కాంతి వేగ పౌనఃపున్యాల (Frequency)తో విద్యుత్‌ అయస్కాంత (Electro Magnetic) తరంగాలను మాడ్యులేషన్ చేయటం ద్వారా తీగల ఆధారము లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేయు ప్రక్రియను దూర శ్రవణ ప్రక్రియ (Radio Transmission) అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అంటారు. మొదటిరోజులలో వాల్వులను ఉపయోగించి, రేడియోలను తయారు చేసేవారు. అవి ఎక్కువ విద్యుత్‌ను వాడేవి, పరిమాణంలో కూడా చాలా పెద్దవిగా ఉండేవి. ఒక చోట మాత్రమే ఉంచి వినవలసి వచ్చేది. 1960లు వచ్చేటప్పటికి, ట్రాన్సిస్టరు కనిపెట్టబడి, ఆ ట్రాన్సిస్టర్ లను వాడిన రేడియోలు వాడకంలోకి వచ్చాయి. వీటిని ట్రాన్‌సిస్టర్ రేడియోలు అని పిలవటం మొదలు పెట్టారు. ఇవి విద్యుత్‌ను చాలా తక్కువగా వాడుకుని పనిచేయగలవు. పైగా, ఘటము (బ్యాటరీ-Battery)తో కూడా పనిచేయగలవు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఈ ట్రాన్సిస్టర్ సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెంది, రేడియోలు పరిమాణంలో చిన్నవి, అతి చిన్నవిగా మారిపోయాయి. జేబులో పట్టే రేడియోలు (Pocket Radios) వచ్చినాయి. ఇప్పుడు విడుదలవుతున్న ప్రతీ కంపెనీ మొబైల్స్ లోనూ రేడియో అప్లికేషను తప్పనిసరి అయిపోయింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం నిర్వహించబడుతుంది.[1]

త్వరిత వాస్తవాలు ఇతర పేర్లు, ఉపయోగాలు ...
రేడియో
Thumb
రేడియో
ఇతర పేర్లునిస్తంత్రీ ప్రసారం, ఆకాశవాణి
ఉపయోగాలునిస్తంత్రీ విధానంలో సమాచార ప్రసారం
ఆవిష్కర్తమార్కోనీ
సంబంధిత అంశాలుట్రాన్సిస్టర్
మూసివేయి

చరిత్ర

మాక్స్ వెల్ ప్రయోగం

ప్రయోగాత్మక భౌతిక శాస్త్ర పరిశోధనల కోసం డ్యూక్ ఆఫ్ దేవాంషైర్ ఒక పెద్ద భవనాన్ని నిర్మించి 1860 దశకంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి అప్పగించాడు. దీనికి కావెండిష్ ప్రయోగ శాల అనే పేరు వాడుకలోకి వచ్చింది. దీని తొలి అధ్యక్షుడిగా జేమ్స్ మాక్స్ వెల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆయనను ఇలా గౌరవించిన గొప్ప శాస్త్రజ్ఞులలో ఎవరికీ విద్యుచ్ఛక్తి, అయస్కాంతత్వాలకు సంబంధించి ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాల్లో నమ్మకం కుదరలేదు. కాంతి తరంగాలు విద్యుదయస్కాంత బలాలకు సంబంధించిన తరంగాలే అని మాక్స్ వెల్ చెప్పడాన్ని కూడా వాళ్ళెవరూ అంగీకరించలేదు. ఈ సిద్ధాంతం సరియైనదే అని నిరూపించబడడానికి పదేళ్ళు ముందుగానే మాక్స్ వెల్ కన్ను మూశాడు.

హెర్ట్ జ్ ప్రయోగం

దీన్ని నిరూపించిన వాడు హెర్ట్జ్ అనే జర్మనీ భౌతిక శాస్త్రవేత్త. 1887 నవంబరులో అతడు ప్రయోగశాలలో ఒక వైపున "విద్యుత్ ప్రేరణ యంత్రాన్ని" మరోవైపున "అనునాదిని" నీ అమర్చాడు. ఒక తీగ చివరల్లో రెండు లోహపు బంతులుంటాయి. తీగను వృత్తాకారంగా వంచి, బంతుల మధ్య సుమారు రెండు సెంటీమీటర్ల దూరం ఉండేలా చేస్తారు. అది అనునాదినిగా పనిచేస్తుంది. ప్రేరణ యంత్రంలో పెద్ద లోహపు పలకలుంటాయి. దీనికీ, అనునాదినికీ మధ్య గాలి తప్ప మరే సంబంధం ఉండదు.

ప్రేరణ యంత్రంలో లోహపు పలకలకు ఏకాంతర విద్యుత్ ను సంధిస్తే, వాటి నుంచి విద్యుదయస్కాంత తరంగాలు ఉత్పత్తి అవుతాయని, ఇవి ప్రయోగశాలలో ఒక వైపు నుంచి మరో వైపుకు కాంతి వేగంతో ప్రయాణం చేస్తాయనీ, ఈ తరంగాలు అనునాదిని పై పడినపుడు బంతుల మధ్య చిన్న విస్ఫులింగాలు (sparks) ప్రసరిస్తాయని హెర్ట్జ్ కనుగొన్నాడు. ఈ ప్రయోగం మాక్స్ వెల్ సిద్ధాంతాన్ని ఋజువు పరిచిందని హెర్ట్జ్ చాలా సంతోషపడ్డాడు. విద్యుదయస్కాంత తరంగాలు ఉత్పత్తి కావటం, అవి కొంత దూరం ప్రసరించాక గ్రహించబడడం మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగంలో జరిగాయి. హెర్ట్జ్ తయారుచేసిన ఈ పరికరాన్ని మొదటి వైర్ లెస్ ప్రసారిణిగా, గ్రాహకంగా పరిగణించవచ్చు.

37 ఏళ్ళ ప్రాయంలో హెర్ట్జ్ చనిపోయేనాటికి విత్తనం మొలకెత్త సాగింది. హెర్ట్జ్ తరంగాలు, కాంతి ఈ రెండూ విద్యుదయస్కాంత తరంగాలే అనీ, రెండింటికీ తేడా కాంతి తరంగ దైర్ఘ్యం లోనే ఉంటుందనీ భౌతిక శాస్త్రవేత్తలందరూ అంగీకరించక తప్పలేదు. కాంతినైనా చూడగలుగుతాం. కానీ ఇతర విద్యుదయస్కాంత తరంగాలను గుర్తించటానికి ప్రత్యేక పరికరాలు వాడాల్సి ఉంటుంది.

బ్రాన్లీ ప్రయోగం

కాథలిక్ విశ్వవిద్యాలయంలో ఎడ్వర్డ్ బ్రాన్లీ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశాడు. లోహం పొడి (Metal fillings) పై విద్యుదయస్కాంత తరంగాలు పడినప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తుందని 1890వ సంవత్సరంలో అతడు గమనించాడు. పొడిలోని కణాల మధ్య ఖాళీ స్థలాలుంటాయి కాబట్టి, దాని గుండా విద్యుత్తు ప్రవహించదు. కానీ విద్యుదయస్కాంత తరంగాలు పడినప్పుడు మాత్రం కణాలన్నీ కలుసుకొని పోయి విద్యుత్ వాహకంగా ప్రవర్తిస్తుంది. కణాలు విడిపోయేలా పొడిని బాగా కదిలించేంతవరకు అది వాహకం గానే ఉంటుంది.

Thumb
ఏఎం,ఎఫ్ఎం మాడ్యులేటెడ్ రేడియో తరంగాల పోలిక

గాజు నాళంలో ఉంచిన లోహం పొడి విద్యుదయస్కాంత తరంగాలను గుర్తించడానికి చాలా ఉపకరిస్తుందన్నమాట. దీనికి బ్రాన్లీ "కొహెరర్" అని పేరు పెట్టాడు. ఈ తరంగాలు ఉపయోగానికి సంబంధించి అనేక ప్రయోగాలు జరిగాయి. టెలిగ్రాఫ్ సంకేతాలను ప్రసారం చేయటానికి వీటిని వాడవచ్చునని లార్ట్ కెల్విన్ సూచించాడు. లోహపు తీగలను డాబా పై ఉంచితే విద్యుదయస్కాంత తరంగాలను ఇంకా ఎక్కువ దూరం నుంచి గుర్తించటానికి వీలవుతుందని రష్యాకి చెందిన ప్రొఫెసర్ పావోవ్ కనుగొన్నాడు. దీన్ని ఇప్పుడు మనం ఏరియల్ అని పిలుస్తున్నాము. ఇలాంటి ఏరియల్ని మోర్స్ టెలిగ్రాఫ్ గ్రాహకానికి సంధించి కొన్ని మైళ్ళ దూరంలో మెరిసే మెరుపులను బ్రాన్లీ గుర్తించగలిగాడు.

మార్కోనీ ఆవిష్కరణ

ఈ ప్రయోగాలన్నీ మార్కోనీ పరిశోధనలకు దోహద పడ్డాయి. బోలోనా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రీగ్ అధ్వర్యంలో ఈ ఇరవయ్యేళ్ళ యువకుడు కొన్ని నెలల పాటు కృషి చేశాడు. తల్లిదండ్రులతో బాటు నివసిస్తున్న తన ఇంటి పై అంతస్తు లోనే అతని ప్రయోగశాల ఉండేది. ఒకరోజు అర్థరాత్రి సమయంలో తల్లిని నిద్రలేపి ఓ తమాషా చూపిస్తానని పైకి తీసుకెళ్ళాడు. ఒకచోట మోర్స్ కీ (key) 12 అడుగుల దూరంలో ఎలక్ట్రిక్ బెల్ ని అమర్చాడు.కీని అదిమినప్పుడల్లా గంట మోగడం ప్రారంభించింది. మధ్యలో తీగలు లేకపోయినా గంట మోగటం నిజంగా ఆశ్చర్యకరమే. వైర్ లెస్ విధానం ద్వారా తొలి సంకేతాన్ని ప్రసారం చేసిన ఈ ప్రయోగం గొప్ప చారిత్రాత్మక సంఘటన అని చాలాకాలం తరువాత మార్కోనీ తల్లి గ్రహించగలిగింది.

మార్కోనీ తన పరికరాల్ని ఇంటి ముందుండే తోటలోకి మార్చాడు. క్రమంగా సంకేతాలు వెళ్ళగలిగే దూరాన్ని పెంచుతూ పోయాడు. ఓ చిన్న గుట్ట ఆవలిపైపు దాకా సంకేతాలు వెళ్ళగలిగాయి. సంకేతం ఆవలి వైపున చేరగానే దాన్ని గుర్తించానని తెలియజేయడానికి గాను ఆయన తమ్ముడు గుట్టపై నిలబడి నాట్యం చేసేవాడు. 1896 నాటికి ఈ సంకేతాలు రెండు మైళ్ళ దాకా వెళ్ళగలిగేవి. మార్కోనీ తల్లి వుట్టినిల్లు ఐర్లండ్ అయితే మెట్టినిల్లు ఇటలీ. పరికరాన్ని బ్రిటన్కు తీసుకొని వెడితే బాగుంటుందని ఆమె సలహా యిచ్చింది.

పేటెంట్ హక్కులు

లండన్ వెళ్ళగానే మార్కోనీ వైర్ లెస్ పరికరాన్ని పేటెంట్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించాడు. జనరల్ పొస్టాఫీసులో ప్రధాన ఇంజనీరుగా పనిచేస్తున్న విలియం ప్రీస్ పరికరాన్ని ప్రదర్శించడానికి మార్కోనీకి అనుమతి సంపాదించిపెట్టాడు. ఇంజనీర్లు, విజ్ఞాన శాస్త్రవేత్తలు, వ్యాపార సంస్థల అధిపతులు ఈ ప్రదర్శనకు ఆహ్వానించబడ్డారు. ఇంట్లో తయారు చేసిన మొరటుపరికరాలు ఎలా పనిచేస్తాయో ఏమో అని మార్కోనీ అధైర్య పడ్డాడు. కానీ ప్రయోగం సంపూర్ణంగా విజయవంతమైంది. మరుసటి ప్రదర్శన పదాతిదళం, నావికాదళం అధిపతుల సమక్షంలో జరిగింది. మార్కోనీ పరికరంతో సంకేతాలను ఎనిమిది మైళ్ళ దాకా పంపడానికి వీలయ్యేది.

నీళ్లపైన ప్రయోగం

1897 మేలో తొలి వైర్ లెస్ టెలిగ్రాఫ్ స్టేషను కార్డిఫ్ వద్ద నెలకొల్పబడింది. ఏరియల్ ని వంద అడుగుల ఎత్తులో బిగించారు సంకేతాలు నీళ్ళ మీదుగా ఎలా ప్రయాణిస్తాయో పరిశీలించాలని బ్రిస్టల్ చానల్ మధ్య భాగం నుంచి ప్రసారం ప్రారంభించాడు. మొదట్లో సంకేతాల జాడే కనిపించలేదు. నిరాశ చెందకుండా మార్కోనీ ఎక్కడ లోపముందో పరీక్షించి, పరికరంలో తగిన మార్పులు చేసాడు. సంకేతాలు వచ్చాయి కానీ అవి బలహీనంగాను, లోపభూయిష్టంగానూ ఉండేవి. ఏరియల్ పొడవును పెంచి సంకేతాలను సంతృప్తికరంగా గుర్తించటం జరిగింది. ఈ ప్రయోగాలను పరిశీలించటానికి బెర్లిన్ అధికారులు ప్రొఫెసర్ స్లాచీ, జార్జ్ ఆర్కో అనే ఇద్దరు నిపుణులను పంపించారు కూడా.

ఖ్యాతి

అనతి కాలంలోనే మార్కోనీ ప్రయోగాల విజయ గాథలు ఐరోపా అంతా వ్యాపించాయి. ఎక్కడ చూసినా ప్రజలు ఆయన వినూత్న ఆవిర్భావాన్ని గురించి చర్చించుకోసాగారు. ఇది వరకు ఇంగ్లండ్ లో అతడిని గేలి చేసిన వాళ్ళూ, విమర్శించిన వాళ్ళూ ఇప్పుడు జోహార్లర్పించడం మొదలుపెట్టారు. సముద్రం మీద ప్రయాణం చేస్తున్న ఓడలలో వార్తా ప్రసార సౌకర్యాలు ఏర్పరుచుకునే అవకాశం దగ్గర పడుతోందని సామాన్య ప్రజలకు కూడా నమ్మకం కుదిరింది.

వైర్ లెస్ ప్రసారాలు

క్రమంగా సంకేతాలను ఎక్కువ దూరం ప్రసరించేలా చేయడంలో మార్కోనీ కృతకృత్యుడయ్యాడు. 1898 వేసవిలో సముద్ర మద్యంలో జరిగిన పడవ పందేల గురించి ఎప్పటికప్పుడు వార్తలు పంపడానికి డబ్లిన్ వార్తా పత్రిక మార్కోనీని నియమించింది. అతడు సముద్ర తీరంలో గ్రాహకాన్ని అమర్చి, వైర్ లెస్ ప్రసారిణిని ఓ పడవలో ఉంచుకొని బయలు దేరాడు. వార్తలను వైర్ లెస్ ద్వారా సముద్ర తీరానికి పంపితే, అక్కడి నుంచి వార్తా పత్రిక కార్యాలయానికి టెలిఫోన్ ద్వారా చేరవేశారు. వైర్ లెస్ ద్వారా పంపబడిన మొట్టమొదటి పత్రికా వార్త ఇదే.

వేల్స్ రాకుమారుడు ఒకసారి విహార నౌకలో వెడుతూ వైట్ దీవుల కావల జబ్బు పడ్డాడు. కుమారుని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కప్పుడు తెలుసుకోవాలని విక్టోరియా రాణి సంకల్పించింది. వెంటనే మార్కోనీని అభ్యర్థించగా అతడు వైర్ లెస్ పరికరాలను నెలకొల్పి, 16 రోజుల పాటు నిర్విరామంగా వార్తలను చేరవేసే ఏర్పాటు చేశాడు. మొత్తం 150 టెలిగ్రాంలు అటూ, యిటూ ప్రసారం చేయబడ్డాయి.

కొన్నాళ్ళకు ఇంగ్లీషు ఛానెల్ మీదుగా వైర్ లెస్ ప్రసార సౌకర్యం నెలకొల్పబడింది. కొన్ని డజన్ల మైళ్ళ వరకు ఈ సౌకర్యం కల్పించడం సులభంగానే జరిగిపోయేది గానీ, కొన్ని వేల మైళ్ళు దూరమైతే ఇది సాధ్యమవుతుందా? ప్రసారిణి సామర్థ్యాన్ని పెంచి, గ్రాహకం మరీ సున్నితంగా ఉండేలా చేయడం ఓ పద్ధతి. ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఒకటుంది. విద్యుదయస్కాంత తరంగాలు ఆకాశంలో ఋజుమార్గంలో ప్రసరిస్తాయా లేదా భూమి తలానికి సమాంతరంగా వక్ర మార్గంలో వెడతాయా? ఋజుమార్గంలో వెళ్ళేటట్లైతే అన్ని సముద్రాలను వైర్ లెస్ ద్వారా కలిపే ఆలోచన పగటి కలే అవుతుంది. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ప్రయోగం చేయాల్సిందే.

సముద్రాన్ని దాటిన వైర్ లెస్ తరంగాలు

1901 డిసెంబరు 12 వ తేదీన మార్కోనీ తన సహాయకులతో బాటు న్యూఫౌండ్ లాండ్ లో ఒక చోట పాత పూరి గుడిసెలో కూర్చున్నాడు. మంచి శీతాకాలం, తుఫాను గాలులు గోడ పగుళ్ళలో నుంచి ఎముకలు కొరికేలా వీస్తున్నాయి. పై కప్పు రంధ్రాల నుంచి వర్షం పడుతోంది. కొద్దిపాటి కోకో,ఒక విస్కీ సీసా తప్ప తినడానికి యేమీ లేదు. వెలుపల గాలిపటం నుంచి వేలాడ దీసిన ఏరియల్ 400 అడుగుల ఎత్తున ఈదురుగాలికి రెపరెపలాడుతోంది. సరిగా అదే సమయంలో 2,170 మైళ్ళ దూరంలో ఉండే పోల్డు (కార్నవాల్ రాష్ట్రం) నుంచి మోర్స్ కోడ్ ప్రకారం S అక్షరాన్ని ప్రసారం చేయాలని ప్రయత్నించారు. కానీ చాలాసేపు ఫోన్ లో అరగొర శబ్దాలు తప్ప మరేమీ స్పష్టంగా వినిపించలేదు. "భూమి గోళాకారంగా ఉండటం మూలాన విద్యుదయస్కాంత తరంగాలు ప్రయాణించడానికి అవరోధ ముండదని నేను ఇప్పటికీ విశ్వసిస్తున్నాను. కాబట్టి ప్రపంచంలో ఎక్కడికైనా వాటిని ప్రసారం చేయవచ్చు---" అని మార్కోనీ అభిప్రాయపడ్డాడు. ఫోన్ లో సముద్రం ఆవలిపైపు నుంచి ఏవైనా సంకేతాలు వినబడతాయేమో అని ఆదుర్దాగా నిరీక్షిస్తున్న మార్కోనీ అనుచరుడు 12-30 సమయంలో హఠాత్తుగా చేయి పైకెత్తి సైగ చేశాడు. వెంటనే మార్కోనీ ఫోన్ తీసుకుని చెవులు రిక్కించి విన్నాడు. మూడు పివ్ అనే శబ్దాలు మళ్ళీ మళ్ళీ వినబడసాగాయి. వైర్ లెస్ తరంగాలు సముద్రాన్ని దాటాయన్నమాట!

విమర్శలు

దీనితో ప్రయోగం దిగ్విజయం కావడమే కాకుండా, మార్కోనీ కష్టాలు కూడా మొదలయ్యాయి. కార్న్ వాల్ నుంచి సంకేతాలు వింటున్నానని భావించటం ఆత్మ వంచనే అని థామస్ అల్వా ఎడిసన్ లాంటి వాళ్ళు అభిప్రాయ పడ్డారు. అతడు మోసగాడని మరి కొందరు దూషించారు. న్యూఫౌండ్ లాండ్ లో టెలిగ్రాఫ్ ప్రసారాలకు సంబంధించి, తమ గుత్తాధికారాలను హరించాడని ఓ అమెరికన్ టెలిగ్రాఫ్ సంస్థ మార్కోనీపై దావా వేస్తానని బెదిరించింది. వైర్ లెస్ ప్రసారాలు నెలకొల్పడంలో ప్రపంచమంతటా తనదే గుత్తాధిపత్యం ఉండాలని మార్కోనీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడని కొన్ని వ్యాపార వర్గాలు, రాజకీయ వాదులూ ఆరోపించసాగారు. అతని పరిశోధనను దురుద్దేశాలతో, దుస్సాహసాలతో కూడుకున్న కుంభకోణంగా పలువురు అభివర్ణించారు.

ప్రజాజీవనంలో వైర్ లెస్

మార్కోనీ కనుగొన్న పరికరం మాత్రం విజయ ఢంకా మోగిస్తూనే ఉంది. ప్రజా జీవనంలో దీని మహత్తర ఉపయోగాన్ని ఎలుగెత్తి చాటే సంఘటనలు కొన్ని జరిగాయి. 1909 లో రెండు పడవలు సముద్ర మద్యంలో ఢీ కొన్నాయి. వైర్ లెస్ ద్వారా తీరానికి సమాచారం వెంటనే అందించకపోయి ఉంటే 1700 మంది ప్రయాణీకులు మునిగిపోయే వారు. ఒకసారి డాక్టర్ క్రిపెన్ అనే హంతకుడు ఇంగ్లండ్ నుండి కెనడాకి వెళ్ళే ఓడలో ప్రయాణం చేస్తుండగా ఆ ఓడ అధికారి వైర్ లెస్ ద్వారా ఈ సమాచారాన్ని స్కాట్లండ్ యార్డ్ కి తెలిపాడు. ఫలితంగా ఆ ఓడ కెనడా చేరగానే పోలీసులు అతడిని బంధించారు.

టైటానిక్ ఓడ - SOS సందేశం

ఈ శతాబ్దం ప్రారంభ దశలో తొలి అంతర్జాతీయ వైర్ లెస్ సమావేశం జరిగింది. ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు సహాయం అర్థించడానికి SOS అనే సంకేతాన్ని ఉపయోగించాలని తీర్మానించారు. అందరూ అనుకున్నట్లుగా ఈ సంకేతానికి అర్థం (save our souls) మమ్మల్ని రక్షించండి అనికాదు. మోర్స్ కోడ్ ప్రకారం ఈ మూడు అక్షరాలను మూడు చుక్కలు,మూడు డాష్ లు, మూడు చుక్కలుగా సూచిస్తారు. ప్రసారం చేయటానికి సులువుగానూ, సరళంగానూ ఉంటుందని సంకేతాన్ని ఇలా నిర్ణయించారు. 1912 ఏప్రిల్ లో టైటానిక్ అనే ఓడ సముద్ర మద్యంలో ఓ మంచు కొండను ఢీకొంది. ఓడ మునిగి పోతుండగా అక్కడి ఆపరేటర్ వైర్ లెస్ ద్వారా SOS సంకేతాలను అనేక సార్లు పంపించాడు. ఫలితంగా 700 మందిని రక్షించటానికి వీలైంది. వైర్ లెస్ టెలిగ్రాఫ్ విధానం ఇంకా వేళ్ళూనుకోక ముందే సంభాషణల్ని, సంగీతాన్ని ఇదే విధంగా ప్రసారం చేయగలిగే రోజు ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తుండేవారు. ఈ కలలు పండడానికి అనేక సాంకేతిక అవరోధాలు అధిగమించవలసి వచ్చింది.

రేడియో ప్రసారాల ఆవిష్కరణ-విధానము

Thumb
How radio communication works. Information such as sound is transformed into an electronic signal which is applied to a transmitter. The transmitter sends the information through space on a radio wave (electromagnetic wave). A receiver intercepts some of the radio wave and extracts the information-bearing electronic signal, which is converted back to its original form by a transducer such as a speaker.

ఇందుకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలు వేరు వేరుగా కృషి చేశారు. ఇంగ్లండుకు చెందిన ప్రొఫెసర్ ప్లెమింగ్ 1904 లో శూన్య నాళిక అనే కొత్త సాధనాన్ని నిర్మించాడు. దీనిలో రెండు ఎలక్ట్రోడులు ఉంటాయి. ఒకదాన్ని వేడి చేస్తే దాని నుంచి ఎలక్త్రాన్లు వెలువడతాయి. దీన్ని కాథోడ్ అంటారు. ఈ సాధనంతో విద్యుత్తు ఒక దిశలో మాత్రమే వెళ్ళగలుగుతుంది. అంటే ఇది ఏకాంతర విద్యుత్తును ఏక ముఖ విద్యుత్తుగా మారుస్తుందన్న మాట. అందుకే దీన్ని వాల్వు అని కూడా అంటారు.

ప్లెమింగ్ కనుగొన్న వాల్వును ఉపయోగించి వైర్ లెస్ తరంగాలను గుర్తించటమే కాకుండా, బలహీనమైన తరంగాలను బలవత్తరం చేయవచ్చునని వియన్నాకి చెందిన లీబెన్, అమెరికాకి చెందిన లీ డీ ఫారెస్ట్ అనే శాస్త్రవేత్తలు గ్రహించారు. ప్లెమింగ్ వాల్వులో ఉండే రెండు ఎలక్ట్రోడ్ ల మధ్య రంధ్రాలు గల గ్రిడ్ అనే మూడో ఎలక్ట్రోడును అమర్చితే మైక్రోఫోను నుంచి వచ్చే బలహీన తరంగాలను వర్థనం చేయటానికి (Amplify) వీలవుతుంది. మూడు ఎలక్ట్రోడులు కలిగి ఉన్న ఈ సాధనాన్ని ట్రయోడు అంటారు. దీన్ని ఉపయోగించి అధిక పౌనఃపున్యము గల తరంగాలను ఉత్పత్తి చేయవచ్చు. ఇలాంటి తరంగాలను ప్రసారం చేయడంలోనూ, రిసీవర్ ల ద్వారా గ్రహించటంలోనూ ట్రయోడ్ అత్యంత కీలక పాత్ర వహించింది.

లీబెన్ చిన్న వయస్సులోనే చనిపోయాడు గాని లీ డీ ఫారెస్ట్ తరంగాల ప్రసారంలోనూ, వాటిని గ్రహించటంలోను ఇతని పరిశోధనలు ఉపయోగపడేలా కృషిచేశాడు. ప్రసారిణి ఉత్పత్తి చేసే వాహక తరంగాలను (carrier waves) మైక్రోఫోన్ లోని శబ్దాలకు అనుగుణంగా వచ్చే విద్యుత్ ప్రవాహ స్పందనలతో (pulses) కలుపుతారు. ఇలా కలపడం వాల్వు చేస్తుంది. గ్రాహకం (Receiver) లో ఈ మిశ్రిత తరంగాల నుంచి వాహక తరంగాలను తీసివేసి, మిగతా భాగాన్ని వాల్వు ల సహాయంతో వర్థనం చేసి (amplified) లౌడ్ స్పీకర్ల ద్వారా శబ్ద తరంగాలుగా మారుస్తారు.

రేడియో ప్రసారాల ప్రారంభం

1907 లో బ్రిటిష్ నావికాదళానికి చెందిన ఓడలు ప్రపంచ పర్యటన చేస్తున్న సందర్భంగా జాతీయ గీతం వాద్యాలాపనను ఒక ఓడ నుండి మరో ఓడకి ప్రసారం చేసుకోగలిగారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సముద్ర తీరం నుంచి 30 మైళ్ల దూరంలో ఉండే యుద్ధనౌకకు వైర్ లెస్ ద్వారా మార్కోనీ సందేశం పంపించగలిగాడు.

జర్మనీలో టెలిఫంకన్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ హాన్స్ బ్రెడో బెర్లిన్ నగరంలో ఉపన్యాసాన్ని, సంగీతాన్ని ప్రసారం చేసే పరికరాల్ని ప్రదర్శించాడు. కానీ లౌడ్ స్పీకర్లలో పునరుత్పత్తి అయిన ఉపన్యాసం, సంగీతం కాస్త అస్పష్టంగా ఉన్నాయి. జర్మనీ లోని తపాలా శాఖ అధికారులందరి తోనూ వైర్ లెస్ ద్వారా తన ఆఫీసు నుంచే మాట్లాడే సమయం త్వరలోనే ఆసన్నమవుతుందని డాక్టర్ బ్రెడో ఆ సభకు విచ్చేసిన తపాలా శాఖ మంత్రితో చెప్పాడు. దీనిని పిచ్చి వాగుడు కింద జమకట్టి, ఇదయ్యే పనేనా అన్నట్లుగా బ్రెడోని చూస్తూ పళ్ళు ఇకిలించి మంత్రి ఆయన వీపు తట్టాడు. "వైర్ లెస్ ప్రసారిణి ద్వారా ఓ రాజకీయ నాయకుడు ప్రసంగించడం, దాన్ని వేలకొద్దీ ప్రజలు జర్మనీ అంతటా ఏక కాలంలో వినగలగటం -- ఇదేదో జూల్స్ వెర్న్ వ్రాసిన ఊహాజనిత కథగా తెలుస్తోంది."--- అని ప్రదర్శనను తిలకించిన ఓ పత్రికా విలేఖరి మరునాడు పత్రికలో ఉద్వేగ పూరితంగా వ్రాశాడు. ఈ కల అనతి కాలంలోనే నిజమవుతుందని అతడు ఊహించలేదు. రెండేళ్ళ తరువాత జర్మనీ పోస్టాఫీసులో వైర్ లెస్ శాఖ అధ్యక్షుడిగా బ్రెడో నియమించబడ్డాడు.

మార్కోనీ మాత్రం రేడియో ప్రసారానికి సంబంధించిన పరిశోధనల్ని అవిశ్రాంతంగా కొనసాగించాడు. లిస్బన్ వద్ద సముద్ర తీరంలో వైర్ లెస్ పరికరాల్ని అమర్చి 300 మైళ్ళ దూరం దాకా సంభాషణల్ని ప్రసారం చేయగలిగాడు. కొన్ని నెలల లోపే ప్రపంచంలో కెల్లా తొలి ప్రసార కేంద్రం (broad casting station) పిట్స్ బర్గ్ లో స్థాపించబడింది. అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్ ఎన్నికయ్యాడన్న వార్తను తొలి ప్రసారంలో ప్రకటించటంతో 1920 నవంబరు 2 వ తేదీన కార్యక్రమాలు ప్రారంభమైనాయి.

వివిధ దేశాలలో రేడియో ప్రసారాలు

రేడియో ప్రసారాల విషయంలో ఆసక్తి కనబరచిన తొలి యూరోపియన్ దేశం ఇంగ్లండే. ప్రసార కేంద్రాలను నెలకొల్పడానికి, ఇష్టమొచ్చిన కార్యక్రమాలను ప్రసారం చేసుకోవటానికి అమెరికాలో ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ బ్రిటనులో పరిస్థితి వేరు.10 వాట్ ల కంటే ఎక్కువ సామర్థ్యం గల ట్రాన్స్ మీటర్ లను నెలకొల్పరాదన్న ప్రభుత్వ నిషేధం శాస్త్రవేత్తల ఉత్సాహాన్ని నీరుగార్చింది. 100 వాట్ల కేంద్రం వల్ల కూడా ఎలాంటి హాని కలగదని ప్రభుత్వాధికారులను ఒప్పించటానికి కొన్ని నెలలు పట్టింది. ఎట్టకేలకు ఛెల్మ్స్ ఫర్డ్ వద్ద అలాంటి కేంద్ర నిర్మాణానికి మార్కోనీ కంపెనీ అనుమతించబడింది. వారానికో రోజు అరగంట మాత్రం ప్రసారం జరుగుతుండేది. ప్రతి ఏడు నిమిషాలకు మూడు నిమిషాల సేపు ప్రసారాన్ని నిలిపి వేసి ప్రభుత్వ ట్రాన్స్ మీటర్ ద్వారా నిషేధాజ్ఞలు యేవీ అందక పోతే ప్రసారాన్ని మళ్ళీ కొనసాగించే వారు. ఈ కారణంగా కార్యక్రమాలు నిరుత్సాహ జనకంగా తయారయ్యాయి. పైగా కేవలం కొన్ని నిమిషాలే పరిమితమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రసిద్ధ కళాకారులెవ్వరూ ముందుకు రాలేదు.

1922 మే నెలలో 100 వాట్ల సామర్థ్యం గల రేడియో ప్రసార కేంద్రాన్ని లండనులో స్థాపించారు. ఎందుకనో మొదట్లో సంగీత కార్యక్రమాల ప్రసారాన్ని ప్రభుత్వం నిషేధించింది. కొంత కాలానికి నిషేధాన్ని తొలగించాక ప్రసారాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. బ్రిటను, ఫ్రాన్సు దేశాల వివిధ ప్రాంతాల నుంచి శ్రోతలు అధిక సంఖ్యలో అభినందన లేఖలు వ్రాయసాగారు. మరింత క్రమబద్ధంగా కార్యక్రమాల్ని మలిచి, ఇతర ప్రదేశాల్లో ట్రాన్స్ మీటర్ లను నెలకొల్పి ప్రసార శాఖను సాంకేతికంగా మెరుగు పరచాలని అభ్యర్థనలు కోకొల్లలుగా వచ్చాయి. ఫలితంగా వైర్ లెస్ పరికరాలను తయారు చేసే అరడజను కంపెనీలు కలిసి బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (B.B.C) అనే సంస్థను 1922 నవంబరులో స్థాపించాయి. బ్రిటనులో ప్రసార హక్కులు గల ఏకైక సంస్థగా దీన్ని ప్రభుత్వం గుర్తించింది. నవంబరు 14 నుంచి లండను కేంద్రం రోజువారీ ప్రసారాలు ప్రారంభించింది. మరు దినం నుంచి బర్మింగ్ హామ్ లోనూ, కొద్దికాలం తరువాత మాంచెష్టర్ లోనూ ప్రసార కేంద్రాలు పనిచేయటం మొదలు పెట్టాయి. 1923 మేలో జెకోస్లావేకియా, అదే సంవత్సరం అక్టోబరులో జర్మనీ ప్రసార కేంద్రాల్ని స్థాపించాయి.

నిర్మాణం లో మార్పులు

Thumb
A Crystal Receiver, consisting of an antenna, rheostat, coil, crystal rectifier, capacitor, headphones and ground connection.

ఆ రోజుల్లో వాడే రేడియోలలో ఇప్పటిలాగా లౌడ్ స్పీకర్లు ఉండేవి కాదు. అప్పటి రేడియో నమూనాలను క్రిస్టల్ నెట్ అనేవారు. ఇది చాలా సున్నితమైన పరికరం. దీన్ని ఉపయోగించినంతసేపూ ఏవో సర్దుబాట్లు చేస్తూ ఉండాలి. పైగా కార్యక్రమాల్ని మామూలుగా వినడానికి వీలయ్యేది కాదు. ఫోన్ లను చెవులకు తగిలించుకొని, వినాల్సి వచ్చేది. 1920 దశకంలో ట్రాన్స్ మీటర్ నిర్మాణంలోనూ, రేడియో నమూనాల్లోనూ అనేక మార్పులు వచ్చాయి. వాల్వు ల సహాయంతో రిసీవరు నిర్మాణాన్ని బాగా మెరుగు పరచాక ఫోన్లు లేకుండా మామూలుగా వినడానికి వీలయింది.

రేడియో ప్రసారం ప్రారంభమైన తొలిదశలో ప్రసారాలన్నీ మీడియం తరంగాల్లోనూ (100 నుండి 550 మీటర్లు), దీర్ఘ తరంగాలలోనూ (1000 మీటర్ల నుండి 2000 మీటర్ల వరకు) జరిగేవి. తరంగం పొడవు ఎక్కువయ్యే కొద్దీ, వివిధ ప్రసార కేంద్రాల కార్యక్రమాలు విడివిడిగా వినబడకుండా ఒకదానితో ఒకటి కలుసుకు పోయే ప్రమాదం ఉంది. ప్రసారానికి చిన్న తరంగాలను (16 నుండి 75 మీటర్లు) ఉపయోగిస్తే ఈ ఇబ్బందిని నివారించవచ్చు. ప్రసారాలు అతి దూర ప్రాంతాలకు విస్తరించాలంటే చిన్న తరంగాలనే వాడటం మేలని సాంకేతిక నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు.

రేడియో తరంగాల రకాలు

ప్రజలు వినగలిగే రేడియో తరంగాలు మూడు రకాల ఫ్రీక్వెన్సీలలో ఉంటాయి. అవి

  1. మధ్యతరహా తరంగాలు (Medium Wave),
  2. అతి చిన్న తరంగాలు (Short Wave)
  3. పౌనఃపున్య మాడ్యులేషన్ (Frequency Modulation).

మధ్య తరహా తరంగాలు(Medium Wave)

ఈ పౌనఃపున్యాన్ని ముఖ్యంగా కొద్ది ప్రాంతంలో అంటే 200 నుంచి 300 కిలోమీటర్ల పరిధి వరకు ప్రసారానికి వాడతారు. ఈ ప్రసారాలలో నాణ్యత, ధ్వనిలో స్వచ్ఛత మధ్య రకంగా ఉంటుంది. ధ్వని ప్రసారంలో ఎక్కువ తక్కువలు సామాన్యంగా ఉండవు. ట్రాన్స్‌మిటరు నుండి అన్ని ప్రక్కలకు ఏరియల్ ద్వారా వలయాకారంగా ప్రయాణించి రేడియోలను చేరుకుంటాయి. మనం వింటున్న హైదరాబాదు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలు ఈ విధమైన ప్రసారాలు చేస్తున్నాయి.

అతి చిన్న తరంగాలు(Short Wave)

ఈ పౌనఃపున్యతను సుదూర ప్రాంతాలకు ప్రసారంచేయడానికి వాడతారు. రేడియో ట్రాన్స్‌మిటర్‌కు అనుసంధించిన ఏరియల్ యొక్క కోణాన్ని బట్టి ప్రసార దూరాన్ని నియంత్రిస్తారు. సామాన్యంగా 3500 కిలోమీటర్లను దాటి ఈ ప్రసారాలు ఉంటాయి. రేడియో ట్రాన్స్‌మిటర్‌కు అనుసంధించిన ఏరియల్‌ నుండి వెలువడిన రేడియో తరంగాలను భూవాతావరణపు పై పొర (Iono sphere) ను తమకు కావల్సిన కోణంలో ఢీ కొట్టేట్టుగా వదులుతారు. ఆ రేడియో తరంగాలు, భూవాతావరణపు పై పొర (Ionosphere) ను ఢీకొని వికేంద్రీకరించబడి (Reflect) తిరిగి భూమి మీదకు ప్రసారమవుతాయి. సామాన్యంగా, ట్రాన్స్‌మిటర్‌కు, ప్రసారమయ్యే ప్రాంతానికి దూరం 3,500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ట్రాన్స్‌మిటరు ఏరియల్ కోణాన్ని నియంత్రించి ఈ దూరాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో జరిగే ప్రసారాలు చాలా దూరం వినబడినా, ధ్వనిలో నాణ్యత ఉండదు. భూ వాతావరణపు పొరలో వచ్చే మార్పులమీద ఆధారపడి ప్రసారాలు జరుగుతాయి కాబట్టి, రేడియోలలో వచ్చే ప్రసార కార్యక్రమాల ధ్వని పైకి, కిందకూ జరుగుతూ ఉంటుంది. ఒకే ప్రాతంలో వాతావరణపు పొరను ఢీ కొట్టటం వలన ఒక రేడియో స్టేషను‌‌కు మరొక స్టేషను‌కు తరంగాలు కలసి పోయి ఒక్కొక్కసారి అస్తవ్యస్తమవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ పద్ధతిలో చాలా తక్కువ రేడియో స్టేషనులు ప్రసారాలు చేస్తున్నాయి. బి.బి.సి (British Boradcasting Corporation), వి.వొ.ఎ. (Voice of America) మొదలగు అంతర్జాతీయ రేడియో సంస్థలు ఈ విధానంలో దశాబ్దాలపాటు ప్రసారాలు చేసినాయి, ఇప్పటికి కూడా చేస్తున్నాయి.

పౌనఃపున్య మాడ్యులేషన్(Frequency Modulation)

Thumb
ఒక శ్రవణ సంకేతాన్ని (పైన) AM లేదా FM రేడియో తరంగం ద్వారా పంపవచ్చు

అయితే వాతావరణం వల్లగానీ, సాంకేతిక కారణాల వల్లగానీ ఏర్పడే అరగొర శబ్దాలేవీ లేకుండా ప్రసార కార్యక్రమాలు స్పష్టంగా వినబడాలంటే అతి చిన్న తరంగాలను (ultra short waves) వాడాలి. దీన్ని V.H.F (Very High Frequency) పద్ధతి లేదా F.M. (Frequency Modulation) పద్ధతి అంటారు. రేడియో ప్రసారాల్లో మామూలుగా A.M. (Amplitude Modulation) వాడుతారు. దీని ప్రకారం వాహక తరంగాల వెడల్పును (దీనినే కంపన పరిమితి-amplitude అంటారు) ప్రసార విశేషాల శబ్దాల కనుగుణంగా మార్చడం జరుగుతుంది. అయితే తరంగాలు పొడవు 1 నుంచి 10 మీటర్ల దాకా ఉండటం వల్ల, ఎన్ని ప్రసార కేంద్రాలున్నప్పటికీ, అన్ని కార్యక్రమాలూ విడివిడిగా, స్పష్టంగా వినబడతాయి. వివిధ స్థాయిలలో ఉండే అన్ని స్వరాలను దోష రహితంగా, నిర్దుష్టంగా ప్రసారం చేయగలగడం ఈ పద్ధతి లోనే సాధ్యమవుతుంది.

వైర్ లెస్ టెక్నీషియన్లు చిరకాలంగా కంటున్న మరో కల ఈ పద్ధతి వల్ల నిజమైంది. శబ్దాన్ని త్రిపరిమాణీయంగా (Three Dimensional) లేదా స్టీరియో పద్ధతిలో ప్రసారం చేయటం. రెండు మైక్రోఫోన్ లను ఒకదానికొకటి కొంత దూరంలో ఉండేలా అమర్చి, రెండు ట్రాన్స్ మీటర్ ల ద్వారా ప్రసారం చేస్తారు. రిసీవర్లు, లౌడ్ స్పీకర్ లు కూడా రెండేసి ఉంటాయి. ఇవి కాక, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని శాటిలైటు రేడియోలు, ఇంటర్‌నెట్‌ రేడియోలు కూడా ఉన్నాయి.

అర్థవాహకాల వినియోగం

ట్రాన్సిస్టర్ ఆవిర్భావంతో ఎలక్ట్రానిక్స్ విభాగంలోనే విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. వాల్వు రేడియోలకు పూర్వం క్రిస్టల్ సెట్ లను వాడేవారని మనకు తెలుసు. ఇందులో గెలీనా (Gelena Lead sulphide) అనే క్రిష్టల్ ఉంటుంది. ప్రసారం చేయబడే కార్యక్రమాలు ఏకాంతర (Alternating) విద్యుదయస్కాంత తరంగాల రూపంలో క్రిస్టల్ పై పడినపుడు ఏకాంతర విద్యుత్తు ఏకముఖ విద్యుత్తు (Direct) గా మారుతుంది. ఈ విద్యుత్తు వల్ల చెవులకు తగిలించుకున్న ఫోన్ లలో శబ్ద తరంగాలు వినబడతాయి. ఇక్కడ ఉపయోగించే క్రిస్టల్ ని అర్థవాహకం (semi conductor) అంటారు.

వాల్వు రేడియోలు వచ్చాక, అర్థ వాహకాల్లో పరిశోధనలు తెరమరుగయ్యాయి. రేడియో సంకేతాలను గుర్తించటానికి, వర్ధనం చేయటానికి వాల్వు లే సమర్థవంతమైన సాధనాలుగా తయారయ్యాయి. ఒకటి, అవి గాజుతో తయారు చేయబడటం వల్ల పగిలిపోయే ప్రమాదముంది. రెండోది, అవి పనిచేయాలంటే అధిక వోల్టేజీ విద్యుత్తు అవసరం. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయ సాధనాలకోసం శాస్త్రవేత్తలు కృషి చేయసాగారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ పరిశోధనలు మరీ ముమ్మరంగా కొనసాగాయి.

ట్రాన్సిస్టర్లు

Thumb
The Regency TR-1 which used Texas Instruments' NPN transistors was the world's first commercially produced transistor radio.

అమెరికా బెల్ టెలిఫోన్ ప్రయోగశాలల్లో పనిచేసే పరిశోధక బృందం తొలి ట్రాన్సిష్టర్ 1948 లో తయారు చేసింది. ఈ బృందంలో ప్రముఖులు జాన్ బాల్డీన్,వాల్డర్ బ్రటేన్, విలియం షాక్లీ. వాల్వు లాగానే ట్రాన్సిష్టరు కూడా ఎలక్ట్రాను లను నియంత్రిస్తుంది. దీన్ని జెర్మేనియం లేదా సిలికాన్ అనే అర్థ వాహకంతో తయారు చేస్తారు. వీటిలో "మలిన పదార్థాలు" అనబడే ఇతర మూలకాలను కలిపితే ఎలక్ట్రాన్ల చలనాన్ని ఉధృతం చేయవచ్చు. ప్రసార కార్యక్రమాలకు సంబంధించిన రేడియో సంకేతాల వల్ల ఒక మిలియన్ ఎలక్ట్రాన్ లు దీనిలో ప్రవేశపెట్టబడితే, ట్రాన్సిష్టర్ చర్య వల్ల ఎలక్ట్రాన్ ల సంఖ్య 50 రెట్లు అవుతుంది. ఫలితంగా అధిక వోల్టేజి విద్యుత్ అవసరం లేకుండానే కావలసినంత వర్ధనం లభిస్తుంది. అందుకే మామూలు టార్చ్ లైటులో వాడే బ్యాటరీతో ట్రాన్సిష్టరు రేడియో కొన్ని నెలల దాకా పనిచేయగలుగుతుంది.

అగ్గిపుల్ల కంటే చిన్నది గానూ, ఇంచుమించు అంతే మందంగానూ ఉండే ఈ అతి సూక్ష్మ ట్రాన్సిస్టర్ల పుణ్యమా అని చిన్న పరిమాణాలలో రేడియోలు తయారయ్యాయి. వీటిని భుజాలకు తగిలించుకొని, మరీ చిన్నదైతే జేబులో ఉంచుకొని వెళ్లవచ్చు. ట్రాన్సిస్టరు పని చేయటానికి వాల్వు లాగా ఎర్రబడేంత వరకు వేడి కానక్కరలేదు. పైగా ఇది పగిలి పోతుందన్న భయం లేదు. చిరకాల మన్నికా ఉంటుంది.

ప్రింటెడ్ సర్క్యూట్

ఇంతే కాకుండా ప్రింటెడ్ సర్క్యూట్ అనే సరికొత్త సాధనంతో దీన్ని ఉపయోగించవచ్చు. ఈ సాధనంలో లోహపు తీగలతో కలపడంగానీ అతికించటం గానీ (soldering) చాలా సులువుగా ఉంటుంది. దీంతో ఒక రిసీవర్ తయారు చేయాలంటే, ఒక ప్లాస్టిక్ పలక మీద రాగి పూత పూస్తారు. ఆసిడ్ ప్రభావం లేని సిరాతో సర్క్యూట్ ని రాగి తలంపై గీస్తారు. మిగతా రాగి తలాన్ని మరో రసాయనిక పదార్థంతో తుడిచి వేయడం జరుగుతుంది. ఇలా చేస్తే రాగి తలంపై ముద్రించబడిన సర్క్యూట్ మాత్రం మిగులుతుంది. ఈ పద్ధతిలో అయితే ట్రాన్సిష్టరు లాంటి చిన్న మూలకాలను ప్రత్యేకించి తీగలతో కలిపే పని ఉండదు.

వివిధ రంగాలలో ఉపయోగాలు

ట్రాన్సిష్టరు ల వాడకం రేడియో సెట్లలో ప్రారంభమై చెవిటి వాళ్ళు ఉపయోగించే శ్రవణ పరికరాలు, గిటార్లు, రాకెట్ లో వాడే ఆధునిక పరికరాలు, కంప్యూటర్లు దాకా విస్తరించింది. ఇంతే కాకుండా అర్థవాహకాలను ఉపయోగించి సౌరశక్తినీ, పరమాణు శక్తినీ విద్యుత్ శక్తిగా మార్చటానికి వీలవుతుంది. ఇటీవలి కాలంలో జరిగిన పరిశోధనల ఫలితంగా తపాలా బిళ్ళ కంటే చిన్న పరిమాణమున్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనబడే సాధనం రూపొందించబడింది. దీనిలో ట్రాన్సిష్టర్లు, కెపాసిటర్లు, రెసిస్టర్లు కావలసిన పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. కంప్యూటర్ల నిర్మాణంలో ఇది అతి కీలక పాత్ర వహిస్తోంది.

రేడియో టెలిఫోన్

Thumb
Modern GPS receivers.

చిన్న తరంగాలపై పనిచేసే రేడియో టెలిఫోన్ అనే పరికరం చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ఓడ నుండి తీరానికి, విమానం నుంచి విమానాశ్రయానికి వార్తలను పంపించేందుకు దీన్ని తప్పనిసరిగా వాడాల్సిందే. కల్లోలిత ప్రాంతాల్లో గస్తీ దళాలకు, పర్వతారోహక బృందాలకు, అంబులెన్స్ వాహనాలకు, సైనిక దళాలకు, ఇది విస్తృతంగా ఉపయోగపడుతుంది. కొన్ని విదేశీ నగరాల్లో కారులో ప్రయాణం చేస్తూ కూడా ఇతర టెలిఫోన్ వినియోగదారులతో మాట్లాడటానికి వీలుంది. ఆస్పత్రుల్లో డాక్టర్ లతోనూ, పెద్ద,పెద్ద కర్మాగాలాలలో, ఆఫీసుల్లో, ఉద్యోగులతోనూ రేడియో టెలిఫోన్ ద్వారా ఎప్పటికప్పుదు సంప్రదించవచ్చు. అంతర్జాతీయ సమావేశాలు జరిగినపుడు ప్రధాన వక్త ఉపన్యాసాన్ని వేరు వేరు మైక్రోఫోన్ లు, ట్రాన్స్ మీటర్ల ద్వారా వివిధ భాషల్లో తర్జుమా చేస్తుంటారు. సభ్యుల వద్ద ఉండే చిన్న రిసీవర్లతో ఏ భాషలోనైనా వినటానికి వీలుంటుంది. ఇలాంటి అధునాతన పరికరాలనిర్మాణం ట్రాన్సిష్టర్ల ద్వారానే సాధ్యమైంది.

రేడియో ప్రసారాలు

ఆకాశవాణి

ఆలిండియా రేడియో ప్రభుత్వ ఆధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార, ప్రసార యంత్రాంగ ఆధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి యొక్క విభాగము. దూరదర్శన్ కూడా ప్రసార భారతిలో భాగమే. ఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయము కొత్త ఢిల్లీ లోని పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు ప్రక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లో ఉంది. ఆకాశవాణి భవన్ లో నాటక విభాగం, ఎఫ్.ఎం రేడియో విభాగం, జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి.

రేడియో స్టేషన్ల యొక్క అధికారిక వెబ్సైట్లు, ప్రైవేటు పోర్టల్స్పై ఇంటర్నెట్ ద్వారా రేడియోకు వినడానికి నేడు ప్రముఖంగా ఉంది, ఇక్కడ వివిధ రకాలైన రేడియో స్టేషన్లు సేకరించబడ్డాయి. ఈ పోర్టల్లో ఒకటి భారతదేశంలో ఐదువందల వందల రేడియో స్టేషన్ల సమాచారాన్ని కలిగి ఉంది.

భారత దేశ అభివృద్ధిలో రేడియో పాత్ర

Thumb
1955లో ఒక పత్రికా ప్రకటనలో ప్రచురించిన హెచ్ఎంవీ రేడియో బొమ్మ

దేశాభివృద్ధిలో ప్రభుత్వాధీంలో ఉన్న రేడియో, అన్ని రంగాలలోను సమాచారాన్ని ఇస్తూ దేశ సమగ్రతకూ, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతోంది.

వ్యవసాయ అభివృద్ధిలో

1966 ప్రాంతాలలో వ్యవసాయ విషయాలను రైతులకు చెప్పటానికి పంటసీమలు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం రూపొందించంటంలో ఆ తరువాత నిర్వహించటంలో ఆకాశవాణి విజయవాడ కేద్రంలో అప్పట్లో పనిచేస్తున్న గుమ్మలూరి సత్యనారాయణ కృషి ఎంతగానో ఉంది. పంటలగురించి, కొత్తరకాల వంగడాలు, సస్యరక్షణ, వ్యవసాయ పద్ధతులగురించి రైతులకు చక్కగా వివరించే కార్యక్రమాలు ప్రసారం చేసి, ఆయా కార్యక్రమాల ద్వారా వ్యవసాయదారులకు ఎంతగానో ఉపయోగపడే సమాచారాన్ని అందించేవారు. రైతులకు వారి భాషలో, అయా ప్రాంతాల యాసలలో, ఒక్కొక్క సారి అనుభవజ్ఞులైన రైతులతో సంభాషణలు పొందుపరచి కార్యక్రమాన్ని రక్తి కట్టించేవారు. ప్రభుత్వ వ్యవసాయ విభాగాలు, రైతులకు తెలియచెప్పవలసిన విషయాలను ఈ కార్యక్రమం ద్వారా అందచేసేవారు. పంటల గురించే కాక, పశు సంరక్షణ, పాడి పశువులను సాకటం గురించి కూడా చక్కగా విశదపరచేవారు. ఇప్పుడు 'ఈ టీవీ'మొదలుకొని ఇతర టీవీ లలో వచ్చే వ్యవసాయ కార్యక్రమాలకు స్ఫూర్తి, మూలాలు, పంటసీమల కార్యక్రమమే అనటంలో అతిశయోక్తి లేదు.

వయోజన విద్యా ప్రచారంలో

మహిళాభ్యుదయంలో

కార్మిక విద్యా ప్రచారంలో

పిల్లల అభిరుచులను అభివృద్ధిపరచటంలో

సంఘం రేడియో

దళిత మహిళలు ప్రారంభించిన సంఘం రేడియో ఆసియాలోనే తొలి మహిళా రేడియో, భారత్‌లోనే తొలి గ్రామీణ సామాజిక (కమ్యూనిటీ) రేడియో (Community Radio). జహీరాబాద్‌కు ఐదారు మైళ్ల దూరంలోని మాచునూరు గ్రామంలో ప్రాణం పోసుకుంది. ఇది జనం కోసం, జనమే నడిపే, జనం రేడియో.

ఈ 'రేడియో' కార్యక్రమాలు ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర దాకా, గంటన్నర సేపు ప్రసారమవుతాయి. జహీరాబాద్ చుట్టుపక్కల పాతిక కిలోమీటర్ల పరిధిలోని నూట యాభై పల్లెల్లో వినొచ్చు. పస్తాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీ.డీ.ఎస్.) అనే స్వచ్ఛంద సంస్థ వాళ్ల తరఫున ముందుండి పోరాడింది.

సంఘం మనుషులు ఏ చెట్టు కిందో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న పెద్దల ముందు మైకుపెడతారు. వాళ్ల అనుభవ సారమంతా టేపుల్లో నిక్షిప్తం అవుతుంది. వారి జీవితానుభవాలను పిల్లలు తెలుసుకొనడానికి ఇదొక మంచి అవకాశం. కొంత మంది కథలు చెప్పవచ్చును, సంగీత కచేరీ కూడా చేయవచ్చును.

కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ సామాజిక రేడియోలకు తలుపులు తెరిచింది. బోణీ 'సంఘం రేడియో' వారిదే. బుందేల్‌ఖండ్‌లో కూడా ఈమధ్యే కార్యక్రమాలు మొదలయ్యాయి. కచ్ మహిళా వికాస్ సంఘటన్ (గుజరాత్), ఆల్టర్నేటివ్ ఫర్ ఇండియా డెవలప్‌మెంట్ (జార్ఖండ్), వాయిస్ ప్రాజెక్ట్ (కర్ణాటక)... ఇప్పటికే కమ్యూనిటీ రేడియోల్ని జనానికి పరిచయం చేశాయి. ఇంకో ఏడాదిలో పాతిక దాకా కొత్త రేడియోలు రావచ్చని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ రేడియో ఫోరం అంచనా. సామాజిక రేడియో లైసెన్సు కింద చాలా విశ్వవిద్యాలయాలు సొంత స్టేషన్లు పెట్టుకున్నాయి. ఒక యూనిట్ స్థాపనకు 'ఐదు లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది.

ఇవి కూడా చూడండి

తెలుగులో రేడియో కార్యక్రమాలకు విశేషమైన ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యల గురించి చదవండి.

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.