From Wikipedia, the free encyclopedia
రామానంద్ సాగర్ ( 1917 డిసెంబర్ 29[1] – 2005 డిసెంబర్ 12[1]) (జన్మనామం చంద్రమౌళి చోప్రా) ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు. దూరదర్శన్‌లో ప్రసారమై విశేష జనాదరణ పొందిన ధారావాహిక "రామాయణ్"ను ఇతడు నిర్మించాడు. 78 భాగాల ఈ టెలివిజన్ ధారావాహిక భారతీయ పురాతన ఇతిహాసం రామాయణం ఆధారంగా తీయబడింది. ఈ సీరియల్లో రామునిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చికాలియా నటించారు.[2] భారత ప్రభుత్వం ఇతడిని 2000వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[3]
రామానంద్ సాగర్ | |
---|---|
జననం | చంద్రమౌళి చోప్రా 1917 డిసెంబరు 29 |
మరణం | 2005 డిసెంబరు 12 87) | (వయసు
ఇతర పేర్లు | రామానంద్ చోప్రా రామానంద్ బేడి రామానంద్ కాశ్మీరీ |
వృత్తి | చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, రచయిత |
జీవిత భాగస్వామి | లీలావతి |
పిల్లలు | ఆనంద్ సాగర్, ప్రేమ్ సాగర్, మోతీ సాగర్, సుభాష్ సాగర్, శాంతి సాగర్, సరితా చౌదరి |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం (2000) |
రామానంద్ సాగర్ లాహోర్ సమీపంలోని అసల్ గురు గ్రామంలో జన్మించాడు. ఇతడి ముత్తాత లాలా శంకర్ దాస్ చోప్రా కాశ్మీర్‌కు వలస వెళ్ళాడు. ఇతని అమ్మమ్మకు మగ సంతానం లేనందువల్ల ఇతడిని దత్తత తీసుకుంది. ఆ కారణంగా ఇతని పేరు చంద్రమౌళి చోప్రా నుండి రామానంద్ సాగర్‌గా మార్చబడింది.[4] ఇతని తల్లి మరణానంతరం ఇతని తండ్రి మరో పెళ్ళి చేసుకున్నాడు. విదు వినోద్ చోప్రా ఇతని సవతి తల్లి కుమారుడు. రామానంద్ సాగర్ పగటిపూట ప్యూన్‌గా, ట్రక్కు క్లీనర్‌గా, కంసాలి వద్ద సహాయకుడిగా పలు పనులు చేస్తూ రాత్రి పూట డిగ్రీ చదువుకున్నాడు.
1942లో ఇతడు పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి సంస్కృతం, పర్షియన్ భాషలలో బంగారు పతకాలను పొందాడు. డైలీ మిలాప్ అనే పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు. ఇతడు రామానంద్ చోప్రా, రామానంద్ బేడీ, రామానంద్ కాశ్మీరీ అనే కలం పేర్లతో ఎన్నో కథలు, నవలలు, కవితలు, నాటికలు రచించాడు.[4] 1942లో క్షయ వ్యాధి సంక్రమించినప్పుడు ఇతడు లాహోర్ నుండి వెలువడే ఆదాబ్ - ఎ- మష్రిఖ్ అనే పత్రికలో "డైరీ ఆఫ్ ఎ టి.బి. పేషెంట్" అనే శీర్షిక క్రింద తన అనుభవాలను అక్షరబద్ధం చేశాడు.[4]
1932లో రామానంద్ సాగర్ రైడర్స్ ఆఫ్ ద రైల్ రోడ్ అనే మూకీ చిత్రానికి క్లాపర్ బాయ్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు.[5] దేశవిభజన అనంతరం 1949లో ఇతడు ముంబైకి తన మకాం మార్చాడు.
1940లలో పృథ్వీరాజ్ కపూర్ ఆధీనంలోని పృథ్వీ థియేటర్స్ లో ఇతడు అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశాడు. కపూర్ పర్యవేక్షణలో కొన్ని నాటకాలకు దర్శకత్వం వహించాడు.[6][7]
కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు ఇతడు రాజ్ కపూర్ సూపర్‌హిట్ సినిమా బర్సాత్కు కథ, స్క్రీన్‌ప్లే అందించాడు. ఇతడు సాగర్ ఫిల్మ్స్ (ప్రైవేట్ లిమిటెడ్) అనే సినిమా, టెలివిజన్ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. బాజూబంద్, మెహమాన్ వంటి సినిమాలను దర్శకత్వం వహించి నిర్మించాడు కానీ అవి అంతగా విజయవంతం కాలేదు.
ఎస్.ఎస్.వాసన్ దర్శకత్వంలో దిలీప్ కుమార్ , వైజయంతిమాల, రాజ్‌కుమార్‌లు నటించిన పైగమ్ చిత్రానికి ఇతని 1960లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సంభాషణల రచయిత అవార్డ్ లభించింది.
ఇతడు 1960వ దశకంలో ఘుంఘట్, అర్జూ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 1964లో రాజేంద్ర కుమార్, వైజయంతిమాల, పృథ్వీరాజ్ కపూర్, రాజ్‌కుమార్‌లు నటించిన జిందగీ అనే కళాత్మక చిత్రానికి దర్శకత్వం వహించాడు. 1968లో ధర్మేంద్ర, మాలా సిన్హా జంటగా నిర్మించిన స్పై థ్రిల్లర్ సినిమా ఆంఖేఁ చిత్రం ఇతనికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డ్‌ను సంపాదించి పెట్టింది.[8] 1970వ దశకం తొలి దశలో ఇతని సినిమాలు గీత్, లల్కార్ విజయవంతం కాలేదు. 1976లో ధర్మేంద్ర, హేమా మాలిని జంటగా చరస్, 1979లో రాజేష్ ఖన్నా, రేఖ, మౌసమీ చటర్జీలు నటించిన ప్రేమ్బంధన్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం నెరిపాడు. 1982లో ధర్మేంద్ర, హేమా మాలిని, రీనా రాయ్‌లు నటించి ఇతడు దర్శకత్వం వహించిన భాగవత్ సినిమా ఘనవిజయాన్ని తెచ్చిపెట్టింది.
1985లో ఇతడు దర్శకుడిగా పనిచేసిన సల్మా చిత్రం సంగీతపరంగా జనాదరణ లభించినా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.
1985లో ఇతడు టెలివిజన్ రంగంలోకి ప్రవేశించాడు. మోతీ సాగర్ దర్శకత్వంలో దాదా దాదీకి కాహానియాఁ సీరియల్‌ను నిర్మించాడు. అది మొదలు ఇతని సంస్థ సాగర్ ఆర్ట్స్ భారతీయ చరిత్రకు సంబంధించిన టెలివిజన్ సీరియళ్లను నిర్మించడం ప్రారంభించింది. ఇతడు దర్శకత్వం వహించిన రామాయణ్ దూరదర్శన్‌లో 1987 జనవరి 25న మొదటి ఎపిసోడ్ ప్రసారమయ్యింది.[9][10] దీని తరువాత కృష్ణ, లవ్ కుశ్ టెలీసీరియళ్ళను నిర్మించి దర్శకత్వం వహించాడు. 1988లో ఇతడు విక్రమ్ ఔర్ భేతాళ్ అనే సీరియల్‌కు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత అలీఫ్ లైలా, సాయిబాబా టెలీసీరియళ్లను తీశాడు.
రామాయణ్ ధారావాహికను మొదట 52 వారాలలో ప్రసారం చేయడానికి నిర్మించాడు. అయితే ఆ ధారావాహికకు వచ్చిన ప్రజాదరణ దృష్ట్యా మూడుసార్లు పొడిగించి చివరకు 78 వారాలు ప్రసారం చేశారు.
ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చిన అభ్యర్థన మేరకు ఇతడు లవ్ కుశ్ సీరియల్‌ను నిర్మించాడు.[11]
భారత పాకిస్తాన్ విభజన సమయంలో తన అనుభవాలను వివరిస్తూ హిందీ - ఉర్దూ భాషలలో ఔర్ ఇన్సాన్ మర్ గయా అనే పుస్తకాన్ని 1948లో ప్రచురించాడు.
2000లో భారతప్రభుత్వం ఇతడిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇతడు తన 88వ యేట అనారోగ్య కారణాలతో ముంబైలోని తన స్వగృహంలో 2005, డిసెంబర్ 12న మరణించాడు.
ఇతని జీవితచరిత్రను "ఏన్ ఎపిక్ లైఫ్: రామానంద్ సాగర్ ఫ్రమ్ బర్సాత్ టు రామాయణ్" అనే పేరుతో ఇతని కుమారుడు ప్రేమ్‌సాగర్ 2019 డిసెంబర్లో వెలువరించాడు. ఇందులో అట్టడుగు స్థాయి నుండి గొప్ప ఫిల్మ్‌మేకర్‌గా ఎదిగడానికి జీవితంలో ఇతడు ఎదుర్కొన్న కష్టాలను వివరించబడింది.[12][13]
సంవత్సరం | పేరు | సినిమా/టి.వి.సీరియల్ | పాత్ర (లు) | విశేషాలు |
---|---|---|---|---|
2005 | సాయిబాబా | టి.వి.సీరియల్ | దర్శకుడు | |
1993 | అలీఫ్ లైలా | టి.వి.సీరియల్ | దర్శకుడు | |
1993 | కృష్ణ | టి.వి.సీరియల్ | దర్శకుడు | |
1988-89 | లవ్ కుశ్ | టి.వి.సీరియల్ | దర్శకుడు | |
1987-88 | రామాయణ్ | టి.వి.సీరియల్ | దర్శకుడు నిర్మాత రచయిత | |
1985-86 | విక్రమ్ ఔర్ భేతాళ్ | టి.వి.సీరియల్ | దర్శకుడు నిర్మాత | |
1985 | సల్మా | సినిమా | దర్శకుడు నిర్మాత | |
1983 | రొమాన్స్ | సినిమా | దర్శకుడు నిర్మాత | |
1982 | భాగవత్ | సినిమా | దర్శకుడు నిర్మాత | |
1981 | ఆర్మాన్ | సినిమా | నిర్మాత | |
1979 | హమ్ తేరే ఆషిక్ హైఁ | సినిమా | సంభాషణల రచయిత స్క్రీన్‌ప్లే రచయిత | |
1979 | ప్రేమ్ బంధన్ | సినిమా | దర్శకుడు | |
1976 | చరస్ | సినిమా | దర్శకుడు నిర్మాత రచయిత | |
1973 | జల్తే బదన్ | సినిమా | దర్శకుడు నిర్మాత రచయిత | |
1972 | లల్కార్ | సినిమా | దర్శకుడు నిర్మాత రచయిత | |
1970 | గీత్ | సినిమా | దర్శకుడు నిర్మాత | తెలుగులో ఆరాధన పేరుతో పునర్మించబడింది |
1968 | ఆంఖేఁ | సినిమా | దర్శకుడు నిర్మాత రచయిత | |
1965 | అర్జూ | సినిమా | దర్శకుడు నిర్మాత రచయిత | |
1964 | జిందగీ | సినిమా | దర్శకుడు నిర్మాత | తెలుగులో ఆడబ్రతుకు పేరుతో పునర్మించబడింది. |
1964 | రాజ్‌కుమార్ | సినిమా | సంభాషణల రచయిత స్క్రీన్‌ప్లే రచయిత | |
1960 | ఘుంఘట్ | సినిమా | దర్శకుడు | |
1959 | పైగమ్ | సినిమా | సంభాషణల రచయిత | |
1958 | రాజ్ తిలక్ | సినిమా | రచయిత సంభాషణల రచయిత | |
1956 | మేమ్ సాహిబ్ | సినిమా | సంభాషణల రచయిత | |
1954 | బాజూబంద్ | సినిమా | దర్శకుడు | |
1952 | సంగ్దిల్ | సినిమా | సంభాషణల రచయిత స్క్రీన్‌ప్లే రచయిత | |
1953 | మెహమాన్ | సినిమా | దర్శకుడు | |
1950 | జాన్ పెహచాన్ | సినిమా | సంభాషణల రచయిత స్క్రీన్‌ప్లే రచయిత | |
1949 | బర్సాత్ | సినిమా | రచయిత సంభాషణల రచయిత స్క్రీన్‌ప్లే రచయిత | |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.