From Wikipedia, the free encyclopedia
అగ్రహారము బ్రాహ్మణులు నివసించే వీధి లేదా గ్రామం. అగ్రహారం అన్న పేరున్న గ్రామంలో పూర్వం వంశపారంపర్యంగా బ్రాహ్మణులే వ్యవసాయభూములకు అధిపతులుగా ఉండడం గమనించవచ్చు. అగ్రహారాన్ని సంపన్నులు లేదా పరిపాలకులు బ్రాహ్మణులకు దానమిచ్చేవారు. అగ్రహారాన్ని రాజులు దానం చేసేప్పుడు ఆయా భూములపై పూర్తిగా పన్ను లేకుండా కానీ, కొంత పన్ను మినహాయింపుతో కానీ ఇవ్వడం కద్దు.
మధ్యయుగమునందు విద్యావైదుష్యములను వ్యాపింపజేసిన సంస్థలలో రాజాస్థానములకు బిమ్మట పేర్కొనవలసినవి అగ్రహారములు. పర్వకాలములందును, దిగ్విజయ పట్టబంధాది మహాసమయములందును రాజులనేకులు వేదవేదాంగపారగులను, పురాణేతిహాసాజ్ఞులను, కర్మనిరతులను అగు విప్రులకీ అగ్రహారములను దానమొసంగుచుండిరి. వీని ఆదాయముతో జీవయాత్రను చేయుచు ఈ బ్రాహ్మణులు నిశ్చింతులై స్వాధ్యాయప్రవచనములతో కాలక్షేపము జరిపెడివారు. ఈ అగ్రహారము లేక భోగములు, బహుభోగములని రెండువిధములు. అందు మొదటి తరగతి వొక్కని హక్కు భుక్తములోనే యుండునవి.రెండవతరగతి అగ్రహారములలో అనేకపండితకుటుంబీకులకు వృత్తులేర్పరుపబడియుండెడివి.
అగ్రహారములకు మంగలమనియు, చతుర్వేది మంగలమనియు పేరుండెడిది. వీరచోడుడు చతుర్వేది మంగలమున ఒకచోట గల శాసనమునుండి, ఇచ్చట వ్యాకరణ, మీమాంస, వేదాంత, ఋగ్యజుస్సామ, రూపావతార, పురాణ, జ్యోతిష్య, వైద్య విద్యలను బోధించు ఆచార్యులొక్కక్కరికి ఒక్కొక్క వృత్తి కల్పింపబడెడిదని తెలియజేయడమైనది. ఈ అగ్రహారములకు ఏ విధమైన బాధ కలుగకుండగ చేసి రాజులు వానికి సర్వస్వతంత్రములను కల్పించెడివారు. వీనిపై ఏవిధమైన పన్నులను విధింపబడకుండినవి. ఇందలి భూమిపై వచ్చు ధాన్యమంతయూ అగ్రహారీకులదే. రాజకీయోద్యోగులకు ఇందు ప్రవేశము లేకుండెడిది. అందలి పండితులను అన్యాపేక్షలేక సర్వకార్యములను నిర్వహించుకొనుచుండిరి. ఇటులన్నివిధములను నేటి విశ్వవిద్యాలయములను మించిన స్వాతంత్ర్యము కలిగి ఈ అగ్రహారములు అనన్య దృష్టితో వైదిక విద్యను వ్యాపింపజేయుచుండిరి.
తెలుగు వారి గ్రామనామాల్లో చాలానే అగ్రహారాలు కనిపిస్తాయి. అందులో అధికభాగం గ్రామనామంలో ఉత్తరపదం (చివరి పదం) గా ఉండగా, కొన్ని పూర్వపదం (మొదటి పదం) గానూ ఉన్నాయి.
అగ్రహారం అనే పదం చాలా గ్రామనామాలకు ఉత్తరపదంగా ఉంటుంది. బ్రాహ్మణులకు వైదిక విద్యలు వ్యాప్తిచేసేందుకు, వారి విద్యాప్రదర్శనకు మెచ్చుకోలుగా రాజులు, జమీందారులు, సంపన్నులు దానమిచ్చిన భూభాగాన్ని అగ్రహారం అంటారు. అలాంటి గ్రామాలను అగ్రహారమని పిలుస్తారు. అగ్రహారం అనే పదం అనుబంధంగా ఉండే గ్రామాలు ఈ కింది విధంగా ఉన్నాయి:[1]
కొన్ని గ్రామనామాల్లో అగ్రహారమనే పదం పూర్వపదంగా కూడా ఉంది.
ఉదాహరణ: అగ్రహరం పల్లె, అగ్రహారం మెట్ట.
Seamless Wikipedia browsing. On steroids.