పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరమని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

గోదావరి నది పురాణము

రాజమండ్రి వద్ద గోదారమ్మ విగ్రహం పూర్వము బలి చక్రవర్తిని శిక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి మూడడుగుల స్థలం కావాలని అడుగగా బలి చక్రవర్తి మూడడుగులు ధారపోసాడు. మహావిష్ణువు ఒక అడుగు భూమి పైన, రెండో అడుగు ఆకాశం పైన, మూడో అడుగు బలి తలపై పెట్టి పాతాళం లోకి త్రొక్కి వేస్తాడు. భూమండలం కనిపించకుండా ఒక పాదం మాత్రమే కనిపించడంతో చతుర్ముఖ బ్రహ్మ కమండలం లోని నీటిలో సమస్త తీర్థాలను ఆవాహన చేసి ఆ ఉదకంతో శ్రీ మహావిష్ణువు పాదాలను అభిషేకించి, మహావిష్ణువును శాంతింపజేస్తాడు. అందువల్లనే గంగను విష్ణుపాదోద్భవి గంగా అని పిలుస్తారు. అలా పడిన గంగ పరవళ్ళు త్రొక్కుతుంటే శివుడు తన జటాజూటంలో బంధిస్తాడు. పరమశివుడిని మెప్పించి భగీరథుడు తన పితామహులకు సద్గతులను కలగజేయడానికి గంగను, గోహత్యాపాతకనివృత్తి కోసం గౌతమ మహర్షి గోదావరిని భూమికి తీసుకొని వస్తారు.

ఒకానొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి కరువుతో తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు, వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆ ఋషులు తమకు లేని తపోశక్తులు గౌతమునికి ఉన్నాయని ఈర్ష్యతో ఒక మాయ గోవును పంపి గౌతముడి పాడిపంటలు నాశనం చేయించారు. గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదలించగా అది మరణించింది. గౌతముడు తాను చేసిన గోహత్యాపాతకం నివృత్తి కోసం శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు ఆ గంగయే గోదావరి లేదా గౌతమీ నది. ఈ నదిని ఆ చనిపోయిన గోవు మీద నుండి ప్రవహింపజేసి తన గోహత్యాపాతకాన్ని విముక్తి చేసుకొన్నాడు. ఆ గోవుకి స్వర్గప్రాప్తి కలిగింది. ఆ స్థలమే గోష్పాద క్షేత్రం. ఈ క్షేత్రమే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం.

పుష్కరాల ఆవిర్భావం

నదీ బాగోగులు, అనగా నదీ పర్యావరణము, పరిశుభ్రతను తెలుసుకొనేందుకే పుష్కరాలు ఆచరించడమనే సంప్రదాయం పుట్టిందని పలువురి అభిప్రాయం. నదీ తీరంలో ఎక్కడ మెరక, పల్లం ఉంది? ఎక్కడెక్కడ కోతకు గురవుతున్నది? ఎక్కడ చెట్లు నరికివేశారు? ఏ ప్రాంతంలో కలుషితమౌతోంది? అనే విషయాలు అధ్యయనం చేసి, దాని బాగోగులు చూడటానికే 12 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించే అభివృద్ధి కార్యక్రమమే పుష్కరాలు అని, అంతే గాని కేవలం పూజలు నిర్వహించి స్నానాలు చేయడానికి కాదని సుప్రసిద్ధ మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు అభిప్రాయపడ్డారు [1]. హృదయంలో పశ్చాత్తాపం మార్పు వస్తే తప్ప నదిలో కేవలం స్నానం చేయడం వలన చేసిన పాపాలు పోవని, పుణ్యం రాదని, వాస్తవానికి ఆధ్యాత్మికత జోడించంవలనే ప్రజలకు నదీ ప్రాముఖ్యత తెలుస్తున్నదని పలువురి అభిప్రాయం.

గోదావరి పుష్కరాల పురాణం

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు తందిలునితో ఏ వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మకార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణాలు చెప్తున్నాయి.

భారతదేశంలో గంగానది తరువాత అంత పేరుగాంచిన జీవ నది గోదావరి నది. ఈ గోదావరి నదిని దక్షిణ గంగగా అభివర్ణిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యం గల ఈ పుణ్య నది యొక్క రాశి సింహరాశి. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి యమునా నది పుష్కరాలు తరువాత గోదావరి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో పుణ్యనగరి రాజమండ్రికి దేశ విదేశాల నుండి భక్త జనం పోటెత్తుతుంది. లక్షలాది భక్తులు గోదావరి నది స్నానం కోసం రాజమండ్రి వస్తారు. ఈ సమయం రాజమండ్రి నగరం ప్రతేక శోభతో విరాజిల్లుతుంది.

గోదావరి నది పుష్కరాలు

1884 పుష్కరాలు

1884 తారణనామ సంవత్సరంలో గోదావరి పుష్కర సంభంరం ప్రారంభమైంది. అపుడు 'గోదావరి పుష్కర యాత్రికులు ఉత్కళ దేశం నుండి, నిజాం రాష్ట్రం నుండి, తక్కిన ఆంధ్ర మండలం నుండి వచ్చారు' అని చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తన `స్వీయచరిత్ర' లో రాసుకున్నారు.

1896 పుష్కరాలు

పుష్కర యాత్రికుల కోసం అప్పటి బ్రిటీష్ వారుకోటి లింగాల వద్ద తాటియాకుల పందిళ్లు, పాకలు వేయించి వసతులు ఏర్పాటుచేశారు. దర్మవరం సంస్థానం ప్రోప్రయిటర్ కంచుమర్తి రామచంద్రారావు జమీందారు యాత్రికులు సౌకర్యంకోసం నీళ్ల పైపులను వేయించారు. అంతేకాకుండా రహదారులు కూడా వేయించారు.

ఎలిపిన్ స్టన్ సబ్ కలెక్టర్ గోదావరిరేవులో జనం పడిపోకుండా, కర్రలు పాతించారు. కలరా రాకుండా వైద్యం అందించారు.

1956 పుష్కరాలు (మే 3 నుంచి జూన్ 2 వరకు)

మన భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటి పుష్కరాలు. అన్ని పుష్కరాల విధంగానే ఈ పుష్కరాలకు కూడా అధికారికంగా తేదీలు నిర్ణయించారు. అయితే ఆ తేదీలు సరైనవి కావని పండితులు మరో తేదీలు ఖరారు చేశారు. కనుక 24 రోజులు పుష్కరాలు చేయడం తప్పనిసరి అయింది. వేద సండితులు నిర్ణయించిన ప్రకారం మే 3 నుంచి 14 వ తేదీ వరకు పుష్కరాలు జరిగాయి. అధికారులు మే 22 నుంచి జూన్ 2 వరకి పుష్కరాలను జరిపించారు.

1967 పుష్కరాలు (సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు)

1979 పుష్కరాలు (ఆగష్టు 29 నుంచి సెప్టెంబర్ 9 వరకు)

1979 పుష్కరాల్లో తితిదే తరపున ప్రత్యేక అధికారిగా డా. రావుల సూర్యనారాయణమూర్తి గారు నియమించబడ్డారు. ఆ సమయంలో తితిదే తరపున రాజమండ్రిలో ఏదో ఒక కార్యక్రమం చేయమని అప్పటి ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి గారు సూచించారు. దాంతో అప్పటి టి.టి.డి. ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ పి.వి.ఆర్.కె ప్రసాద్ గారు ప్రణాళికారచన ప్రారంభించారు. 1979 వరకూ జరిగాయి.

  • రాజమండ్రి లోని సుబ్రహ్మణ్య మైదానంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. అందుకోసం తిరుమల నుండి అర్చకులను, సిబ్బందిని తీసుకొని వచ్చారు.
  • మైదానం అంతా పండాల్స్ నిర్మించి అర్ధరాత్రి వరకు హరికథలు, పురాణ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు మొదలైన ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహించారు.
  • కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక గ్రంథాలను పంపిణీ చేశారు. ఒక్కొక్క పుస్తకాన్ని పది వేలకు పైగా ముద్రించి నామమాత్రపు ధరకు విక్రయించగా అందుకు విశేష ఆదరణ లభించింది.

1991 పుష్కరాలు (ఆగష్టు 14 నుంచి 25 వరకు)

1979 పుష్కరాల్లో వచ్చిన స్పందన, ప్రజల్లో వచ్చిన గుర్తింపుని చూసి రెండవసారి అనగా 1991లో కూడా ధార్మిక సేవలు అందించడానికి టి.టి.డి. ముందుకువచ్చింది. మున్సిపల్ ఆఫీసులో జిల్లాస్థాయిలో జరిగిన పుష్కర ఏర్పాట్ల విస్తృతస్థాయి సమావేశానికి టి.టి.డి తరపున డా. రావుల సూర్యనారాయణమూర్తి గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో అప్పటి జిల్లా కలెక్టర్ రఫదీస్ సూడాన్, జాయింట్ కలెక్టర్ ఉమామహేశ్వరరావు, రెవెన్యూ కార్యదర్శి కె.ఎస్.ఆర్. మూర్తి, పుష్కరాల ప్రత్యేక అధికారిగా కృష్ణయ్య పాల్గొన్నారు.

సుబ్రహ్మణ్య మైదానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సమాచార ప్రచారశాఖకు స్టాల్స్ పెట్టుకోవడానికి కేటాయించారు. టి.టి.డి. ధార్మిక సేవలకు వేరే స్థలాన్ని ఇచ్చారు. అయితే పవిత్ర గోదావరిలో స్నానంచేసి, దైవదర్శనం చేసుకొని కొంచెంసేపు ఆధ్యాత్మికంగా కాలక్షేపం చెద్దామనుకుంటున్న భక్తులకు అందుబాటులో ఉన్న స్థలం కావాలని, కాబట్టి సుబ్రహ్మణ్య మైదానాన్ని టి.టి.డి. ధార్మిక సేవలకు ఇవ్వాలని సూర్యనారాయణమూర్తి గట్టిగా పట్టుబట్టడంతో ప్రభుత్వం అంగీకరించింది.

దాంతో గత పుష్కరాల మాదిరిగానే అన్ని ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు వచ్చిన ప్రతి భక్తుడు టి.టి.డి. దేవాలయాన్ని దర్శించకుండా వెళ్లేవారుకాదు. చాలాసేపు ఆ పవిత్ర స్థలంలోనే ఉండి వెళ్లేవారు. స్వామివారి లడ్డులను కూడా విక్రయించారు.

2003 పుష్కరాలు (జూలై 30 నుంచి ఆగష్టు 10 వరకు)

2015 పుష్కరాలు

పుష్కర నిర్ణయము-2015

రేలంగి తంగిరాల వారి గంటల పంచాంగము (2015-2016) ప్రకారం మన్మథ నామ సంవత్సర అధికాషాఢ బహుళ త్రయోదశీ మంగళవారం అనగా 2015 జూలై 14 ఉదయం 6.26 ని.లకు బృహస్పతికి సింహరాశి ప్రవేశము సంభవించింది.[2] కావున ఈ దినము లగాయితు గోదావరి నదికి పుష్కర ప్రారంభముగా ఆచరింపదగును. పుష్కరవ్రతము ద్వాదశ దిన సాధ్యమగుటచే 14-7-2015 నుండి 25-7-2015 వరకు ఆధి పుష్కరములుగా ఆచరింపవలెను. ఈ గోదావరి నదికి మాత్రము అంత్యమందు 12 రోజులు కూడా, అనగా 31-7-2016 నుండి 11-8-2016 వరకు అనగా బృహస్పతి కన్యారాశి యందు ప్రవేశ పూర్వము వరకు పుష్కర కార్యక్రములను యధావిధిగా ఆచరింపవలెను.

2015 సంవత్సరంలో గోదావరి పుష్కరాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేసి జరిపించాయి.[1] ఈ పుష్కరాలు గోదావరి నది తీరాన వివిధ ప్రాంతాలలో జరుగుతాయి.[2]

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.