20 వ శతాబ్దం మధ్యలో మద్రాసు రాష్ట్రం భారతదేశ రాష్ట్రాల్లో ఒకటి. భారత స్వాతంత్ర్యానికి మునుపు బ్రిటిష్ ఏలుబడిలో మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్న ఇది, తర్వాత మద్రాస్ ప్రావిన్సుగా మారింది. 1950 లో అది ఏర్పడిన సమయంలో, ప్రస్తుత తమిళనాడు మొత్తం, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, ఉత్తర కేరళలోని మలబార్ ప్రాంతం, దక్షిణ కెనరాలోని బళ్లారి ఇందులో భాగంగా ఉండేవి. తీరప్రాంత ఆంధ్ర, రాయలసీమలు విడిపోయి, 1953 లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడగా, దక్షిణ కెనరా, బళ్లారి జిల్లాలను మైసూర్ రాష్ట్రంతో, మలబార్ జిల్లాను ట్రావెన్కోర్-కొచ్చిన్ రాష్ట్రంలో విలీనం చేసి 1956లో కేరళను ఏర్పాటు చేశారు. 1969 జనవరి 14 న మద్రాస్ రాష్ట్రాన్ని తమిళనాడుగా మార్చారు.[1]

త్వరిత వాస్తవాలు
మద్రాసు ప్రావిన్సు (1947–1950)
మద్రాసు రాష్ట్రం (1950–1969)
స్వాతంత్ర్యానికి పూర్వం భారత రాష్ట్రం

1950–1969
Thumb
Location of మద్రాసు రాష్ట్రం
దక్షిణ భారతదేశం (1953–1956) పటం 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956కి ముందు ఉన్న మద్రాసు రాష్ట్రం పసుపు రంగుతో ఉంది
చరిత్ర
 - మద్రాసు ప్రావిన్సు నుంచి మద్రాసు రాష్ట్రం ఏర్పడింది 1950
 - కోస్తా ఆంధ్ర, రాయలసీమలు విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి 1953
 - మద్రాసు రాష్ట్రం నుంచి మలబార్ జిల్లాను కేరళ లోనూ, దక్షిణ కెనెరా జిల్లాను మైసూరు రాష్ట్రంలోకి చేర్చారు 1956
 - తమిళనాడుగా పేరుమార్చారు 1969
States of India since 1947
మూసివేయి

ఒ.పి. రామస్వామి రెడ్డియార్ మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రధానిగా 1949 వరకు ఉన్నాడు. ఇతను నేతృత్వంలో ఆలయాల్లోకి దళితులకు ప్రవేశం కల్పించే చట్టం చేశాడు. దేవదాసి వ్యవస్థ రద్దుకు కూడా చట్టాన్ని అమలు చేశారు. 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడ్డ తర్వాత మద్రాసు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కుమారస్వామి రాజా 1952 దాకా పనిచేశాడు. 1952 ఎన్నికల్లో సి. రాజగోపాలాచారి శాసనసభకు ఎన్నికవకపోయినా శాసనమండలికి నామినేట్ అయి తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు.ఇతను హయాంలోనే పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను మొదట్లో వ్యతిరేకించిన జవహర్ లాల్ నెహ్రూ శ్రీరాములు మరణంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ఒప్పుకున్నాడు కానీ మద్రాసును అందులో కలపడానికి ఒప్పుకోలేదు. 1953 అక్టోబరు 1 న మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడివడింది. 1954 లో కె. కామరాజ్ మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. 1956 లో ఈ రాష్ట్రం నుంచి మలబార్ జిల్లాను కేరళ లోనూ, దక్షిణ కెనరా జిల్లాను మైసూరు రాష్ట్రంలోకి చేర్చారు. ఇతను తర్వాత వచ్చిన మింజూర్ భక్తవత్సలం మద్రాస్ రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రి. 1969లో ఇది తమిళనాడు రాష్ట్రంగా మారింది.

చరిత్ర

భారత స్వాతంత్ర్యం తరువాత, మద్రాస్ ప్రెసిడెన్సీ 1947 ఆగస్టు 15 న మద్రాస్ ప్రావిన్స్ అయింది. 1950 జనవరి 26 న భారత ప్రభుత్వం దీనిని మద్రాస్ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా రాష్ట్ర సరిహద్దులను తిరిగి నిర్వచించారు. చివరకు 1969 జనవరి 14 న ముఖ్యమంత్రి సి.ఎన్ అన్నాదురై రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చాడు.[2]

ముఖ్యమంత్రులు

ఒపి. రామస్వామి రెడ్డియార్

స్వాతంత్ర్య సమయంలో, ఒమండూర్ రామసామి రెడ్డిగా ప్రసిద్ధి చెందిన రామస్వామి రెడ్డియార్, 1947 మార్చి 23 నుండి 1949 ఏప్రిల్ 6 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీకి ప్రధానిగా ఉన్నాడు.[3][4] స్వాతంత్ర్యం తరువాత, ప్రెసిడెన్సీ బదులు 1950 వరకు ప్రావిన్స్ అనే పదాన్ని ఉపయోగించారు. కాంగ్రెస్ నాయకులలో పెరుగుతున్న అంతర్గత గొడవలను కారణంగా చూపిస్తూ 1949 ఏప్రిల్ 6 న అతను రాజీనామా చేశాడు. అతను పదవీకాలంలో భారత్ స్వాతంత్ర్యం సాధించింది. కుమారస్వామి రాజా మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు (1949 ఏప్రిల్ నుండి 1952 ఏప్రిల్ వరకు) పనిచేసాడు. దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు అతను పనిచేశాడు.[5]

మద్రాస్ టెంపుల్ ఎంట్రీ ఆథరైజేషన్ యాక్ట్

దళితులను హిందూ దేవాలయాలలోకి అనుమతించాలని ఈ చట్టం చెప్పింది. అప్పటి వరకు ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేవారు. పెరియార్ ఇ.వి.రామసామి నేతృత్వంలోని ద్రావిడర్ కజగం (గతంలో అదే జస్టిస్ పార్టీగా ఉండేది) హిందూ దేవాలయాలలోకి దళితులను అనుమతించాని ఒత్తిడి చేస్తూ ఉండేది. ఒమండూర్ రామసామి రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం మద్రాస్ టెంపుల్ ఎంట్రీ ఆథరైజేషన్ యాక్ట్ 1947 ను ఆమోదించింది. 1947 మే 11 న అప్పటి గవర్నర్ ఆమోదించారు.[6] ఈ చట్టం హిందూ దేవాలయాలలోకి ప్రవేశించడానికి దళితులు ఇతర నిషేధిత హిందువులకు పూర్తి, సమస్త హక్కులను ఇచ్చింది.[6][7]

దేవదాసి నిర్మూలన చట్టం 1947

ఒమండూర్ మంత్రివర్గం మహిళలకు సంబంధించి మరో మైలురాయి లాంటి చట్టాన్ని ఆమోదించింది, ముత్తులక్ష్మి రెడ్డి, పెరియార్ ఇ.వి.రామసామి వంటి సామాజిక కార్యకర్తలు చాలాకాలం ఒత్తిడి చేసాక ఈ చట్టం రూపుదిద్దుకుంది. మద్రాస్ దేవదాసిస్ (ప్రివెన్షన్ ఆఫ్ డెడికేషన్) యాక్ట్ అనే ఈ చట్టం, దేవదాసికి వివాహం చేసుకోవడానికి చట్టబద్ధమైన హక్కును ఇచ్చింది. హిందూ దేవాలయాలకు బాలికలను అంకితం చేయడం చట్టవిరుద్ధం చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన 2 నెలల్లో 1947 అక్టోబరు 9 న దీన్ని ఆమోదించారు.[8][9]

పి.ఎస్.కుమారస్వామి రాజా

పిఎస్ కుమారసామి రాజా 1949 ఏప్రిల్ 6 న అధికారం చేపట్టాడు. 1950 జనవరి 26 న భారతదేశం రిపబ్లిక్‌గా ఏర్పడిన తరువాత మద్రాస్ రాష్ట్రానికి అయిన మొదటి ముఖ్యమంత్రి అతడు. మద్రాసు ప్రావిన్సే ఇప్పుడు మద్రాసు రాష్ట్రం అయింది. మద్రాసు ప్రావిన్సు లోని పరిపాలనా ప్రాంతాలైన, ఈనాటి ఆంధ్ర ప్రదేశ్, కొచ్చిన్ స్టేట్, నేటి కేరళ లోని మలబార్ జిల్లా, ఈనాటి కర్ణాటక లోని దక్షిణ కెనరా జిల్లాలు మద్రాసు రాష్ట్రం లోనూ భాగాలే. క్యాబినెట్ సభ్యులు మారినంత మాత్రాన ప్రభుత్వ విధానాలలో మార్పేమీ రాలేదని, తన ప్రభుత్వం గత మంత్రిత్వ సిద్ధాంతాలనే అనుసరిస్తుందని అతను పేర్కొన్నాడు.[10]

చక్రవర్తి రాజగోపాలచారి

1952 ఎన్నికలలో, రిపబ్లిక్ ఇండియాలో జరిగిన మొదటి ఎన్నికలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, స్పష్టమైన మెజారిటీ లేనందున కాంగ్రెసు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెరుగైన స్థితిలో ఉంది. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రాన్ని పాలించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చక్రవర్తి రాజగోపాలచారిని (రాజాజీ) ఎంపిక చేశారు. రాజాజీ మద్రాస్ శాసనసభలో ఎన్నికైన సభ్యుడు కానందున, అప్పటి గవర్నర్ అతణ్ణి శాసనమండలికి నామినేట్ చేసారు. రాజాజీ మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.[11]

మాజీ తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్ అయిన డాక్టర్ పిసి అలెగ్జాండర్ ఇలా రాశాడు: మద్రాస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని రాజగోపాలాచారిని ఆహ్వానించినప్పుడు శ్రీ ప్రకాశ చేసినది, అత్యంత స్పష్టమైన రాజ్యాంగ అతిక్రమణ కేసు.

ఆంధ్రరాష్ట్ర ఆందోళన

ఈ సమయంలో, స్వాతంత్ర్య సమరయోధుడు పొట్టి శ్రీరాములు తెలుగు మాట్లాడే జిల్లాలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఆంధ్ర అని పేరు పెట్టాలని, తన లక్ష్యాన్ని సాధించేందుకు ఆమరణ ఉపవాస దీక్ష చేసాడు. ఉపవాస సమయంలో తలెత్తిన సమస్యల నేపథ్యంలో అతను మరణించాడు, మద్రాస్ నగరంతో సహా మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాల్లో హింసాత్మక అల్లర్లు జరిగాయి. భాషా రాష్ట్రాల ఆలోచనను మొదట్లో వ్యతిరేకించిన జవహర్‌లాల్ నెహ్రూ, పొట్టి శ్రీరాములు మరణానంతరం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక డిమాండుకు తలొగ్గాడు. కానీ మద్రాస్ నగరాన్ని కొత్త రాష్ట్రమైన ఆంధ్రాలో చేర్చాలన్న డిమాండును తిరస్కరించారు.

50 రోజులకు పైగా ఉపవాసం కొనసాగినప్పటికీ, ఉపవాసాన్ని విరమింపజేసేందుకు గానీ, శ్రీరాములుకు వైద్య సహాయం అందించడంలోగానీ రాజాజీ జోక్యం చేసుకోలేదు. ఆధునిక భారతీయ చరిత్రలో ఉపవాస దీక్ష చేసి మరణించినది శ్రీరాముల కంటే ముందు జతిన్ దాస్ అనే వ్యక్తి ఒక్కరే. చాలా సందర్భాల్లో దీక్ష విరమించడం గానీ, ఆసుపత్రిలో చేర్చడం గానీ, అరెస్టు చెయ్యడం గానీ, బలవంతంగా ఆహారం ఇవ్వడం గానీ చేసేవారు.[12] 1953 అక్టోబరు 1 న మద్రాస్ రాష్ట్రం నుండి తెలుగు మాట్లాడే ప్రాంతాలను వేరు చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. రాజాజీ ఆంధ్ర రాష్ట్ర సమస్య నుండి, సంబంధిత సమస్యల నుండి దూరంగా ఉన్నాడు.[13]

కుటుంబ వృత్తి విద్యా విధానం

రాజాజీ ఆహార ధాన్యాలపై నియంత్రణలను తొలగించి, కుటుంబ వృత్తి ఆధారంగా కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం విద్యార్థులు ఉదయం పాఠశాలకు వెళ్లాలి. పాఠశాల తర్వాత వడ్రంగి, తాపీపని వంటి వారి తల్లిదండ్రులు ఆచరించే కుటుంబ వృత్తిని తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇది కులవాదమేనంటూ దీనిని ద్రవిడర్ కజగం, డిఎంకెలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కులా కల్వి తిట్టం (వంశపారంపర్య విద్యా విధానం) ను అతని సన్నిహితుడు, రాజకీయ ప్రత్యర్థి పెరియార్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ విధానంపై కాంగ్రెస్ పార్టీ లోపల, వెలుపలా దాడి చేసారు. ఈ వివాదం చివరికి 1954 లో అతను రాజీనామాకు దారితీసింది.[14][15][16]

కామరాజ్

1954 ఏప్రిల్ 13 న కె. కామరాజ్ మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. "సోషలిజం" అంటే కామరాజ్ దృష్టిలో "వెనుకబడిన వారు పురోగతి సాధించాలి" అని అర్ధం. ప్రజల కనీస అవసరాలైన "కూడు, గూడు, గుడ్డ, ఉపాధి" లను కల్పించడానికి అతడు కట్టుబడి ఉన్నాడు. కామరాజ్ పాలన లోని గొప్ప లక్షణం తిరోగమన విద్యా విధానాలకు ముగింపు పలికి, సార్వత్రిక ఉచిత పాఠశాల విద్యను ప్రవేశపెట్టడం.

కేబినెట్ పునర్వ్యవస్థీకరణ

ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కామరాజ్ చేసిన మొదటి రాజకీయ చర్యలలో ఒకటి, మంత్రివర్గంలో బ్రాహ్మణేతరుల ప్రాతినిధ్యాన్ని విస్తృతం చేయడం. అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా, కామరాజ్ తన నాయకత్వానికి పోటీ చేసిన సి. సుబ్రమణ్యం, ఎం. భక్తవత్సలం లను మంత్రివర్గం లోకి తిసుకున్నాడు. తమిళనాడు టాయిలర్స్ పార్టీ, కామన్వెల్త్ పార్టీ వంటి ఇతర పార్టీలకు మంత్రి పదవులు ఇచ్చాడు. డిఎంకే సమర్థించిన తమిళ సాంస్కృతిక రాజకీయాలను ఎదుర్కోవటానికి, కామరాజ్ భాషా సాంస్కృతిక విషయాలలో పాలు పంచుకున్నాడు. తమిళ ఆకాంక్షలను శాంతింపచేయడానికి, కామరాజ్ కొన్ని చర్యలు తీసుకున్నారు.

భాషా విధానం

పాఠశాలలు, కళాశాలలలో తమిళ భాషను బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టే ప్రయత్నాలతో పాటు తమిళంలో 'శాస్త్రీయ, సాంకేతిక విషయాలపై' పాఠ్యపుస్తకాలు ప్రచురించారు. 1960 లో ప్రభుత్వ విద్యా కళాశాలల్లో తమిళాన్ని బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చర్యలు తీసుకున్నారు.

అదేవిధంగా కోర్టులలో తమిళ వాడకాన్ని ప్రోత్సాహించారు. రాష్ట్ర భాషా రాజకీయాల్లో తన పాత్ర పునరుద్ఘాటించేందుకు, కామరాజ్ 1962 ఫిబ్రవరిలో మద్రాసు రాష్ట్రం పేరును 'తమిళనాడు'గా మార్చే బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టాడు. ఈ బిల్లులో రాజధానిగా మధురైను ప్రతిపాదించాడు. కానీ సభ ఈ బిల్లుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, అది చట్టరూపం పొందలేదు. కాంగ్రెస్ సంస్థాగత పనులపై దృష్టి పెట్టడానికి "కామరాజ్ ప్రణాళిక" ప్రకారం కామరాజ్ ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నాడు. ఆ తరువాత నాలుగేళ్ళకు 1967 లో జరిగిన ఎన్నికలలో డిఎంకే కాంగ్రెసును ఓడించింది.

విద్యా విధానం

రాజాజీ ప్రవేశపెట్టిన కుటుంబ వృత్తి ఆధారిత వంశపారంపర్య విద్యా విధానాన్ని కామరాజ్ తొలగించాడు. పదకొండవ తరగతి వరకు ఉచిత, నిర్బంధ విద్యను ప్రవేశపెట్టడం ద్వారా నిరక్షరాస్యతను నిర్మూలించడానికి కామరాజ్ కృషి చేశాడు. లక్షలాది మంది పేద పాఠశాల పిల్లలకు రోజుకు కనీసం ఒక భోజనం అందించేలా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాడు.[17]

300, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ఒక మైలు వ్యాసార్థంలో దాదాపు ప్రతి గ్రామంలో ఒక పాఠశాల పెట్టారు. గ్రామీణ పేద పిల్లలను పాఠశాలలకు ఆకర్షించడం కోసం, కామరాజ్ పంచాయతీ ప్రభుత్వ సంస్థలలోని ప్రాథమిక పాఠశాల పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనం అందించే పథకాన్ని ప్రవేశపెట్టాడు. అమెరికన్ స్వచ్ఛంద సంస్థ CARE సహాయంతో ఈ పథకాన్ని 1957 లో ప్రారంభించారు. అదనంగా, పేద విద్యార్థులకు పాఠశాల యూనిఫాంలను సరఫరా చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. వివిధ నేపథ్యాలకు చెందిన పిల్లలకు విద్యను సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి, పాఠశాల ఫీజుల నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు. ప్రజల చేత నిధులు సేకరించడం, పాఠశాలలకు పరికరాలు సేకరించడం వంటి వివిధ పథకాల ద్వారా విద్యను సామాజిక బాధ్యతగా మార్చారు. ఇటువంటి చర్యలు శతాబ్దాలుగా ప్రాథమిక విద్యా అవకాశాలను నిరాకరించిన చాలా మందికి విద్యను దగ్గర చేశాయి.

విద్యుదీకరణ, పారిశ్రామిక అభివృద్ధి

ప్రధానంగా విద్యుదీకరణ, పారిశ్రామిక అభివృద్ధికి అభివృద్ధి కార్యక్రమాలను సులభతరం చేయడం కామరాజ్ చేసిన మరో పని. వేలాది గ్రామాలకు విద్యుత్తు నిచ్చారు. దీంతో సాగు నీటి కోసం పెద్ద ఎత్తున పంపుసెట్లను ఉపయోగించటానికి వీలైంది. వ్యవసాయానికి ఊపు వచ్చింది. కామరాజ్ కాలంలో ప్రధాన నీటిపారుదల పథకాలకు ప్రణాళిక చేసారు. రాష్ట్రమంతటా హయ్యర్ భవానీ, మణి ముతార్, ఆరణి, వైగై, అమరావతి, సాతనూర్, కృష్ణగిరి, పుల్లంబాడి, పరంబికులం, నెయ్యారు వంటి ఆనకట్టలు, నీటిపారుదల కాలువలనూ నిర్మించారు. పాల్ఘాట్ జిల్లాలోని మలపుళా ఆనకట్టను 1955 లో అతను ముఖ్యమంత్రిగా ప్రారంభించారు (1956 లో కేరళ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ముందు). ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు అనేక పెద్ద, చిన్న తరహా పరిశ్రమలను ప్రారంభించారు. కామరాజ్ పంచవర్ష ప్రణాళికల ద్వారా అందుబాటులోకి వచ్చిన నిధులను ఉత్తమంగా ఉపయోగించుకున్నాడు. గరిష్ఠ ప్రయోజనాన్ని పొందడంలో తమిళనాడుకు మార్గనిర్దేశం చేశాడు.

ఎం. భక్తవత్సలం ముదలియార్

1962 లో, భారత జాతీయ కాంగ్రెస్ మద్రాస్ రాష్ట్ర ఎన్నికలలో గెలిచి, 25 సంవత్సరాలలో ఐదవసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కామరాజ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది ముఖ్యమంత్రిగా అతను మూడవ పదవీకాలం ( 1962 మార్చి 3 - 1963 అక్టోబరు 2). తరువాత కామరాజ్ "కామరాజ్ ప్లాన్" కింద కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. కామరాజ్ పార్టీలో ఎక్కువ సమయం గడపాలని కోరుకోవడంతో 1963 అక్టోబరు 2 న భక్తవత్సలం ముదలియార్ మద్రాస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.[18] భక్తవత్సలం, మద్రాసు రాష్ట్రానికి చివరి కాంగ్రెసు ముఖ్యమంత్రి.[19]

భక్తవత్సలం పదవీకాలంలో మద్రాస్ రాష్ట్రంలో హిందీ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి.[20] హిందీని తప్పనిసరి భాషగా ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి భక్తవత్సలం ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. కాలేజీలలో తమిళాన్ని బోధనా మాధ్యమంగా మార్చాలన్న డిమాండ్లను తిరస్కరించింది. ఇది "ఆచరణాత్మక ప్రతిపాదన కాదు, జాతీయ సమైక్యత ప్రయోజనాల కోసం కాదు, ఉన్నత విద్యా ప్రయోజనాల కోసం కాదు, విద్యార్థుల ప్రయోజనాల కోసం కాదు " అని పేర్కొన్నాడు.[21] 1964 మార్చి 7 న, మద్రాస్ శాసనసభ, భక్తవత్సలం ఇంగ్లీష్, హిందీ,తమిళాలతో కూడిన మూడు భాషల సూత్రాన్ని ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది.[22][23]

1965 జనవరి 26, భారత పార్లమెంటు సిఫారసు చేసిన 15 సంవత్సరాల పరివర్తన కాలం ముగిసిన రోజు. ఆ రోజు దగ్గర పడే కొద్దీ, ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. ఇది పోలీసు చర్యకు, ప్రాణనష్టానికి దారితీసింది.[23] ఆందోళనకారులలో ఐదుగురు (శివలింగం, అరంగనాథన్, వీరప్పన్, ముత్తు, సారంగపాణి) తమను తాము దహనం చేసుకోగా, మరో ముగ్గురు (దండపాణి, ముత్తు, షణ్ముగం) విషం సేవించారు. ఆందోళనకారులలో ఒకరైన పద్దెనిమిదేళ్ల రాజేంద్రన్ 1965 జనవరి 27 న పోలీసుల కాల్పుల్లో మరణించాడు.[21]

1965 నాటి హిందీ వ్యతిరేక ఆందోళనల సమయంలో ప్రజా ఆస్తులను పెద్ద ఎత్తున నాశనం చేయడానికి, హింసకూ ప్రతిపక్ష ద్రావిడ మున్నేట్ర కళగం, వామపక్షాలే కారణమని, 1965 ఫిబ్రవరి 13 న, భక్తవత్సలం చెప్పాడు.[24]

సిఎన్. అన్నాదురై

1967 లో, 1949 లో ద్రవిడ కజగం నుండి జన్మించిన డిఎంకే (ద్రవిడ మున్నేట్ర కజగం) పార్టీ, కాంగ్రెసుపై మంచి మెజారిటీతో గెలిచింది. ఈ ఎన్నికల్లో తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. కానీ ఒక్క మద్రాస్ రాష్ట్రంలో మాత్రమే ఒకే పార్టీ మెజారిటీ సాధించింది.[25] ప్రతిపక్ష ఓట్ల విభజనను నివారించేలా కాంగ్రెసేతర పార్టీలు ఎన్నికల పొత్తు పెట్టుకోవడం వలన 1967 ఎన్నికల విజయం సాధ్యపడింది. కాంగ్రెస్ మాజీ నాయకుడు రాజగోపాలాచారి అప్పటికే కాంగ్రెస్ నుంచి విడివడి మితవాద స్వతంత్ర పార్టీని స్థాపించాడు.[26]

వివాహ చట్టం

సిఎన్ అన్నాదురై దేశంలో తొలిసారిగా ఆత్మగౌరవ వివాహాలను చట్టబద్ధం చేశారు.[27] ఈ పెళ్ళి పూజారి చెయ్యాల్సిన అవసరం లేదు.

ఆహార విధానం

ఎన్నికల మ్యానిఫెస్టోలో బియ్యాన్ని సబ్సిడీ ధరకు ఇస్తామని అన్నాదురై ప్రకటించాడు. అతను రూపాయికి ఒక కొలత బియ్యం ఇస్తానని వాగ్దానం చేశాడు. మొదట్లో అమలు చేసాడు కాని త్వరలోనే ఉపసంహరించుకున్నాడు. బియ్యం సబ్సిడీ చేయడం, ఉచితంగా ఇవ్వడం ఇప్పటికీ తమిళనాడులో ఎన్నికల వాగ్దానాలుగా ఉపయోగిస్తున్నారు.[28]

రాష్ట్రం పేరు మార్పు

అన్నాదురై ప్రభుత్వం మద్రాస్ రాష్ట్రాన్ని తమిళనాడుగా మార్చింది.[29] అతను ముఖ్యమంత్రి పదవీకాలంలోనే రెండవ ప్రపంచ తమిళ సదస్సును 1968 జనవరి 3 న భారీ స్థాయిలో నిర్వహించారు.[30] అలాగే, తమిళ సదస్సుకు గుర్తుగా ఒక స్మారక స్టాంప్ విడుదల చేసినప్పుడు, స్టాంపు హిందీలో ఉందని అన్నాదురై అసంతృప్తి వ్యక్తం చేశారు.[31]

తమిళనాడుగా రాష్ట్ర పేరు మార్చినందుకు గోల్డెన్ జూబ్లీ వేడుక

పూర్వపు 'మద్రాస్ రాష్ట్రం' పేరు మార్చడం గుర్తుగా తమిళనాడు ప్రభుత్వం 2018 జనవరి 14 న స్వర్ణోత్సవం జరిపింది.తమిళ భాష, తమిళ ప్రజల గొప్పతనాన్ని గుర్తుచేసే సంఘటనలతో, యువ తమిళ పరిశోధనా పండితులను గౌరవించడం ద్వారా స్వర్ణోత్సవం జరిపారు

ఇవి కూడా చూడండి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.