From Wikipedia, the free encyclopedia
సంధ్యావందనం శ్రీనివాసరావు దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి విద్వత్ గాయకుడు.
ఇతడు అనంతపురం జిల్లా పెనుకొండలో 1918, ఆగష్టు 21న నారాయణరావు, గంగాబాయి దంపతులకు జన్మించాడు.[1] ఇతని తల్లిదండ్రులు దాసకూట పరంపరకు చెందినవారు. ఇతని పూర్వీకులు మైసూరు సమీపంలోని శ్రీరంగపట్టణంలో నివసించేవారు. ఇతడు దత్తమండల కళాశాలలో బి.ఎ.చదివాడు. తరువాత బి.ఎల్. కూడా చదివాడు. వకీలుగా కొంతకాలం ప్రాక్టీసు చేశాడు. అనంతపురం కలెక్టర్ ఆఫీసులో కొంతకాలం గుమాస్తాగా పనిచేశాడు. ఇతడి భార్యపేరు సరస్వతి. ఇతనికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె కలిగారు.
ఇతడు సంగీతంలో ప్రాథమిక పాఠాలు పల్లవి పక్క హనుమంతాచార్, తిరుపతి రంగాచార్యులు, చిలమత్తూరు రామయ్యల వద్ద అభ్యసించాడు. తరువాత ఇతడు టైగర్ వరదాచారి, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, ద్వారం వేంకటస్వామినాయుడు, మైసూరు వాసుదేవాచార్‌ల వద్ద సంగీతంలో మెళకువలు నేర్చుకున్నాడు. శ్రద్ధతో, ఉత్సాహంతో, పట్టుదలతో అనేక ప్రాచీన సంప్రదాయ కీర్తనలు సేకరించి, స్త్రీలపాటలు, పల్లెపదాలు అనేకం ప్రోదిచేసి వాటి ద్వారా ప్రాచీన రాగాల స్వరూపాలను కల్పన చేశాడు.ఇతడు తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, సంస్కృతము, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇతడు కళ్యాణి, యదుకుల కాంబోడి, భైరవి, కేదారగౌళ, సహన, ద్విజవంతి మొదలైన రాగాలలో విశేషమైన కృషి చేశాడు. ఇతడు తన 12వ యేటి నుండే కచేరీలు ఇవ్వడం ప్రారంభించి సుమారు 6 దశాబ్దాల కాలం దేశం అంతటా సంగీత ప్రదర్శనలు ఇచ్చాడు. ఇతడు ఆకాశవాణి విజయవాడ,మద్రాసు కేంద్రాలలో శాస్త్రీయ సంగీత కార్యక్రమాల నిర్వాహకుడిగా, వివిధ హోదాలలో పనిచేశాడు. ఇతడు చక్కటి కర్ణాటక బాణీలో గానం చేసి భక్తిరంజని కార్యక్రమాలను నిర్వహించాడు. ఆకాశవాణిలో అనేక వాద్యగోష్టులను నిర్వహించాడు. మద్రాసులోని సంగీత ఉపాధ్యాయుల కళాశాలకు ప్రిన్సిపాల్‌గా కుడా పనిచేశాడు.
ఇతడు కేంద్ర సంగీత అకాడెమీ నిపుణుల కమిటీలోను, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిటీలోను, సంగీత నాటక అకాడెమీలోను, ఆకాశవాణి ఆడిషన్స్ కమిటీలోను సభ్యుడిగా నియమించబడ్డాడు. ఇతడు తిరుపతి తిరుమల దేవస్థానముల వారి అన్నమయ్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు లకు ప్రత్యేక అధికారిగా కూడా సేవలను అందించాడు. ఇతడికి అనేక పురస్కారాలు, బిరుదులు లభించాయి. సంగీత అకాడెమీ పురస్కారం, డి.లిట్., తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండిత పదవి మొదలైనవి ముఖ్యమైనవి. సంగీత కళాచార్య, సంగీత కళారత్న, స్వరవిలాస అనే బిరుదులు ఇతడికి లభించాయి.[2]
ఇతడికి అరియకుడి రామానుజ అయ్యంగార్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, ఎం.ఎస్.సుబ్బలక్ష్మి, ఎం.ఎల్.వసంతకుమారి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్.రామనాథన్, రాధ&జయలక్ష్మి, త్రిచూర్ రామచంద్రన్, ఆర్.వేదవల్లి, సుగంధ కలామేగం, ప్రపంచం సీతారాం మొదలైన హేమాహేమీలకు ప్రత్యేక సంగీత బాణీలను నేర్పే అవకాశం దక్కింది. ఇతని శిష్యులలో చెప్పుకోదగినవారు ఇతని కుమారులు, మధ్వమునిరావు, పూర్ణప్రజ్ఞారావు, అరుంధతీ సర్కార్, శశాంక్ మొదలైనవారు.
Seamless Wikipedia browsing. On steroids.