | |
---|---|
অশোক কুমার গাঙ্গুলী | |
జననం | కుముద్ లాల్ గంగూలీ 1911 అక్టోబరు 13 భాగల్పూర్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటీష్ ఇండియా |
మరణం | 2001 డిసెంబరు 10 90) | (వయసు
వృత్తి | నటుడు, పెయింటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1936–1997 |
జీవిత భాగస్వామి | శోభాదేవి |
పిల్లలు | 4, ప్రీతి గంగూలీతో సహా |
పురస్కారాలు |
|
సన్మానాలు | పద్మభూషణ్ (1999) |
కుముద్ లాల్ గంగూలీ బీహార్ రాష్ట్రం (అప్పటి బ్రిటీష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీ)లోని భాగల్పూర్లో ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించాడు.[1] ఇతని తండ్రి కుంజ్లాల్ గంగూలీ ఒక న్యాయవాది తల్లి గౌరి ఒక గృహిణి. ఇతడు వారి నలుగురు సంతానంలో పెద్దవాడు.ఇతని సోదరి సతీదేవి పిన్నవయసులోనే శశిధర్ ముఖర్జీని పెళ్ళి చేసుకుని సినిమా రంగానికి చెందిన ఒక పెద్దకుటుంబానికి కోడలు అయ్యింది. తరువాతి సోదరుడు కళ్యాణ్ తరువాతి కాలంలో అనూప్ కుమార్ గా సినిమా రంగంలో రాణించాడు. కళ్యాణ్ ఇతనికంటే 14 సంవత్సరాలు చిన్నవాడు. ఇక ఇతనికంటే అతి పిన్న వయస్కుడైన చివరి తమ్ముడు అభాస్ గంగూలీ చలన చిత్ర సీమలో కిషోర్ కుమార్ పేరుతో ప్రముఖ గాయకునిగా రాణించాడు.
ఇతడు కలకత్తా లోని ప్రెసిడెన్సీ కాలేజి ఉన్నతవిద్యను అభ్యసించి న్యాయవాదిగా వృత్తిని చేపట్టాడు. ఇతడు లా చదువుతున్నపటికీ ఇతని మనసు సినిమా రంగంపైనే ఉంది. ఇతడు సినిమాలలో టెక్నీషియన్‌గా రాణించాలనుకున్నాడు.
ఇతడు చదువుకునే సమయంలోనే శోభ అనే అమ్మాయితో తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాన్ని సంప్రదాయబద్ధంగా చేసుకున్నాడు.[2] వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగింది. వీరికి అరూప్ గంగూలీ అనే కుమారుడు, భారతీ పటేల్, రూపావర్మ, ప్రీతి గంగూలీ అనే ముగ్గురు కుమార్తెలు కలిగారు.
కుముద్ లాల్ సోదరి సతీదేవికి బాల్యంలోనే వివాహం జరిగింది. ఆమె భర్త శశిధర్ ముఖర్జీ ముంబై సినిమా పరిశ్రమలో టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. అతడిని చూసి కుముద్‌లాల్ గంగూలీ సినిమా రంగంపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఇతడు లా పరీక్ష తప్పడంతో తరువాతి పరీక్షల వరకు కొంత కాలం ముంబైలోని తన సోదరి ఇంట్లో గడిపాడు. ఇతని కోరిక పై ఇతని బావ బాంబే టాకీస్ అనే స్టూడియోలో లేబొరేటరీ అసిస్టెంట్‌గా ఉద్యోగం కుదిర్చాడు. ఇతనికి ఆ ఉద్యోగం నచ్చి తన తండ్రిని ఒప్పించి లా చదువు మానివేసి అదే ఉద్యోగంలో కొనసాగాడు.
ఇతడు లేబొరేటరీ అసిస్టెంట్‌గా ఐదు సంవత్సరాలు పనిచేశాడు. ఇతడు నటుడిగా మారడం యాధృచ్ఛికంగా జరిగింది. 1936లో బాంబే టాకీస్ వారి జీవన్ నయా అనే చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఆ చిత్రంలో నజ్మల్ హసన్, ఆ స్టూడియో నిర్మాత హిమాంశు రాయ్ భార్య దేవికారాణి ప్రధాన భూమికలు పోషిస్తున్నారు. అయితే కొని కారణాల వల్ల నజ్మల్ హసన్‌ను ఆ సినిమా నుండి తొలగించారు. ఆ సినిమా దర్శకుడు ఫ్రాంజ్ ఓస్టెన్ సలహాపై కుముద్లాల్ను నజ్మల్ హసన్ స్థానంలో తీసుకున్నారు. కుముద్లాల్కు అశోక్ కుమార్ అనే పేరు పెట్టారు.
అశోక్ కుమార్ తన నట జీవితాన్ని కొంత అయిష్టంగానే ప్రారంభించినా ఇతని తరువాతి చిత్రం అఛూత్ కన్య ఇతనికి దేవికారాణికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. బ్రాహ్మణ బాలుడు దళిత బాలికను ప్రేమించడమనే కథతో ఆ సినిమా హిందీ తొలి సినిమాలలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విజయంతో అశోక్ కుమార్, దేవికారాణి జంట ఆ కాలంలో వెండితెరపై విజయవంతమైన జంటగా నిలిచారు.
తరువాత ఈ జంట వరుసగా జన్మభూమి (1936), ఇజ్జత్ (1937), సావిత్రి (1937), వచన్ (1938), నిర్మల (1938) సినిమాలలో నటించారు. వీరిద్దరూ జంటగా నటించిన చివరి చిత్రం అంజాన్ (1941). తరువాత ఇతడు లీలా చిట్నీస్‌తో కలిసి సినిమాలలో నటించడం ప్రారంభించాడు. ఈ జంటకూడా కంగన్ (1939), బంధన్ (1940), ఆజాద్ (1940), ఝూలా (1941) వంటి విజయవంతమైన చిత్రాలను అందించింది.
1943లో గ్యాన్ ముఖర్జీ దర్శకత్వంలో వెలువడిన కిస్మత్ సినిమాలో ఇతడు ప్రతినాయకుడిగా నటించాడు. ఈ సినిమాలో ఇతని నటన మూలంగా 1 కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమాగా మునుపటి బాక్స్ఆఫీసు రికార్డులను బద్దలు చేసింది. ఈ సినిమాలో నటన ద్వారా ఇతడు హిందీ సినిమాలో మొట్ట మొదటి సూపర్ స్టార్‌గా పేరు గడించాడు.
కిస్మత్ తరువాత చల్ చల్రే నవ్‌జవాన్ (1944), షికారి (1946), సాజన్ (1947), మహల్ (1949), మషాల్ (1950, సర్గమ్ (1950), సమాధి (1950) వంటి అనేక బాక్సాఫీస్ హిట్ సినిమాలలో నటించాడు.
ఇతడు బాంబే టాకీస్ సంస్థ చివరి రోజులలో ఆ సంస్థ కోసం అనేక సినిమాలను నిర్మించాడు. వాటిలో దేవానంద్, ప్రాణ్ నిలదొక్కుకోవడానికి కారణమైన జిద్దీ (1948), రాజ్ కపూర్‌ను పరిచయం చేసిన నీల్ కమల్ (1947), మధుబాలతో కలిసి నటించిన మహల్ (1949) సినిమాలు ఉన్నాయి.
1950వ దశకంలో అశోక్ కుమార్ కథానాయకుని పాత్రల నుండి పరిణితి చెందిన పాత్రలను ధరించడం ప్రారంభించాడు. 1958లో విడుదలైన హౌరా బ్రిడ్జ్ సినిమా మాత్రం దీనికి మినహాయింపు. యువ హీరోలైన దేవానంద్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్ వంటి వారు వెలుగొందుతున్నప్పటికీ ఇతడు కూడా అఫ్సానా (1951), దీదార్ (1951), నవ్ బహార్ (1952), పరిణీత (1953), బందీష్ (1955), ఏక్ హీ రాస్తా (1956) వంటి విజయవంతమైన సినిమాలలో రాణించాడు.
ఇతడు 1950వ దశకంలో ఎక్కువగా నళినీ జయవంత్తో కలిసి నటించాడు. ఇతడు మీనాకుమారి జంటగా తమాషా (1952) మొదలు పాకీజా (1972) వరకు 20 యేళ్ల వ్యవధిలో 17 సినిమాలలో నటించారు. ఈ దశాబ్దంలో ఇతడు ఎక్కువగా పోలీస్ ఆఫీసర్, క్రిమినల్ వేషాలలో కనిపించాడు.
1960లలో ఇతడు తండ్రి, మామ, తాత వంటి పాత్రలను ధరించడం మొదలుపెట్టాడు. కానూన్ (1960)లో న్యాయాధికారి, బందిని (1963)లో స్వాతంత్ర్య సమరయోధుడు, చిత్రలేఖ (1964)లో ముసలి పూజారి, జవాబ్ (1970)లో జమీందార్ By the 1960s, విక్టోరియా 203 (1971)లో నేరస్థుడు వంటి విభిన్నమైన పాత్రలను పోషించాడు. 1960 - 70లలో వెలువడిన అనేక ఆణిముత్యాల వంటి సినిమాలలో ఇతడు ముఖ్యమైన పాత్రలు ధరించాడు. వాటిలో జువెల్ థీఫ్ (1967), ఆశీర్వాద్ (1968), పూరబ్ ఔర్ పశ్చిమ్ (1970), పాకీజా (1972), మిలీ (1975), ఛోటీ సీ బాత్ (1975), ఖూబ్సూరత్ (1980) వంటి సినిమాలున్నాయి. ఇతడు 1980-90లలో కొన్ని సినిమాలలో నటించాడు. ఇతడు టెలివిజన్‌లో హమ్‌లోగ్ అనే సీరియల్లో వ్యాఖ్యాతగా, బహదూర్ షా జఫర్ అనే సీరియల్లో ప్రధాన భూమికను పోషించాడు. ఇతడు చివరిసారిగా ఆంఖోఁ మే తుమ్ హో (1997) చిత్రంలో నటించాడు. ఇతడు నటుడు మాత్రమే కాక ఔత్సాహిక చిత్రకారుడు (పెయింటర్), హోమియోపతి వైద్యుడు కూడా. హోమియోపతి వైద్యుడిగా ఇతడు అద్భుతాలను సృష్టించి అనేక రోగాలను నయం చేశాడు[3].ఇతడు మొత్తం 275 చిత్రాలలో నటించాడు. 30కి పైగా బెంగాలీ నాటకాలలో వేషాలు వేశాడు.
అశోక్ కుమార్ 2001, డిసెంబర్ 10న తన 90 యేట ముంబై, చెంబూరులోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించాడు.[4]
అశోక్ కుమార్ నటించిన సినిమాల పాక్షిక జాబితా:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.