తెలుగు రచయిత From Wikipedia, the free encyclopedia
ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు (జనవరి 23, 1863 - ఆగష్టు 1, 1936) ప్రముఖ రచయిత, గ్రాంథికవాది. కందుకూరి వీరేశలింగం పంతులు తర్వాత, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్యకాలంలో పనిచేశారు. భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. ధర్మసమాజాన్ని స్థాపించారు. రామ భక్తుడు. రామాయణము ఆంధ్రీకరించి "ఆంధ్ర వాల్మీకి" బిరుదు పోందారు. ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని పునరుద్ధరించడానికి ఒక కొబ్బరి చిప్పను బిక్షా పాత్రగా విరాళాలను పోగు చేశారు, టెంకాయ చిప్ప శతకాన్ని రచించారు.
గిడుగు వారి వ్యావహారిక భాష వల్ల తెలుగు సాహిత్యానికి అపకారం జరుగుతుందని పండితుల్లో అలజడి బయలుదేరి మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఏర్పడింది. వావిలికొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు గ్రాంధికభాష పరిరక్షణ కోసం ఉద్యమం లేవదీసారు.
వావిలికొలను సుబ్బారావు జనవరి 23, 1863 న రాయలసీమలోని ప్రొద్దుటూరులో జన్మించాడు. తండ్రి రామచంద్రరావు. తల్లి కనకమ్మ. భార్య రంగనాయకమ్మ. 1883లో ప్రొద్దుటూరు తాలూకా ఆఫీసులో గుమాస్తాగా చేరి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది 1896 వరకు పనిచేశాడు. ఆగష్టు 1, 1936 న మద్రాసులో పరమపదించాడు. ఈయన కాలాంతరమున వాసుదాస స్వామిగా ప్రసిద్ధికెక్కిన మహా భక్తుడు. తపోమయ నిరాడంబర జీవి. ఆయన మొదట హఠ యోగ సాధనాలు చేసేవారు. ఒకనాడు స్వప్నములో ఇద్దరు సోదరులు కనిపించి నీవు నడుస్తున్న దారి ముళ్ళ బాట. ఇటు రమ్మని చేయి పట్టుకొని మంచి రాచ బాటలో విడిచినట్లు కలగన్నారు. అంతట హఠ యోగమును విడచి భక్తి యోగమును ఆశ్రయించి కృతార్ధుడైనాడు.
సుబ్బారావు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని ఇరవై నాలుగు వేల ఛందో భరిత పద్యాలుగా తెలుగులో వ్రాశారు. దానికి మందరం అని పేరు. ఇది అనితర సాధ్యమైన విషయం. వాల్మీకి రామాయణాన్ని (24000 శ్లోకాలనూ ) 108 సార్లు నియమ పూర్వకంగా పూర్తిగా పారాయణం చెయ్యటం వలన ఆయనకు అందులోని నిగూఢ అర్ధాలు స్ఫురించాయి. ఆయన వ్రాసిన రామాయణాన్ని మహాసభా మద్యంలో ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామునకు అంకితం ఇచ్చాడు. అప్పుడు బళ్ళారి రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు ఆయనకు 'ఆంధ్ర వాల్మీకి' అని బిరుదు ప్రదానం చేసారు.
రాజులు ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికి వారు భోంచేయగా రామునికి నైవేద్యం కరువైన స్థితికి ఆలయం వచ్చింది. జీర్ణదశకు చేరిన ఒంటిమిట్ట రామాలయాన్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకొని,ఆయన టెంకాయ చిప్పను చేతిలో ధరించి ఆంధ్రదేశంలో ఊరూరా తిరిగి బిచ్చమెత్తి ఆ ధనంతో ఆయన ఆలయాన్ని పునరుద్ధరించాడు.ఎంత ధనం దానిలో పడినా ఏదీ ఉంచుకొనక రామునకిచ్చి చివరకు తాను ఖాళీ అయిన టెంకాయచిప్పను చూచి "నీ జన్మ ధన్యము కదే టెంకయ చిప్పా" అంటూ దానిమీద 'టెంకాయ చిప్ప శతకం' చెప్పిన మహాకవి.
ఆయన ఎంతటి మహా కవి యంటే నెల్లూరులో జరిగిన ఒక సభలో సభ అందరి ఎదురుగానే కొన్ని గంటలలో ఆశువుగా రంగనాయకునిపై నూరు పద్యాలు ఆశువుగా చెప్పి శతకాన్ని పూర్తిచేసాడు.
ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యువరాజు భారతదేశాన్ని చూడటానికి వచ్చినపుడు, కళాశాల తెలుగు పండితుడు గనుక యువరాజును స్తుతిస్తూ కవితలు చెప్పమని బ్రిటిషు ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది. బహుమతిగా బంగారు కంకణం ఇస్తామని ఆశ చూపింది. దాన్ని ఖరాకండిగా తిరస్కరించి తాను రామదాసునే గాని కామదాసును గానని తేల్చి చెప్పాడు.
ఆయన 1920 ప్రాంతాలలోనే మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితునిగా పనిచేసాడు. వైరాగ్యపూరితుడై భోగమయ జీవితాన్ని త్యజించి గోచీ ధరించి రాముని కోసం ఒంటిమిట్టలో ఏళ్ల తరబడి తపస్సు చేసాడు. కాని ఊరిలోని కొందరు స్వార్థపరులు కుళ్ళు రాజకీయాలతో ఆయన్ను అవమానించి ఆలయంలోనికి రానివ్వక వెడలగొట్టి ఊరిలో నిలువలేని పరిస్థితిని కల్పించారు. ఆయన దుఖించి, ఆ ఊరిని వీడి, మొదట గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలోనూ తరువాత అంగలకుదురులోనూ తన ఆశ్రమాన్ని స్థాపించుకొని అక్కడే ఉన్నాడు. ఈయన మొదలు పెట్టిన గురుపరంపర నేటికీ కొనసాగుతూ ఉన్నది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.