From Wikipedia, the free encyclopedia
మోక్షసన్యాస యోగము, భగవద్గీతలో పద్ధెనిమిదవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.
భగవద్గీత | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
గమనిక
అర్జునుడు:
కృష్ణా! సన్యాసము, త్యాగము అంటే ఏమిటి? వివరంగా చెప్పు?
కృష్ణుడు:
కోరికచే చేయు కర్మలను మానడం సన్యాసమనీ, కర్మ ఫలితాలు విడిచిపెట్టడమే త్యాగమని పండితులు అంటారు. కర్మలన్నీ బంధ కారణాలే కనుక చేయకపోవడమే మంచిదని కొందరు, యజ్ఞ, దాన తపస్సులను విడవకూడదని కొందరు అంటారు. త్యాగ విషయంలో నా అభిప్రాయం ఏమంటే చిత్తశుద్ధిని కల్గించు యాగ, దాన, తపస్సులను మూడు కర్మలు ఎన్నడూ విడవరాదు. వాటిని కూడా మమకారం లేక, ఫలాపేక్ష లేక చెయ్యలని నా అభిప్రాయం. కర్తవ్యాలను విడిచిపెట్టడం న్యాయం కాదు. అలా విడవడం తామస త్యాగం. శరీరకశ్టానికి భయపడి కర్మలు మానడం రాజస త్యాగం. ఫలితం శూన్యం. శాస్త్రకర్మలు చేస్తూనే ఆసక్తినీ, కర్మఫలాన్నీ విడిస్తే అది సాత్విక త్యాగం. ఇలా చేయువాడు, సందేహాలు లేనివాడు ఆత్మజ్ఞాని దుఃఖాలను ఇచ్చే కర్మలను ద్వేషింపడు. సుఖాన్నిచ్చే కర్మలను ఆనందింపడు. శరీరం కలిగినవారు కర్మలను వదలడం అసాధ్యం. కాబట్టి కర్మ ఫలితాన్ని వదిలేవాడే త్యాగి. ఇష్టము, అనిష్టము, మిశ్రమము అని కర్మఫలాలు మూడు రకాలు. కోరిక కలిగిన వారికి ఆ ఫలితాలు పరలోకంలో కలుగును. కర్మఫలత్యాగులకు ఆ ఫలితాలు అందవు. శరీరం, అహంకారం, ఇంద్రియాలు, ప్రక్రియా పరమైన వివిధ కార్యాలు, పరమాత్మ అను ఈ ఐదే అన్ని కర్మలకూ కారణమని సాంఖ్య శాస్త్రం చెప్తోంది. మనస్సు, మాట, శరీరాలతో చేసే అన్ని మంచి, చెడు కర్మలకూ ఈ ఐదే కారణము. ఈ విషయాలు తెలియనివారు, చెడ్డ భావల వారు మాత్రం తమే చేస్తున్నట్టూ అహంకారంతో తిరుగుతారు. తను పనిచేస్తున్నానన్న అహంకారం లేనివాడు, అజ్ఞానం లేనివాడు ఈ లోకంలో అందరినీ చంపినా సరే - ఆ పాపం వారికి ఏ మాత్రమూ అంటదు. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత అని మూడు కర్మ ప్రోత్సాహకాలు. అలాగే కర్త, కర్మ, సాధనం అని కర్మ సంగ్రహం మూడు రకాలు. జ్ఞానం, కర్మ, కర్త అనేవి సాంఖ్యశాస్త్రం ప్రకారం మూడేసి విధాలుగా ఉన్నాయి. వాటిని విను. విభిన్నంగా కనపడే అన్ని జీవులలో అవినాశమై, మార్పు లేని, ఒక్కటిగా ఉన్న ఆత్మను గ్రహించే జ్ఞానమే సాత్విక జ్ఞానం. ఎన్ని జీవులుంటే అన్ని ఆత్మలు ఉన్నాయనడం రాజస జ్ఞానం. ఏది చూస్తే అదే సర్వమని అనుకొనే జ్ఞానం తామస జ్ఞానం. అభిమాన, మమకార, ద్వేషం లేక ఫలాపేక్ష లేక చేయు విధిపూర్వక కర్మలు సాత్వికం. ఫలితం పైన ఆసక్తితో, అహంకార అభిమానాలతో, చాలా కష్టంతో చేయునవి రాజస కర్మలు. మంచిచెడ్డలను, కష్టనిష్ఠూరాలను గమనింపక మూర్ఖంగా చేయు పని తామస కర్మ. ఫలితం పైన ఆశ పెట్టుకోకుండా, నిరహంకారియై, ఫలితం లోని మంచిచెడ్డలకు ప్రభావితం కాక ధైర్యోత్సాహాలతో పని చేయువాడు సాత్విక కర్త. ఫలితం పైన ఆశతో, అభిమానంతో, లోభగుణంతో, హింసతో, అశుచిగా, సుఖదుఃఖాలకు చలిస్తూ పని చేయువాడు రాజస కర్త. ధైర్యం పోగొట్టుకొని, మూర్ఖత్వంతో, మోసంతో, దీనమనస్సు తో, వృథా కాలయాపంతో పనిచేయువాడు తామస కర్త. బుద్ధి, ధృతి అనే ఈ రెండూ గుణబేధాలచే మూడు విధాలు. ధర్మాధర్మములందు ప్రవృత్తి నివృత్తులను-కర్తవ్యాకర్తవ్యాలను-భయాభయాలను-బంధనమోక్షాలను స్పష్టంగా తెలుసుకోగలిగినదే సాత్విక బుద్ధి. ధర్మాధర్మాలు, కార్యాకార్యాలు నిజజ్ఞానాన్ని కాక పొరపాటుగా గ్రహించేది రాజస బుద్ధి. ప్రతిదాన్ని వ్యతిరేకంగా గ్రహించేది తామస బుద్ధి. మనసు, ప్రాణం, ఇంద్రియాల వృత్తులను నిగ్రహించి చెదిరిపోకుండా నిలిపే పట్టుదలను సాత్విక ధృతి అంటారు. ఫలితంపై అధిక ఆసక్తి, ధర్మ, అర్థ, కామాలందు చూపే అధిక పట్టూదలే రాజస ధృతి. కల, భయం, బాధ, విషాదం, గర్వం వీటికి లోనవుతూ కూడా మూర్ఖపు పట్టుదలను వీడనిది తామసిక ధృతి. సుఖాలు మూడు విధాలు. మొదట దుఃఖకరమైనా సాధన చేస్తున్నకొద్దీ సులవు అనిపించి, ఇబ్బందులు తొలగి చివరికి ఎనలేని ఆనందం ఇస్తుందో-ఆ అమృతమయ బుద్ధితో జన్మించేదే సాత్విక సుఖం. ఇంద్రియ సంయోగం వలన పుట్టేదీ, మొదట అమృతంగా ఉన్నా చివరికి విషం అయ్యేది రాజస సుఖం. ఎప్పుడూ మోహింప చేస్తూ, నిద్ర, ఆలస్య, ప్రమాదాలతో కూడినది తామస సుఖం. త్రిగుణాలకు అతీతమైనది ఏదీ భూ, స్వర్గ లోకాలలో, దేవతలలో ఎక్కడా ఉండదు. స్వభావ గుణాలను అనుసరించి నాలుగు వర్ణాలవారికీ కర్మలు వేర్వేరుగా విభజింపబడ్డాయి. బాహ్య, అంతర ఇంద్రియనిగ్రహం, తపస్సు, శౌచం, క్షమ, సూటిస్వభావం, శాస్త్ర జ్ఞానం, అనుభవ జ్ఞానం మొదలగునవి స్వభావంచే బ్రాహ్మణ కర్మలు. శౌర్యం, తేజస్సు, ధైర్యం, వెన్ను చూపనితనం, సపాత్రదానం, ఉత్సాహశక్తులు క్షత్రియ కర్మలు. వ్యవసాయం, గోరక్షణ, వ్యాపారం వైశ్యులకు-సేవావృత్తి శూద్రులకు స్వభావ కర్మలు. తన స్వభావకర్మలను శ్రద్ధాసక్తులు కలిగి ప్రవర్తించేవాడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందుతాడు. పరమాత్మను తనకు విధింపబడిన కర్మలచే ఆరాధించేవాడు చిత్తశుద్ధిని పొందుతాడు. బాగా చేసే పరధర్మం కన్నా దోషం చే చేసే స్వధర్మం చేయడమే మంచిది. స్వధర్మం దోషంతో ఉన్నా విడవరాదు. అగ్నిని పొగ ఆవరించి ఉన్నట్టూ అన్ని ధర్మాలూ ఏదో ఒక దోషం కలిగి ఉంటాయి. విషయాసక్తి లేనివాడు, ఇంద్రియనిగ్రహీ, చలించనివాడూ జ్ఞానమార్గం చే నైష్కర్మ్యసిద్ధిని పొందుతాడు. నిష్కామ కర్మచే జ్ఞానసిద్ధిని పొందినవాడు పరమాత్మను పొందేవిధానం చెపుతాను విను. మాయ లేని నిశ్చలజ్ఞానంతో మనసును నిగ్రహించి, శబ్దాది విషయాలను వదిలి, రాగద్వేష రహితుడై, నిత్యమూ విరాగియై, యేకాంత వాసంతో, అల్పాహారియై, మనస్సు, మాట, శరీరాలల్ను నియమబద్దం చేసి, ధ్యానయోగియై, అహంకార, అభిమాన, కామ, క్రోధాలను వదిలి, విషయ స్వీకారం విడిచి, మమకారం లేనివాడై, శాంత చిత్తం కలిగినవాడే బ్రహ్మభావానికి అర్హుడు. బ్రహ్మజ్ఞాని దేనినీ కోరడు. దేనికీ దుఃఖించడు. అన్ని భూతాలందూ సమదృష్టి కల్గి నా భక్తిని పొందుతాడు. ఆ భక్తిని పొందినవాడు నన్ను పూర్తిగా గ్రహించి ఆ భక్తితోనే నాలో ఐక్యం అవుతాడు. అన్ని పనులు చేస్తున్నా, నన్నే నమ్మిన కర్మయోగి నా పరమపదమే పొందుతాడు. అన్ని కర్మలూ నాకే అర్పించి సమబుద్ధిరూపమైన యోగం చెయ్యి. నేనే పరమగతినని తెలుసుకొని నీ మనసును నాలోనే లగ్నం చేయి. నన్ను శరణు కోరితే నా అనుగ్రహంతో సంసారాన్ని తరిస్తావు. కాదని అహంకరిస్తే నాశనమవుతావు. యుద్ధం చేయకూదదని నీవనుకున్నా నీ నిర్ణయం వృథానే. ఎందుకంటే నీ క్షత్రియధర్మమే నిన్ను యుద్ధానికి ప్రేరేపిస్తుంది. సర్వభూతాలనూ తన మాయచే కీలుబొమ్మలలా ఆడిస్తూన్న ఈశ్వరుడు అందరి హృదయాలలో ఉన్నాడు. అతడినే అన్నివిధాలా శరణు వేడు. అతని దయచే శాంతి, మోక్షం పొందుతావు. అతిరహస్యమైన జ్ఞానాన్ని నీకు చెప్పాను. బాగా ఆలోచించి నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నా యందు మనసు కలిగి, నన్నే భక్తితో సేవించు. నన్నే పూజించు. నమస్కరించు. నీవు నాకు ఇష్టం కావున నీతీ ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. నిశ్చయంగా నువ్వు నన్నే పొందుతావు. అన్ని ధర్మాలనూ వదిలి నన్నే శరణువేడు. నిన్ను అన్ని పాపాలనుండి బయటపడవేస్తాను. తపస్సులేని వాడికీ, భక్తుడు కాని వాడికీ, సేవ చేయని వాడికీ, నన్ను అసూయతో చూసేవాడికీ ఈ శాస్త్రాన్ని చెప్పరాదు. అతిరహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు అందించేవాడు, నిశ్చయంగా నా పరమాత్మ భావాన్ని పొందుతాడు. ఈ గీతాశాస్త్ర ప్రచారకుడికన్నా ఎక్కువైన భక్తుడు కానీ, ప్రియుడుకానీ, ఈ లోకంలో నాకు మరొకడు లేడు. మన సంవాదరూపమైన ఈ గీతను ఎవడు పారాయణ చేస్తాడో వాడివలన నేను జ్ఞానయజ్ఞంచే ఆరాధింపబడినవాడిని అవుతున్నాను. శ్రద్ధాసక్తి తో, అసూయలేక దీనిని విన్నవారు గొప్పగొప్ప పుణ్యాలు చేసినవారు పొందే లోకాలను తేలికగా పొందుతారు. ఇంతవరకూ నేను చెప్పినది మనసు లగ్నం చేసి విన్నవా?నీ మోహం నశించినదా?
అర్జునుడు:
నీ దయవలన నా అజ్ఞానం తీరింది. సందేహం పోయింది. ఆత్మజ్ఞానం కల్గింది. నువ్వేమి చెప్తే అది చేయడానికి సిద్దంగా ఉన్నాను.
సంజయుడు:
ధృతరాష్ట్ర మహారాజా! మహాత్ములైన శ్రీకృష్ణార్జునుల సంవాదం నేను విన్నాను. పులకించాను. శ్రీవ్యాసుల దయచేత యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పిన యోగశాస్త్రాన్ని ప్రత్యక్షంగా వినే భాగ్యం నాకు కలిగింది. ఆ సంవాదం మాటిమాటికీ మా మనస్సును ఉప్పొంగిస్తోంది. ఆ అద్భుత విశ్వరూపం తలుచుకుంటుంటే నా ఆనందం అధికమవుతోంది. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి ఐన అర్జునుడూ ఎక్కడ ఉంటారో అక్కడే లక్ష్మీదేవి, విజయమూ, ఐశ్వర్యమూ ఉంటాయనేది నా దృఢనిశ్చయము.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.