ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించింది.జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది. అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం. అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు), మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది. అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది. శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే.నదీతీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని పెద్దలు చెప్తారు. పితరులను ఉద్దరించడానికి భాగీరధుడు గంగానదిని భూమికి తీసుకు వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తి వాచకం చెప్పడమని లోకోక్తి. నదీ స్నానాలలో పూష్కర స్నానం పుణ్యప్రథమని హిందువుల విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.

గోదావరి పుష్కరాలు 2015 మొదలు తేదీ 2015 జూలై 14. ఆఖరు తేదీ 2015 జూలై 25. మొత్తం దినాలు 12.

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానం. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.

బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరం అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

భాషా విశేషాలు

పుష్కర శబ్దానికి నీరు.. వరుణుని కుమారుడు అనే అర్థాలు ఉన్నాయి, పుష్కరం [ puṣkaramu ] pushkaramu. సంస్కృతం n. The tip of an elephant's trunk. ఏనుగు తొండము చివర. A lotus. మెట్ట తామర. The sky, ఆకాశము. The head of a drum. వాద్యముఖం The revolution of twelve years. A feast held once every twelve years at certain holy rivers as the గోదావరి పుష్కరం, కృష్ణపు ష్కరం, &c. ఒక పుష్కర పాలగ్రామములు a dozen holy stones. కరపుష్కరం the lilies of her hands, i.e., her fair hands. పుష్కరిణి pushkarini. n. A flowery lake, a pond wherein lotuses grow. A i. 55. తామరకొలను, కోనేరు. A female elephant.

పుష్కరాల ఉద్దేశం

నదీ బాగోగులు, అనగా నదీ పర్యావరణము, పరిశుభ్రతను తెలుసుకొనేందుకే పుష్కరాలు ఆచరించడమనే సంప్రదాయం పుట్టిందని పలువురి అభిప్రాయం. నదీ తీరంలో ఎక్కడ మెరక, పల్లం ఉంది? ఎక్కడెక్కడ కోతకు గురవుతున్నది? ఎక్కడ చెట్లు నరికివేశారు? ఏ ప్రాంతంలో కలుషితమౌతోంది? అనే విషయాలు అధ్యయనం చేసి, దాని బాగోగులు చూడటానికే 12 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించే ప్రక్షాళన కార్యక్రమమే పుష్కరాలు అని, అంతే గాని కేవలం పూజలు నిర్వహించి స్నానాలు చేయడానికి కాదని సుప్రసిద్ధ మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు అభిప్రాయపడ్డారు.[1] హృదయంలో పశ్చాత్తాపం మార్పు వస్తే తప్ప నదిలో కేవలం స్నానం చేయడం వలన చేసిన పాపాలు పోవని, పుణ్యం రాదని, వాస్తవానికి ఆధ్యాత్మికత జోడించంవలనే ప్రజలకు నదీ ప్రాముఖ్యత తెలుస్తున్నదని పలువురి అభిప్రాయం.

పుష్కరాల వెనుక ఉన్న ఇతిహాసం

పుష్కర జననం

పవిత్రమైన నదులలో మానవులు స్నానం చేసి వారి పాపాలను పోగొట్టుకొంటున్నారు. నదులు ఆపాపాలు స్వీకరించి అపవిత్రులు అవుతున్నాయి. మానవుల వల్ల అపవిత్రులై ఆ నదులు పాపాలు భరించలేక బాధ పడుతుంటే పుష్కరుడు అనే మహానుభావుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ దేవుని అనుగ్రహం పొంది తనను ఒక పవిత్ర క్షేత్రంగా మార్చమని కోరతాడు. ఈ విధంగా పుష్కరుడు పుష్కర తీర్థంగా మారి స్వర్గలోకమున మందాకిని నది యందు అంతర్భూతమై ఉన్నాడు. పన్నెండు సంవత్సరాల కాలం. భారతదేశంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నదులకు పుష్కరాలు పేరుతో ఉత్సవాలు జరిపే ఆనవాయితీ ఉంది. పుష్కర అనేది భూమి విూది సప్త ద్వీపాలలోనూ ఒకదాని పేరు. కానీ, సాధారణంగా పుష్కరం/ పుష్కరాలు అంటే నదులకు జరిగే పుష్కరోత్సవాలనే స్ఫురిస్తుంది. మన దేశంలోని పన్నెండు నదులకు పుష్కరాలు జరపడానికి సంబంధించి వాయు పురాణంలో ఒక గాథ ఉంది. బ్రహ్మలోక వాసి పుష్కరుడు గురుగ్రహం ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశిస్తుందనే కాలాన్ని బట్టి ఈ పన్నెండు నదులనూ దర్శిస్తుంటాడని ఐతిహ్యం. బ్రహ్మ స్వయంగా పంపించిన వాడు కావడం చేత పుష్కరుడు నదులకు వచ్చినప్పుడు సప్త మహా ఋషులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తుంటారని, వారు సూక్ష్మ దేహంతో నదులకు వస్తారు కనుక వారు వచ్చిన కాలం పవిత్రమైనదనీ ఒక విశ్వాసం. గురుగ్రహం, అంటే బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడు గంగానదికీ, కన్యారాశికి వచ్చినప్పుడు కృష్ణా నదికీ, సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికీ, అలాగే మరికొన్ని నదులకూ పుష్కరాల ఉత్సవాలు జరుగుతాయి. మరి కొన్ని నదులు ఏవి అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకు వేదకాలంలో సరస్వతి నది ఉండేది. ఇప్పుడు అది లేదు. దేశం మొత్తం విూద గంగానది పుష్కరాలే ప్రసిద్ధి. ఎక్కువ మందికి ఆమోద యోగ్యమైన పుష్కర నదుల పేర్లివి - రాశి నామాలతో సహా : సింధు (కుంభ రాశి), నర్మద (వృషభ రాశి), యమున (కర్కాటకం), అదృశ్యవాహినిగా సరస్వతి (మిథున), కావేరి (తులారాశి), ప్రాణహిత (విూన రాశి), భీమ (వృశ్చికం), తుంగభద్ర (మకరం), పుష్కర (ధనుస్సు). ఈ జాబితాలో పెద్ద లోపాలు ఉన్నాయి. ఉదాహరణకు పుష్కర ఒక సరస్సేగాని నది కాదు. భీమ, తుంగభద్ర, ప్రాణహిత ఉపనదులేగాని నదులు కావు. గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలకు కూడా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తుంటారు. బృహస్పతి రాశిలో ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులు పుష్కరం అంటారు. సంవత్సర కాలం జరిగే ఈ ఉత్సవాలలో చివరి పన్నెండు రోజులూ అంత్య పుష్కరం. పుష్కరాలు ప్రారంభ మైనప్పటి మొదటి పన్నెండు రోజులే చాలా ముఖ్యం. పితృదేవతలను స్మరించుకోవడానికి, తర్పణాదులకు ఇది చాలా మంచి సందర్భమని పూర్వం నుంచి ఒక విశ్వాసం బలంగా ఉంది. సప్తర్షులేగాక, చాలా మంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదుల ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరి స్తుంటారనీ, పుష్కర స్నానాలు చేసే వారికి శుభాలను కలిగిస్తారనీ కూడా నమ్మకం. పుష్కరాలు జరిగే సంవత్సర కాలంలో నదికి సవిూప ప్రాంతాలలోని వారు వివాహాది శుభ కార్యాలు చేయరు. తప్పని సరిగా చేయవలసి వస్తే వేరే ప్రాంతాలకు వెళ్లి చేస్తారు. ఉత్సవాలు జరిగే పన్నెండు రోజులూ అవకాశం ఉన్నవారు నదీ స్నానాలు చేస్తారు, తీరంలో పూజలు, తర్పణాలు, జపాలు, దానాలు చేసే సంప్రదాయం ఉంది.

పుష్కరుని చరిత్ర

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్థించాడు .ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణాలు చెప్తున్నాయి.

పుష్కర సమయంలో చేయవలసిన దానాలు

పురాణాలలో చెప్పబడిన పుష్కర సమయంలో చేయవలసిన దానాలు.

  • మొదటి రోజు;- సువర్ణ దానం, రజితం దానం, ధాన్య దానం, భూదానం చేయాలి.
  • రెండవరోజు;-వస్త్ర దానం, లవణ దానం, రత్న దానం చేయాలి.
  • మూడవ రోజు;- గుడ (బెల్లం), అశ్వశాఖ, ఫల దానం చేయాలి.
  • నాల్గవ రోజు;-ఘృతం (నెయ్యి) దానం, తైలం (నూనె) దానం, క్షీరం (పాలు, మధువు (తేనె) దానం చేయాలి.
  • ఐదవ రోజు;-ధాన్యదానం, శకట దానం, వృషభదానం, హలం దానం చేయాలి.
  • ఆరవవ రోజు;-ఔషధదానం, కర్పూరదానం, చందనదానం, కస్తూరి దానం చేయాలి.
  • ఏడవ రోజు;- గృహదానం, పీట దానం, శయ్య దానం చేయాలి.
  • ఎనిమిద రోజు;- చందనం, కందమూలాల దానం, పుష్ప మాల దానం చేయాలి.
  • తొమ్మిదవ రోజు;-పిండ దానం, దాసి దానం, కన్యాదానం, కంబళి దానం చేయాలి.
  • పదవ రోజు;-శాకం (కూరగాయలు) దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం చేయాలి.
  • పదకొడవ రోజు;-గజ దానం చేయాలి.
  • పన్నెండవ రోజు;-తిల (నువ్వులు) దానం చేయాలి.

పుష్కర సమయంలో పిండ ప్రదానం

సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రథమని విశ్వసిస్తారు.మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి.శ్రాద్ధకర్మలు ఉపనయనం, వివాహం అయిన పురుషులు తండ్రి మరణాంతరం మాత్రమే చేయాలి.

పుష్కరకాల స్నానం

నీటిలో రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం, మార్జనం అనేశక్తులున్నాయని వేదం వివరిస్తుంది.మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే మార్జన అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన.నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానంద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు.తీర్ధ స్నానం ఉత్తమం దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం. ఆసమయంలో దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని, పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం లభిస్తుందని, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది.నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది.ఇసుకతో కాని, మట్టితో కాని పార్థీవ శివలింగాన్ని చేసి పూజించాలంటారు. నదీ తీరంలోని ఇసుకను నదిలోకి వేయాలంటారు. పురోహితులు భక్తుల తలపై మూడు దోసిళ్ల నీళ్లతో ఆశీస్సులు అందజేస్తారు. గోదావరికి దీప దానం కూడా చేస్తారు. -

నదికి వాయినాలు

సుమంగళిగా జీవితాంతంగా ఉండాలని కోరుకుంటూ ఆడపడచులు పుష్కరాల సందర్భంగా నదీమతల్లికి వాయినాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు దూరమై అన్నీ శుభాలే కలుగుతాయని విశ్వసిస్తారు. చీర, రవికె, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. బ్రాహ్మణ జంటలకు, ముత్తెదువలకు వాయినాలను అందజేసి వారి ఆశీస్సులు స్వీకరిస్తారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.