![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/5/54/Papam_pasivadu.jpg/640px-Papam_pasivadu.jpg&w=640&q=50)
పాపం పసివాడు
1972లో విడుదలైన తెలుగు చిత్రం / From Wikipedia, the free encyclopedia
పాపం పసివాడు వి. రామచంద్రరావు దర్శకత్వంలో 1972 సెప్టెంబరు 29న విడుదలైన చిత్రం. ఇందులో ఎస్. వి. రంగారావు, దేవిక, మాస్టర్ రాము ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అట్లూరి శేషగిరిరావు శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. కథ, చిత్రానువాదం, మాటలు గొల్లపూడి మారుతీరావు అందించాడు. చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం దర్శకత్వం వహించాడు.[1] ఈ సినిమాలోని అమ్మా చూడాలీ అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది.[2] ఎం. కన్నప్ప ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. బాలు ఎడిటర్ గా పనిచేశాడు.
పాపం పసివాడు | |
---|---|
![]() | |
దర్శకత్వం | వి. రామచంద్రరావు |
రచన | గొల్లపూడి మారుతీరావు (కథ, స్క్రీన్ ప్లే, మాటలు) |
నిర్మాత | అట్లూరి శేషగిరిరావు |
తారాగణం | ఎస్.వి. రంగారావు, దేవిక, మాస్టర్ రాము |
ఛాయాగ్రహణం | ఎం. కన్నప్ప |
కూర్పు | బాలు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | సెప్టెంబరు 29, 1972 (1972-09-29) |
సినిమా నిడివి | 139 ని |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
1969లో దక్షిణాఫ్రికా చలన చిత్రమైన లాస్ట్ ఇన్ ది డెసర్ట్" (Lost in the Desert (en)) అనే చిత్రానికి ఇది పునర్నిర్మాణం. విదేశాల్లో చికిత్స కోసం పైలట్ అయిన మేనమామతో కలిసి ఛార్టర్ విమానంలో బయలు దేరిన ఒక చిన్న పిల్లవాడు, విధివశాత్తూ విమానం కూలిపోయి ఎడారి పాలవుతాడు. ఆ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని తిరిగి తన తల్లిదండ్రులను ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్ర కథాంశం.
ఈ చిత్ర నిర్మాత అంతకుముందు మోసగాళ్ళకు మోసగాడు అనే చిత్రాన్ని ఎడారి నేపథ్యంలో తీశాడు. మరో చిత్రాన్ని అదే వాతావరణంలో తీయాలనుకుని గొల్లపూడి మారుతీరావు చేత లాస్ట్ ఇన్ ది డెసెర్ట్ను అనుసరించి కథను తయారు చేయించుకున్నాడు. 1972 మార్చిలో ప్రారంభమైన ఈ చిత్ర నిర్మాణం సుమారు 27 రోజులపాటు రాజస్థాన్ లోని థార్ ఎడారిలో చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్ర ప్రచారం కోసం వినూత్నంగా హెలికాప్టర్ ద్వారా కరపత్రాలు పంచి పెట్టారు. 1972 సెప్టెంబరు 29న విడుదలైన ఈ చిత్రం వ్యాపారాత్మకంగా విజయం సాధించింది.