నిఘంటువు (అనగా ఆక్షర క్రమములో పదములు, వాటి అర్థములు కలిగినది. దీనినే పదకోశము, వ్యుత్పత్తి కోశము అనికూడా అంటారు. తెలుగు భాష యందు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ రచించిన నిఘంటువు ప్రఖ్యాతి గాంచింది. గిడుగు రామమూర్తి గారు తెలుగు సవర పదకోశం చేశారు. నిఘంటువులలో యాస్కుడు కశ్యపుడు మున్నగు ముని పుంగవులు రచించిన నిరుక్తములు అను నామము కలవి వేదమునకు చెందినవి. ఏయే మహర్షి ఏయే వేదములోని పదములనే రీతిన రచించెనో ఆ నిరుక్తము ఆ వేదము యొక్కది అగును. ఇందువలన ఒక్కొక్క నిరుక్తము ఒక్కొక్క వేదసంబంధమైనదిగ ఉండును. కొంతకాలము నుంచి కొందరు పండితులు ఈ నిరుక్తములవలనే ఒక్కొక్క గ్రంథమునకు, ఒక్కొక్క కవి రచించిన అన్ని గ్రంథములకు ఆ గ్రంథముల పేరుతో నిఘంటువులను, ఆ కవి పేరుతో నిఘంటువులను రచించుట జరిగింది. ఈ నిఘంటువులు పలు రకాలు. పర్వాయపదములను బోధించునవి కొన్ని, ఉదాహరణకు అమరకోశము, నామలింగానుశాసనము, అభిదాన చింతామణి మొదలగునవి. శబ్దములయొక్క నానార్థములను తెలుపునవి మరికొన్ని.వీటినే నానార్థ నిఘంటువులు అంటారు. ఉదాహరణకు దండినాథుని నానార్థరత్నమాల, మేదినీ కోశము, విశ్వప్రకాశము మొదలైనవి. సంస్కృత భాషలో శబ్దబోధక నిఘంటువులు శబ్ద వ్యుత్పత్తిని వివరించునవి మరికొన్ని. తెలుగులో నానర్థ నిఘంటువును సూరయామాత్యుడు రచించిన నానార్థరత్నమాల మాత్రమే అని చెప్పవచ్చును.అలానే సంస్కృతములో ఏకాక్షర నిఘంటువులు కొన్ని ఉన్నాయి. అవి తెలుగులో మనకు లేవు. అలానే సంస్కృతములో లేని నిఘంటువు ఒకటి తెలుగులో లభించును. అదియే రామయణము కృష్ణయామాత్యుడు రచించిన దేశ్యనామార్థకోశ, తెలుగులూ వివిధ దేశ్యములైన పేళ్ళతో కల నిఘంటువు.

Thumb
తెలుగు అకాడమి వారి తెలుగు కన్నడ నిఘంటువు

అష్టాదశ మహాపురాణములలో చేరిన శ్రీమద్వేద మహర్షి ప్రణీతమైన అగ్నిపురాణములోను నిఘంటు నిర్మాణ ప్రక్రియయే అనంత నిఘంటు నిర్మాతలకు మార్గదర్శకము.

సా.శ.1900 సంవత్సరానికి పూర్వపు తరువాతి తెలుగు, ఇతరభాషల నిఘంటువులు

  • వేంకటేశాంధ్రము

ఇది సా.శ.1860 ప్రాంతమున గణపవరపు వేంకటకవిప్రణీతమైన సర్వలక్షణశిరోమణి అను నామాంతరము గల శ్రీ వేంకటేశాంధ్రము. ఇందు దేశీయములు, తబ్ధవములు అచ్చ తెలుగు పదములు దైవతమానవస్థావర తిర్య జ్ఞానార్ధవర్ధులను విభజనమున 128 సీస పద్యములలో నిఘంటువుగా కూర్చబడింది. కవి అమరకోశముతో సమానముగా దీనిని రచించి వేంకటేశునికి అంకితమిచ్చినట్లు చెప్పియున్నాడు.ఇది కొంచెం ఇంచుమించుగా పర్యాయపద నిఘంటువుగా అనవచ్చును. పెరుమాళ్ళు నల్లదేవర కర్రిసంగాతి వెడవిల్తునయ మచ్చయెడదమేటి.. వెన్నుడన నీదు పేళ్ళు శ్రీవేంకటేశ అను పద్ధతిలో రచించబడెను.

  • కవిచౌడప్పసీసపద్యనిఘంటువు

1590-1670 మధ్యలో కవిచౌడప్ప సీసపద్యనిఘంటువు అను పేర ఒక నిఘంటువు రచించినట్లు ఉంది. చౌడప్ప శతకము అనుసరించి ఈతడు కుకుత్థ్సవిజయగ్రంధయగు అనంతభూపాలునకును, విజయవిలాసిదికృతిభర్తయగు తంజావూరి రఘునాధ నాయకుడును సమకాలికుడు అంటారు.ఇది అచ్చతెలుగు నిఘంటువు. ఇందు 30 సీస పద్యములలో సంగ్రహముగా కూర్చబడింది. ఈ నిఘంటువు స్వరూపమును తెలుపుటకు ఈ క్రింది పద్యము చాలును.

విరియనా పువ్వు సీవిరియనా కల్లు వా
విరియనా చెట్టు కావిరియు పొగయు
పరియనా డాలు రూపరియనా సొగసు మే
పరియనా తిండి తేపరన తెగువ
తరలునా వళుల బిత్తరులునా చెలులుచి
త్తరులు నా బొమ్మత్తరులు వలపు
కణియనా కప్పు సాకిరియినా సాక్షి బూ
కరియనా నదలు టక్కరస దొంగ
వరియనా చేను లావరియనా బంటును
సరియనా దండ కేసరులు వడ్లు..
నూరిజనకల్ప వరదందశూకతల్ప
డంబు కరివేల్పు పిట్టసిడంబుదాల్ప.

ఆంధ్రనిఘంటువుల ప్రాథమికావస్థను తెల్పుటకిది చాల తోడ్పడుచున్నది.

  • ఆంధ్రభాషార్ణవము

పద్యమ ఆంధ్రనిఘంటువులలో ఆంధ్రభాషార్ణవమే ఎక్కువ సమగ్రామంగను, మిక్కిలి ఉపయోగకరమైనది. ఇది కూడా రమారమి తంజావూరి రఘునాధ నాయకుడు కాలమునాటిదే. దీనిని రచించినది విద్వత్కవియగు నుదురుపాటి వెంకనార్యుడు. ఇద్ము ప్రథమ కాండమున స్వ్రగ, వ్యోమ, ది, క్కాల, ధీ, వా, క్చబ్దాది, నాట్య, పాతాళ, భోగి, నరక వారి వర్గములు; ద్వితీయ కాండమున భూ,పుర, శైల, వనౌషధి, సింహాది,మనుష్య, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య,శుద్ర వర్గములును; తృతీయ కాండమున విశేష్యనిఘ్న, సంకీర్ణ నానా, ర్ధావ్యయ,క్రియావర్గములును ఉన్నాయి. ఇందలి శైలి మిగుల రమ్యము.

పలుకవెలఁదిమగఁడు బంగారుకడుపువాఁ
డంచతేజి నెక్కునట్టి రౌతు
బమ్మ తాత నలువ తమ్మిచూలి దుగినుఁ
డనఁగ బ్రహ్మపేరు లబ్జమౌళి.

ఇట్టి పద్యములు దీనికి ఉదాహరణములు. దీనిని ఉప్దయోగించే ఇటీవలి శబ్దరత్నాకరము, సుర్యరాయాంధ్ర నిఘంటువు అనేకపదుములు నేర్చుకొనిరి.

  • ఆంధ్రనామసంగ్రహము

దీనిని రచించినది పైడిపాటి లక్ష్మణకవి.ఇందు దైవతమానవస్థావర తిర్య జ్ఞానార్ధవర్ధులను విభజనము ఉంది.దీనిని కవి తన ఇష్టదైవమైన విశ్వేశ్వరునికి అంకితమిచ్చాడు.ఇందు పద్యములు పదములు కూడా ప్రశస్తములే. <poem> వలపులగౌరు చౌదంతి వెల్లయేనుఁ గనఁగ నై రావతంబున కాఖ్య లమరు వేల్పుదొరతేజి యనఁగను వెల్లగుర్ర మనఁగ నుచ్చైశ్రవం బొప్పు నంబికేశ.

  • ఆంధ్రనామశేషము

ఆంధ్రనామసంగ్రహమున చేరక మిగిలిపోయిన మరికొన్ని పదములతో ఆంధ్రనామశేషము అను పేరిట సా.శ.1750 ప్రాంతమున ఆడిదము సూరకవి మరియొక సంగ్రహనిఘంటవును రచించెను.చర్విత చర్వణముగా మరల మరియొక నిఘంటువును రచించక ఆంధ్రనామసంగ్రహమునకు అనుబంధముగా దీనిని రచించెను. ఈరెండు పెక్కు పదములు తెలుపుచున్నవి.

  • సాంబనిఘంటువు

దీనిని రచించినది సా.శ. 18వ శతాబ్దమునకు చెందిన వెచ్చ కస్తూరిరంగకవి. దీనిని ఇతడు సాంబమూర్తికి అంకితమిచ్చాడు.ఆనంద రంగరాట్చందోగ్రంధకర్త యగు కస్తూరిరంగకవి ఈ నిఘంటువును ప్రామాణికముగనే అంగీకృతమైయున్నది.

  • ఆంధ్రపదాకరము

ఇది సా.శ.1840ప్రాంతమున వెలువడినది.దీనిని శ్రీ.రాజా త్యాడిపూసపాటి వీరపరాజు రచించెను. ఇది ఒక పద్య నిఘంటువు.ఇందు సుర, నర, గుణ, పరికర, చర, అచర, నానరధవర్గులు ఉన్నాయి. ఇది యతిసామాన్య నిఘంటువు.

  • ఆంధ్రదీపిక

దీనిని మామిడి వెంకయ్య అను బందరువాసి 1810 సం. న రచించగా ఇది చెన్నపురిలో 1848లో ముద్రితమయ్యెను. ఇది అసమగ్రము, అవిశ్వసనీయమని బ్రౌను దొర వ్రాసెను.నిజమే కాని, ప్రాచీనప్రబంధములందలి కొన్ని పదములు దీసి అకారాదిగా గూర్చి వివిధార్ధమలను వచనములో నొసగుటయే ఇందలి విశేషము.

  • క్యాంబెల్ నిఘంటువు

ఇది అకారక్రమముగా ఆంగ్లపద్ధతిన రచించిన మొదటి నిఘంటువు ఇదియే. ఇది తెలుగు రాని ఆంగ్లేయులకు తెలుగు తెలిసికొనుటకు ఉపయోగించునట్లు తెలుగు పదముల ఆంగ్ల అర్ధములతో రచించబడింది. క్యాంబెలు తెలుగుపాండిత్య అల్పమగుట నిందు చేరనిపదములు, చేర్చిన పదములకు ఈయని అర్ధములు, ఇచ్చిన వానిలో పెక్కు తప్పులు ఉన్నాయి.

  • బ్రౌణ్యనిఘంటువు

క్యాంబెలు తప్పులు సరిదిద్ది బ్రౌణు దొర తెలుగు పాండిత్యము సంపాదించి దీని చాలా ప్రశాస్తముగా వ్రాసియున్నాడు.తెలుగు పదములకు ఆంగ్లార్ధములతో ఒకటి, ఆంగ్లపదముల ఆంధ్రార్ధములతో ఒకటి, అన్యదేశ్యపదజాలముతో అర్ధములతో మిశ్రనిఘంటువు ఇతడు మరియొకటి రచించి కీర్తిగాంచెను.ఇందు మొదటిదానిలో అనేక తెలుగు పదములను జేర్చి వానివాని అర్ధములకు లభ్యములైన పూర్వకవిప్రయోగములను వ్యావహారిక వాక్యములను ఈతడు ఉదహరించియున్నాడు. ఇది క్రీ,శ. 1852లో ప్రకటింపబడింది. 1806లో అల్పారంభమైనను 1830 వరకు ఆంధ్రగ్రంధము లచ్చ్వడుటకే నోచుకొననిదినములలో ఎన్నియో ప్రాచీన ప్రబంధముల సంపాదించి, కొన్ని టీకలు వ్రాయించి కొన్నిటిని ప్రకటించి తెలుగున వ్యాకరణము, నిఘంటువులు రచించి తెలుగుపండితులను కొనియాడి తెలుగు భాషకు బ్రౌను దొర నిరుపమానమగు సేవచేసియున్నాడు.ఈతని నిఘంటువే శాబ్దరత్నాకరమునకు, ఇటీవలి నిఘంటువులకును ప్రతిపాదికయై యెంతయో మేలుకూర్చెను.

  • చిన్నయసూరి నిఘంటువు

బ్రౌను తరువాత పండితాదరణ పాత్రమైన సమగ్రాంధ్రనిఘంటువును సమర్ధతతో నిర్వహింప సమకట్టినవాడు పరవస్తు చిన్నయసూరి. ఈ పవిత్రసంకల్పముతో సా.శ. 1875-80 ప్రాంతమున అకారక్రమమున పదముల్క పట్టికలు తయారుచేసి ప్రతిపదమునకు ప్రతియర్ధమునకు ప్రాచీనకవిప్రయోగములను పరమనిర్ధారకములుగా నున్నవి మాత్రమే కొన్నిటిని కొన్నిటిని జేర్చుకొని యుంచాడు కాని చిన్నయసూరి అర్ధనిర్ణయాదుల జేసి నిఘంటువు పూర్తిచేయుటకు నోచుకొనక దెవంగతుడు అగుటచే ఆతని నిఘంటురచనాద్యోమమే పెక్కురకు దెలియలేదు. ఇది ఆంధ్రుల దురదృష్టమే.

  • శబ్దరత్నాకరము

దీనిని శ్రీ. బహుజనపల్లి సీతారామాచార్యులు వారు సా.శ. 1885లో రచించారు. ఇందు శబ్దార్ధస్వరూపనిర్ణయము శాస్త్రసమ్మతమగను, సమంజసముగను జేయబడుట నిది శ్రీఆచార్యులవారి సామర్ధ్యమును వేనోళ్ళ చాటునదై యున్నది. పదపదార్ధములకు పూర్వకవిప్రయోగములెన్నియో నొసగబడుట ఈ నిఘంటువునకు ప్రామణికత సిద్ధించింది. ఇది పూర్వ నిఘంటువులన్నింటికంటె ఉత్తమమైనది. కాని యతివిస్తృతమగు ఆంధ్ర్హభాషలోని పదజాలమెంతయో చేరవల్సైయున్నది. దీని మొదటి ప్రచురణ:1996.ముద్రణ:అసియన్ ఎడ్యుకెసనల్ సర్విసెస్,న్యూఢిల్లి.

  • ఆంధ్రపదపారిజాతము

దీనిని సా.శ. 1888లో శ్రీ ఓగిరాల జగన్నాధకవి గారు రచించిరి. అకారక్రమమున ఆచ్చికపదముల అర్ధములు, అర్ధాంతరములు ఇందులో నున్నవి. కొన్నిచోట్ల పూర్వగ్రంధములనుండి ఆశ్వాసపద్యసంఖ్యారహితముగ కొన్ని ప్రయోగములు ఈయబడినవి.కాలక్రమమున పదములు అర్ధములు మారుచుండుటచె సుప్రశిద్ధప్రయోగశూన్యములైన నిఘంటువులు ప్రమాణికములు కాజాలవనుటకిది సాక్ష్యము.కాని నేడు మరుగుపడిన దేశ్యపదములు ఎన్నియో ఇందు ఉన్నాయి.

సంవత్సరం, నిఘంటు నిర్మాత, నిఘంటువు పేరు, ప్రచురించ బడిన ప్రదేశం.

  • 1818: డబ్ల్యు. బ్రవున్‌, A Vocabulary of Gentoo and English, మద్రాస్‌.
  • 1821: ఎ.డి. కేంప్‌బెల్‌, A Dictionary of the Teloogoo Language, మద్రాస్‌.
  • 1835: జె.సి.మోరిస్‌, A Dictionary, English and Teloogoo, మద్రాస్‌.
  • 1839: డబ్ల్యు. కార్పెంటర్‌, A Dictionary of English synonyms, లండన్‌.
  • 1841: సి. రామకృష్ణ శాస్త్రులు, A Vocabulary, in English and Teloogoo, మద్రాస్‌.
  • 1841: జె. నికోలాస్‌, A Vocabulary of English and Teloogoo, మద్రాస్‌.
  • 1844: ఇ. బాల్పోర్‌, Vocabularies Telagoo, కలకత్తా .
  • 1847: డబ్ల్యు. ఇల్లియట్‌, Language of the Goands with terms in Telugu, కలకత్తా .
  • 1849: బి.హెచ్‌. హాడ్జ్‌సన్‌, Vocabularies of Southern India, కలకత్తా .
  • 1852: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, A DICTIONARY, Telugu and English, మద్రాస్‌.
  • 1854: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, బ్రౌణ్య మిశ్రభాషా నిఘంటువు A Dictionary of the Mixed Telugu మద్రాస్‌.[1]
  • 1862: రెవరండ్‌ పెర్సివల్‌, Telugu - Eng1ish DICTIONARY, మద్రాస్‌.
  • 1868: సర్‌.ఏ.జె. ల్యాల్‌, A Vocabulary in Hindustani, English, Telugu, నాగపూర్‌.
  • 1886: రెవరండ్‌ పెర్సివల్‌, Anglo-Telugu Dictionary, మద్రాస్‌.
  • 1889: వీరస్వామి మొదలియార్‌, Vocabulary in English and Telugu, మద్రాస్‌.
  • 1891: పి. శంకర నారాయణ, English - Telugu Dictionary, మద్రాస్‌.[2]
  • 1898: జి.డబ్ల్యు. టేలర్‌, An English-Telugu Vocabulary, మద్రాస్‌.
  • 1900: పి. శంకర నారాయణ, Telugu - English Dictionary, మద్రాస్‌.
  • 1900: పి. హోలర్‌, Telugu Nighantuvulu, రాజమండ్రి.

1900 తరువాతి నిఘంటువులు

  • శబ్దార్ధచంద్రికాదులు

దీనిని సా.శ. 1903లో సరస్వతుల సుబ్బరామశాస్త్రి గారు రచించిరి. ఇది అచ్చతెలుగు నిఘంటువు.శ్రీ పం.తిరువెంకటాచార్య రచిత మగు శబ్దార్ధకల్పతరువు, శ్రీ తాటికొండ తిమ్మారెడ్డి విరచితమగు శబ్దార్ధచింతామణి చెప్పుంకొనుటకు విశేషణములు లేని లఘునిఘంటువులు.

  • శబ్దార్ధచంద్రిక

దీనిని 1906లొ శ్రీమహంకాళి సుబారాయుడు రచించిరి. దీనిని చిన్న శబ్దరత్నాకరము అంటారు. ఇది పాఠశాలలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులకు చాల ఉపయోగకరముగ ఉండును.

  • లక్ష్మీనారాయణీయము

దీనిని 1903లో శ్రీ కొట్రలక్ష్మీనారాయణశాస్త్రి రచించిరి. ఇది ఒక శుద్ధాంధ్రప్రతిపదార్ధ పదనిఘంటువు. ఇదియును పిల్లశబ్దరత్నాకరమే. విద్యార్థులకు ఉపయోగికారియే.

  • శబ్దకౌముది

దీనిని 1905లో శ్రీశిరోభూషణము రంగాచార్యులు గారు రచించిరి.ఇది ఇపుడు అలభ్యము.

  • పురుషోత్తమియము

దీనిని 1908లొ శ్రీ నాదెళ్ళ పురుషోత్తమకవిగారు రచించిరి. దీని యందు ప్రకృతి రూపప్రకాశిక, అన్యరూపదీపిక, విశేషరూపదర్శిక అను పలు విభజనలు ఉన్నాయి. ఇది పూర్వ నిఘంటువులనుండి ఈవిభజనములకు నౌవుగా పలుపదములను కొనికూర్పబడినవి.

  • ఆంధ్రవాచస్పత్యము

1920 లో సూర్యరాయనిఘంటువు రచనము జరుగుచుండగా "ఆధ్రవాచస్పత్య" అను పేర శ్రీ కొట్రశ్యామలకామశాస్త్రి గారు నాలుగు సంపుటములలో ఒక పెద్ద నిఘంటువును ప్రకటించిరి. అందు తొలి సంపుటము 1934 సం.లో, మలి సంపుటము 1938సం.లో,మూడునాలుగు 1939,1940 లలోను ప్రకటితమయ్యెను. ప్రతిపదమునకు ప్రతిఅర్ధమునకు ఇందు ప్రామాణ్యములు ఒసగబడలేదు, ఇది సరియైన శాస్త్రదృష్టిని (Scientific method) జరుగని కారణమున రావలసిన కీర్తి దీనికి రాలేదు.

  • శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు

ఆంధ్ర నిఘంటు రచనమున ఆధునికముగా అగ్రగణ్యస్థానమంద దగిన సూర్యరాయనిఘంటు రచనము 1920 సం.ప్రాంతమున చెన్నపురిలో ఆరంభమైనది. దీనికి శ్రీ పీఠికాపురాధీశులు అగు శ్రీ జయంతి రామయ్య పంతులు ఆశ్రయము. ఈ బృహన్నిఘంటువున అనేక తత్సమ శాబ్దములు పరిశీలనా పూర్వకముగా సంస్కృత నిఘంటువుల నుండి గైకొనబడినవి. వానికి సంస్కృత కావ్య నాటకాదుల నుండియు, ఆంధ్ర ప్రబంధములనుండియు నటనటనావశ్యకములని తోచిన చోటులను, అర్ధ విశేషములు గల చోటులను ప్రయోగములీయబడినవి. ప్రతిపదమునకును ప్రతి అర్ధమునకును ప్రామాణిక ప్రయోగములనో, నిఘంటువులనో, లేక శిష్టవ్యవహారమునో ఈనిఘంటువు చూపుచుండుటచే దీని కొక ప్రామాణికత ఇచ్చినట్లయినది. ఒక్కొక్క పదమునకు అర్ధమునకు ఒక్కొక్క పయోగమునేకాక పూర్వ పూర్వతర పూర్వతమ ప్రయోగములను ప్రధాన పదములక్రింద ఇచ్చి వాని అర్ధాంతరములను ప్రయోగ సహితముగా ఇందు వివరించిరి. శబ్దముల జన్య జనక సంబంధము కూడనిందు వివరింపబడింది.లోకవ్యవహారము నుండియు ప్రాచీన శిలాశాసనములనుండియు కొన్ని కొన్ని శబ్దములిందు గైకొనబడినవి. వానివానికి సముచితార్ధములు, అర్ధాంతరములు ఇందు పొందు పరచబడినవి.

Thumb
శబ్దరత్నాకరము.తెలుగు-తెలుగు నిఘంటువు
వావిళ్ల నిఘంటువు, 1949 [3]
తెలుగు వ్యుత్పత్తి కోశం

లకంసాని చక్రధరరావు,ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ సంపాదకత్వంలో "తెలుగు వ్యుత్పత్తి కోశం " పేరుతో తెలుగు నుండి తెలుగు నిఘంటువు 1,08,330 పదాలతో 8 సంపుటాలుగా వెలువడినది.

  1. అ-ఔ (1978) 412 పేజీలు, పొట్టి శ్రీరాములు కిఅంకితం.ఎమ్.ఆర్.అప్పారావు తొలిపలుకులు.12219 పదాలు.
  2. క-ఘ (1981) 455 పేజీలు, కట్టమంచి రామలింగారెడ్డికి అంకితం. ఆవుల సాంబశివరావు ముందుమాట.19670 పదాలు
  3. చ-ణ (1981) 277 పేజీలు, ........... కిఅంకితం, ఆవుల సాంబశివరావు ముందుమాట.11000 పదాలు
  4. త-న (1985) 440పేజీలు, వాసిరెడ్డి శ్రీకృష్ణకి అంకితం. కోనేరు రామకృష్ణారావు మున్నుడి.16000 పదాలు.
  5. ప-భ (1987) 498 పేజీలు, లంకపల్లి బుల్లయ్యకి అంకితం. కోనేరు రామకృష్ణారావు మున్నుడి.19000 పదాలు.
  6. మ (1987) 268 పేజీలు, ఎమ్.ఆర్.అప్పారావుకి అంకితం కోనేరు రామకృష్ణారావు ముందుమాట.9754 పదాలు
  7. య-వ (1989) 272 పేజీలు, ఆవుల సాంబశివరావుకి అంకితం కనిశెట్టి వెంకటరమణ తొలిపలుకు.10132 పదాలు
  8. శ-హ (1995) 315 పేజీలు, కోనేరు రామకృష్ణారావుకి అంకితం మద్ది గోపాలకృష్ణారెడ్డి ప్రవచనం. 6651పదాలు. 3904 (అ-హ) అనుబంధం.

ఆంతర్జాల నిఘంటువు

తెలుగు-తెలుగు నిఘంటువులు
ఆంగ్లం-తెలుగు నిఘంటువులు
  • అక్షర మాల నిఘంటువు,[8]
  • బ్రౌణ్య ఆంగ్లం-తెలుగు నిఘంటువు . స్వేచ్ఛ యూనికోడ్ లోకి మార్చిన ( ప్రజోపయోగ పరిధిలో ) [9]
  • లిటిల్ మాస్టర్స్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ, సంకలనం:ఎస్ కె వెంకటాచార్యులు, 1992 జనవరి,[10]
  • సాహితి ఆన్ లైన్ నిఘంటువులు [11] ఇందులో బ్రౌన్, వేమూరి నిఘంటువులు ఉన్నాయి. ఇవి తెలుగు, తెలుగు (ISCII), యూనికోడ్లో పనిచేస్తుంది.
  • వేమూరి. ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు - 2002 (గూగుల్ బుక్స్‌లో ఉచిత మునుజూపు కొన్ని పేజీలుమాత్రమే )[12]
  • వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) ఇది తెలుగు వికీపీడియాలో పూర్తిగా ఉంది. ఈ నిఘంటువు "సైంసు"కి పెద్ద పీట వేసిన నిఘంటువు.
తెలుగు-ఆంగ్లం నిఘంటువులు
  • గ్విన్ తెలుగు-ఆంగ్లము నిఘంటువు నిఘంటువు [13]. తెలుగు పదాలు ఇంగ్లీషులిపిలో ఉన్నాయి.
  • బ్రౌన్ తెలుగు-ఆంగ్లము నిఘంటువు [14] తెలుగు లిపి వాడబడిన 1903 ప్రచురణ.
  • పి.శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు - (గూగుల్ బుక్స్‌లో ఉచిత మునుజూపు కొన్ని పేజీలుమాత్రమే) [15]
  • వెబ్స్టర్స్ తెలుగు -ఆంగ్లం [16]
  • వేమూరి నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు) ఇది తెలుగు వికీపీడియాలో పూర్తిగా ఉంది. ఈ నిఘంటువు "సైంసు"కి పెద్ద పీట వేసిన నిఘంటువు.
బహు భాషా నిఘంటువులు
  • ఆంధ్రభారతి నిఘంటువు [17] ద్వారా వివిధ తెలుగు నిఘంటువులను యూనికోడ్తో వెతకవచ్చు.
  • భాషా సాంకేతికాల పరిశోధన కేంద్రం నిఘంటువు: ఆంగ్లం నుండి తెలుగుకు, కన్నడ మరాఠి, బెంగాలి నుండి హిందీ ఉర్దూ కు, ఇంకా ఎన్నో భారతదేశభాషల నుండి వివిధమైన భాషలకు తర్జుమా చేయుటకు భాషా సాంకేతికాల పరిశోధన కేంద్రం, ఐఐఐటి, హైదరాబాదు,[18] నిఘంటువులు [19] తయారుచేసింది. అయితే ఇవి యూనికోడ్ కు ముందు తరానివి, పాత కోడింగ్ పద్ధతులు (ISCII, Shusha, RomanReadabale, itrans, RomanWX కోడులు అంటే ఇంగ్లీషు అక్షరాల వాడి తెలుగు రాయాలి)వాడబడినవి.
  • విక్షనరీ వ్యాసము,[20]
  • గూగుల్ అనువాదం [21]

ప్రత్యేకమైన నిఘంటువులు

  • పారిభాషిక పదకోశం, గణిత, సాంఖ్యక శాస్త్రాలు, (పారిభాషిక పదావళి-2), తెలుగు అకాడమి, 1973
  • పారిభాషిక పదకోశం, భౌతిక శాస్త్రం, (పారిభాషిక పదావళి-8), తెలుగు అకాడమి, 1979
  • పారిభాషిక పదకోశం, జంతుశాస్త్రం, (పారిభాషిక పదావళి- ), తెలుగు అకాడమి,
  • పారిభాషిక పదకోశము-, సంకలనం. తిరుమల వెంకట రంగాచార్యులు, ప్రకాశకులు కాశీనాధుని నాగేశ్వరరావు,1936, ఆంధ్ర గ్రంథమాల-27 ఇంటర్నెట్ ఆర్కైవ్ నకలు [22]
  • ఆధునిక వ్యవహార పదకోశము, బూదరాజు రాధాకృష్ణ[23]
  • పత్రికా పదకోశం ఇంగ్లీషు-తెలుగు, సం:చేకూరి రామారావు, ద్వితీయ ముద్రణ పరిష్కర్త: బూదరాజు రాధాకృష్ణ,,2004 [24]
  • తెలుగు పర్యాయపద నిఘంటువు సంకలనం:ఆచార్య జి.ఎన్.రెడ్డి, 1990 జూన్, విశాలాంధ్ర పబ్లిషర్స్ ( 1998 మే)
  • పాలనా పరిభాష [25]
  • మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ పరిభాష [26]
  • తరచూవాడేస్థానికీకరణ పదాలు (FUEL)[27]

కొత్త పదాల సృష్టి, సమన్వయం

ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులు (క్లుప్త సందేశ సేవ (SMS), ఇంగ్లీషు భాషా, సమాచార సాధనాలు, దృశ్య శ్రవణ మాధ్యమాలలో ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడుక) ప్రజల జీవనశైలి, వారి భాషపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితులలో తెలుగు భాషని సజీవంగా పుంచడానికి, కొత్తగా తయారయ్యే పరభాషా పదాలకి అనుగుణంగా తెలుగు పదాల నిర్మాణం జరగాలి. దీనికి ప్రస్తుతం ఎవరికి వారే యమూనాతీరే అన్నట్లుగా జరుగుతున్న పనిని కొంతవరకు సమన్వయం చేస్తున్న జాల స్థలాలున్నా [28][29][30][31][32][33] మరింత మెరుగు చేయటానికి తెలుగు భాషా సంస్ధలు ముందుకి రావాలి.

నిఘంటువుల భవిష్యత్

ప్రింట్‌ రూపంలో ఉన్న నిఘంటువులకు గిరాకీ తగ్గిపోతోంది కాబట్టి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో మాత్రమే ఉండేలా ఆక్స్‌ఫర్డ్ ప్రెస్‌ వ్యూహం మార్చింది.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

వనరులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.