From Wikipedia, the free encyclopedia
సిరియస్ అనేది సూర్యుని నుంచి 8.6 కాంతి సంవత్సరాల దూరంలో వున్న ఒక జంట నక్షత్ర వ్యవస్థ (Visual Binary System). దీనిలో సిరియస్-A , సిరియస్-B అనే రెండు నక్షత్రాలు వున్నాయి. టెలిస్కోప్ నుంచి చూస్తేనే సిరియస్ కి ఈ రెండు నక్షత్రాలున్నట్లు కనపడుతుంది. మామూలు కంటితో చూస్తే మాత్రం సిరియస్ ఒంటరి నక్షత్రంగానే కనిపిస్తుంది. భూమి మీద నుంచి చూస్తే ఆకాశంలో రాత్రిపూట కనిపించే నక్షత్రాలలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఈ సిరియస్ నక్షత్రమే. తెల్లని వజ్రంలా ప్రకాశించే ఈ నక్షత్ర దృశ్య ప్రకాశ పరిమాణం – 1.46. కానిస్ మేజర్ (బృహల్లుబ్దకం) అనే నక్షత్రరాశిలో కనిపించే ఈ నక్షత్రాన్ని బేయర్ నామకరణ పద్దతిలో Alpha Canis Majoris (α CMa) గా సూచిస్తారు. ఈ తారనే డాగ్ స్టార్ (Dog Star), మృగవ్యాధ రుద్రుడు అని కూడా వ్యవహరిస్తారు.
Observation data Epoch J2000.0 Equinox ICRS | |
---|---|
Constellation | Canis Major |
Sirius (/ˈsɪriəs/[1]) system | |
Right ascension | 06h 45m 08.91728s[2] |
Declination | −16° 42′ 58.0171″[2] |
Apparent magnitude (V) | −1.46[3] |
Sirius A | |
Right ascension | 06h 45m 08.917s[4] |
Declination | −16° 42′ 58.02″[4] |
Apparent magnitude (V) | −1.47[5] |
Sirius B | |
Right ascension | 06h 45m 09.0s[6] |
Declination | −16° 43′ 06″[6] |
Apparent magnitude (V) | 8.44[5] |
Characteristics | |
Sirius A | |
Evolutionary stage | Main sequence |
Spectral type | A0mA1 Va[7] |
U−B colour index | −0.05[3] |
B−V colour index | +0.00[3] |
Sirius B | |
Evolutionary stage | White dwarf |
Spectral type | DA2[5] |
U−B colour index | −1.04[8] |
B−V colour index | −0.03[8] |
Astrometry | |
కోణీయ వేగం (Rv) | −5.50[9] km/s |
Proper motion (μ) | RA: −546.01[2] mas/yr Dec.: −1223.07[2] mas/yr |
Parallax (π) | 379.21 ± 1.58[2] mas |
ఖగోళ దూరం | 8.60 ± 0.04 ly (2.64 ± 0.01 pc) |
Sirius A | |
Absolute magnitude (MV) | +1.42[10] |
Sirius B | |
Absolute magnitude (MV) | +11.18[8] |
Visual binary orbit[11] | |
Companion | α CMa B |
Period (P) | 50.1284 ± 0.0043 yr |
Semimajor axis (a) | 7.4957 ± 0.0025" |
Eccentricity (e) | 0.59142 ± 0.00037 |
Inclination (i) | 136.336 ± 0.040° |
Longitude of the node (Ω) | 45.400 ± 0.071° |
Periastron epoch (T) | 1994.5715 ± 0.0058 |
Argument of periastron (ω) | 149.161 ± 0.075° |
Details | |
α CMa A | |
Mass | 2.063 ± 0.023[11] M☉ |
Radius | 1.711[12] R☉ |
Luminosity | 25.4[12] L☉ |
Surface gravity (log g) | 4.33[13] cgs |
Temperature | 9,940[13] K |
Metallicity [Fe/H] | 0.50[14] dex |
Rotation | 16 km/s[15] |
Age | 237–247[11] Myr |
α CMa B | |
Mass | 1.018 ± 0.011[11] M☉ |
Radius | 0.0084 ± 3%[16] R☉ |
Luminosity | 0.056[17] L☉ |
Surface gravity (log g) | 8.57[16] cgs |
Temperature | 25,000 ± 200[12] K |
Age | 228+10 −8[11] Myr |
Other designations | |
Sirius B: EGGR 49, WD 0642-166, GCTP 1577.00[23] | |
Database references | |
SIMBAD | The system |
A | |
B |
సిరియస్ అనే జంట నక్షత్ర సముదాయంలో ఒకటి మహోజ్వలమైన నక్షత్రం (సిరియస్-A) కాగా మరొకటి కాంతివిహీనంగా కనిపించే వైట్ డ్వార్ఫ్ నక్షత్రం (సిరియస్-B). మహోజ్వలంగా మెరిసే సిరియస్ A నక్షత్రం తన పరిణామ దశలో ‘ప్రధాన క్రమం’ (Main Sequence) లో వున్న నక్షత్రం. A1V వర్ణపట తరగతికి చెందిన నీలి-తెలుపు (Blue-White) వర్ణనక్షత్రం. ఇది సూర్యునికంటే వ్యాసంలో 1.71 రెట్లు పెద్దది, తేజస్సు (Luminosity) లో సుమారుగా 25 రెట్లు పెద్దది.[12] ఇకపోతే సిరియస్ B నక్షత్రం కాంతివిహీనంగా వున్న ఒక చిన్న నక్షత్రం. ఇది సూర్యుని కంటే వ్యాసంలో సుమారు 120 రెట్లు చిన్నది. భూమి కంటె కొద్దిగా చిన్నది. ఇది వైట్ డ్వార్ఫ్ (శ్వేత కుబ్జతార) నక్షత్రం. ఈ జంట నక్షత్ర వ్యవస్థ యొక్క వయస్సు సుమారు 20 నుంచి 30 కోట్ల సంవత్సరాల మధ్య ఉంటుంది. [12]
కానిస్ మేజర్ (బృహల్లుబ్దకం) అనే నక్షత్రరాశిలో కనిపించే సిరియస్ నక్షత్రాన్ని ఓరియన్ (Orion) నక్షత్రరాశి ఆధారంగా సులభంగా గుర్తించవచ్చు. ఓరియన్ నక్షత్రరాశిలో వేటగాడి బెల్ట్ ను పోలివున్న 3 నక్షత్రాలను తూర్పుకి పొడిగిస్తే తెల్లగా అత్యంత కాంతివంతంగా మెరుస్తూ కనిపించే నక్షత్రమే సిరియస్.
సిరియస్ నక్షత్రాన్ని శీతాకాలపు త్రిభుజం (Winter Triangle) లో భాగంగా కూడా గుర్తించవచ్చు. ఉత్తరార్ధ గోళంలో వున్న వారికి సిరియస్, ప్రొసియన్, ఆర్ద్రా నక్షత్రాలు – ఈ మూడు అతి ప్రకాశవంతమైన నక్షత్రాలు శీతాకాలంలో రాత్రిపూట ఆకాశంలో ఒక ఊహాత్మక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తున్నట్లుగా కనిపిస్తాయి. దీన్నే శీతాకాలపు త్రిభుజం (Winter Triangle) గా పేర్కొంటారు. [24] ఈ మూడు నక్షత్రాలు వేర్వేరు నక్షత్ర రాశులకు చెందినప్పటికీ, వాటి మొదటి ప్రకాశ పరిమాణ తరగతి కారణంగా, శీతాకాలంలో రాత్రిపూట ఈ త్రిభుజం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ శీతాకాలపు త్రిభుజాన్ని గుర్తించడం ద్వారా, దాని ఒక శీర్షంలో మహోజ్వలంగా మెరుస్తున్న సిరియస్ నక్షత్రాన్ని సులువుగా గుర్తుపట్టవచ్చు.
సిరియస్ నక్షత్రం ఉత్తరార్ధగోళంలో వున్న వారికి డిసెంబర్ నెల నుంచి ఏప్రిల్ నెల వరకూ ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రి పూట ఉజ్వలంగా ప్రకాశించే ఈ నక్షత్రం అనుకూల పరిస్థితులున్నప్పుడు మామూలు కంటికి పగటి వెలుగులో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆకాశం నిర్మలంగా వున్నప్పుడు, సూర్యుడు క్షితిజానికి (Horizon) కాస్త క్రిందుగా వున్నప్పుడు, ఎక్కువ ఉన్నత ప్రదేశంలో వున్న పరిశీలకులకు సిరియస్ నక్షత్రం నడి నెత్తిన ఆకాశంలో పగటి పూట కూడా స్పష్టంగా కనిపిస్తుంది. [25] అయితే ఇటువంటి అనుకూల పరిస్థితులు దక్షిణార్ధ గోళంలో ఎక్కువగా ఏర్పడతాయి దీనికి కారణం సిరియస్ నక్షత్రానికి ఖగోళ దిక్పాతం (Declination) దక్షిణంగా వుండటమే.
సుమారు 73 డిగ్రీల N కు ఉత్తరంగా వున్నఅక్షాంశ ప్రాంతాల వారికి తప్ప భూగోళంపై వున్న అన్ని ప్రాంతాలలోను సిరియస్ కనిపిస్తుంది. ఉత్తరార్ధ గోళంలో అందులోను బాగా ఉత్తరాన్న వున్న కొన్ని నగరాలలో నుంచి చూస్తే ఇది క్షితిజానికి (Horizon) దగ్గరగా కనిపిస్తుంది. ఉదాహరణకు సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో సిరియస్ నక్షత్రం, క్షితిజానికి 13 డిగ్రీల ఎత్తులోనే కనిపిస్తుంది.[26] భారతదేశంలోని విభిన్న ప్రాంతాలలో సిరియస్ నక్షత్రం, తన ఉత్కృష్ట స్థితిలో (Altitude at Upper Culmination) క్షితిజానికి సుమారు 40° నుంచి 66° వరకు గల ఎత్తులలో కనిపిస్తుంది. ఉదాహరణకు ఈ నక్షత్రం కన్యాకుమారిలో క్షితిజానికి 65.2° ఎత్తులో కనిపిస్తుంది. చెన్నై నగరంలో క్షితిజానికి 60.2° ఎత్తు లోను, విజయవాడలో 56.7° ఎత్తులోను, ముంబై లో 54.2° ఎత్తులో, కొలకత్తాలో 50.7° ఎత్తులోను, న్యూ ఢిల్లీ లో క్షితిజానికి 44.6° ఎత్తులో , శ్రీనగర్ లో క్షితిజానికి 39.2° ఎత్తులోనే కనిపిస్తుంది.
73°17'S కు దక్షిణాన్న సిరియస్ నక్షత్రం ధృవ పరిభ్రమణ తారగా (Circumpolar star) వుంటుంది. అంటే దక్షిణ ధ్రువం నుండి 16.7° అక్షాంశ పరిధిలోపల ఇది ధృవ పరిభ్రమణ తార అవుతుంది. దీని దిక్పాతం సుమారుగా -16°43'. అందువల్ల 73°17'S కు దక్షిణంగా వున్న అక్షాంశ ప్రాంతాలపై నుండి ఆకాశంలో చూస్తే సిరియస్ నక్షత్రం ఖగోళ దక్షిణ ధృవం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు కనిపిస్తుంది. 73°17'S కు ఉత్తరంగావున్న అక్షాంశ ప్రాంతాలపై నుండి చూస్తే సిరియస్ నక్షత్రం ఆకాశంలో క్షితిజానికి దిగువన అస్తమిస్తుంది. దక్షిణార్ధగోళంలో జూలై ప్రారంభంలో సిరియస్, సూర్యాస్తమయం తరువాత సాయంత్రం సమయంలోనే కాక సూర్యోదయానికి ముందు ఉదయం సమయంలో కూడా ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తుంది.[27]
భూమికి గల ప్రెసిషన్ (precession) చలనం వల్ల సిరియస్ నక్షత్రం భవిష్యత్తులో మరింత దక్షిణంవైపుకు పయనిస్తుంది.రమారమి 9000 సంవత్సరం నుంచి ఉత్తర యూరప్, మధ్య యూరప్ ప్రాంతాల నుండి సిరియస్ నక్షత్రం కనిపించదు. ఆపై 14000 సంవత్సరంలో దాని దిక్పాతం సుమారు -67° గా వుంటుంది. దానితో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లోని అనేక ప్రాంతాల్లో నుండి చూస్తే ఇది ధృవ పరిభ్రమణ తారగా వుంటుంది.
సిరియస్ నక్షత్రం మనకు 8.6 కాంతి సంవత్సరాల (2.64 parsec) దూరంలో వుంది. దీనిని హిప్పార్కస్ అంతరిక్ష ఉపగ్రహము శాస్త్రీయంగా నిర్ధారించింది.[28][29][30] మన భూమికి సమీపంగా వున్న పొరుగు నక్షత్రాలలో ఇది ఒకటి. సూర్యుని మినహాయిస్తే మన సౌర వ్యవస్థకు అతి దగ్గరలో వున్న ఎనిమిదవ నక్షత్రం సిరియస్.[31] అలాగే సౌర వ్యవస్థకు అతి సమీపంలో వున్న నక్షత్ర వ్యవస్థల (stellar system) లో సిరియస్ జంట నక్షత్ర వ్యవస్థది ఐదవ స్థానం.[31] సిరియస్ నక్షత్రం మనకు ఇంత సమీపంగా ఉండటం వలెనే ఆల్ఫా సెంచూరై, కానోపస్, రీగల్, ఆర్ద్రా తదితర దేదీప్యమానంగా వెలిగిపోయే (highly luminous) సూపర్ జెయింట్ సదూర నక్షత్రాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. [32] 1977 లో ప్రయోగించబడినప్పటి నుండి ఇప్పటివరకూ అంతరిక్షంలో సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తున్న మానవ రహిత అంతరిక్ష నౌక వోయేజర్ 2, ఇలాగే తన ప్రయాణం నిర్విరామంగా కొనసాగించగలిగితే మరో 2,96,000 సంవత్సరాలకు సిరియస్ నక్షత్రానికి సగం దూరంలో చేరుకోగలుగుతుందని ఒక అంచనా.[33]
సిరియస్ నక్షత్రానికి ఉత్తరంగా ప్రొసియన్ అనే ప్రకాశవంతమైన నక్షత్రం కనిపిస్తుంది. ఇది కానస్ మైనర్ (లఘులుబ్దకం) అనే నక్షత్రరాశికి చెందినది. సిరియస్ కు సమీపంలో ఉన్న అతి పెద్ద పొరుగు నక్షత్రం ప్రొసియన్ నక్షత్రమే. ఇది సిరియస్ కు 5.24 కాంతి సంవత్సరాల దూరంలో వుంది.[34] ఉత్తరార్ధ గోళంలో వున్న వారికి శీతాకాలంలో రాత్రిపూట ఆకాశంలో కనిపించే శీతాకాలపు త్రిభుజం (Winter Triangle) యొక్క శీర్షాలుగా సిరియస్, ప్రొసియన్, ఆర్ద్రా నక్షత్రాలున్నాయి. సిరియస్ నక్షత్రానికి దక్షిణంగా కానోపస్ (అగస్త్య) అనే మరో ఉజ్వల నక్షత్రం కనిపిస్తుంది. ఇది కెరీనా నక్షత్రరాశికి చెందినది.
మెసియర్ 41 (M-41) నక్షత్ర గుచ్చం (star cluster): సిరియస్ కు 4 డిగ్రీల దక్షిణంగా M-41 అనే నక్షత్ర గుచ్చం వుంది. ఇది సాధారణ కంటికి కనీకనిపించనట్లున్నప్పటికి టెలీస్కోప్ తో చూస్తే అనేకానేక నక్షత్రాలు గుంపుగా కనిపిస్తుంది. ఇది అనేక రెడ్ జెయింట్ నక్షత్రాలతో సహా సుమారు 100 నక్షత్రాలు కలిగి ఉంది,
గైయా-1 (Gaia-1) నక్షత్ర గుచ్చం: ఇది సిరియస్ కు పశ్చిమ దిశలో కేవలం 10 ఆర్క్ నిమిషాల దూరంలో వున్నప్పటికీ. ఉజ్వలమైన సిరియస్ కాంతికి సంబంధించిన గ్లేరింగ్ కారణముగా సాధారణ టెలీస్కోప్ లో దీనిని 2017 వరకూ చూడలేకపోయారు.[35] 2017 లో గైయా స్పేస్ అబ్జర్వేటరీ గుర్తించిన ఈ భారీ నక్షత్ర గుచ్చంలో 1200 వరకు నక్షత్రాలున్నాయి.
1868 లో, రేడియల్ వేగాన్ని (radial velocity) కొలిచిన మొదటి నక్షత్రం సిరియస్. దీనితో ఖగోళ వస్తువుల యొక్క రేడియల్ వేగాలను అధ్యయనం చేయడం ప్రారంభమైంది. సర్ విలియం హగ్గిన్స్ అనే బ్రిటీష్ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఈ తార స్పెక్ట్రమ్ (వర్ణపటం) ను పరిశీలించి రెడ్ షిఫ్ట్ (స్పెక్ట్రమ్ రేఖలు ఎరుపు వర్ణం వైపుకు జరగడం) ను గమనించాడు. దానితో సిరియస్ నక్షత్రం మన సౌర వ్యవస్థ నుండి దూరంగా 40 కి.మీ./సె. రేడియల్ వేగంతో మరలిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చాడు.[36] [37] అయితే అతను భూ కక్ష్యా వేగాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో, దోషం తేలి అతని అంచనాలో సుమారు 30 కి.మీ./సె. ఎక్కువగా రావడం, ఫలితంగా మైనస్ గుర్తు రాకుండా పోయి వుంటుంది. దానితో అతని అంచనా తప్పని తేలింది. ప్రస్తుతం ఈ సిరియస్ నక్షత్రం యొక్క రేడియల్ వేగాన్ని -5.5 కి.మీ./సె. ఖచ్చితంగా నిర్ధారించారు. ఈ మైనస్ గుర్తు ఈ నక్షత్రం సూర్యుని సమీపిస్తున్నదని తెలియ చేస్తుంది. అంటే సిరియస్ నక్షత్రం 5.5 కి.మీ./సె. రేడియల్ వేగంతో మన సౌర వ్యవస్థ వైపుకు కదులుతున్నది అర్ధం.
1955 లో రాబర్ట్ హాన్బరీ బ్రౌన్, రిచర్డ్ ట్విస్ అనే బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్ర వ్యతికరణమాపకం (Stellar Interferometer) వుపయోగించి సిరియస్ A వ్యాసాన్ని కనుగొన్నారు.[38] సిరియస్ A నక్షత్రం సూర్యుని కంటే ద్రవ్యరాశిలో సుమారు రెండు రెట్లు పెద్దది. వ్యాసంలో 1.71 రెట్లు పెద్దది. 2005 లో హుబల్ టెలీస్కోప్ నుపయోగించి ఖగోళ శాస్త్రవేత్తలు సిరియస్ B నక్షత్రం, భూవ్యాసంతో సమానమైన వ్యాసాన్ని, సూర్యునితో సమానమైన ద్రవ్యరాశిని (సౌర ద్రవ్యరాశిలో 102%) కలిగి వుంటుందని నిర్ధారించారు.[39]
అయితే సూర్యుని అంత ద్రవ్యరాశి కలిగివున్నప్పటికి సిరియస్ B నక్షత్ర వ్యాసం (12,000 కిలోమీటర్లు), భూగోళం వ్యాసం కన్నా చిన్నది కావడంతో, దీనికి భూమి కంటే 3,50,000 రెట్లు అధికంగా అపారమైన గురుత్వాకర్షణ శక్తి ఏర్పడింది. అంటే భూమి మీద 68 kg ల బరువున్న ఒక వ్యక్తి ఈ సిరియస్ B నక్షత్రంపై 25,000 టన్నుల బరువు ఉంటాడని చెప్పవచ్చు.
ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, జూపిటర్ ల తరువాత మనకు ప్రకాశవంతంగా కనిపించేది సిరియస్ నక్షత్రమే. సాధారణంగా అంగారకుడు, బుధుడు గ్రహాలు సిరియస్ కన్నా మసక గానే ఉన్నప్పటికీ, కొన్ని సమయాలలో మాత్రం అవి గరిష్ట స్థాయిలో సిరియస్ కన్నా ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాయి.[40] సిరియస్ తరువాత స్థానం కానోపస్ నక్షత్రానిది. భూమిపై నుండి చూస్తే ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించే మొదటి పది ఖగోళ వస్తువులు - సూర్యుడు (-26.7), చంద్రుడు (-12.9), ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (-5.9), శుక్రుడు (-4.4), జూపిటర్ (-2.94), అంగారకుడు (-2.94), బుధుడు (-2.48),సిరియస్ నక్షత్రం (-1.47), కానోపస్ నక్షత్రం (-0.72), శని గ్రహం (-0.55) వరుస క్రమంలో వుంటాయి.
సిరియస్ A నక్షత్రం యొక్క దృశ్య ప్రకాశ పరిమాణం -1.47. ఈ విలువ 1.5 కన్నా తక్కువగా వుండడం వలన ఇది మొదటి తరగతి పరిమాణపు నక్షత్రాల (First Class Magnitude stars) కోవలోకి వస్తుంది. అంతర్గత దీప్యత (Intrinsic Luminosity), భూసామీప్యతల కారణంగా సిరియస్ నక్షత్రం మనకు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. నిజానికి సూర్యుడు తరువాత రాత్రిపూట ఆకాశంలో కనిపించే నక్షత్రాలన్నింటిలోను అతి ఉజ్వలంగా ప్రకాశిస్తూ కనిపించేది ఇదే. దీని తరువాత స్థానంలో వున్న ప్రకాశవంతమైన నక్షత్రం కానోపస్ (అగస్త్య) తో పోలిస్తే సిరియస్ దాదాపు రెట్టింపు కాంతివంతంగా కనిపిస్తుంది.[41]
సూర్యుని మినహాయిస్తే ఈ విధంగా ఋణాత్మకమైన దృశ్య ప్రకాశ పరిమాణ విలువలు కేవలం నాలుగు నక్షత్రాలకు మాత్రమే వున్నాయి. అవి సిరియస్ A (-1.47), కానోపస్ (-0.72), ఆల్ఫా సెంచూరి (-0.27), స్వాతి నక్షత్రం (-0.05)
సిరియస్ A నక్షత్రం యొక్క నిరాపేక్ష ప్రకాశ పరిమాణం (absolute bright magnitude) విలువ +1.45. అంటే సిరియస్ A నక్షత్రాన్ని భూమి నుంచి 10 parsec నియమిత దూరంలో వుంచినపుడు దాని ప్రకాశ పరిమాణం విలువ 1.45 మాత్రమే. వివిధ నక్షత్రాల యదార్ధ ప్రకాశ పరిమాణాలను (intrinsic brightnesses) తులనాత్మకంగా పరిశీలించడానికి నిరాపేక్ష ప్రకాశ పరిమాణాలను కొలమానంగా తీసుకొంటారు. సూర్యునికి ఈ విలువ +4.83 కాగా సిరియస్ A, కానోపస్ నక్షత్రాలకు నిరాపేక్ష ప్రకాశ పరిమాణం విలువలు వరుసగా +1.45, -5.53.
సాధారణంగా తక్కువ ప్రకాశ పరిమాణ విలువలు గల ఖగోళ వస్తువులు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి. సిరియస్ A, కానోపస్ నక్షత్రాలను పోల్చి చూస్తే, సిరియస్ A నక్షత్రానికి తక్కువ దృశ్య ప్రకాశ పరిమాణ విలువ వుంది కాబట్టి కానోపస్ కన్నా సిరియస్ A నక్షత్రమే మనకు ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అదే విధంగా కానోపస్ నక్షత్రానికి తక్కువ నిరాపేక్ష ప్రకాశ పరిమాణ విలువ వుంది కాబట్టి సిరియస్ A కన్నా కానోపస్ నక్షత్రమే నిజానికి ఎక్కువ ప్రకాశవంతమైనది. ఈ విధంగా ఎంతో పరమ ప్రకాశవంతమైన కానోపస్ నక్షత్రం తో పోలిస్తే , సిరియస్ A నక్షత్రమే మనకు ఉజ్వలంగా కనిపించడానికి కారణం భూమి నుంచి సిరియస్ A నక్షత్రానికి గల సామీప్యత. మనకు సిరియస్ A నక్షత్రం సమీపంగా (8.6 కాంతి సంవత్సరాల దూరం) వుంటే, కానోపస్ నక్షత్రం మరింత దూరంలో (313 కాంతి సంవత్సరాలు) వుండటమే.
సిరియస్ జంట నక్షత్ర వ్యవస్థ క్రమేణా మన సౌర వ్యవస్థకు సమీపంగా కదులుతున్నది. అందువలన మరో 60,000 సంవర్సరాల వరకు అది ఇంకొద్ది ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఆ తరువాత అది సౌర వ్యవస్థ నుండి దూరంగా జరగడం వల్ల ఆపై ప్రకాశమానం కొద్దిగా తగ్గుతుంది. అయితే ఏదిఏమైనా రాబోయే 2,10,000 సంవత్సరాల వరకు సిరియస్ నక్షత్రమే మనకు కనిపించే అత్యంత ప్రకాశమైన నక్షత్రంగా వుంటుంది.[42]
సిరియస్ A ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 10,000°K వరకు ఉంటుంది. సిరియస్ B నక్షత్రం కేవలం కేంద్రభాగం (Core) మాత్రమే మిగిలి వున్న ఒక మరుగుజ్జు నక్షత్రం. దీని కోర్ భాగంలోని హీలియం ఇంధనమంతా హరించుకుపోవడం వల్ల, కేంద్రక చర్యలు కూడా ఆగిపోయివుంటాయి. అయినప్పటికీ అత్యదిక అంతర్గత ఉష్ణాన్ని కలిగి వున్న కొర్ భాగంను మాత్రమే కలిగి వుండటం వలన, సిరియస్ B నక్షత్రం సుమారు 25,000°K వరకు అత్యధిక ఉపరితల ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది.
మనకు సమీపంలోని నక్షత్రాలతో పోలిస్తే సిరియస్ నక్షత్రం అంతర్గత దీప్తితో వెలిగిపోతూ ఉంటుంది. సూర్యునితో పోలిస్తే సిరియస్ A నక్షత్రం 25 రెట్లు ఎక్కువ దేదీప్యమానంగా ఉంటుంది.[12] అంటే 1 సెకండ్ లో సిరియస్ A నక్షత్రం సూర్యుని కంటే 25 రెట్లు అధికంగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంతటి అంతర్గత దీప్తితో వున్న సిరియస్ నక్షత్రం భూమికి సమీపంగా ఉండటం వలన మనకంటికి ఉజ్వలంగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అయితే ఇతర ముఖ్య ఖగోళ వస్తువులతో పోలిస్తే దీని దీప్యత తక్కువగానే వుంది. ఉదాహరణకు సిరియస్ A తరువాత స్థానంలో వున్న ప్రకాశవంతమైన నక్షత్రం కానోపస్, సూర్యుని కంటే సుమారుగా 13,600 రెట్లు ఎక్కువ దేదీప్యమానంగా ఉంటుంది. సిరియస్ B వైట్ డ్వార్ఫ్ నక్షత్రం సూర్యుని దీప్తి లో కేవలం 5% మాత్రమే కలిగి వుంది.
సుమారు 8.44 దృశ్య ప్రకాశం పరిమాణంతో బాగా కాంతివిహీనంగా వున్న సిరియస్ B నక్షత్రం, శక్తివంతమైన టెలిస్కోప్ తో మాత్రమే కనిపిస్తుంది. అందువలనే సిరియస్ ఒక జంట తార అనే విషయం 1844 వరకూ ఊహించలేకపోయారు. 1844 లో మొదటిసారిగా జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ విల్ హెల్మ్ బెస్సెల్ ఆకాశంలో దీని మార్గంలో వస్తున్న మార్పులను పరిశీలించి సిరియస్ ఒంటరి నక్షత్రం కాదని, దానికి మరొక సహచరతార ఉంటుందని [43]ఊహించడమే కాకుండా ఈ రెండు నక్షత్రాలు ఒకదాని చుట్టూ మరొకటి తిరిగేందుకు 50 సంవత్సరాలు పడుతుందని కూడా ఖచ్చితంగా లెక్కించగలిగాడు.
1862 జనవరి 31లో అల్వాన్ గ్రాహమ్ క్లార్క్ అనే అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు, టెలిస్కోప్ తయారీదారుడు మొదటిసారిగా దీని సహచరతారను (సిరియస్ B) టెలీస్కోప్ లో చూసాడు. డెర్బోర్న్ అబ్జర్వేటరీ కోసం నిర్మిస్తున్న అతి పెద్ద రిఫ్రాక్టర్ టెలిస్కోప్ కు సంబంధించి 18.5 అంగుళాల ద్వారాన్ని పరీక్షిస్తున్నప్పుడు ఇది జరిగింది.[44] తరువాత మార్చి 8 న సిరియస్ B కనిపిస్తున్న విషయాన్ని చిన్న టెలీస్కోప్ లతో కూడా నిర్ధారించారు.[45]
1915 లో మౌంట్ విల్సన్ అబ్జర్వేటరీలో వాల్టర్ సిడ్నీ ఆడమ్స్ అనే అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త 60-అంగుళాల రిఫ్లెక్టర్ ను ఉపయోగించి, సిరియస్ B యొక్క వర్ణపటాన్ని (స్పెక్ట్రం) అధ్యయనం చేసాడు ఇది మందకొడిగా (faint) వున్న తెల్లటి నక్షత్రం అని నిర్ణయించాడు.[46] భూమి కంటే సైజులో కొంచెం పెద్దదిగా ఉన్నప్పటికీ, ఒక ప్రమాణ ఉపరితల విస్తీర్ణాన్నీ పరిగణిస్తే మాత్రం, సూర్యుని కంటే సిరియస్ B నక్షత్రం యొక్క ఉపరితలం చాలా ఉజ్వలంగా ఉంటుంది అని కనుగొన్నాడు.
హబుల్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించి, ఖగోళ శాస్త్రజ్ఞులు సిరియస్ B నక్షత్రం దాదాపుగా భూమి వ్యాసంతో సమానమైన వ్యాసాన్ని (12,000 కి.మీ.), సూర్యుని ద్రవ్యరాశితో సమానమైన ద్రవ్యరాశిని (సూర్యుని ద్రవ్యరాశిలో 102%) కలిగివుందని నిర్ణయించారు.
సిరియస్ జంట నక్షత్ర వ్యవస్థలో రెండు తెల్లటి నక్షత్రాలున్నాయి. వీటిలో అత్యంత ప్రకాశమానంగా కనిపిస్తున్న దానిని సిరియస్-A నక్షత్రంగా వ్యవహరిస్తారు. ఇది A1V వర్ణపట తరగతికి చెందిన ఉజ్వలమైన నక్షత్రం. నక్షత్ర పరిణామ క్రమంలో ఇది సూర్యడు లాంటి దశలో ఉండటం వలన దీనిని ప్రధాన క్రమంలో వున్న నక్షత్రం (Main Sequence Star) గా పేర్కొంటారు. దీనర్ధం సూర్యుడి వలె ఈ నక్షత్రం కూడా తన కేంద్రభాగం (Core) లో జరిగే హైడ్రోజన్ అణువుల సంలీన (Fusion) ప్రక్రియ ద్వార అపారమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని ఉపరితల ఉష్ణోగ్రత 9,940°K. [13]
దీని సహచర నక్షత్రం సిరియస్-B. సుమారు 8.44 దృశ్య ప్రకాశం పరిమాణంతో బాగా కాంతివిహీనంగా కనిపించే సిరియస్ B నక్షత్రం DA2 వర్ణపట తరగతికి చెందిన వైట్ డ్వార్ఫ్ నక్షత్రం (White Dwarf Star- శ్వేత కుబ్జ తార). అంటే ఇది తన నక్షత్ర పరిణామ క్రమంలో ప్రధాన క్రమ దశను దాటిపోయి చివరకు ఒక తెల్లని మరుగుజ్జు నక్షత్రంగా మారిపోయిన నక్షత్రం. అంటే సిరియస్-B ను ఒక చిన్నపాటి గ్రహ పరిమాణంలో కుచించుకు పోయిన నక్షత్రంగా భావించవచ్చు.
జంట తారలైన సిరియస్-A , సిరియస్-B నక్షత్రాలు ఒకదానికొకటి సుమారు 20 ఖగోళ ప్రమాణాల (ఆస్ట్రానమికల్ యూనిట్ల) దూరంలో ఉంటూ, ఒక కక్ష్యలో ఒకదాని చుట్టూ మరొకటి పరిభ్రమిస్తున్నాయి. దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ఇవి తిరుగుతున్నప్పుడు ఈ రెండింటి మధ్య దూరం 8.2, 31.5 ఆస్ట్రానమికల్ యూనిట్ల మధ్య మారుతూ ఉంటుంది. వీటి ఆవర్తన కాలం 49.9 సంవత్సరాలు.[47] కక్ష్యలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ రెండు నక్షత్రాలు కనిష్టంగా 3 ఆర్క్ సెకండ్లు, గరిష్టంగా 11 ఆర్క్ సెకండ్ల కోణీయ దూరాలలోకి వస్తాయి. అవి కక్షలో ఒకదానికొకటి దగ్గరగా వచ్చినపుడు ఉజ్వలమైన సిరియస్ A నక్షత్ర వెలుగులో తెల్లటి వైట్ డ్వార్ఫ్ ను వేరు చేసి పరిశిలించడం చాలా కష్టసాధ్యమైన విషయం. ఇది సాధ్యం కావాలంటే కనీసం 30 సెం.మీ. ద్వారంతో కూడిన టెలిస్కోప్ తో పాటు అద్భుతమైన దృశ్య పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఒక జంట నక్షత్ర వ్యవస్థలోని రెండు జంట తారలు కక్ష్యలో ప్రయాణిస్తున్నప్పుడు వాటి మధ్య దూరం క్రమేణా క్షీణిస్తూ కనిష్ట స్థాయికి చేరుకొంటుంది. ఈ స్థితిని పరిదూరం (periastron) అంటారు. తరవాత కక్ష్యలో వాటి మధ్య దూరం క్రమేణా పెరుగుతూ వస్తూ ఒక దశలో అవి ఒకదానికొకటి అతి గరిష్ట దూరం లోనికి చేరుకోవడాన్ని అపదూరం (apastron) అని పేర్కొంటారు. 1994 లో కక్ష్యలో పయనిస్తున్న సిరియస్-A , సిరియస్-B నక్షత్రాలు ఒకదానికొకటి అతి సమీపంలోకి రావడం (పరిదూరం) జరిగింది. అప్పటినుంచి ఈ జంట తారల మధ్య దూరం కక్ష్యలో క్రమేణా పెరుగుతూ వస్తుండటంతో ఈ రెండు నక్షత్రాలను టెలిస్కోప్ లో వేర్వేరుగా మరింత స్పష్టంగా గుర్తించడానికి వీలు కలిగింది.[48]
ఈ జంట నక్షత్ర వ్యవస్థ యొక్క వయస్సు 23 కోట్ల సంవత్సరాల వరకు ఉండవచ్చని ఒక అంచనా. ఈ నక్షత్ర వ్యవస్థ ప్రారంభంలో రెండు ప్రకాశవంతమైన నీలి-తెలుపు రంగు నక్షత్రాలు వుండేవని, ఇవి ఒకదాని చుట్టూ మరొకటి ఒక దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమించేవని ఊహించారు. ఆ దశలో ఇవి ఒకదాని చుట్టూ మరొకటి తిరగడానికి 9.1 సంవత్సరాల కాల వ్యవధి పట్టేది.[49] సిరియస్ A నక్షత్రం సూర్యునితో పోలిస్తే కొద్దిగ తక్కువ ద్రవ్యరాశితో, సిరియస్ B నక్షత్రం సూర్యుని కంటే 5 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశితో వుండేది. అందువలన తమ జీవిత పరిణామక్రమంలో ఈ నక్షత్రాలు అనేక మార్పులకు లోనయ్యాయి. భారీ ద్రవ్యరాశి గల సిరియస్ B నక్షత్రం, ప్రధాన క్రమ దశ (Main Sequence), రెడ్ జెయింట్ దశ (Red Giant) లు దాటిపోయి ప్రస్తుతానికి డ్వార్ఫ్ దశలోనికి చేరుకొంది. కొద్దిగ తక్కువ ద్రవ్యరాశి వున్న సిరియస్ A నక్షత్రం మాత్రం ఇప్పటికీ ప్రధాన క్రమదశ లోనే కొనసాగుతూ వుంది.
ప్రధాన క్రమదశలో వున్నప్పుడు, సూర్యుని కంటే 5 రెట్లు ఎక్కువగా భారీ ద్రవ్యరాశితో వున్న సిరియస్ B నక్షత్రం, తన హైడ్రోజన్ ఇంధన వనరులను పూర్తిగా వినియోగించుకోవడం జరిగింది. దాని లోని హైడ్రోజన్ నిల్వలు అయిపోయిన వెంటనే కోర్ భాగం కుచించుకుపోవడం, అదే సమయంలో బాహ్య కర్పరం విస్తరించడం ప్రారంభమైంది. విస్తరిస్తున్న బాహ్య కర్పర కారణంగా సిరియస్ B నక్షత్ర వ్యాసం కూడా క్రమేణా పెరుగుతూ జెయింట్ దశ లోనికి చేరుకొంది. ఈ దశలో ఎరుపు రంగులో ప్రకాశించడం వలన దీనిని రెడ్ జెయింట్ నక్షత్రం (Red Giant Star)గా పిలుస్తారు. ఈ విస్తరిస్తున్న బాహ్య కర్పరం క్రమేణా పోగొట్టుకోవడం, మిగిలిన కోర్ భాగం తనలో తాను బాగా కుదించుకుపోవడడం జరిగింది. ఫలితంగా ఈ చిన్న కోర్ అంతర్భాగంలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగి కోర్ లోపలి భాగంలోని హీలియం కేంద్రక సంలీనం చెంది మరింత బరువైన మూలకాలు (కార్బన్ తదితర మూలకాలు) గా మారుతుంది. హీలియం సంలీన చర్యల ఫలితంగా విడుదలైన శక్తి వలన కుదించుకుపోయిన చిన్న కోర్ భాగం ప్రకాశిస్తూ వైట్ డ్వార్ఫ్ నక్షత్రంగా మారిపోయింది. చివరలో ఆ చిన్న కోర్ లోని హీలియం నిల్వలు కూడా తరిగిపోగానే, ఇక ప్రకాశించలేక క్రమేణా తనలోని ఉష్ణాన్ని పోగొట్టుకుంటూ అత్యంత సాంద్రతర గ్రహంలా మారిపోతుంది.
విశ్వంలో ఉద్గారమవుతున్న పరారుణ వికిరణాన్ని సర్వే చేస్తున్న స్పేస్ అబ్జర్వేటరీ (IRAS) వారు తెలియచేసిన ప్రకారం సిరియస్ జంట నక్షత్ర వ్యవస్థ ఊహించిన స్థాయి కన్నా అధికంగా పరారుణ వికిరణాన్ని (Infrared Radiation) వెలువరిస్తున్నది. ఇది ఈ నక్షత్ర వ్యవస్థలో గల ధూళి (dust) కి సంబందించిన ఒక సూచన కావచ్చు. ఏది ఏమైనప్పటికీ జంట తారలకు సంబంధించినంత వరకూ దీనిని ఒక అసాధారణమైన విషయంగా భావిస్తున్నారు.[34]
సిరియస్ జంట నక్షత్రాలలో ప్రధానమైనది, మహోజ్వలంగా ప్రకాశించేది సిరియస్-A నక్షత్రం. దీని ద్రవ్యరాశి సూర్యునితో పోలిస్తే రెండు రెట్లు పెద్దది.[50] [51] [52]వ్యాసం సూర్యునితో పోలిస్తే 1.71 రెట్లు పెద్దది. అంటే దీని ఘనపరిమాణం సూర్యునితో పోలిస్తే సుమారు 5 రెట్లు పెద్దదిగా వుంటుంది.
సిరియస్-A నక్షత్రం కూడా సూర్యుని వలె తన చుట్టూ తాను భ్రమణం చేస్తూ వుంటుంది. దీని భ్రమణ వేగం (Rotational Velocity) 16 కి.మీ./సెకండ్ గా అంచనా వేయబడింది.[15] సాపేక్షకంగా ఇంత తక్కువ భ్రమణ వేగం వుండటం వల్ల ఈ నక్షత్రం యొక్క మధ్య రేఖ అంచులు బల్లపరుపుగా అయ్యే అవకాశం ఎక్కువగా వుండదు.[53] ఇదే పరిమాణంలో వున్న వేగా నక్షత్రంను తీసుకొంటే దాని భ్రమణ వేగం అత్యధికంగా 274 కి.మీ./సెకండ్ వుండటం వల్ల, ఆ వేగా నక్షత్ర మధ్య రేఖ చుట్టూవున్న భాగం గణనీయంగా ఉబ్బెత్తుగా మారుతుంది. [54]సిరియస్-A నక్షత్ర ఉపరితలంపై బలహీనమైన అయస్కాంత క్షేత్ర ప్రభావాన్ని గుర్తించారు.[55]
నక్షత్రాల ఆవిర్భావ నమూనాల ప్రకారం పరమాణుమేఘాలు (molecular cloud) కుప్పకూలిపోతున్నప్పుడు నక్షత్రాలు ఏర్పడతాయి. ఆ తరువాత సుమారు కోటి సంవత్సరాల అనంతరం కేవలం న్యూక్లియర్ చర్యల ద్వారా మాత్రమే దాని అంతర్గత శక్తి ఉత్పత్తి అవుతుంది. సంవహన ప్రక్రియ (Convective) లో భాగంగా, ఈ నక్షత్రం యొక్క కోర్ భాగం కార్బన్-నైట్రోజన్-ఆక్సిజన్ (CNO) చక్రం ద్వారా ఈ అంతర్గత శక్తిని ఉత్పత్తి చేస్తుంది.[56]ప్రస్తుతం సిరియస్-A నక్షత్రం ప్రధాన క్రమదశలో వుంది. మరో మరో వంద కోట్ల సంవత్సరాలు గడిచేసరికి సిరియస్-A కోర్ భాగంలో వున్న హైడ్రోజన్ వాయు నిల్వలు పూర్తిగా హరించుకుపోతాయి. దానితో ఈ నక్షత్రం రెడ్ జెయింట్ దశ లోనికి ప్రవేశిస్తుంది. ఆ తరువాత క్రమేణా తన ఉష్ణాన్ని పోగొట్టుకొంటూ (చల్లబడుతూ), కుచించుకుపోతూ చివరికి ఒక సాధారణ గ్రహ పరిమాణం స్థాయికి చేరుకుంటుంది. ఒక గ్రహ పరిమాణ స్థాయిలో కుచుంచుకుపోయిన మరుగుజ్జు నక్షత్రాన్ని వైట్ డ్వార్ఫ్ లేదా శ్వేత కుబ్జ తార (white dwarf star) అంటారు. అంటే ప్రస్తుతం ప్రధాన క్రమదశలో వున్న సిరియస్-A నక్షత్రం భవిష్యత్తులో రెడ్ జెయింట్ దశ లోనికి, చిట్టచివరకు వైట్ డ్వార్ఫ్ దశలోకి చేరుతుంది.
సిరియస్-A నక్షత్రం యొక్క వర్ణపటంలో (spectrum) లోహ శోషణ రేఖలు (metallic absorption lines) గాఢంగా కనిపించడం వలన దీనిని Am నక్షత్రంగా వర్గీకరించారు. [57] ఈ రేఖల వల్ల సిరియస్-A నక్షత్రంలో హీలియం కన్నా బరువైన మూలకాలు (ఇనుము వంటి లోహ మూలకాలు) వృద్ధి చెందుతున్నాయని తెలుస్తుంది.[56] [34]
సూర్యుడితో పోలిస్తే సిరియస్-A నక్షత్రంలో హైడ్రోజన్ కు సంబంధించి ఇనుము యొక్క సహజ లాగరిథమిక్ [Log (Fe/H)] విలువ 0.5 గా వుంది.[14] అంటే Fe/H విలువ 3.16 కి సమానం. దీనర్ధం సూర్యనితో పోలిస్తే, సిరియస్-A నక్షత్ర ఉపరితలంలో ఇనుము 3.16 రెట్లు అధికంగా వుంది. అయితే ఇలా ఉపరితలంలో లోహ మూలకాలు అధికంగా ఉండటమనేది మొత్తం నక్షత్రానికంతటికీ వర్తిస్తుందని చెప్పలేము. దీనికి బదులు ఇనుము లాంటి భారలోహ మూలకాలు దీని ఉపరితలం పైకి విరజిమ్మబడుతున్నాయని భావించవచ్చు.[56]
సిరియస్ జంట నక్షత్రాలలో కాంతి విహీనంగా తెల్లగా మెరిసే నక్షత్రం సిరియస్-B. ప్రస్తుతం ఇది సూర్యుని కంటే వ్యాసంలో సుమారు 120 రెట్లు చిన్నది. రమారమి భూమి సైజులో వుంటుంది. అయితే దీని ద్రవ్యరాశి మాత్రం సూర్యునితో దాదాపు సమానంగా (98%) ఉంటుంది. ఇలా సూర్యునితో సమానమైన ద్రవ్యరాశిని భూమి ఘనపరిణామంతో సమానమైన ఘనపరిణామంలో దట్టంగా కుదించడం వలన,[39] సిరియస్-B నక్షత్రం నమ్మశక్యం కానంత అపారమైన సాంద్రతను కలిగి వుంటుంది. ఫలితంగా సిరియస్-B నక్షత్రం మీద గురుత్వాకర్షణ శక్తి భూమి మీద కన్నా సుమారు 3,50,000 రెట్లు బలంగా వుంటుంది. దీనర్ధం భూమి మీద 3 గ్రాముల బరువున్న పదార్ధం సిరియస్-B నక్షత్రం మీద ఒక టన్ను (1000 కి.గ్రా.) వరకూ వుంటుంది.
మనకు తెలిసిన భారీ వైట్ డ్వార్ఫ్ నక్షత్రాలలో ఇది ఒకటి. అంతేగాక భూమికి అతి సమీపంలో వున్న వైట్ డ్వార్ఫ్ కూడా ఇదే. ఇది తన బాహ్య కర్పరాన్ని (outer shell) పోగొట్టుకొని కేవలం కేంద్రభాగం (Core) మాత్రమే మిగిలి వున్న మరుగుజ్జు నక్షత్రం. దీని కోర్ భాగంలోని హీలియం ఇంధనమంతా హరించుకుపోయివుంటుంది. దీనిలో కేంద్రక చర్యలు జరగడం ఆగిపోయినప్పటికీ, అంతర్గతంగా అత్యదిక ఉష్ణంతో వున్న కోర్ భాగాన్ని కలిగి వుండటం వలన వైట్ డ్వార్ఫ్ నిర్విరామంగా వెలుగుతూ వుంది. ప్రకాశవంతమైన ఎక్స్ రే మూలాలు కలిగి వున్నందువల్ల, సిరియస్-B నక్షత్రం దాని సహచర ప్రకాశమాన నక్షత్రంతో పోలిస్తే మరింతగా వెలిగిపోతుందని చంద్ర ఎక్స్ రే అబ్జర్వేటరీ యొక్క చిత్రాలు కూడా తెలియచేస్తున్నాయి.[58]
దీని ఉపరితల ఉష్ణోగ్రత 25,200°K.[12] అంతర్గతంగా ఉష్ణాన్ని జనింప చేసే మూలాలు లేనందువల్ల ఇది తనలో మిగిలి పోయిన ఉష్ణాన్ని వికిరణ శక్తి రూపంలో అంతరిక్షంలోనికి వెదజల్లుతూ క్రమేణా చల్లబడుతూ వస్తుంది.[59] నక్షత్రాలు తమ జీవిత పరిణామ క్రమంలో వరుసగా ప్రధాన క్రమదశ, రెడ్ జెయింట్ దశ లను దాటిన తరువాత మాత్రమే వైట్ డ్వార్ఫ్ దశను చేరుకొంటాయి. ప్రస్తుతం 23 కోట్ల సంవత్సరాల వయస్సు గల సిరియస్ B నక్షత్రం, తన సగం వయస్సులోనే (12 కోట్ల సంవత్సరాలకు పూర్వమే ) వైట్ డ్వార్ఫ్ నక్షత్రంగా మారింది.[12] వైట్ డ్వార్ఫ్ గా మారక మునుపు ప్రధాన క్రమదశలో వున్నప్పుడు సిరియస్ B నక్షత్రం సూర్యుని కంటే 5 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశితో[12], B తరగతికి చెందిన నీలి-తెలుపు నక్షత్రంగా వుండేదని భావిస్తున్నారు.[60] [61] ఇది రెడ్ జెయింట్ దశలో కొనసాగుతున్నప్పుడు, దాని సహచర నక్షత్రం సిరియస్ A నుండి లోహత్వాన్ని (metallicity) సంతరించుకొని ఉండవచ్చు.
పూర్వ నక్షత్ర (progenitor) దశలో జరిగిన హీలియం సంలీన చర్యల వలన సిరియస్ B నక్షత్రంలో బరువు మూలకాలు (కార్బన్, ఆక్సిజన్ వంటివి) ఉత్పత్తి అయ్యాయి. అందువల్ల ప్రాధమికంగా ఈ నక్షత్రం కార్బన్-ఆక్సిజన్ మిశ్రమాన్ని కలిగి ఉంది.[12] అయితే ఈ నక్షత్రానికి గల అపారమైన గురుత్వాకర్షణ శక్తి కారణంగా బరువైన మూలకాలు దీని ఉపరితలంపై పరుచుకోగా, వాటి పై భాగంలో తేలికైన మూలకాలు పేరుకొన్నాయి.[62] ప్రస్తుతం సిరియస్ B నక్షత్రం యొక్క బాహ్య వాతావరణం ఇంచుమించుగా స్వచ్చమైన, తేలికైన హైడ్రోజన్ తో నిండి వుంది. వర్ణపటంలో ఇది తప్ప మరేతర మూలకాల జాడ కనిపించదు.[63]
పురాతన గ్రీకు పదం సిరియోస్ (Σείριος "ప్రకాశించే"), నుంచి సిరియస్ నక్షత్రానికి ఆ పేరు వచ్చింది. కానిస్ మేజర్ (బృహల్లుబ్దకం లేదా పెద్ద కుక్క) అనే నక్షత్రరాశిలో ప్రముఖంగా కనిపించే ఈ నక్షత్రాన్ని డాగ్ స్టార్ (Dog Star) అని కూడా పిలుస్తారు.[18] సిరియస్ నక్షత్రానికి సూర్యగమనంతో సంబంధం వుంది. ఉత్తరార్ధ గోళంలో వేసవిలో సూర్యునితో పాటు ఉదయించి, సూర్యునితో పాటు అస్తమిస్తుంది. అదే విధంగా దక్షిణార్ధ గోళంలో శీతాకాలంలో సూర్యునితో పాటు సిరియస్ ఉదయించి, సూర్యునితో పాటు అస్తమిస్తుంది. ప్రాచీనకాలం నుండి ఈ నక్షత్రం ఋతువుల ఆగమనానికి ఒక సూచికగా, రాత్రివేళలలో నావికులకు దిక్కులను సూచించే నక్షత్ర సూచికగా ఎంతోగానో ఉపయోగపడింది.
నాలుగు వేల సంవత్సరాలకు పూర్వమే ప్రాచీన ఈజిప్షియన్లకు ఈ నక్షత్రం గురించి తెలుసు. ముఖ్యంగా వేసవిలో సూర్యునితో పాటు ఉదయించే సిరియస్ నక్షత్రం, నైలు నది వరద రాకకు గుర్తుగా ఉండేది. ఇది కనిపించే సమయాన్ని బట్టి ప్రాచీన ఈజిప్షియన్లు ముందుగానే నైలూ నదికి వరదలు ముంచెత్త బోయేవని అంచనా వేసేవారు. నైలూ నదీ వరదలు మీద వారి వ్యవసాయిక నాగరికతా వృద్ధికి ఆధారపడటం వల్ల, వారు కేలిండర్ ను కూడా సిరియస్ నక్షత్ర గమనానికి అనుగుణంగా రూపొందించుకున్నారు.
ప్రాచీన గ్రీకులకు వేసవిలో సూర్యోదయం వేళ ఈ నక్షత్రం ప్రస్ఫూటంగా కనిపించేది. దానితో వేసవి కాలం ప్రారంభమైనట్లు భావించేవారు. వారు సిరియస్-సూర్యుల జంట ఆగమనాన్ని వేసవికి సూచనగా భావించి, మండు వేసవి రోజులను డాగ్ డేస్ (Dog days) గా పిలిచేవారు.[64] పాచీన రోమన్లు వేసవిలో పునర్దర్శనమయ్యే సిరియస్ రాకను పురస్కరించుకొని ఏప్రిల్ 25 తారీకులలో రోబిగో దేవతకు కుక్కను బలిగా ఇచ్చి వ్యవసాయిక ఉత్సవం జరుపుకునేవారు. సిరియస్ పునర్దర్శనం, వారి గోధుమ పంటకు హానికరమైన గోధుమ పొట్టు తెగులును సోకకుండా చేస్తుందని విశ్వసించేవారు.[65]
దక్షిణార్ధగోళంలో ఫసిఫిక్ మహా సముద్రంలో గల అనేక దీవుల మధ్య ప్రయాణం చేసే పోలినేషియన్లకు, రాత్రిపూట దారి చూపడానికి సిరియస్ నక్షత్రం ఎక్కువగా ఉపయోగపడేది. క్షితిజానికి దిగువన కనిపించే ఈ ఉజ్వలమైన నక్షత్రం వారికి నౌకాయాన సందర్భాలలో దీవులు గుర్తుపట్టడానికి నక్షత్ర సూచిగా ఉపయోగపడింది. ప్రకాశవంతమైన సిరియస్ నక్షత్రం పోలినేషియన్లకు అక్షంశ గుర్తుగా కూడా ఉపయోగపడేది. ఉదాహరణకు సిరియస్ నక్షత్రం యొక్క దిక్పాతం (declanation) సుమారుగా 17°. ఇది ఫిజీ ద్వీప సముదాయం యొక్క అక్షంశం తో చక్కగా సరిపోయేది. అందువల్ల ఆ దీవుల మీదుగా ప్రతీ రాత్రి సిరియస్ పయనిస్తూ కనిపించేది.[66] గ్రీకులకు వేసవి ఆగమన సూచనగా వున్నట్లే దక్షిణార్ధ గోళంలోని మౌరి తదితర పోలినేషియన్ జాతులవారికి సిరియస్ పునర్దదర్శనంతో శీతాకాలం ప్రారంభమయ్యేది. హవాయిలో దీనిని "క్వీన్ ఆఫ్ హెవెన్" (స్థానిక భాషలో kaulua) గా వ్యవహరించి శీతాకాలపు ఆయనంతం (Winter solstice) లో దీని పరాకాష్టతను ఒక ఉత్సవంగా జరుపుకునేవారు.
సంస్కృతంలో ఈ నక్షత్రాన్ని మృగవ్యాధ (లేడి వేటగాడు) అని వ్యవహరిస్తారు. పేరుకు తగినట్లుగా మృగవ్యాధ నక్షత్రం రుద్రుడిని (శివుడిని) సూచిస్తుంది.[67][68] మలయాళంలో మకరజ్యోతి గా ప్రస్తావించబడిన ఈ నక్షత్రం శబరిమలై పుణ్యక్షేత్రంలో మతపరంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగివుంది.[69] మధ్యయుగాల నాటి యూరోపియన్, అరబ్బుల జ్యోతీష శాస్త్రాలలో మంత్రశక్తులను ప్రసాదించగల 15 మహిమాన్విత నక్షత్రాలలో (Behenian fixed stars) ఒకటిగా సిరియస్ ను భావించేవారు.[70] జునిఫర్ వృక్షాన్ని, బెరిల్ (గరుడ పచ్చ) రాయిని ఈ నక్షత్రానికి ప్రతీకగా అరబ్బులు భావించేవారు.
బ్రెజిల్ దేశపు జెండాపై కనిపించే 27 నక్షత్రాలలో సిరియస్ ఒకటి, ఇది ఆ దేశం లోని మాటో గ్రోస్సో రాష్ట్రాన్ని సూచిస్తుంది.[71]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.